Home
  By Author [ A  B  C  D  E  F  G  H  I  J  K  L  M  N  O  P  Q  R  S  T  U  V  W  X  Y  Z |  Other Symbols ]
  By Title [ A  B  C  D  E  F  G  H  I  J  K  L  M  N  O  P  Q  R  S  T  U  V  W  X  Y  Z |  Other Symbols ]
  By Language
all Classics books content using ISYS

Download this book: [ ASCII | HTML | PDF ]

Look for this book on Amazon


We have new books nearly every day.
If you would like a news letter once a week or once a month
fill out this form and we will give you a summary of the books for that week or month by email.

Title: Onamaalu
Author: Ramamohan Rao, Mahidhara, 1909-2000
Language: 
As this book started as an ASCII text book there are no pictures available.


*** Start of this LibraryBlog Digital Book "Onamaalu" ***


అవంతీ ప్రచురణలు 4.



ఓనమాలు



రచన:

మహీధర రామమోహనరావు



సోల్ డిస్ట్రిబ్యూటర్లు:

విశాలాంధ్ర ప్రచురణాలయం,

విజయవాడ-2



మొదటి ముద్రణ

1956



వెల

రెండు రూపాయల పావలా



అవంతీ ప్రెస్

రాజమండ్రి



1947....

....నాటి తెలంగాణా ఒక అగ్నిగుండం.

దుస్సహమైన జాగీర్దారీ వ్యవస్థను నిర్మూలించగల పోరాటాల్ని ప్రజానీకం సాగిస్తూంది. వాటినన్నింటినీ ఒకే జెండా క్రిందికి తెచ్చి,
రాజకీయ నాయకత్వం సమకూర్చడానికై ఆంధ్రమహాసభా, కమ్యూనిస్టు పార్టీ సన్నాహాలు సాగిస్తున్నాయి.

రెండో వైపున – విదేశీ పాలనకూ, సంస్థానాధీశుల నిరంకుశ పాలనకూ వ్యతిరేకంగా జాతీయ ప్రజాతంత్ర పోరాటాలు తెలంగాణాన్ని
అలుముకొంటున్నాయి.

ప్రజాతంత్ర హక్కులకై సాగుతున్న ఈ పోరాటాలు ఐక్యతను కూర్చుకొంటూ నిజాము పరిపాలనా యంత్రాన్ని మొదలంట కదిల్చివేస్తున్నాయి.

ఈ దశలో …

విచ్ఛిన్నమైపోతున్న జాగీర్దారీ వ్యవస్థను రక్షించగల శక్తి నిజాము ప్రభుత్వానికి లేదని గ్రహించిన భూస్వామ్యవర్గం నూతన
నాయకత్వం కొరకై వెతుకులాడుతూ జాతీయోద్యమంలో తనకు రక్షణనివ్వగల శక్తుల్ని చూసుకొంది.

సమాజంలో తనకున్న బలం క్రమంగా క్షీణించి పోతూంటే, కూలిపోతున్న తన అధికారాన్ని పరిరక్షించుకొనేటందుకై మతవాదుల్నీ, రౌడీల్ని
సమీకరించి విధ్వంసకాండకు పూనుకొంది నిజాము సర్కారు.

ప్రజానీకానికీ, ప్రతిరోధ శక్తులకూ మధ్య జరిగిన ఈ ఘర్షణలలో తెలంగాణా ఒక అగ్నిగుండమే అయింది.

ఆనాటి సంఘర్షణలే నా ఈ నవలకు కథావస్తువు. సుదీర్ఘమైన ఈ నవలలో మొదటి భాగం పాఠకుల ముందుంచుతున్నా. త్వరలోనే
మిగతావీ.

విజయవాడ,

20-3-56

రచయిత.



భూమి కోసం
భుక్తి కోసం
నిగళబంధ
విముక్తి కోసం
నేల కొరిగిన
తెలుగు జోదుల
కిత్తు నంజలులు.

కృతజ్ఞత

తమ పత్రికలో ధారావాహికగా వెలువడిన ఈ నవలను పుస్తకరూపంలో ప్రచురించుకొనుటకనుమతించిన విశాలాంధ్ర సంపాదకులకు -

రచయిత.



ఓనమాలు
(మొదటి భాగం)



ఒకటో ప్రకరణం.


నెత్తిన తన్నుతూన్న కాకుల్నీ, గోరింకల్నీ తప్పించుకుంటూ చక్కర్లు కొడుతున్న ఓ గద్ద దీర్ఘప్లుతంలో కృష్ణ నామస్మరణ
చేస్తూంది.

ఏప్రిల్ నెల. ప్రొద్దుట ఎనిమిదింటికే ఎండ భగ్గుమంటూంది. ఎర్రగా కనిపిస్తున్న నేల వేగి పోయినట్లు పొగలు చిమ్ముతూంది.

కనుచూపు మేరలో పచ్చదనమే కనబడని పర్రభూమి. అక్కడా అక్కడా చాపంతమేరా, చదరంతమేరా పండి, ఎండి గోధుమ
రంగులీనుతున్న అవిరిగడ్డి మాసికలు; ఆ అవిరిగడ్డి కూడా లేక బొగులు బొగులుమంటున్న చిన్న చిన్న గుట్టలూ, పెద్ద పెద్ద
బండలూను.

మండుతున్న ఆ మైదానంలో కంటికి చల్లగా కనబడుతున్నదొక్క బోళ్ళ పొలమే.

గట్టు. దాని వంచన రాయి పగలకొట్టి కట్టిన మోటబావి. గుండ్రంగానో, పలకలుగానో, అంచులు తీర్చి కొట్టిందీ కాదు. కట్టిందీ
కాదు. పనసపండు మీది పగులులాగ రసం చిప్పిలుతూన్న ఒక పెద్ద బీట అది. పొడుగ్గా బద్దలయిన బండలలో ఒక మూల మోట
కోసం రాతితో తీర్చి కట్టిన అంచు కట్టూ, ఆ రాతి కట్టులో నీటికి కొంచెం పైగా పెద్ద పెద్ద గూళ్ళలా కట్టిన గుళ్ళూ చూస్తే
తప్ప అదొక నుయ్యి అనిపించదు. పొడుగ్గా బద్దలయిన బండ మధ్య, కొమ్మ నాచు క్రింద నల్లగా కనిపిస్తున్న చల్లని
నీళ్ళూ, నీళ్ళలోంచీ ఎగుడు దిగుడుగా గొగ్గిపళ్ళల్లా వున్న అంచులూ. ఆ ఎగుడు దిగుడుల్లోనూ, రాతి నెరియల్లోనూ వేళ్ళూనుకొని
పెరుగుతున్న జువ్వి మొక్కా, వేపచెట్టూ, వాని మధ్య నుంచి నూతిలోకి దిగేటందుకు మెట్లుగా కొట్టిన రాళ్ళూ. రాళ్ళ క్రింద
కొమ్మనాచు అలుముకొని, నల్లగా, చల్లగా కనిపించే నీరు బొగులు బొగులుమంటున్న ఆ పర్రలో ఇంత చల్లని మేరని సృష్టించింది.

మోటగాడికి రెండువేపులా కానుగచెట్ల వరస, వాని కావల మెరక మీద నాలుగు చింతలూ, నల్లని నీడల్ని పరుస్తూ, కళ్ళనూ,
కాళ్ళనూ ఆకర్షిస్తున్నాయి. ఆ నీడల్లో రాళ్ళ మధ్యగా పాకుతున్న మోటబోదె, బోదెకు రెండు వేపులా మల్లెదుబ్బులూ, తులసి
మొక్కలూ, రుద్రజడలూ ఒకదానినొకటి ఒత్తుకొని పిట్టగోడ పెట్టినట్లున్నాయి. ఆ పచ్చని గోడలకు వెలుపల ఒక గజంమేర
వరకూ పచ్చగా చెంగలిగడ్డి పట్టి కలకల్లాడుతూ తివాసీ పరిచినట్లుంది.

పచ్చని మొక్కల గోడల మధ్య నుంచి, మోటబోదె బయల్పడినచోట ఓ పది కుంటల వరి చేను. చేను మధ్య కూడా బండలున్నాయి.
ఆ బండల కుదుళ్ళలోకంటా మన్ను సరిచేసి వరిమొక్కలూడ్చారు. వరిమళ్ళు చిన్న చిన్నవి. మెట్లు మెట్లుగా బోదెలోని నీటిని
అంచెలంచెలుగా అందుకొంటున్నాయి.

బావిచుట్టూనూ, వరిమళ్ళకంటానూ ఒక వరసా, క్రమం లేకుండా అనేక రకాల పళ్ళమొక్కలు చిన్న అడవిలా పెరుగుతున్నాయి. ఆ
పళ్ళ తోటనూ, మరికొంత ఖాళీ స్థలాన్నీ చుట్టుకొని, గాదంగి మొక్కల వెలుగు మంచి ఎత్తుగా పెరిగి వుంది.

చెట్ల గుబురులో, బావికి సమీపంగా ఒక చిన్న పాక. పాక ముందర చదరంత మేర వరికళ్ళం కోసం చదునుచేసి, పేడతో అలికి
శుభ్రం చేసిన ముంగిలి.

* * * * *

మోటగాడి అంచున, నీటిబోదె ప్రక్కన చింతల నీడలో చెంగలి తివాసీ మీద వెంకటయ్య తల క్రింద చేతులు పెట్టుకొని, వెల్లకిలా
పడుకొని ఏవేవో ఆలోచనల్లో కొట్టుకొని పోతున్నాడు.

అతని ఆ స్థితి సత్తెమ్మకు కొత్తగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ, తుళ్ళుతూ వుండే మనిషి గంభీరంగా నిద్రలో పనిచేస్తున్నట్లు
కనబడుతూంటే, ఆమె మనస్సుకేదో భీతిగా ఉంది. కూడు తిన్న పళ్ళెం బోదెలో కడిగి, పాకలో చూరునున్న వుట్టిమీద జాగ్రత్త
పరిచింది. తడి చేతులు చీర కొంగున తుడుచుకుంటూ నెమ్మదిగా నడిచి వచ్చి ప్రక్కన నిలబడింది. ఓరకంట అతని ముఖంలోకి
చూసింది. అతని కళ్ళు చూస్తూనే వున్నా, ఆమెను గుర్తించినట్లు లేవు. సంకోచిస్తూనే ప్రక్కన కూర్చుంది. అప్పుడూ అతడు
కదలలేదు. అతని మీదుగా వొంగి తులసిమొక్క నుంచి పొడుగాటి వెన్ను ఒకటి తుంపింది. వెచ్చని రొమ్ములు ఒత్తుకొన్నా అతనిలో
కదలిక లేదు. తులసివెన్నుతో గడ్డంక్రిందా, భుజాలమీదా చక్కిలిగిలి పెట్టింది. గిలిగింతకు అతని కండరాలు తరంగిస్తూంటే కిలకిల
నవ్వింది. గిలిగింతలు పెడుతున్న చేతిని పట్టుకొని వెంకటయ్య ఆమెను గుండెలమీదకి లాక్కున్నాడు. అంతలో ఏదో గుర్తు వచ్చినట్లు
చేయి వదిలేసేడు.

సత్తెమ్మ ప్రయత్నాలేవీ వెంకటయ్యను ఆ ఆలోచనలనుంచి బయటకు లాగలేకపోయాయి. ఓటమికి ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగేయి.
దుఃఖం, అభిమానంతో అతనిని త్రోసివేస్తూ, ఆమె చర్రున లేచి నిలబడింది.

అనునయమూ, ఆదరమూ చేయలేని పనిని నైరాశ్యమూ, అభిమానమూ సాధించాయి. ఆమె నెట్టడంతో వెంకటయ్య ఆలోచనలు చెదిరిపోయాయి.
కోపంతో వెళ్శిపోబోతున్న ఆమెను పట్టుకోడానికి చెయ్యి జాపేడు. చేతికి దొరికిన చీరకుచ్చెళ్ళు పట్టుకొని దిగలాగేడు. ఆ గుంజడంలో
చీర విడిపోయినంత పనయింది. పోకముడి పట్టుకుని సత్తెమ్మ చటుక్కున కూర్చుంది. ఆమె మరల లేవడానికి వీలు లేకుండా వెంకటయ్య
దొర్లి, ఆమె వొడిలో తల చేర్చేడు. ఆమె చేతిని చేతుల్లోకి తీసుకొన్నాడు. కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వు నవ్వేడు.

కాని, ఆ నవ్వులో తానెరిగిన ఉత్సాహం కనబడలేదు. ఆ కళ్ళు తనను చూస్తున్నట్లే లేవు. సత్తెమ్మకు నెత్తిమీద నీళ్ళు
దిమ్మరించినట్లనిపించింది. వొణికిపోయింది. వెంకటయ్య తనకి కాకుండా పోతున్నాడనిపించింది. కన్నీటినాపుకోలేకపోయింది. నుదుటిమీద పడ్డ
కన్నీటి చుక్కతో వెంకటయ్యకు పూర్తిగా తెలివి వచ్చింది. మనస్సులోని భావోద్వేగానికి ఆమె ముఖం జేవురించి వుంది. కళ్ళనీళ్ళు
కారుతున్నాయి.

వెంకటయ్య ఆశ్చర్యపడ్డాడు. ఆమె ఏడ్పు ఎందుకో అర్ధం కాలేదు. కాని, ఆమె స్థితి అతని మనస్సును తల్లక్రిందులు చేసింది.
చటుక్కున లేచి కూర్చున్నాడు. దగ్గరగా జరిగి, కారణం కోసం కళ్ళల్లో వెతికేడు.

"ఎందుకు చిన్నీ!?"

చిన్నమ్మ అదృష్టదేవతకి మారుపేరు. తల్లిదండ్రుల ముద్దు ముచ్చటలలో చిన్నమ్మ చిన్నీ అయింది. ప్రణయం కూడా అదే పేరును
స్వీకరించింది.

ఆ పలకరింపుతో ఆమె వుద్వేగం కట్టలు తెగింది. ముందుకు వంగి అతని భుజంమీద తల పెట్టుకుని నిశ్శబ్దంగానే వెక్కివెక్కి
ఏడ్చింది.

వెంకటయ్యకా ఏడ్పు అర్ధం కాలేదు. ఒక్కొక్క వెక్కు అతని హృదయంలో ఒక్కొక్క పోటులా తగులుతూంది. గడ్డం పట్టుకొని ముఖం
తనవేపు తిప్పుకోబోయేడు. ఆమె భుజం మీదినుంచి తల తిప్పనే లేదు. వెంకటయ్య ఎంతో ఆప్యాయంగా ఆమె వీపు నిమిరేడు.
గుండెలకదుముకొని, దెబ్బ తిన్న పక్షిలా విలవిల్లాడేడు.

"ఎందుకు చిన్నీ!"

ఆతని ఆరాటంలో ఆమె తేరుకుంది. కాని హృదయం, కంఠం కూడా విడలేదు. అతడు తనకు దూరం అయిపోతున్నాడనే భయం వదలలేదు.

ఆ మాటనే ఎంతో దుఃఖంతో, ఎంతో భయంతో, అనునయిస్తూ వెలువరించింది.

వెంకటయ్యకు ఆమె భయం అర్ధం అయింది. నవ్వు వచ్చింది. తానామెను వదిలిపోతాననే భయం ఎందుక్కలిగిందో అతనికే అర్థం కాలేదు.
ఆమె నోట వచ్చిన మాటనే తాను అనవలసి వస్తుందని ఈ వారం నుంచీ తానే ఎంతో తటపటాయిస్తున్నాడు. మనస్సులోని మాటను పైకి
చెప్పలేకుండా వున్నాడు. కాని,....

ఆ భయాన్నే సత్తెమ్మ వెలిబుచ్చడం ఆశ్చర్యం కలిగించింది. ఆమె బేలతనానికి జాలీ కలిగింది. గాఢంగా కాగలించుకుని నలిపేసేడు.

ఆమెలో కనబడిన ఆందోళనా, భయంతో అంతవరకూ తాను చెప్పడానికి తటపటాయిస్తున్న మాట నాలికను దాటేసింది. ఆమె తల రెండు
అరచేతుల్లో పట్టుకొని ఎత్తి తన వేపు తిప్పుకొన్నాడు. ఒత్తి ఒత్తి పెదవుల మీద వూదేడు.

"మనం పెళ్ళి చేసేసుకొందాం."



రెండో ప్రకరణం


పదహారో యేట సత్తెమ్మ కాపురానికెళ్ళింది. పదిహేడోయేట తాడు తెగి పుట్టింటికి చేరుకొంది. తండ్రి మరణించేక మగదిక్కులేని ఆ
సంసార భారాన్ని భుజానికెత్తుకొంది.

తండ్రి ఆఖరు రోజుల్లో మూలబడ్డ వ్యవసాయాన్ని చేతిలోకి తీసుకొంది. వ్యవసాయంలో తనకి తోడుకోసం గ్రామంలో మంచి పనివాడుగా
పేరున్న వెంకటయ్యను మరో బుడ్డెడు గింజలెక్కువిచ్చి పనిలో పెట్టుకొంది. నీరసపడి, మూలబడ్డ బావిక్రింది సాగు వారిద్దరి
నిర్వహణలో మళ్ళీ పుంజుకొంది. పుట్టి మళ్ళీ నిండింది.

ఇద్దరూ కలిసి బావి చుట్టూ వనం పెంచేరు. ఇద్దరికీ చెట్లూ, మొక్కలూ పెంచడం అంటే మంచి సరదా. అతడు మొక్క నాటితే, ఆమె
నీరు పోసింది. అతడు మోట కడితే ఆమె నీరు మళ్ళించింది. అతడు కంచె పాతుతూంటే, తాను పెండె కట్టింది. ఇద్దరూ పోగడి ఆ
ఎడారిలో ఒక చల్లని నీడపట్టు సృష్టించేరు. చల్లని చెట్ల నీడలు, తియ్యటి బావి నీళ్ళు, ప్రశాంతమైన వాతావరణం గ్రామంలో
అందర్నీ చివరకి 'దొర' అల్లుణ్ణీ, కూతుర్నీ అతిథుల్నిగా రప్పిస్తూంటే ఇద్దరూ గర్వపడ్డారు. తాము చూపుతున్న శ్రద్ధను
అభినందిస్తూంటే ఒకరొకర్ని చూసుకున్నారు.

పనిలో కలిసిన మనస్సులు, మనువులు కలిపాయి. పాలేరుగా వచ్చిన వెంకటయ్య ప్రాణాధికుడయ్యేడు. ఒకరొకరితోడిదే జీవితం
అనుకొన్నారు.

అటువంటివాడు ఒక వారం పది రోజులనుంచి పరధ్యానంగా వుంటున్నాడు. ఆతడు దూరదూరంగా వుంటున్నాడనిపించింది. ఆ ఆలోచనతో మనస్సు
కరిగిపోతూంది; హృదయం ఆరాటపడిపోతూంది; అతనిని కదిలించడానికి చేసిన ప్రయత్నాలన్నీ, విఫలం అయ్యాయనిపిస్తూంటే ఎంతో
బాధపడిపోతూంది. ఈ వారం పది రోజులుగా అతనిలో కనిపిస్తున్న ధోరణి ఏమిటో అర్థం కాలేదు. ఏమేమిటో కారణాలు కల్పించుకొంటూంది.
ఆ కారణాలన్నీ ఆమెను మరింత బాధిస్తున్నాయి.

అతడు తన ఎరికలో ఇంత గాఢంగా ఆలోచనల్లో మునిగి వుండడం ఎప్పుడూ జరగలేదు. అతడు ఆలోచించవలసిన విషయాలు మాత్రం
పెద్దగా ఏం వున్నాయిగనక. ఆస్తా...సెంటు భూమి లేదు. పన్నుకి పీడించేవాళ్ళింక పుట్టవలిసిందేనని అతడే వేళాకోళంగా
అంటూంటాడు....తల్లా, తండ్రా?...ఆ ఇద్దరూ కూడా ఏనాడో మరణించారు.

...పెళ్ళామా, పిల్లలా?....ఈ మాట ఆలోచనకు వచ్చినప్పుడు సత్తెమ్మ అంత సులభంగా 'కాదు' అనుకోలేకపోయింది.
ఆలోచించగా, ఆలోచించగా అసలు కారణం అక్కడే వున్నట్లు కూడా అనిపించింది. అనిపించడంతో కళ్ళనీళ్లు తిరిగేయి.

అతనిని కాదనడానికి తనకున్న హక్కు ఏమిటి? అతని కోసం తాను ఎంతయినా త్యాగం చేసి వుండొచ్చు. ఉండొచ్చునేమిటి? చేసింది.

ఊరువాళ్ళ మాటల్ని ఖాతరు చెయ్యలేదు. తల్లి ఏడ్పును లెక్కచెయ్యలేదు. కుల మర్యాదల నాలోచించలేదు. అతని కోసం
ఆత్మార్పణ చేసుకొంది. సమాజంలో ఆడది చేయగల త్యాగానికది పరాకాష్ఠ. అయితేనేం?...

అతడు తనకి మగడు కాదు. తనకి మగడు లేడు. వెంకటయ్య కోసం తాను ఎంత తపన పడ్డా, తానో వితంతువు మాత్రమే. అతని
మీద తనకు హక్కు లేదు.

తనతో సావాసం చేసేక అతడు ఇతర పడుచుల్ని అంటుకోలేదు. కన్నెత్తి కూడా చూడలేదు. వెంకటయ్య కోసం దార్లుకాచిన పడుచుల్నీ,
అతని మాటకోసం కాట్లాడుకొన్న పడుచుల్నీ ఆమె ఎరుగును. అన్నీ ఎరిగే ఆమె అతనితో నేస్తం చేసింది. తనతో చేరేక అతడు
పూర్తిగా మారిపోయేడు. అతని పరిచయాల విషయంలో తాను పడ్డ జాలికూడా అతనికి నవ్వుతాలయింది. ఆ సంగతినామె ఎరుగును. అతడు
తనదే లోకంగా ఆనందిస్తున్నాడు. తనకేమాత్రం కష్టం కలిగినా గిజగిజలాడి పోతాడు. తన కాళ్ళక్రింద కళ్ళు పరిచేడు.
కళ్ళముందు హృదయం విప్పేడు.

సత్తెమ్మ ఆ కళ్ళల్లో ఉత్తమ లోకాల్ని చూసింది. ఆ హృదయంలో తన జీవితాన్ని చదివింది.

అది ఆమెకు ఇదమిత్థమని చెప్పలేని ఒక మహదనుభవం. ఆ అనుభవంలో ఆమె ప్రతి అణువూ ఉత్తేజితం అయింది. ఆ ఉత్తేజనమే
ఆమె జీవితాలంబనం.

నేటి వెంకటయ్య ధోరణి ఆ ఆలంబనాన్నే మొదలంట నరికివేస్తున్నట్లు తోచింది. భయం కలిగింది. ప్రపంచాన్నే లెక్కచేయని ఆ
తెగువ ఇక్కడ నీళ్ళు కారిపోయింది.

గతంలో అతడు దూరదూరంగా వుండడమే ఆమెను ఆకర్షించింది. కాని నేడదే భయం కలిగిస్తూంది.

ఆ రోజుల్లో...

ఊళ్ళో పడుచువాళ్ళ కళ్ళన్నీ తనమీదే వుండేవి. ఆ సంగతి సత్తెమ్మకూ తెలుసు. కాని, ఆమె ఎన్నడూ, ఎవ్వరికీ అలుసు
ఇవ్వలేదు.

వెంకటయ్య విషయంలో ఆమె బింకం నిలవలేదు.

అతడు మంచి వయస్సులో వున్నాడు, మాంచి పొడగరి. జువ్వలా చేవదేరిన వొళ్ళు. కాయకష్టంతో బొండాలు తిరిగిన కండలతో
నిగనిగలాడుతూండే వొళ్ళు. కోలమొగం. నిండైన మీసం. చురుకైన కళ్ళు.

అతని పెదవులూ, కళ్ళూ ఎప్పుడూ నవ్వుతూంటాయి. మనిషి మంచి మాటకారి, మాటల గిలిగింతలో మనువులు కలపగలడు.

కాని, ఆమెను ఆకర్షించినది అతని అందచందాలూ కాదు; మాటకారితనమూ కాదు.

నిజం చెప్పాలంటే ఇతర పడుచులతో అంత హుషారుగా గంతు వేసే వెంకటయ్య ఆమె అగల్ బగల నున్నదంటే గప్ చిప్. అంతవరకూ
అతనితో కేరింతలు కొట్టిన పడుచులు కూడా పెదవులు బిగపట్టుకొని నవ్వునాపుకొంటూ బుద్ధిమంతురాళ్ళల్లే తమ పనులు చూసుకొనేవారు.

అసలు అతడు తన అందాన్ని లెక్కచేయలేదనే అభిమానమే ఆమె మనస్సు నాతని వేపు తిప్పింది.

సత్తెమ్మది అందం అని చెప్పదగిన రూపం. రూప సౌందర్యంకన్న ఆమెలో ఆరోగ్య సౌందర్యానిది హెచ్చుపాలు. దృఢమైన శరీరం.
పచ్చని మిసిమి. పెద్ద కళ్ళు – తెలివీ. గాంభీర్యం వెలార్చే చూపులు. ప్రధమ యౌవనపు పొంకం కట్టిన మోటు చీరలోంచి తొంగి
తొంగి చూస్తూంటుంది. ఊళ్ళోని పడుచువాళ్ళంతా ఆమెను ఆకర్షించడానికి అతలాకుతలం అయ్యే వారు. వాళ్ళ మాదిరిగా వెంకటయ్య ఆమె
ముందు అట్టహాసం ఏమీ చెయ్యకపోవడమే ఆమెను ఆకర్షించింది. ఆత్మార్పణం చేయించింది.

* * * * *

వెంకటయ్యను పనిలోకి పిలిచేనాటికి సత్తెమ్మకు మగడి గుర్తు వుందని చెప్పలేము. కాని, అతడు ఇంట్లో తిరుగుతూండగా చూసి,
తనకు మగడంటూ ఒకడు ఏర్పడినందుకు తలుచుకు తలుచుకు దుఃఖపడింది.

కానైతే వెంకటయ్య తన కులం వాడే, తనకు ఈడూజోడూ కూడాను.

అయినా, తనకు అదివరకే ఓమారు పెళ్ళయిపోయింది. తన కులంలో మారుమనువు మర్యాద కాదు. నిషిద్ధం. ఆ విధంగా, ఇంక
మొండిపడ్డ జీవితాన్ని మొలకలెత్తించే అవకాశం లేదు. ఇంక సంఘం కళ్ళు కప్పాలి.

అది ఆమెకు ఒప్పలేదు. ఆ పని లోకం దృష్టిలో తన్నెంతో లోకువ చేస్తుంది. అలా లోకువ కావడం ఇష్టం లేదు. చిన్ననాటి
సంఘటన ఒకటి ఆ రోజుల్లో తనకు అర్థం కాకపోయినా తన మనస్సుకి హత్తుకుపోయింది. పెద్ద అయ్యాక అర్థం అయింది. అర్థం
అయ్యాక, అది గుర్తు వచ్చినప్పుడల్లా వణికిపోయింది.

సావిత్రి ఆమె నేస్తం. ఒకే గ్రామం కాకపోయినా, ఒకే మౌజా క్రింద మజరాలు వాళ్ళిద్దరివీ.

ఒకనాడు సావిత్రి కోసం సత్తెమ్మ వెడుతూండగా ఆ ఘటన జరిగింది.

సావిత్రి తండ్రి ఆమె చిన్నతనంలోనే అదృశ్యం అయిపోయేడు. తల్లి అనసూయ పట్వారీ లక్ష్మీనారాయణతో జత కలిపింది. అనసూయ
చిన్న వయస్సునీ, ఆమె పరిస్థితినీ ఆలోచించి గ్రామంలోవాళ్ళు విచారపడేవారు. క్షమించారు. కాని కూతురు మాత్రం
క్షమించలేకపోయింది. ఆమె వయస్సయినా ప్రపంచపు ఆశల్నీ, ఆశాభంగాల్నీ అర్ధం చేసుకోగల పాటిది కాదు.

కాని, లక్ష్మీనారాయణ ప్రసంగం వచ్చినప్పుడల్లా, ఆమె కళ్ళల్లో మంటలు కనిపించేవి. తల్లిని ఎంతో అసహ్యించుకొనేది.
ఆమెతోపాటు తామంతా కూడా అనసూయమ్మ మీద అసహ్యం ప్రకటించేవారు. దానికో ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు కూడాను. తన
ఒక్కగాని ఒక్క కూతురు కోసం వచ్చిన అభిమానం కొద్దీ అనసూయమ్మ తమకందరికీ ఏమి శ్రీముక్కో చిదిపి ఇంత చేతిలో వేసేది
కూడాను. అయినా ఆమె మీద అభిమానం కలగనేలేదు. ఎందుచేతనంటే వాళ్ళే చెప్పలేరు. తమ నేస్తకత్తె మీద వున్న సానుభూతి
తప్ప మరో కారణం వాళ్ళకి తెలియదు.

ఆ రోజున సత్తెమ్మ సావిత్రి కోసం వెడుతూంటే గవినిరావి క్రింద కూర్చున్న నలుగురూ నిదానించేరు.

ఎవరింటికి వెడుతున్నదీ చర్చించేరు. వాళ్ళల్లో ఒకరు ప్రక్కనే వున్న పట్వారీ లక్ష్మీనారాయణను చూపేడు.

"వీళ్ళ సావిత్రికీ, ఈ పిల్లకీ దోస్తీ."

మరొకడు ఏమీ ఎరగనట్లు ప్రశ్నించేడు.

"నీ కూతురు పేరు సావిత్రా?"

ఇంకొకళ్లు సమాధానం ఇచ్చేరు. కథోపకథనంలో లక్ష్మీనారాయణ రసికత్వం రసవత్తరంగా వర్ణించేరు. ప్రక్కనే వున్న
లక్ష్మీనారాయణ ఏమీ అనలేదు. చుట్ట చుట్టుకొంటూ, స్నేహితుల వాక్చాతుర్యానికి మీసాలలోనే నవ్వుకొన్నాడు.

ఆ ఘటన అర్థం అయ్యే వయస్సు వచ్చేక, ఆమెకు అనసూయ మీద కన్న లక్ష్మీనారాయణ మీద అసహ్యం కలిగింది. కట్టుకొన్న
భార్యను గురించే ఆ పరిహాసాలు జరిగి వుంటే అతడా విధంగా చిరునవ్వు నవ్వుకోగలిగేవాడేనా? కన్నకూతురు అసహ్యానికీ, గ్రామంలో
చిన్నతనానికీ కూడా తలవొగ్గి, తనకు లొంగిన అనసూయ విషయంలో పట్వారీ చూపిన దృక్పథం ఆమెకు చాలా బాధ కలిగించింది. తన
స్నేహితురాలి తల్లిని చులకన చేస్తున్నవాడే, ఆమె చులకన కావడానికి కారణం. ఆ పతనంలో అతనికీ భాగం వుంది. అయినా
అక్కడున్న వాళ్ళెవళ్ళకీ ఆ ఆలోచనే లేదు.

ఆ ఘటననూ, అల్లాంటి ఘటనలనూ తలచుకొని సత్తెమ్మ కొంతకాలం మనస్సును బిగపట్టుకోగలిగింది. కాని, ఆ భయం ఎంతో కాలం
పని చెయ్యలేదు.

కొంతకాలం తమ యిద్దరి మధ్యా వున్న ఆర్థిక అంతరువుల్ని మననం చేసుకుని అతని మీద మనసును అణచిపెట్టుకోడానికి
ప్రయత్నించింది. ఒకప్పుడు మాటెల్లావున్నా, ఇప్పడు తన పుట్టింటివాళ్ళు కాస్త వున్నవాళ్ళల్లోనే లెక్క. ఓ ఏభయ్యెకరాల
భూమి వుంది. కాలమానం సరిగ్గా వుంటే ఇల్లు నిండుతుంది. గట్టు క్రింద బావి వుంది. కాలమానం కూడి వస్తే ఓ పదిహేను కుంటలు
సాగవుతుంది. అదో పెద్ద ఆస్తేం కాదు. కాని, గ్రామంలో ఆ మాత్రం వున్నదెవరికి!

వెంకటయ్యకి అదీ లేదు. వాళ్ళ తాతా, తండ్రీ కాలంలో ఏ మాత్రమో వుండేదట. వాళ్ళకి తోట పొలం కూడా వుండేదట. కానీ, వాళ్ళు
చనిపోయేక దున్నే దిక్కు కూడా లేకపోగా, కుర్రవాడి కోసం జాగ్రత్త పెట్టి ఇస్తానని పెద్దదొరే ఆ భూమిని తన వ్యవసాయంతో
చేర్చుకొన్నాడు. వెంకటయ్య అడిగేడు. బాకీ క్రింద ఆస్తి తనకు స్వాధీనపడిందే గాని ఆ ఆస్తి వెంకటయ్యకు హక్కేమీలేదన్నాడు.
దాని నిజానిజాలు తేల్చుకోవాలంటే కోర్టుకెళ్ళాలి. వెంకటయ్యకు ఆ స్తోమతూ లేదు. సరదా లేదు. అతని మీద దయతలచి రెండేళ్ళు
తన వద్దనే పాలేరుగా పెట్టుకొని దొర యింత తిండి పెట్టేడు. ఆఖర్నో ఏభయి రూపాయిలిచ్చి నీ బ్రతుకు బ్రతకమన్నాడు.
ఇప్పుడు వెంకటయ్యకు ఓ ఇల్లు లేదు. భూమీ లేదు. అతనికన్న చెట్టుమీది పక్షి మేలు. వీటన్నింటినీ, ఈ ఆర్థిక
అంతరువుల్నీ గుర్తు చేసుకొని సత్తెమ్మ తన కోరికను చంపుకోడానికి ప్రయత్నించింది.

కాని, ఆర్థిక అంతరువులు జ్ఞాపకం పెట్టుకోగల అవకాశాలు ఆ యింట్లో లేవు. ఆ కులంలో ఆడవాళ్ళు కూడా పొలాలకెళ్ళి కాయకష్టం
చేస్తారు. నెత్తిన దుత్త పెట్టుకొని మగాళ్ళకి అన్నాలు తీసుకెడతారు. ఇంటికి వచ్చేటప్పుడు పొయ్యిలోకి సందెడు పుల్లలో, పాడి
ఆవుకి ఓ కట్ట పచ్చిగడ్డో కట్టుకు వస్తారు. పొలాలలో మగాళ్ళతోపాటు పని చేస్తారు. సత్తెమ్మ కూడా అలా పని
చేస్తున్నదే. ప్రక్కనే నిలబడి, కూడా కూడా పనిచేసే వ్యక్తుల మధ్య వుండే ఆర్థిక అంతరువు ఓ అంతరువు కాదు. అది
వ్యక్తుల మధ్య ఆకర్షణలను అడ్డుకోగల అంతరువూ కాదు.

అందుచేతనే సంఘభయం కొన్ని నెలలేనా పనిచేసింది గాని, డబ్బు పెద్దరికం ఒక్క పూట కూడా పని చెయ్యలేదు. పని సమయంలో
నిశ్శబ్దంగా వెంకటయ్య తన వేపు చూస్తుంటే ఆమె రక్తం వుడికిపోయీది.

తర్వాత మనస్సును నిలుపుకొనేటందుకో కొత్త భయాన్ని కల్పించుకొంది. చనిపోయిన మగనిమీద ఆమెకెప్పుడూ పెద్ద గౌరవమూ లేదు.
భక్తీ, అభిమానమూ కూడా లేవు. కాని తన నడవడి ఆయన పుణ్యగతుల కెక్కడ ఘాటా తెచ్చిపెడుతుందోనని ఒక తెచ్చికోలు భయం
కల్పించుకొంది. దానిని నిలవబెట్టుకోడానికి ఆయన మీద భక్తిని పెంచుకోబోయింది. ఆయన మూర్తిని గుర్తు చేసుకోబోయింది.

కాని, ఎంత ప్రయత్నించినా ఆ మొగం ఎల్లా వుంటుందో కూడా గుర్తు రాలేదు.

భర్త మీద ఆమెకెన్నడూ సద్భావం లేదు. ఆమె కాపురానికి వెళ్ళేసరికే ఆయన నానా తిరుగుళ్ళూ తిరిగి మనిషి పూర్తిగా
వొట్టిపోయేడు. పెళ్ళాం మీద చెయ్యి వెయ్యకుండానే మంచం మీద శరీరం జేరవేసేడు. ఆమెకు అత్తగారింట్లో భర్తృసుఖం లభించలేదు.
భర్తృసేవే దొరికింది. ఆ సేవ రెండు చేతులా చేసింది.

ఓ ఏడాదిపాటు ఆయన బ్రతుకుతానని బెదిరించేడు. మగడి చావుకి ఏడవాలో సంతోషించాలో అర్థం కాని అవస్థలో సత్తెమ్మ పుట్టింటికి
చేరింది. ఇప్పుడా మగణ్ణి గుర్తు చేసుకోవాలంటే సాధ్యమా? నిరాకారచింతనం ఆమె మనస్సుకి సరిపడలేదు. ఎదురుగా మనస్సునీ
ఆలోచనల్నీ ఆక్రమించుకొని సుందర విగ్రహం నిలబడి వుంటే చచ్చిపోయిన మగాడి పుణ్యగతుల్ని ఎంత వెతుకుదామన్నా పట్టుకోడం
సాధ్యమా?

అయితే చనిపోయిన భర్త ఆలోచనలు ఈ మారు నిజంగానే ఆమెలో ఒక కొత్త భయాన్ని తెచ్చిపెట్టేయి.

ఆ మరణించినవాడు మాట్లాడక వూరుకోకుండా ఏ దయ్యమో అయి వెంకటయ్య వెంటబడతాడేమోననే ఆరాటం ఆమెకు నిజంగానే కలిగింది.
చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలయి ఎన్నెన్నో అఘాయిత్యాలు చేస్తూండడం ఆమెకు తెలుసు. వాళ్ళ వూళ్ళో ఇంటికో దయ్యం వీధికో దయ్యం
ఏదో రోజున హాజరుపట్టీ వేయించుకొంటూనే వుంటాయి. తక్కువ కులాల యిళ్ళల్లో దయ్యాల అలవాట్లు వేరు. గేదెచేత పాలివ్వకుండా
తన్నించేసో, పాలు విరిగిపోయేటట్లు చేసో ఏడిపిస్తాయి. నాలుగు తిట్లు తిని వెళ్శిపోతూంటాయి.

కాని పెద్ద యిళ్ళలో ముఖ్యంగా మగడు లేని పడుచులుండే యిళ్ళల్లో హాజరయ్యే దయ్యాలు తమ అస్తిత్వాన్ని నిరూపించుకొనేటందుకు చాల
కష్టపడతాయి. కష్టపెడతాయి కూడా.

నరసారెడ్డిగారి వియ్యమ్మని మగడు ఈ మధ్య వదిలిపెట్టేడేగాని ఎంత రభస చేసేవాడు? ఒక రోజున ఆమె సావిట్లో పడుకొని
వుండగా ఆ దయ్యం మొగుడు అటక ఎక్కేడు. అక్కడి నుంచి ఓ పెద్ద సన్నికల్లు పొత్రం ఆమె తల ప్రక్కన పడేటట్లు
విసిరేడు. రాయి పడ్డ చోట నేల ఇంతమేర గుంట కూడా పడింది. అదే తల మీద పడితే? ఇంకేమన్నా వుందా? తలకాయి వెలగపెంకులా
తుక్కు తుక్కయిపోదా?

కాని పెద్దదొర అల్లుడూ కూతురూ పొలంవేపు ఓమారు షికారు వచ్చినప్పుడు మాటల సందర్భంలో ఆ భయం కాస్తా వదలకోట్టేరు. ఆ
రోజుల్లో వియ్యమ్మ దయ్యమ్మొగుడి రాతి సరసంతో వూరు గుబగుబలాడిపోతూంది. అంతా విని దొర అల్లుడు రాజిరెడ్డి ఓ ప్రశ్న
వేసేడు.

"వియ్యమ్మ మీద దయ్యం మొగుడికి కోపమా? అభిమానమా?"

ఆమెకు ఎంత ఆలోచించినా సమాధానం దొరకలేదు.

"పెళ్ళాం మీద ఆమె ఏదో అపరాధం చేసిందనో, చేస్తూందనో ఆ మగడికి కోపం వుంటే ఆ రాయి సరాసరి నెత్తినే పడెయ్యొచ్చు కాదూ?
అలాగాక ప్రేమా అభిమానమూ పట్టలేక వెంటబడ్డాడంటే ఆమె మీద ఓ పువ్వు వేస్తే అందం చందం. అంతే కాని నేల కూడా సొట్ట
పడేటంత ఎత్తు నుంచి ఓ మనిషి లేపినా లేవని పొత్రం గిరాటెయ్యడం ఏమిటి?"

ఆ ప్రశ్నల్ని నెమరు వేసుకొన్నాక దయ్యాల అస్తిత్వం విషయంలో ఆమెకు అదివరకుంటూ వచ్చిన నమ్మకం కాస్తా జారిపోయింది.
మళ్ళీ ఆమె మనస్సు వురకలు వేసింది.

ఒక రోజున పక్కయింటి ముంతాజ్‌తో సరాగాలాడుతున్న వెంకటయ్యనూ ఆమె ముఖములో కనిపించిన దీప్తినీ చూసి సత్తెమ్మ తాను
జీవితానందాన్నే కోల్పోతున్నాననుకొని వ్యధ చెందింది. అతడామె జెడ పట్టుకు లాగి అల్లరి పెడుతూంటే ముంతాజ్ నవ్వుతూంది. కపట
కోపం అభినయిస్తూంది. తప్పించుకుపోతున్నట్లు నటిస్తూ అతని చుట్టూ అలవుతొక్కుతూంది.

ఆ సాయంకాలం అవకాశం చూసుకొని ముంతాజ్‌ని పట్టుకొంది. ఆమె వెకిలితనానికి చీవాట్లు పెట్టింది. కాని మరునిముషం నుంచీ
ఆమెను అంత ఆనందపరచిన ఘటన కోసం సత్తెమ్మ తానే ఎదురుచూడసాగింది. ఏవేవో పనుల మిషతో బావి దగ్గర పాకలోకీ ఇంటి
వద్ద గదిలోకీ ఎన్నో మార్లు పిలిచింది. కాని మిష అనుకొన్నవి అవసరమైన పనులే అవుతూ వచ్చేయి. ఆమె ఆశలు విఫలం
అవుతూ వచ్చేయి. ఎదురుచూడడమే మిగిలింది.

ఆడపిల్లలందరితో వెంకటయ్య ఏ సంకోచం లేకుండా మాట్లాడుతాడు. జడలు లాగీ, కొంగు పట్టుకొనీ, నీళ్ళు చల్లీ, మోటు హాస్యాలాడి,
నవ్వీ, నవ్వించి ఎంతో చిలిపితనం చూపేవాడు. అలాంటివాడు తన దగ్గర కిమ్మన్నాస్తి. అల్లరి మరిచిపోతాడు.

ఆమె తపనను వెంకటయ్య కనిపెట్టలేదంటే అర్థంలేదు. జుట్టునో బట్టనో పట్టుకొన్న ఏ గడ్డిపరకనో తీసెయ్యడం మిషతో తాకినా
ఆమె చేతి వ్రేళ్లు అతనికి ఏవిధమైన సందేశాన్నీ యివ్వలేకపోతే అతడు వట్టి మట్టి బొమ్మయినా కావాలి. లేకపోతే సత్తెమ్మ
మీద యిష్టమేనా లేకపోవాలి.

కాని అతని ప్రవర్తన చూస్తే అలాగ అనిపించదు. ఆమె ఏమాత్రం కష్టపడుతున్నా తాను అడ్డం వస్తాడు. అందులో సేవక భావం
కనబడదు. అయినా పొరపాటున కూడా ఆమె కొంగునేనా తాకడానికి కూడా అతడెన్నడూ సాహసించలేదు. అవకాశం చిక్కితే ఆమె
సాన్నిధ్యాన్ని ఒక్క క్షణం కూడా వదలడు. కాని నోట ఒక్క హాస్యం మాట కూడా రాదు.

తాను ఎదురుగా వున్నా కబుర్లు చెప్తున్నా వెంకటయ్య ఏదో కలలో వున్నట్లుండేవాడు. సరాసరి కళ్ళల్లోకి చూడలేకపోయేవాడు.
మాటలో మాట కలపడు. హాస్యమాడలేడు. ఆమెకేన్నో మాట్లు విసుపు పుట్టింది. ఒకటి రెండు రోజులు అతని వేపు చూసేది కాదు.
మాట్లాడేది కాదు. అతడే పలకరిస్తే విసుపూ, కోపం చూపేది. అటువంటి ఘట్టాల్లో వెంకటయ్య మొఖంలో బెదురూ, ఆశ్చర్యమూ చదివి
ఎంతో జాలి పడేది.

అతడు తన్నో దేవతలాగ దూరంనుంచే కొలుస్తున్న కొద్దీ ఆమెలో మనుష్య సహజమైన కోరికలు విజృంభించాయి. సుందరమైన పువ్వును
చూసినట్లు ముట్టుకొంటే కందిపోతుందేమోనని జంకుతున్నట్లనిపించిన కొద్దీ ఆమె రక్తం పీడనకు ఎదురు చూసింది.

చివరవరకూ వెంకటయ్య ఆమెను పూజాపీఠం నుంచి దింపనేలేకపోయేడు. ఆఖరుకు సత్తెమ్మే సాహసించింది. దేవత దిగి వచ్చింది. చేతికి
చిక్కిన పెన్నిధానాన్ని వెంకటయ్య రెండుచేతులా అందుకొన్నాడు.



మూడో ప్రకరణం


రెండేళ్ళ క్రితం సరిగ్గా ఇవే రోజులు. రాత్రీ పగలూ బావి వద్ద పని. ఏమాత్రం ఏమరినా పండబారిన చేను కాస్తా ఎండిపోతుంది.
ఎడ్లు నలిగిపోతున్నాయి. మనుష్యులు నలిగిపోతున్నారు. రాత్రింబగళ్లు పనితో వెంకటయ్య నలిగిపోతూంటే మనస్సు వొప్పక చేయగలది
లేక సత్తెమ్మ దిక్కులు చూస్తూంది. పొలంలో తనకి సహాయం ఇంటి వద్ద తల్లికి సాయం చేస్తూ తిరుగుతున్న సత్తెమ్మను చూసి
వెంకటయ్య బాధపడుతున్నాడు.

ఆరోజున వెన్నెల పుచ్చపువ్వులా వుంది. ప్రకృతి అంతా చల్లని తెల్లని తెరమాటున నిద్రిస్తున్నట్లుంది. నేల వుబ్బ
తగ్గిపోయింది. చల్లని గాలి తోలుతూంది.

వెంకటయ్య మోటబోదె ప్రక్కనే చెంగలిగడ్డిలో పైపంచ పరుచుకొని నిద్రపోతున్నాడు. అతని కాళ్ళ వద్ద అంత దూరంలో కావలి
కుక్క పడుకొని వుంది. పశ్చిమానికి దిగిపోయిన చంద్రుడు చెట్లక్రింది నీడల్ని దూరం దూరం పాకిస్తున్నాడు. గాలికి చెట్ల కొమ్మలు
కదిలినప్పుడల్లా వెన్నెలరేకలు వెంకటయ్య వొంటిని తడుముతూ కదులుతున్నాయి.

తెల్లవారబోయే ముందు సత్తెమ్మ వచ్చింది. పాక వాకిట్లో మంచం ఖాళీగా వుంది. కొద్దిదూరంలో కావలికుక్క గుర్రుమని
తామక్కడున్నట్లు తెలిపితే అటూ నడిచింది. గడ్డిలో వెంకటయ్య వెల్లకిలా పడుకొని వున్నాడు. అతడు పడుకొన్న విధం చూస్తే
భయం వేసింది. పొలాల్లో పాములు తిరుగుతూంటాయి. రాత్రిళ్లు పొలాలు వెడుతూనూ పొలాల నుంచి వస్తూనూ పాము కాటుకు మరణించిన వారి
కధలు గుర్తు వచ్చేవి. గుండెలు పట్టేసినట్లయింది. ఎంతో ఆదుర్దాతో అతని ప్రక్కకు వురికింది. ప్రక్కనే మోకాళ్ళ మీదపడి
రెండు భుజాలూ పట్టి కుదుపుతూ మొగం మీద మొగం పెట్టి చూసింది.

ఆ కుదుపుకు వెంకటయ్య కళ్ళు తెరిచేడు. ఆమె సంతోషం పట్టలేకపోయింది. ఆదుర్దా ఆనందమూతో సంకోచాలూ సందేహాలూ ఎక్కడివక్కడ
తప్పుకొన్నాయి. ఇంక అక్కడ మిగిలిందల్లా పాతికేళ్ళ పడుచుదనం ఒక్కటే.

ఆ రోజు మొదలు వెంకటయ్య మరో పడుచుతో హాస్యం కూడా ఆడలేదు. నిరాభరణమైన ఆమె నిసర్గ సౌందర్యంతో గ్రామంలోని అందగత్తెల
నగలు నిండిన మెడల్నీ కాలుచేతుల్నీ పోల్చి నవ్వుకొనేవాడు. తెల్లని మోటు చీరలలో దాగిన ఆమె దృఢ శరీరం అతనిని స్వర్గాల
అంచులకు తీసుకుపోయింది. మోటు సరసాలూ, హాస్యపు మాటలూ లేకపోయినా వారి కళ్ళల్లోనూ గతుల్లోనూ లోకం కానని లోతులు
కనబడ్డాయి.

అతని సన్నిధానంలో సత్తెమ్మ కళ్ళు దుఃఖరేకల్ని విడిచేయి. నడకలో చురుకుదనం, విలాసం, విభ్రమం ప్రవేశించేయి. ఆ
చూపుల్లో, ఆ మాటల్లో, ఆ నడకల్లో అసలు శరీరం తీరులోనే జీవితానందం పువ్వులు తొడిగింది.

ఊళ్ళో గుసగుసలు బయలుదేరేయి. పొరుగింటి నేస్తం ముంతాజ్ కసి తీర్చుకొనేటందుకు బుగ్గలు పొడిచింది. సత్తెమ్మ గిలిగింతలు
పెట్టినట్లు నవ్వింది. తల్లి అనుమానాన్ని దాచలేక మాటలచేత చురచురా చూసినప్పుడు తన్ను కానట్లు తలతిప్పుకొంది. ఆమె
కూతురు మీద అభిమానాన్ని వెంకటయ్యను ఈసడించడంలో సంతృప్తిపరచుకొనబోయింది. కాని కూతురి భ్రుకుటిక్షేపంలో ప్రళయ కల్లోలపు
పొలిమేరల్ని తొక్కి చూసి నాలికను సంబాళించుకొంది.

ఒకమారు తల్లి, కూతురు అభిమానాన్ని రక్షించడానికి నడుంకట్టక తప్పదనుకొంది. కూతురికి హితబోధ ప్రారంభించింది. ఆమె మారు
చెప్పలేదు. ఆ ధైర్యంతో వెంకటయ్యను పనిలోంచి పంపెయ్యాలని ప్రతిపాదించింది. సత్తెమ్మ వెంటనే వీటో చేసింది.

ఆ ఆవేశంలో తల్లి తిట్టినప్పుడు ఆమె తన భయాలన్నింటినీ పాతేసింది. ప్రతి మాటలో బల్లేలు విసిరింది. ఆశ్చర్యం లేదు. ఓ
కునిష్టిని, క్షయరోగ పక్షిని అర్థాయుష్షుగాడిని తనకు మొగుడంటూ గొంతుకోసిందని ఇదివరలో ఆమె తల్లిని ఎన్నోమార్లు
మనస్సులోనే తిట్టుకుంది. ఇప్పుడా అభిప్రాయాల్నే బయట పెట్టింది.

కోపోద్రేకంలో మాట జారినా మాట మధ్యలోనే సిగ్గేసింది. సిగ్గుతో ఉడుకుబోతుతనం పుట్టుకొచ్చింది. ఆ ఉడుకుబోతుతనంతో మంచం మీద
పడి ఏడ్చి రెండు పూటలు ఉపవాసం చేసింది.

ఆ రెండు పూటలూ వెంకటయ్యకు తిండి కూడా దొరకలేదని తెలిసింది. ఇంకామె మనస్సు నిలబడలేదు. ఇంత కూడు మూటగట్టుకొని పొలం
బయలుదేరింది.

ఆమె సన్నాహాలు చూస్తున్న ముసలమ్మ నిర్విణ్ణురాలై నిలబడిపోయింది. గుమ్మంలో నిల్చున్నదల్లా ప్రక్కకు తప్పుకొని నోట్లోనే
గొణుక్కుంది.

"ఎంత సిగ్గుమాలినదానివి పుట్టేవే."

సత్తెమ్మ వినబడనట్లు గుమ్మం దిగి పది అడుగులు వేసింది. మళ్ళీ వెనక్కి వచ్చింది. రుసరుసలాడుతున్న తల్లి ఎదుట
నిలబడింది. ఆమె చూపుల్ని తట్టుకోలేక తల్లి తల తిప్పుకొని యింట్లోకి తిరిగింది.

"అమ్మా!"

ముసలమ్మ నిలబడింది. సత్తెమ్మ సందేహిస్తున్నట్లు ఒక్క క్షణం ఆగింది. ఇంతవరకు మనస్సులోని కోరికను బయటపెట్టనివ్వని
బెదురులే ఇప్పుడూ నోరు నొక్కేయి. కాని తప్పదు. బయటపడాలి.

తల్లి మళ్ళీ అసహ్యం ప్రకటించింది. కూతురు సిగ్గులేనితనం తమ యింటా వంటా ఎక్కడా ఎప్పుడూ లేదంది.

సత్తెమ్మ ఆవేశపడింది. ఆ ఆవేశంలో సందేహం ఏ కాస్త మిగిలినా ఎగిరిపోయింది.

తనయెడ కూతురు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని విని తల్లి అదిరిపోయింది. కూతురుకు పెళ్ళి చేయడంలో తన తప్పేముందో ఆమెకు
తోచలేదు. ఆడపిల్ల అయ్యాక పెళ్ళి చెయ్యక తప్పదు. కనక ఓ వరుణ్ణి చూసింది. వాళ్ళకో పెద్ద లోగిలి వుంది. సంసారం
కొంచెం చితికిపోయినా పేరూ, ప్రతిష్ఠా వున్నవాళ్ళు. పెద్దయింటివాళ్ళు. వాళ్ళతో సంబంధం తమకే గొప్ప అనుకోవలసిన స్థితి.
వాళ్ళు వచ్చి పిల్లని చేసుకొంటామనడమే చాల గొప్ప అనిపించింది. సంతృప్తిపడింది. కాని ఇప్పుడా సంతృప్తిని కూతురు దెప్పి
పొడుస్తూంటే ఏమనుకోవాలి? ఆ కుటుంబం మనుష్యులు కూడా అంతగా చితికిపోయారని ఆమెకేం తెలుసు?

ఆమె దిగ్భ్రమ చెంది కూతురు ముఖం వంక చూస్తూ నిలబడిపోయింది.

వాళ్ళు ఆమెకిచ్చింది మొగుణ్ణీ కాదు. మగాణ్ణీ కాదు. అది నిజమే. కాని అది తనకు అర్థం అయ్యేసరికి చెయ్యి దాటిపోయింది.
పెళ్ళినాటికే తనకి కొంచెం తెలుసు. కాని ఏదో చిన్నతనం అనుకొందేగాని అల్లుని శృంగారలీల వివరాలు పరిశీలించేటందుకు
ప్రయత్నించలేదు. ఏదో ఎవరు మాత్రం చెయ్యడం లేదులే - అనుకొంది. సరిపుచ్చుకొంది.

కూతురు అత్తవారింట్లో సుఖపడింది లేదు. రాత్రీ పగలూ బండచాకిరీ చేయించేరు. జీవితానికి సరిపడా నైరాశ్యం, వైరాగ్యం
నెత్తికెత్తేరు. మగడు చచ్చిన మరునాడే పెట్టి నెత్తిన పెట్టి పుట్టింటికి తోలేసేరు.

తాను ఎరిగిన గాధనే కూతురు నోట వింటూంటే వీరమ్మకు తన అపరాధం నూరింతలు భయంకరంగా కనబడింది.

సత్తెమ్మ మనస్సులో వున్న అక్కసంతా కక్కేసి విసవిస బయటకు నడిచింది. వెళ్ళేటప్పుడింకోమారు ఖబడ్దార్ చెప్పింది.
ఇన్నాళ్ళకు, ఎన్నాళ్ళకో ఆమెకు మళ్ళీ బ్రతుకు దొరికింది, దానిని లాగెయ్యడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటించకుండా ఉంటుందా?
"గొంతు నులిమేస్తా"నని వాగ్దానం చేస్తూంటే తల్లి మెడ తడివి చూసుకొంది. ప్రమాదం కలగలేదని స్థిరం చేసుకొని తలఎత్తేలోపున
సత్తెమ్మ వీధిలో వుంది. అటు తర్వాతనామె కూతురు మమకారాన్ని క్రీగంట చూడ్డానికి కూడా ప్రయత్నించలేదు.

అతని కోసం సత్తెమ్మ సమాజాన్నీ, కులమర్యాదల్నీ, కుటుంబ గౌరవాన్నీ, బంధు ప్రీతినీ కూడా ధిక్కరించింది. అతడే నేడు తనకు
దూరమైపోతున్నాడనిపించేసరికి దుఃఖం ఆగింది కాదు. అతనిని నిలపగల సంఘబలం తనకు లేదని కన్నీరు కార్చింది.

కాని,....

ఇంతవరకూ తనకు లేదనుకొన్న అధికారాన్నే అతడు కలిగిస్తానంటూంటే నమ్మలేకపోయింది. వెంటనే పెళ్ళికి అంగీకరించనూ లేకపోయింది.
ఆలోచనలో, అపనమ్మకంలో తలవంచింది. తలవంచుకొనే కళ్ళెత్తి చూసింది.

ఆ చూపుల్లోని అపనమ్మకాన్ని చదివి వెంకటయ్య తన ప్రతిపాదనను మళ్ళీ రెట్టించేడు.

"కాదు చిన్నీ! నిజమే మనం పెళ్ళి చేసుకొందాం."

ఒక వైపున ఆ పునరుద్ఘాటన మనస్సుకి ఆశ్వాసం కలిగిస్తున్నా ఒక్కమాటుగా నమ్మనూలేకపోయింది. ఆతని ఆలోచనల ధోరణిని
అర్థమూ చేసుకోలేకపోయింది.

తడి ఆరని రెప్పల్లోంచి కోరచూపులు చుస్తూనే తన అనుమానాన్ని వెలిబుచ్చింది.

పెళ్ళి చేసుకోవాలనే పెద్దమనిషేనా ఈ పది రోజుల నుంచీ మాటేనా ఆడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు? అనుమానం కలిగిందంటే
ఆశ్చర్యం ఏం వుంది?

వెంకటయ్య తన అపరాధాన్ని గుర్తించినట్లు సిగ్గుపడ్డాడు. తన ప్రతిపాదన అనుమానించవద్దని ప్రాధేయపడుతున్నట్లు ఆమెను
మరింత దగ్గరకు లాక్కున్నాడు.

ఈ పది రోజుల్నించీ ఈ ఆలోచనతోనే కొట్టుమిట్టాడిపోతున్నాడని తెలిసి సత్తెమ్మ ఆశ్చర్యపడింది. ఇదివరలో ఇంతవరకూ ఈ
ఆలోచన ఎన్నడూ తమ ఇద్దరిలో ఏ ఒక్కరికీ కలగలేదు. హఠాత్తుగా ఇదెందుకు వచ్చింది? దీనిలో ఏదో విశేషం వుండాలి.

సత్తెమ్మ ప్రశ్నలకి అతడు తన ప్రతిపాదననే రెట్టించి చెప్పేడు. ఆమె ఊ అనకపోతే బ్రతకలేనంటూ తన పది రోజుల
ఆలోచనల పర్యవసానాన్నీ ఒక్క వాక్యంలో తేల్చి తన గుండెల్ని అదుముకున్న ఆమె తలలో మొగం దాచుకొన్నాడు.

నిన్ను విడిచిన బ్రతుకు లేదన్న మాటకన్న మగవాడు ఆడుదాని యెడ చూపగల ప్రేమకు మరో మాట లేదు. ఆ మాటతో సత్తెమ్మ
హృదయం నిండిపోయింది. ఆతనిని మరింత బిగ్గరగా కౌగలించుకొంది.

వెంకటయ్య ఈ పది రోజుల నుంచీ తన మనస్సులో పడ్డ ఆరాటాన్ని వివరించేడు. ఆమెను విడిచి దూరంగా వుండలేనన్నాడు.

కాని, సత్తెమ్మకు ఆతని ఆలోచనలకూ, పెళ్ళి ప్రతిపాదనకూ గల సంబంధం ఏమిటో అర్థం కానేలేదు. దూరంగా వుండలేననేవాడు
ఎందుకున్నాడు? అతని మాటలలో కేవలం ప్రేమ ప్రకటనే గాక, ఏదో కొత్త విశేషం కూడా వుందనిపించింది. కౌగిలి విడిపించుకొని,
ఆతనిని తగులుతూ ఎదురుగా కూర్చుంది. మీసాలూ జులపాలూ సర్దుతూ సంతృప్తి కనబరిచింది.

వెంకటయ్య ఆమెను మరల దగ్గరకు లాక్కుని శిరస్సు మూర్కున్నాడు. దూరంగా ఎవరుండమన్నారని అడిగితే సమాధానం ఏం వుంది?
ఒకరుండమనేదేమిటి? తనకు బాధ్యత లేదా? తమరు దొంగతనంగా కలుస్తున్నారు. లోకానికి తమ కలయిక ఇష్టం కాదు. ఆమె
తల్లికే వొప్పుదల లేదు. పై వాళ్ళది చెప్పేదేముంది? ఆమెను నలుగురూ చులకన చేస్తారు. నాలుగు మాటలూ అంటారు. ఆమె మాట
పడడాన్ని ఆతడు సహించగలడా? ఇదివరకే వచ్చే మాటేదో రానే వచ్చిందంటే, వచ్చింది. ఆ విషయాన్ని గురించి ఆతడిదివరకు
ఆలోచించలేదు. ఆ మాట కూడా తోచలేదు. కాని, ఇప్పుడు ఆ ఆలోచన తట్టింది....

ఇప్పుడే ఆ ఆలోచన ఎందుకు తట్టవలసి వచ్చిందో?.... అంతకన్న తన గౌరవాన్ని గురించి ఆతడు చూపుతున్న శ్రద్ధకు
సత్తెమ్మ బ్రహ్మానందపడింది. తన స్నేహితురాలి తల్లి విషయంలో పట్వారీ లక్ష్మీనారాయణ చూపిన వ్యవహారం గుర్తు వచ్చింది.
వెంకటయ్య యెడ కృతజ్ఞతతో ఆమె మనస్సు నిండిపోయింది. ....

అంతవరకూ తాననుకొన్నదే తనకు వెంకటయ్యతో పెళ్ళయి వుంటే ఇల్లా దూరంగా వుంటాడా అనుకొన్నదే కాని, తీరా చేసి ఆ ప్రసంగాన్ని
ఆతడే తెచ్చేవరకు మహా గంభీరంగా తల అడ్డం తిప్పింది. తన్ను ఎవరన్నా ఏదన్నా మాట అం టారనే భయం లేదని ఘట్టిగా
చెప్పింది. తన్ను ఎవళ్ళు ఏమనడానికీ ఎన్ని గుండెలుండాలి. "నా కొడుకులు. ఏమన్నా అంటే....." గుడ్లు పీకెయ్యదూ? వాళ్ళ
బ్రతుకులు కడిగి వీధినెయ్యదూ?

ఊళ్ళోవాళ్ళ రంకులు రచ్చకీడుస్తానన్నది వెంకటయ్యకు సంతృప్తి కలిగించలేదు.

కాని, సత్తెమ్మ మళ్ళీ తల తిప్పింది. ఈమారు ఆ ప్రతిపాదనకు గల అభ్యంతరాల్నే ముందుకు తెచ్చింది.

"వెధవముండతో పెళ్ళేమిటి?"

ఆతను తలను రెండు చేతుల మధ్యా పట్టుకొని చుంబించింది.

"నీకేమన్నా అవుతుంది బాబో...."

అపాయశంకతో గలిగిన ఆదుర్దాను తెలుపుతూ గాఢంగా కౌగలించుకొంది.

కాని, వెంకటయ్య తన ప్రతిపాదనను ఉపసంహరించుకొనేటట్లు చేయడానికి ఆ అభ్యంతరాలు పని చేయలేదు. సత్తెమ్మ వద్ద ఆ
ఎదురు ప్రశ్న కంటే మారు సమాధానమూ లేదు.

వెధవముండతో సంపర్కం పెట్టుకొంటే పనికి వచ్చినప్పుడు పెళ్ళి చేసుకొంటే పనికిరాదా? పెళ్ళి లేకుండా సంపర్కం పెట్టుకొంటే ఏమీ
ప్రమాదం రానిది. కొత్తగా వస్తుందా?.... అదే అడిగేసేడు. అయితే ఆ బూతు మాట పవిత్రత చెడిపోకుండా చెవిలో నోరు పెట్టి
అడిగేడు.

"ఛా! ఏమ్మాటలవి" అంటూనే సత్తెమ్మ కిలకిలా నవ్వింది. ఆతని ప్రశ్నకు సమాధానం ఏం ఇస్తుంది? పది ఎదురు ప్రశ్నలతో
అసలు విషయాన్ని అడుగునపెట్టడానికి ప్రయత్నించింది.

"ఇల్లా వుంటే చాలదేం?"

"పెళ్ళి చేసుకుంటే నాలో లేని అందం కొత్తగా వస్తుందా?...."

"తక్కువ కులాల్లో మాదిరిగా ఛ! మారుమనువేమిటి?....నవ్వుతారు"

"ఇంటా వంటా లేదు. మారుమనువు చేసుకొంటే నీకేమన్నా అవుతుందేమో. బాబోయ్, వద్దు...."

"మన్ని రానిస్తారా? వూళ్ళో వుండనిస్తరా?

"మా తమ్ముడు ఏమంటడో? అమ్మ ఏమౌతది?...."

ఆమె ప్రశ్నలు అనేక దృక్కోణాలనుంచి వచ్చేయి. సంఘం, ఆచారాలు, కుటుంబం, ఆర్థిక సమస్యలు అన్నీ కదిలేయి. ఆఖరు
ఆయుధంగా పిల్లలు పుడితే వాళ్ళ గతేమిటంది.

"ఇప్పుడో?"

"పుట్టరు."

ఆ ధైర్యం ఏమిటో సత్తెమ్మ చెప్పలేదు.

"ముందూ అంతే...."

ఆమె తల అడ్డంగా తిప్పింది. అది అంగీకారమో, అనంగీకారమో అతడికి అర్థం కాలేదు.

వెంకటయ్య తన ప్రయత్నం మానలేదు.

ఆతని దృష్టిలో పిల్లల సమస్య ముఖ్యం కాదు. పుట్టబోయే పిల్లలు పెద్ద వాళ్ళయ్యే సరికి ఎన్ని మార్పులొస్తాయో. ఇదివరకు
పెద్దయిళ్ళల్లో మామూలే అయిపోవడం లేదూ?

వెంకటయ్య తన వాదనలకు బలంగా వితంతు వివాహాలు చేసుకొన్న పెద్దరెడ్లవీ, దొరలవీ పేర్లుదహరించేడు. ఈమాదిరి పెళ్ళిళ్ళు
చేయించడంలో ఆర్యసమాజం వాళ్ళు తీసుకొంటున్న శ్రద్ధను గురించి కూడా చెప్పేడు.

సత్తెమ్మ ఆ సమాజము పేరునెప్పుడూ వినలేదు. అదేమిటో తెలుసుకొన గోరింది కాని వెంకటయ్య కూడా పెద్దగా చెప్పగల స్థితిలో
లేడు. ఆ పేరునాతడు విన్నదయినా ఈమధ్యనే. దాన్ని గురించి ఆతనికి తెలిసింది కూడా ఒక్కటే విషయం. సాయిబులకీ వాళ్ళకీ
చుక్కెదురు. తమలాంటి వాళ్ళు పెళ్ళి చేసుకొనేటందుకు సాయిబుల్లో కలిసిపోనక్కర్లేకుండా వాళ్ళే చేయిస్తున్నారు. ఆ సమాజం
తనకెంతవరకూ వుపయోగపడుతుందో అంతవరకే అతనికి అర్థం అయింది.

సత్తెమ్మ ఏమీ అనలేదు. తన ప్రతిపాదనకు ఆమెను వొప్పించలేకపోయానని వెంకటయ్య గ్రహించేడు. తన అసమర్థతకి
విచారపడ్డాడు.

"నేనింక నీకు చెప్పలేను. నిన్ను అంటుకోనూలేను."

అంటుకోనంటూనే ఆతడామెను మరింత దగ్గరకు లాక్కున్నాడు. ఆ మాటల్లో ఆత్మవిశ్వాసం కనబడ్డమేలేదు. సత్తెమ్మ ఆతని
గుండెలమీద తల చేర్చి ఆతని ముఖంలోకి చూస్తూ నవ్వింది.

ఆమెకు తెలుసును. వెంకటయ్య తన ముందు ఎంతోసేపు బింకం చూపలేడు. ఆ మాటనే అంటూ కిలకిలా నవ్వింది.

వెంకటయ్య నిట్టూర్చేడు. నిరుత్సాహంగా చేతులు వదిలేడు.

"మీయమ్మలా మా సంగం వాళ్ళూరుకోరు."



నాలుగో ప్రకరణం.


సంగం పేరెత్తేసరికి సత్తెమ్మ వులికిపడింది. ఆమెకు స్పష్టంగా తెలియడంలేదు గాని, ఈమధ్య నీమధ్య వెంకటయ్య సంగం వాళ్ళతో
ఎక్కువ సంబంధాలు పెట్టుకొంటున్నట్లు ఆమెకు తరుచుగా అనిపిస్తూనే వుంది.

ఏడాది క్రితం అతనికి ఇష్టం లేకపోయినా తానే సంగంలో చేర్పించింది. కాని, తర్వాత జరిగిన ఘటనలతో ఆమె అదిరిపోయి,
సంగంవేపు కూడా చూడవద్దని చెప్పింది. కాని, వెంకటయ్య వూరుకున్నట్లు లేదు. ఆ సంగతి తనకూ చూచాయగా తెలుసు. కాని,
ఆతడెన్నడూ ఆమాట సూచనగానైనా తనకి చెప్పలేదు. మొదట్లో సంగంలో పేరివ్వడానికే ఆతడు మొరాయించిన ఘట్టం గుర్తుచేసుకొని,
ఆమె తన అనుమానాలకు ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. తానూ ఏమీ ఎరగనట్లే నటిస్తూంది. అల్లాంటివాడు నేడు
ఉన్నట్లుండి సంగం పేరెత్తడంతో నిర్విణ్ణురాలయింది.

తెలంగాణా పల్లెల్లో ఆంధ్రమహాసభకు "సంగం" అనే పేరు. ఆంధ్రమహాసభ మధ్యతరగతుల వుద్యమంగానే వుండిపోయినంతవరకు గ్రామీణ
ప్రజానీకాన్ని ఆకర్షించలేకపోయింది. చిలుకూరులో జరిగిన మహాసభలో వెట్టి వ్యతిరేక తీర్మానం చేసినా భువనగిరి మహాసభ వరకూ
అది కాగితం మీదనే వుండిపోయింది.

భువనగిరి మహాసభ అనంతరం ఆంధ్రమహాసభ కార్యవిధానంలోనే పెద్ద మార్పు వచ్చింది. ప్రజానీకాన్ని వెట్టికీ, జాగీర్దార్ల
పీడనకూ వ్యతిరేకంగా సంఘటిత పరచి చిలుకూరు తీర్మానాన్ని కార్యరూపంలో పెట్టడానికి నడుం కట్టింది. ఆ కార్యక్రమాన్ని అమలు
జరపడంలో ఆంధ్రమహాసభ "సంఘం" అయింది. సంఘం ప్రజల నోట్లో సంగంగా పరిణితి పొందింది.

ఏడాది క్రితం ప్రక్క వూళ్ళోకి సంగం వాళ్ళు వచ్చేరన్నారు. ఊరంతా సంగం కట్టేరనీ, వెట్టి మానేసేరనీ చెప్పేరు. సీతారాంపురం
వాళ్ళు కూడా ఆ 'మీటంగా'నికి వెళ్ళేరు. తిరిగి వచ్చేటప్పుడు తిరిగి ఓ సంగం జెండా తెచ్చుకొన్నారు. దానితోపాటు సంగం నాయకుల్నీ
పిలుచుకొచ్చేరు. తమ వూళ్ళో కూడా సంగం పెట్టుకొన్నామని తప్పెట్లూ, తాళాలతో వూరేగింపు తీసేరు.

ఊరి బయట చింతల క్రింద పెద్ద సభ జరిగింది. అన్ని కులాల వాళ్ళూ, అన్ని వృత్తుల వాళ్ళూ, బీదా, పేదా జనం అంతా
సభలో వున్నారు. సంగం పెట్టేసేరు. పెద్దల్ని ఎన్నుకొన్నారు. వెట్టి చెయ్యడం లేదని తీర్మానం చేసేసేరు.

ఆనాడు వూరంతా పెద్ద సంబరం జరిగింది. అమ్మవారి జాతరక్కూడా అంత హడావిడి ఉండదు.

సంబరం మంచి జోరుగా వున్న సమయంలో దొరగారి సేరీదారు కిష్టయ్య ధూం ధాం చేస్తూ, చాకలి పద్దాలుని వెట్టికి రాలేదని కేకలు
పెడుతూ వచ్చేడు. ఆరోజున దొరల యింట్లో పద్దాలుది వంతు. ఆ పద్దాలే అసలు సంగాన్ని ఊళ్ళోకి తెచ్చింది. సంగం భవిష్యత్తు
త్రాసులో పడింది. అంతా పద్దాలు వేపే చూస్తున్నారు.

కాని, పద్దాలు వెనకాడలేదు. సంగం పెట్టుకొన్నాం. వెట్టి చెయ్యక్కర్లేదు పొమ్మన్నాడు. అనడం అవసరం కన్న గట్టిగానే
అన్నాడు కూడా. మంగలి నరసయ్యా, కుమ్మరి గురవయ్యా, గొల్ల భాగయ్యా వగైరాలంతా 'అది అంతే' నన్నారు. సాతాని బూసయ్య
వెట్టికి వెళ్ళమనకపోయినా, అంత తొందరెందుకని మందలించేడు. కాని, జనం ధోరణి చూసి, ధూము ధాములు చేసిన కిష్టయ్యను
మందలించక తప్పలేదు. ఆతడే సంగానికి పెద్ద మరి.

సభ అంతా ఆతని చర్యను ఆమోదించింది. సంగానికి జై కొట్టింది. మామూలుగా అరుపులు, తిట్లు, కర్రదెబ్బల ముక్తాయింపుతోగాని
మాట్లాడని కిష్టయ్య నీళ్ళతొట్టిలో పడ్డ ఎలకలా చల్లగా జారుకొన్నాడు. జనం మళ్ళీ హర్షధ్వనులు చేసేరు.

ఆ వెళ్ళడం, వెళ్ళడం కిష్టయ్య పదిహేను రోజులు మళ్ళీ వూళ్ళో కనబడనే లేదు.

ఆ ప్రథమ విజయంతో ప్రజల సంతోషానికి హద్దులే లేవు. వూరంతా నిల్చున్నపాటున సంగంలోకి పేర్లిచ్చేసేరు.

సంగం కట్టడం విషయంలో గాని, పెట్టడం విషయంలో గాని వెంకటయ్యకేమీ భాగం లేదు. వూరంతా అంత సంబరం చేసుకొంటూంటే అతడికి దానిలో
భాగం లేకపోవడం సత్తెమ్మకు నచ్చలేదు. ఆమె వెళ్ళమంటూంటే అతడు నవ్వేడు.

"మనం ఇద్దరం సంగం. మన సంగంలో మూడో వాడుండడానికి వీల్లేదు."

ఆతని పట్టు విడిపించుకొని సత్తెమ్మ వీధిలోకి వెళ్ళింది. గొల్ల భాగయ్యతో చెప్పి సంగంలో వెంకటయ్య పేరు చేర్పించింది.
పెద్దల్ని ఎన్నుకొనే వేళకి పడుచుకారంతా ఆతని పేరు ఇచ్చేసేరు. వెంకటయ్యకి వూళ్ళో స్నేహిత బృందం ఎక్కువే. ఆ స్నేహితుల్లో
ఆతనికి గల స్థానం పెద్దదే. అందుచేతనే ఆతాడానాడు మీటింగు చాయలకి రాకపోయినా ఆతడు సంగం పెద్దల్లో ఒకడయిపోయేడు.
ఆతనికి ప్రజలలో వున్న మంచి పేరు చూసి సత్తెమ్మ బ్రహ్మానందపడిపోయింది.

కాని, ఆమె ఆనందం ఎన్నో రోజులుండలేదు. పదిహేను రోజులు నాటికి నిజాం పోలీసులు వూళ్ళోకి వచ్చేరు. దొర పెద్ద కొడుకు
రమణారెడ్డి సర్కిలినస్పెక్టరు. ఆతని నాయకత్వాన పోలీసులు తెల్లవారేముందర వీధులన్నీ కాచేరు. మగాళ్ళనందర్నీ నిల్చున్న
పాటున లాక్కు వచ్చేరు. పోలీసులతో పాటే వూళ్ళోకి వచ్చిన కిష్టయ్య సంగం పెద్దల్ని పేరు పేరున చూపించేడు.

ఊరంతా చూస్తుండగా పోలీసులు పద్దాలుని నడివీధిలో నిల్చోబెట్టి కాల్చేసేరు. ఇక మిగిలిన పెద్దల్నీ, ఆ రోజున మీటింగులో
చురుగ్గా పాల్గొన్న వాళ్ళనీ కొట్టడం ప్రారంభించేరు. పదిహేను రోజులపాటు వూరంతా మంగలంలోలాగ వేగిపోయింది. ఓ అరడజను మందిని
జైళ్ళకు పంపేసేరు.

పోలీసులు పద్దాలు భార్యని లాక్కుపోయి స్టేషన్‌లో చాకిరీకి పెట్టారు. రెండు నెలలయ్యేసరికి వొంటినిండా గాయాలతో ఆమె
తిరిగి వచ్చింది. ఆమెను లొంగదీయడానికై రమణారెడ్డి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయనుకొన్నారు. ఆమెను లొంగదీసే
ప్రయత్నంలో ఆతని సంసారంకూడా విచ్ఛిన్నం అయిపోయిందని అనుకొన్నారు. అదో పెద్ద కథ.

వూళ్ళోకి తిరిగి వచ్చేనాటికి ఆమె ప్రాణాలు కళ్ళల్లో వున్నాయి. వూళ్ళోకి గోలు గోలున ఏడుస్తూ అడుగు పెట్టింది. వెంకటయ్య
దారిలో ఎదురయి ఆమెను మామ యింటికి తీసుకెళ్ళేడు. కాని, అత్తమామలు ఆమెను యింట్లో అడుగు పెట్టనీయలేదు. కడుపున పుట్టిన
కొడుకు పోయేక కోడలితో సంబంధం ఏం వుందన్నారు. ఆమె నెత్తిన గుడ్డ వేసుకొని వీధిలోకి నడిచింది. మరల వెంకటయ్యే ఆమెను
తీసుకెళ్ళి తన స్నేహితుడింటిలో ఒక పంచ చూపింప చేసేడు.

సంగం పెట్టడంలో వెంకటయ్యకు భాగం ఏమాత్రం లేకపోయినా పోలీసు వాళ్ళ దెబ్బలలో ఆతనికి పెద్ద వాటాయే ముట్టింది. సత్తెమ్మ
ఇచ్చిన డబ్బూ, దొర కూతురూ, అల్లుడూతో ఆమెకున్న పరిచయమూ ఆతనిని ఖైదు శిక్ష నుంచి తప్పించింది. భర్తతో కలిసి దొర
కూతురు సుమిత్ర బోళ్ళ పొలం వేపు చల్లగాలికి షికారు వచ్చినప్పుడు కలిసిన పరిచయం వుపయోగపడింది.

ఓ వారం రోజులు మంచం పట్టడానికి సరిపడా దెబ్బలతో వెంకటయ్య బయటపడ్డాడు. కర్ర దెబ్బలకి నల్లగా కమిలిపోయి శరీర
భాగాలు కదుములు కట్టిపోయాయి. వానికింత ఆముదం వ్రాసి కాపడం పెడుతూ అతని దెబ్బలకి కారణం తానే అయ్యేనని ఎంతో ఏడ్చింది.
ఆమెనూరడించడానికై సంగంతో సంబంధం మాట అటుంచి ఆరోజున వూళ్ళో కూడా లేని వాళ్ళకీ, ఏదో చుట్టాలింటికి వచ్చిన పొరుగూరివాళ్ళకీ
కూడా తనతో పాటు సమంగా దెబ్బలు తగిలిన కథలు చెప్పేడు. అత్తవారింట కూతుర్ని దిగబెట్టడానికి వచ్చిన మల్లయ్య గోలున
ఏడుస్తూ, తనది ఆ వూరే కాదని చెప్తూంటే రమణారెడ్డి ఏమన్నాడో వెంకటయ్య చెప్పాడు. సత్తెమ్మ ఆ కథలు విని ఒక్క
నిట్టూర్పు విడిచింది. కాని ఆతనికి కలిగిన బాధలో తన బాధ్యతను మాత్రం మరిచిపోలేకపోయింది.

కాని, వెంకటయ్యలో కసి రగిలింది. మంచం దిగిన మొదటిరోజుననే ఆతడు సంగం నాయకుల కోసం వాకబు ప్రారంభించేడు. చేయి ఆసరా
యిచ్చి నడక అలవాటు చేయిస్తున్న సత్తెమ్మ ఆతని ప్రశ్న విని దిక్కులు చూసింది. స్వరం తగ్గించి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ,
ఆతడినింక సంగం వూసు ఎత్తవద్దని ప్రాధేయపడింది.

వెంకటయ్య ఆశ్చర్యంతో ఆమె వేపు ఓరకంట చూసేడు. కాని, ఏమీ అనలేదు. సత్తెమ్మ ఆ చూపును గమనించింది. అర్థమూ
చేసుకొంది. కాని, తన భయాన్నీ, ఆదుర్దానూ కప్పిపుచ్చుకోలేక పోయింది.

ఇంక వెంకటయ్య ఆమె వద్ద యెన్నడూ ఆ వూసు తీసుకురాలేదు. కాని, ఆతడు సంగం వాళ్ళతో దగ్గర సంబంధాలు కలిగివుంటున్నాడని
ఆమె త్వరలోనే గ్రహించింది.

వెనకటి మాదిరిగా గాక ఆతడిప్పుడు తరుచుగా రాత్రిళ్ళు ఎక్కడికో పోతున్నాడు. అడిగితే వూళ్ళో వూసాడుతూ కూర్చుంటే
పొద్దుపోయిందనో, చేను చూసిరాబోయేననో ఏదో సాకు చెప్తున్నాడు. అవన్నీ వట్టి సాకులు మాత్రమేనని ఆమె త్వరలోనే గ్రహించింది.
ఆమె గ్రహించిందని అర్థం చేసుకొన్నా వెంకటయ్య ఏమీ ఎరగనట్లే వూరుకున్నాడు. సత్తెమ్మ కూడా మళ్ళీ ఏమీ అనలేదు.

అప్పుడప్పుడు ఎవరో బావి వద్దకు వస్తూంటారు. ఏదో పని కోసం వాళ్ళని పెట్టేనని చెప్పేవాడు. మొదట నిజమేననుకొంది. కాని,
ఆ వచ్చే వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఏ రాత్రి వేళో వచ్చేవారు. రాత్రి అయితేగాని వెళ్ళేవారు కారు. వాళ్ళ రాకపోకలకీ
వెంకటయ్య రాత్రి సంచారాలకీ సంబంధం వున్నట్లనిపించింది.

కొత్త వాళ్ళని పనిలోకి పెట్టిన రోజున తాను తెచ్చిన ముద్ద కాస్తా వాళ్ళకి పెట్టేసేవాడు. మళ్ళీ పోయి తెస్తానంటే
వొప్పుకొనేవాడు కాదు. ఆతడు తిండి లేకుండా వుండగా చూడలేకపోయింది. కాని, ఆతడు ఆకలి వొప్పుకొనేవాడే కాదు, అటువంటి
సందర్భాలలో వుపయోగపడేటందుకని ఓ బుడ్డెడు బియ్యమూ, జొన్నలూ పాకలో పాతిపెట్టి చూపించింది. వెంకటయ్య గ్రహించేడు. కాని,
ఏమీ అనలేదు. సత్తెమ్మకు సందేహమే లేకపోయింది.

అటు తర్వాత కూడా అతడు ఆమెకు ఏమీ చెప్పకపోయినా, దాచడానికి ప్రయత్నం చెయ్యలేదు. తరుచుగా తమ పనిలో కనిపించే ఆతని
పేరు సత్తిరెడ్డి అని తెలుసుకొంది. ఆయన వెంకటయ్యకు ఏవేవో పెద్ద సంగతులు చెప్తూండడం ఓ రోజున వింది. వెంకటయ్య ఎప్పుడో
చదువు కూడా నేర్చుకొన్నాడనీ, ఏవో కాగితాలు చదవగలుగుతున్నాడనీ ఆమె గ్రహించింది కూడా అప్పుడే. తనకు చదువు కొంచెం వచ్చినా
తానెప్పుడూ అక్షరాలు నేర్పడానిక్కూడా ప్రయత్నించలేదు. కాని సంగం మనిషి ఎప్పుడు నేర్పేడో ఎన్ని సంగతులు నేర్పేడో, వాళ్ళు
చెప్పుకొనేవి తనకేమీ అర్ధమే కావడం లేదు. అదే చాలు సంగం వాళ్ళ మీద విపరీతమైన అభిమానం కుదరడానికి.

ఆతని మాటల్లో వెనకటల్లే బూతు మాటలు దొర్లడం లేదని ఆమె ఆరోజునే గ్రహించింది. సంభాషణ మధ్యంలో వెంకటయ్య ఓ బూతుమాటని
వూతపదంగా వాడితే సత్తిరెడ్డి తప్పుపట్టేడు: వెంటనే వెంకటయ్య క్షమాపణ చెప్పుకొన్నాడు. తానిప్పుడు బూతులు
మాట్లాడ్డంలేదనడానికి సాక్ష్యం సత్తెమ్మనే అడగమన్నాడు.

పాక చాటునుంచి వారి సంభాషణ వింటున్న సత్తెమ్మ ఆలోచించింది. నిజమేననిపించింది. తనకొక్కర్తికి మాత్రమే వినబడేలాగ, చెవిలోనే
తప్ప ఆతడీమధ్య బూతులు మాట్లాడ్డం లేదని ఆ రోజునే ఆమె గ్రహించింది. వెంకటయ్యకు మర్యాదలు నేర్పుతున్న సత్తిరెడ్డి మీద
ఆమెకెంతో అభిమానం కలిగింది.

కాని, ఈవేళ సంగం వాళ్ళు తమ స్నేహాన్ని వొప్పుకోరనేసరికి ఒక్క మారు చర్రుమనిపించింది. తన తల్లికే పట్టని గొడవ
వీళ్ళకెందుకు అనుకొంది.

సత్తిరెడ్డి చెప్పిన మాటలన్నింటినీ ఆతడు వినిపించేడు. పెళ్ళి లేకుండా ఈ దొంగ సంబంధాలు పెట్టుకోవడం వలన సత్తెమ్మకెంతో
అవమానం వస్తూందని ఆయన చెప్పేడన్నప్పుడు తన మిత్రురాలి తల్లి మాట గుర్తు వొచ్చింది.

సత్తిరెడ్డి వాదన అంతే కాదు, ఏ కడుపైనా వస్తే మరింత అవమానం, అది పోగొట్టుకొనేటందుకు చేసే ప్రయత్నాల్లో ప్రాణాపాయం
కలుగుతుంది. కనక అలవాటున్నా లేకపోయినా నలుగురూ మెచ్చేపని చేయమన్నాడు.

అవన్నీ నిజమే. సత్తెమ్మ ఆలోచనలో పడింది. తన మర్యాదను, తన ప్రాణాన్నీ కాపాడ్డం కొసమే అంత శ్రద్ధ తీసుకొన్న
సత్తిరెడ్డి సలహా అంత సులభంగా కొట్టిపారెయ్యరాదు.

కాని,....

తనకో మాటు పెళ్ళయిందనే సంగతి ఆతనికి తెలుసో తెలియదో....

ఆ ప్రశ్నే అనవసరం. తెలియకపోతే ఇంత చర్చ వచ్చేదే కాదు. వెంకటయ్య కూడా తలతిప్పేడు.

సత్తెమ్మ మొగం తిప్పుకొని మరో ప్రశ్న వేసింది. తాను కొన్నాళ్ళు కాపురం వెలిగించిందని తెలుసునో తెలియదో.

వెంకటయ్య మళ్ళీ తల వూపేడు. నిజానికి సత్తిరెడ్డి వివాహ ప్రశంస తెచ్చినప్పుడు ఆతడు చూపిన పెద్ద అభ్యంతరమే అది.

తన భార్య అని చెప్పుకోవలసినయామె మరొకడితో నాలుగురోజులేనాయె కాపురం చేసింది అనే ఆలోచన ఆతనికి దుర్భరం అనిపించింది.
ఇప్పుడంటే వేరు. మరొకడి పెళ్ళాన్ని పక్కలోకి తెచ్చుకొన్న వీరుడల్లే చలామణీ అవుతాడు. ఆమెనే పెళ్ళి చేసుకొంటే అన్ని
తరవాయిలూ తీరిందాన్ని కట్టుకొన్నాడంటారు. అదీ ఆతని భయం.

చెప్పి చెప్పి సత్తిరెడ్డికి ప్రాణం చాలొచ్చింది. అంతవరకూ తానుపయోగించవద్దన్న బూతుమాట సహాయంతో తన మనస్సులోని విసువు
ప్రకటించేడు.

ఆమెను పెళ్ళాంలా వుపయోగించుకోడానికి ఏ అభ్యంతరం లేదు. కాని, పెళ్ళాం అనుకొనేటందుకు మాత్రం అన్నీ అభ్యంతరాలే. అదేమన్న
మాట?

వెంకటయ్య ఆలోచనలో పడ్డాడు. సత్తిరెడ్డి మరీ సూటిగా చెప్పేడు.

"నువ్వు ఇన్ని చెప్పే ఆమె మొదటి మగడి మాట ఆమెతో వున్నప్పుడు నీకెన్నడూ గుర్తురానే లేదా? పెళ్ళి అంటే ఏమిటి? ఇప్పుడు
మీ మధ్య వున్న సంబంధానికి సంఘం వేసే ముద్ర. ఆ ముద్రకి పనికిరాని ఆడది పక్కలోకి పనికి వస్తుందేం?"

తర్వాత ఈ మాదిరి సంబంధాల వలన వచ్చే దుష్ఫలితాలు సత్తెమ్మను ఎలా నాశనం చేస్తాయో చెప్తూంటే వెంకటయ్య తన ఆటంకాలన్నీ
మరచిపోయాడు.

ఆ రోజున సత్తిరెడ్డి వాదనలనే ఆతడు నేడు సత్తెమ్మ ముందు పెట్టేడు. ఆమెకు ఏమాత్రం ప్రమాదం గలిగినా తాను
బ్రతకలేనన్నాడు. ఆమెకు కలిగే అగౌరవం తన అగౌరవమేనన్నాడు. ఆతడామెతో పొందుతున్న తాదాత్మ్యం అంత ఘనిష్టం.

తను ఓ దురదృష్టవంతురాలని సత్తెమ్మ నమ్మకం. తన్ను పెళ్ళి చేసుకొంటే వెంకటయ్యకు అశుభం కలుగుతుందని తాను భయపడుతూంటే,
పెళ్ళి చేసుకోకపోతే తనకు కష్టం వస్తుందని ఆతడు భయపడుతున్నాడు.

సత్తెమ్మ ఏమీ తేల్చుకోలేకపోయింది. తానే ఆ సంగం పెద్దతో ఓ మారు మాట్లాడితే? అడిగింది.

ఎవరు ఎప్పుడు వచ్చేదీ, ఎక్కడికెళ్ళేదీ, ఎక్కణ్ణుంచి వచ్చేదీ ఎవ్వరికీ తెలియనివ్వరాదనేది రహస్య జీవితం గడుపుతున్న
నాయకులతో పరిచయం పెట్టుకొన్నప్పుడు వెంకటయ్య నేర్చుకొన్న ప్రథమ పాఠం. ఆ మాట గుర్తు వచ్చింది. నిజానికి సత్తిరెడ్డి
ఆ రాత్రి వస్తున్నాడని ఎరిగి వున్నా పది రోజుల దాకా రాడని అబద్ధం ఆడేడు.

కాని అసలు సంగతి మరో విధంగా చెప్పేడు. మరునాడు ఇద్దరికీ కూడు ఇక్కడికే తెమ్మన్నాడు. పని అయ్యేక కూర్చుని కబుర్లు
చెప్పుకోవచ్చు. మళ్ళీ ఆదరాబాదరా ఇంటికి పరుగెత్తనక్కర్లేదు.

ఆ మాటను సత్తెమ్మ అర్ధం చేసుకొంటే సరే సరి...

సత్తెమ్మ అర్ధం చేసుకొంది.



అయిదో ప్రకరణం


ఆ రోజున ఇంటికి వచ్చేసరికి సత్తెమ్మ పెద్ద తుఫానును ఎదుర్కోవలసి వచ్చింది. అంతవరకూ తన యెడ ఎంతో భయం, భక్తీ,
ప్రేమ చూపుతూ వచ్చిన తమ్ముడు రంగయ్య తన ప్రవర్తనపై చేసిన వ్యాఖ్యానాల్ని వినేసరికి ఆమెకి కోపం బదులు ఆశ్చర్యం
కలిగింది. తానంటే విశేష పరిచయం లేని కొత్త కోడలు సూరమ్మ తన తరఫున నిలబడ్డం చూసేసరికి ఆశ్చర్యంతో పాటు ధైర్యమూ
చిక్కింది. తాను వెంకటయ్యను పెళ్ళి చేసుకోదలిచానన్న సంకల్పాన్ని సరాసరి వాళ్ళ మొహాన పడేసి, గింజుకు చావండన్నట్లు మొహం
పెట్టింది.

ఇంక ఎవరికి వారే బలాల ప్రదర్శన ప్రారంభించేరు. ఏడ్పులు, మొత్తుకోళ్ళు, రుంజుకోడాలు, మొగం మాడ్చుకోడాలు ప్రారంభమయ్యేయి.
ఒకర్ని విడిచి ఒకరుపవాసాలు చేశారు. సమస్య పరిష్కారానికి వచ్చేటట్లు కనపళ్ళేదు.

తల్లి నూతిలోనో, గోతిలోనో పడతాననే దృఢ సంకల్పాన్ని ప్రకటించింది. ఈ తుఫానుకు ముందు రోజున మాత్రమే వచ్చిన తమ్ముడు
వెంటనే బయలుదేరుతున్నానన్నాడు. ఆ గుడిసేటి కొంపలో క్షణం వుండనన్నాడు.

కాని, సత్తెమ్మ తుఫాను మధ్య కొండలా నిశ్చలంగా నిలబడింది. ఆమె ఏడవలేదు. ఎదిరించింది. సవ్యసాచిలా అందరికీ అన్ని
మాటలు వప్పగించింది.

నూతిలో పడి ప్రాణం పోగొట్టుకోవడంలో తల్లికి కొన్ని మెలకువలు నేర్పడానికి ప్రయత్నించింది. మనశ్శాంతికి వేదాంత బోధా చేసింది.

"ఎవళ్ళూ ఎవళ్ళ కోసం జీవించడం లేదు. చావడం లేదు. చావదలచుకొన్నవాళ్ళెవరూ చెప్పి చావరు.
గప్‌చిప్‌గా తమ పని పూర్తి చేసేస్తారు. పెద్దదానివైపోయేవు. ఉట్టి గట్టుకొని ఊరేగుతావా యేం?
ఎప్పుడయినా చావు వుండేదే. కొడుకు చేతి మీదుగా వెళ్ళిపోతే పుణ్యమూ, పురుషార్థమూ. పైగా కూతురు చాటుమాటున ఏడవడం మాని
బహిరంగంగా పెళ్ళికి తెగించిందన్న అప్రతిష్ఠ మాట చెవిని పడకుండా వెళ్ళిపోతావు. మంచి ఆలోచనే కానియ్యి."

కూతురు ఎకసక్కెపు మాటలకు తల్లి వీరమ్మ వుడికిపోయి నిల్చున్నపాటున నూతి వద్దకు పరుగెత్తింది. తన వెనకాల ఎవరన్నా
వచ్చి నిలవబెట్టేస్తారేమోనన్నట్లు భయంతో అడుగడుగునా వెనక్కి చూసింది.

సత్తెమ్మ సన్నికల్లు పొత్రం తీసుకొని వెంటబడింది. తాడు తెస్తున్నాను ఒక్క నిముషం నిలబడమని కేకేసింది.

"ఇదిగో, ఈ బండ కాస్తా మెడకు కట్టుకొని మరీ వురుకు. దిక్కుమాలిన ప్రాణం అంత సులువుగా పోదు. పైకి తేలుతావు. ఎవ్వరో
ఒకరు తీసి గట్టున పడేస్తారు. మళ్ళీ ఈ పాడు లోకం కనబడుతుంది. ఒక్క నిముషం ఆగు. "

కూతురు తీసుకొన్న ధోరణి చూసేక వీరమ్మ ఇంక నూతిలో పడాలనే సంకల్పాన్ని పూర్తిగా వదులుకొంది.

కొరడా చురుకుల్లాగ ఆమె మాటలు నసాళం అంటిపోతూంటే తమ్ముడు నోరు వెళ్ళబెట్టేడు.

"నీ ఏడుపు నాకు తెలుసు. ముండమోసిన అప్ప ఇంట్లోనే వుంటే నీ వుచ్చ వూస్తుంది. నిన్నూ, పెళ్ళాన్నీ కూర్చోబెట్టి చాకిరీ
చేస్తుంది. అటు పొలం పనీ, ఇటు ఇంటి పనీ చేస్తుంటే నువ్వు పట్నంలో పెద్దరికం వెలిగించొచ్చు. ఇక్కడికి ఇరవైమూడేళ్లు
వచ్చేయి. నీ పొలం హద్దులు నీకు తెలుసూ? నాలుగురోజులయి వూళ్ళోకొచ్చేవు. చేను ఏమౌతూందో చూసుకొన్నావా? నీకక్కర్లేదు.
అప్పముండ చేసేస్తూంది. నీకా శ్రమ కూడా ఎందుకు? నలుగురి చేతా నాలుగు మాటలూ పడ్డా, పెళ్ళీ పెటాకులూ లేకుండా నీ యింట్లో
చాకిరీ చేస్తూంటే నీ ప్రతిష్ఠకి ఘాటా రాదు. అంతేగా నీ రుంజుకోడానికి అర్థం?"

తన మాటల అర్థం ఏమిటో అక్క వివరించే సరికి రంగయ్య నోరు వెళ్ళబెట్టేడు. మరుగుతున్న నీళ్ళు నెత్తిన పోసినట్లే,
చెవులు మూసుకొని ఇంట్లోంచి పారిపోయేడు.

ఈ వ్యతిరేకత గంద్రగోళం ఇంట్లో వాళ్ళతోనే ఆగినంత వరకు ఆమె లొంగలేదు. తల్లి తన బెదిరింపు వ్యర్థమయ్యేక సన్నిహిత
బంధువుల్ని తోడు తెచ్చుకొంది. ఇంక ఆమె ధైర్యం ఎంతో కాలం నిలబడలేదు.

అంతవరకూ తనను నెత్తిన పెట్టుకున్న వాళ్ళూ, గౌరవించిన వాళ్ళూ నేడు తానేదో కాని పని చేయబోతున్నట్లు ఉపదేశం చేయడానికి
పూనుకొనేసరికి ఆమె తన గాంభీర్యం నిలుపుకోలేకపోయింది.

వెంకటయ్యకు తనకు గల సంబంధాన్ని వారంతా ఎరిగిన వారే. ఎరిగి సహించిన వారే. హాస్యమాడి తలవూపిన వారే. వారే నేడు
గంభీరంగా హితోపదేశానికి పూనుకొనేసరికి ఆమెకు ఏడ్పే శరణ్యం అయింది.

ఏడ్చినా, ఆమె తన ప్రయత్నం విరమించుకొంటున్నాననలేదు.

ఉపదేశికుల సంఖ్య రోజులు గడిచిన కొద్దీ పెరిగింది. పెద్దమనుష్యులం అనుకొనేవారు మనసాలలో అడుగు పెట్టేరు.

తన బెదిరింపులు విఫలమయ్యేక వీరమ్మ గ్రామ పెద్దల కాళ్ళు పట్టుకొంది.

"పెద్దదాన్ని అయిపోయాను. బ్రతికినన్నాళ్ళు బ్రతకను. నా కళ్ళ ముందు నా కన్నకూతురే ఇంటా వంటా లేని పని చేస్తూంటే
భరించలేను."

ఆ పెద్దలు తమ పెద్దరికాన్ని నిలుపుకొనేటందుకు ముందు ఆమెను నిరసించేరు.

"తోటకూరకాడ నాడేనా చెప్పకపోతే" ఇల్లాంటివి తప్పవన్నాడు ఒకాయన.

డబ్బు ఖర్చు లేకుండా నానా చాకిరీ చేస్తున్నాడు గదాయని సంతోషించావంటూ వేరొకాయన ఆమె పొదుపరితనాన్ని ఎత్తి పొడిచేడు.

ముసలమ్మ ఏడ్చింది. ప్రమాణాలు చేసింది. పొలం పనికి ఎంతమంది పాలేర్లను పెట్టుకోడం లేదు? ఈ విచిత్రమైన స్థితి తనకు
వచ్చిందిగాని.

విసుక్కుంటూ పెద్దలు సలహాలిచ్చేరు. ఒక్కొక్కరే కదిలేరు.

నరిసిరెడ్డి మనసాలలో స్తంభానికి జేరబడి కూర్చుని గదిలో తలుపులు మూసుకొని కూర్చున్న సత్తెమ్మకు వినబడేలాగ హితోపదేశం
ప్రారంభించేడు. ఈ పెళ్ళి వలన కలగగల కష్టాలన్నీ తల్లి చేతా, తమ్ముడు చేతా ఏకరువు పెట్టించేడు.

సత్తెమ్మ తలుపు తియ్యలేదు. దేనికీ సమాధానం ఇవ్వలేదు. నోరు నొప్పి పుట్టి నరిసిరెడ్డి ఒక తిరుమంత్రం ఉపదేశించేడు.

"ఈ మద పిచ్చికి ఒక్కటే మందు. చింతబరికెలు నాలుగు తెచ్చి వీపు చిట్లగొడితే అన్ని తిమ్మిర్లూ వొదులుతాయి. ఒళ్ళు
కొవ్వెక్కి...."

తోక తొక్కిన తాచులాగ బుసలుకొడుతూ సత్తెమ్మ గది తలుపు తీసుకొని గుమ్మంలో నిలబడింది. రేగిన జుట్టు, ఏడవడంచేత
ఎర్రబడ్డ కళ్ళు, బుగ్గల్ని కన్నీటి తడి, తడికి అంటుకొన్న ఒకటి రెండు ముంగురులు, మాసిన బట్టలు—ఆ ఆకారంలో
ఆతడెన్నడు ఆమెను చూడలేదు. మగడు చచ్చి ఇంటికి చేరుకొన్న రోజున కూడా ఆమె ఆలాగలేదు. కోపంతో పెదవులదిరిపోతూంటే,
మీదపడిపోయేలా వున్న ఆ చెట్టంత మనిషినీ చూసేసరికి నరిసిరెడ్డి హడలిపోయేడు. తన పెద్దరికాన్ని కూడా మరచిపోయి
తడబడుతున్న గొంతుకతో "అ(. అ(." అన్నాడు.

సత్తెమ్మ కూడా అక్కడ ఎంతో సేపు నిలబడలేదు. నరిసిరెడ్డి పెద్దరికాన్ని ఒక్క మాటతో నేలగలిపి, వెనక్కి తిరిగి,
తలుపు భళ్ళున వేసుకొంది.

"వియ్యమ్మకీ వైద్యం పని చెయ్యలేదేం? బహుశా తురకాణ్ణి వొప్పచెప్పేవు అందుకే. నీ బ్రతుకూ, నువ్వూ...."

ఆ థూత్కారంలో మొహాన ఎమన్నా పడిందేమోనని నరిసిరెడ్డి అప్రయత్నంగా పైగుడ్డతో మొహం తుడుచుకొన్నాడు.

వియ్యమ్మ నరిసిరెడ్డి కూతురు. పెళ్ళి కాకుండానే ముండమోసింది. వయసు వచ్చింది మొదలు వూళ్ళో పడుచువాళ్ళకి వూరదేవత గుడిని
విహార భూమిగా మార్చింది. ఎంత గింజుకొన్నా బంధువులు ఆమెను నిలుపలేకపోయేరు. చివరకు నరిసిరెడ్డి కొడుకులు ఆమె ప్రియుల్లో
ఒకణ్ణి చంపేసేరు.

దానితో కొంతకాలం వూళ్ళో పడుచువాళ్ళు వెనకాడేరు. చివరకి ఓనాడు పొరుగూరి జాగీర్దారు తమ్ముడు ఛోటేజాన్‌తో ఆమె ఏలాగో
కత్తు కలిపింది. ఈమారు తల్లిదండ్రులూ, అన్నదమ్ములూ భయపడే స్థితి వచ్చింది. ఛోటేజాన్ కచ్చడం బండి కట్టుకొని సరాసరి
యింటికే వచ్చేస్తాడు. ఆ బండి చప్పుడు వినబడగానే ఇంటిల్లిపాదీ ఎక్కడివాళ్ళక్కడే గప్‌చిప్. మాటమధ్యలోనే
అందరికీ నిద్ర వచ్చేస్తుంది.

ఒక్కొక్కప్పుడతడు వియ్యమ్మను తనతో బండెక్కించి ఎక్కడికో తీసుకుపోతూంటాడు. రెండు మూడు రోజులామె ఎక్కడుందో ఎవరికీ తెలియదు.
అయినా ఆమె ఇంట్లో వున్నట్లే అంతా నటిస్తారు.

ఛోటేజాన్ ఒక్కొక్కరోజున తాగి వచ్చి ఆమెను తన్ని పోతూంటాడు. ఆమె మీద తనకేదో పెత్తనం వున్నట్లు వాళ్ళతోనూ, వీళ్ళతోనూ
పోయేవంటాడు. అదో పెద్ద రభస.

సత్తెమ్మ కొట్టిన దెబ్బతో మనసాలలో వున్న వాళ్ళంతా స్తంభించిపోయేరు. ఒక్కరి నోట కూడా మాట రాలేదు.

సత్తెమ్మ కూడా ఇంక ఎదిరించనూలేదు. ఇంక పెళ్ళి మాట తలపెట్టను అని వాగ్దానం చేసింది. వెంకటయ్యను పనిలోంచి పంపెయ్యడానికి
అంగీకరించింది. ఆమాట అన్న తర్వాత ఒక్కమారు బావురంది.

అంత అప్రతిష్ఠ పని మానినందుకు తన్ను అభినందించవచ్చిన తల్లిని తోసేసింది. ఆ ఉక్రోషంలో బండబూతులు తిట్టింది.

"వియ్యమ్మలా కనిపించినవాడికల్లా.... తే మీ ప్రతిష్ఠ పోదు. పెళ్ళి చేసుకొంటే మీ బతుక్కి అప్రతిష్ఠ. ధూ..."

తానన్న మాటలకి క్షమాపణ చెప్పుకోడానికి వచ్చిన తమ్ముడి మొగం వేపు కూడా చూడలేదు.

"సబబు చెప్పడానికి మీరు తెచ్చిన మూకను చూసేక మర్యాదంటే మీకున్న అభిప్రాయం అర్థం అయింది."

ఆమాట విన్నాక తమ్ముడు మరల ఆమె దిక్కు మొగం చూపడానిక్కూడా ప్రయత్నించలేదు.

ఆ వరసన సత్తెమ్మ రెండు రోజులు పూర్తిగా నిరాహార వ్రతం చేసింది. బ్రతిమాలిగాని, బెదిరించిగాని ఆమెచే ఎవ్వరూ
పచ్చిమంచినీళ్ళు కూడా త్రాగించలేక పోయేరు.

వెంకటయ్య పొలంలో వాడు పొలంలోంచే పని మానుకొని వెళ్ళిపోయేడు. వెళ్ళిపోయే ముందు ఒక్కమారు సత్తెమ్మను చూడగలిగితే
బాగుండుననుకొన్నాడు. కానీ సాధ్యం ఎల్లాగ? బంధువుల కాపలాలో వున్న ఆమెకు కబురు అందించడం కూడా సాధ్యం కాలేదు. ఒక్క
నిట్టూర్పు విడిచేడు. చూరులో గుచ్చిన చేతికర్రనున్న కంబళీ భుజాన వేసుకొని అల్లాగే వెళ్ళిపోయేడు.



ఆరో ప్రకరణం


సత్తెమ్మ పరిస్థితులకు లొంగిపోయి తల వంచింది. కానీ ఆ లొంగుబాటులో చేసిన త్యాగం తల మళ్ళీ ఎత్తగల శక్తి లేకుండా
చేసింది. ఆమె జీవనాడుల్ని పూర్తిగా క్రుంగదీసింది. ఆమెలో ఇప్పుడు వెనుక వుత్సాహం—ఉత్సాహమనేదే లేదు. ఎవ్వరితోనూ
మాట్లాడదు. పలకరిస్తే ఏదో గాఢ నిద్రలో వుండగా లేపినట్లు మిర్రిచూపులు చూస్తుంది. పదింటికోమాట సమాధానం ఇస్తుంది. అదయినా
ఎంతో విసుపూ, కోపంతో.

తల్లి ఆమెను మరల ప్రకృతిలోకి తేవడానికి ప్రయత్నాలు చెయ్యబోయింది. కాని, ఆమె ఎదుట కనిపిస్తేనే సత్తెమ్మకు మహా
చిరాకు. అయినా ఆమె ప్రయత్నాలు మానలేదు. చిరాకుల్నీ, పరాకుల్నీ లెక్క చెయ్యకుండా హితోపదేశం చేస్తూ వెంటబడేసరికి
సత్తెమ్మ "కంయ్" మంది. "ఓరి దేవుడా" అనుకుంటూ ముసలమ్మ పారిపోవడం తప్ప ఏమీ చెయ్యలేకపోయింది.

"మీ గౌరవం కాపాడేను. ఇంకేం కావాలి? నా ప్రాణమా? తాడు తెస్తావా? విషం ఇస్తావా?"

ఆ మాట అన్నాక ఇంకామెను ఎవ్వరూ పలకరించలేకపోయేరు. క్రమంగా ఆమె ఇరవైనాలుగ్గంటలూ మంచం మీదనే పడి వుంది. ఇంటి
కప్పును నిర్నిమీలితంగా చూస్తూ వుండిపోతూంది. నవనవలాడుతూ ఎక్కి వస్తున్న మొక్క వాడిపోయినట్లుంది, మనిషి. తమ్ముడికి బాధ
అనిపించింది. వెళ్లి పలకరించేడు. మందొకటి తెచ్చి యిచ్చేడు.

సత్తెమ్మ మాత్రం పొట్లం మంచంకోటి మూలలో పెట్టేసింది. తనకేమీ జబ్బులేదనీ చెప్పేసింది.

మరదలు అద్దం తెచ్చి మొగం ముందు పెట్టింది.

"చూసుకోండి, ఏలాగున్నారో...."

సత్తెమ్మ అద్దంలో తన ప్రతిమ వంక చూసి, అప్రయత్నంగానే రేగి వున్న జుట్టు సర్దుకొంది.

"మనుష్యులెప్పుడూ ఒక్కలాగే వుంటారా? పెద్దదాన్ని అవుతున్నా. చిన్ననాడున్నట్లు లేనంటే...."

"పాతికేళ్ళ వయస్సులో పండు ముసలి మాటలు" రంగయ్య నిశ్శబ్దంగా వెళ్ళిపోయేడు. కాని, మరదలు వెంట వదలలేదు. ఆమెకు
ఆడబిడ్డపై ఎంతో అభిమానం....

....ఆరోజున చీకటి పడేముందు పొరుగింటి ముంతాజ్ దొడ్డిదారిన యింట్లోకి వచ్చింది. కొంతసేపు ఆమాటలూ, ఈమాటలూ చెప్పి
సత్తెమ్మను తమయింట సాయం పడుకొనేటందుకు రమ్మని కోరింది. వాళ్ళ అయ్య వూరికెళ్ళాడు.

వీరమ్మ ముంతాజ్ మాటల్ని నమ్మలేదు. ఎంతో ప్రయాస మీద లొంగి వచ్చిన కూతురికి మళ్ళీ మనసు మార్చేస్తారేమోనని ఆమె భయం.

ఆయింట వచ్చిన గంద్రగోళంలో ముంతాజూ, ఆమె తండ్రీ కూడా సత్తెమ్మ అభిప్రాయాలకు అనుగుణంగా మాట్లాడేరు. వాళ్ళంతట వాళ్ళుగా
కలగచేసుకొని మాట్లాడలేదు; ఆ పేచీలలోకి దిగనూ లేదు. అలాగని మాట వచ్చినప్పుడు నీళ్ళునమలనూ లేదు. వీరమ్మ తన గోడు
వెళ్ళబోసుకొంటూంటే సిలార్ తమలో వున్న అలవాట్లను చెప్పేడు. వాళ్ళల్లో మగడు పోతే పెళ్లి చేయడం తప్పు అనే నిషేధం లేదు.
ఇష్టం లేకపోతే తలాక్ ఇచ్చేసి మళ్ళీ నిఖా కట్టేసుకొంటారు కూడా.

ముంతాజ్ సరాసరిగా సమాధానం ఇవ్వలేదు.

"మా అయ్యే నన్ను పెళ్ళి చేసుకోమంటున్నాడు. నేనే కాదంటున్నాను గాని...."

ముంతాజ్‌కి ఓమారు పెళ్ళి అయింది. ప్రక్క వూళ్ళోనే దర్జీ పని చేసుకు బ్రతుకుతున్న బుడన్ అనే పడుచువాడికిచ్చి
పెళ్ళి చేశాడు, తండ్రి. పెళ్ళి అయ్యేక బుడన్ మళ్ళీ కొట్టు తెరవలేదు. సరాసరి మామ యింటనే మకాం పెట్టేడు.

పైకి చూడ్డానికి బుడన్ ఎంత సౌమ్యంగా, అందంగా వుంటాడో అంత క్రౌర్యం, ధూర్తత్వం వుందని చెయ్యిజారేక గాని సిలార్‌కు
తెలియలేదు. దంపతులకి అనుకూల్యం కుదరలేదు. వాడు రోజూ త్రాగి వచ్చి కూతుర్ని కొడుతూంటే తండ్రి ప్రాణం కొట్టుమిట్టాడిపోయింది.
చివరకి ఓరోజున దొడ్డిలోకి ఓపంది వచ్చిందని వూళ్ళో వడ్డెర కుర్రాడిని ఒకడిని బల్లెంతో బుడన్ పొడిచి చంపేయడంతో సిలార్
ఇంక సహించలేకపోయేడు. ఇంట్లోంచి తరిమేసేడు. ఇంటికి చేరనివ్వలేదు. విడాకులిప్పించి, మళ్ళీ పెళ్ళి చేయాలని ఆలోచనలో
పడ్డాడు. ముంతాజ్ ఆ సంగతే చెప్పింది.

ఆ సమాధానాలు విన్నాక వీరమ్మ ఇంక వాళ్ళని సలహా అడగలేదు. వాళ్ళు తన ప్రయత్నాలకు వ్యతిరేకులని ఆమె
నిర్ణయించుకొంది.

ఇప్పుడు ముంతాజ్ సత్తెమ్మను సాయం రమ్మని అంటూంటే ఆమెకు అనుమానమే కలిగింది. తీరా తీసికెళ్ళి ఏం చేస్తారో, చల్లబడ్డ
కొంపలో ఏం చిచ్చు రగులుస్తారోయని భయం.

"నాడు, వాడ మధ్య భయమేంది పిల్లా!"

ఆ మాట వినడంతో సత్తెమ్మకు చాల కోపం వచ్చింది. ఇదివరకు అనేకమాట్లు ముంతాజ్‌కి సహాయంగా వాళ్ళ యింట పడుకొంది.
చాలామార్లు తల్లే పంపింది కూడా. ఇదే మొదటి మారు కాదు. అప్పుడెప్పుడూ తోచని 'నాడు వాడ'లు ఈ రోజున గుర్తు రావడంతో
సత్తెమ్మకు ఆవేశం పుట్టింది. తల్లి తనను అనుమానిస్తూందని కోపమూ వచ్చింది.

"వెంకటయ్య వస్తాడట మాట్లాడాలి. వెడుతున్నా"

ఆశ్చర్యంతో నోరుతెరచిన ముంతాజ్ చేయిపట్టుకు లేవదీసింది.

"రా."

కూతురు మాటవినగానే వీరమ్మ కంగారుపడింది. తాను అనుమానిస్తున్నాననే కోపంతో ఆమె యామాట అన్నదని గ్రహించింది. ఆ సమాధానంలోని
క్రోధాన్నీ, పెంకెదనాన్నీ అర్ధం చేసుకొంది. తెగే దాకా లాగడం తెలివిగల పని కాదు. నిజంగా ఆ పిలుపులో ఏమన్నా కుట్ర వుంటే
కూతురు పైకి అనేస్తుందా? సర్దుకొంటున్న మనిషిని రెచ్చ కొట్టకూడదనుకొంది.

"అదేం మాట పిల్లా!"

సత్తెమ్మ సమాధానం ఇవ్వలేదు. వెడుతున్నాని కూడా చెప్పకుండా ముంతాజ్‌ని చెయ్యి పట్టుకొని తీసుకుపోయింది.

ఇంటికి చేరేక ముంతాజ్ కోప్పడింది.

"నిన్ను రానివ్వదనుకొన్నా. అల్లా అన్నావేమిటి?"

ముంతాజ్ ఆందోళనకి కారణం ఏమిటో సత్తెమ్మకి తెలియదు. మామూలుగనే అనేసింది.

"లేకపోతే చూడు. వెధవ అనుమానాలు. తన పక్కలోంచి తీసుకుపోయినా కళ్ళు తెరవని ముండకి, ఇప్పుడు నీకు సాయం కావాలనేసరికి
అనుమానంట. గింజుకు చావనీ."

సత్తెమ్మ ఇప్పుడు అనవలసిన మాటా, అనకూడని మాటా ఆలోచించడం లేదు. తన వ్యవహారం వీధిన పడ్డాక ఆమెలో సున్నితం
అనేది లేకుండా పోయింది.

కోపంలో ఏదో మాట అనేసినా, ఆ మాట వెనకటి జ్ఞాపకాలను ముందుకు తెచ్చేసరికి ఉక్కిరిబిక్కిరయిపోయింది. పూర్వ స్మృతులతో
మనస్సు కలిగిపోయి దొడ్డిగుమ్మంలోనే కూర్చుండిపోయింది.

స్నేహితురాలి మానసిక వ్యధ చూసి ముంతాజ్ చాల బాధపడింది.

"నువ్వు గట్టిగా నిలబడవలసింది బహన్!"

ఆమాట విని సత్తెమ్మ ఏడ్చింది. వెక్కుతూనే అప్రయత్నంగా అనేసింది.

"ఒక్కమాటు చూడగలిగితే...."

ఎంతో గంభీరంగా వుండే మనిషి ఆలా డీలా పడిపోతూంటే ముంతాజ్ సానుభూతి తెలిపింది. కళ్ళు తుడిచింది. అరచేతుల్లో దాచుకొన్న మొగాన్ని
పైకి ఎత్తింది. చెవిలో రహస్యంగా తాను పిలుచుకు వచ్చిన కారణం వూదింది.

"వెంకటయ్య వస్తాడిప్పుడు."

తల్లితో తానన్న మాటకు ముంతాజ్ ఎందుకు భయపడిందో సత్తెమ్మకిప్పుడు అర్ధం అయింది. ఆమె దౌత్యం నడుపుతూందనిపించి చాల కోపం
వచ్చింది.

"తార్పుడు ప్రారంభించేవా?"

ఆ మాటలోని తీవ్రతకూ, నీచత్వారోపణకూ ముంతాజ్ నిస్తబ్ధురాలయిపోయింది. బారుమని ఏడుస్తూంటే ఆమెను ఊరడించడం ఓ పెద్ద పని
అయిపోయింది.

"ఇల్లాంటి పనులెప్పుడూ చెయ్యకు. వెంకటయ్యను పంపేసెయ్యి."

ఈ విధంగా రాయబారాలు నడిపి, సంకేతాలు ఏర్పాటు చేసుకొని పరాయి ఇంట్లో దొంగతనంగా కలుసుకోవడం చిన్నతనం అనిపించింది.
వెంకటయ్య తమ యింట్లో వున్నప్పుడు మాత్రం వారు తమ సంబంధాన్ని రహస్యంగానే వుంచినా అది చిన్నతనం అనిపించలేదు. తమ సంగతి
తల్లికి తెలుసును. అందుచేత ఆమె ఎదుటనున్నంతవరకు వారు గుట్టుగానే వుండేవారు. కాని, నడకల్లో, చేతల్లో చూపుల్లో
మనస్సులు ప్రతిబింబిస్తూనే వుండేవి. అది బహిరంగమూ కాదు. రహస్యమూ కాదు.

ఎరిగి వున్న బంధువులూ ఏమీ తేలలేదు. ఏదో మాములుగా జరిగిపోయే ఘటనలా వదిలేసేరు. చెలికత్తెల బుగ్గపొడుపుల్లో కూడ
ఈర్ష్య, వినోదం మాత్రమే కనబడేవి గాని నింద వినిపించలేదు. ఏడో దొంగపని చేస్తున్నట్లు అనిపించలేదు.

కాని, ఇప్పటి పరిస్థితి వేరు. ఈ పది పదిహేను రోజుల్లో నడిచిన వ్యవహారం, తల్లికి తానిచ్చిన వాగ్దానం, వాటి దృష్ట్యా
నేడు ముంతాజ్ తాము కలుసుకొనేటందుకు అవకాశం కలిగించడం ఎంతో చిన్నతనంగా కనిపించింది.

సత్తెమ్మ లేచి నిలబడింది. ముంతాజ్ చేయి పట్టుకొంది. ఆ చేతిని నెమ్మదిగా విడిపించుకొంటూ నెమ్మదిగా అంది.

"ఇల్లా కబుర్లు పెట్టి చిన్నపుచ్చ వద్దని చెప్పు."

ఆ కబురు అందుకోవలసిన వెంకటయ్య మధ్యవర్తుల అవసరం లేకుండానే వాళ్ళ ముందు హాజరయ్యేడు. సత్తెమ్మ మాట విననూ
విన్నాడు. క్షమాపణా చెప్పుకొన్నాడు.

తన పని తీరిపోయినట్లూ, ఇంక వారిద్దరి మధ్యా తాను అడ్డం వుండదలచనట్లూ ముంతాజ్ నెమ్మదిగా జారుకొనేటందుకు ప్రయత్నించింది.
కాని సత్తెమ్మ వదలలేదు. తన ముందుకు లాక్కుని, వెనక తిప్పి నిలబెట్టింది. ఆమె వీపునానుకొని, రెండు భుజాల మీదా
చేతులానింది. ఆమె తల మీదుగా వెంకటయ్య చూపులనెదుర్కొంది.

"జరిగింది చాలదనా? ఇంకెప్పుడూ ఇల్లా రాబోకు."

తాను చేసిన పనికి కోపపడ్డా, వెంకటయ్యతో అంత నిక్కచ్చిగా చెప్పగలుగుతుందని ముంతాజ్ అనుకోలేదు. అతనిపై ఆమెకున్న
ప్రేమనూ, ఒక్కరోజు అతడు కనబడకపోతే ఆమె పడే ఆరాటాన్నీ ఎరుగును. ఇద్దరివీ ఇరుగుపొరిగిళ్ళు కావడమూ, ఇద్దరిదీ
ఇంచుమించు ఒకే వయస్సు కావడముతో వారి మధ్య అరమరికలు లేవు. గత అనుభవాన్ని పట్టి సత్తెమ్మ ఈ మాదిరిగానైనా
కలుసుకోడానికి తొందరపడుతూండి వుంటుందనే ఆమె నమ్మకం. కాని, ఇప్పుడీ మాటలు విని ఆశ్చర్యపడింది.

ముంతాజ్‌కిదేమీ అర్ధం కాలేదు. తాను స్నేహితురాలికి చేసింది ఉపకారమా? అపకారమా? ఆతనినొక్కమారు చూడలేకపోయేనని
ఒక్క క్షణం క్రితమే కళ్ళనీళ్ళు పెట్టుకొన్న మనిషి, అతడు నిజంగా ఎదుట నిల్చున్నప్పుడు ఇల్లా ఎదురు తిరుగుతుందేం?

తన ముఖం వేపు చూడడానికై ముంతాజ్ వెనక్కి తల తిప్పబోతూంటే సత్తెమ్మ కదలనివ్వలేదు. రెండు అరచేతుల్లో ఆమె బుగ్గల్ని
ఒత్తిపెట్టి, తల తిరగకుండా నొక్కిపట్టింది. గడ్డం అదిమి తలను నొక్కిపెట్టింది.

ముఖం చూడలేకపోయినా, తన వీపును అదుముతున్న రొమ్ముల కదలికలలో, ఆమె మనస్సులో రేగుతున్న తుపానును ముంతాజ్ అర్ధం
చేసుకొంది.

వెంకటయ్య తల గోక్కుంటూ నిలబడిపోయేడు. ఈ పదిహేను ఇరవై రోజుల నుంచీ ఆమెపై బంధువులు తెచ్చిన వొత్తిడి తీవ్రతను
అతడూహించలేకపోలేదు. తాను వినకనూపోలేదు.

ఆమె ధైర్యస్థైర్యాలనాతడెరుగును. ఆమె లొంగిపోయిందనే వార్తనే నమ్మలేకపోయేడు. ఇప్పుడీ మాట.

ఆ గంద్రగోళం రోజుల్లో ఆతడు సాధ్యమైనంత వరకు వూళ్ళోకి రాకుండా బావుల వద్దనే కాలక్షేపం చేసినా, ఎవరో ఒక స్నేహితుడు
ఎప్పటికప్పుడు వూళ్ళో విషయాలు చెవిని వేస్తూనే వున్నాడు. ఊళ్ళో పెద్దవాళ్ళు కొందరు తమ పెళ్ళికి వ్యతిరేకం. చాలమంది
తటస్థం. పడుచుకారు అంతా తనకు అనుకూలం. కాని, ప్రధాన నిర్ణయం సత్తెమ్మ మీద ఆధారపడి వుంది. ఆమె ఎవ్వరికీ
లొంగడంలేదని విన్నప్పుడు, అవసరమయితే ఆమె సహాయానికి పరుగెత్తడానికై వెంకటయ్య పనులన్నీ కట్టిపెట్టేసి కూర్చున్నాడు.
కాని, కడకామె లొంగిపోయిందన్నారు. మొదట నమ్మలేదు. తర్వాత నమ్మకపోడానికి కారణం కనబడలేదు.

నేడు తాను కోరినంతమాత్రాన రాగలుగుతుందని ఆతడనుకోలేదు. కాని అవసరం. ప్రయత్నించేడు. ఫలించింది. అంతమాత్రంచేత ఆమె తన
చేతుల్లో వురుకుతుందని భావించలేదు. ఆమె విషయం తాను చెప్పలేడు గాని, తానే ఆ సాహసం చేయలేడు. ఎవరో పరాయి మనిషి
విషయంలో, కొత్త మనిషి విషయంలో కలిగినట్లే మనస్సుకు సంకోచం కలుగుతూంది.

.... అయినా సత్తెమ్మ రావద్దనీ, కనపడవద్దనీ అంటుందని అతడనుకోలేదు.

తాను మాట్లాడదలచిన సంగతే వేరు. ఆమె తన అభిప్రాయాన్ని మార్చుకోడానికి గల కారణాల్ని అడగకూడదనీ, వెనకటివి తవ్వి
ఆమె మనస్సుని బాధించరాదనీ వచ్చేటప్పుడే ఆతడు నిశ్చయం చేసుకొని మరీ వచ్చేడు. కాని ఆమె మాటలతో అతని ప్రణాళిక
తల్లక్రిందులయింది. అనుకోకుండానే, అంతవరకూ తాను అడగకూడదనుకొన్న సంగతులు ఎత్తుకొన్నాడు.

"నాకు నమ్మకం లేదు. నీ నోటితో చెప్పు. ఏది ఏమయిపోయినా సరే...."

అదివరకు మాట్లాడుతున్న విషయాలమీద అభిప్రాయం చెప్పమన్నట్లు ప్రారంభమయింది. ఒకదానికొకటి సంబంధం లేని మాటలే అయినా,
సత్తెమ్మకా మాటలు అర్ధం అయ్యాయి. ముంతాజ్ కొంటెతనంగా భుజం ఎగరవేసింది. అయినా సమాధానం రాలేదు. ఆతడొక్క క్షణం ఆగేడు.

"భూమీ, పుట్రా, డబ్బూదస్కం లేని ముంతాజ్‌ని. నీవో దేవతవు. నాకు అదృష్టం లేదు...."

అతని నిట్టూర్పుతో ఆమె దుఃఖం పొంగిపొర్లింది. రెండు కన్నీటి బొట్లు ముంతాజ్ తలలో ఇంకేయి.

"తల తడిపేసేలాగున్నావే."

ముంతాజ్ గిజాయించుకొని లోనికి పరుగెత్తింది. సత్తెమ్మ ద్వారబంధం మూలకు జేరబడిపోయింది.

ముంతాజ్ ఇషారాను వెంకటయ్య గ్రహించకపోలేదు. సత్తెమ్మ ఏడుస్తూందని చెప్పింది. ఆమెను ఊరుకొపెట్టుకోమన్నట్లు, తమరిద్దరినీ
వదలి వెళ్ళిపోయింది. కాని, అతడు సాహసం చెయ్యలేకపోయేడు.

ఒక్క నిముషానికి వెంకటయ్య సర్డుకొన్నాడు. ఈమారు తాను పిలిపించిన పనిని గురించి ఎత్తుకొన్నాడు.

"నిజానికి నాకూ సంబంధం లేదనుకో. కాని, తోట చేతులతో పెంచేను. అది పాడయిపోతుందేమోనని మనస్సుకి ఎలాగో వుంటూంది."

అతడు బోళ్ళపొలం గురించి తాను పడిన శ్రమను వర్ణించేడు. సత్తెమ్మ చెవులు రిక్కించింది. బాధాకరమైన సంభాషణ నుంచి ప్రసంగం
తప్పించినందుకు సంతోషం కలగడానికి బదులు ఈమారు ప్రసంగం మరింత బాధ కలిగించింది.

బావి పొలం పాడు కానివ్వకంటే నవ్వూ వచ్చింది. కాపురం వదలి పోతూ మగడు ఆకలికి ఓర్చుకోలేడని ఒకామె అత్తగారికి
వప్పచెప్పి పోయిందట. ఆలా వుందనిపించింది. తనకన్న బోళ్ళపొలం ఎక్కువన్న మాట. అదే అనేసింది కూడా.

కాని వెంకటయ్య ఇచ్చిన సమాధానం ఆమెను తల్లక్రిందులు చేసేసింది.

"నీ మీదా, ఆ పొలం మీదా కూడ నాకే విధమైన హక్కూ లేదు. నీ మీద నాకు వెర్రి ముహబ్బత్ వుంది. కాని, దానిని చూపలేను.
నిన్ను దూరం నుంచైనా చూడగల హక్కు లేదు. కాని, పొలం సంగతి వేరు. అక్కడికెళ్ళి ఓ నిముషం కూర్చున్నా ఎవ్వరూ వద్దనరు.
ఆ అభిమానం చూపించగలను. అంతే తేడా!"

సత్తెమ్మకు గత పది పదిహేను రోజుల ఘటనలూ గుర్తు వచ్చేయి. వాటితో పాటు నిరాశ, నిస్పృహా కూడా.

"ఏదెల్లా పొతే నాకెందుకు? నేను చెయ్యగలది మాత్రం ఏం వుంది?"

ఆమెకు ధైర్యం చెప్పడానికీ, కర్తవ్యం బోధించడానికీ వెంకటయ్య చాలా చెప్పుకొచ్చేడు. ఆమెకది చెవికెక్కలేదు. విసువు కలిగింది.

"నీ ఎరికనే ఎవరన్నా మొక్కా, మోటి అంటే శ్రద్ధగలవాడుంటే కుదిర్చి రంగడితో చెప్పు."

వెంకటయ్య ఆమె మొగం వంక ఆశ్చర్యంతో చూసేడు. తానంటే ఒకప్పుడు రంగయ్యకి మంచి అభిప్రాయం వుంటే వుండొచ్చు. కాని, ఇప్పుడు
అతడు తన మంచి సలహాని కూడా సద్భావంతో తీసుకోగలడని ఎలా అనుకోడం?

ఇద్దరూ చాల సేపు నిశ్శబ్దంగా నిలబడిపోయేరు. ఈమారు సత్తెమ్మే సంభాషణ ప్రారంభించింది.

"నేను ఆ తోటకేమన్నా చాకిరీ చెయ్యగలనా? నా వశమా?...."

ఆమె మాటలు మెత్తబడ్డట్లు సూచిస్తూన్నాయి. అదే సమయం, తన అభిప్రాయం తేల్చేడు.

"సరయ్యని పెట్టుకోరాదూ? ముసలాడికెవ్వరూ లేరు. పొలాన్నే వుండి, వొండుకు తింటూంటాడు. తోటా, దొడ్డీ పాడుగాకుండా చూస్తూంటాడు."

సరయ్య ఎవరో జ్ఞాపకం చేసుకోడానికి సత్తెమ్మ ప్రయత్నించింది. కాని గుర్తు రాలేదు. మరల వెంకటయ్యే సహాయం చేసేడు.

"నూజీడు సరయ్య. మామిళ్ళు తెచ్చిచ్చేడు. యాదిలేదు?"

ఈ మారు గుర్తు రావడమే కాదు. వెంకటయ్య ప్రయత్నం ఏమిటో కూడా అర్ధం అయిందనిపించింది.

అరవయికి పైగా వయస్సు. నెరిసి మాసిన గడ్డం. డొక్కుపోయిన దవడలు. వేలాడిపోతున్న కండరాలు. సరయ్య ఆకారం కళ్ళ ముందు
మెదిలింది. అంతా అతన్ని నూజీడు ముసలాడనేవారు. అతడెప్పుడొచ్చినా సంగం వాళ్ళు రావడానికి పూర్వమో, వచ్చి వెళ్ళాకనో. అతడో
మారు కనిపించినప్పుడు సంగం నాయకుడొస్తాడాయని తాను అడగడం గుర్తు వచ్చింది.

ఇప్పుడా ముసలివాని పేరు రాగానే మళ్ళీ వెనకటి అనుమానమే కలిగింది. అతని ముఖం వేపు చూసింది. కాని దానిమ్మ నీడలో ఆ ముఖం
అర్ధం కాలేదు.

సత్తెమ్మ ఆలోచించింది. తాను లేకపోయినా, సంగం వాళ్ళకి మదుగుగా వుపయోగపడేటందుకే వెంకటయ్య బోళ్ళపొలంలో సరయ్యని
పెట్టమంటున్నాడనిపించింది. ఆ ప్రయత్నం ఆమెకు అభ్యంతరం కాదు. అందుకే అయితే తప్పక వొప్పుకోవాలనిపించింది.

తమరిద్దరినీ పెళ్లి చేసుకోవలసిందిగా సంగం వాళ్ళు తెచ్చిన వొత్తిడి మూలంగానే ఇంత గంద్రగోళం జరిగిందనీ, వాళ్ళు ఆ పేచీ
పెట్టకపోతే ఈ రభస వచ్చేది కాదనీ ఆమె అప్పుడప్పుడు అనుకోకపోలేదు. కాని, వాళ్ళ పట్టుదల వెనక ఎంత సద్భావం వుందో
కూడా ఆ పది రోజుల రగడలోనూ అడుగడుగునా కనిపించింది.

ఆ గంద్రగోళం ప్రారంభమయ్యేక సంగం వాళ్ళు మంచికి గానీ, చెడ్డకి గానీ ఆమె వ్యవహారాల్లో ఎదురు కాలేదు. అయినా వాళ్ళ
అభిప్రాయం ఆమెకు తెలిసింది. పెళ్ళి కాకుండా సంపర్కం వద్దన్నారు. కొన్నాళ్ళు కక్కుర్తి తీర్చుకొని మగాడు పారిపోతే? పెళ్ళి
అయ్యేక పారిపోకూడదా అంటే ఆ స్థితి వేరు. నేను పెళ్ళి చేసుకోవాలంటే సంఘాన్ని ఎదుర్కొని పెళ్ళి చేసుకోవాలి. సంఘాన్ని
ఎదిరించగల దృఢ నిశ్చయం చూపగలవాని ఏకాగ్రతను శంకించనక్కర్లేదు. ఆ ధైర్యం లేనివాడితో సంపర్కం ఆత్మ నాశనానికి దారి
తీస్తుంది. సంఘంలో మగాడి స్థానం వేరు. ఆడదాని స్థితి వేరు. ఈ విధంగా దొంగతనంగా సంపర్కం పెట్టుకొన్నప్పుడు ఏ కడుపన్నా
అయితే ఏమిటి చెయ్యడం? పెళ్ళి చేసుకొనే ధైర్యం లేనివాడు పిల్లవాడికి పితృత్వం అంగీకరిస్తాడా? ఆమె తన స్థితికి సమాధానం ఏం
ఇస్తుంది? ఆమెను ఎవరు ఆదుకొంటారు? తల ఎత్తుకోలేక వీధిన పడాలి. లేదా ఏ మందో పుచ్చుకోవాలి. ఆ పని తరుచుగా
ప్రాణాపాయం కలిగిస్తుంది. తప్పకుండా ఆరోగ్యానికి దెబ్బ. భర్త పోతే ఎందుకు పెళ్ళి చేసుకోకూడదు? ఒకడుంచుకొన్నాడన్న
మాటకన్నా మళ్ళీ పెళ్ళి చేసుకొందన్న మాట భయంకరమా?

వాళ్ళు పుణ్యం, పాపం, స్వర్గం, నరకం వగైరాల్ని గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. తన ఆరోగ్యం, తన క్షేమం, తన
ప్రతిష్ఠ, తన భవిష్యత్తునూ గురించి మాత్రమే ఎంతసేపూ చెప్పేరు.

తల్లీ, వాళ్ళ ధోరణితో ఆ మాటల్ని పోల్చి చూసింది. పెళ్ళి చేసుకొంటానంటే ఇంత రాద్ధాంతం చేస్తున్న బుద్ధిమంతులు, ఆ మనిషితోనే
చాటుమాటుగా రహస్య సంబంధాలు కలిగి వుండడానికి పేచీ పెట్టలేదు. వస్తే అవమానం తనకు వస్తుంది. పొతే తాను పోతుంది. అంతేగా
వాళ్ళ ఊరుకోడానికి అర్ధం? కాని, పెళ్ళి అనే సరికి ఎంత పేచీ. దానిలో అగౌరవం ఏముందీ? పెద్ద వుత్సవంగా సంతోషించే
పెళ్ళికే తనకు అభ్యంతరం. తమ యింటి ఆడపడుచు మళ్ళీ పెళ్ళి చేసుకోడం కుటుంబానికే మచ్చ! కన్న కూతురు కన్న, ఆమె
ప్రతిష్ఠ, ప్రాణం మర్యాద కన్న, కుటుంబం, కులం మర్యాద ఎక్కువ. ఏ కడుపన్నా వచ్చి, పెళ్ళి ప్రయత్నం చేస్తూందనుకొని
మందు కూడా ఇప్పిస్తామన్నారు. ఎరకల పుల్లి మందు తింటే గర్భం పోకపోయినా, ప్రాణం పోతుంది. అల్లాగ ఎందరో చచ్చిపోయారని
తన బంధువులెరగారా? ఎరుగుదురు. కొంతమందిని తానే ఎరుగును. ప్రాణం దక్కినవాళ్ళు ఎవరన్నా వుంటే యావజ్జీవం ఎందుకూ కొరగాకుండా
తయారయ్యేరు. ఒకళ్ళిద్దర్ని తానూ చూసింది. ఆ రోజున సత్తిరెడ్డి అదే చెప్పేడు. గట్టిగా చెప్పేడు. కాని తన తల్లి!
తాను చచ్చినా, యావజ్జీవం పనికి రాకుండా పోయినా ఆమెకేమీ చింత లేనే లేదా?

ఇల్లాంటి ఆలోచనలే ఈ పదిహేను రోజుల్లో కొన్ని వందల మార్లు ఆమె మనస్సులో పరుగులు తీసేయి. ఇప్పుడూ అవే తోచేయి.

"ఆ చెట్లు నీ చేతుల్లో పెరిగేయి. ఎవరినో ఒకర్ని నువ్వే కుదుర్చు."—అంది. వెంకటయ్య ఆలోచనకు తన అభ్యంతరం ఏమీ
లేదన్నట్లు.

వెంకటయ్య ఆమె అభిప్రాయాన్ని అర్ధం చేసుకొన్నాడు. కాని, తానా విషయంలో కలగచేసుకోలేనన్నాడు.

సత్తెమ్మ ఏమీ అనలేదు. అతడు ఎందుకు నిరాకరించేడో అర్థం చేసుకోడం కష్టం కాదు. సరయ్యను కుదిర్చినది అతడేనని తెలిస్తే
ఇంటిల్లిపాదీ కందిరీగల తుట్టలా రేగిపోతారు. వారినెదుర్కోగల శక్తి తనలో లేదు. మరి సరయ్యను రప్పించడం ఎల్లాగ? కబురు
ఎవరు చేస్తారు? ఆ మాట అందించడానికిక్కూడా వెంకటయ్య నిరాకరించేడు.

"ఎప్పుడో వస్తాడు. నువ్వే అడుగు."

ఆఖరు నిముషంలో కూడా అతడు తన వుద్దేశాన్ని బయటపెట్టదలచుకోలేదనుకుంది. కాని, తానేమీ అనలేదు.

ఇద్దరూ అల్లాగే ఓ నిముషం ఏవేవో ఆలోచనలలో నిలబడిపోయేరు.

ఆఖరుకు అతడే "వెళ్ళనా?" అన్నాడు.

సత్తెమ్మ గుండె దడదడలాడింది. మాట కూడా గట్టిగా రాలేదు. తల వంచుకొనే క్షమాపణ వేడుకొంది.

"నా మీద కోపం వుంచుకోకు."

వెంకటయ్య ఎంతో బాధతో ఆమె వంక చూసేడు. ఏం చెప్పగలడు? ఆమె మీద కోపగించగల శక్తి కూడా తనకు లేదని చెప్పాలి. కాని
చెప్పలేదు. ఆమె మాటలకన్న కంఠంలో గద్గదికం అతనిని నిర్వాక్కుణ్ణి చేసింది. నోటితో ఏమీ చెప్పలేక చెయ్యి ఆడించేడు.
తొందరగా అడుగులేసుకొంటూ వెళ్ళిపోయేడు.

సత్తెమ్మ అతడు వెళ్లిన వైపే చూస్తూ చాల సేపు నిలబడి పోయింది. వెనక్కి పిలుద్దామనుకుంది. కాని పిలువలేకపోయింది. ఒక్క
నిట్టూర్పు విడిచింది.

వాకిట్లో చాల సేపు అలికిడి లేకపోతే ముంతాజ్ వెతుక్కుంటూ వచ్చింది. నీరసంగా దొడ్డి గుమ్మం వేపు చూస్తూ శిలా ప్రతిమలా నిలబడి
వున్న సత్తెమ్మ భుజం మీద చెయ్యి వేసింది.

"బహెన్,"

సత్తెమ్మ పెదవులు కదిల్చింది. ముంతాజ్ అడగలేకపోయిన ప్రశ్నకది సమాధానం.

ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళేరు. చెరో మంచాన్నీ ఆశ్రయించేరు. అనేక ఆలోచనల మధ్య తల్లక్రిందులవుతూ ఎంతో రాత్రి అయ్యే వరకూ
నిద్ర పట్టక దొర్లుతూనే వున్నారు.

ముంతాజ్ పక్కలోంచే పలకరించింది.

"నిద్రపోలా?"

సత్తెమ్మ సమాధానం ఇవ్వలేదు. కాని, లేచి కూర్చుంది. ముంతాజ్ లేచి వచ్చి ఆమె ప్రక్కనే నిలబడింది.

సత్తెమ్మ ఆమె వీపు నిమిరి చేయి పట్టుకొని ప్రక్కన ప్రక్కన కూర్చోబెట్టుకుంది. ఆమె పెదవులు క్షీణస్వరంతో పలకరించేయి.

"ముంతాజ్!"

ముంతాజ్ ఆమె ముఖం వంక చూసింది.

"నేనో తప్పు చేసేను. నేనిచ్చిన సలహా తప్పు. ఒకమారు పెళ్ళి అయ్యేక మొగుడూ, కాపురమూనా అన్నాను. నాది తప్పు."

ముంతాజ్ ఆమెను నిలపడానికి ప్రయత్నించింది. అవన్నీ ఇప్పుడెందుకులే – అంది. కాని సత్తెమ్మ ఆగలేదు.

"ఎందుకు చేసుకోకూడదు? ఆడదానికి సుఖం, సంసారం అక్కర్లేదా? మనసిచ్చి మాట్లాడుకొనేటందుకు మనిషి లేక మంచంపట్టెనంటిపెట్టుకొని
పడుండవలసిందేనా?" అప్పుడు ఆమెను వేళాకోళం చేసింది. కాని, తన మట్టుకి తాను ఆగలేకపోయింది. ఈ రెండేళ్ళలో ఆమెకామాటే
గుర్తు రాలేదు. ఇప్పుడు....

సత్తెమ్మ దుఃఖంతో మాట్లాడలేకపోయింది. ముంతాజ్ ఆమెకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నించింది.

ఓదార్పు మాటలు విన్నకొద్దీ సత్తెమ్మకు దుఃఖం పొంగి పొర్లింది. అరచేతుల్లో మొగం వాల్చుకొని ఏడుస్తూ కూర్చుంది.

ముంతాజ్ ఆమె దుఃఖంలో సానుభూతి తెలుపుతూ ఆమె భుజం మీది చెయ్యి తియ్యకుండా నిశ్శబ్దంగా అలాగే కూర్చుండిపోయింది.

"నా వాళ్ళే నా గొంతు కోసేరు. నన్ను మోడును చేసేరు. నీకా బాధలేదు. త్వరలో పెళ్ళి చేసుకు సుఖపడు. నా మాటలు మరిచిపో."
– అంటూ సత్తెమ్మ కళ్ళు తుడుచుకొంది.



ఏడో ప్రకరణం


దుఃఖం, సంతోషం కూడా సాంక్రామికాలు. సత్తెమ్మ నిరుత్సాహం నేడింట్లో అందరినీ అంటుకొంది. ఇల్లిప్పుడు వెనకటల్లే సందడిగా వుండడం
లేదు. శవం వెళ్ళిన యింట్లో మాదిరిగా అంతా నిశ్శబ్దం. ఒకరి ముఖం ఒకరు తప్పించుకు తిరుగుతున్నారు. ఎవ్వరి ముఖానా
నవ్వనేది కనబడదు. ఎప్పుడేనా ఒక హాస్యపు మాట వినబడ్డా నూతిలో వేసిన బెడ్డ మాదిరిగా అక్కడి అలలు అక్కడే
అంతరించిపోతున్నాయి. ఆట్టే కదలికలు కలిగించవు.

వెనకటి మాదిరిగా ఇంట్లో పాటలు, పదాలు వినబడవు. సత్తెమ్మ పాటల పుట్ట. ఇంట్లో వున్నా, పనిలో వున్నా గొంతెత్తి ఏదో
పాడుతూనే వుంటుంది. పాట వినిపించకపోతే ఆమె ఇంట్లో లేనట్లే వీధిలో వాళ్ళు అనుకొంటారు. ఆమెది హృదయం విచ్చిన నవ్వు. ప్రతి
కదలికా, మాటా, ఘటన ఆమెకు గిలిగింతలు పెడుతుంది. నవ్వు నాలుగు విధాల చేటని తల్లీ వాళ్ళూ కోప్పడుతూనే వుండేవారు. కాని,
అప్పుడు కూడా ఆమె నవ్వడం మానేది కాదు. అటువంటిది ఇప్పుడా పాటలూ లేవు, నవ్వులూ లేవు.

ఇంట్లో వచ్చిన ఈ మార్పు, ముఖ్యంగా అక్కగారి పరిస్థితి రంగయ్యకు చాల బాధ అనిపించింది. అసలీ తుఫాను ఎందుకు
తెచ్చిపెట్టేనాయని కూడా అంతా అయిపోయేక బాధపడుతున్నాడు. అంతవరకూ అతనికా ఆలోచన కలగలేదు. ఒక్కటే పంతం. అది కాస్తా
చెల్లేక ఎంత పని చేసేనని పది మాట్లనుకొన్నాడు.

తానేమో వితంతు వివాహాలు కావాలని వాదించేవాడే. అయినా తన అక్కగారు మళ్ళీ పెళ్లి చేసుకొంటానంటే ఇంత రభస ఎందుకు తెచ్చేడు?
ఆమెను నేలబెట్టి రాసేసే వరకూ తనకు ఆ సంస్కరణ దృక్పథం మాట ఎందుకు గుర్తు రానేలేదు?

ఒకమారు పొలం వద్ద ఇల్లాంటి చర్చే వచ్చినప్పుడు రాజరెడ్డి అన్న మాటలు గుర్తు వచ్చాయి. మనస్సుకి మరీ బాధ కలిగింది.

వీరేశలింగం పంతులుగారి సమాజసంస్కరణాభిప్రాయాల్ని న్యాపతి సుబ్బారావు పంతులు గారు బలపరిచేరు. విధవా వివాహాలు జరిపించేటందుకు
సాయమూ చేసేరు. ఆ విషయంలో ప్రోత్సాహం ఇస్తూ ఉపన్యాసాలూ ఇచ్చేరు. కాని,

.... ఆయన సోదరుడే వితంతు వివాహం చేసుకొనేసరికి ఎదురు తిరిగేరు. పంతులుగారి మీద కక్ష కట్టేరు.

వీరేశలింగం పంతులుగారి ఆత్మ చరిత్ర నుంచి రాజరెడ్డి ఈ ఘటనను ఉదాహరించి చెప్పేడు.

సంఘంలో వున్న దురాచారాల మీద నిజంగానే కోపం వుండొచ్చును. వానిని నిర్మూలించాలనే పట్టుదలా వుండొచ్చు.

కాని, మనం ఒక్కటి మరిచిపోకూడదు. ఆ దురాచారాలు వందలకొలది సంవత్సరాలుగా మన నిత్య జీవితంలో భాగాలుగా ఏర్పడిపోయాయి.
అవి మన మనస్సుల మీదా, జీవిత పద్ధతుల మీదా మనకు తెలియకుండానే పని చేస్తున్నాయి. ఆ బంధనాల్ని మనుష్యుడు
తెగ్గోసుకోగలగాలంటే అదంత సున్నితమూ కాదు. సుఖమూ కాదు. మానవజాతి చరిత్రలో అటువంటి బంధనాలను తెగకోసుకొని బయట
పడేటందుకు జరిగిన ప్రతి ప్రయత్నమూ ఒక్కొక్క పునర్జన్మ.

"తన దాకా వచ్చినప్పుడే తన విశ్వాసాల బలం బయటపడుతుంది." అన్నాడు ఆ రోజున రాజరెడ్డి.

తాను దానికి అంగీకరించేడు. భావనా బలం లేకపోతే వాదనలలోనే మనిషి తేలిపోతాడని తాను అనుకొన్నాడు.

తన వాదనలలో ఎప్పుడూ గాంభీర్యం, విశ్వాసం కొరవడలేదనే అతని వూహ. తాను తన దాకా వస్తే-కూడా నిలబడతాననుకొన్నాడు.

కాని...

ఇప్పుడేం జరిగింది? తానేం చేసేడు?...

తాము వూళ్ళోకొచ్చిన రెండో రోజున పడక గదిలో భార్యతో కబుర్లు చెప్తున్నాడు. మాటల నడుమ ఆమె అతడు చెప్పే సంస్కరణల
కబుర్లని ముదలకించింది.

వితంతువులకి వివాహాలు చెయ్యాలంటూ అన్ని ఉపన్యాసాలిస్తారే. ఇంట్లో పూచిన తంగేడులా ఉన్నారు. వొదినకి ఆ పెళ్ళేదో చెయ్యరాదూ?

ఆ మాటలు విని, రంగయ్య వులికిపడి తలుపు వేపు చూసేడు. పెళ్ళాం నోరు మూసేడు.

"గట్టిగా అనకు. ఆవిడ చెవిని పడిందంటే మనమిద్దరం ఈ యింట్లోంచి ఈ పూటే మూట కట్టెయ్యాలి. వెధవ ముండకి పెళ్ళి మాట
చెప్తే చంపేస్తుంది."

సూరమ్మ మగని అమాయికత్వానికి నవ్వింది.

"ముంతాజ్ మగడి గొడవల్లో ఆవిడ చేత వందమాట్లు చీవాట్లు తిన్నాను. ముసల్మానుల్లో మళ్ళీ పెళ్లి తప్పు కూడా కాదు. ఆ
పిల్ల తండ్రి సిద్ధంగా వున్నాడు. కాని, అక్కగారి గురుత్వమే. ఆవిడ పెళ్ళి చేసుకోనంది. మంచిదానివి. నా దగ్గిర కనక
సరిపడింది. పొరపాటునేనా అన్నావు గనుక. గుడ్లు తోడేస్తుంది."

సూరమ్మ బహు తాపీగా సమాధానం ఇచ్చింది.

"ఈ మాటు వదిన తిట్టరులెండి. మాటవరసకి ఓ మారు కస్సుబుస్సుమన్నా నాలిక పీకెయ్యరు."

భార్య అనుమానాన్ని ఆమె నోట విని రంగయ్య మహా తామస పడ్డాడు.

తన అక్క వెంకటయ్యను ఎన్నుకొందన్న మాటను ఆతడు నమ్మలేకపోయేడు.

"పాలేరువాడు. ముండలముఠాకోరు."

అది వెంకటయ్య ఆర్థిక, నైతిక విలువలయెడ రంగయ్య అభిప్ర్రాయం. కాని, సత్తెమ్మ దృష్టిలో?

ఒకప్పుడు తన అక్క పెళ్ళి చేసుకోడం గురించి అతడూ ఆలోచించేడు. సంఘ సంస్కరణను తన యింట్లోంచి ప్రారంభిస్తే, తనకు రాగల
ప్రతిష్ఠను గురించి కూడా ఎన్నో సంగతులు అల్లుకొన్నాడు. తన అక్క మగడు ఎలా ఉండాలో, ఏమిటో కూడా ఆలోచిస్తూ అనేక
కథలు వూహించుకున్నాడు.

కాని తీరా చేస్తే తన అక్కగారు ఒక అతి సామాన్యుడైన పాలేరువాణ్ణి వరించి వూరుకొంది. పాలేరుకిచ్చి పెళ్ళి చేసేనని
చెప్పుకోడానికిక్కూడా సిగ్గేసే స్థితి. సంస్కరణ వివాహం చేసేమన్నా ఓ పేరూ, ప్రతిష్ఠా వుండాలి. పెద్ద చదువుకొన్నవాణ్ణో,
పెద్ద వుద్యోగస్తుణ్ణో, ఆస్తిపరుణ్ణో వరించిందంటే ఓ పేరూ, ప్రతిష్ఠాను. కాని వెంకటయ్యని తన అక్క మగడనుకోడంలో
ప్రతిష్ఠేమిటి?

సూరమ్మ ఈ సంభాషణను ప్రారంభించడంలో దురుద్దేశం ఏమీలేదు. కాని, తీరా అది మగనిలో కలిగించిన వ్యతిరేకతను చూసేసరికి
భయపడింది. మాట తప్పించడానికీ, సాచెయ్యడానికీ చాల ప్రయత్నించింది. కాని సాధ్యం కాలేదు.

ప్రపంచానుభవం అంతగా లేని తన భార్య, ఏదో చుట్టపు చూపుగా వచ్చిన రెండో రోజున ఈ రహస్యాన్ని పసిగట్టిందే, ఎప్పుడూ
ఇంట్లో వున్న తల్లికి తెలియదా? ఏ మాత్రం అనుమానం వున్నా వూరుకుంటుందా?

ఆ కథా భాగాన్ని కూడా సూరమ్మ వినిపించింది. తప్పలేదు.

"వెంకటయ్యను ఆమె పంపెయ్యమన్నారట; కాని, వదిన వొప్పుకోలేదట. ఏమీ చెయ్యలేక వూరుకొన్నారట."

సూరమ్మకు ఈ విషయాలు చెప్పిన చెలికత్తెల మాటల్ని మొదట రంగయ్య నమ్మలేదు. కాని తర్వాత తల్లి ఆ మాటలు నిజమేనని
చెప్పింది. అక్క మీది కోపం, తల్లిమీద జాలితో రంగయ్య మనస్సు కుతకుతమని పోయింది.

వెంకటయ్యకు ఆడపిల్లల వెంటబడే అవలక్షణం ఒకటున్నా, మనిషి చాల మంచివాడనీ, చురుకైనవాడనీ, తెలివిగలవాడనీ రంగయ్యకు
మంచి అభిప్రాయమే వుండేది. తన అక్కగారు ఆతనిని పెళ్ళి చేసుకొనదలచిందన్నమాట వచ్చేక గాని ఆడపిల్లల వెంటబడడం
వెంకటయ్య అవలక్షణమని అతనికెప్పుడూ అనిపించలేదు. తానున్న సమాజం అటువంటిది. ఊళ్ళోకి కొత్తకోడలు ఎవరన్నా
వచ్చిందంటే, ఆమెను పక్కలోకి తెచ్చుకునే మార్గాల కోసం దొరలు ఎంతో శ్రమపడతారు. నయం, భయం, డబ్బు, డాబు, అన్నీ
వుపయోగంలో పెడతారు. పెద్దవాళ్ళ అలవాట్లే మిగిలినవాళ్లూ అనుకరిస్తారు. ఆ సంఘంలో ఆడదాని విలువ పక్క వరకే. అందుచేత
గతంలో వెంకటయ్య విజయాలు కుర్రకారందరికీ వినోదకరంగా మాత్రమే వుండేవి.

ఆతడు తన అక్కగారిని కూడా లొంగదీసుకొన్నాడనిపించి రంగయ్య మండిపడ్డాడు. ఆడపిల్లల్ని అల్లరి పెట్టేవాళ్ళకి, తమ యింటి
ఆడవాళ్ళు అందని ఎత్తుల్లో వుండాలని ఆశలెక్కువ.

రెండోవేపున వెంకటయ్య ఆర్థిక స్థితి.

ఇవి రెండూ రంగయ్య వ్యతిరేకతకి ప్రధానాలంబనాలుగా కనబడసాగేయి. అక్క పెళ్ళి చేసుకోడం తనకిష్టమేననీ, ఈ రెండు
అభ్యంతరాల మూలంగా తాను అంగీకరించలేకున్నాననీ అతడు అనుకొన్నాడు.

కాలేజీలో చదువుకొనే రోజుల నుంచీ నూతన పరిసరాలు, చదివే పుస్తకాలు, నూతనములయిన తాత్విక ధోరణులు అతని అభిప్రాయాలలో
ఎన్నో మార్పుల్ని కలిగించాయి. కుల భేదాలు కల్పితాలన్నాడు. వితంతువులకు పెళ్ళి చేయడం ఒక అత్యవసర సంస్కరణగా
స్వీకరించేడు. అనేకమాట్లు తనకు మంచివాళ్ళూ, తెలివిగలవాళ్ళూ అనిపించిన లెక్చరర్లూ, విద్యార్థులూ, వివాహితులేమో
తెలుసుకొన్నాడు. కాకపొతే వాళ్ళ తాత్విక ధోరణులేలాంటివో తెలుసుకొనేటందుకు చర్చల్లోకి తెచ్చేడు. వాళ్ళని తన అక్క పెళ్ళి
చేసుకొంటే బాగుంటుందనీ అనుకొన్నాడు.

కాని, వెంకటయ్య విషయంలో ఆ ఆలోచన అతనికెన్నడూ తట్టనూ లేదు. తీరా ఆ పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చేసరికి
తట్టుకొనలేకపోయేడు.

ఆ వారం పది రోజుల్లో భర్తను శాంతింప చేయడానికి సూరమ్మ చాల మాట్లు ప్రయత్నించింది. భర్తలాగ ఆమె వెంకటయ్య మీద
ఇదివరలో ఏర్పడిన సద్భావాన్ని క్షణంలో కోల్పోలేకపోయింది.

అతనిని గురించి భర్త చాల చెప్పేవాడు. ఇదివరలో అత్తవారింటికి వచ్చిన ఒకటి రెండు పర్యాయాలూ తాను అతనిని చూసింది.
వెంకటయ్యను ఆ యింట్లో ఎవరూ, - ఒక్క అత్తగారు తప్ప- పాలేరులా చూడలేదు. ఆమె కూడా అంతే. ఇప్పుడు ఇంత రభస
చేస్తున్న తన మగడు అతని వద్ద హనుమంతుడిలా వుండేవాడు.

సూరమ్మ తన ప్రయత్నాలు విఫలమైనా మళ్ళా, మళ్ళా ప్రయత్నించింది. సత్తెమ్మ మొదటి మగడిని జ్ఞాపకం చేసి వెంకటయ్య
విషయంలో చూపే అభ్యంతరాలను తొలగించడానికి కూడా ప్రయత్నించింది.

"వదిన మగణ్ణి ఎరుగుదురా? ఆతని ఆఖరు రోజులు మీరెరగరు. నేనెరుగుదును."

ఆమెకప్పటికి పదేళ్ళో, పదకొండేళ్ళో వుండేవి. తమ వీధిలోనే సత్తెమ్మ అత్తగారిల్లు కూడా వుండేది. అందుచేత ఆమెకు బాగా
గుర్తు.

రంగయ్యకు అక్క మగడు గుర్తులేడు. ఎప్పుడో పెళ్ళిలో మాత్రం చూసిన గుర్తు. ఆ గుర్తులు ఆయన ఆకారాన్ని వూహించుకోడానిక్కూడా
చాలలేదు. కనక భార్య వర్ణనకు చెవినొగ్గేడు.

"ఆయనకు చదువూ, సంధ్యా లేదు. సంతకం కూడా పెట్టలేడు. మనిషెల్లా వుండేవాడో తెలుసా?"

సూరమ్మ చిటికెన వ్రేలు చూపింది.

"ఎముకల పోగు. నానా రోగాలు తగుల్చుకొన్నాడుట. కాళ్ళడిపోయేయి."

ఆ ఆకారాన్ని తలుచుకొని వెలపరించుకొంది. ఆయనగారిప్పటికీ బ్రతికి వుంటే మీ బావ అని చెప్పుకొనేటందుకు సిగ్గుపడేవారేనాయని
నిలదీసింది. ఆతనికీ, వెంకటయ్యకూ వున్న తేడాల్ని ఎదుట పెట్టింది.

కాని. ..

రంగయ్య ఆ విధంగా సమాధానపరుచుకొని వూరుకోలేకపోయేడు. బయట తల్లి వద్దా, ఇతరుల వద్దా ఏమన్నా, భార్య వద్ద మాత్రం
తన అక్క పెళ్లి చేసుకోనేకూడదని అనలేదు. ఆమె పెళ్ళి చేసుకోవచ్చు. కాని, వెంకటయ్య పనికిరాడు. అతనితో వున్న సంబంధం
తెంపెయ్యాలి.

ఆతని అహంకారానికి భార్య విస్తుపోయింది. ఇంకేం అనలేక పోయింది.

రంగయ్య పట్టుదల నెరవేరింది. కాని, దాని వలన ఆతని మనస్సుకి మాత్రం శాంతి కలగలేదు. తను తెచ్చిన రభసకు
పర్యవసానంగా వచ్చిన పరిణామాన్ని గమనించేక ఆతని వుత్సాహం సడలింది. తాను చేసిన పని మంచిదేనా అని ఆలోచనలో పడ్డాడు.

ఆ మధ్య తోటలో పండ్ల చెట్లమీద అలుముకొని అణగ తొక్కేస్తూందని నవనవలాడుతున్న జూకామల్లిని మొదలు కోసేసేడు. రెండు
గంటల్లో తీగంతా వొడిలిపోయింది. అందాకా ఎంతో అందంగా కనిపించిన తోట కళావిహీనంగా కనబడింది. తర్వాత విచారించేడు. ఎంత
సౌందర్యాన్ని నేలగలిపేననుకొన్నాడు. ఆనాడు మనస్సుకి కలిగిన క్లేశం, దుఃఖం ఇప్పుడు అక్కను చూసినా కలుగుతూంది.

ఆమెను మరిపించడానికీ, బాధాకరంగా కనిపించే ఈ పరిసరాల నుంచి దూరంగా తీసుకుపోవడానికీ, ఆమెను తనతోపాటు తాను ప్రాక్టీసు
పెట్టబోయే చోటికి రమ్మన్నాడు.

"అలా చేస్తే ముందు వెంకటయ్యను మరచిపోయేటట్లు చెయ్యొచ్చు. తర్వాత యోగ్యుడైన వరుణ్ణి చూసి, ఆతని మీదకు మనస్సు
తిప్పవచ్చును."

సూరమ్మ ఆ అభిప్రాయాన్ని బలపరచింది.

కాని, సత్తెమ్మ స్పష్టంగా 'రాను' అని చెప్పింది. ఆ మాటలలో అనుమానం లేశం కూడా లేదు.

అంతవరకూ కూతురు వూరొదిలి పోతే ఆస్తీ, వ్యవసాయం చెదిరి పోతుందంటున్న వీరమ్మ ఆమె వెళ్ళడానికి నిరాకరించిన మాట వినగానే
మండిపడింది.

"ఊరొదిలిపోతే ఈ మారాముళ్ళన్నీ సాగవు."

ఆ మాటనే కూతురు వద్ద అనగల ధైర్యం ఆమెకు లేదు. చాటుగానే రుంజుకొంది.



ఎనిమిదో ప్రకరణం


నాలుగు దూడకన్నె తాళ్ళు కట్టకట్టి భుజాన వేసుకొని, సరయ్య ఆ యింటి ముందు ఆగేడు. వీరమ్మకీ, కొడుక్కీ, కోడలికీ తాళ్ళు
కావాలో, తంపర కావాలో తెలియదు. సత్తెమ్మ అన్నీ చూసుకొనేది. ఆమె ఇప్పుడేమీ వినిపించుకోదు. పట్టించుకోదు. ఎవరూ ఏమీ
చెప్పకపోయినా సరయ్య కదలలేదు. వాకిట్లో పంచవార, పలుపుల కట్ట ముడ్డి క్రింద వేసుక్కూర్చున్నాడు. నీరసంగా 'అమ్మ'
అనుకొన్నాడు.

వీరమ్మ విసుక్కున్నా ఆతడు కదలలేదు.

'ఆ మధ్య అమ్మయ్య కావాలన్నారు."

సత్తెమ్మ లోపలి నుంచి అన్నీ వింటూనే వుంది. మొదట ఆమె కదలలేదు. తల్లీ వాళ్ళూ విసుక్కోడం, వీధిలో మనిషి తాను
పురమాయించినట్లు చెప్పడం వినబడి, వీధిలోకి వచ్చింది. ఆమెను చూడగానే సరయ్య దండం పెట్టేడు. ఆతనిని చూడగానే ఆమెకు
వెంకటయ్య మాటలు గుర్తు వచ్చేయి. ఇంతవరకు ఆమెకు సరయ్య మాటే గుర్తులేదు.

"నువ్వు వెనక పునాసమామిడి మొక్కలు తెచ్చేవుకదూ?"

సరయ్య వాకిట్లో కూర్చుని పలుపులు ఎదుట పడేసేడు. తానెప్పుడో అడిగిన మాట గుర్తుంచుకొని పలుపులు తెచ్చినందుకు కూడు
పెట్టించింది. ఈ మధ్య కనపడ్డం లేదేమంది.

"జబ్బు పడ్డా తల్లీ. అంచేతే ఇన్నాళ్ళదాకా తేలేకపోయా."

అతడు భోజనం చేస్తూంటే ఆమె ఎదురుగా కూర్చుని క్షేమ సమాచారాలడిగింది. భార్యాబిడ్డల్ని గురించి అడిగినప్పుడు అతడు ముద్ద
మింగలేకపోయేడు. దుఃఖంతో జేరగిలబడిపోయి, ఆకులోనే చేయి వదిలిపెట్టి చాలసేపు కూర్చుండిపోయేడు.

"లేరు తల్లీ! ఇంకెవ్వరూ మిగలలేదు."

అతని సంసారం విచ్చిన్నమైపోయిన కథ చెప్తూ వుంటే సత్తెమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరిగేయి.

సరయ్యకి ఒక్కడే కొడుకు. పిఠాపుర సంస్థానాథీశుడిచ్చిన ఆర్థిక సహాయంతో చదువుకొన్న హరిజన యువకుల్లో అతడొకడు.
అతడెంత వరకు చదువుకొన్నాడో చెప్పలేకపోయేడు. కాని, రెండేళ్ళు చదివితే తాశీల్దారు అయిపోయేవాడేనన్నాడు.

అతడోమాటు సెలవులకి ఇంటికి వచ్చేడు. అప్పుడు గ్రామంలో పనివాళ్ళంతా సమ్మె చేస్తున్నారు. కూలిగింజలు కొలవడమా, డబ్బు
ఇవ్వడమా అనే పెద్ద పేచీ వచ్చింది. ధాన్యం చవకగా వుంటే కుంచెడు గింజలు కొలవడం, ప్రియమయ్యేసరికి ఓ పావలా డబ్బులు
చేతిలో పెట్టడంగా వుండేది. అప్పటి రోజుల్లో ధాన్యం చవక అయింది. డబ్బులివ్వడం మాని గింజలు కొలుస్తామంటారు రైతులు. డబ్బులే
ఇమ్మన్నారు కూలీలు. తగాదా వచ్చింది. సమ్మె చేసేరు. సరయ్య కొడుకు సమ్మెకు నాయకత్వం వహించేడు. గ్రామంలోని భూస్వాములను
ఎదిరించినందుకు కక్షతో, ఆతనిని రౌడీలచేత కొట్టించి చంపించేరు.

ఆ కొడుకు పోయేక తల్లి మళ్ళీ మంచం దిగలేదు. ఆమె చచ్చిపోయేక సరయ్య వూరొదిలేసేడు. దూరం పోయి నూజివీడు ప్రాంతాల్లో
ఆపనీ, ఈపనీ చేసుకొని కొన్నాళ్ళు గడిపేడు. అక్కడినుంచి నిజాములోకి వచ్చేడు. ఒక్క పొట్ట, ఎంత కావాలి? ఏదేదో పనులు
చేస్తూంటాడు. ఆతడు పలుపులు బాగా వేస్తాడు. ఆతనికి చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు వుంది. ఏదో, రోజు గడిపేస్తున్నాడు.

ఆతని కష్టాలకు సత్తెమ్మ విచారం తెలిపింది. తమ పొలానికి ఆహ్వానించింది.

"నీకూ ఎవరూ లేరంటున్నావు. ఎవరి వద్దా పనిలోనూ లేనంటున్నావు. పోనీ మా బోళ్ళపొలంలో వుండరాదా?"

మొక్కా, మొటికా పెంచడం చిన్నపనేం కాదు. అతడూ పెద్దవాడయిపోయేడు. బరువు పనులు చెయ్యగలడా?

సరయ్య అనేక అభ్యంతరాలు చూపేడు. అసమర్థతా, అయిష్టం ప్రకటించేడు. అవన్నీ విన్నాక, ఆనాడు వెంకటయ్య చెప్పినప్పుడు
తాను పడ్డ అనుమానం సరియైనది కాదనుకొంది.

తమ తోటలో ఆతడు చేయవలసిన పెద్దపనులేవీ వుండవని చెప్పింది. తోటను కనిపెట్టుకు వుండాలి. దూడా దుడికీ పడి పాడు
చెయ్యకుండా చూస్తుండాలి. మోటనీరు నారుమళ్ళకి మళ్ళించడం కూడా బరువు పనా?

సరయ్య చాల సేపు ఆలోచించేడు. అంగీకరించేడు.

"సరే తల్లీ!"

సత్తెమ్మకు అతని అంగీకారం చాల సంతృప్తి కలిగించింది. వెంకటయ్య అడిగినందుకు ఆ మాత్రమేనా చెయ్యగలిగేననుకొంది.

ఆ సాయంకాలమే సరయ్య తన కాపురాన్నంతనీ ఓ చిన్న గంపలో పెట్టుకొని బోళ్ళపొలం చేరుకొన్నాడు.

మర్నాడుదయమే సత్తెమ్మ పొలం బయలుదేరింది. గత దినం నుంచీ అక్కగారిలో వస్తున్న మార్పును గమనించి రంగయ్య ఒక్క ఊర్పు
తీసుకొన్నాడు. వట్టినే కూర్చుని, అనేక ఆలోచనలతో కుంగిపోతూన్న అక్క ఏదో పనిపెట్టుకొంటే తప్ప తేరుకోలేదని ఆతడు
గ్రహించేడు. ఆమె మనస్సుని మళ్ళించడానికి మార్గం వెతుకుతున్నాడు. కాని, ఏమీ తోచడం లేదు. ఈ దశలో పొలం పనుల్లో ఆమెయే
కలగచేసుకోడంతో ఒక పెద్ద బరువు దిగిపోయినట్లే సంతోషించేడు.

కూతురు పూనుకొంటే తప్ప ఈ ఏడాది వ్యవసాయం చెడుతుందని భయపడుతున్న తల్లి కూడా ఈ పరిణామానికి తృప్తి పడింది.

కాని, ఆ సంతోషం, తృప్తీ, రెండు రోజులు కూడ మిగలలేదు.

సత్తెమ్మ రెండు రోజులు పొలం వెళ్ళింది. ఏ మొక్కకి ఎటువంటి సంరక్షణ కావాలో సరయ్య చెప్తూంటే వింటూ వెంట వెంట తిరిగింది. ఆ
నెలరోజుల్లోనూ చూసేవాళ్ళూ, అదిలించేవాళ్ళూ లేక కట్టవలో దార్లు ఏర్పడ్డాయి. వాటిని జాగ్రత్తగా మూసెయ్యమంది.

అన్నీ చూసి, చెప్పి, విని సరయ్య విచారపడ్డాడు.

"పడుచువాళ్ళకి గాని అలవుగాని పని."

ఆ మాట ఎందుకన్నాడో అర్ధం కాలేదు. ఈ రెండు రోజుల్లోనూ అతడొక్క మాటు కూడా వెంకటయ్య పేరు ఎత్తకపోవడం చూసి, తమ
యింట్లో వచ్చిన గంద్రగోళం తెలుసు కాబోలుననుకొంది.

వెంకటయ్య రాత్రీ పగలూ విసువు లేకుండా ప్రతి మొక్కనీ ఎంత శ్రద్ధతో చూసేవాడో గుర్తు వచ్చి ఒక్క నిట్టూర్పు విడిచింది.

ఇంక పొలం వైపు వెళ్ళలేకపోయింది. రోజూ ఏదో వేళ సరయ్యే వచ్చి పొలంలో కబుర్లు చెప్పిపోతున్నాడు.



రెండో భాగము



ఒకటో ప్రకరణం


సరయ్య కంచెలో మేస్తున్న ఎడ్లని తోలి తెచ్చి తుమ్మచెట్టు క్రింద కట్టేసేడు. పోయి ప్రొద్దుటే వండుకొన్నదే ఇంత కూడు గంజి
పోసుకు తిని, బొచ్చె కడిగి, పంచన వ్రేలాడుతున్న వుట్టిమీద పెడుతూంటే, పొలం వెలుపల గుట్టల్లో ఎక్కడో ఒక గూబ
గుబగుబలాడింది. ఒక్క నిముషం శ్రద్ధగా ఆలకించేడు. చూరులో గుచ్చిన చేతికర్రమీద వేసిన పైపంచ తీసి తలకు చుట్టేడు.
కర్ర నేలని తాటిస్తూ బయలుదేరేడు.

కటిక చీకటి. నిర్మలంగా వున్న ఆకాశపుటంచుల్లో, చెట్టుపుట్టల ఆకారాలు కాటుక కుప్పలు పోసినట్లున్నాయి. పొలం చుట్టునా
వున్న కోరడిలోని నల్ల తుమ్మలమీద వేలూ లక్షలూగా మిణుగురులు మిలమిలలాడుతూ ఆకాశానికి అద్దం పట్టినట్లు కనబడుతున్నాయి.

కాపలా కుక్క అడుగులో అడుగు వేసుకొంటూ వెంట వస్తూంటే, సరయ్య కోరడి గుమ్మానికి ఎదురుగా, బయటనున్న ఒక పెద్ద బండ
ప్రక్కన నిలబడ్డాడు. నక్షత్రాల వెలుతురు సంజ చీకటిలా గనిపిస్తున్నా, పది గజాల దూరాన వున్న మనిషిని గుర్తుపట్టడం
కూడా సాధ్యం కావడం లేదు.

కొద్దిసేపటికి గుమ్మంలో పడుకొన్న కుక్క గుర్రుమంది. ఎరిగున్న వాళ్లెవరో వస్తూండాలి. లేకపోతే అది అంతతో వూరుకోదు.
సరయ్య బాటవేపు కళ్ళు గుచ్చి చూసేడు. రెండు నల్లని నీడలు దగ్గిరికి వచ్చేయి.

"పాగ చుడితివే. గల్లంత దూరానికి తెల్లంగ కనిపిస్తుండవు.'

సరయ్య వెంటనే పాగా తీసేసేడు. వెంకటయ్య వచ్చి ప్రక్కనే కూర్చున్నాడు. రెండో నీడ తోటలోకి వెళ్ళింది. కాపలా కుక్క లేచి,
కొంతదూరం సాగనంపి మళ్ళీ వచ్చి పడుకుంది.

"మనోళ్ళు రాలా?"

సరయ్య తోట మకాంలో చేరినప్పటినుంచీ వెంకటయ్యా, ఆతని మిత్రులూ రాత్రులు బోళ్ళపొలం వస్తూ, పోతుండేటందుకు వీలు చిక్కింది.

సంగంలో చేరినందుకు దెబ్బలు తిని, జైళ్ళకు పోయి వచ్చిన ఇద్దరు ముగ్గురితో గత సంవత్సరం ప్రారంభమైన ఈ సమావేశాలకు
ఇప్పుడు పదిమంది దాకా వస్తున్నారు. వెంకటయ్య చేతిలో పొలం వున్న రోజుల్లో ప్రారంభమైన చదువుల తరగతి, సరయ్య వచ్చేక
మళ్ళీ ప్రారంభమయ్యింది. నలుగురూ చేరి కష్టసుఖాలు చెప్పుకోడంతో ప్రారంభమైన సమావేశాలు "పెద్దల పాఠాలు" నేర్చుకొనేటందుకు
మారేయి. క్రమంగా 'ప్రజాశక్తి' తేవడం కూడా ప్రారంభించేరు. అప్పటికే ప్రజాశక్తి మీద నిజాం ప్రభుత్వం నిషేధాజ్ఞలు
తెచ్చింది. పత్రిక తేవడం, పంచడం, చదవడం అన్నీ రహస్యంగా జరగవలసిందే. దినం దినం పత్రిక తెలంగాణంలోకి వెళ్ళేటందుకు
అవకాశాలు లేక కేవలం తెలంగాణా వార్తల్ని వారం వారం ఒక ప్రత్యేక అనుబంధంగా ప్రజాశక్తి వేస్తూంది. అదికూడా తీసుకురావడం,
పంచడం అంత సులభమేం కాదు. ఈ వారం పత్రిక గ్రామాలకి చేరేసరికి రెండేసి, మూడేసి వారాలు కూడా పట్టేది. ఒక్కొక్కప్పుడు
రెండుమూడు వారాల పత్రికలు ఒక్కమాటే కలిసి వచ్చేవి. అయినా జనం ఎంతో శ్రద్ధా, ఆప్యాయంతో వాటిని చదివేవారు.
చదివించుకొనేవారు. ప్రజాశక్తి వచ్చినప్పుడల్లా బోళ్ళపొలంలో సమావేశాలు రెండు మూడు రోజులు నిండుగ సాగుతుంటాయి.

లంబాడీ పూర్ణయ్య, మేదర మల్లయ్య, చాకలి నారయడు, కుమ్మరి గురవయ్య. అసాగలి వెంకటాచారి ఒక్కొక్కరే తలోవైపు నుంచీ
వచ్చేరు. రావలసిన వారంతా వచ్చేసేరనుకొన్నాక సరయ్య రాతిమీది నుంచి లేచి, ముడ్డిక్రింద వేసుకొన్న తలగుడ్డ దులిపి భుజాన
వేసుకొని కదిలేడు. కోరడి గుమ్మానికున్న తడక దగ్గరగా లాగి, గొలుసు దూర్చి తాళం పెట్టేడు.

అంతా పాకలోకి చేరి దీపం ముట్టించేరు. వెంకటయ్య నలుగురి ముఖాలూ పరకాయించి చూసేడు.

"గొల్లాయన రాలేదు. ఇంక రాడనుకొంటా."

సరయ్య ప్రశ్న వెంకటయ్యకే. బోళ్ళపొలం నుంచి వెళ్ళిపోయేక అతడు గొల్ల భాగయ్య ఇంటిపంచన వుంటున్నాడు. వాళ్ళిద్దరూ
స్నేహితులు.

భాగయ్య ప్రసంగం రాంగనే అతడు అసంతృప్తి తెలిపేడు.

భాగయ్య కుటుంబ వ్యవహారాలు ఏమీ బాగాలేవు. దినం ఆలుమగల మధ్య రగడే. మధ్యన తీర్పు చెప్పలేకా, సర్దలేకా వెంకటయ్య
ప్రాణం చాలొస్తూంది. ఆవేళకావేళ ఉదయం నుంచీ ఇద్దరూ కోడిపుంజుల్లా వున్నారు. ఎవరిని వూరుకోమన్నా వూరుకోరు. సాయంకాలం గడీ
నుంచి వచ్చి అతడు భార్యను గొడ్డును బాదినట్లు బాదేడు. ఆమె కూడు వండకుండా ముసుగు పెట్టింది.

ఆ కథంతా చెప్తూంటే నలుగురూ జాలిపడ్డారు; విచారమూ పొందేరు; అసంతృప్తీ వెలిబుచ్చేరు.

గత వారం పది రోజుల నుంచీ ఆ కుటుంబంలో కలహాలు మరీ రగుల్కున్నాయి.

పది రోజుల క్రితం అమీన్ వూళ్ళోకి దౌరా వచ్చేడు. ఆయనకూ, ఆయనతో వచ్చిన పరివారానికీ కావలసిన పాలూ, వేట జీవాల్నీ
ఇవ్వడం గొల్లల వంతు. పోలీసాయన వచ్చేడు. భాగయ్య ఇంట్లో లేడు. పెళ్ళాం వుంది. ఆమె పాలు దూడ కుడుచుకొన్నదని చెప్పింది.
నిజానికి ఆ బర్రెదూడ బతికీలేదు. కుడుచుకుపోవనూలేదు.

బర్రె ఇచ్చే పాలే అంతంతగా వున్నాయి. ఓ పూట ఇచ్చీ ఓ పూట ఎగచేపీ ఏడిపిస్తూంది. తనకూ తన పిల్లలకూ మజ్జిగనీళ్ళేనా
లేకపోతే మానె, ఆ ఇచ్చిన కాసిన్నీ పోలీసువానికి పోసేస్తే వాడికవాళ్ళకేం చెప్తుంది? అందుకోసం అబద్ధం ఆడింది. పోలీసువాడు
తిట్టి పోయేడు.

కాని, అదక్కడితో ఆగలేదు. ఓ గంట పోయేక వీధినే వస్తున్న భాగయ్యని పట్టుకొని ఆతడు అమీన్ ముందు పెట్టేడు. పాలు
పంపనందుకు ఆయన శిక్ష వినిపించేడు. యమభటుల్లాగ పోలీసులు దానిని వెంటనే అమలు జరిపేసేరు.

భాగయ్య చేతులు రెండూ వెనక్కి విరిచి కట్టేసేరు. ఓ వరస కొట్టడం పూర్తి అయ్యేక, నిప్పుల్లో కాల్చిన ఓ గుండ్రాయి అతని
వీపున పెట్టేరు. విరిచి కట్టిన చేతుల పట్టులో రాయి క్రింద పడదు. దులుపుకొని వదలించుకోడానికి సాధ్యం కాదు. సహజంగానే
వేడి చల్లారే సరికి వీపూ, చేతులూ కాలి, కమిలి, బొబ్బలెక్కి పోయాయి.

ఆ బాధతో ఇంటికి ఎల్లాగో చేరుకొన్నాడు. చూరునున్న వొసికొయ్య తీసి పెళ్ళాన్ని బాదడం మొదలెట్టేడు. వెంకటయ్యే అడ్డం వచ్చి,
మరో ప్రమాదం జరక్కుండా చేసేడు. కాని వాళ్ళ కలహం చల్లారలేదు.

ఆ నా కొడుకులికి ఆ పాలేవో తగలేస్తే నాకీ దెబ్బలు తగిలేవా అంటాడు భాగయ్య.

మగడి గాయాలు చూసీ, తనకి తగిలిన దెబ్బలననుభవించీ రంగమ్మ ఏడ్చింది. కాలిన బొబ్బలకింత పసరు పూసీ, కదుములు కట్టిన
కర్రదెబ్బలకు ఆముదం రాసీ పరిచర్యలు చేస్తూనే తన్ను అంతలేసి దెబ్బలు కొట్టినందుకామె మగణ్ణి తిట్టిపోసింది. అతని చేతులు
పడిపోవాలనీ, అతణ్ణి మారెమ్మ వేసుకుపోవాలనీ గొంతెత్తి శపించింది.

ఆమె వాదం కూడా అంత తీసిపారెయ్యవలసిందేం కాదు.

"ఇంట్లోకి కానివ్వడు. ఆ పాలే, ఆ మజ్జిగే అమ్మి కూడు తినాలి. బర్రె ఎండిపోతూంది. ఉన్న కాసిన్నీ ఆళ్ళ ఎదానెడితే ఏం
తినేది? పాల కోసం ఇల్లా కొడతారనుకొన్నానా?" - అంటుంది.

విన్నవాళ్ళకి ఏంజెప్పాలో తెలియదు. ఆవిషయంలో ఏం చేసివుండాలిసిందో ఈనాటికీ జనం మధ్య ఏకాభిప్రాయం లేదు.

సాతాని నారయ్య ఈ కష్టాలన్నింటికీ సంగం కారణం అన్నాడు.

"దీనమ్మ! ఈ ఆడముండలకి నోరిచ్చింది సంగం కాదా? ఎప్పుడన్నా దొరలు పాలు కావాలంటే ఎవర్తన్నా కాదండం వుందా?"

లేని మాట నిజమే, కాని, ఆ వాదాన్ని అందరూ సమర్థించలేదు. చాకలి నారాయడు భాగయ్య పెళ్ళాం రంగమ్మ వకాల్తా తీసుకున్నాడు.

"ఆమె మాత్రం ఏం చేస్తుంది? నెలా చాకిరీ చేస్తే భాగయ్యకిచ్చేది మూడుబుడ్ల ధాన్యం. దానిమీద ఇద్దరు చిన్నాళ్ళూ, ఇద్దరు
పెద్దాళ్ళూ బ్రతకాలి. ఎల్లా?"....అది ఆతని వాదం.

ఈ వారం పది రోజులూ వీధుల్లో జరుగుతూ వచ్చిన చర్చలే నేడు పొలంలోనూ వచ్చేయి. కాని, బయట వినబడని కొత్త వాదం ఒకటి
ఇక్కడ వచ్చింది. ఉభయపక్షాల వాదనలూ విన్నాక సరయ్య చల్లగా అందించేడు.

"మూడుబుడ్లు చాలకపోతే ఎక్కువ ఇమ్మనాలి. తప్ప తాలూ దొరలిస్తే, ఇంటికొచ్చి పెళ్ళాన్ని తన్నడం మగసిరా?"

నాలుగువేపుల నుంచీ మొదట గట్టిగానూ, తరవాత నెమ్మదిగానూ సందేహ వాచకాలు వినిపించేయి.

"మనం అడక్కుంటేనేనా మూడుబుడ్లు ఇవ్వడం?"

చర్చ పాలేర్ల, కూలీల కూలి సమస్య మీదికి మళ్ళింది. కూలాడు, పాలేరు బిగువుగా వుంటే ఈ దొరలేం చెయ్యలేరనే అభిప్రాయాన్ని
అంతా ఏకగ్రీవంగా అంగీకరించేరు. ప్రజాశక్తిలో వచ్చిన సూర్యాపేట పాలేర్ల విజయ వార్త దానిని సమర్ధించింది.

"గొడ్లదగ్గిర పేడ తియ్యాలి. వాటిని చూసుకోవాలి. ఈ దొరలూ, దొరసానులూ మంచాలు దిగుతారా?"

సరయ్య తన కొడుకు ప్రాణాల్ని హరించిన సమ్మె పోరాటాన్ని వివరించేడు.

మేమూ ఇల్లాగే కాట్లాడుకొనేవాళ్ళం. మావోడు కాకినాడ నుంచొచ్చేడు. సంఘం పెట్టుకొని కట్టుకట్టమన్నాడు. అక్కడ పీచుపని
చేసేవాళ్ళు ఇల్లాగే సంఘం పెట్టుకొని, పెద్ద సమ్మె చేసేరంట. వింటే బాగనే అనిపించింది. అదేదో పుస్తకం తెచ్చేడు. కాని చీటీలు
కోసేడు. సంఘం పెట్టేశాం. సమ్మె చేశాం. అన్ని పనులూ బంద్. చివరికి మావూరి పెద్దరైతింట్లో బర్రె చస్తే తియ్యడానికి మాదిగలు
కూడా పోలేదు. అప్పుడాయన దిగొచ్చేడు. అంతవరకూ మిగిలిన రైతాంగం మేం ఆడినట్లు కూలివ్వడానికి ఒప్పుకొన్నా ఆయన పట్టుదల
మీదనే ఆగేరు."

వెనకటి గాథలన్నీ ఉక్కిరిబిక్కిరి చేసేస్తూంటే సరయ్య ఒక్క నిముషం వూరుకొన్నాడు. కన్నీరు వొత్తుకుంటూ ఆ సమ్మె ఫలితంగా
తన ఇంటికి వచ్చిన ఆపదను రెండు మాటల్లో తేల్చేసేడు.

"వారం నాడు కుర్రడు ఏటిగట్టంట వస్తుంటే మునసబంపిన యెదవలు కొట్టేసేరు."

ప్రాణాలు కూడా ఒడ్డవలసిన సంఘం కబుర్లతో వాళ్ళు చాలసేపు గడిపేరు. ఆఖరున లంబాడీ పూర్ణయ్య అంతవరకూ మనస్సులో
మెదులుతున్న ప్రశ్నను బయట పడేసేడు.

కమ్యూనిస్టంటే ఎవళ్ళు? సంగం వాళ్ళూ వాళ్ళూ ఒక్కటేనా? వేరా? - ఇల్లాంటివే ఆతని ప్రశ్నలు.

సరయ్య తన కొడుకు కమ్యూనిస్టనీ, కమ్యూనిస్టులే కూలి సంఘాలు పెట్టారనీ చెప్పేడు. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీ
ఒకటి కాదనేంత వరకే అతడెరుగును. రెండూ వేరు. సరే. తేడా ఎక్కడుంది? అతడు చెప్పలేకపోయేడు. కాని, ఒక్క కొత్త
సంగతి జత చేర్చేడు.

కమ్యూనిస్టులు కూలాడికి రాజ్యం కావాలంటారు.

ఆంధ్రమహాసభ ఏమంటుందో వాళ్ళెరగరు. కాని, ఎరిగినంతవరకే చర్చలో పడింది.

కూలాడికి రాజ్యం ఏమిటి? అక్షరం గుర్తు తెలియనివాడు రాజ్యం ఏం ఏలుతాడు? ఈ పోలీసాళ్ళూ, పటేళ్ళూ, గిర్దావర్లూ, దొరలూ
ఏమౌతారు? వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే బతకగలమా?

కూర్చున్న వాళ్ళందరికీ ఇవీ, ఇల్లాంటివీ కొన్ని వందల సందేహాలు. వాళ్ళు తలొకవేపు నుంచీ ప్రశ్నలు వేస్తుంటే సరయ్య
ఉక్కిరిబిక్కిరియైపోయేడు. ఆతడొక్క దారి చూపించేడు.

"కూలోడిది రాజ్యం అయితే ఈ దొరల్నీ, గిరల్నీ తన్ని తగిలెయ్యడూ?"

అందరూ కూడా అది అసంభవం అని తేల్చేసేరు. ఓనమాల పుస్తకం తెచ్చుకోవాలని ఎన్నాళ్ళ నుంచో వాళ్ళ ఆశ. కాని ఎవరన్న
చూస్తారేమో. ఎవరన్నా పటేల్ చెవినేస్తే? పోలీసాళ్ళ దాకా ఎందుకు? - ఆయనే కర్రుచ్చుకొంటాడు. "మళ్ళీ చదువు
మొదలెట్టేరంట్రా" యని మక్కులిరగ కొట్టిస్తాడు. ఈ భయంతోటే ఇంతవరకు పుస్తకం తెచ్చుకోలేదు. నిరుడు కొట్టిన దెబ్బల్లో
ఎక్కువ భాగం రాత్రి పాఠశాలకు పోయిన వాళ్ళకే తగిలేయి. సంగం ఏర్పడ్డాక రాత్రి పాఠశాల మొట్టమొదటి మారుగా వచ్చింది.
నడిచింది మాత్రం ఎన్నాళ్ళు? అంతా చేసి పది రోజులు. ఆ పది రోజుల్లోనే చాలమంది అక్షరాలు దిద్దేరు. కొందరు పేర్ల
పుస్తకాలు పట్టేరు.

పోలీసులు వస్తూనే స్కూలు పాకమీద పడి దాన్ని పీకేసేరు. ఉస్తాదుకి రెండేళ్ళు శిక్ష తగిలించి జైల్లో పెట్టేసేరు. ఇళ్ళన్నీ
సోదా చేసి పలకలు చితక్కొట్టి, పుస్తకాలు మంటేసేరు. ఆ మంటల్లో పడకుండా ఎక్కడో దాచిపెట్టిన రెండు మూడు పుస్తకాలే
ఇప్పుడిక్కడ సాగుతున్న చదువుకు మొదలు.

అలాంటప్పుడు వాళ్ళందర్నీ తరిమెయ్యగలమంటే నమ్మేదెల్లాగ? నమ్మకం లేదు. కాని సరయ్య వదలలేదు.

నిరుడు సంగం పెట్టుకొని బేగారీ చెయ్యడం లేదంటే ఏం చేసిరేం?"

"పోలీసోళ్ళొచ్చి చెయ్యలేదా?"

కాని, పోలీసులు, మిలిటరీ తుపాకులు వస్తే తప్ప దొరలు తమరినేమీ చెయ్యలేకపోయేరనే సంగతిని అంతా గుర్తు చేసుకొన్నారు.

"రెడ్డి సేరీదారు కిష్టయ్య అదే వురికిండు."

పోలీసులు వచ్చి కొట్టి పోయేక కూడా గిర్దావరూ, అమీనూ వూళ్ళోకి వచ్చేరు; కాని వెట్టి కోసం వెనకటల్లే బాధ పెట్టడం లేదు.
ఆ సంగతీ గుర్తు వచ్చింది.

"మనం సంగం పెట్టుకున్నాం. వాళ్ళు వురికిన్రు. వాళ్ళ సంగం పెద్దది. బందూకులుండాయి. వచ్చారు. మనం ఏం చెయ్యలేకపోయేం? మన
సంగం పెరిగి, మనకీ బందూకులుంటే...."

ఉంటే ఏం చేసి ఉండేవారో? .... ఆలోచించుకొంటూ అందరూ వొక్క నిముషం వూరుకున్నారు. ఆఖరున లంబాడీ పూర్ణయ్య ఒక్క నిట్టూర్పు
విడిచేడు.

"ఏం చేయడానికీ మనకేం తెలుసు? రాజ్యం వొస్తే ఏం చెయ్యాలో దేహాత్ వాళ్ళం మనకేం తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళనే పిలవాలి."

ఇంతవరకూ చర్చలన్నీ వింటూ, నిశ్శబ్దంగా కూర్చున్న సత్తిరెడ్డి ముందుకు వచ్చేడు.

"రాజ్యం నీదేననుకో, ఏం చేస్తావో చెప్పు."

అనుకోవడం ఎల్లాగ? పూర్ణయ్య కొంత సేపు రాజ్యం తనది కాదని మొరాయించేడు. కాని, చివరికి అదో ఆటయి, నలుగురూ తమ తమ
అభిప్రాయాల్ని చెప్తూంటే వాళ్ళతో తనూ కలిసేడు.

"అనసూయమ్మ లాక్కున్న నా భూమిని పుచ్చేసుకోకపోయేనా? ఒక్క గడియ వూరుకుందునా?"

అనసూయమ్మది అక్కడికో మైలులో వున్న పకీర్రావుపేట. నాలుగైదు వందల ఎకరాల ఆసామీ. పూర్ణయ్య కుటుంబం వాళ్ళు రెండు మూడు
తరాలుగా చేసుకొంటున్న భూమి తన పట్టాలోనిదంటూ ఆమె దానిని రెండేళ్ళ క్రితం స్వాధీనం చేసుకొంది.

వెంకటయ్య వంతొచ్చింది. ఏడాది క్రితం తగిలిన దెబ్బలకి వీపు ఇంకా చిమచిమలాడుతూనే వుందనిపించింది.

"పోలీసోళ్ళనీ, దొరల్నీ పిట్టల్ని వేటాడినట్లు వేటాడుతా."

ఆతడు మంచి గురికాడు. వడిసెలా, భర్మారూ ఆతని చేతిలో గురి తప్పవు. ఆతని అభిప్రాయానికి నలుగురూ సెభాషన్నారు.

అంతా తాముతాము అతి ముఖ్యం అనుకొన్న పనులన్నింటినీ ఏకరువు పెట్టేరు. అవేవీ వూరి సరిహద్దుల్నీ, వారి నిత్యావసరాల్నీ
మించిపోలేదు.

అవన్నీ వింటూంటే సత్తిరెడ్డికి తాను చదువుకొంటున్న రోజులు గుర్తు వచ్చేయి.

కాలేజీలో ఓమారు డిబేట్లు జరిగేయి. "నేనే ముఖ్యమంత్రినైతే" అనేది చర్చనీయాంశం. ఆనాడు ఆ చర్చల్లో పాల్గొన్నవారంతా
పెద్దజాగీర్దార్ల, వుద్యోగస్థుల బిడ్డలు, వాళ్ళ ఆలోచనలు ఇప్పటల్లా చిన్న సమస్యల మీద లేనేలేవు.

ఒకడు రాష్ట్రం అంతా పరిశ్రమలు పెరిగేటందుకు ప్రోత్సాహం ఇస్తానన్నాడు.

ఒకడు రాష్ట్రప్రభుత్వాదాయం పెంచేటందుకు ఏయే పన్నులు వెయ్యడమో చెప్పేడు.

మరోకాతడు సర్కార్లలో మాదిరిగా జిల్లా జిల్లాకీ కాలేజీలూ, వూరూరుకీ బళ్లూ పెట్టిస్తానన్నాడు.

ఇంకొకడు వ్యవసాయంలోకి ట్రాక్టర్లూ, యంత్రాలూ తెస్తే తప్ప లాభం లేదన్నాడు.

చివరి విషయం గుర్తు రాగానే ఆ కుర్రవాని పేరు కూడా గుర్తు వచ్చింది, ఆతని వూరేదో మరిచిపోయేడు. కాని, ఈ ప్రాంతం వాడే.
ఏ వూరో?

వాళ్ళు అంతా ఈరోజున ఇక్కడుంటే, ఇవన్నీ వింటే ఏమనుకొంటారో అనిపించింది.

చాకలి నారాయడు ఒకటో తరగతి పుస్తకాలు వూరంతా పంచి పెట్టిస్తాడు.

కుమ్మరి గురవయ్య కోరిక మాత్రం అందరికీ అసంభవం, పెద్ద ఎత్తూ అనిపించింది.

"మనూళ్ళో పురుళ్ళాసుపత్రి పెట్టిస్తా."

ఆతని భార్య రెండేళ్ళక్రితం ప్రసవించలేక చచ్చిపోయింది. అక్కడికి ఆసుపత్రి ముఫ్పయి, నలభయి మైళ్ళల్లో వుంది. ఆ వూరికో
దారీ డొంకా లేదు. కొంతదూరం బండిమీదా, కొంతదూరం బస్సుమీదా వెళ్ళాలి. కావాలన్నప్పుడు బస్సు కలవదు. కలిసినా చోటు దొరకడం
సులభమూ కాదు. ఎంతో డబ్బు అవుతుంది. గురవయ్యకు అదేమీ సాధ్యం కాలేదు. ఆస్పత్రి వూళ్ళోనే వుంటే ఆమె బ్రతికేదేనని
అతడెన్నోమాట్లు అన్నాడు. ఇప్పుడూ అదే మాట.

సత్తిరెడ్డి ప్రశ్నలు వేస్తూ, సమాధానాలు చెప్పిస్తూ కూలివాడికి రాజ్యం వస్తేనే ఇవన్నీ జరుగుతాయని వాళ్ళచేత వోప్పించేడు.

అయితే అందరికీ ఒకే సందేహం.

"ఎల్లాగ?"

"దొరలు రానిస్తారా?"

"నవాబు సేనలున్నాయి."

సత్తిరెడ్డి వోపికగా మళ్ళీ మొదటి నుంచీ ప్రారంభించవలసి వచ్చింది.

వెట్టి చేయరాదని ఎన్నో ఏళ్ళ నుంచి ఎందరో ఎదురు తిరుగుతూండలేదూ? ఎదురు తిరిగేరు. ఆలాగ ఎదురుతిరిగి ఏదో రోజున దెబ్బలు
తినని మనిషీ ఏదో విధంగా నష్టపడి వుండని యిల్లూ ఆవూళ్ళో లేనేలేదని చెప్పాలి. ఏదో పది పెద్దకుటుంబాల వాళ్ళకి ఆ తాకిడి
లేకపోయినా అదేం పెద్ద లెక్క కాదు. వాళ్ళు అయినా వెట్టి రూపంలో కాకపొతే నజరానాల రూపంలో ఇచ్చుకోలేక ఎదురుతిరిగి మరో
విధంగానేనా నష్టపడ్డ వాళ్ళే.

ఒక్క నిరుడు మాత్రం పదిహేను రోజులపాటు ఆ పీడ వదిలింది. ఆ తరవాతయినా దొరాలూ, అధికార్లూ వెనకటి మాదిరిగా కాకుండా చూసీ
చూడనట్లు వూరుకుంటున్నారు – అనిపిస్తూంది.

అయితే ఎందుచేత?

అందరూ ఏక కంఠంతో తమ అభిప్రాయం తెలిపారు.

"సంగం చేసింది."

"కాని సంగం ఏమిటి? అదేవిధంగా చేసింది? వివరించడానికై వారు దీర్ఘాతి దీర్ఘంగా ఆలోచించేరు. సూక్ష్మాతి సూక్ష్మంగా సమాధానం
ఇచ్చేరు.

సంగం అన్నది ఒక మనిషేం కాదు. వూళ్ళోవాళ్ళంతా దాంట్లో చేరేరు. వాళ్ళు చేరక పూర్వం ఆ వూళ్ళో సంగం లేదు. పోరుగూరాయనొచ్చి
సంగం చెప్పి వెళ్ళిపోయేడు. కాని సంగం వెళ్ళిపోలేదు.

పోరుగూరాయన వెట్టి చెయ్యనక్కర్లేదన్నాడు. తామంతా మానేసేరు. ఆయన వెళ్ళిపోయేకనూ చెయ్యలేదు. సంగం పెట్టుకొన్నాం మేం చెయ్యం
అనేసేరు.

మిలిటరీ వచ్చింది. పద్దాలుని కాల్చేసింది. అందర్నీ కొట్టారు. కొందర్ని జైళ్ళల్లో వేసేరు. సంగం లేదన్నారు. మళ్ళీ తెస్తే
చంపేస్తామని కూడా చెప్పేరు. తాము సంగాన్ని తేలేదు. మళ్ళీ వెట్టికి పోనేపోయేరు.

సంగం రానూవచ్చింది. పోనూపోయింది. కాని, మళ్ళీ వస్తుందేమోననే భయం మాత్రం దొరలకి పోలేదు.

సంగంలో చేరినారన్న తామంతా వూళ్ళోనేవున్నారాయె. సంగం ఎక్కడికి పోయింది?....

సంగం అన్నది పైనుంచి రాలేదు. మరెక్కడికీ పోనూలేదు. ఈమాటనందరూ వొప్పుకొన్నారు. కాని, అదేమిటో మాత్రం ఎవరికీ అంతు
చిక్కలేదు.

రాత్రి పొద్దుపోయింది. తెల్లారినాక అంతా మళ్ళీ పనుల్లోకి వెళ్ళవలసినవాళ్ళే. చర్చ నిలిపేరు. ఈమాటు మరో రోజున దీని
సంగతి తెల్చుకోవాలనుకొన్నారు. ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోయేరు. వెంకటయ్య ఒక్కడే వెనక్కి దిగబడ్డాడు.

సత్తిరెడ్డి ముందు అనుకొన్న కార్యక్రమాన్ని మార్చుకొంటున్నానన్నాడు. మళ్ళా సంగాన్ని ఏర్పాటు చెయ్యడం అవసరమని అతడు
కొద్ది రోజులుగా ఆలోచిస్తున్నాడు. నేడు జరిగిన చర్చలు ఆలోచనను కార్యరూపంలో పెట్టవలసిన అవసరం వచ్చినట్లు
సూచిస్తున్నాయి.

"రేపు రాత్రి మళ్ళీ అందర్నీ పిలు. పగలు మరో చోటు చూడగలవా? ఇక్కడే వుండడం మంచిదా?"

వెంకటయ్య ఆలోచించేడు. ఆనాడు వచ్చిన వారంతా నమ్మకం అయిన వాళ్ళే. కాని, ఏ పొరపాటునో నోరుజారితే? ఆతని పేరు
సత్తిరెడ్డి అని తెలియకపోవచ్చు. కాని, రహస్య కార్యకర్త వచ్చేడని నోరుజారేరా ప్రమాదం. కనక ఆయన్ని మరో చోట
వుంచడం అవసరం. తాను ఎరిగి వున్న ఇళ్ళన్నీ నెమరువేసుకొన్నాడు.

నేనిదివరకెన్నడూ చెప్పలేదు. కాని నాకు నమ్మకం వుంది. చాకలి మంగమ్మ యింట్లో వుందురుగాని...."

మంగమ్మ చచ్చిపోయిన పద్దాలు భార్య. ఇప్పుడు వూరి చివర ఎవరి దొడ్డిలోనో పాక వేసుకొని రైతుల యిళ్ళల్లో పని చేసుకొని
బ్రతుకుతూంది.

అత్తవారి వాళ్ళు కొడుకు పోయేక కోడల్ని ఇంట్లోకి రానివ్వడానిక్కూడా నిరాకరించేరు. వెంకటయ్య ఆమెకు సాయం చేస్తూ, మంచీచెడ్డా
కనుక్కుంటున్నాడు. ఆమె ఆలోచనల ధోరణిని అతడెరుగును. అనేకమార్లు ఇద్దరూ తమ మనస్సులోని కసిని కలబోసి, ప్రతీకారం
ఎల్లాగ చెయ్యాలని ఆలోచించేరు.

కనకనే సత్తిరెడ్డిని ఆమె యింట్లో వుంచడం సాధ్యమేననిపించింది.

సత్తిరెడ్డి కూడా చాలా ప్రశ్నలు వేసి, ఆమె యింటివద్ద వుండొచ్చుననుకొన్నాడు.

తెల్లవారే ముందు ఇద్దరూ మంగమ్మ గుడిసె తలుపు కొట్టేరు.



రెండో ప్రకరణం


చిన్న గుడిసె. ఒంటి నిట్రాటిది. దానికి ముందు ఓ వాకిలీ, వెనక ఓ పెరడూ, ఓ ఆవరణా అంటూ ఏమీలేదు. మదుగుగా వున్న
చోటల్లా మట్టి పెట్టి మెత్తిన అడివికంప దడుల లోపలున్న ఎనిమిది పది చదరపు గజాల మేర మాత్రమే. అక్కడ ఓ మూల
మంగమ్మ వొండుకుంటుంది. మరో మూల పడుకుంటుంది. సత్తిరెడ్డికి ఆశ్రయం ఆ ఇల్లు.

ఆ గుడిసెలో పైన సగభాగంలో ఒక చిన్న అటక కట్టేరు. దానిమీద ఇన్ని పిడకలు ఒక మూల గూడు పేర్చి వున్నాయి. ఓ
చిన్న కుండలో ఇన్ని జొన్నలు పోసి వేరే మూల వున్నాయి. అక్కడే ఎల్లాగో సర్ది ఒక గోనెగుడ్డ పరిచేరు. దానిమీద
సత్తిరెడ్డి పడక వేసేడు.

అంతా కటికి చీకటి. బయట ఫెళ్ళున ఎండ కాస్తున్నా అంతే. ఏమీ కనపడదు. కాలక్షేపం కోసం తల క్రింది సంచిలోంచి
సత్తిరెడ్డి ఓ పుస్తకం తీసేడు. ఆ గుడ్డి వెలుతుర్లోనే చదువుకొనేటందుకు ప్రయత్నించాడు. కాని నడవలేదు. కళ్ళు పీకేయి.
మూసి తల క్రింద పెట్టేడు.

నిద్ర పోవాలంటే వెంటనే పట్టనేలేదు. అదీగాక ఎంతసేపని నిద్రపోతాడు? కళ్ళు తెరుచుకొనే చూస్తూ పడుకున్నాడు. చూడ్డానికి ఏం
వుంది? వెల్లకిలా పడుకుని ఓ గజం దూరంలో వున్న కప్పు వేపు చూడాలి. లేకపోతే క్రింది వేపు తిరిగి ఇంటి వెంట నిశ్శబ్దంగా
తిరుగుతూ పని చేసుకుంటున్న మంగమ్మని చూస్తూండాలి.

మంగమ్మ అందవికారం మనిషి కాదు. స్ఫోటకం మచ్చలతో ముఖం వులాడించినట్లున్నా కన్నూ, ముక్కూ తీరైనవి. వయస్సూ, ఆరోగ్యంతో
మిసమిసలాడుతున్న పొంకమైన శరీరం. విరియపూచిన పొన్నచెట్టులా వుంది. సర్కిలినస్పెక్టరు రమణారెడ్డి ఆమె కోసం పడే
తాపత్రయం అప్పుడర్ధం అయిందనిపించింది, సత్తిరెడ్డికి.

మొదట ఆమె వైపే చూస్తూ పడుకోడం భావ్యంలా తోచలేదు. కాని, కప్పులో పరుగెత్తిన ఎలకల మూలంగా కంట్లో నలకలు పడ్డాక
ఆతడు ముఖం తిప్పుకోక తప్పిందీకాదు. తిప్పినప్పుడు మంగమ్మే కనిపించక మాననూలేదు. ఆమెను చూస్తూ, ఆమె జీవిత పరిస్థితుల్ని
వూహించుకుంటూ కాలం గడిపేడు.

ఆ పగలంతా మంగమ్మ ఒక్క మాట ఆడలేదు. ఏదేదో ఆలోచనలతో కొట్టిమిట్టాడిపోతూ ఇంటి వెంట కలలో తిరిగినట్లు తిరుగుతూంది.

ఇన్ని జొన్నలు దంచుకొచ్చింది. సంకటింత వుడకపెట్టింది. మూకుట్లో పెట్టి ఇంత కారం వేసి అటక మీద సత్తిరెడ్డి కందించింది.

ఉతుకు బట్టలు తెచ్చింది. రేవుకెళ్ళింది. వచ్చింది. రేవులో వున్నంతసేపూ ఆమె మనస్సు గుడిసె మీదనే వుంది.

ఆ గుడిసెకి ఓ గుమ్మం, ఓ తలుపూ అంటూ లేవు. తడక ఓ తలుపు. తాడో గొళ్ళెం. జారుముడి ఓ తాళమూను. ఇంట్లో పోయేవేమీ
లేవు. కనక ఆమెకెప్పుడూ దొంగ భయం లేదు. వున్నదేమన్నా వుంటే దొరలదే భయం. వాళ్ళకి ఆ యింట్లో ఆశకొలిపే వస్తువులేం
లేవు. ఎక్కడున్నవి అక్కడే వుండేవి. ఎవరన్నా ఎరిగివున్న అమ్మలక్కలు తాను లేనప్పుడు వచ్చినా ఓ నిముషం కూర్చుని
పోయేవారు.

కాని, ఈ వేళ తనింటికెవరన్నా వస్తారేమోననే ఆమె ప్రాణం కొట్టుకొంటూంది. అటకమీది మనిషి ఆ వచ్చినవాళ్ళ కంటబడితే?
ఆయనతో తనకు రంకు కడతారని భయం లేదు. ఆయన ఎవరో, ఎందుకు దాచాలో వెంకటయ్య చెప్పేడు. ఆయనకు ఏ అపాయం రాకుండా
చూడాలన్నాడు. తన యింటికి వచ్చే వాళ్ళు ఆయన్ని చూసి గప్‌చిప్‌గా వెళ్ళిపోయి వాళ్ళతోనూ, వీళ్ళతోనూ
చెప్పొచ్చు. లేదా నిర్జనంగా వుందని బేపరాకత్తుగా వున్న చోట పరాయి మగాడెవ్వరో దాగుకొని వుండడం చూసి కంగారుపడి కేకలు
పెట్టొచ్చు. ఎల్లాగైనా కష్టమే.

త్వర త్వరగా పని ముగించుకొంది. ఇంటికి పరుగెత్తి వచ్చింది. దారిలో పుల్లలు ఎరుకొనేందుకు వచ్చిన ముత్తమ్మ పలకరించింది.
పొద్దుతిరిగేకగాని ఇంటికి వెళ్ళని మనిషి అంత పెందరాళే తిరిగి రావడం చూస్తే ఆమెకాశ్చర్యం కలిగింది.

"ఏం వొదినా! అప్పుడే పనయిపోయిందా?"

ముత్తమ్మ పుల్లలేరుకోవడం మాని బాతాఖానీకి తన వెంటబడుతుందేమోనని మంగమ్మ భయపడింది. తలనొస్తూందని కణతలు నొక్కుకుంది. ఓ
గడియ పడుకోవాలంది.

ముత్తమ్మ ఏమీ అనలేదు. వెళ్ళిపోయింది. ఆవిడకాపూట కూర్చునే తీరిక లేదు. ఆమె కాకపోతే ఇతర స్నేహితురాళ్ళెవరేనా
రావచ్చు. ఏ పుల్లలేరుకొందుకో వచ్చి, ఎండవేళ ఓ అరగడియ కూర్చుని పోతూండడం వాళ్ళకో అలవాటు. వాళ్ళు వస్తే ఏం
చెయ్యాలో? ఆలోచిస్తూనే ఇంటికి పరుగెత్తింది.

ఇంటికి వచ్చేసరికి ఎక్కడివక్కడే వున్నాయి. ఏవిధమైన గంద్రగోళమూ జరగలేదు. "అమ్మయ్య" అని ఒక్కవూర్పు తీసుకొంది.

"ఎవరూ రాలేదుగంద?" అది మనస్సంతృప్తికి వేసిన ప్రశ్న. ఆమె తడక తోయగానే నిద్రనుంచి మేల్కొన్న సత్తిరెడ్డి, ఆ
ప్రశ్నలో ఇమిడి వున్న ఆదుర్దాను గుర్తించేడు. కాని, ఏమీ అనలేదు. తాను ఊ అనో, ఉహు అనో ఏకమాత్రలో సమాధానం
ఇచ్చినా, ఆమెతో ఇంట్లోకి అడుగుపెడుతున్నవాళ్ళెవరన్నా వింటే? మంగమ్మ కూడా తన ప్రశ్నకి సమాధానం కోరలేదు. నిశ్శబ్దంగా
గుమ్మంలోనే పీట వేసుకొని కాపలా కూర్చుంది.

తీరుబడిగా కూర్చుంటే మనస్సులో అనేక ఆలోచనలు తుపాను రేపేయి. అవన్నీ సంగం వచ్చేక తన జీవితంలో వచ్చిన కష్టాల మీదనే
సాగేయి.

ఒకవేపున సంగం మూలంగానే తన కుటుంబ జీవితం ధ్వంసమైపోయిందనిపిస్తూంది. రెండోవేపున ఆ సంగాన్నే తన అటకమీద దాచి కాపలా
కాస్తూంది. ఎందుకు? తన కష్టాలలో ఈ సంగం తన్నాదుకుందా? పైగా పోలీసులు తన మగణ్ణి కాల్చేస్తే – ఆ నాయకులంతా పోలీసుల
నుంచి తప్పించుకొని తలదాచుకుంటున్నారు. వీళ్ళు దాంకోడం ఎందుకు? అంత మగసిరి వుంటే తన మగాడిలాగే చస్తే చచ్చామని ఎందుకు
ఎదుట నిల్చోరు? వాళ్ళని తానెందుకు దాచాలి? ఇల్లా దాగి వీళ్ళు చేస్తున్న ఘనకార్యం ఏమిటి?

అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు. వాటికి ఆమె వద్ద సమాధానాలూ లేవు. వెంకటయ్య మీదున్న అభిమానంకొద్దీ ఆ ప్రశ్నలకి
సమాధానం తెలుసుకోలేకపోయింది.

అయినా సంగంయొక్క ప్రత్యక్షమూర్తిలాగ ఎదురుగా సత్తిరెడ్డి కనిపిస్తూంటే ఆ ప్రశ్నలు మనస్సులో పుట్టకుండా వుండడం లేదు.

తన మగడు, సంసారం, మీటింగు, పోలీసులు, మగని శవం, తనను పోలీసులు పెట్టిన బాధలూ తెరమీద బొమ్మల్లా ఒకదాన్నొకటి
తరుముకుంటూ మనస్సులో మెదిలేయి. ఆ కష్టాలకూ, బాధలకూ కారణం ఈ సత్తిరెడ్డేననిపించింది. నిజానికి ఆ రోజున మీటింగు చెప్పిందీ
సత్తిరెడ్డి కాదు. ఈయన్ని ఆ రోజుల్లో తాను చూడనూలేదు. కాని, తన కష్టాలన్నింటికీ మూలం అనిపించిన సంగానికి ఆయన
ప్రతినిధి.

తన కుటుంబ జీవితాన్ని మంటబెట్టింది నిజాం ప్రభుత్వమూ, జాగీర్దార్లూ, దొరలూను. ఆ విషయం అంతా వెంకటయ్య చెప్పేడు. తన
మగణ్ణి వాళ్ళే కాల్చిచంపేరు. తనచేత వెట్టిగా చాకిరీ చేయించుకొన్నారు. అవమానం చేసేరు.

తాను పెద్దమనిషి కాక పూర్వమే దొర కొడుకు రమణారెడ్డి తన్ను చెరిచేడు. ఆ రమణారెడ్డే సర్కిలయ్యేడు. చిన్నప్పుడు
భయానికో, బలానికో తాను లొంగిపోయింది. నోరు కూడా విప్పలేకపోయింది. కాని పెద్దదయ్యాక రమణారెడ్డిని తన మీద చెయ్యి
వెయ్యనివ్వలేదు. ఆ కోపంతోనే ఆతడు తన మగణ్ణి కాల్చిచంపేడని ఆమె అభిప్రాయం.

మగణ్ణి చంపేసేక, తనని పోలీసుస్టేషనులో చాకిరీకి పెట్టేరు. నానాచాకిరీ చేయించారు. సర్కిలు పక్కలోకి వెళ్ళాలన్నారు.
నిరాకరిస్తే కుళ్లపొడిచేరు. కాని తాను లొంగలేదు. చెప్పిన చాకిరీ అంతా చేసింది. మీద చెయ్యివెయ్యబోయేరా గుర్రుమంది. పిల్లిలా
పీకింది. ఆరడుగుల బలిష్ఠమైన ఆమె విగ్రహం చూసి పోలీసులు కూడా అంతకంటె ఎక్కువ సాహసం చెయ్యలేకపోయేరు.

సర్కిలు వూళ్ళోకి దౌరా వచ్చినప్పుడల్లా తన్ను రప్పిస్తూనే వున్నాడు. కొడుతూనే వున్నాడు. తన్ను లొంగ తీసుకొనే యావలో అతని
కుటుంబ జీవితం కూడా భగ్నం అయింది. కాని, ఆతడు మానలేదు.

ఓ రోజున దౌరా వచ్చిన రమణారెడ్డి తెగత్రాగి తన మీద దౌర్జన్యం చేయబోయేడు. తాను లొంగలేదు. కొట్టేడు. తిట్టేడు.

తాగి వొళ్ళు తెలియని స్థితిలో అతణ్ణి బంట్రోతులు గఢీలో మేడమీద గదికి తీసుకెడుతున్నారు. అతడు గిజాయించుకొని బూతులు
తిడుతున్నాడు. ఆ వొళ్ళు తెలియని స్థితిలో ఆతడు జీవితానికి సరిపడా దుఃఖాన్ని మూటకట్టుకొన్నాడు. ఆతని సంసారంలో వచ్చిన
కల్లోలానికి మంగమ్మ ప్రతీకారానందాన్ని అనుభవించింది.

రమణారెడ్డిని బంట్రోతులు ఆతని గదిలోకి తీసుకుపోతున్నప్పుడు ఎదుటనున్న గది గుమ్మంలో భార్య కనబడింది. తాగి వున్న రెడ్డి
ఆమెలో మంగమ్మనే చూసేడు. బంట్రోతులకు ఆజ్ఞాపించేడు --- "ఆ లంజని జుట్టు పట్టుకు లాక్కురాండిరా."

ఆ మాటలకు బంట్రోతులు హడలిపోయేరు. రమణారెడ్డి భార్యను ఇంక సర్దుబాటు చెయ్యడం ఎవ్వరి తరమూ కాలేదు. ఆమె భర్తను
గుర్తించడానిక్కూడా నిరాకరించింది.

అతని కుటుంబ జీవితంలో కల్లోలానికి పరోక్షంగా తాను కొంత కారణం అయినందుకు మంగమ్మ సంతోషించింది. కాని, ఆమె మనస్సులోని కసి
తీరలేదు. సర్కారు నాశనం అయితే తప్ప పీడ వదలదని వెంకటయ్య చెప్పేడు. ఆ శుభముహూర్తం కోసం ఆమె ఎదురుచూస్తూంది. ఆ
సర్కారు కోపానికి గురి అయిన సంగం మీద అభిమానం పెంచుకొంది.

కాని, సత్తిరెడ్డి ఎదురుగా కనిపిస్తుంటే, చితికిపోయిన తన సంసారమే గుర్తు వచ్చింది. సంగం మీది అభిమానం, సర్కారు మీది
కసి కన్న బాధల భయం నిరుత్సాహపరచింది. సాయంకాలం ఆ మాట తేల్చేసింది కూడా.

"ఇదివరకటి వాటికే చచ్చిపోతున్నా. కొత్తవి తెచ్చిపెట్టకండి."

ఆ మాటలంటూనే చెట్టంత మనిషీ కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది.

ఇల్లంతా చీకటిగా వుంది. దీపం పెడితే కొత్త మనిషి బయటి వాళ్ళకి కనిపించిపోతాడేమోనని కందిలి ముట్టించలేదు. సత్తిరెడ్డి
అటక దిగి గుమ్మంలో నిలబడ్డాడు. ఏడుస్తున్న ధ్వని తన మనస్సును కలచివేసింది. ఓదార్చేడు.

"ఎందుకల్లా దుఃఖపడతావు? ఎంత ఏడ్చినా పోయినవాడు తిరిగిరాడు. అతనికేం? వీరుడి చావు వచ్చింది."

ప్రొద్దుటినుంచీ, ఇంటివెంట తిరుగుతున్నా, గుమ్మంలో కూర్చున్నా శోకదేవతలాగ కనిపిస్తున్న మంగమ్మని పలకరించి ధైర్యం
చెప్పాలనీ, ఓదార్చి దుఃఖం ఉపశమింప చేయాలనీ సత్తిరెడ్డి చాలమాట్లు అనుకొన్నాడు. దానికోసం తాను ఏలా మాటలు ప్రారంభించాలో,
ఆమె ఏమి సమాధానం ఇస్తే తాను ఏమనాలో ఒకటికి పదిమాట్లు ఒద్దికలు వేసుకొన్నాడు. కాని, తీరా సమయం వచ్చేసరికి
తాననుకొన్నదేదీ జరగలేదు. సిగ్గూ, బిడియమూతో చెప్దామనుకొన్నవి చెప్పలేకపోయేడు. ఏడుస్తున్న మంగమ్మని చూసేక కొత్త
మాటలేం తోచలేదు. ఏదో అనేసేడు. అన్నాక ఆ మాటలు అందరూ అనేవేనని గ్రహించేడు.

మంగమ్మ ఒక్క నిముషం ఏడ్చి సర్దుకొంది.

"పుట్టింటివాళ్ళెవరూ లేరా?"

"అదెప్పుడో బుగ్గి అయిపోయింది."

తల్లీ, తండ్రీ చచ్చిపోయేక తనను దొరలయింట పెంచేరంది. ఆ పెంచేరన్న మాటలో అభిమాన స్వరం వినబడలేదు. విపరీతమైన
ద్వేషం వినిపించింది. సత్తిరెడ్డి మళ్ళీ ప్రశ్నించేడు.

"పోనీ ఇంకే బంధువులూ లేరూ? ఈ నిప్పుకి దూరంగా మరో వూళ్ళో....."

ఆమె ఇచ్చిన సమాధానం సత్తిరెడ్డికే సిగ్గు కలిగించింది.

"ఏ వూరెడితే మాత్రం? అక్కడోళ్ళింతకన్న మంచివాళ్ళా?"

నిజమే. ఎక్కడికెడితే మాత్రం? రక్షణేం వుంది? ఉన్నచోటనే వుండి రక్షణ కల్పించుకోవాలి గాని...

సత్తిరెడ్డి కి సమాధానం తోచలేదు. ఒక్క నిట్టూర్పు విడిచేడు.

ఆతని కంఠంలోని సానుభూతినీ, మాటలలోని అనునయాన్నీ విన్నాక మంగమ్మ కూడా తన మొదటి ధోరణిని మరచిపోయింది. కొత్త కష్టాలు
తేవద్దంటూ నిష్టూరంగా అన్న మాటల్ని మరచిపొమ్మంది.

"ఏదో కష్టం మీదన్నా."

సత్తిరెడ్డి మాట తప్పించేడు. మాటల్లో పెట్టి ఆమె జీవితం ఏలా గడుస్తూందో ఏమిటో యోగక్షేమాలు ఒక్కొక్కటే ప్రశ్నించేడు. ఆమె
తనను పోలీసులు పెట్టిన బాధలూ, పెడుతూన్న బాధలూ చెప్తూంటే ఆతనికెంతో బాధ కలిగించింది. మనస్సు ద్రవించింది.

కాని, ఏమని ఊరట చెప్పగలడు? ఈ దుర్మార్గాలన్నింటికీ దేశం ప్రతీకారం చేయకమానదన్న మాట కేవలం మనస్సంతృప్తికి
మాత్రమే. ప్రతీకారం ఎప్పుడు చేస్తుంది? ఎవరినని చేస్తుంది? ఎల్లా చేస్తుంది? ఇల్లాంటి ప్రశ్నలకి సమాధానాలేమీ లేవు. ఆ
రోజున పద్దాలుని చంపిన సిపాయిని శిక్షిస్తారా? ఉహుఁ. అమీను, సర్కిలూ? అంతగా వస్తే వాళ్ళు పారిపోతారు. నిజాము? అసలీ
దౌర్జన్యాలన్నిటికీ వెనక బలం నిజాము పరిపాలన. కాని, ఆయనకు బ్రిటిష్ సర్కారు హామీ వుంది. ఇప్పుడు నడుస్తున్న
రాజకీయాల ధోరణి చూస్తే ఇన్ని హత్యలు, హింసలు నడిపిన నిజాము రక్షణకు కాంగ్రెసుచేత హామీనిప్పిస్తూంది. ఈ ఆటంకాల
నధిగమించగల ప్రజా వుద్యమం తలఎత్తి, పీడకుల్నీ, హంతకుల్నీ బోనెక్కించే రోజుకి ఈ ఉస్మాన్ బ్రతికి వుంటాడా?

కాని మంగమ్మ క్షుభిత మనస్సుకి ఈ ప్రశ్నలేం తోచలేదు. ప్రతీకారం జరుగుతుందనేదొక్కటే ఆమె కనంత సంతృప్తిని కలిగించింది.



మూడో ప్రకరణం

భార్య సుమిత్రతో కలిసి తోటలో అడుగుపెడుతున్న రాజిరెడ్డిని చూసేసరికి రంగయ్య ఎంతో బిడియపడ్డాడు. ఆ దంపతులు వూళ్ళోకి
వచ్చినప్పుడు తప్పకుండా తోట వైపు షికారు రావడం, చెట్ల నీడల్లోనూ, మోటబోదె నీళ్ళతోనూ ఆటలాడుకోవడం, చీకటి పడేవరకూ
కూర్చుని కబుర్లు చెప్పుకొని ఇంటికి పోవడం ఓ అలవాటే. ఎంత పెద్దరెడ్డి అల్లుడూ, కూతురూ అయినా దంపతులిద్దరూ పట్టపగలు
కబుర్లు చెప్పుకోవడం, నవ్వుతూ తుళ్ళుతూ వీధి వెంటా, పొలాలమీదా షికార్లు పోవడం వూళ్ళో వాళ్ళందరికీ వింతగానే వుండేది. ఎదురుగా
చూడనట్లు నటించినా, చాటుగా బుగ్గలు నొక్కుకొనేవారు. కొత్త జంతువుల్ని చూసినట్లు విరగబడి చూసేవారు. అవన్నీ గమనిస్తూన్నా
ఎరగనట్లే నటించేవారు ఆ దంపతులు. వూళ్ళో వున్న రోజుల్లో వీలు చిక్కినప్పుడల్లా వచ్చి, బోళ్ళ పొలంలో ఒక్క గంటయినా
గడిపేవారు. అందుచేత ఆ రోజున వారు రావడంలో ప్రత్యేకత ఏమీ లేకపోయినా, రంగయ్య వారిని మాములుగా ఆహ్వానించలేకపోయేడు.

ఈ మధ్య ఇంట్లో వచ్చిన గంద్రగోళాల అనంతరం వారక్కడికి రావడం అదే ప్రథమం. ఆ గొడవలు వాళ్ళ చెవిని పడకుండా
వుంటాయా? మామూలుగా వచ్చినప్పుడల్లా కనిపిస్తూ వచ్చిన ఇద్దరూ నేడు లేకపోవడాన్ని గమనించలేరా? తప్పకుండా చూస్తారు. ఏమీ
ఎరగనట్లు సత్తెమ్మ కనబడదేం? -వెంకటయ్య ఏడీ? అని వాళ్ళిద్దరూ అడిగితే తానేం చెప్పాలి? వాళ్ళిద్దరూ పెళ్లి
చేసుకొంటామన్నారనీ, తమకిష్టం లేకపోయిందనీ, వారిని దూరం చేయడానికి ఎంతో బ్రహ్మప్రళయం చెయ్యవలసివచ్చిందనీ తాను
చెప్పగలడా? అందులోనూ రాజిరెడ్డితో. ఇద్దరూ చాల సన్నిహిత మిత్రులు. సంఘ సంస్కరణలు సమాజాభివృద్ధి మొదలయిన అనేక
సమస్యలమీద ఇద్దరూ ఇదివరకు, ఎంతో చర్చించిన వాళ్ళే. తన అభిప్రాయాల్ని ఎరిగిన రాజిరెడ్డి ముందర తాను చేసిన పనికి
సిగ్గుపడవలసి వస్తూందనిపించి రంగయ్య ఎంతో చిరాకుపడుతున్నాడు. ఏం ప్రశ్నలు వస్తాయోనని ముళ్ళమీదున్నట్లున్నాడు.

చివరకు ఏదో సందు చూసుకుని రాజిరెడ్డి అడగనే అడిగేడు. అయితే ఆ ప్రశ్న అంతవరకు రంగయ్య వూహించుకొంటున్న విధంగా లేదు.

"నేనన్నీ విన్నాను. నువ్వు చేసిందేం మంచి పని కాదు."

విన్నదేమిటో, మంచిపని కానిదేమిటో రాజిరెడ్డి చెప్పకపోయినా అర్థం అయింది. అక్క అవస్థ చూసేక తాను చేసిన గొడవ మంచికా,
చెడ్డకాయనే అనుమానం రంగయ్యకే ఎన్నోమాట్లు కలిగించింది. కాని, ఎదటి మనిషి అది మంచిది కాదనేసరికి అభిమానం వేసింది. కోపం
వచ్చింది. తన పనిని సమర్థించుకోవాలనే అహంకారమూ కలిగింది.

"మా బతుక్కి తగునుకదా యనా? ఇదే నీ యింట్లో కథయితే, నాకు చేసిన హితబోధ నీకు గుర్తుండేదేనా?"

ఎంత స్నేహితుడైనా ఇదే నీ యింట్లో జరిగితే-ననడం రాజిరెడ్డికి కష్టమే అనిపించింది. ఎందుకీ ప్రసంగం తెచ్చేనా అనుకొన్నాడు.
చింతపడ్డాడు. కాని, సమాధానం ఇవ్వకుండా కోపగించుకోడం మంచిది కాదనుకొన్నాడు.

"కోపం వద్దు రంగా! మనకున్న చనువును పట్టీ, గతంలో ఇల్లాంటి సమస్యల్ని గురించి మనం తరుచుగా సాగిస్తూ వచ్చిన చర్చల
దృష్ట్యానూ అన్నాను. కాని...."

ఒకమారు మిత్రుణ్ణి నొప్పించేక రంగయ్య అరరే అనుకొన్నాడు. కాని రాజిరెడ్డి తమ గత చర్చల కథ జ్ఞాపకం చేసేక తన
మాటను సర్దుకొనేటందుకు ప్రయత్నించడం కూడా అభిమానంగా తోచింది. మళ్ళీ అదే మాట రెట్టించేడు.

"కోపం ఎందుకనుకొంటావు? ఒక విషయం మంచిచెడ్డల్ని ఆలోచించేటప్పుడు ఎవరికివారు దానిని తమకు వర్తింప చేసుకొని ఆలోచన
ప్రారంభిస్తే సమస్య సులువుగా పరిష్కారం అవుతుంది."

ఈ ఘట్టంలో మనమే వుంటే ఏం చేసి వుండేవాళ్ళం అనేది ఆలోచించడం అవసరం. దానితో అనేక సమస్యలకి పరిష్కారం సులభంగా
దొరుకుతుంది. అదేం కొత్త సిద్ధాంతమూ కాదు.

దానినే మరో దృక్కోణంలోంచి ఆంధ్ర భారతకారుడు వివరిస్తూ పరమధర్మ పదాలలోకెల్లా పరమోత్కృష్టమన్నాడు.

కాని అదే పరాయణం కాదు. మనుష్యుడి మనస్సు, ఆలోచనలు ఆతడు పెరిగిన వాతావరణాన్నే చాల వరకు ప్రతిబింబిస్తుంటాయి.
ఆతడు చదివిన చదువూ, ఆతని విజ్ఞానమూ, అలవాట్లూ, ఆచారాలూ, ఆలోచనల్ని ముందుకి గెంటుతూ, వెనక్కి లాగుతూ మహా
సంఘర్షణను కల్పిస్తూంటాయి.

రాజిరెడ్డి ఓర్పుతో మానవుని ఆలోచనల మీద ఏయేవి ఎల్లాంటి ప్రభావం కలిగిస్తుంటాయో చెప్పుకువచ్చేడు.

"ఏ విషయం మీదయినా మనకు తోచే మంచిచెడ్డ అభిప్రాయాలు సర్వస్వతంత్రంగా వుండవు."

ఆ తాత్విక విశ్లేషణకు రంగయ్య సమాధానం ఏమీ ఇవ్వలేదు. ఆ చర్చ కూడా పాతదే. ఆ అభిప్రాయాల్ని గతంలో తానూ
సమర్ధించేడు. కాని, పైకి ఒప్పుకోలేకపోయేడు.

ఆనాటి సాయంకాలం ఆ మిత్రులు ముభావంగానే విడిపోయేరు.

రాజిరెడ్డి ఇంటికి చేరుకున్నాక కూడా తోటలో వచ్చిన చర్చలను మరచిపోలేకపోయేడు.

పరధ్యానంగా, ఏదో కలలో వున్నట్లున్న భర్తను ప్రకృతిలోకి తేవడానికై సుమిత్ర అనేక ప్రయత్నాలు చేసింది. కాని,
ఆతడిచ్చిన సమాధానాన్ని పట్టి తన ప్రయత్నాలు సఫలమైనట్టా, విఫలమైనట్లా అనేది ఆమెకే అర్ధంకాలేదు.

రాజిరెడ్డి ఒక్క నిట్టూర్పు విడిచేడు. కుర్చీ చేతిమీద ఆనుకొని కూర్చుని, ఆమె యాతని భుజంమీద చెయ్యివేసి ఏదో
ప్రశ్నిస్తూంది. ఆ చేతిని తన చేతిలోకి తీసుకొని, బుగ్గనానించి నొక్కుతూ ఆతడు మరల ఏదో ఆలోచనలో పడ్డాడు.

"మనుష్యుడు బ్రతికేది ప్రేమించడానికా? బాధించడానికా? ఒకళ్ళ సుఖం చూసి సంతోషించడెందుకు? ఆ సుఖం తాను ప్రతిష్ఠగా భావించిన
దేనికో నష్టకరం అని ఎందుకనుకోవాలి? ఆ సుఖాన్ని నాశనం చేసినా ప్రతిష్ఠ నిలబడేదీలేదు, దానిలో ఆనందమూ లేదు. కాని,
ఆతని ఆలోచనలు అటే నడుస్తాయి. బహుశా దుఃఖం, బాధ మనుష్యుణ్ణి ఆకర్షిస్తాయో ఏమో?"



నాలుగో ప్రకరణం


రంగయ్య ముసుగు తియ్యకుండానే భార్యను పిలిచేడు.

"నీళ్ళు."

భార్య పేరు నీళ్ళు కాదు. కాని, తనకు వెంటనే కావలసిన పదార్ధం భార్యకి పర్యాయపదంగా మారిపోయింది. సరిగ్గా అదే పద్ధతి
సూరమ్మకు అయిష్టం. తనకు తన పేరే తప్ప మరొకటిలేదని ఆమె దృఢాభిప్రాయం. 'ఉరఫు'లు, 'అనే'లు ఆమెకు అయిష్టం.

భార్యను పేరు పెట్టి పిలవడం ఆతనికి అలవాటే. కాని తానున్న పల్లెటూళ్ళో ఆ అలవాటు లేదు. పైగా వింత జంతువును చూసినట్లు
విరగబడి చూస్తారు. నవ్వుతారు. యద్దేవా చేస్తారు. అందుచేతనే వూళ్ళోకి వచ్చినప్పుడల్లా ఆతడామె పేరు మరచిపోయి
వూరుకుంటాడు.

సూరమ్మ ఆతని భయాన్నీ, సిగ్గునూ గణనలోకి తీసుకోదు. తనకి తల్లిదండ్రులు పెట్టిన పేరొకటున్నదనీ, ఒసే, ఏమేలు దానికి
పర్యాయపదాలు కావనీ ఒకటికి పదిమాట్లు చెప్పింది. ఆతడూ దాన్ని అంగీకరిస్తాడు. కాని, వూళ్ళోవాళ్ళ మాటేమిటి? వాళ్ళు ఆ
సంగతిని వొప్పుకోరుగా? దొర అల్లుడు రాజిరెడ్డి తన భార్యను ఆమె పుట్టింట్లో అందరూ పిలిచేలాగ 'చిట్టీ' అంటాడని బుగ్గలు
నొక్కుకొని, కనుబొమ్మ లెగరేసే అమ్మలక్కలు తన్ను బ్రతకనిస్తారా? మొహం మీదే తాటేకులు కట్టెయ్యరూ?

కాని, సూరమ్మ వొప్పుకోదు. వాళ్ళ అక్కను మగడు పేరు పెట్టే పిలుస్తాడు. మొదట తమ యింట్లో వాళ్ళందరికీ అది విడ్డూరంగానే
అనిపించింది. తానూ అప్పట్లో అక్కను వేళాకోళం పట్టించినదే. కాని, తనదాకా వచ్చేసరికి ఆలాగ పిలవడమే బాగుందనిపించింది.
తన వాళ్ళంతా మొహమొహాలు చూసుకొంటూంటే తన అక్క కూడా మొదట్లో మగడితో తన్ను పేరు పెట్టి పిలవవద్దని
బ్రతిమలాడుకొన్నదట. కాని, ఆతనితో ఓ ఏడాదిపాటు ఏలూరులో కాపురం వుండివచ్చేక తన అభిప్రాయాల్ని మార్చుకొంది.

"ఆవేపున అది అలవాటేనమ్మా! ఎవరో ముసిలాళ్ళూ, చాదస్తులూ తప్ప చిన్నకారంతా పెళ్ళాల్ని పేరెట్టే పిలుస్తున్నారు.
ఏమోనమ్మా! అదే బాగుంది నామట్టుకి. ఊళ్ళో వాళ్ళందర్నీ పేరెట్టి పిలవడానికి తప్పులేదు. కాని, భార్యని ఏదో దాసీదాన్ని
పిలిచినట్లు 'ఒసే, ఉసే' ఏమిటి? అసయ్యంగా!"

పెద్దకూతురు అభిప్రాయాన్ని తల్లి అంగీకరించింది. కాని, తాము ఇల్లాంటిదెప్పుడూ చూడలేదని చెప్పడం మాత్రం మానలేదు.

తర్వాత తన అన్నకు పెళ్ళయింది. అక్క మగణ్ణి చూసి, ఆతడూ ఆ పద్ధతినే అవలంబించేడు. సూరమ్మ మొదటి రోజుల్లో తనను
మగడు ముద్దుగా 'సూర్యం' అని పిలిచినప్పుడు ఎవరినా అన్నట్లు విరగబడి చూసినా తన్నే అని గ్రహించేక కొండెక్కింది. తన
అక్క మగడు బెజవాడ వైపు వాడు. అక్కడివాళ్ళు కొన్ని అలవాట్లు చేసుకొన్నారు. అది తనకు నచ్చుతే మాత్రం? మగాడికి
కొత్తే కాదూ? ఇక్కడ అలవాట్ల ప్రకారం, తన అక్క అన్నట్లు ఏ దాసీదాన్నో పిలిచినట్లు 'ఒసే, ఉసే' అంటాడేమోనని
భయపడింది. కాని, రంగయ్య అత్తవారింటి అలవాట్లు చూసేడు. అనుకరించేడు.

అయిన తన వూళ్ళోని అలవాట్లు కనబడని చట్టాలు. అవి మనస్సుని పట్టిపోయి వున్నాయి. నాలుక కూడా ఆ అడ్డుగోడల్ని
దాటలేకపోయింది.

స్వగ్రామంలో అయినా సరే మగనిచేత పేరునే పిలిపించుకోవాలని ఆమె అభిప్రాయం.

అందుచేత రంగయ్య నీళ్ళని పిలిచినప్పుడు ప్రక్కనున్న వసారాలో ఒక చెంబులోంచి మరొక చెంబులోకి వురుకుతూ నీళ్ళు తామక్కడే
వున్నామని తెలియపరిచేయి.

ఆతడు ఆలకించేడు. తన పిలుపునకది సమాధానం. నవ్వుకున్నాడు. ఈమారు పేరు మార్చేడు.

"చెంబు!"

వెంటనే వసారాలో చెంబు ఖంగున గొంతెత్తి పలికింది. తాను చెంబును పిలిచేడు. దానికి స్వయంగా పలికే శక్తి లేదు. కనుక సూరమ్మ
ఒక పుల్ల సహాయంతో దానిని పలికించింది.

రంగయ్య దుప్పటి తన్నేసి లేచేడు. భార్యను ఆట పట్టించాలనే మహోత్సాహంతో తలుపు తెరిచేడు. స్లూయిసులెత్తినప్పుడు వురకలెత్తి
వస్తున్న నీటి ప్రవాహం లాగ సూర్యకిరణాలు గదిలోకి తరుముకొచ్చేయి. బాగా ఎండ వచ్చేసింది. హఠాత్తుగా వెలుతురు చూడలేక
కళ్ళు మూసుకొని నిలబడ్డాడు. అంత పొద్దెక్కిన విషయం తాను గమనించనేలేదే అనుకొన్నాడు. అప్పటిమట్టుకి భార్యను అల్లరి
పట్టించాలనే సంకల్పాన్ని పక్కనపెట్టి గోడమీదున్న పుల్ల అందుకున్నాడు. తానింకా మొగమేనా కడగలేదనే విషయాన్ని తల్లి గాని,
అక్క గాని చూస్తున్నారేమోననే సంకోచంతో అటూ యిటూ తొంగి చూసేడు. ఆతని భయాన్ని చూసి సూరమ్మ నవ్వుకుంది. చూపుడు వేలాడిస్తూ,
కనుబొమ్మలెగరేసి బెదిరించింది.

పట్నవాసం చదువుతో రంగయ్యకు అక్కడి అలవాట్లు కొన్ని పట్టుబడ్డాయి. తన వూళ్ళోనైతే సూర్యుడు పొడిచే సరికి మంచంమీద
వుండడానికి వీల్లేదు. అసలు వూళ్ళల్లో ఆవేళప్పటిదాకా నిద్రపోడానికి వీలే వుండదు. గొరకొయ్యలు అంతదూరానికి ఎక్కి రాగానే
కొందరూ, తొలికోడి కూయగానే కొందరూ, చుక్క పొడవగానే కొందరూ వాళ్ళ వాళ్ళ పొలం పనుల స్వభావాన్ని పట్టి లేచేస్తారు.
వెళ్ళిపోతారు.

కాలేజీకి వెళ్లక పూర్వం రంగయ్యవీ అవే అలవాట్లు. కాని, కొత్త పరిసరాలలోకి వెళ్ళేక వాటి అవసరం కనబడ్డం లేదు.
మొదట అలవాటు కొద్దీ కొద్ది రోజులు తెల్లవారగట్లనే లేచినా తర్వాత మానుకొన్నాడు. ఓ రాత్రివేళ లేచి చేసేదేమిటి? ఇంటి
దగ్గిరైతే కంచెలకెళ్ళాలి. కాడిగట్టే ముందుగా ఎడ్లని మేపాలి. ఇక్కడాపని వుండదు. ఇంక చదువుకోవాలి. కొంచెం తెలివిగల
వాళ్ళందరికీ మల్లేనే ఆతడికి పుస్తకాలంటే పెద్ద శ్రద్ధ లేదు. పరీక్షల్లో తప్పకుండా మార్కులు తెచ్చుకోడానికి తగుపాటి
చదువు చాలుననేది ఆతని అభిప్రాయం. అలాగే చదివేవాడు. మిగిలిన కాలాన్ని నిజాము పరిపాలనలో హిందువులకు జరుగుతున్న
అన్యాయాల్ని గురించీ, మాతృభాష నణచి వేయడానికై చేస్తున్న అన్యాయాల్ని గురించీ చర్చలకు వినియోగించేవాడు. హిందువుల మత
రక్షణ కోసం ఆర్యసమాజం చేస్తున్న కార్యకలాపాల్ని అభినందించాడు. ఆంధ్రభాష అభివృద్ధి కోసం జరిగే ప్రయత్నాలకు
తోడ్పడేవాడు. కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, కాలేజీ లేని రోజుల్లో అతనికి ఒక స్థావరం. నిజాం రాష్ట్ర ఆంధ్రసారస్వత
పరిషత్తు ఏర్పడ్డాక వారి సభలకు తప్పనిసరి హాజరు. విద్యార్ధుల్లో విప్లవవాదిగా సి. ఐ. డీ. ల లిస్టులకెక్కినాడనే
చాలమంది అభిప్రాయం.

చదువు, ఇతర వ్యాపకాల విషయంలో ఆతనికున్న అభిప్రాయాల మాట ఏలా వున్నా ఇంటి దగ్గర వున్నన్నాళ్ళూ పనున్నా లేకపోయినా
తెల్లవారకుండా లేవవలసిందే. అక్క లేస్తుంది. ఇంటెడు పనీ చేసుకొని బావి కడకు బయలుదేరుతుంది.... తల్లీ లేస్తుంది.
పెద్దదయిపోయి ఏ పనీ చెయ్యగల స్థితిలో లేకపోయినా కనీసం తన వయస్సువాళ్ళతో గప్పాలకైనా సిద్ధంగా వుంటుంది. వెళ్ళేవాళ్ళు
తమ దారిన తాము పోతే బాగుండును కాని, పడుకోకుండా తనని నిద్ర లేపుతారు. తెల్లవారినాక నిద్రపోవడం దరిద్ర చిహ్నమని
వాళ్ళ అభిప్రాయం. నమ్మకమూను. ఎప్పుడో వచ్చి నాలుగురోజులుండి పొయ్యేవాడిని పొలం తోలడం ఎందుకులే యని వదిలేస్తారు. కాని,
నిద్రలేచే విషయంలో వాళ్ళకి మహా పట్టుదల.

కానీ, ఈ నెలా, రెండు నెలల గంద్రగోళాలు అతని అలవాట్లకి కొంత స్వాతంత్ర్యాన్నిచ్చేయి. ఆతడు వానిని పూర్తిగా
వుపయోగించుకొంటున్నాడు. గదమాయించే అక్కగారు ఇప్పుడింట్లో ఏది ఏమయిపోయినా మాట్లాడ్డం లేదు. తల్లి వద్ద ఆతనికెప్పుడూ భయం
లేదు. అందుచేత మానవ స్వాతంత్ర్యాల పట్టికలో నిద్రా స్వాతంత్రాన్ని కూడా జమ కట్టి, దానిని అమలు జరిపేస్తున్నాడు.
అయినా దానినింకా సాగలాగే ధైర్యం కలగలేదు. అందుచేత భార్యను ఆటపట్టించే సంకల్పాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి తక్షణ
కర్తవ్యం ఎత్తుకొన్నాడు.

ఇంకా పుల్ల నమలడం పూర్తి కాకుండానే వీధిలో పిలుపు వినబడింది. ఎవరాయని తేల్చుకొనేలోపునే సేతుసిందీ గోవిందు నిలువు పొడువు
బాణాకర్రతో గుమ్మంలో హాజరయ్యాడు.

చిన్ననాటి మిత్రులిద్దరూ కుశలప్రశ్నాదికం పూర్తి చేశాక గోవిందు తాను వచ్చిన పని చెప్పేడు.

"దొర యాదు చేస్తున్నాడు."

గోవిందు తొందర పెట్టకుండేటందుకై ఆతడికింత 'చా' ఇచ్చినా, అది తాగేసి చొక్కా వేసుకొనే లోపునే పదిమాట్లు హెచ్చరించేడు.

"జరా జల్దీరా."

రంగయ్య ఆదరా బాదరా చొక్కా వేసుకొంటూంటే గోవిందు దొరల మర్యాదలు గుర్తు చేసేడు.

"జరాపనికి చొక్కా ఎందుకు. పై తుండు చాలదా?

టీ త్రాగిన విశ్వాసాన్నీ, చిన్ననాటి స్నేహాన్నీ కనబరుస్తూ గోవిందు నెమ్మదిగానే దొర వద్దకు వెళ్ళేటప్పుడు అవలంబించవలసిన
మర్యాదల్ని గుర్తుచేసేడు. రైతులకు చెల్లే నిబంధనలు చదువుకొన్న వాళ్ళు పాటించనక్కర్లేదని ఆతడెరుగును. కాని, రంగయ్య
ఎంత చదువుకున్నా వూళ్ళో రైతుల బిడ్డేకా!

పల్లెటూళ్ళలో దొరలది మకుటం లేని రాజరికం, చట్టం ఎరగని శాసనాధికారమూను. ఒక్క కుల పెద్దరికం వలన లభించిన
పెత్తనం మాత్రమే కాదు. డబ్బు, భూమి, కులం, దర్పం, దాష్ఠీకం—వీటన్నింటి మిశ్రణం ఆ దొరతనం. ఒకడు పెద్ద ఇల్లు
కట్టుకోడాన్ని అది సహించదు. చొక్కా వేసుకోడానికి ఒప్పుకోదు. ఎండ మాడుస్తున్నా, హోరున వర్షం కురుస్తున్నా వారి ఎదటనే
కాదు, వారి ఇంటి ముందు కూడా గొడుగు చంకన పెట్టవలసిందే. కాలిజోడు చేతికి తీసుకోవలసిందే. చుట్ట దాచవలసిందే. తల
దింపాలిసిందే. ప్రతి మాటలో తన బానిసతనాన్నీ, దొరల పెద్దరికాన్నీ, గుర్తు చేసుకొంటూ, గుర్తు చేస్తూ మాట్లాడవలసిందే.
అదంతా చట్టాలకెక్కని శాసనం.

రంగయ్య చిన్నప్పుడా వాతావరణంలో పెరిగినవాడే. చిన్న చిన్న తప్పిదాలకు కఠోర శిక్ష ననుభవించి ఆ అలిఖిత ధర్మ
శాస్త్రాన్ని ఆకళింపు చేసుకొన్నవాడే.

ఎప్పుడో చిన్ననాటి మాట. ఓరోజున రంగయ్య వాకిట్లో మంచం మీద పడుకుని వున్నాడు. ఆ దారిన ఆ సమయంలో దొర వెళ్ళేడు.
రంగయ్య లేవలేదు. దొరకు దండం పెట్టలేదు. ఆ రెండు పనులూ అత్యవసరాలని ఆతనికి తెలియదు. కాని, తండ్రి దండన
తప్పలేదు. ఆనాడు పెయ్యకన్నె తాడుతో తగిలించిన దెబ్బల్ని ఆతడు జీవితంలో మరిచిపోలేడు.

తండ్రి కొట్టిన దెబ్బల వలన ఆతనికి దొరలమీద భయభక్తులు కలిగించడానికి బదులు ద్వేషం, క్రోధం కలిగించేయి. ఆ క్రోధంతో
చిన్ననాడు స్నేహితుల వద్ద చాటుమాటున దొరల్ని నిందించి వాళ్ళ మెప్పు, గౌరవం పొందేవాడు. పెద్దవాడయి, చదువుకొన్నాక ఆ
పెద్ద కుటుంబాల వారే తన్ను గౌరవిస్తూంటే ఆ ద్వేషం మరిచిపోయేడు. ఇప్పుడా కోపం దొరలంటే భయ భక్తులు చూపే అమాయకుల మీదికి
మళ్ళింది. "నీబాంచని," "నీకాల్మొక్కుతా" నంటూ బానిస బుద్ధి చూపించక, నిలబడితే దొరలేంచేస్తారేం యని ఆతని వాదం. కాని,
వాళ్ళకాతని మాటల్లో విశ్వాసం లేదు. ఆత్మవిశ్వాసమూ లేదు. అది చూస్తే రంగయ్యకు కోపం. అందుచేతనే నేడు కూడా గోవిందు మీద
చర్రుమన్నాడు చొక్కా ఎందుకంటే?

ఎందుకు వేసుకోకూడదు? వాళ్ళ గొప్పేమిటి? తన కులం తనకు గొప్ప. తనంతవాడు తాను. డబ్బుకా? తాము ఎవర్నీ అడుక్కుతినడం
లేదు. తాను దొరలకేం బాకీ లేడు. కొద్దో, గొప్పో చదువుకున్నాడు. ఇంకెందులో వాళ్ళ గొప్ప? తాను వంగి సలాములెందుకు పెట్టాలి?

ఆ వాదంలో చిన్ననాటి రంగయ్యనే గోవిందు కళ్ళచూసేడు. ఏమీ అనలేదు. సంసారంలో పడి, ఆ మూడు రూపాయల వుద్యోగంలో చేరేక
ఆతడు రంగయ్య మాటల్లో చిన్ననాడు ఆనందాన్ని పొందలేకపోయేడు. ఊరుకున్నాడు.

కాని, రంగయ్య వూరుకోలేదు. మైలు, మైలున్నర దూరంలో వున్న దొర యింటికి చేరేలోపున ఆత్మగౌరవం యొక్క ఔన్నత్యాన్నీ, దాని
కోసం నిలబడవలసిన ఆవశ్యకతనీ చెప్పడం ప్రారంభించేడు. నిరుడు తాను సర్కార్లలో చూసిన ఒక ఘటనను చెప్పి, గొర్రెల్లా
కాకుండా, స్వాభిమానంతో బ్రతకవలసిన అవసరాన్ని వివరించేడు.

రంగయ్య, ఆతని మిత్రులు కొందరూ వినోదయాత్రకి సర్కార్లలోకి వెళ్ళేడు. తూర్పుగోదావరి జిల్లా ర్యాలిలోని జగన్మోహినీ విగ్రహం
చూడవలసినదని ఎవరో చెప్పేరు. రాజమండ్రీ వద్ద స్టీమరులో గోదావరి దాటి డెల్టాలో ప్రవేశించారు. బస్ ఎక్కేరు. అప్పుడా
ప్రయాణంలో జరిగిన సంఘటన అది.

బస్సు ఓ వూరు దగ్గర ఆగింది. ఓ పెద్దింటి ముత్తైదువ ఎక్కాలి. ఆమె బండిలోకి ఎక్కే ముందు తాను కూర్చోవలసిన సీటులోని
జనం ఎవరాయని వాకబు ప్రారంభించింది. కండక్టరు మర్యాదగానే చెప్పేడు.

"బస్సులో అందరూ ఎక్కాలిసిందేనమ్మా! ఇంకోళ్ళు వుండకూడదనుకొనేవాళ్ళు స్వంతానికి కారు పెట్టుకోడం మంచిది....

"ఇంక స్వంతానికి కారు పెట్టుకోలేక, మరొకరితో కలిసి కూర్చోలేనివారు ప్రయాణాలు మానుకోడం మంచిది"- అని చెప్పేడు.

"కాని, ముసలమ్మ తృప్తి పడలేదు. వచ్చే డబ్బు వదులుకుపోవడం బస్సువానికిష్టం లేదు. అందుచేత కండక్టరు ఒక రాజీ దారి
చూపించేడు. ఆ సీటులో వున్న హరిజన స్త్రీని మరో సీటులోకి జరగమన్నాడు. కాని, ఆమె నిరాకరించింది. కావలిసొస్తే ఆవిణ్ణే
అక్కడ కూర్చోపెట్టమంది."

ఒక క్రింది జాతి ఆడమనిషి చూపించిన ధైర్యగాధ గోవిందును ఆకర్షించింది. తర్వాతేమయిందని ప్రశ్నించేడు.

తాను చెప్పిన ఘటన పూర్తి ఫలితం ఆతని మనస్సుకి పట్టించాలనే ఆలోచనతో అబద్ధం ఆడేడు, రంగయ్య.

"ముసలమ్మ తమరందరి కుల గోత్రాలూ ఎందుకడగాలనే కోపంతో బస్సులో వాళ్ళంతా ఆ హరిజన అమ్మాయి మాట సబబుగా వుందన్నారు.
కండక్టరు నోరు మూసుకొన్నాడు. ఆ ముసలమ్మ ఆ హరిజన అమ్మాయి ప్రక్కనే కూర్చోవలసి వచ్చింది."

గోవిందుకు హరిజన అమ్మాయి ధైర్యం కన్నా ఆమెను బలపరచిన జనాన్నందర్నీ అభినందిస్తూంటే రంగయ్య నాలుక కరుచుకొన్నాడు.

నిజానికా రోజున బస్సులో వాళ్ళంతా కండక్టరు రాజీ పద్ధతికి సెభాష్ అన్నారు. హరిజన అమ్మాయి పెంకెతనాన్ని దుయ్యపట్టి,
తక్కువ కులాలవాళ్ళని కొర్రెక్కించేడని గాంధీనీ తిట్టేరు.

ఆ బస్సులోనే వున్న తాము అంతా ఆ అమ్మాయిని సమర్థించేరు. ఇల్లాంటి పనులవల్లనే తక్కువ కులాలన్నీ తురకల్లోనూ,
కిరస్తానీల్లోనూ కలిసిపోతున్నారన్నారు. ఆర్యసమాజ సభల్లో విన్న వాదనలన్నీ అక్కడ వల్లించేరు.

కాని, వాళ్ళు నవ్వేసేరు. తమ మాటల్లోని యాసా, ఉర్దూ పదాల మిశ్రణం మూలంగా తమ వాదన పూర్తిగా వాళ్ళకర్థం కాలేదు.
ఇంక హాస్యం పట్టించేరు. వాళ్ళల్లా నవ్వుతూంటే సర్కారు వాళ్ళ దురహంకారానికి తాను పళ్ళు కొరికేడు కూడా.

వాళ్ళనే ఇప్పుడు గోవిందు అభినందిస్తున్నాడు. ఆ హరిజన పడుచు ప్రతిఘటనను గురించి తానింత చెప్పినా బాగుందని ఒక్క మాట
అనలేదు. పైగా ఇది.

ఆరేడు నెలల క్రితం బందరు నుంచి ముగ్గురు యువకులు తెలంగాణాలోకి వచ్చి ఎర్రపాడు కోటలో హింసలకు గురి అయిన వార్తను గుర్తు
చేసుకొని బీదాళ్ళంటే సర్కార్లలో అభిమానం కాబోలని కూడా నిర్ణయం చేసేసేడు.

1946 వెట్టి వ్యతిరేక వుద్యమం తెలంగాణా పల్లెల్లో కారుచిచ్చులా వ్యాపించింది. దానిని అణచివేయడానికై నిజామ్ శాహీ మిలిటరీని
కూడా వుపయోగించి ఎన్నో ఘోరాలు సాగించేడు. ఆ దురంతాలను వ్యతిరేకిస్తూ కోస్తా తెలుగు జిల్లాలన్నింటా బ్రహ్మాండమైన ఆందోళన
జరిగింది. అనేక చోట్ల తెలంగాణా సహాయక సంఘాలు ఏర్పడ్డాయి. బందరులో ఏర్పడిన కమిటీ తెలంగాణా పరిస్థితుల్ని స్వయంగా
పరిశీలించి రావడానికై ముగ్గురితో కూడిన ఒక కమిటీని పంపించింది. [1] వారు 1946 డిసెంబరు 10 వ తేదీన మధిర
వెళ్ళారు. అక్కడి నుంచి మూడు రోజుల పాటు 10, 12 గ్రామాలు పర్యటించారు. 12 వ తేదీన వీరిని జన్నారెడ్డి
ప్రతాపరెడ్డి అనే జమీందారు పట్టించి 'ఎర్రపాడు' కోటలో నిర్బంధించి చాల ఘోరంగా హింసించేడు. తరువాత వారిని నల్లగొండ
పోలీసులకి వప్పచెప్పేడు.

[1] ఈ కమిటీ సభ్యులలో ఒకరైన శ్రీ భోగాదుల రామారావుగారిని కాంగ్రెసు ప్రభుత్వం 1950 డిసెంబరు 5 న కాల్చివేసింది:-
రచయిత.

దాని మీద సర్కార్లలో బ్రహ్మాండమైన ఆందోళన జరిగింది. ఫలితంగా నిజాం ప్రభుత్వం వారిని విడుదల చేయక తప్పింది కాదు.

గోవిందు ఆ కధనే నెమరువేస్తున్నాడు.

తాను కళ్ళతో చూసిన విషయాన్నీ, తెలంగాణా ప్రజకు అండగా నిలబడి పెద్ద ఆందోళన చేసిన ప్రజల్నీ సరిప్రక్కల పెట్టి
చూస్తే సర్కారు ప్రజలకి బీదలంటే అభిమానం వుందనాలో, లేదనాలో అర్థం కాలేదు రంగయ్యకు. మంచీ చెడ్డా అన్నిచోట్లా వున్నాయి.
ఆ మాటే గోవిందుతో అన్నాడు.

"ఎక్కడా ఒక్కటే నమూనా. బెదిరేవాళ్ళుంటే గొర్రె కూడా కరుస్తుంది."

గోవిందు అంగీకరించేడు.

రంగయ్య పది రోజుల క్రితం రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు తన కంటబడిన ఒక సంగతిని వివరించేడు.

ఆతడెక్కిన రైలు భువనగిరి దాటింది. పెట్టె అంతా కిటకిటలాడిపోతూంది. ఓ పది పదిహేనేళ్ళ ముస్లిం కుర్రాడు బండిలోకొచ్చేడు.
వానిని చూస్తేనే పరమ అసహ్యంగా వున్నాడు. చోటుకోసం అటూ యిటూ చూసేడు. బల్ల మీద చొక్కాలు తొడుక్కున్న వాళ్ళ మధ్య ఒక
రైతు చెవిలో పచ్చాకుచుట్టా, భుజాన కంబళీతో కూర్చుని కనిపించేడు. ఆ ముస్లిం కుర్రాడు అతని వద్దకు వెళ్ళి మాటామంతీ లేకుండా
చేయిపట్టుకు లాగేసేడు. వాని స్థానంలో తాను ఇరికేడు. అంతవరకూ రైతు సరిగ్గా కూర్చోడానిక్కూడా చోటు ఇవ్వని ఆ ప్రయాణీకులు
సర్దుకొని, గౌలు కంపు కొడుతున్న వాడికి చోటు యిచ్చేసేరు. వాడు అడుక్కుతినేవాడయితేనేం, నవాబూ, వాడూ ఒక మతం వాళ్ళు.
అందుచేత వానిది రాజవంశం.

నిజానికి ఆ రైతు తలుచుకుంటే వానిని సున్నితంగా కిటికీలోంచి క్రిందికి జారవిడిచెయ్యగలడు. కాని, ఆ పని చెయ్యలేదు.
గిడగిడలాడుతూ దండం పెట్టి, బెంచీల మధ్య అందరి కాళ్ళక్రిందా కూర్చున్నాడు. గౌలు కంపు కొడుతున్న ముస్లిం కుర్రవాడికి చోటు
ఇవ్వవలసివచ్చిన దురవస్థకు బల్ల మీద వారు తమ కాళ్ళ వద్ద కూర్చున్న రైతుమీద కసి తీర్చుకొనసాగేరు. అతన్ని
తన్నేరు, తిట్టేరు. తగులుతున్నాడని మోకాళ్ళతో పొడిచేరు.

'ఆ అమాయకుడు' నీ బాంచని, కాల్మొక్కుతానని పేరు పేరు వరసన బ్రతిమలాడుతూంటే నవ్వి ఎకసక్కెం ఆడేరు. ఆ సమయంలో
అక్కడే వున్న రంగయ్య అన్నీ చూస్తూ ఎంతో బాధపడ్డాడు. కాని, వాని తరపున నిలబడి ఒక్క మాట కూడా ఆడలేకపోయాడు.
అడ్డుపడాలనీ, రైతును బాధిస్తున్నవాళ్ళని గదమాయించాలనీ ఆతనికెంతో ఆవేశం వుంది. కాని ఏమీ చెయ్యలేకపోయేడు.

అయినా, ఆ రోజున తాను అనాలనుకొన్న మాటల్నీ, అనివుండాలిసుందని తర్వాత బాధపడిన మాటల్నీ నిజంగా తాను అన్నట్లుగానే
చెప్పేడు. అతని మంచితనాన్ని గోవిందు అభినందించేడు.

ఈమారు రంగయ్య ధైర్యంగా గోవిందు భయ స్వభావాన్ని వేలు పెట్టి చూపించేడు.

"దొరలు ఏమంటారో, అనరో.... కాని, ఏదో అంటారని మన భయం. ఆ భయాన్ని చూసే వాళ్ళు మనల్ని చొక్కా కూడా
తొడుక్కోనివ్వడం లేదు. ఆ భయం పోవాలి. అప్పుడే మనం తలెత్తుకోగలం."

అదెల్లాగన్నట్లు గోవిందు ప్రశ్నార్ధకంగా ఆతని ముఖం వంక చూసేడు.

అతనికే కాదు ప్రజానీకానికంతకూ అదొక ప్రశ్నే. యుగయుగాలు కళ్ళు కుట్టేసేరు. నాలుకను అంగుడికి తాపడం చేసేసేరు. ఇప్పుడు
కళ్ళు తెరవమంటేనూ, మాట్లాడమంటేనూ సాధ్యమా? మాట్లాడవేమని నెపం పెడితే? ఆ కుట్లు విప్పెయ్యాలి. నాలికకు స్వేచ్ఛనివ్వాలి.
అప్పుడయినా ఆ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు అలవాటు పడే సరికి కొంతకాలం పడుతుంది.

"చొక్కా నా వొంటినుంటే ఆ దొర మర్యాదగానీ కమీ అవుతుందా?"

గోవిందు ఏమీ మాట్లాడలేదు.



అయిదో ప్రకరణం


రంగయ్య వచ్చేడని వింటూనే శివరామిరెడ్డి రమ్మన్నట్లు తల విసిరేడు. గోవిందు పక్కకు తప్పుకొన్నాడు. రంగయ్య చావిడిలో
అడుగు పెడుతూ రెండు చేతులూ జోడించి సలాం అన్నాడు. రెడ్డి బుగ్గమీసాల సందు నుంచి చిరునవ్వు కనబడింది. ప్రతి నమస్కారంగా
రెండుమార్లు కుడి చేయి నుదిటివేపు ఎత్తేడు.

రంగయ్య వస్తూనే తాను పిలవనంపితే వచ్చేనన్న సంగతి విన్నవించేడు.

"తమరు ఎందుకో యాది చేశారట."

శివరామిరెడ్డి కూర్చోమనకుండానే పలకరించేడు. ఏదీ ప్రత్యేకమైన పని ఏమీ లేదనీ, ఓమారు పరిచయం చేసుకోవాలనిపించి
తీసుకురమ్మన్నాననీ చెప్పేడు.

"మా అల్లుడుగారు తరుచు నిన్ను గురించి చెప్తుంటారు. బాగా చదువుకుంటున్నావనీ, ఈ ఏడాదే వకాలతు పెట్టబోతున్నావని చెప్పారు.
సంతోషం. మీ తాతా తండ్రీ చాల మంచి వాళ్ళు."

అతని తెలివితేటల్ని గురించి తన అల్లుడు ఏమేం చెప్పేడో, ఆతని కుటుంబం మంచిని గురించి తానేమేం యెరుగునో శివరామిరెడ్డి చెప్పుకు
పోతూంటే రంగయ్య వినయం కనబరుస్తూ నిలబడిపోయేడు. అంత మంచి కుటుంబంలో పుట్టిన, తనంత బుద్ధిమంతుణ్ణి రెడ్డి మాటవరసకయినా
కూర్చోమనలేదనీ, తనతోపాటు ఆయన కూడా నిలబడే వున్నాడనీ గమనించి రంగయ్య ఆలోచనలో పడ్డాడు.

శివరామిరెడ్డి ఇంకా చెప్పుకుపోతున్నాడు.

"వాళ్ళు తమ జీవితాల్ని మన్నుకి అంకితం చేసేసేరు. అంతవాళ్ళు లేరనిపించుకొన్నారు."

శివరామిరెడ్డి తాటాకులు కడుతున్నాడో, నిజంగా పొగుడుతున్నాడో, అర్ధం కాలేదు. తన కుటుంబం వాళ్ళు మన్ను పిసుక్కు బ్రతికిన
సాధారణ కుటుంబమే సుమా యని రెడ్డి గుర్తు చేస్తున్నట్లనిపించింది. చదువుకొని బల్లకట్టబోతున్నా మాకంటె తక్కువవాడివేయని
ఙ్ఞాపకం చేయడమా దీనికర్థం? మొగం వేపు చూసేడు. అక్కడ అటువంటి భావమేం కనబడలేదు. కాని, ఆయన తన్ను కూర్చోమనేనా
అనలేదు. రాజిరెడ్డి తమ పెద్ద కుటుంబాలలో కనబరిచే అహంకారాలూ, వ్యర్థ ప్రతిష్ఠలూ గురించి చెప్తూ తన మామగారి కథలు
బోలెడు చెప్పేడు. తాను అగౌరవం చేయడానికి సాహసించలేని, గౌరవించడానికి ఇష్టంలేనివారికి శివరామిరెడ్డి "దర్శనం" ఇచ్చే
విధానాన్ని ఆతడే చెప్పేడు. అవన్నీ గుర్తు వచ్చేయి. ఆతడు చెప్పిన చావిడి ఇదే అయివుంటుంది. అక్కడున్న పరికరాల్ని
చూసేక తానున్న చావిడి అటువంటి దర్శనాలనివ్వడం కోసమే ఏర్పడినదయి వుండాలని భావించేడు.

"నీకు అక్కడ కూర్చునేటందుకు ఏమీ వుండదు. పైగా ఆయన అటూ ఇటూ పచారు చేస్తూ, నీ మొహంవేపన్నా చూడకుండా మట్లాడుతూ
పోతూంటే, వ్యవహారం మీద వచ్చినవాడిని నిల్చుండకేం చేస్తావు?

సరిగ్గా రాజిరెడ్డి వర్ణించినట్లే వుంది. గోడని ఎదురుగా నిజాం నవాబు జూబిలీ హాలులో కొలువు తీర్చిన చిత్రం ఒకటి.
పెద్దసైజుది వుంది. గోడల పొడుగునా స్టేట్‌లోని వివిధ జిల్లాలలోని అందమైన ప్రకృతి దృశ్యాల పెద్ద సైజు ఫొటోలు
అలంకరించబడి వున్నాయి. గదిలో నేలని మెత్తని తివాచీలు పరిచి వున్నాయి. ఎక్కడా కుర్చీలుగాని, తఖ్తాలుగాని లేవు.

ఈ చావడిని గురించి వర్ణించినప్పుడు తానో ప్రశ్న వేసేడు.

"ఆ వచ్చినవాడు పెంకెఘటం అయి, హోదా గలవాడైతే?"

వట్టి పెంకెఘటమే అయితే మాత్రం ఎక్కడ కూర్చొంటాడు? మొండితనానికి కూర్చుంటే సరిగా ఆయన కాళ్ళ వద్ద మోకరిలబడినట్లే
వుంటుంది. శివరామిరెడ్డి ఆరడుగుల పై చిల్లర విగ్రహం. అంత మనిషీ నిల్చుని మాట్లాడుతూంటే, వచ్చినవాడు ఆయన ముఖం చూస్తూ
కూర్చున్నాడా, మోకరిలబడి ఏదో ప్రార్థిస్తున్నట్లే వుంటుంది. మనల్ని అగౌరవం చేయడానికి ఆయనే ఇష్టపడనప్పుడు మనల్ని
మనమే హీనపరుచుకుంటామా?

ఆనాడు రాజిరెడ్డి మాటలు ఆతనికి అర్ధం కాలేదు. కాని, నేడు నిజమేననుకొన్నాడు. కూర్చునేటందుకు పరుపు వేసి కూర్చోమన్నా
ఆతడు కూర్చోడు. ఎంత దొర అయితే మాత్రం కాళ్ళ వద్ద కూర్చుంటాడా?

హోదాగల వాళ్ళకి దర్శనం ఇవ్వవలసి వస్తే ప్రక్కనే వున్న అందమైన చిన్న పూలతోటలో తిప్పుతాడు. తాను నిల్చున్న చోటికి
ఆ పూలతోటలో కొంత భాగం కనిపిస్తూనే వుంది.

అసలు వచ్చినవానితో కూర్చోడం ఇష్టంలేక అలా తిప్పుతున్నాడని తోచనిస్తాడా? అలా అయితే అందం ఏం వుంది?

తానూ వింటున్నాడు మీ తాత తండ్రులు తమ జీవితాన్ని మన్నుకు అంకితం చేసేరని అభినందించడంలో తమ పూర్వ స్థితిని గుర్తు
చేస్తున్నట్లనిపించినా, ఆ మాటలెంత పొందిగ్గా వున్నాయి? ఆ మాటల్లో, స్వరంలో ముఖంలో ఎంత అభిమానాదరాలు ఒలుకుతున్నాయి!

రంగయ్య మనసులో శివరామిరెడ్డి సంభాషణ పొడూగునా గచ్ఛద్వ్యాఖ్య సాగుతూనే వుంది. మధ్య మధ్య సమయోచితంగా రాజిరెడ్డికీ,
శివ రామిరెడ్డికీ తమ కుటుంబం మీద గల సదభిప్రాయానికి అభినందన వాక్యాలు తెలుపుతూనే వున్నాడు.

శివరామిరెడ్డి ప్రశ్నలు వేసి, ఆతడెక్కడ వకాలతు పెట్టబొయ్యేదీ, ఏం చెయ్యబోయేదీ తెలుసుకొని సంతోషం తెలిపేడు.

"నవాబుగిరీ అనుకో, చూడు సంగారెడ్డి? అన్ని జిల్లాలలోనూ ఎస్టేట్లకి ఎస్టేట్లు సంపాదించేడు. పోనీయంటే ఇంగ్లీషూ రాదు. తెలుగు
తిన్నగా రెండు నిముషాలు మాట్లాడలేడు. కాని, మంచి వకీలుగా పేరు సంపాదించేడు. ఆయన సంపాదన- ఏపాటి ఆస్తి వున్నా
సాధ్యమా?"

సంగారెడ్డి మంచి పేరు గల వకీలు. రాజకీయాలలో కాంగ్రెసు, స్టేట్ కాంగ్రెసు నాయకుల్లో వొకడు. ధాన్యపు రవాణా నిబంధనల
నతిక్రమించిన బ్లాక్ మార్కెటు కేసుల్లో అయితేనేం, ఆస్తిపరుల మరణానంతరం నిజాముకు చెందిపోయిన జాగీర్లు, ఇనాములు మొదలయిన
వాటిని వారసులకిప్పించేటందుకు పైరవీ నడపడంలోనూ ఆయన సిద్ధహస్తుడు. హైకోర్టు జడ్జీలను సహా ఆయన సంతృప్తి పరుస్తాడని
ప్రతీతి. ఆయన కేసులన్నీ ఆస్తిలో వాటాల పద్ధతి మీదనే. అందుచేతనే స్టేట్‌లోని అన్ని జిల్లాలలో ఆయనకు
బోలెడన్ని ఆస్తులు దఖలు పడ్డాయి. లక్షలు సంపాదించేడు.

సంగారెడ్డి సంపాదనా శక్తి మీద ఎంతో గట్టివాడురా యనే భావం రంగయ్యలో వున్నా ఆస్తితో పోటీ పెట్టడంచేత అంగీకరించడానికి
ఒప్పుదల కలగలేదు. అలాగని శివరామిరెడ్డి మాటలను ప్రత్యాఖ్యానం చేసి వాదన పెట్టుకోగల ధైర్యమూ లేదు. కనక
వ్యవసాయం కిట్టుబాటు కాకపోవడానికి దేశంలోని ఆర్థిక పరిస్థితి కారణం అని చెప్పేడు. వెట్టి చాకిరీలు, భూస్వాములు
రైతులకున్నదల్లా వూడ్చుకుపోవడం వలన పనిచేసేవానికి రక్షణా, విశ్వాసమూ, తాహతూ లేకుండా పోతూందని చెప్పాలని వుంది. కాని
పెద్ద రెడ్డి ముందర ఆ మాటలు చెప్పడానికీ సాహసం కలగలేదు. కనక చిన్న చిన్న కమతాలూ, వేదయుగం నాటి పనిముట్లూ
గురించి ఎత్తుకొన్నడు. వాటిని గురించి ఎంతసేపు చెప్పినా తనకూ, సంగానికీ ముడిపెట్టి ఇబ్బంది కలిగించడం ఎవరికీ సాధ్యం కాదు.

మొట్టమొదట్లో, ఏదో వొకటి చెప్పాలి గనకా, పెద్దరెడ్డికి కోపం కలగకుండా, తనకు నష్టం కలగకుండా వుండేందుకని చిన్న
కమతాలూ, పాత పనిముట్లూ సంగతిని ఎత్తుకున్నా క్రమంగా ఆ ఆవేశంలో పడిపోయేడు. ఉదాహరణకు అమెరికాలో వ్యవసాయ
పరిస్థితులను గురించి తాను చదివినవీ, విన్నవీ గుర్తు వచ్చేయి. అక్కడ పెద్ద పెద్ద బ్యాంకులూ, కంపెనీలూ లక్షలకొలది,
ఎకరాల కమతాలను నడిపిస్తున్నాయి. ఏ పైరు వేసినా వేల ఎకరాల లెక్కనే. కనక వాటిని దున్నాలన్నా, పైర్లు కోయాలన్నా
ఏం చెయ్యాలన్నా అనేక రకాల యంత్రాలనుపయోగిస్తున్నారు. అవి ఎంతెంతో ఖర్చును ఆదా చేస్తున్నాయి.

చిట్టచివర మన దేశంలో కూడా వ్యవసాయంలో యంత్రాలను ప్రవేశ పెడితే తప్ప లాభం లేదన్నాడు. యంత్రాలను తేవాలంటే సెంటూ, కుంటా
వ్యవసాయాన్ని కొనసాగించడం ఎల్లాగ?

శివరామిరెడ్డి నిశ్శబ్దంగా పచారు చేస్తూ, శ్రధ్ధగా ఆతడు చెప్పినవన్నీ విన్నాడు. ఆఖరున ఏదో ధ్యానముద్రలోంచి మేలుకొన్న
వాడిలాగ చూసేడు: ఆశ్చర్యం ప్రకటించేడు, ఒక్క నిట్టూర్పుతో.

"ఈ రోజుల్లో పడుచువాళ్ళందరివీ ఒకటే పద్ధతి. మా రఘు కూడా ఇదే......సరిగ్గా ఇంతే..."

రఘునందనుడు శివరామిరెడ్డి రెండో కొడుకు. చదువుల్లోనూ, వ్యవహార విషయాలలోనూ చాలా తెలివిగలవాడని పేరు వుంది. కొద్ది రోజులు
ప్రభుత్వోద్యోగం చేసి, మనస్తత్వానికీ ఉద్యోగపధ్ధతులకీ సరిపడక రాజీనామా పెట్టేడు. స్వంత సేరీ పెట్టేడు. ఇంజన్లూ,
ట్రాక్టర్లూ తెప్పించేడు. ఆధునిక పధ్ధతులపై వ్యవసాయం చేయిస్తాడంటున్నారు.

మంచి తెలివిగలవాడుగా పేరున్న రఘుననందనుడి అభిప్రాయాలతో తన అభిప్రాయాలు కలుస్తున్నాయన్నది విని రంగయ్య బ్రహ్మానంద
పడ్డాడు.

రఘునందనుడు కానైతే కొంచెం తేడాలో తన వయస్సు వాడే. అయినా ఆతనితో రంగయ్యకు పరిచయం లేదు. అయినా, తనను పెద్దగా
అభినందించిన దొరను సంతోష పెట్టడానికై ఆయన కొడుకుని పొగిడేడు.

"అటువంటి వారే దేశానికి ఆదర్శం చూపగలరు. వారికి ఆ అవకాశం, ఆసక్తీ వుండడం దేశం అదృష్టం...."

శివరామిరెడ్డి మీసాలు సవరించుకొంటూ విన్నాడు. అన్నీ విన్నాక రంగయ్య ఆదర్శ పధ్ధతియని పొగిడిన కార్యవిధానాన్ని అమలు
జరపడానికి సంసిద్ధత ప్రకటించేడు.

దొర కొడుకు పెద్ద ఎత్తున వ్యవసాయం సాగించే ఏర్పాట్లలో వున్నాడు. ట్రాక్టర్లూ, మోటార్లూ, నీటి పంపులూ తెప్పించేడు. చెదురు
చెదురుగా చిల్లరగా రైతుల చేతుల్లో వున్న భూముల్ని రెండేళ్ళుగా నెమ్మది నెమ్మదిగా చేతిలోకి తెచ్చుకొంటున్నాడు. ఆ మహా యఙ్ఞంలో
బోళ్ళపొలం కూడా స్వాహా కావలసిన అవసరం వొచ్చింది.

శివరామిరెడ్డి మాటలతో రంగయ్య నెత్తిన పిడుగు పడ్డట్లయింది. గూబకి బెత్తుడు చూసి, సాగదీసి కొట్టినట్లయి బిత్తరపోయేడు.



ఆరో ప్రకరణం.


బోళ్ళపొలమూ, ఆ చుట్టుప్రక్కలనున్న భూములూ అన్నీ రెడ్డివే. ఎప్పుడో ఏభయ్యరవయ్యేళ్ళనాడు రంగయ్య తాత వూళ్ళోకి
పెళ్ళాన్నీ పదేళ్ళ కొడుకునీ వెంటబెట్టుకొని వచ్చేడు. చాల బీదవాడు. శివరామిరెడ్డి తండ్రి ఊరు ప్రక్కన గట్టు వెనక్కాల
వున్న ఆ పదెకరాల భూమీ చూపించేడు. అప్పటికి తాను బాగా చిన్నవాడు. తర్వాత జ్ఞానం వచ్చేక తండ్రి తననోమారు పిలిచి
భూమినిచ్చిన సంగతి చెప్పి ఒక్క మాట అన్నారు. అదిప్పటికీ జ్ఞాపకం.

"వీళ్ళు చాలా ఓర్పుగలవాళ్ళు. మనమిస్తున్న భూమి మొదలయి, వీళ్ళు సెభాష్ అనిపించుకోగలరు...."

ఆ భవిష్యత్కథనం నేడు యథార్ధంగా కనిపిస్తూందంటూ శివరామిరెడ్డి పితృస్మరణకు చెమ్మగిల్లిన కళ్ళు ఆకాశం వంక తిప్పి,
ఒక్క నిట్టూర్పు విడిచేడు.

" మహాపురుషులు!..."

ఒక్క నిముషం గది అంతా నిశ్శబ్దంగా వుంది. రెడ్డి తన తండ్రిగారి ఆశీర్వచనం ఎలా ఫలించిందో నాలుగు మాటల్లో చెప్పేడు. ఆ
కుటుంబం ఆ చిన్న ఆసరాతో నిలదొక్కుకుంది. అభివృద్ధిలోకి వచ్చింది. ఆ ముసిలి రంగయ్య మనమడు వకాలతు చదివేడు. ప్రాక్టీసు
పెట్టబోతున్నాడు. అంతకన్న తమరిచ్చిన మొదలు వేయింతలయి మూడు పువ్వులూ ఆరు కాయలూగా వృద్ధి పొందడంకన్న కావలసిందేమిటి?
అంతకన్న సంతోషం ఏముంది?

ఆ పదెకరాల గోడ్రాళ్ళ దిబ్బా, ఆయన ఆశీర్వచనమూ మాత్రమేనా తమ కుటుంబం కాలు నిలదొక్కుకోడానికి కారణం? తమ కష్టం,
చాకిరీ వీటికి విలువే లేదా? తన చేయి తన నెత్తినే పెట్టించే విధంగా రెడ్డి మాట్లాడుతూంటే రంగయ్య నోరు వెతకలెయ్యడం తప్ప
ఏమీ అనలేకపోయాడు.

చివరకు రెడ్డి తన అభిప్రాయం మరో మరోలా వున్నా కేవలం దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రంగయ్య చెప్పినట్లే చిన్న
చిన్న ఖండాలుగా వున్న భూమిని ఏకం చేయవలసి వస్తూందన్నాడు.

"మీ అయ్య ఓ ఏభయ్యెకరాలు కొన్నాడు. నువ్వూ చదువుకొని పైకి వచ్చేవు. మా నాయనగారి ఆశీస్సు ఫలించింది. ఇంక దేశం
అభివృద్ధి కోసం ఆ మొదలు మళ్ళీ తీసుకోవలసి వస్తూంది. నీ అభిప్రాయం కూడా అంతే కావడంతో ఒక పెద్ద సమస్య తీరిపోతూంది."

పైకి ఎంతో సున్నితంగా, అరచేతిలో అరటిపండొలిచి పెట్టినట్లు కనిపించే వ్యవసాయ సంస్కరణల వెనకనున్న చిక్కులు ఆ క్షణంలో
అర్ధం అయినట్లు రంగయ్యకు మరెప్పుడూ కనబడలేదు. తన తాతకు రెడ్డి తండ్రి ఆ భూమి ఇచ్చిన మాట నిజం.

కాని.....

ఆ ఇచ్చిన భూమి ఎటువంటిది? అది లెక్క లేదా? అంతా రాళ్ళూ రప్పలతో, నీటి జాళ్ళకి, నిలువుడేసి గోతులతో, గాళ్ళతో
తల్లక్రిందులుగా వుండేది. ఆ కుటుంబం వాళ్ళు రెండు తరాల వాళ్ళు తమ రక్తమాంసాలతో పూడ్చినా, ఈనాటికీ ఆ భూమిలో గజం,
అరగజం ఎత్తు తేడాలో చెలకలు పక్క పక్కన కనిపిస్తున్నాయే. మొదట్లో ఎల్లా వుండేదో?......

రంగయ్య కూడా మొదట్లో ఆ చేను ఎల్లా వుండేదని కాని, దానికోసం ఎంత శ్రమ పడ్డారోయని గాని ఆలోచించడం లేదు. ఆ భూమి
తమది. తమ కుటుంబం మనుగడకూ, ప్రతిష్ఠకూ ఒక ప్రత్యక్ష చిహ్నం. అది కాస్తా పోతే గతంతోటీ, భూమితోటీ తమకు సంబంధం
ఏం మిగులుతుంది?

ఇప్పుడు పెద్దరెడ్డి ముందు తాను తెచ్చిన వాదనలనే కొద్ది నెలల క్రితం రాజిరెడ్డీ తానూ పొలంలో కూర్చుని మాట్లాడుకొన్నారు.
తమ వాదనలకి వెంకటయ్య అభ్యంతరం చెప్పేడు.

" చిన్న కమతాలయితే మునిగిపోయిందేమిటి? కొద్దో గొప్పో నాది అనుకొనే భూమి లేకపోతేనే గద బీదవాళ్ళకి ఈ చిక్కులు."

ఇల్లూ, వాకిలీ, పనీ, పాటా, తిండీ, బట్టా మొదలయిన నిత్యజీవితావసరాలన్నింటికీ బీద ప్రజ పడే చిక్కులన్నీ సెంటు భూమి
కూడా వాళ్ళ చేతిలో లేకపోవడమేనని వెంకటయ్య అభ్యంతరం.

దేశం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలని తామిద్దరూ వాదించేరు.

మనిషి మాటేమిటని ఆతడు అడ్డు తగిలేడు. ఆ చర్చలన్నీ గుర్తు వచ్చేయి. తన వాదంలో వున్న ప్రమాదాన్ని చూపించినది
వెంకటయ్యే కావడం రంగయ్యకు కష్టం అనిపించింది. అంత చికాకులోనూ.

ఆ రోజున సత్తెమ్మ అంది కూడా.

"ఇది నాది అనుకొని వుండకపోతే మా తాతయ్య, అయ్య, నేను దీనికోసం ఇంత కష్టపడి వుండేవాళ్ళమేనా?

ఆ రోజున అది కేవలం స్వార్థ దృక్పథం అనిపించింది.

ఆ భూమి కోసం తమ కుటుంబం ఎంత శ్రమ పడిందో లోకుల నుంచి విన్నవన్నీ సత్తెమ్మ ఏకరువేసింది. తమ యింట్లో ఏభయ్యేళ్ళపాటు
ఏది ఎంత వుంటే అదే అంతే తిన్నారు. వున్నదాంట్లో కానీ, అర్ధణా మిగిల్చేరు. ఆ ఏభయ్యేళ్ళల్లో ముగ్గురు పెద్దవాళ్ళూ,
నలుగురు అజాత శిశువులూ ఆ అగడ్తలకు బలి అయ్యేరు. తమ తల్లికి కలిగిన ఆరు గర్భాలలో తామిద్దరు మాత్రమే
బ్రతికేరు. మిగిలిన వాళ్ళంతా అధిక శ్రమ ఫలితంగా గర్భస్రావాలలోనే మరణించేరు.

ఇన్ని ప్రాణాలు బలిపెడితే వారు పోగు చేసిందల్లా నూట ఏభయి రూపాయలు. అది పెట్టి, తమ తండ్రి ఓ ఏభయ్యెకరాలు అడివి
భూమి కొన్నాడు. ముసలివాని జీవితంలో పెట్టుకొన్న ఆశయం, ఆతని కొడుకు ఆశ్వాసాంత ఘట్టాల నాటికి జత పడింది.

ఇంత ఏకాగ్రనిష్ఠ ఏమిటి? దాని గమ్యం ఏమిటి? .... భూమి లేకపోతే ఈ ప్రపంచంతో తమకున్న బంధం ఏమిటి? ఆ భూమిని
కొనుక్కోరాదు. అమ్మరాదు అనంటే కోట్లమందిని తాడూ, బొంగరం లేకుండా చెయ్యడమే కాదా?

ఆ రోజున తాను ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వలేకపోయేడు. అది రైతు వర్గం దిగపీకుడు స్వభావాన్ని ప్రతిబింబిస్తూందని రాజిరెడ్డి
కొట్టి పారేసేడు.

ఆ రోజున వెంకటయ్యే మరో మాట మీద కూడా ఆటంకం చెప్పేడు. ఆతనికెందుకు తోచిందో, దాని మీద తమరు చెప్పగల సమాధానం కూడా
లేకపోయింది.

దున్నలేనివాడికి భూమి ఎందుకని తానో వాదం తెచ్చేడు. ఓ ఎద్దుండదు. గిత్త వుండదు. ఓ నాగలీ, గొడ్డలీ వుండదు. చేతిలో కానీ
వుండదు. వాడి చేతిలో భూమి వుండి లాభం ఏమిటి? దేశానికి మీదు మిక్కిలి నష్టం గాని....

వెంకటయ్య దానికభ్యంతరంగా చెప్పిన మాటలు తనకప్పుడు అర్ధం కాలేదు.

భూమి ఎవరు దున్నితే వానిదా? అయితే రోజూ ఓ వంద ఎకరాలు దున్నుతుందట. దొర యంత్రం తెప్పించేడు. వరసపెట్టి కావాలంటే మరో
నాలుగు తెప్పిస్తారు. గట్లూ, కాలవలూ లేకుండా వరసపెట్టి దున్నేస్తాయవి. ఆ భూమంతా దొరదే అవుతుందన్నమాట. మరి వూళ్ళో
రైతాంగం, కూలీ నాలీ జనం మాటేమిటి?

ఆ ప్రశ్నకి రాజిరెడ్డి వద్ద కూడా సమాధానం లేకపోయింది. పోయి మార్క్సు-ఏంగిల్సులు ఏం వ్రాసేరో చూసుకొన్నాడు. రెండు రోజులు
వెతికి ఏమేమిటో చెప్పేడు. జమీందారీ యుగపు భూస్వామ్య విధానానికి విరుగుడుగా దున్నేవాడికే భూమి అన్నారుట. దానిని తీసుకెళ్ళి
యంత్రాలతో వ్యవసాయం చేసేస్తామనే జమీందార్లని సమర్ధించడానికుపయోగించబోవడం తప్పేనన్నాడు.

రాజిరెడ్డిది అదో గొడవ. ఏమన్నా వస్తే మార్క్సు ఏం వ్రాసేడని తిరగెయ్యడం మొదలెడతాడు. దానిని తామందరూ వేళాకోళం
చేస్తారు. కాని ఆయనే సరిగ్గా అన్నాడనిపించిందిప్పుడు. ఆ రోజున తానో చిట్కా చెప్పేడు.

"దేశ క్షేమం కోసం బలవంతంగానైనా పూనుకోవలసిందే."

ఆ రోజున తాను చెప్పిన చిట్కానే ఇప్పుడు రెడ్డి అమలు జరపబోతున్నాడు. కాని, అది తనకే ఎసరు కాబోతూంది. మింగుడు పడ్డం
లేదు.

" ఈ పొలాన్ని ఏభయ్యేళ్ళ నుంచి మేం చేసుకొంటున్నాం."

రెడ్డి మీసాలు దువ్వుకొంటూ ఆకాశం వేపు చూసేడు.

"అందుకే ముఖ్యంగా విశ్వాసం చూపడం మరీ అవసరం. ఏదో కష్టంలో వున్నప్పుడు ఆసరా యిచ్చాం. ఏభయ్యేళ్ళ పాటు ఏం ఇచ్చారో,
ఏం లేదో, అదంతా ఆ భగవంతుడికే ఎరిక. మీరూ నిలదొక్కుకున్నారు. ఇంక దానిని వదలండి. ఈ ఏడాది నార్లు అక్కడే
పోయిస్తా."

ఎంతో మెత్తగా, విచారపడుతున్నట్లూ, వాదించి వొప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లూ కనిపిస్తున్నా రెడ్డి ఆఖరు వాక్యం
సుగ్రీవాజ్ఞ. దానికి సమాధానం లేదు. ఆయన కోరనూ లేదు.

రంగయ్య దిగులుగా ఇంటి మొగం పట్టేడు.



ఏడో ప్రకరణం


రంగయ్య నిద్రలో నడుస్తున్నట్లు తూలిపోతూ వచ్చేడు. మనసులోని బాధ అంతా మొగాన్నే వుంది. ఆ ఆకారం చూసేసరికే ఏదో కష్టం
వచ్చిందని భార్య నిశ్చేష్టురాలయింది. తల్లి పలకరింపులో ఏడ్పు ప్రతిధ్వనించింది. దారినే పోతున్న రైతు ఆతనినంత దూరానే చూసి
ఏదో కష్టం కలిగిందనిపించి నిలబడ్డాడు. భుజాన వున్న సామాను వాకిట్లో పడేసి లోనికి వచ్చేడు.

భార్య తెచ్చి యిచ్చిన మంచినీళ్ళతో గొంతు తడుపుకొంటూ రంగయ్య దొర మాటలొక్కటొక్కటే చెప్పలేక చెప్పేడు. దొర బోళ్ళపొలం
వదలమన్నాడనేసరికి తల్లి గోలు గోలున ఏడ్పు మొదలెట్టింది. ఏడుస్తూనే తామా చెలకభూమిని సరిచేయడానికీ, సాగు చేయడానికీ
పడిన కష్టాల్నీ, పోగొట్టుకొన్న ప్రాణాల్నీ వివరించింది. వర్ణన సుదీర్ఘం. ఇది వరకు దానినంతా వేర్వేరు రూపాల్లో విన్నారు.
అయినా ఇప్పుడూ విన్నారు. విని ఓదార్చేరు.

వాళ్ళ చేతుల్లోకి వచ్చినపుడు అది పొలమూ కాదు. కనీసం చెలకయినా కాదు. రాళ్ళు రప్పలు, బండలు, బోళ్ళు, ముళ్ళు,
తుప్పలతో వుంది. ఒక చిన్న గుట్ట పంచన వాలులో వున్నదేమో వర్షపునీటికి జాళ్ళుపడి, ఇంతింతేసి లోతున పర్రెలు పడి
వుండేది. వీరమ్మ మామా, అత్తా కాస్త చదునుగా వున్న నాలుగైదెకరాలలో జొన్నో, సజ్జో వేసేరు. తీరికయినప్పుడల్లా రాళ్ళు
ఏరి, జాళ్ళకి సప్పిళ్ళు వేసేరు. గొప్పుకొట్టి పల్లాలు పూడ్చేరు.

ఒక రోజా, రెండు రోజులా? కొన్ని ఏళ్ళ పాటు నిద్రాహారాల కవసరమయిన కనీస కాలం తప్ప మిగిలిన ప్రతి ఘడియా పొలంలో
గడిపేరు.

ఇదివరకు వాళ్ళ నోటా, వీళ్ళ నోటా విన్న కథల్నే తల్లి చెప్తూంటే వింటూ ఆ భూమి కోసం తన తండ్రి తాతలు పడిన శ్రమకు
విలువ కట్టడానికి రంగయ్య ప్రయత్నించేడు. కాని అతనికి అంతు చిక్కనేలేదు.

దొర తన తండ్రి యిచ్చిన మొదలూ, ఆశీర్వాదమూ గురించి మాట్లాడుతూంటే ఈ విషయమే తోచలేదు. తమకా భూమి మీద గల హక్కు
కేవలం ఏభయ్యరవయ్యేళ్ళ కబ్జా వలన సంక్రమించింది మాత్రమే కాదు. ఆ భూమిలో ప్రతి అంగుళం మేరా తన కుటుంబీకుల కష్టంతో
ప్రస్తుతం వున్న రూపానికి వచ్చింది. ఏభయ్యేళ్ళు ఒక కుటుంబం వాళ్ళు ఓడ్చిన శ్రమకి విలువే లేదా?

దానికి విలువ కట్టడానికి మామూలు కూలి-కూలిపని లెక్కలు సరిపడవు. రైతు తన పొలంలో చేసే పనికి లెక్క కట్టడం సాధ్యం
కాదు. ప్రతి గంటలో కూలివాడు చేసే రెండు గంటల పని కుప్పి ప్రతిరోజూ ముగ్గురు కూలీలపెట్టు పని చేస్తాడు. దానికంతకూ లెక్క
కడితే దొర యిచ్చిన మొదలూ, ఆ ఆశీర్వచనమూ ఓ లెక్కకొస్తాయా?

దానికి లెక్క కట్టలేరు. రైతు చేసే కష్టం రెండు గంటలు, బుడ్లూ లెక్కకి అందదు. అదే మరోచోట కూలి పనికి పోతే, మరో
వృత్తి ఏదన్నా చేసుకుంటే?.... నిజమే బోలెడు ఆదాయం వచ్చేదే. ఏమో? కాని వాళ్ళు చెయ్యలేదు. ఎందుకు? ఆ రాళ్ళు,
రప్పలు పెల్లగించడంలో, ఆ గోతులు నింపడంలో, అంగుళం, అంగుళం మేర చదును చేయడంలో వాళ్ళు ఏమాసించేరు?

వరసగా అరడజను మంది జ్ఞాత, అజ్ఞాత శిశువుల్ని పోగొట్టుకొన్నా తన తల్లి మళ్ళీ తమర్ని కననే కంది. భూమి మీద రైతు
చూపే ఆప్యాయత కూడా అంతే కాబోలు.

మంచివాళ్ళో, చెడ్డవాళ్ళో తన సంతానం అంటూ వుండాలి. ఆ సంతానాశ భగ్నం అవుతున్నా మనుష్యుడు నిర్వికారంగా పునఃకల్పన చేస్తూనే
వున్నాడు. పంట రాకున్నా, వచ్చినా భూమి మీద కూడా చాకిరీ అలాగే చేస్తున్నాడేమో, అందుకేనేమో భూమితో రైతు ప్రాణం లంకె పడి
వుండడం?

పెద్ద వ్యవసాయాల్ని గురించి తానన్ని పెద్ద కబుర్లు చెప్తున్నా, అజ్ఞాతంగా తన మనస్సు బిగించి పడుతున్న సూత్రాలవేనేమో.
రంగయ్య మనస్సు అనేక ఆలోచనలతో ఉద్వేలితం అవుతూంది.

చేతులన్నీ కాయలయినాయి. పొలం బాగడింది. పిల్లలు సుఖపడతారని ఆ దేముడెంత మురిసినాడే-యని తల్లి దీర్ఘం తీసింది.

ఆమె తానెన్నడో కాపురానికి వచ్చిన నాటి నుంచీ పెట్టుకొన్న ఆశల్నీ పడ్డ భయాల్నీ జ్ఞప్తికి తెచ్చుకొని, తెచ్చుకొని
ఏడుస్తూంది. ఆ జ్ఞాపకాల చుట్టూనే రంగయ్య ఆలోచనలు అలగం తొక్కుతున్నాయి.

మనుష్యుడు పడే శ్రమ అంతా పిల్లల కోసమేనా? శివరామిరెడ్డి భూమిని దేశం కోసం, తన కొడుకు ఆలోచనలు కార్యరూపంలో
పెట్టేందుకోసం తీసుకొంటున్నానన్నాడు. తన తల్లి బిడ్డల కోసం భూమిని బాగు చేశామంటూంది. అయితే తన అక్కగారు ఉన్న
నగలమ్మేసి వ్యవసాయానికి పెట్టుబడి పెట్టింది. ఆమె ఎవరి కోసం చేసింది? ఆమెకు పిల్లలే లేరుగా? వెంకటయ్యను పెళ్ళి
చేసుకొనే ఆలోచనతోనే అతణ్ణి పనిలోకి పిలిచిందేమో?

తన అక్క వెంకటయ్యను పెళ్ళి చేసుకోడం ప్రయత్నం గుర్తు రాగానే ఆ సమస్య మీద వారం రోజుల క్రితం రాజిరెడ్డితో జరిగిన
వాగ్వాదం గుర్తు వచ్చింది. అతనిని తాను నొప్పించేడు ఆ రోజున. అయితే తానా రోజున అన్నదానికీ, నేటి ఘటనకూ సంబంధం
లేదుగదా యనిపించింది. తనను అవమానకరంగా మాట్లాడిన విషయం రాజిరెడ్డి మామగారితో గాని చెప్పేడేమో, ప్రతీకారంగా ఆయన ఆ
భూమికే ఎసరు పెట్టి వుంటాడు.

ఒకర్ని అనుమానించడం అనేది కలగకనే పోవాలి గాని, ఒక్క మాటు ఆ బీజం పడిందంటే దానిని మట్టుపెట్టడం కష్టం. తుంగనేనా
కుళ్ళగించొచ్చు. కాని అనుమానాన్ని పెల్లగించలేము.

వీధిలోనున్న నలుగురూ వచ్చేరు. కబుర్లూ, ఓదార్పులూ సాగుతున్నాయి. సానుభూతి తెలుపుతున్నారు. అందరికీ ఏదో ఒకటీ, అరా
మాటతో సమాధానం ఇస్తూనే వున్నాడు. కాని, అతని ఆలోచనలు రాజిరెడ్డి ఏం చెప్పివుంటాడాయనే....

"ఎంత చాకిరీ! మరో అయ్య పనికెళ్ళినా బోలెడు సంపాదించేవారు కాదా?

"ఒక్కరోజన్నా కడుపునిండ తిండి వుందా?

"ఏభయ్యేళ్ళ నుంచి చేస్తున్న కొండ్ర"

"కాస్త పచ్చగా వుంటే రెడ్లు కళ్ళల్లో నిప్పులోసుకుంటారు. ఎప్పుడూ అంతే."

"ఆ పదెకరాలే లోటొచ్చేయా? అంత దరిద్రంలో వున్నారా? వెయ్యెకరాలూ చాలలేదా?"

"ఏకాలానికేం వొస్తుందో ఎవరు చెప్పగలరు?"

"కర్మ కాకపోతే...."

ఆర్థిక సూత్రాలూ, సమాజ దాస్యం నుంచి ఆధ్యాత్మిక సందేహాల వరకూ రకరకాల కారణాలూ, సమాధానాలుగా గ్రామీణుల ఓదార్పుల్లో
దొర్లిపోతున్నాయి. వీధి చివరి వెర్రెమ్మ ఏదో సందు చూసుకొని, రెండో మనిషి చెవినపడకుండా వీరమ్మ చెవిలో ఒక నూతన
కారణాన్ని పడేసింది.

"ఏదో తప్పు జరిగిపోయింది. కాయమని కాళ్ళ మీద పడండి. అపరాధం ఇచ్చుకోండి.'

చేసిన తప్పేమిటో, అపరాధం ఇచ్చుకోవడం ఏమిటో వీరమ్మకు మొదట అర్థం కాలేదు. తెరిచిన నోరు తెరిచినట్లే వెర్రెమ్మవంక
ప్రశ్నార్థకంగా చూసింది,

"అదెనే. అది."

అదేమిటో చెప్పకపోయినా సత్తెమ్మ వున్న గదివైపు ఆమె చూసిన చూపూ, ఆమె చేసిన అభినయమూ "'అది' ఏమిటో చెప్పేయి.
వీరమ్మకు కటిక చీకట్లో దారి దొరికినట్లనిపించింది.

"అంతేనంటావా?"

జనం అంతా వెళ్ళిపోయేక వీరమ్మ దుఃఖపు దూకుడంతా కూతురు మీదికి తిరిగింది.

"దీని చలవే. అప్రతిష్ఠ ఆ మహారాజు చెవికంటా వెళ్ళింది. లేకుంటే ఇన్నేళ్ళనుంచి లేని భూమి ఆలోచన ఇప్పుడే ఎందుకు
రావాలి?"

ఒక్కొక్కమాటే అంటున్నకొద్దీ ఆ విశ్వాసం కూడా బలపడుతూ వచ్చింది.

"ఆయన ధర్మరాజు, తండ్రిలాంటి వాడు."

రంగయ్యక్కూడా ఔనేమోననిపించేటంత విస్తృతంగా శివరామిరెడ్డి యోగ్యతల్ని వీరమ్మ వర్ణించింది. ఇచ్చుకోలేమన్న రైతులకు
ఎన్నోమాట్లు శిస్తు మాఫ్ చేసేడు. యుద్ధం రోజుల్లో ఎందరికో డబ్బు ఇప్పించేడు. రెండేళ్ళక్రితం ఎరువును చేలోకి తోలించేసి
ఇంతవరకూ డబ్బు పుచ్చుకోలేదు. [2] ఇంట్లో ఎరువా ఏమన్నానా? కంపెనీ ఎరువులు. పెద్ద పులి పేరంటానికి పెట్టుకుందట. నిజాం
సర్కారు అంత ఖర్చు చేసి ఎరువులు రైతులకిచ్చేస్తుందా? దొర రైతుల లాభం కోసం తన చేతి డబ్బే ఇచ్చుకొన్నాడో, ఏదో చిట్కా
వేసి సర్కారు చేత ఇప్పించేడో, అంత మంచివాడు తమ భూమిని అడిగేడంటే వెనకాల రాజిరెడ్డి చాడీకోరుతనం ప్రోత్సాహం వుండకపోదనే
రంగయ్యకు గట్టిగా అనిపించింది. అక్కగారి అపరాధానికిది ప్రతీకార చర్య అంటున్న తల్లి మాట మీద విశ్వాసం లేకపోయినా,
కలిస్తే అదీ ఒక కారణం అయితే అయివుండొచ్చుననిపించింది.

[2] రెండో ప్రపంచ యుద్ధం రోజుల్లో అధికోత్పత్తి కార్యక్రమంలో నిజాం ప్రభుత్వం ఎరువుల వాడకాన్ని రైతుల్లో
ప్రోత్సహించడానికి పూనుకొంది. నాలుగో వంతు ధర తగ్గించి దీర్ఘకాల వాయిదాల మీద చెల్లగట్టే సౌకర్యంతో తక్కావీ ఎరువులు
సరఫరా చేసింది. కాని, అలవాటు లేని రైతాంగం వాటిని తీసుకోలేదు. ప్రభుత్వోద్యోగులు కోటా ప్రకారం ఎరువులు బస్తాలు తెచ్చి
గ్రామ చావడుల్లో పడేసి, చేలల్లో చిమ్మివేసి అప్పులు మాత్రం రైతుల పేర వ్రాసుకుపోయేరు. మొదటి నిర్ణయం ప్రకారం
అయిదారేళ్ళ వరకూ ప్రభుత్వం తక్కావీ ఎరువుల అప్పు సంగతి కదపలేదు. అది అప్పు అనే సంగతి రైతులు మరిచిపోయేరు.

తాను ఏమన్నా కూతురు నిశ్శబ్దంగా వూరుకోవడం చూసిన కొద్దీ వీరమ్మకు ధైర్యం బలపడింది. తిట్టింది.

"దీనిపోత్రం బొగ్గులుగానూ...."

సత్తెమ్మ దానికీ ఏమీ అనలేదు.

తమ్ముడు దొర దగ్గిర జరిగిన సంభాషణను వివరిస్తుంటే వాకిట్లోకి వచ్చి స్తంభాన్ని జేరబడి నిల్చుంది. ఒక్క పలుకు కూడా
ఆడకుండా అన్నీ వింది. ఆమె ఎవరినీ ఓదార్చలేదు. ఒకరి ఓదార్పుల్ని వినిపించుకోలేదు. వచ్చిన జనం తోట పెంచడానికై
సత్తెమ్మ పడిన కష్టాన్ని చెప్తూ ఆమె ముఖంకేసి చూసినప్పుడు కూడా ఆమె ఏమీ అనలేదు.

ఇప్పుడు తల్లి తిడుతున్నా ఆమె కదలలేదు. అత్తగారి మాటలు కోడలికే కష్టం అనిపించేయి. ఎదుటి నుంచి తీసుకుపోదామని వచ్చి
చేయి పట్టుకొంది.

"లోపలికి పోదాం రాండి."

సత్తెమ్మ మాట్లాడనూ లేదు. కదలనూ లేదు, పరధ్యానంగానే మరదలు చేయి విడిపించుకొంది.

"ఇంటా వంటా లేని పని చేస్తివే కూతరా! తింటూ తింటున్న కూట్లో మన్నోస్తివే తల్లీ! ఎటువంటి కొంపకెటువంటి చిచ్చు తెస్తివే!"

కూతురు ఏమీ అనడం లేదనే ధైర్యం చిక్కిన కొద్దీ వీరమ్మ ఆమె వైపు డేకుతూంది. అనేక కోణాల నుంచి అనేక కొత్త కొత్త
మాటలతో తిడుతూంది.

తల్లి దగ్గరకు వచ్చినా సత్తెమ్మ కదలలేదు. చివరకామె కాళ్ళకు తగిలేటట్లు వచ్చింది.

"పాపం వూరికెనే పోతుందా?"

అది శాపమో, అనుతాపమో, సత్తెమ్మ నోట అప్రయత్నంగా వచ్చేసింది.

"పాపం చేసింది నేనూ, చుట్టుకునేది మిమ్మల్నీనా?"

తల్లి అంటున్న మాటల్లో విశ్వాసం లేకపోయినా రంగయ్య అక్కగారి మాటలకు ఉక్రోషపడ్డాడు. ఈ ఉత్పాతం అంతా రాజిరెడ్డి
చెప్పిన ఏదో మాటల ఫలితం అయి వుంటుందని అనిపిస్తూంది. కాని, పైకి చెప్పలేడు. తన మాటే ఇంత తెచ్చిందని నలుగురికీ
తెలిసిపోవడంకన్న, నెపం వేరొకరిమీదికి పోవడంలో తృప్తి.

సత్తెమ్మ మాటలు ఆ తృప్తి మీద దెబ్బ తీసేయి. కోపం వచ్చింది. కాని, గట్టిగా ఏమీ అనలేకపోయేడు. గొణిగేడు.

"చేసింది చెప్తే ఉక్రోషం.'

తల్లి అన్ని తిట్టినా మాట్లాడని సత్తెమ్మ తమ్ముడు గొణుగుడికి మండిపడింది.

"ముండల్లే నామీద పడి ఏడవకపోతే అక్కడే అదేదో ఏడవకపోయావూ. వెధవ చదువు వెలిగించేవు, ముసలి పీనుగుల వెనక్కాల తాళం
వేయడానికి."

సత్తెమ్మ ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేదు. వీరమ్మ నోరు తెరిచి, కూతురు పోయిన వైపే చూసింది.

కొడుకును వేరే పిలిచి తల్లి తన ప్రతిపాదనను ముందుపెట్టింది. కొడుకు దానికి వొప్పుకొంటాడనే ధైర్యం ఆమెకు లేదు. అయినా
అంతకన్న ఏం చెయ్యగలుగుతారో ఆమెకు అర్థం కాలేదు.

రంగయ్య కాలేజీలో చేరినప్పటి నుంచీ ఇటువంటి వాటిని వ్యతిరేకిస్తున్నాడు. చట్టంలో ఇల్లాంటివి పుచ్చుకోకూడదనీ, ఇవ్వకూడదనీ
వుందన్నాడు. కాని ఆ పొలాన్ని కాపాడుకొనేటందుకు చట్టంలో లేకపోయినా దానికి విరుద్ధంగా అయినా సరే దొరకి అపరాధం చెల్లించాలని
ఆమె అభిప్రాయం.

సత్తెమ్మ తన శారీరకావసరాలకు లొంగిపోవడం ఒక అపరాధం. అందులో విధవరాలయివుండీ. ఆ తప్పు చేసినందుకు దొరకి అపరాధం
చెల్లించుకోవాలి.

ఎవరింట్లోనైనా బిడ్డ పుట్టితే, పెళ్ళి జరిగితే, పిల్ల కాపురానికెళ్ళినా, కోడలు ఇంటికి వచ్చినా, చిన్న మాటా మాటా
అనుకొన్నా పేచీ పడి సఖ్యపడాలనుకొన్నా దొరకి అపరాధమో, బహుమానమో, నజరానాయో రూపం ఏదయితేనేం, పేరు ఏదయితేనేం కొంత
రుసుం చెల్లించుకోవాలి.

దొర కూతురు పెళ్ళయితే గొల్లరత్తాలు మందకో గొర్రె నిచ్చేడు. మంగలి వెంకాయి ఎవర్తెనో లేవదీసుకొచ్చినందుకు పాతిక రూపాయలు
అపరాధం దొరకిచ్చుకున్నాడు. ఇల్లాగే ప్రతి ఇల్లూ ఏదో రూపేణా, ఎంతో కొంత ఇస్తూనే ఉన్నారు.

అల్లా ఇవ్వకుంటే ఎన్నో చిక్కులు. ఏదో సమయంలో దెబ్బలు తగులుతాయి. పోలీసుస్టేషన్లకీడుస్తారు. కేసులు వస్తాయి.
బలాత్కారంగా వసూలు చేయడం ఎల్లాగూ మానరు. పైగా తిట్లూ, తన్నులూ కొసరు, అందుచేత పల్లెటూళ్ళలో ఎవ్వరూ ఈ ఆనవాయితీని
తప్పించడానికి ప్రయత్నం చెయ్యరు.

దొర పెట్టించిన బడిలో కొడుకును చేర్పించినప్పుడు రంగయ్య తండ్రి స్వయంగా బుడ్డెడు వెన్న కాచిన నెయ్యి ఇచ్చివచ్చేడు.
కాలేజీలో చేరే ముందు ఆతడే స్వయంగా ఇచ్చివచ్చేడు.

కాని కాలేజీలో చేరేక ఈ కట్నాలు చట్టవిరుద్ధమని రంగయ్య తెలుసుకొన్నాడు. వాటికి వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇచ్చేడు. వాటిని
కాలేజీల్లోనే చాలమంది వ్యతిరేకించేవారుండేవారు. అతన్ని బలపరిచేవారూ చాలమంది కనబడ్డారు. అనేకమంది దొరల బిడ్డలూ,
జమీందార్ల సంతానమూ తాము వూళ్ళలోకి వెళ్ళేక ఈ దురన్యాయపు వసూళ్ళని కట్టిపెట్టించేస్తామన్నారు. ప్రమాణాలు కూడా చేసిన
వాళ్ళున్నారు. కొందరు ఈ ఆలోచనలను ఎగతాళీ చేసేరు. భూమి అమ్మితేనూ, కొంటేనూ స్టాంపు ఫీజు ఇవ్వడంలాంటిదే దొరలకిచ్చే
రుసుమూనంటారు వాళ్ళు. స్కూలులోనూ, కాలేజీలోనూ కొత్తగా చేరేటప్పుడిచ్చుకొనే ఎంట్రన్సు ఫీజు మాటేమిటని నిలదీసేరు. కాని,
వారయినా ఏ సంబంధం లేని దొరలకి రుసుం ఎందుకివ్వాలంటే చెప్పలేకపోయారు. ఆచారం! దానికి మారు సమాధానం లేదు. సమాజంలో
ఆచారానికి చట్టానికున్నదానికన్న బలం ఎక్కువ.

వీటి మీద తాము రోజుల తరబడి చర్చలు జరిపేరు. వానికెన్నడూ తెగూతెంపూ వుండేది కాదు. ఇప్పుడవన్నీ గుర్తువచ్చేయి. ఆ
జ్ఞాపకాలూ, తన వాదనలూ తరుముకు వస్తూంటే రంగయ్య తల్లి ప్రతిపాదననంగీకరించలేకపోయేడు. పైగా ఈ ఆపదకు తానూహిస్తున్న
కారణం వేరు. తన అక్క చేసిన తప్పు దీనికి కారణం అనిపించడం లేదు. రాజిరెడ్డి ఏవో చాడీలు చెప్పేడు. అసలు కారణం వేరే
వుండగా అక్క ఏదో పెళ్ళి చేసుకుంటానన్నదని అపరాధం చెల్లించబోతే ఏమౌతుంది?

కాని, తన మనస్సులోని ఆలోచనను బయట పెట్టలేదు. అపరాధం పేరు ఎత్తవద్దని తల్లిని మందలించేడు. ఆమె ఏడ్చింది.

"పొలం పోవలసిందేనా?"

"కోర్టులున్నాయిలే" యంటూ కొడుకు ఆమెకు ధైర్యం చెప్పబోయేడు. నిజానికి కోర్టుల వలన పని ఏమన్నా జరుగుతుందంటే ఆతనికే
నమ్మకం లేదు. కనీసం గట్టిగా ఎదుర్కొంటారనీ, భూమి ఓ పట్టాన స్వాధీనం కాదనీ తోస్తే దొర వూరుకోవచ్చునని ఒకవేపున
అనిపిస్తూంది. కొండెపు మాటలకు తన్ను బెదిరించేడేమో? కాని, అలాగని వూరుకోలేడు. పోయి దీని అంతేదో చూడాలి.

"షికాయతుకు ఎంతో డబ్బు కావాలి. దొరలతో పేషీ. నెగ్గుతామనే ధైర్యం ఏమిటి? ఖర్చులకయ్యే డబ్బు అపరాధంగా చెల్లిస్తే?
సఖ్యతా వుంటుంది. పొలమూ పోదు."

తల్లి సలహాను రంగయ్య లెక్కచేయలేదు.

వెంటనే భార్య వడ్డించగా నాలుగు మెతుకులు ఆదరాబాదరా కొరికి నల్లగొండ పోయే బస్సునందుకోడానికి దండుబాటకి వెళ్ళేడు.

వీరమ్మ వంటింట్లో పాలదాలి సమీపంలో పాతిపెట్టిన పిడత పైకి తీసింది. అయిదు రూపాయలు కొంగున మూటకట్టుకొంది. దుఃఖభారంతో కాళ్ళు
ఈడ్చుకొంటూ కిష్టయ్య ఇంటికి బయల్దేరింది.

కిష్టయ్య రెడ్డిగారి శేరీదారు. రేపు పొలం స్వాధీనం చేసుకోడానికి రావలసిన మనిషి. దొర వద్ద పని జరగాలంటే ఆతనికి
తాంబూలం ఇవ్వడం అవసరమని వీరమ్మకు అనుభవజ్ఞానం.

అయిదు రూపాయలూ రొంటినెట్టుకొని కిష్టయ్య మీసాలు సవరించుకొన్నాడు. నిరుడు తాను వూళ్ళోంచి పారిపోవలసి వచ్చిన స్థితిని
గుర్తుచేసికొని, ఆనాటి తిరుగుబాటులో వెంకటయ్య ఎంత బాధ్యుడో జ్ఞాపకం చేసేడు.

వీరమ్మ లబలబలాడింది.

ఇంటికి వచ్చేసరికి గుమ్మంలో కూతురు కనబడింది. అయిదు రూపాయలూ జ్ఞాపకం వచ్చి మండిపోయింది. ఎంతో కష్టపడి కూడబెట్టిన
డబ్బు నీళ్ళల్లా ఖర్చు చేయవలసిన స్థితి కలిగించినందుకు తిట్టింది.

"మారెమ్మ!"

సత్తెమ్మ తల్లిని నమిలేసేలా చూసింది. అంతే. ఏమీ అనలేదు.



ఎనిమిదో ప్రకరణం


చేతిలోని సిగరెట్టు చేతిలోనే నుసి అయిపోతూంటే ఆ ధ్యాసైనా లేకుండా రాజిరెడ్డి ఏవేవో ఆలోచనల్లో కొట్టుకుపోతూ అలాగే
కూర్చుండిపోయేడు. సత్తెమ్మ ప్రశ్నకి సమాధానం ఏమిస్తాడు?

నిజానికి చట్టంలో కౌలుదారులకి రక్షణ అనేది వున్నట్లు కనిపిస్తున్నా ఆచరణలోకి రాకుండా దానికేన్నో మినహాయింపులు.
ఏభయ్యరవయ్యేళ్ళ పాటుకి ఏగాని విలువనివ్వని ప్రభుత్వం. ఈ అరణ్య రోదనానికి ఆలనా పాలనా చూపే శక్తి ఎవరికుంది?

కాని, ఆ సమస్య భయంకర స్వరూపాన్ని ఎరగని సుమిత్రా, ఎరిగి వున్నా ఏం చెయ్యాలో తెలియని సత్తెమ్మా కూడా ఆతని
సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఎదుట వున్న కుర్చీ చేతిమీద ఆనుకొని కూర్చుని సుమిత్ర నిరీక్షిస్తూంది. వారికెదురుగా
గుమ్మానికి ప్రక్కన గోడనానుకొని సత్తెమ్మ నిలబడి వుంది. తన ప్రశ్నకు సమాధానం వారి ముఖాలలో వెతుకుతున్నట్లు వారిని
మార్చిమార్చి చూస్తూంది.

పెద్దదొర తమ భూమిని కావాలన్నారనీ, దానికి కారణం తాను పెళ్ళి చేసుకోవాలనుకోవడమేననీ తల్లీ, తమ్ముళ్ళ నోట విన్నాక
ఆమె కోపం పట్టలేకపోయింది. భూమిని అడిగేడన్న దానికన్న ఆ క్షణంలో దానికి చెప్పిన కారణం మీదనే ఆమె ఎంతో ఆవేశపడింది.
పెళ్ళి చేసుకోవాలనుకోడంలో తప్పేమిటో, దానికాయన కోపగించవలసిన పనేమిటో, ఆ కోపంతో తమ భూమిని ఏ హక్కుతో ఇమ్మంటున్నారో
స్వయంగా పెద్దరెడ్డిగారినే అడిగెయ్యాలని బయలుదేరింది. మరొకప్పుడైతే ఆ ప్రశ్నలు అడగగలిగేదే కాదు. అందులో పెద్దరెడ్డిని
స్వయంగా అడగడం. కాని ఇప్పుడామెకా భయమూ లేదు. సంకోచమూ లేదు. రెడ్డి ఇంట్లో లేకపోయాడు గాని ఆమె అడిగివుండేదే. ఆయన
లేకపోవడంచేత ఆయన కూతుర్ని అడిగింది. సుమిత్రతోనూ, ఆమె భర్తతోనూ తనకున్న పరిచయాన్ని పట్టి కొంచెం దురుసుగానే
అడిగింది. ఆ దంపతులతోడి సంభాషణలో దొరకు ఆ భూమి మీద కన్ను పడడానికిగల కారణం తాను పెళ్ళి చేసుకోవాలనుకోడం ఎంతమాత్రం
కాదని తెలిసిపోయింది. అంతవరకూ ఆమె మనస్సులో అడుగున పడి వున్న భూమిపై తమకుగల హక్కు సమస్య ఇప్పుడు
అగ్రస్థానానికి వచ్చింది. దానిలో తమ కుటుంబం ఎంత చాకిరీ చేసిందో! తాము ఎంత పెట్టుబడి పెట్టేరో! తమ జీవితంలో ఒకభాగం
అయిపోయిన ఆ భూమిని అడిగే హక్కు దొరకెక్కడిది?

రెండు తరాల నుంచి తమరా భూమి పండించుకు తింటున్నారు. పన్నులు కట్టుకొంటున్నారు. అది తమదే ననుకొంటున్నారు. తమరొక్కరే కాదు.
ఊరందరిదీ అదే అభిప్రాయం.

ఆ భూమిని ఇప్పుడున్న స్థితికి తేవడంలో తాను ఎంతో కష్టపడింది. ఎంతో డబ్బూ పెట్టింది. అదంతా లెక్కలేనట్టూ, తమ
జీవితాలకు విలువేలేనట్లూ, పట్టా కాగితం ఒక్కటే ప్రపంచం అన్నట్లూ మాట్లాడితే?

రాజిరెడ్డికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏం అనగలడు? నిజం చేత ఆతనికి సత్తెమ్మ మీద సానుభూతి వుంది. ఆమె మీదనే
కాదు. ఆమె లాగ సంఘవ్యవస్థ కక్కుల చక్రంలో నలిగిపోతున్న వాళ్ళందరి మీదా కూడా అభిమానం వుంది. ఒక్కమారు తిరగబడితే
తప్ప ఈ వెట్టి చాకిరీలూ, హింసలూ, దోపిడీలూ వదలవని అతడు గట్టిగా నమ్ముతాడు.

కాని, ఆతని అభిప్రాయాలు కార్యరూపంలోకి వస్తే నలిగిపోయే వాళ్ళు తన సన్నిహిత బంధువులే. ఏడాది క్రితం వెట్టిచాకిరీ
చెయ్యబోమని నలుగురూ కట్టుకట్టేసరికి తన మామగారివాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో విన్నప్పుడు సంతోషం కలిగినా రెండోవేపున
అయ్యో అనిపించకపోలేదు. వండుకున్న తిండి ఏలాగో పెట్టుకు తిన్నా ఆకు తీసి పారేసే దిక్కు లేకపోయింది. మంచాలున్నాయి.
పరుపులున్నాయి. దుప్పట్లున్నాయి. కాని కళ్ళు మూసుకొని పడుక్కోవాలనుకొంటే పక్కవేసేటందుకు మనషి లేకపోయె. దొడ్డి నిండా
పశువులున్నాయి. పిల్లలకి పాలు వచ్చే దారి లేకపోయె. ఒక్కరికీ ఏం చెయ్యాలో తెలియదు. ఏ పనికి ఏం ఇవ్వాలో ఒక్కళ్ళకీ
అర్థం కాదు.

ఆనాడు తాము పడిన ఇబ్బందుల్ని ఏకరువు పెట్టి వెట్టి వ్యతిరేకతని తెలుగు మీరిపోవడంగా వర్ణించి అత్తవారి వాళ్ళు నిందిస్తూంటే
రాజిరెడ్డికి ఏం సమాధానం చెప్పాలో అర్ధం అయ్యేది కాదు. పైకి ఏమీ అనకపోయినా మనసులో మాత్రం వుండేది. ఏం వాళ్ళెందుకు
వుట్టినే చాకిరీ చెయ్యాలనిపించేది. కాని, రెండోవేపున డబ్బూ అడిగి తీసుకొని పని ఎందుకు చెయ్యకూడదు అనీ తోచేది. అంత
సందిగ్ధతలోనూ ఆతని సానుభూతి మాత్రం ప్రజల వేపే వుంది.

ఇప్పుడూ అదే స్థితి. సానుభూతి సత్తెమ్మ మీద. ఆమె ఆ భూమిని బాగు చెయ్యడానికి చూపిన తాదాత్మ్యం అతడు కళ్ళారా చూసేడు.
అంతకంటె భూమిమీద మరో హక్కు ఏం కావాలి? ఆ భూమి వుందో లేదో. ఎక్కడుందో, ఎల్లావుందో ఎరగని మామగారు దానిని కావాలనడం
బాగాలేదనిపించింది. "దున్నే వాళ్ళకే భూమి మీద హక్కుండాలి."

కాని, ఆ సానుభూతిని తాను ఏవిధంగా చూపగలడు? భూమిని అడగడం న్యాయం కాదని మామగారి వద్ద అనగల ధైర్యం లేదు. ఆయనంటే
ఒక విధమయిన భక్తీ, భయమూ కూడాను.

చిన్న బావమరిది వద్ద చనువూ వుంది. తన ఈడు వాడు గనక పరిచయమూ వుంది. కాని, ఆయన ఆలోచన వేరు. యంత్రాలతో
పెద్దయెత్తున వ్యవసాయం సాగించాలనే ప్రయత్నంలో వున్నాడు. దున్నేవాడికే భూమి హక్కు వుండాలనేటట్లయితే ఇప్పుడు నాకంటే
హక్కుగలవాడెవ్వరూ వుండరన్నాడు.

యంత్రాలతో తాను వేల ఎకరాలు దున్నించగలడు. తనకు పట్టా వున్న భూమే కాదు. అడ్డు చెప్పేవాడు లేకపోతే వూళ్ళోదే కాదు.
చుట్టుప్రక్కల వూళ్ళది కూడా దున్నించెయ్యగలడు. ఆ భూమంతా తనకు రావలసిందే మరి – అన్నాడు.

నిజంగా అంత పనీ చెయ్యగలరు. కాని చెయ్యరు. ఒక్కమారు ఆ పని ప్రారంభిస్తే ఇంక ఆస్తిహక్కు అనే దానికి అవకాశమే
లేకుండా పోతుంది. భూమిమీద ఆస్తిహక్కు ఒక్కమారు రద్దు అయ్యాక అది అక్కడే ఆగుతుందని నమ్మకం ఏమిటి? ఆ భయం లేకపోతే
ఏనాడో ఆ పని చేసివుండేవారే.

మానవుడు ఏమవుతాడనే విచారం లేదు. మనం ఏమవుతామనే బాధే. అదే ఇక్కడా ప్రత్యక్షమయింది. దానిని తాను అర్ధం
చేసుకొన్నాడు. కాని ఆ మాటలు సత్తెమ్మతో ఎల్లా చెప్పగలడు? తన బావమరిదిమీదా, మామగారిమీదా తిరుగుబాటుకి ప్రోత్సాహం
చెయ్యడం న్యాయం కాదనుకొన్నాడు. అయితే మరి సత్తెమ్మ ప్రశ్నకు సమాధానం?

భర్తతోడి సాహచర్యంలో పట్టుబడ్డ అభిప్రాయాలూ, సత్తెమ్మ అంటే వున్న మంచి అభిప్రాయముతో సుమిత్ర కూడా తన ఆత్మబంధువులు
ఈ విషయంలో మంచిగా వ్యవహరించడం లేదనుకొంది. కాని, వాళ్ళు ఆత్మబంధువులు, తండ్రీ, అన్నా, వాళ్ళు తప్పు
చేస్తున్నారనిపించినా, ఎంత సదభిప్రాయం గల మనిషి అయితే మాత్రం సత్తెమ్మ వద్ద వాళ్ళని ఏమనగలదు? అలాగని
సమర్థించనూ లేదు. సమస్యకు పరిష్కారమార్గం మగడి మీద పడేసి ఎదురు చూస్తూంది. కాని ఆయనకు కూడా తెగినట్లు కనబడ్డం
లేదు.

మెట్లమీద ఎవరో గబగబా ఎక్కి వస్తున్న చప్పుడయి సుమిత్ర కుర్చీ చేతిమీద నుంచి అప్రయత్నంగానే లేచి నిలబడింది. ఇంత
చనువుగా వచ్చేవారెవరాయన్నట్లు ఆమె చూపులు ఆవైపే తిరిగాయి. మరుక్షణంలో తల కనబడింది. గుర్తుపట్టింది. తమ సమస్య
తేలిపోయినంత వుత్సాహం గొంతులో ప్రతిధ్వనించింది.

"అరుగో చిన్నన్నయ్యే వచ్చేరు. ఆయన్నే అడుగు...."

"ఏమిటి అడగడం?" అంటూ అతడు మరుక్షణంలో గదిలో అడుగు పెట్టేడు, కుర్చీ ఒకటి లాక్కుకూర్చుని. రెండోమారు తన ప్రశ్నను
రెట్టించే వరకూ ఆ గదిలో మరొక మనిషి కూడా వున్నదని గుర్తించలేదు. గుర్తించినాక ఆతని నోట మరో మాట రానూలేదు.
ఉదాసీనంగా కనబడుతున్న సత్తెమ్మ ముఖం ఆతని నాకర్షించింది.

సన్నగా సలాకులావున్నా ఆ విగ్రహంలో దీప్తి వుంది. పెద్ద పెద్ద కళ్ళు ఆ దీప్తికి దివిటీ పడుతూంటే, ఆ సౌందర్యం ముందు
అతడు చాలసేపటివరకూ నిర్వాక్కుడుగా కూర్చుండిపోయేడు.

తన చెల్లెలి ముందర ఎవరో ముక్కూ మొగం ఎరగని పరాయి స్త్రీ వేపు రెప్పార్పకుండా చూడడం సంకోచం అనిపించింది. చూపులు
తిప్పుకొన్నాడు. కాని, దానికి ఎంత మనోనిగ్రహం చూపవలసి వచ్చిందో అతని అప్పటి మొగమే చెప్పింది.

తన వైపు రెప్పార్పకుండా చూడడం సత్తెమ్మకు చాల కోపం తెప్పించింది. అసహ్యమూ కలిగింది. రఘునందనుణ్ణి గురించి ఆమెకేమీ
తెలియదు. దొర కొడుకని మాత్రమే ఆతనిని గురించి ఆమెకు తెలిసినదల్లా. దొరలయెడా, వారి నీతి నియమాలయెడా ఆమెకు తీవ్రమైన
అసహ్యం వుంది. వారి అవినీతికర చర్యల కథలు ఆమె బహు ముఖాల అసంఖ్యాకంగా వింది. రఘునందనుడి అన్న రమణారెడ్డి చాకలి
మంగమ్మని లొంగదీసుకొనే ప్రయత్నంలో కాపురంలో నిప్పులు పోసుకొన్న కథ వూళ్ళో ఇంకా పరిసిపోలేదు. రఘునందనుడు ఆ అన్నకు
తమ్ముడే కాదా? పైగా భార్య పోయింది. ఆయన చూపులలో కేవలం ఆశ్చర్యం, దిగ్భ్రమా మాత్రమే కనబడుతూన్నా అవి తన రూపు
రేఖలకు జోహారులిస్తున్నట్లు కనబడుతూనే వుంది. సత్తెమ్మ మనస్సులోనే చిటచిట లాడింది. తల తిప్పుకొంది. ఆ చిటచిటలో
చరాలున మేడ దిగిపోయేదే. కాని, సుమిత్ర వేసిన ప్రశ్నకూ, ఇచ్చిన సలహాకూ సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా లేచిపోవడం
మర్యాద కాదు. కనక నిలబడింది.

"అడగవమ్మా! అసలు మనిషి వచ్చేడు."

తన అన్నను కూడా హెచ్చరించింది.

"ఆవిడేదో అడుగుతూంది. చెప్పు."

రఘునందనుడు ఆ ప్రశ్న కోసం ఎదురు చూసేడు. కాని సత్తెమ్మ ఏమీ అడగలేదు.

ఈమారు ఆ ప్రశ్న ఏమిటో సుమిత్రే చెప్పింది. ఏం చెప్తావన్నట్లు సత్తెమ్మ ఆతని చూపుల్ని నిర్భయంగా ఎదుర్కొంది.

రఘునందనుడు ఏమీ సమాధానం ఇవ్వలేదు. ఏం ఇవ్వాలో తోచలేదు. తన భూమిని గురించి ఈమెకు సమాధానం ఎందుకివ్వాలి?

ఎందుకివ్వాలో కూడా సుమిత్రే బయటపెట్టింది.

"ఆ భూమి ఎందుకూ కొరగానిది. అందుకే తాతగారు గాలికిపోయే పేలాపిండిలా కృష్ణార్పణం అన్నారు. ఇప్పుడది బాగుపడింది...."

తన తాతగారి పనిని అంత కించపరుస్తూ మాట్లాడ్డం రఘునందనుడికి కష్టం అనిపించింది. అందులో తన చెల్లెలే అంటూంది. అదీ ఈ
పరాయి పడుచు వద్ద. ఆ భూమి సమస్యతో ఆమెకే సంబంధం వుండడంకూడా కొంత చికాకు కలిగించింది. చెల్లెలి వంక రూక్షణంగా చూసేడు.

"తాతగారు చేసిన తప్పు దిద్దుకుందాం."

అతని అభిప్రాయం అర్ధంకాక సుమిత్ర మగని ముఖం చూసింది. బావకు కోపం వచ్చిందని గ్రహించి రాజిరెడ్డి అందుకొన్నాడు.

"పెద్దలు చేసిన పనికి పేర్లు పెట్టడం మంచిది కాదు. కాని, మనం చేసే పనులు ఆ అవహేళనకు కారణం కానీయకూడదు."

అది చెల్లెలిని మందలించడమో, తనను తప్పుపట్టడమో రఘునందనునికి అర్ధం కాలేదు.

"పేరెట్టండి, ధర ఇచ్చేస్తా. కొరగానిదిచ్చినారనే అప్రతిష్ఠ ఎందుకు?"

పరిస్థితుల్ని మరింత పాడు చేశానని సుమిత్ర గతుక్కుమంది. రాజిరెడ్డి కూడా గ్రహించేడు. కాని, ఇంతవరకూ వచ్చాక వెనక్కి
గుంజడం ఏలాగో అర్ధం కాలేదు.

సత్తెమ్మ సమాధానం ఇచ్చింది.

"భూమికి ఖరీదు కడతారు. కాని, దానిని నేడున్న దశకు తేవడంలో చేసిన కష్టానికి ఖరీదు ఏం కడతారు?"

రాజిరెడ్డికి ఆ మాట వినగనే మహాకవి శ్రీశ్రీ గీతం ఒకటి గుర్తు వచ్చింది. సన్నగా ఆలాపించేడు.

పొలాలనన్నీ
హలాలదున్నీ
ఇలాతలంలో హేమంపిండగ
జగానికంతా సౌఖ్యం నిండగ
విరామమెరుగక పరిశ్రమించే
బలం ధరిత్రికి బలిగావించే
కర్షకవీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మజలానికి
ఘర్మజలానికి
ధర్మజలానికి
ఘర్మజలానికి
ఖరీదు లేదోయ్.||

చెల్లెలి మగని మధుర కంఠస్వరంతో మరుగునపడిన అభిమానం ఘర్మజలం ఖరీదుతో మళ్ళీ తల ఎత్తింది....

నెమ్మదిగా లేచి వెళ్ళిపోయేడు.



తొమ్మిదో ప్రకరణం


రంగయ్య నల్లగొండ చేరే సరికే బాగా రాత్రి అయింది. బస్సు దిగేడు. పరిచితములైన వీధులే పరధ్యానంలో అపరిచితంగా తోస్తూంటే,
అలవాటయిన కాళ్ళు వాటంతటవే అత్తవారింటికి చేర్చేయి. ఆ వేళకప్పుడే అంతా భోజనాలు చేసేసి, వాకిట్లో మంచాలమీద కబుర్లు
చెప్పుకొంటున్నారు.

అల్లుణ్ణి ఆ వేళప్పుడు ఆ ఆకారంలో చూసి మాణిక్యమ్మ కంగారు పడింది. వచ్చింది అతడొక్కడేనని తెలుసుకొన్నాక ఆలోచనలో
పడింది. ముఖం, మాటలూ చూసేక ఏదో విశేషం వుందనుకొంది. మనస్సులో ఎంత ఆదుర్దా వున్నా చంపుకొని ఆతిథ్యం ఇచ్చింది. కోడలికి
వంట పురమాయించి, చిన్న కూతుర్ని బావగారికి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు తెమ్మని పురమాయించింది. చిన్న బావమరిది మంచం దిగి
కూర్చోడానికి చోటు యిచ్చేడు.

ఇంటిల్లిపాదీ తన కోసం చూపుతున్న శ్రద్ధాసక్తుల్ని చూసే సరికే రంగయ్య మనస్సు ఊరటపడింది.

మాణిక్యమ్మ కొడుకు చేతికి విసనకర్ర యిస్తూ ఉమ్మడిగా కుశల ప్రశ్న వేసింది.

"అంతా మంచేనా?"

కాళ్ళు చేతులు కడుక్కుని, ఇన్ని మంచినీళ్ళు త్రాగి సేద తీరేక పేరు పేరు వరసన క్షేమం తెలుసుకొంది.

"వదినగారు తిరుగుతున్నారా? కోడలు పిల్ల ఏం చేస్తూంది? సూరమ్మ బాగుందా? దాన్ని కూడా ఓ మారు తోలుకు రాకపోయావా,
పోనీ...."

అందరూ బాగున్నారు. మరి అనుకోకుండా, ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చినట్లు? ముఖంలో కనిపిస్తున్న నలుగుడు ప్రయాణపు బడలిక
లాగలేదు. మనస్సులో వ్యధ ఏమిటో? భార్యా భర్తల మధ్య మాట పట్టింపులు రాలేదు గదా యనుకొంది. ఒక్కక్షణం నాలుక
చివరికంటా వచ్చిన ప్రశ్ననే మార్చింది.

ఆమె అడగదలచిన ప్రశ్నల్ని రంగయ్య ఆమె ముఖంలో చదివేడు. క్షీణ స్వరంతో ఆ అడగని ప్రశ్నలకి సమాధానం ఇచ్చేడు.
కాని అది సమాధానం కాదు. ఎదురు ప్రశ్న.

కంఠస్వరంలోనే మాణిక్యమ్మ ఆతని నిస్సత్తువనూ, ఆదుర్దానూ గ్రహించింది. మామగారు వూళ్ళో లేరంటే తెల్లబోయాడు. పట్నం
వెళ్ళేరంటే గుడ్లు మిటకరించేడు. బస్సుకి రావలసిందేనన్న మాట విని తేరుకొన్నాడు. బస్సు వేళ మిగిలిపోలేదాయని పదిమాట్లు
ప్రశ్నించేడు.

మామగారి కోసం ఆతడు చూపుతున్న ఆదుర్దాను గ్రహించి ఆయన తప్పకుండా ఆ రోజునే వచ్చి తీరుతారని మాణిక్యమ్మ ధైర్యం
చెప్పింది. ఆఖరు బస్సు కూడా వచ్చే వేళ మిగిలిందని వంటింట్లో గిన్నెలు సహా సర్దేసిన సంగతిని తానూ మరచింది.

ఎంత రాత్రి అయినా మామగారు వస్తారనే మాట విని రంగయ్య తృప్తిపడ్డాడు. పనికుర్రవాడొచ్చి జాలార్లో నీళ్ళు పెట్టేనన్నాడు.
వేణ్ణీళ్ళతో స్నానం. కమ్మని గేదె పెరుగుతో భోజనం. ప్రాణము కుదుటపడింది. సామాను లేని ఖాళీ పడవ సాధారణ కెరటాల్లో కూడా
వూగులాడిపోతుంది. పూటు వేసిన పడవ తుఫానులో కూడా హంస గమనం సాగిస్తుంది. మనుష్యుడు కూడా అంతే. నిండు కడుపుమీద ఆవేశాలు
అల్లరి చేయవు. కడుపు నిండేక, ప్రశాంతంగా వున్న మనుష్యుల మధ్య కూర్చున్నాకా రంగయ్యకు అంతవరకూ తాను పడిన ఆవేదన
అనవసరమేమోనని కూడా అనిపించింది.

సావకాశంగా కూర్చున్నా మరల యోగక్షేమాలు, ఈమారు వివరాలతో కనుక్కొన్నారు. చిన్న బావమరిది యిచ్చిన వక్కాకు నములుతూ
రంగయ్య తాను వచ్చిన కారణం బయట పెట్టేడు.

నలుగురూ శివరామిరెడ్డికి భషట్కారాలు తగిలిస్తూంటే ఆతని మనస్సు తేలికపడింది.

తన వూళ్ళో శ్రోతలకీ, వీళ్ళకీ తేడా వుంది. వారంతా తాను పడుతున్న వ్యధననేకమార్లు అనుభవించిన వాళ్ళే. అనుభవించడమే
తప్ప మరో దారి లేదని కుంగిపోయిన వాళ్ళే. వాళ్ళది సహానుభూతి. చనిపోయినవాని గుణ గణాలు తలుచుకొని, శక్తి సామర్ధ్యాలు
జ్ఞాపకం చేసుకొని, వాని మీద పెట్టుకొన్న ఆశలు చెప్పుకొని ఏడ్చినట్లే వుంటుంది వాళ్ళ ఓదార్పు. అవి సాంత్వనం కలిగించలేవు.
తగిలిన గాయాన్ని రేపుతుంటాయి గాని.

కాని, వీళ్ళది ప్రేమతో కూడిన పరాయితనం. తన బాధలో వాళ్ళకి భాగం లేదు. తన కష్టం చూస్తే జాలి మాత్రమే. తన మీద
ప్రేమ మాత్రమే. శివరామిరెడ్డి తమ వూళ్ళోవాళ్లకిలాగ వీళ్ళకి దొర కాడు. ఆయన మీద తమరందరికీ వున్న భయమూ లేదు.
భక్తీ లేదు. కనక రంగయ్య మీది ప్రేమాభిమానాలు శివరామిరెడ్డి మీద అసహ్యం రూపంలో బయటపడడానికి భయము, భక్తీ,
వేదాంతమూ అవేవీ అడ్డం రాలేదు. విన్నవారు ప్రతి ఒక్కరి కంఠంలో ఆశ్చర్యం, అసహ్యం, క్రోధం మేళవించేయి.

"వాడి దరిద్రం మండిపోనూ."

"ఉన్నవాడికి ఉన్నంతా దరిద్రం."

"వాళ్ళ భూమి నీకెందుకయ్యా అని గడ్డెట్టేవాళ్ళే లేరా మీ వూళ్లో."

బంధుకోటి అంతా చేరి ఆశ్చర్యార్థకాలూ, అభిమాన వాచికాలూ, అభినందన వాక్యాలూ పలికి హెచ్చరిస్తూంటే, రంగయ్య దుఃఖం మరిచి
కుటుంబ గాథను సగర్వంగా చెప్పుకొని పోతున్నాడు. బహుశా తన కుటుంబీకుల దారిద్ర్యం, పామరత్వం, మోటుతనం గురించి మరొకప్పుడైతే
అంత గర్వంగా చెప్పేవాడే కాదేమో.

"ఆ మిట్టపల్లాల చెక్క ఖరీదు ఎంతని కాదు. బహుశా దానిలో చేసిన చాకిరీకి కూలి కడితే ఆ డబ్బుతో ఏ చెరువుక్రిందనో
పదెకరాల భూమి వచ్చి వుండేది. చాకిరీ ఒక్కటేనా? ఎంత పెట్టుబడి పెట్టేరు. దానిలో రూపాయికి అణాయేనా వచ్చిందా అంటే
అనుమానమే. అసలు విషయం అది కానేకాదు. మా కుటుంబం వాళ్ళ కష్టానికీ, ఓర్పుకూ అది చిహ్నం. అందులో మా రక్తం పొదిపాం.
ప్రాణాలు ఎదచల్లేం. మా కుటుంబంలో భాగం అది. దానిని ఇవ్వాలనడం, మా కుటుంబంలోని ఆడవాళ్ళని ఇవ్వాలనడం కన్న తక్కువేం
కాదు.

ఆ బోళ్ళపొలం విషయంలో రంగయ్య అంత అభిమానాన్ని ఎన్నడూ ప్రకటించి వుండలేదు. అనేకమాట్లు దాని మీద చేసే ఖర్చు బూడిదలో
పన్నీరు పొయ్యడమేనని అక్కగారి వద్దా అన్నాడు.

బహుశా ఆ భూమి తన కుటుంబపు దారిద్ర్యానికి చిహ్నంగా భావించేడేమో కూడా. ఈ రెండు మూడు నెలల నుంచీ గ్రామంలో వున్నాడు. పొలం
పనులు బోలెడు వచ్చేయి. ఇంట్లో వచ్చిన గొడవల్లో సత్తెమ్మ వేనికీ కలగచేసుకోవడం లేదు. తాను వూళ్ళోనే వున్నా ఎప్పుడో
ఓమారు షికారుగా వెళ్ళిరావడం తప్ప పొలం పనులన్నీ సరయ్యమీదనే వదిలేసేడు. అన్నింటికీ కూలీల్నే పెట్టవలసి రావడంతో ఖర్చు
బాగా తగులుతూంది. ఖర్చులకి చేతిలోంచి డబ్బు వదలడంతో ఆదాయాలు లెక్క చూడ్డం మొదలు పెట్టేడు. జమాఖర్చులు బేరీజు వేసుకొని
వ్యవసాయం కిట్టుబాటు కాదని తేల్చుకొన్నాడు. ఎవరికన్నా కౌలుకిచ్చేయ్యాలనే కోరికను కూడా వెలిబుచ్చేడు. అదంతా ఆతనికిప్పుడు
గుర్తు రానేలేదు.

వ్యవసాయం కిట్టుబాటు కాదనీ, ఉన్న భూమిని అమ్మేసి పట్నంలోకి చేరుకోమనీ బంధువులు చాల మార్లు ఆతనికి సలహా యిచ్చేరు.
అయితే ఆ పల్లెటూళ్ళో మెరక భూమికి వచ్చే ధర శూన్యం. దానిమీద వచ్చే సొమ్ము దేనికీ చాలదు. అందుచేత ఆదాయం వచ్చినా
రాకపోయినా, తనకూ కొంత భూమి అనేది వుందంటే సంఘంలో తనకు నిలకడన్నా వుంటుంది. ఆ వుద్దేశంతోనే ఆతడు అమ్మడం గురించి
ఎక్కువ శ్రద్ధా తీసుకోలేదు. ఆ వివరాలన్నీ ఎరిగున్న వాళ్ళకి కూడా ఆతని మాటలకు నవ్వు రాలేదు.

ఆ ఆవేశంలో ఆతడు తనకున్న పట్టుదల తీవ్రతను కూడా ప్రకటించేడు.

"ఆయనకు మన సంగతి ఇంకా బోధపడలేదు. మేము వోడ్చిన చెమటా రక్తం కక్కిస్తా గాని వూరికే వొదులుతామా?"

ఈమారు మాణిక్యమ్మ నవ్వుకుంది. ఘర్షణ వస్తుందంటే వూళ్ళోంచి కూడా వెళ్ళిపోయే రకం మనిషి. తనకి నష్టం వచ్చినా వొరగదోసుకు
పోతాడు. ఆలాంటివాడు తొడలు చరిచి హుంకారం చేస్తూంటే ఎవరికేనా నవ్వు వస్తుంది. కాని నవ్వడానికి సమయం కాదు. ఉచితమూ కాదు.
అల్లుడాయె. మాణిక్యమ్మ ఆతని మాటలకు భయం ప్రకటించి అనునయించింది.

"తొందరపడకు. మీ మామగారు వస్తారు. ఆయన చెప్తారుగా, ఏమీ కంగారు అక్కరలేదు."

భయం లేదని పైకి చెప్పినా ఇల్లాంటి విషయాలలో భర్త చెయ్యగలదేమీ వుండదని ఆమెకు తెలుసు. తన ముప్ఫయ్యేళ్ళ కాపురంలోనూ
ధనవంతుల శక్తి సామర్థ్యాలను గురించి ఆమె చాలమాట్లు వింది. సంస్థానంలో చదువు, ఆస్తులు, వుద్యోగాలు కొద్దిమంది యిళ్ళకు
మాత్రమే పరిమితం. వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పు తెప్పించడం, దానిని అమలు జరిపించడం ఇంచుమించు అసంభవం. దొరలు భూములు
లాక్కొని తరిమేస్తే వచ్చి రైతులు తన భర్తతో కష్టాలు చెప్పుకొని సలహా అడగడం ఆమె వింది. ఒకమారు వచ్చినవాడు-ఈ లోకం
మీద విసువుపుట్టి సెలవు పుచ్చుకొంటే తప్ప ఎన్ని ఏళ్ళు గడచినా మళ్ళీ మళ్ళీ వస్తూనే వుంటాడని ఆమె ఎరుగును. కనక ఇంక
అల్లుడు భూమి ఆశ వొదులుకోవలసిందేననే నిశ్చయం చేసుకొంది. ఏదో ఉత్పాతం వస్తే తప్ప లాభం లేదు...

మళ్ళీ ఓ మారు శివరామిరెడ్డిని తిట్టింది. అల్లుడికి ధైర్యం చెప్పింది.

* * * * *

వకీలు గోపాలరావు అల్లుడి కథ విని ఆశా చూపలేదు. ఆవేశపడనూ లేదు. శివరామిరెడ్డిని తిట్టనూలేదు. వకీలుగా ఆయన
ఇల్లాంటి కేసులెన్నో చూసేడు. అందుచేత సరాసరి వ్యవహార పరిశీలనకే పూనుకొన్నాడు.

"భూమి పట్టా అయిందా?"

"పన్ను రశీదులున్నాయా?"

"కబ్జా మీదే అనడానికి కాగితం మీద ఆధారాలేమన్నా వున్నాయా?"

చదివింది వకాలతే అయినా తన ఇంటి వ్యవహారాలకి సంబంధించిన ప్రాథమిక విషయాలను కూడా తాను ఎన్నడూ తెలుసుకోలేదని అప్పుడే
మొట్ట మొదటి పర్యాయం రంగయ్యకు అర్ధం అయింది. ఆ మాట చెప్తూ తల వంచుకున్నాడు. గోపాలరావు అల్లుడు వేపు జాలిగా చూసేడు.
ఇంత తెలివయిన వాడివి వకాలతు ఏం చేస్తావనా? రంగయ్య సిగ్గుపడ్డాడు. వ్యవహార విషయంలో తన అజ్ఞానాన్ని
కప్పిపుచ్చుకొనేటందుకై న్యాయం, ధర్మం ప్రకారం ఆ భూమి తనదేనని ఒత్తి ఒత్తి చెప్పేడు. ఏభయ్యేళ్ళపై నుంచి ఆ భూమి తన
కుటుంబం కబ్జాలోనే వుంది. పన్ను ఇవ్వలేదనే తగాదా ఎప్పుడూ వచ్చిన గుర్తులేదు. అందుచేత ఆ విషయం సరిగ్గానే వుండి వుంటుందని
ఆతని నమ్మకం.

కాని, గోపాలరావుకు ఆ నమ్మకం లేదు. డబ్బు ఇచ్చేస్తారు. భూమిని కొనుక్కొంటారు. కాని, భూమిని తమ పేర పట్టాలు చేయించుకొనే
శ్రద్ధ చాలామందికి వుండదు. రిజిస్ట్రారు ఆఫీసు వాళ్ళపాలిటికి ఓ మొసలి. ఆ ప్రాంతాలకు వెళ్ళడానిక్కూడా వాళ్ళకి భయం!

ఆ భూమిని అమ్మినది ఏ దొరలో, పెద్దరెడ్లో అయితే ఇంక రిజిస్ట్రేషన్ అయ్యే ఆశే వుండదు. కుటుంబ ప్రతిష్ఠలు, మనిషి
నమ్మకాలు అవసరం పనులు అనేకం అడ్డం వస్తుంటాయి. భూమి తాను చేసుకొంటున్నాడు. పన్నులు తానే చెల్లించుకొంటున్నాడు. అదే రైతు
భరోసా, పట్వారీ రశీదు ఇవ్వకపోయినా పట్టించుకోడు. పన్ను ఎంత ఇవ్వాలో, ఎంత ఇస్తున్నాడో అర్థంకాదు. తనకు భూమి అంటూ
వున్నదే గొప్ప. ఒకవేళ పన్ను ఎక్కువ వసూలు చేస్తున్నట్లు అనుమానం తగిలి అడిగినా పట్వారీ చెప్పడు. ఆయేడు సర్కారు
రకం ఎక్కువ చేసిందంటాడు. జాయింటు పట్టాలో సరిగ్గా లెక్క చూడకపోవడంచేత తక్కువ వసూలు చేశాననీ, ఇప్పుడు సరిచేసేశాననీ
అంటాడు. ఇంకా ఎక్కువ వసూలు చెయ్యనందుకూ, గతం ముదరా రాబట్టనందుకూ సంతోషించమంటాడు. మామూలు మాట జ్ఞాపకం చెయ్యాలా యని
గదుముతాడు. ఏదో కాగితం మీద రశీదు ఇస్తాడు. అది రశీదో, చిత్తుకాగితమో రైతు ఎరగడు. పన్నెంత ఇచ్చినట్లు వ్రాసేడో,
సంతకం ఎవరిది పెట్టేడో అతనికి తెలియదు. అసలా చీటీ యిచ్చిందే గొప్ప. దాన్ని పదే పదార్ధంగా మూటకట్టి ఏ చూరులోనో
దోపుతాడు. ఆ యిళ్ళు ఓ యిళ్ళా? ఆ యిళ్ళల్లో ఓ పెట్టీ, బేడానా? ఎప్పుడో ఏ యిల్లో తగలబడినప్పుడు ఏళ్ళ తరబడి
దాచిన ఆ కాగితాలన్నీ బూడిద అయి వూరుకుంటాయి. ఇంక మిగిలేదల్లా భూమి మీది కబ్జా మాత్రమే. దంపినమ్మది బొక్కిందే కూలి.
పేచీ రాకుండా వుంటే ఆ భూమి అతడిదే. అన్నప్పుడూ పేచీలు రావు. నిజమే కాని పేచీకి అవకాశం వుండనే వుంది. లేకపోయినా వాటిని
సృష్టించే మార్గాలు వెయ్యి. వెయ్యిన్నొకటోది కూడా వాళ్ళు కనిపెట్టగలరు.

భార్య పంపిన టీ కప్పుల ముందు గోపాలరావు తన అనుభవంలోని కేసుల్ని గురించి చెప్పుకొనిపోతున్నాడు.

వానిలో ఒకటి మరీ అన్యాయంగా కనబడింది.

వాళ్ళంతా గౌండ్లు, అయిదారు కుటుంబాల వాళ్ళు అన్నదమ్ములు, కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు ఓ నలభయి ఏభయిమంది
ఉన్నారు. పెద్ద కుటుంబం. చెలకభూమి డెబ్భయి ఎనభయ్యెకరాలుంది. దానిలోనే ఓ కుంట. కుంట క్రింద ఓ పదెకరాలు మాగాణవుతూంది.
మిగిలినదంతా ఈదుల వనం. ఆ పంట తింటూ ఈదులు గీసుకుంటూ, ఆ భూమిలో చాకిరీ చేసుకొంటూ వాళ్ళు రోజులు గడిపేస్తున్నారు. భూస్వామి
వెంకయ్య కూడా తెలివిగానే పన్నాగం పన్నేడు. అతడు తమ భూమి మీద కన్నేసేడని వాళ్ళెరగనే ఎరగరు. ఆ వూళ్ళో కోఆపరేటివ్
బ్యాంకుంది. దానికి వెంకయ్యే సదరు.

ఎప్పుడో పదేళ్ళక్రితం పిల్లదాని పెళ్ళికో మరో కార్యం కరామత్తుకో బ్యాంకులో గౌండ్లు ఓ మూడువందలు అప్పు తీసుకొన్నారు.
రెండేళ్ళు గడిచింది. మంచి డబ్బు నిక్కచ్చి రోజుల్లో వెంకయ్య నొక్కేడు. వాళ్ళు డబ్బుకి గిజగిజలాడుతున్నప్పుడు పొలం
అమ్మమన్నాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంక నేర్పుగా జాయింటు కుటుంబంలోని అన్నదమ్ముని వితంతు భార్యకు ఓ వంద యిచ్చి భూమి
తనకు అమ్మేసినట్లు వ్రాయించుకొన్నాడు.

ఇటువంటి ఘటనల్ని రంగయ్య ఎన్నో విన్నాడు. అయినా ఆశ్చర్యం ప్రకటించకుండా వుండలేకపోయేడు.

"చెల్లుతుందా?"

"వెంకయ్యకు కావలసింది పేచీకి ఆధారం. చెల్లుతుందో చెల్లదో తేల్చవలసింది కోర్టులు."

కోఆపరేటివు బ్యాంక్ అప్పు మూడువందలో, నాలుగువందలో తీర్చలేకుండా వున్నవాళ్ళు కోర్టు ఖర్చులు భరించగలరా? అదే ఆశ
వెంకయ్యది. వూళ్ళో పట్వారీ జగన్నాధరావు అడ్డం వచ్చి వుండకపోతే ఆ ఆశ అప్పుడే ఫలించేది. పట్వారీకీ వెంకయ్యకూ పడదు.
పైగా పంచాయతీ అంటూ లేకపోతే తనకు మాత్రం డబ్బు ఎవడిస్తాడు? కనక గౌండ్లను ప్రోత్సహించేడు. కోర్టుకు తెచ్చేడు.

గోపాలరావే ఆ కేసు నడిపించేడు.

" ఏమయింది?"

అది అల్లుడి ప్రశ్న. కోర్టులో న్యాయమే జరిగి వుంటుందనే మామగారియందు గల నమ్మకముతో అతడు గౌండ్లు విజయం పొందే వుంటారని
తలచేడు. కాని గోపాలరావు సమాధానంతో కళ్ళింత చేసి ఆశ్చర్యం కురిపించేడు.

మామూలుగా అవుతూన్నదే ఇక్కడా అయింది. కోర్టుల పడ్డాక వ్యవహారం ఓ పట్టాన తేలుతుందా? వెంకయ్య కాలిది తీస్తే మెడకీ,
మెడది తీస్తే కాలికీ లంకెలు వేస్తున్నాడు. కాలం గడిపి, ఆయాసపెడితే గౌండ్లు లొంగి వస్తారని ఆతని ఆశ. కేసు మరో రెండేళ్ళు
సాగిందల్లా లాభం జగన్నాధరావుకి. ఉభయులకీ కావలసింది కేసు తేలకపోవడమే. అంతే. తేలలేదు. నాలుగైదేళ్ళపాటు గౌండ్ల వాళ్ళ
కుటుంబం అంతా వాళ్ళ వూరుకీ, నల్లగొండకీ మధ్య రోడ్డు మీదనే బ్రతికేరు. హఠాత్తుగా ఓ రోజున జగన్నాధరావు రంగం నుంచి
నిష్క్రమించేడు.

రంగయ్య విచారం ప్రకటించేడు.

"చచ్చిపోయేడా?"

తన కవితా ధోరణి కల్పించిన అర్థానికి గోపాలరావు పకపక నవ్వేడు.

"కొంచం ఇంచుమించు అల్లాంటిదే. లంచం మేసి తిరిగిపోయేడు."

జగన్నాధరావుకి గౌండ్ల మీద అభిమానమా యేమన్నానా? పైరవీ నడిపితే పైసా ముడుతుంది. నడిపేడు. చిక్కినంత చిక్కించుకొన్నాడు.
నాలుగేళ్ళ తంటాలు పడ్డా దొరకనంత డబ్బు వెంకయ్య ఇస్తానంటూంటే ఇంకేం?

"ఏమిచ్చేడు?"

అదో అనవసరపు ప్రశ్న. డబ్బుగలవాడు ఏమిచ్చినా ఇస్తాడు. ఇంత బలగం వున్న వాళ్ళే నెగ్గలేకపోయారనిపించేస్తే తనకి
మళ్ళీ వూళ్ళో ఎదురుంటుందా? ఆ ఆలోచనతో జగన్నాధరావు కళ్ళు జిగేల్‌మనిపించేడు.

ఏర్కోలు ఎడ్ల జత. ఏడెనిమిది వందలకు తక్కువుండదు. దొడ్లో వున్న నలభయ్యేభయి జతల్లోంచి ఏరుకోమన్నాడు.

మంచి, కొత్త కచ్చడం బండి. రోజూ ఏడెనిమిది శేర్లు పాలిచ్చే గౌడుగేదె. వాళ్ళింట్లో మంచి చారగేదె వుండేదట. దాని కూతురది.
మలిచూలు పడ్డ. మంచి తరి అవుతుంది.

ఇవి గాక మరో అయిదు వందలు కరుకులు మూటగట్టి యిచ్చేడు.

అంతా చేరుస్తే రెండు, రెండున్నర వేల సొత్తు. ఇంక చచ్చిపోయేడంటే ఆశ్చర్యం ఏం వుంది?

గోపాలరావు మళ్ళీ పకపక నవ్వేడు. రంగయ్యకు నవ్వు రాలేదు. జగన్నాధరావు చేసిన మోసం గురించి ఆలోచిస్తున్నాడో,
గౌండ్లవాళ్ళ దుస్థితికి విచారిస్తున్నాడో.

గౌండ్లు నిరుత్సాహ పడి కేసు వదిలేసుకొన్నారు. కోర్టు తీర్పులతో నిమిత్తం లేకుండా వెంకయ్య విజయం పొందేడు.

రంగయ్య ఒక్క నిట్టూర్పు విడిచేడు. గౌండ్లకన్న ఎంత ఎక్కువ కాలం నిలబడగలనో అని ఆలోచిస్తున్నాడు.

గోపాలరావు అల్లుని ఆలోచనలు పసికట్టినట్లుగా సమాధానం ఇచ్చేడు.

"కేసు నడుపుదాం. ముప్పు తిప్పలూ పెట్టి మూడు చెరువులు తాగిద్దాం. కాని, నీ భూమి నీకు దక్కుతుందనే ధైర్యం మాత్రం లేదు.
కోర్టులూ, చట్టాలూ నీకు రక్షణ యివ్వలేవు. కాని, ఒక పని చేయవచ్చు.

సంగారెడ్డిని కలుద్దాం. ఆయనకిదో కేసు కాదు. అయినా సలహా చెప్పగలుగుతాడు.

సంగారెడ్డికి ఇదో కేసు కాదు. ఆయన దీనిని పట్టుకోడు. రంగయ్యకు ఆ సంగతి బాగా తెలుసు. జాగీర్దార్లూ, ఇనాందార్లూ
చనిపోయినప్పుడు సనదులు నిజాంకు తిరిగిపోతాయి. వానిని వారసులకిప్పించేటందుకు పైరవీలు నడపడంలో సంగారెడ్డి మొనగాడు. మంచి
కీలక స్థానాల్లో ఆయన మనుష్యులున్నారు. ప్రస్తుతం హైకోర్టు చీఫ్ జడ్జిగా వున్నాయన బారెట్లా ప్యాసయి కొత్తగా బారుకి
వచ్చినప్పుడు కేసులిప్పించి పైకి లాగేడు. అడ్వొకేట్ జనరల్‌గా వున్న వ్యక్తి చదువుకుంటున్న రోజుల్లో వాళ్ళింట
వుండి, ఆయన పుస్తకాలనే వుపయోగించుకొన్నాడు. ఈ పరిచయాలన్నీ నేడాయనకుపయోగపడుతున్నాయి. వారసులకి సనదులిప్పించినందుకు
ఫీజుగా ఆస్తిలో వాటా. ఆలాగ ఆయన సంస్థానంలోని అన్ని జిల్లాల్లోనూ బోలెడంత ఆస్తి సంపాదించేడు. ఆయనకి ఈ బోళ్ళపొలం పేచీ
ఒక కేసా?

కాని, శివరామిరెడ్డి మాటల్లో సంగారెడ్డిమీద ఎంతో ఆప్యాయం, భక్తీ కనబరిచేడు. అదేమన్నా వుపయోగపడుతుందేమో?

రంగయ్య ఆశ కొత్త చిగుళ్ళు పెట్టింది.



పదో ప్రకరణం


సంగారెడ్డి వారు చెప్పినవన్నీ శ్రద్ధగా విన్నాడు. అన్నీ విని దేశాన్ని బాధిస్తున్న ప్రధానమైన పీడను ప్రస్తావించేడు.

"బాధ్యతాయుత ప్రభుత్వం లేని లోపం మనకి అడుగడుగునా కనిపిస్తూంది."

బాధ్యతాయుత ప్రభుత్వం లేని లోపం పరిపాలనా విధానంలో ఏవిధంగా ప్రతిబింబిస్తూందో, ఆ లోపం దేశంలో ఇంకా పాతుకుపోయి వుండడానికి
కారణం ఎవరో, ఏం చెయ్యాలో సుదీర్ఘంగా వుపన్యసించేడు.

"ప్రజాతంత్ర ప్రభుత్వం ఏర్పడితే తన ఏకచ్ఛత్రాధిపత్యం చెల్లదని నిజాం ప్రభువు ఆలోచన. యూనియనులో చేరితే తన
పెత్తనం పోతుందని భయం. ప్రజాప్రతినిధులనీ, రాజ్యాంగ చట్టం అనీ ముక్కుత్రాళ్ళు బిగుస్తాయని ఆలాహజరత్ అనుమానం. నిజాము
తొలక్కపొతేమానె, ఆయన రెక్కలు కత్తిరించాలి..."

నిజాము పెత్తనం పోవాలనేవాడు గోపాలరావు. తాను వచ్చిన పని మరిచి నిజాము వుండాలో, అక్కర్లేదో తేల్చుకోడానికి సన్నద్ధం
అయ్యేడు.

నిజామును వుంచాలనడం ఒక ఎత్తుగడ మాత్రమేనంటాడు సంగారెడ్డి.

ఎత్తుగడ పేరుతో నిజామును అట్టే వుంచాలనడం ప్రజల వుద్యమాన్ని అవమానించడం అంటాడు గోపాలరావు.

"నిజాము ముస్లిం గనక, ఆయన్ని తీసెయ్యాలంటే హిందూముస్లిం ఘర్షణగా చిత్రిస్తారు..." అంటాడు సంగారెడ్డి.

అంజుమన్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ముస్లిం రాజ్య పరిరక్షణ పేరుతో రజాకార్లని తరిఫీదు చేస్తూంది. కాస్త నోరున్నవాడల్లా
పదిమందిని పోగుచేసుకొని ఊళ్ళ మీద పడి అల్లరి చేయడం సాగిస్తున్నాడు. వారి నోరు నొక్కడానికి నిజాము విషయం ఇప్పట్లో
వదిలెయ్యడం ఓ ఎత్తుగడ సంగారెడ్డి దృష్టిలో. ప్రజాతంత్ర ప్రభుత్వం ఏర్పడితే నిజాము ఉత్సవ విగ్రహంలా ఉంటాడు,
సంవత్సరానికోమాటు బూజు దులిపి, తోమి, ఊరేగించినట్లు శాసనసభకి తీసుకురావచ్చు. ప్రజలు ఎన్నుకొన్న వాళ్ళు చట్టాలు
చేస్తారు. ఆయన సంతకం పెడతాడు.

కాని గోపాలరావు అదంతా కాంగ్రెసు సిద్ధాంతాలకి తిలోదకాలనివ్వడమేనంటాడు. ప్రజలకి ఒకటి చెప్పి, మరొకటి చేస్తే ద్రోహం
అన్నాడు.

నిజాము జాగీర్దారీ విధానానికి ప్రతినిధి. ఆ విధానం క్రింద నలిగిపోతూన్న ప్రజ ఆ విధానంతో పాటు నిజామూ పోవాలంటున్నారు.
నిజామును తరిమెయ్యాలన్నప్పుడే వుద్యమానికి ప్రజల సహాయం వుంటుంది.

పైగా నల్లగొండ, వరంగలు జిల్లాల ప్రజలు పది నెలలనుంచి నిజం ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాటాలు సాగిస్తున్నారు. ఎన్ని
ఇబ్బందులు పెట్టినా, నిర్బంధాలు తెచ్చినా లొంగడం లేదు. ఈ స్థితిలో నిజామును వుంచుతామనడం ఓ ఎత్తుగడే కాదు. ప్రజల
పక్కన నిలబడి, నిజామును గద్దె దించేటందుకు వారితో పాటు పోరాడడమే ఇప్పుడు చేయవలసిన పని.

సంగారెడ్డి గోపాలరావును హేళన చేసేడు.

కమ్యూనిస్టుల "ప్రజాశక్తి" సరిగ్గా ఇదే పద్ధతిలో వ్రాస్తుందన్నాడు.

గోపాలరావు అభ్యంతరం చెప్పలేదు.

పైగా కాస్త ఆలోచించేవాళ్ళంతా అదే నిర్ణయానికి రావలసి వుంటుందన్నాడు.

సంగారెడ్డికి చుర్రుమంది. తనకి ఆలోచన లేదనా దాని వుద్దేశం?

"బాధ్యత పట్టించుకొనేవాళ్ళ ఆలోచనలు ఒడిదుడుకుల్లో పడవు."

ప్రజల్ని పోలీసుల మీదా, ప్రభుత్వం మీదా తిరుగుబాటుకి ప్రోత్సహించడం చేతనే నిర్బంధ విధానం సాగించడానికి నిజాముకు సాకు
దొరికిందని సంగారెడ్డి అభిప్రాయం.

"ప్రభుత్వం ఏలాంటిదే గాని, తన మీద తిరుగుబాటు వస్తే చూసి చూసి వూరుకోదు. వూరుకోమనడం మన తప్పు. ఈవేళ ఆ ప్రభువు
మీద తిరగబడ్డవాళ్ళు రేపు మన మీద తిరగబడరా?"

తన అభిప్రాయాలకి కాంగ్రెసు అగ్రనాయకుల ఆలోచనలు సరిపడుతున్నాయని కూడా చెప్పుకోకుండా వుండలేకపోయేడు. తాను సర్దార్
పటేల్‌ను కలుసుకొన్నప్పుడు ఆయన కూడా అదే చెప్పాడన్నాడు.

"సర్దార్ పటేల్ సంస్థానాల ఆంతరంగిక వ్యవహారాల్లో కలగచేసుకోమని కూడా హామీ యిస్తున్నాడు. కాశ్మీర్, తిరువాన్కూర్,
హైద్రాబాద్‌ల విషయంలో మరో అడుగు ముందుకు వేయడానిక్కూడా సిద్ధంగా వున్నాడు. విదేశ వ్యవహారాలూ, రక్షణలాంటి
ప్రధాన సమస్యల్ని యూనియన్‌కు వదలాలనే విషయంలో కూడా పట్టుపట్టనన్నాడు."

"సంస్థానాల వ్యవహారాలలో కలగచేసుకోము అంటే రోజూ మన కళ్ళ ముందు జరుగుతున్నవన్నీ చూసినా మాట్లాడము అనేగా?"

సంగారెడ్డి తన ఆవేశంలో చాలా దూరం పోయేననుకొని సర్దుకోడానికి ప్రయత్నించేడు.

"యూనియన్‌లో కలియాలనేదొక్కటే సర్దార్ పట్టు. ఒకమారు యూనియన్‌లో చేరేక నిజాము ఎక్కడికి పోతాడు?"

కాని గోపాలరావు ఆవిధంగా సంతృప్తి పడలేడు. యూనియన్‌లో చేరడం వలన నిజాం పరిపాలనలో మంచి మార్పులు కలిగే
అవకాశం కన్న, వీరి స్నేహంతో యూనియన్‌లో కూడా పరిపాలనా పద్ధతులు చెడడానికి అవకాశం వుంటుందంటాడు.
ఇక్కడిదిక్కడే ఇప్పుడున్నట్లే వదిలేసి, నిజాముతో స్నేహం చేస్తాననడం ఆ దౌర్జన్యాలని సమర్థించడమేగా?

చర్చలు అసలు విషయాన్ని వదిలి చాల దూరం పోయేయి. కాంగ్రెసులోని వేరువేరు ముఠాల మూల సిద్ధాంతాల చర్చలో పడింది. రెండు
ముఠాల వారూ తిట్టుకొనే తిట్లు కూడా సూచనప్రాయంగా విసురుకొన్నారు.

వ్యవహారం ముదురుతూంది కూడా. రంగయ్య తను వచ్చిన వ్యవహారం మూలపడిందని కంగారుపడ్డాడు, అసలు సమస్యను గుర్తుతెచ్చేడు.

సంగారెడ్డి గంభీరంగా సమాధానం ఇచ్చేడు.

"ఇటువంటి దురన్యాయాలకి మూలం తుంచెయ్యడం కోసమే మరో పదిరోజుల్లో సత్యాగ్రహం చేయాలని నిశ్చయించుకొన్నాం."

రంగయ్య ప్రశ్నల ధోరణికి వెనకనున్న అభిప్రాయాన్ని గోపాలరావు గుర్తించేడు. వ్యవహారంమీద వచ్చి రాజకీయపు చర్చల
తగాదాల్లో వురికినందుకు విచారపడ్డాడు. సంగారెడ్డి వాక్యాలకు సమాధానం నాలుక చివరివరకూ వచ్చినా దిగమింగేడు.

రంగయ్యే ఈమారు రాజకీయ చర్చను ఎత్తుకొన్నాడు.

"అయితే జమీందారీ విధానం పోవాలనీ, రైతులకు భూములివ్వాలనీ పట్టుబడితే ఈ వుద్యమానికి దొరలంతా ఎదురుతిరగరా?"

సంగారెడ్డికి ఆ ప్రశ్నలో వున్న మెలిక చటుక్కున స్ఫురించలేదు, వెంటనే అనేసేడు.

"చిన్నవాడివైనా బుద్ధిమంతుడివి. మీ మామకీ వాళ్ళకీ చెప్పు ఆ మాట. మాట్లాడితే జమీందారీ విధానం రద్దు చేస్తామంటూ ఆలంగడా
వెనక తాళం వేస్తూన్నారు. గోడు చెడగొట్టకండయ్యా అంటే వినిపించుకోరు."

గోపాలరావు స్టేట్ కాంగ్రెసులో స్వామీజీ ముఠా మనిషి. అందుకే ఆ ఎత్తిపొడుపు.

సంగారెడ్డి తన అభిప్రాయాన్ని వివరించేడు.

"జమీందారీ విధానం రద్దు చేయవలసిందే. కాని అది భావి కర్తవ్యం. ప్రస్తుతం కావలసింది అటువంటి చట్టాలను చెయ్యగల
అవకాశం."

ఆ భావి కార్యక్రమానికి ప్రాతిపదిక ఎల్లావుండాలో కూడా చెప్పేసేడు.

"అనవసరమైన గంద్రగోళాలు, వ్యతిరేకతా రాకుండా, ఎవళ్ళకీ నష్టం కలగకుండా వ్యవహారాలు సర్దుబాటు చేసుకోవాలి."

నష్టం కలగని పద్ధతీ గంద్రగోళం రాని పద్ధతీ నష్టపరిహారం ఇవ్వడం. అదీ అడిగినంత.

* * * * *

రంగయ్యా, గోపాలరావూ తిరిగి వస్తూ ఆనాటి చర్చల్ని నెమరు వేసుకొన్నారు.

జమీందారీవిధానం మాట ఎత్త వద్దనీ, నిజామును ఎప్పట్లాగే వుంచుదామనీ సంగారెడ్డి చెప్పిన వాదనలు గోపాలరావు చెవుల్లో
గింగిరుమంటున్నాయి. వారం పది రోజుల్లో స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహానికి సన్నాహాలు చేస్తూంది. కాని ఆ పోరాటం వలన
సాధించదలచిన ఫలితాల విషయమై కాంగ్రెసులోనే ఏకాభిప్రాయం లేదు. అది ఆతనికి చాలా విచారం కలిగిస్తూంది.

తననెదుర్కొంటున్న సమస్యకు ఆ వాదోపవాదాల్లో పరిష్కారం వెతుక్కుంటున్నాడు రంగయ్య. సిద్ధాంతాల స్థాయిలోనే ఆలోచిస్తూ కూర్చోగల
స్థిమితంలేదిప్పుడు. ఒక పెద్ద సమస్య, జీవిత సమస్య కళ్ళ ముందు నిలబడి నామాటేం చెప్పేవని నిలదీస్తూంది.

"అయితే ఈ ఏభయ్యేళ్ళ నుంచీ ఆ భూమిలో ఊరికే చాకిరీ చేయనిచ్చినందుకా పరిహారం ఇవ్వడం?"

గోపాలరావు అల్లుని మాటలు విని నిలబడ్డాడు. నష్టపరిహారం ఇవ్వాలనే మాట ఆయనకు అనుచితంగా కనబడలేదు. ఆస్తి
హక్కులంటూ వున్నాయి. వాటి మాటేమిటి?

రంగయ్య తల అడ్డంగా తిప్పేడు.

"ఆ భూమిని ఆయన ఎన్నడూ చెయ్యలేదు. చెయ్యగలిగివుండేవాడే కాదు, మరెందుకు పరిహారం? పట్టా మాకు లేకపోయిందనా? ఆయనకు
వుందనా? అన్యాయంగా సంపాదించిన పట్టాకి మనుష్యుడి ప్రాణం కన్నా విలువ ఎక్కువా?"

న్యాయం అయితే లేదు. కాని, సమాజం నిబంధనలన్నీ న్యాయం మీదనే ఆధారపడి వుండడం లేదు.

గోపాలరావు ఇవ్వగల సమాధానం ఒక్కటే.

"సమాజం నడకకి కొన్ని నిబంధనలవసరం."

"మనుష్యుని జీవితానికి కొన్ని న్యాయపరిరక్షణలవసరం. అన్యాయాలను రక్షించుకొనేందుకు మనుష్యుడు నిలబడ్డం అవసరమే. ఆ
అవసరం నాకు వచ్చింది."

అల్లుని కంఠస్వరములోని దృఢత్వం గోపాలరావును చకితుణ్ణి చేసింది.



పదకొండో ప్రకరణం


తెల్లవారడంతోనే గోపాలరావు అల్లుణ్ణి హైద్రాబాద్ ప్రయాణం చేసేడు. చెప్పడం అయితే పెద్దవకీలునెవరినో కలుసుకోడానికి అన్నాడు.
కాని, అసలు వుద్దేశం వేరు. నిన్న రాత్రి సంగారెడ్డి ఇంటినుంచి తిరిగి వచ్చాక మాట్లాడిన మాటలు విన్నాక అల్లుణ్ణి
స్వగ్రామం పోనివ్వడం మంచిదనిపించలేదు. నిజంచేత ఇల్లాంటి సందర్భాల్లో మరో క్లయింటయితే భూమి మీద కబ్జా మాత్రం వదలకని
చెప్పేవాడే. కాని, ఇక్కడ క్లయింటు కూతురు మగడు. దిక్కుమాలిన పొలం కోసం పట్టుదలలకి పోతే ప్రాణాలకే మోసం. గ్రామాల్లో
రెడ్లూ, పెత్తందార్లూ మహా దురంతాలక్కూడా వెనుదియ్యరు. బందగీని చంపించినదిల్లాగే. పిండిప్రోలులో పట్టపగలు నడివీధిలో
జగ్గయ్యని చంపించి ఇంకా నాలుగు నెలలు కాలేదు. పాడు భూమి. అంతా చేసి నాలుగువేలు చెయ్యదు. దానిని రంగయ్య ఎల్లాగూ
వ్యవసాయం చెయ్యబోవడంలేదు. ఎక్కడో వకాలతు పెట్టడమో, మంచి వుద్యోగం దొరికితే పోవడమో అనుకుంటున్నదేనాయె.

సరిగ్గా సమయానికి ప్రభుత్వంలో మంచి హోదాలో వున్న ఒక మిత్రుడు ఒక వుద్యోగానికి మనిషి కావాలని చెప్పిన మాట గుర్తు
వచ్చింది.

నిజాం ప్రభుత్వానికి పబ్లిసిటీ ఆఫీసర్లు అవసరం అయ్యేరు. అందులోనూ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా హిందువైతే
మంచిదనే దృష్టిలో వున్నారు. సమర్ధుల్ని ఆకర్షించడానికై మంచి జీతాలనిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మంచి వుపయోగాలుంటాయని ఆ
మిత్రుడు చెప్పేడు.

చెప్పిన సమయంలో అల్లుణ్ణి పంపాలనే ఆలోచన తోచలేదు. దానికి రాజకీయాలు ఓ కారణం. రెండోది బల్ల కడితే వెంటనే కాకపోయినా
ఆ జీతపురాళ్ళు కిట్టకపోవు. ఆ ఆలోచనతోనే తన అల్లుడి మాట చెప్పలేదు. కాని, ఇప్పుడు పరిస్థితి తరుముకు
వస్తున్నట్లనిపించింది. ఆ మిత్రుని వద్దకు రంగయ్యని తీసుకుపోయి పరిచయం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. కాని, ఆ నిశ్చయం
మనస్సులోనే. పైకి చెబితే రంగయ్య ఒప్పుకోడు. అతడున్న ఆవేశం అటువంటిది. లాభనష్టాల్నీ, పట్టుదలల్నీ బేరీజు వేసుకొనే
వయస్సు కూడా కాదు.

భార్య కూడా ఆ ఆలోచనే బాగున్నదంది. పట్టుదలలు ఎంతెంత ఆలోచన గల వాళ్ళనీ ఇట్టే బోల్తా కొట్టించేస్తాయి. వాళ్ళ
స్వగ్రామంలో ఇద్దరు యిరుగు పొరుగువాళ్ళు, తమ యిళ్ళ మధ్యనున్న ఉమ్మడి గోడకి ద్వారం పెట్టుకునే హక్కు వుందో లేదో
తేల్చుకోడానికి బోలెడంత ఆస్తికి కరారావుడి చుట్టేసేరు. అప్పటికీ తేలలేదు. ఒక ప్రాణం బలిపెట్టేరు. నలుగురు రెండేసేళ్ళు
జైళ్ళల్లో పోయి కూర్చున్నారు. ఇంతా చేస్తే పైన మరో కోర్టు మిగిలిపోయింది కూడా.

అందుచేత అల్లుణ్ణి స్వగ్రామానికి వెళ్లవలసిన పని లేకుండా మారుదారిన పెట్టడమే మంచిదని ఆమె కూడా సలహా చెప్పింది. ఇంక
ఆలోచన అనవసరం. పెద్దవాళ్ళని సలహా అడగడం పేరుతో అల్లుణ్ణి కదిలించేడు. ఇద్దరూ మొదటి బస్సుకే బయలుదేరేరు.

* * * * *

బస్సు సర్వాపేట సమీపాన ఘాటీలోకి వచ్చేసరికి పోలీసులు ఆపేసేరు. అంతదూరంలో లోయలోకి దొర్లిపోయిన ఒక లారీ
తగులబడిపోతూంది. మధ్యమధ్య ఏవో ప్రేలుతున్న చప్పుళ్ళు. చుట్టుపక్కలకెవ్వరూ పోకుండా పోలీసులు కమ్మేసేరు.

బస్సు డ్రైవరు ఆ ప్రమాదం ఏమిటో చెప్పేడు. ఖాజీకి హైద్రాబాద్ నుంచి పెట్రోలు, బందూకులు, జంబియాలు తీసుకొని నిన్న రెండు
లారీలు వచ్చేయి. బహుశా ఇది మరొకటయి వుంటుంది.

గోపాలరావు, రంగయ్య మొగ మొగాలు చూసుకున్నారు. నిజాము ఓ వైపున ఢిల్లీకి మనుష్యుల్ని పంపి రాయబారాలు సాగిస్తూనే, ఆయుధాలు
వగైరా అందించి జనాన్ని తయారు చేసుకొంటున్నాడు. ఖాజీ తమ ప్రాంతంలో అంజుమన్ నాయకుడు. దానికి నిజాము నవాబు ప్రోత్సాహం, సహాయం
ఉన్నాయి. లేదని పైకి ఎన్ని చెప్పినా ఈ ప్రత్యక్ష సాక్ష్యానికి ఏం చెప్తారు?

డ్రైవరుకు ఇంకా చాలా సంగతులు తెలుసునని ప్రశ్నలు వేసి గోపాలరావు గ్రహించేడు. ఈ ఆయుధాల్ని జేరవేసే లారీలు వీళ్ళ సహాయం
లేనిదే నడవ్వు. వాళ్లల్లో ఏ ఒక్కరికి తెలిసినా మిగతా అందరికీ తెలిసిపోతుంది. అయినా అనేక కారణాల వలన పైకి
చెప్పలేరు. ఏయే జిల్లాలో ఏయే మజ్లిస్ నాయకుని వద్దకు ఎన్నెన్ని ఆయుధాలు జేరవేసిందీ వాళ్ళందరికీ కరతలామలకం. ఇంత
పెద్దఎత్తున ఆయుధాలు రవాణా అవుతున్నా గోల పుట్టలేదేమాయని గోపాలరావు ఆశ్చర్యపడ్డాడు.

మంటలు చల్లారినాక పోలీసు అధికార్లు బస్సుని పోనిచ్చారు. కాని, తగలబడిన లారీ వైపు తొంగి చూడ్డానిక్కూడా వీలు లేకుండా
వేగిరించేరు.

దారిలో అయిన ఆలస్యాలు కారణంగా బస్సు పట్నం చేరే సరికి బాగా ఆలస్యం అయింది. తాను కలుసుకోదలచానన్న వకీళ్ళందరూ
ఎక్కడెక్కడికో షికార్లు పోయి వుంటారు. గోపాలరావు తన ఉద్యోగి మిత్రుడి కోసం ఫోన్ చేసేడు. ఆయనింకా ఇంట్లోనే వున్నాడు.
మిత్రుడి గొంతు వినిపించగానే ఉత్సాహం ప్రకటించేడు. ఆ రోజు రాత్రి ఆయన ఇంటి వద్ద ముషాయిరా జరుగుతుంది. నగరంలోని
ప్రముఖులు చాలామంది వస్తున్నారు. గోపాలరావు కూడా తప్పక రావాలన్నాడు.

బి. యల్. ప్యాసైన తన అల్లుడు కూడా తనతో వచ్చేడని విన్నాక ఆ వుద్యోగి అసలు విషయం అర్థం అయిందనుకొన్నాడు. ఆ
యువకుడితో తనకు పరిచయం లేనందుకు విచారం తెలిపేడు. సాయంకాలం ముషాయిరాకి ఆయన్ని కూడా తోడి తెమ్మని పదేపదే చెప్పేడు.

తాను తలపెట్టిన ఒక ముఖ్యమైన పని సక్రమంగా సానుకూల పడుతున్నందుకు గోపాలరావు సంతృప్తి పడ్డాడు.

ముషాయిరాకు వచ్చిన ఆహ్వానాన్ని అల్లుడికందజేసేడు.

"నువ్వూ వ్రాస్తావుగా కవిత్వం. రా. అదో సరదా."

రంగయ్య చిరునవ్వు నవ్వేడు.

* * * * *

విశాలమైన ఆ హాలంతా లష్తర్ల వెలుతుర్లో మిలమిలలాడిపోతూంది. గది అంతటా తివాచీలు పువ్వులు పరచినట్లున్నాయి. హాలులో ఒక
ప్రక్కన పరుపులు, తఖ్తాలతో వేదిక అమర్చబడి వుంది. గుమ్మంలో నిలబడి గోపాలరావు స్నేహితుడు స్వయంగా అతిధుల్ని
చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నాడు. కరచాలనం చేసేడు. ఆదాబ్ తెలుపుతున్నాడు.

గోపాలరావును చూడగానే ఆయన చాలా ఆనందం ప్రకటించేడు. రంగయ్యతో పరిచయం చేసుకొని ఆహ్వానించేడు.

వుద్యోగి వర్గంలో మామగారికున్న మంచి పేరుకు రంగయ్య ఆశ్చర్యపడ్డాడు. ఆ వుద్యోగి స్వయంగా ఇద్దరినీ విశ్రాంతి మందిరంలోకి
తీసుకెళ్ళేడు. ఒక పరిచారకుడు 'డ్రింక్' తెచ్చియిచ్చేడు. గ్లాసులు ఖాళీ చేస్తూ రంగయ్యతో పరిచయం వృద్ధి చేసుకొన్నాడు.
ఎక్కడ చదివేడో, ఎప్పుడు ప్యాసయ్యేడో వివరాలు తెలుసుకొన్నాడు.

సంభాషణ ముషాయిరాల మీదికి మళ్ళింది. రాజకీయాలోచనల తలనొప్పిలో కవితా గోష్ఠి మనస్సుకు ఎంత ప్రశాంతినిస్తుందో వర్ణించేడు.
'దక్ఖినీ సంస్కృతి' ప్రత్యేకతకు ఉదాహరణంగా ఈ ముషాయిరాలు మత భేదాల పునాది మీద గాక కవితాభిరుచి పునాదితోనే జరగడం
గమనించాలన్నాడు.

"ఈ ప్రత్యేకత నిజాము ప్రభువు పరిపాలన ఫలితం."

ఈ ప్రత్యేక సంస్కృతిని రక్షించేటందుకే నిజాము స్వాతంత్ర్యం కొరుతున్నాడని కూడా తన మిత్రుడు చెప్తాడని గోపాలరావు భావించేడు.
కాని, ఆయన ఆ మాట అనలేదు. ఈ ప్రత్యేక సృష్టితో పరిచయం లేకపోవడం చేతనే దేశమంతటా దురభిప్రాయాలు వ్యాపించి
వున్నాయన్నాడు. వానిని తొలగించడం, ప్రపంచానికి సత్యస్థితి తెలపడంలో నేడు సంస్థానంలోనున్న యువకుల మీద గల ప్రధాన
బాధ్యత అన్నాడు.

తర్వాత అందరినీ సభా మందిరానికి తీసుకువెళ్ళేడు.

* * * * *

రాత్రి ఒంటిగంట వేళకి ముషాయిరా ముగిసింది. మరునాడు ఆఫీసులో కలుసుకొంటామని వాగ్దానం చేసి గోపాలరావు, రంగయ్య వీధిలోకి
వచ్చేరు. రిక్షాలు తీసుకొని బయలుదేరేరు.

కొంత దూరం వచ్చేసరికి రోడ్డు మొగలో పోలీసువాడు రిక్షాలు ఆపేడు. గబగబా నాలుగు మూలలనుంచీ ఓ యిరవయిమంది చుట్టు మూగేరు.
వారిని చూసేసరికి గోపాలరావుకి అర్ధం అయింది. పోలీసువాడు ప్రశ్నలు వేస్తున్నాడు. వాడు ఆపుతాడు. మిగిలిన వాళ్ళంతా అల్లరి
చేస్తారు. మజ్లిస్ వలంటీర్లు వాళ్ళంతా. హైద్రాబాద్ ఆజాదీ కోసం పోలీసుల సహాయంతో రోడ్ల మీద వీరవిహారం చేస్తున్నారు.

గోపాలరావును తీసుకువస్తున్న రిక్షావాడు తాను బేరం ఎక్కించుకొన్న వీధీ, వుద్యోగి ఇల్లూ చెప్పేడు. రజాకార్లు ఆ పేరు వినగానే
వెనక్కి తగ్గేరు. పోలీసువాడు సలాము కొట్టి ప్రక్కకు తొలిగేడు.

రిక్షాలు కదిలేయి.

హోటలు గదికి వెళ్ళేక గోపాలరావు తన వుద్యోగి మిత్రునితో జరిగిన సంభాషణ విశేషాలను నెమరు వేసేడు. ప్రచార శాఖ
వుద్యోగికిస్తామన్న ఎనిమిది వందల రూపాయల జీతాన్ని పొగిడేడు. రంగయ్య అపహాస్యం చేసేడు.

"మన రిక్షాలనాపిన సంస్కృతీ రక్షకుల చర్యలను సమర్థించేటందుకు ఎనిమిది వందల జీతం చాల తక్కువ."



పన్నెండో ప్రకరణం


ముసలితనపు బరువుకి కాళ్ళు తడబడి పోతూంటే సరయ్య పరుగు పరుగున వూళ్ళోకి వచ్చేడు. అతను చెప్పిన వార్త విని వీరమ్మ
లబోదిబోమంది.

పెద్దదొర శేరీదారు కిష్టయ్య పదిమంది కూలీలతో పొలంలోకి వచ్చి తన కుండా మండా వాకిట్లో పారేసేడు. పాక పీకేయించేడు.

పొలం వొప్పచెప్పమని ఇంకా రోజు తిరగలేదు. ఇంత త్వరగా స్వాధీన పరుచుకొనేందుకు మనుష్యుల్ని పంపుతాడని ఎవ్వరూ ఊహించను
కూడా లేదు. వీరమ్మ విలపించింది. "ఈ ఏడాది పంట కోసుకొనే అదృష్టం కూడా లేదా దేవుడా?"

ఇంకెవ్వళ్ళ మాటా వినిపించుకోకుండా, సుదీర్ఘమైన వాక్యాలతో, ఉదాత్తానుదాత్త సరితల్ని యధాశక్తినుపయోగిస్తూ ఆ భూమిని బాగు
చెయ్యడం కోసం తన మగడు పడ్డ కష్టాన్నీ, దానిమీద ఆయన పెట్టుకొన్న ఆశల్నీ జ్ఞాపకం వున్నంతవరకు వర్ణిస్తూంది.

"ఇంత రాత్రేళ ఎందుకన్నా వినకుండా, గొరకొయ్యలు నెత్తికొచ్చేయని పరుగు పరుగున వెళ్ళి, రౌతులేరి చదును చేసి గట్టు
వేసివయ్యో! కొడుకు పెద్దవాడౌతాడు కోడలొస్తుంది, ఇంత తిండి తింటారని ఎంతెంతలేసి ఆశలెట్టుకుంటివయ్యో!.....":

సరయ్య రోజుకుంటూ పరుగెత్తి రావడం చూసేకా, వీరమ్మ లబదిబలు విన్నాకా వీధివాళ్ళందరికీ విషయం అర్థం అయింది. పొలాలనుంచి
వస్తున్న వాళ్ళు భుజాన వున్న సామానులు వీధిలోనే చెట్టు క్రింద పడేసి, లోపలికి వచ్చి పరామర్శ చేస్తున్నారు. సలహాలు
చెప్తున్నారు. వేదాంతం బోధిస్తున్నారు. ఇరుగు పొరుగమ్మలు సానుభూతి ప్రకటిస్తున్నారు.

"ఇంతే ప్రాప్తం........."

'దేవుడన్నా మరిచిపోతాడు గాని-"

సరయ్య గొంతు విని సత్తెమ్మ బయటికి వచ్చింది. ఆతడు తోటలో జరిగిన విషయాలన్నీ మొట్టమొదటి మారుగా వివరంగా చెప్పేడు.

సత్తెమ్మ కళ్ళల్లో భుగభుగలు కనిపించేయి. ఆ ఆకారాన్ని చూస్తూంటేనే వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యంతో నోరు తెరిచారు.

ఆమె తల్లిలా ఏడవలేదు. వినవచ్చిన జనం ఓదార్పులూ వినలేదు. దృఢంగా అడుగులేస్తూ వెళ్ళి పంచలోంచి చిటికెనవ్రేలు లావూ,
బారెడు పొడుగూ జువ్వకర్ర లాగింది.

తల్లి ఏడ్పు మాని, సగంలోనే మాట నిలిపి, ఆశ్చర్యంతో నోరు తెరిచి కూతురువంక చూస్తూంది. ఆ జువ్వకర్ర ఎవరి కోసమో
ఆమెకర్థం కాలేదు. ఈ గంద్రగోళాలు వచ్చేక కూతురామెకర్థం కావడమే లేదు. ఈ మూడు నెలలలో కూతురులో ఆ చురుకుదనం చూడలేదు.
ఎప్పుడూ నీరసంగా, నిర్లక్ష్యంగా, నాకెందుకొచ్చిందిలే అన్నట్లు వుంటున్న మనిషి ఒక్క క్షణంలో పూర్వాకారం ధరించింది. ఆ జువ్వ
తీసింది. అది ఎందుకో, ఏం చేయబోతూందో, ఏడుస్తున్నందుకు తన్ను వడ్డించదు కద? ఎందుకేనా మంచిదని చూడవచ్చిన ఇరుగు
పొరుగమ్మల మధ్యకు జరిగింది.

కాని సత్తెమ్మ అటువంటిదేమీ చెయ్యలేదు. అసలు అక్కడున్న వాళ్ళ వేపు చూడనేలేదు. జువ్వకర్రతో వాకిట్లోకి వచ్చింది.
సరయ్యను నడవమంది. రెండో మాట కూడా లేకుండా, వెనక తిరిగి చూడకుండా చరచరా నడిచిపోతూంది.

ఆమె ఎక్కడికి బయలుదేరిందో, తనను ఎక్కడికి నడవమన్నదో సరయ్యకు అర్ధంకాలేదు. కళ్ళింతచేసుకొని ఆమె పోయిన వేపే
చూస్తూ ఒక్కనిముషం నిలబడ్డాడు.

సత్తెమ్మ వీధి మలుపు తిరిగే సరికి తెలిసింది. పొలం వైపే వెడుతూంది. అంటే భూమిమీదికొచ్చిన వాళ్ళని ఎదుర్కోడానికి
బయలుదేరుతూందన్నమాట. ఒక్కర్తే అంత ధైర్యంగా కదలడం ఆశ్చర్యం అయింది. ఆమె సాహసానికి ఓ వైపున సంతోషం కలిగింది. కాని
మరుక్షణంలో భయమూ వేసింది. పొలం ఆక్రమించిన దొరకు బలగం వుంది. ప్రభుత్వం వత్తాసు క్షణంలో వస్తుంది. "నా
భూమినాక్రమిస్తన్నాడు మొర్రో" యని మొత్తుకున్నా బీదవాడి మాటా, రైతు మాటా ఏ ప్రభుత్వమూ పట్టించుకోదు. అదే దొరలయితే?
"వాడి భూమి దున్నుతానంటే ఒప్పుకోడంలేద" ని కాకిచేత కబురంపినా మందీ మార్బలం దిగుతుంది. ఈ అన్యాయాన్ని ఎదిరించడానికే తమ
ప్రయత్నం. అయితేనేం? సత్తెమ్మ జువ్వకర్ర పుచ్చుకొనేసరికి కంగారు పుట్టింది. ఆడకూతురు ఒక్కర్తే ఏం చెయ్యగలదు?

సరయ్య కంగారుగా పిలుస్తూ, తడబడుతూ పరుగు ప్రారంభించే వరకూ అసలు విషయం ఎవ్వరికీ తెలియలేదు. తెలిసేక నలుగురూ
సత్తెమ్మని పట్టుకోడానికి లేచేరు. ఆపండని ఒకరొకరికి పురమాయించేరు.

జనంతోపాటు వీరమ్మా ఆదుర్దాగా లేచింది.

"సత్తెమ్మతల్లీ! నిలబడవే. ఏమర్రా నాయనా! దానిని ఆపండర్రా."

జానకిరామయ్య కండువా నడుముకి చుడుతూ "ఆపడం ఎందుకు నడవండేస్సి"-అన్నాడు.

అతడు చేసుకునేదీ కౌలు భూమే. ఈ వరస చూస్తే తాను బచాయించేది అసంభవం. ఈవేళ కాకపోతే రేపైనా తన భూమీ గొడవలో పడేదే.
చేసుకొంటూ చేసుకొంటున్న భూమినల్లా నాకిచ్చెయ్యమని కూర్చుంటుంటే మంది బ్రతికేదెల్లా. జానకిరామయ్య నిన్నటి నుంచీ అదే ఆలోచనలో
వున్నాడు. సత్తెమ్మ వూరుకున్నా తన భూమినడిగితే ఏమైనా ఇవ్వకూడదని నిర్ణయం చేసుకొన్నాడు. ఇప్పుడు సత్తెమ్మా తాను
అనుకొన్నదే చేస్తూంది. ఆమెని ఆపడం ఎందుకు?

సత్తెమ్మ ఎవరి మాటా ఎవరి పిలుపూ వినిపించుకోలేదు. చరచరా నడుస్తూంది. చేతిలోని జువ్వకర్ర వెనక్కీ, ముందుకీ వూగుతూ,
ఆమె అడుగుతో లయ కలుపుతూంది.

వెనకనుంచి వస్తున్న జనాన్ని ఆమె గమనించలేదు. ఈ హడావుడినంతా చూసి వీధుల్లోకి వచ్చేశారు, ఆడా మగా. అంతా తలోవిధంగా
తలో మాటా అంటున్నారు.

వీరేశలింగం వెనకనుండి వస్తున్న వీరమ్మను పలకరించేడు. ఆమె గిడగిడలాడింది.

"తీసుకురారా బాబూ! పొలం పోతే పోయింది. పోలీసాళ్ళ దెబ్బలు కూడా ఎక్కడ తినం?"

పోలీసులు, దెబ్బలు అనే మాట వినేసరికి ఏడాది క్రితం గ్రామం మీద జరిగిన దాడులు జ్ఞాపకం వచ్చేయి. ఇప్పటికీ సూర్యాపేట
తాలూకా గ్రామాల మీద గుర్రపు దళాలు దాడి చేస్తూనే వున్నట్లు కర్ణాకర్ణిగా వింటూనే వున్నారు. వీరేశలింగం సమాధానం కూడా
ఇవ్వకుండా లోపలికెళ్ళిపోయాడు.

వెనకనే వస్తున్న జానకి రామయ్య ఎగతాళిగా చూసేడు. గుమ్మాల్లో నిలబడి వున్న నలుగురు ముగ్గుర్నీ పిలిచేడు.

"రాండేసి."

పిలిచేడే గాని వస్తున్నదీ లేనిదీ చూడకుండా పరుగెత్తాడు.

వీరమ్మా, ఆమె వెనక కోడలూ సత్తెమ్మను తీసుకు రావడానికి చకచకా నడుస్తున్నారు. ఆయాసంతో రొప్పుతున్నారు.

సాతాని బూసయ్య తోడు కదిలేడు.

"నడవండి. తొందరపడనివ్వకండి."

వీధి మొగలో కోటమ్మ ఎదురయింది. చంకనున్న పిల్లగాణ్ణి అరుగు మీద కూలబడేసి పైటకొంగు నడుముకు చుట్టింది.

"రాండి. నేనూ వస్తున్నా."

పదడుగులు వేసింది. నడి వీధిలో నిలబడి వెనక్కి జారుకుంటున్న వాళ్ళని తిట్టడం మొదలెట్టింది.

"మగాళ్ళు. ఆడకూతురుపాటి చొరవలేదు. థూ......"

కోటమ్మ నోటి దురుసు మనిషి. ఎంతవాడినీ, ఇట్టే మాట అనేస్తుంది.

ఆమె కేకలూ, హడావిడీ జనంలోని నిస్తబ్ధతను వొదలకొట్టేయి. వీధి గుమ్మాల్లోనూ, పెరటి గుమ్మాల్లోనూ నిలబడ్డ ఆడవాళ్ళంతా
కోటమ్మను చూసి కదిలారు. ఎడ పిల్లల్ని వదిలించుకొనీ, చంటి పిల్లల్ని చంకనేసుకొనీ వెంటబడ్డారు. ఆడవాళ్ళు కదలడంతో
మగాళ్ళు అరుగులు దిగేరు. పది నిముషాల్లో జనం పుంతలకీ, చెలకలకీ అడ్డుపడి బోళ్ళ పొలం వైపు పరుగెత్తుతున్నారు.

సత్తెమ్మ ఈ గంద్రగోళాన్ని గమనించలేదు. పిలుపులూ, హెచ్చరికలూ కూడ ఆమె చెవి చొరడంలేదు. తన వెంట జనం వస్తున్నారనే
ధ్యాస కూడా లేదు. పొలాన్ని ఆక్రమించడానికి వచ్చేరన్న మాట ఒక్కటే సర్వగ్రాసిగా ఆమె మెదడుని ఆక్రమించి వుంది.

వచ్చినవాడు కూడా కిష్టయ్య అనేసరికి ఆమె ఆవేశానికి అంతే లేకుండా వుంది. నిరుడు వెంకటయ్యను దగ్గరుండి కొట్టించిన నాటినుంచీ
కిష్టయ్య అంటే ఆమెకు తగని కోపం. ఆతడిని ఏమీ చెయ్యలేక పోయిన అసహాయ స్థితి ఆ ద్వేషాన్నింతకాలమూ మనస్సులో అణచి
వుంచింది. నేడు ఆతడే తన పొలాన్ని ఆక్రమించడానికి వచ్చేడు.

సత్తెమ్మ పుంత దాటింది. బోర్లలో నడుస్తూంది. గట్టు తిరిగితే బావి.

వీరమ్మకి పొలం పోతుందనే ఆదుర్దా కన్న తర్వాత రాగల బాధలు ఎక్కువ ఆందోళనకరంగా వున్నాయి. దొర భూమిని పట్టుకుపోతాడు.
తాము కొనుక్కొన్న నలభయ్యేభయ్యెకరాల చెలకా వుండనే వుంది. చేసుకు బ్రతకొచ్చు. కాని, ఇప్పుడు రగడ పడితే దొరతో
వ్యవహారం. ఆయన కొడుకు సర్కిల్ ఇన్స్పెక్టరు కూడా. సర్కారు వాళ్ళ తరఫు తమ కొంప పీకేస్తారు. ఊళ్ళోంచి కూడా లేచి
పోవలసిందేగాని నిలబడ్డానిక్కూడా దారుండదు.

కాని, ఆమె మాటలు వినేటందుకూ, ఔగాములు ఆలోచించేటందుకూ సత్తెమ్మ ఆ ప్రాంతాల కూడా లేదు. నడవలేక వీరమ్మ బాగా
వెనకబడింది. ఊరి జనం కూడా ఆమెను దిగ తొక్కి పోతున్నారు. ఏం చెయ్యలేని కోపం వచ్చింది. చేతగానితనాన్ని తిట్లలో
ప్రకటిస్తూంది. అసలు ఈ గొడవకి కారణం సత్తెమ్మేనని కూడా ఆమె నమ్మకం. చేసింది చాలక ఇప్పుడింకా పీకమీదికి తెస్తుందని
భయం.

వెనకనే వస్తున్న గొల్ల భాగయ్య చెయ్యి పట్టుకొంది. సత్తెమ్మ తల్లిని నిలుపుతే ఆతని కడుపున పుడతానని వాగ్దానం
చేసింది.

వెంకటయ్యకు భాగయ్య స్నేహితుడు. తన యిల్లు వదిలిపోయేక వెంకటయ్య ఆతని ఇంట్లోనే మకాం కూడా. వీరమ్మ ఆ
విషయాన్నెరుగును. మరొక సమయం అయితే తన కూతురు విషయంలో ఆతని సహాయాన్ని వీరమ్మ కోరివుండేదే కాదు. కాని ఇప్పుడా
అనుమానాలూ, ద్వేషాలూ గుర్తు వచ్చే స్థితి కాదు. ఆయాసంతో రొప్పుతూ, రోజుతూ, జారిపోతున్న పైటకొంగు నడుం చుట్టూ తిప్పి మొలలో
దోపి, ప్రక్కనున్న రాతి బండ మీద చతికిలబడింది. వెనక వస్తున్న జనం ఆమెను అక్కడే వుండమంటూ గబగబ ముందుకు
పరుగెత్తుతున్నారు. ధైర్యం కోసం వెనక వస్తున్న వాళ్ళను పిలుస్తున్నారు. మళ్ళీ నడుస్తున్నారు.

పొలం సమీపించిన కొద్దీ సత్తెమ్మ నడక తీవ్రం అయింది. అడుగు వడి నడక వడి అయింది. అది పరుగయింది. గట్టు తిరిగి
పొలం కోరడి గుమ్మంలోకి వచ్చేసరికి చెట్లచాటున పాకకెదురుగా వున్న నిలువెత్తు గుండ్రాయి మీద కూర్చున్న కిష్టయ్య
కనబడ్డాడు. బండమీద లేచి నిలబడ్డాడు. ఎందుకో తమ వూరి వేపే చూస్తున్నాడు.

సత్తెమ్మ కోరడి దాటి, చెట్లు దాటి తాను కూర్చున్న బండ వద్దకు వస్తున్నా కిష్టయ్య ఆమెను గమనించనేలేదు. ఆతని దృష్టి
దూరాన వినిపిస్తున్న కోలాహలం మీద కేంద్రీకరించి వుంది.

దూరాన ఏవో కేకలూ, పిలుపులూ వినబడుతున్నట్లయి కూర్చున్న వాడల్లా లేచి నిలబడ్డాడు. దూరాన వూరి వేపు నుంచి జనం
పరుగెత్తి వస్తూ కనబడ్డారు. మనుష్యుల్ని గుర్తు పట్టేటంత దూరంలో లేరు. రంగురంగుల బట్టలు అన్నీ ఆడవాళ్ళవి. పంచెలు,
ఎర్ర రంగు గళ్ళకండువాలూ, నల్లకంబళ్లు వాళ్ళంతా మగాళ్ళు. అందరూ పరుగెత్తి వస్తున్నారు. తానున్న వేపే పుంతలకీ,
చెలకలకీ అడ్డపడి వస్తున్నారు కూడా. చేతులు ఎత్తి ఏదో కేకలు వేస్తున్నారు. ఎదురుగాలిలో మాట వినబడ్డం లేదు.
చేతులెత్తుతూ వూపుతున్నారు. అది పిడికిళ్ళు బిగించి, గద్దరిస్తూన్నట్లు కనిపిస్తూంది.

ఏడాది క్రితం వూళ్ళో 'సంగం' ఏర్పడిన సంగతి జ్ఞాపకం వచ్చింది. ఆ రోజున వూరేగింపులో వాళ్ళంతా పిడికిళ్ళు బిగించి చేతులు
ఇల్లాగే ఎగరేసేరు. పద్దాలును తీసుకెళ్ళలేక చేతులూపుకుంటూ తాను తిరిగిపోతూంటే ఇల్లాగే రణగొణధ్వని చేశారు.

తర్వాత వాళ్ళ మీద తాను కసి తీర్చుకొన్న విధానం గుర్తు వచ్చి హడలిపోయేడు. వాళ్ళని తాను స్వయంగా కొట్టేడు. కొట్టించేడు.
మంచినీళ్లు అడిగితే నోట్లో వుచ్చపోసేడు. ఒకడికి కాళ్ళు మెలితిప్పించేసేడు. అవన్నీ నేడు తాను అనుభవించాల్సి వస్తుందనిపించింది.
భయంతో రాతి నుంచి ఒక్క వురుకు వురికేడు. అదే అతణ్ణి రక్షించింది. లేకపోతే సత్తెమ్మ బలం కొద్దీ సాచికొట్టిన జువ్వకర్ర
దెబ్బకు వీపు పొడుగునా చర్మం లేచిపోయేది.

అంత దెబ్బా తినవలసిన కిష్టయ్య తప్పించుకోడంతో ఆ వూతానికి సత్తెమ్మ ముందుకి తూలిపోయింది. బండ్రాయికి తగిలి కర్ర
కణుపులోకి విరిగిపోయింది. దెబ్బ నిజానికి తగలకపోయినా చప్పుడు విని వెనక తిరిగి చూసిన కిష్టయ్యకి అంత దెబ్బా వీపున
పడ్డట్లే అనిపించింది. సత్తెమ్మ తూలుపాటు సర్దుకొని లేచేలోపున ఏభయ్యేళ్ళ మనిషీ పాతికేళ్ళవాడిలాగ కోరడి మీదుగా
లంఘిస్తున్నాడు.

సత్తెమ్మ వెనకాలనే తోటలోకి చొరుచుకు వచ్చిన జనం కిష్టయ్య వీపు తడుముకుంటూ కంచె వురికి పారిపోడం చూసి విజయధ్వని
చేసేరు. ఆ విధంగా తరిమిన సత్తెమ్మను భేషుక్కయిన పని చేసేవన్నారు. ఆమెను వెనక్కు పిలుచుకుపోవాలని వచ్చినవారు కూడా
తమ వుద్దేశాన్ని మరచిపోయేరు. కిష్టయ్య పారిపోతో మంది భయాన్ని కూడా వీపునవేసుకొనేపోయేడు. పారిపోయేవాడిని తరమడం ఓ
హుషారు. ఆలాగే అంతా కిష్టయ్య వెంటబడ్డారు. కాని, ఆతడు చిక్కలేదు. ప్రాణభయంతో ఆతడు కోరడి అవలీలగా దాటేసేడు.
వెంటవచ్చిన వాళ్ళకది సాధ్యంకాలేదు. ఒకళ్ళిద్దరు ముళ్ళకంచె తప్పించడానికి ప్రయత్నించేరు. సాధ్యం కాలేదు. ఇంక ఏ పని
చెయ్యలేక కోరడి లోపలే నిలబడి, బూతులు తిడుతూ కిష్టయ్య కాళ్ళకి మరింత ప్రోత్సాహం ఇవ్వడం ప్రారంభించేరు.

* * * * *

విరిగిపోయిన కర్రముక్కతో లేచి నిలబడి సత్తెమ్మ పాకవైపు తిరిగింది. ఆమె రౌద్రాకారం, కిష్టయ్య పలాయనం చూసేక దొరగారి
పాలేళ్లు నిలువునా వొణుకుతున్నారు. పక్క పక్కల్ని వొదుగుతూ సందు దొరికితే పారిపోవాలని చూస్తున్నారు. కాని, తోట అంతా జనం
నిండిపోయేరు.

ఇంతలో సత్తెమ్మ వాళ్ళవేపు తిరిగింది. ఆ చూపులోనే కర్రలు వీపులమీద నాట్యం ఆడుతున్నంత బాధ అనుభవించేరు. క్షమార్పణలు
చెప్పుకొంటున్నారు. మరెప్పుడూ రామని వాగ్దానాలు చేస్తున్నారు.

సత్తెమ్మ ఏమీ అనలేదు. కాని, ఆమెతో వచ్చిన జనం వుత్సాహం పట్టలేకుండా వున్నారు. మహాదర్పంగా రొమ్ములు విరుచుకుని
తిరిగిన కిష్టయ్య చుంచులా పారిపోతూండగా చూసి తమ బలాన్ని గుర్తించేరు. ఆతనితో వచ్చిన జనం? వాళ్ళూ గజగజలాడిపోతున్నారు.
తమ బలాన్ని గుర్తించిన వుత్సాహంలో పొలం అంతా కలగదొక్కుతున్నారు. ఎదుట వున్నవాళ్ళనీ, లేనివాళ్ళనీ చుట్టపెట్టి బూతులు
తిడుతున్నారు.

"కొడుకుల్ని పక్కలిరగతన్నండి."

"మీ దొర ముల్లెగాని దాచిపెట్టేడనుకున్నారట్రా?"

సత్తెమ్మ వాళ్ళని కొట్టవద్దంది. నిర్లక్ష్యంగా పొమ్మంది. ఆమాట నోట రావడం తడువు కందెనవేసిన బండిచక్రాల్లా కాళ్ళు చక
చక పరుగెత్తేయి.

ఎక్కడనుంచి వచ్చేడో మంగలి వెంకన్న మందిముందు చేతులు నలుపుతూ నిలబడ్డాడు. ఆతని భూముల్ని ఒక్కవారంక్రితమే దొర స్వాధీనం
చేసుకొన్నాడు. తన పొలాన్ని కూడా విడిపించమని అతని ప్రార్థన.

విజేతలంతా పెద్దపెద్ద కేకలు పెడుతూ ఆ పొలంవైపు నడిచేరు. విడిపించడానికి అక్కడ వారి నడ్డపెట్టేదేదీలేదు. పొలం చుట్టూ
చివరికి కోరడి కూడా లేదు. దానిని దొర స్వాధీనపరచుకొన్నాడనిగాని, అది దొరలదనిగాని చెప్పేటందుకు గుర్తుకూడా లేదు.
లేకపోయినా ఆస్తిస్వత్వాల మీద రైతువానికున్న భక్తి సుగ్రీవాజ్ఞలాంటిది. తానుగా ఆస్వత్వాన్ని త్రోసిపుచ్చలేడు.

మంది – ఆడా మగా అంతా చెలక దగ్గిరికొచ్చేరు. వెంకన్న మహా సంతోషంతో చేతులు నలుపుకుంటూ భూమిలోకి దిగి అలగం తొక్కేడు.

"నీ పొలం నువ్వు చేసుకో. ఒకరి గోడేమిటి?"

మంది అనుజ్ఞ తీసుకొని వెంకన్న పొలం పని అప్పుడే ప్రారంభించేడు. పనంటే ఏముంది? చెలకలో వున్న రాళ్ళన్నీ ఏరి గట్టున
పడేసేడు. రెండు జిల్లేడుమొక్కలు తోక్కేసేడు.

జనం మహోత్సాహంతో గర్జించింది.



మూడో భాగము



ఒకటో ప్రకరణం


రంగయ్య వూళ్ళోకి తిరిగి వచ్చేసరికి గ్రామం ఏమీ జరగనట్లే నిత్యకృత్యాలలో మునిగిపోయింది.

బోళ్ళపొలం బావి కడ నలుగురూ విడిపోయేక ఎవరికివారే ఆలోచనల్లో పడిపోయేరు. వారిని కలిపి నిలవబెట్టే బంధం లేదు. ఒక
నిర్మాణం ఏర్పడి వారికి దారి చూపే స్థితి లేదు. పైగా ఇంటికి వచ్చేసరికి ఇళ్ళవద్ద దొరికిన ధైర్యం, ప్రోత్సాహం కూడా చాల
స్వల్పం. అందులో పోలీసు దాడుల్ని చవిచూసి పది నెలలు కూడా కాలేదు. ఆనాటి దెబ్బల కదుములు ఇంకా `కరేల్' మంటూనే
వున్నాయి.

"నీకెందుకొచ్చిన గొడవలురా పిల్లగ!"

"పోలీసోళ్ళు పక్కలిరగదంచుతే ఎవరు కాస్తారు?"

"దొరలతో కోడెమంట్రా?"

"మన్నికూడా భూమి నుంచి లేచి పొమ్మంటే?"

అనేక దృక్కోణాల నుంచి అనేక వ్యాఖ్యలు, సలహాలు, ప్రార్ధనలు బెదిరింపులు, తిట్లు.

కొందరు నిశ్శబ్దంగా వున్నారు. మనస్సులో బెరుకు కలిగినా పైకి గంభీరంగా మెసులుకుంటున్నారు. కొందరు తాము ఏమీ చెయ్యలేదని
చెప్పుకొన్నారు. మరికొందరు `పోవే నీ గొడవేమిటి' అని గదుముతున్నారు. కొద్దిమంది మాత్రం మొండికేసేరు. ఇంతకంటె కొత్త బాధలు
ఏం వొస్తాయి చూద్దాంలే – అనే మొండితనం కనబరిచేరు.

కాని, అందరూ కూడా ఏదో జరగగలదనే విషయంలో ఏకాభిప్రాయం ప్రకటించేరు. ఎవరికి వారు గాంభీర్యం, అమాయకత్వం, మొండితనం
చూపిస్తూనే బంధువుల యిళ్ళూ, వాళ్ళ యోగక్షేమాలు స్వయంగా తెలుసుకు రావలసిన అవసరాలూ జ్ఞాపకం చేసుకొన్నారు. కొందరికి
పట్నంలో వ్యవహారాలు మురిగిపోతున్న ప్రమాదం గుర్తు వచ్చింది. అవీ, యివీ లేనివాళ్ళు, పొలం పనులున్నవాళ్ళూ బావుల దగ్గిరికి
చేరుకొన్నారు. మొత్తంమీద మధ్యాహ్నం అయ్యేసరికి గ్రామంలో వయస్సు వచ్చిన మగాడు లేకుండా వెళ్ళిపోయేరు.

వూళ్ళో యిళ్ళలో ఆడవాళ్ళూ, పిల్లలే మిగిలేరు. బిక్కు బిక్కుమంటూ అలికిడైనప్పుడల్లా అదిరి, అదిరి పడుతూ నీడల్లాగా
తిరుగుతున్నారు. పిల్లల్ని ఇంటివద్దనే పడుండమని గడుముతున్నారు. ఎవరన్నా వస్తున్నారేమో చూడమని పొరుగింటి పిల్లలకి
పురమాయిస్తున్నారు.

పిల్లవాళ్ళందరికీ తమ ప్రాముఖ్యత అర్ధం అయింది. ప్రతి యింటివాళ్ళూ తమ సాయం కోరుతున్నారు. పోలీసాళ్ళు వస్తారని
పెద్దవాళ్ళంతా భయపడుతున్నారు. ఆ పోలీసుల రాకపోకల్ని గమనించి చెప్పే బాధ్యత తమ మీద పెడుతున్నారు. మనస్సులో
పోలీసాళ్ళు కొడతారేమోననే భయం మధ్య మధ్య పీకిస్తున్నా హఠాత్తుగా తమ మీద పడ్డ పెద్దరికాన్ని వారు వదులుకోడానికి
ఇష్టపడ్డం లేదు. ఎవరికీ వారే తమతో వెంటబడుతున్న తమ్ముళ్ళనీ, చెల్లెళ్ళనీ పోలీసులు కొడతారని బెదిరించి వెనక్కు
పంపెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. ఆ బెదిరింపు పనిచేయనప్పుడు తామే రెండు కొడుతున్నారు. అదీ పని చెయ్యనప్పుడు గికురించి
పారిపోతున్నారు. తప్పించుకుపోవడం కూడా సాధ్యం కానప్పుడు విసుగూ కోపంతో "నీయమ్మ నేమో చెయ్యా...." యని బూతులు
లంకించుకొంటున్నారు.

కదల మెదలలేని ముసలివాళ్లు కర్రల సాయంతో ఏ చెట్టు కిందికో చేరి దవడలు పీకేలాగ పచ్చాకు చుట్టలు ముట్టించేరు. బాతాఖానీ
కొట్టడానికి ప్రయత్నించేరు. కాని రోజూలాగ మాటలు సాగడం లేదు. అందరి దృష్టీ వేరే చోట వుంది. అందుచేత ఏ అంశం ఎత్తుకున్నా
రెండు మూడు మాటలతో మొండిపడిపోతూంది.

వాళ్ళ చెవులు వూరి వెలపల వున్నాయి. కళ్ళు వీధి మూలల్లో వున్నాయి. మసకబారిన కళ్ళు పత్తికాయలు చేసుకొని వీధిలో
కనబడిన నీడల్ని గుర్తించడానికై ప్రయత్నిస్తున్నారు. ఎంతసేపటికీ తాము ఎదురు చూస్తున్న వాళ్ళు రావడం లేదు. విసుగుపుట్టి,
చుట్ట నలిపి చెవిలో పెట్టుకొని లేస్తున్నారు. దేనికోసమో వెతుకుతున్నట్లు ఆత్మప్రదక్షిణం చేసి మళ్ళీ కూర్చుంటున్నారు.
తెగిపోయిన సంభాషణల్ని మళ్ళీ ప్రారంభించడానికై వ్యర్ధ ప్రయత్నాలు చేస్తున్నారు.

కోటమ్మ వూరి వెలపల బాట పక్కనున్న బండమీద బుట్టెడు ఆముదాలు ఆరబోసి కర్రొకటి పట్టుకు కూర్చుంది. పొద్దుటి ఘటనలో
ఆమె తీసుకొన్న పాత్ర భర్తకి నచ్చలేదు. ఇద్దరూ కాట్లాడుకున్నారు. ఈ ప్రోత్సాహం నువ్వే యిచ్చేవని, నిన్ను
కట్టుకున్నందుకు నన్ను కొడతారేయని మొత్తుకొన్నాడు. కలగబోయే బాధని తలుచుకొని, ముందుగానే పంచనున్న కర్ర తీసి రెండు
తగిలించేడు. కోటమ్మ ఆతని మొగంమీద నఖక్షతాలుంచింది. ఆతడామె కుటుంబం వాళ్ళ గయ్యాళితనాన్ని పట్టుకొని తిట్టేడు. ఆతని
కుటుంబం వాళ్ళలో పెళ్ళాన్ని కొట్టడానికి తప్ప మరో మగతనం లేదని సోదాహరణంగా లెక్క చెప్పింది. తమ పిల్లలకి ఇద్దరిలో
ఎవరి పోలికలు వస్తాయోనని ఇద్దరూ భయం ప్రకటించేరు. మాటల్లో నెగ్గలేక `అమ్మ ఆలీ' బూతులకెక్కువ ప్రాముఖ్యత
ఇచ్చేడు. పోలీసువాళ్ళు వచ్చి మానభంగ ప్రక్రియని ఏవిధంగా జరుపుతారో వర్ణించేడు.

కోటమ్మ మగని చేతకానితనాన్ని దులిపేసింది.

ఆ మాటల్నే ఇప్పుడు బండమీద కూర్చుని చుట్టూ చేరిన ఆడవాళ్ళకి బోధిస్తూంది.

"తొపాకులూ వద్దు తూటాలూ వద్దు. సంకట్లోకి చేసుకున్న కారపు గుండ ఓ పిడికెడు తీసుకొని గాలిబారున నిలబడి కొడితే
నాకొడుకులు...."

గుండా ఎల్లా తియ్యాలో, ఎల్లా విసరాలో, ఫలితాలు ఏలా వుంటాయో వర్ణిస్తూంటే దారినపోయే వాళ్ళు ఓ నిమిషం నిలబడి
ఆనందిస్తున్నారు. ఆఖరున ప్రపంచ రహస్యాన్ని చెప్పేసి కోటమ్మ తన వాదాన్ని ముగించింది.

"పరుగెత్తేవాణ్ణి గొర్రె తరుముతుంది. నిలబడితే నిప్పులు కూడా ఆరిపోతాయి."

* * * * *

సాయంకాలం అయింది; ఏమీ జరగలేదు, పోలీసులు రాలేదు. కనీసం దొరగారి మనుష్యులు కూడా రాలేదు. ఏమిటో రహస్యం ఎవరికీ అర్ధం
కావడము లేదు. చిన్నదానికీ పెద్దదానికీ, సంబంధం వున్నవాళ్ళకీ, లేనివాళ్ళకీ కబుర్లు మీద కబుర్లు వచ్చేవి. ఇప్పుడేమీ
లేవు. ఎందుచేతనో, కబురు వస్తుందేమోననేది ఓ భయం. రాకపోయినా భయమే. కారణం ఎవ్వరికీ తెలియదు. తెలుసుకోనేటందుకు మార్గమూ
లేదు.

ఊరికి రమారమీ మైలు దూరంలో చెరువునానుకొని ఎత్తుబండ మీద దొరగారి గఢీ వుంది. వూళ్ళోకల్లా కాస్త వున్న ఆసాముల పది
ఇళ్ళూ అక్కడే వున్నాయి. అంతా పందిరి రాటకి పనులు చెప్పే రకం. కనక ఎంత పనున్నా ఆ దారిని వెళ్ళే అలవాటు వూళ్ళో
వాళ్ళకి లేదు. అక్కడ ఏం జరుగుతుందో తెలియడం యెల్లాగ? సేతుసిందీ గోవిందునడిగితే తెలుస్తుంది. తీరా ఆతని కోసం వెడితే వూళ్ళో
లేడంది, ఆతని పెళ్ళాం. ఎక్కడికెళ్ళేడంటే దొర పంపేడంది. ఇంకేముందని వచ్చినవాడు రెండో ప్రశ్న వెయ్యకుండా పరుగెత్తేడు.
కాని, ఆ భయం అనవసరమని అప్పుడే తెలిసిపోయింది. దొర ఆతడిని పంపించి రెండు రోజులయింది. ఆ మాట విని పరుగెత్తుతున్న
వాళ్ళు నిలబడి "నిజమేనా?" అని అడిగేరు.

మళ్ళీ ప్రయత్నం ప్రారంభం అయింది. ఈమారు మాలగూడెం పెద్ద శీనయ్య నుంచి భోగట్టా తియ్యడానికి ప్రయత్నించేరు. శీనయ్యే మరో
సేతుసిందీ.

ఎప్పుడు పిలవడానికి వెళ్ళినా తన్ను తిట్టి, పటేల్‌ చేత తిట్లు తినిపించే రైతులు నేడు ఇరుకునపడడం శీనయ్యకు
చాలా సంతోషంగా వుంది.

గూడెం నలుగురినీ పిలిచి పోగుచేసేడు. రైతుల మీద దొర ఎల్లా కసి తీర్చుకొంటాడో చెప్తుండగా గొల్లభాగయ్య వచ్చేడు. ఏదో పెద్ద
పని వున్నట్లు వొచ్చి అసలు విషయం తెలుసుకోవాలనుకొంటున్న భాగయ్యని ఎగతాళి చేసేడు.

"ఏమయ్యొవ్ గొల్లాయన? ఏమన్నా రెండెకరాలన్నా కిట్టుబాటయ్యేనా?"

భాగయ్యకి కోపం వచ్చింది. మళ్ళీ ఎత్తిపొడిచేడు.

"నీ అల్లుడికి పటేల్‌గిరీ దొరకలా?"

నిరుడు వెట్టి వ్యతిరేక పోరాటాల కాలంలో మాలలు వుద్యమంలో చేరకుండా విడదీసేటందుకై నిజాం ప్రభుత్వం ఓ ఎత్తుగడ వేసింది.
మాలలకు ముస్లిం మతం ఇచ్చేటందుకు జరిగిన ప్రయత్నాలు ఇదివరకే విఫలం అయ్యాయి. ఈమారు మతంతోపాటు ఇతర ఆశలు కూడా
చూపించ ప్రయత్నించేరు. గూడెంలో కాస్త నోరున్న వాడికి గ్రామ పటేల్ పదవులనిచ్చేరు. ఆ ఎగలో శీనయ్య అల్లుడు సున్నతి
చేయించుకొన్నాడు; ‌‌పటేల్‌గిరి సంపాదించేడు.

కాని, వూళ్ళో పెద్ద కులాల వొత్తిడికి మతంమార్పూ నిలబెట్టుకోలేక పోయేడు. పటేల్‌గిరీ పోయింది.

భాగయ్య ఎత్తిపొడుపు అనాలోచితం.

మాలవానికి వుద్యోగం ఇవ్వడం, వాళ్ళు ముందుకు రావడమూ ఇష్టంలేక పెద్ద కులాల వాళ్ళు చేసిన దౌర్జన్యంగానే వారు దానిని
భావిస్తున్నారు. అందుమీద కొంత సేపు వాగ్వాదం జరిగింది. ఏమీ తేలలేదు. భాగయ్య వెళ్ళిపోయేడు.

దారిలో వెట్టిమాదిగ ఎదురయ్యేడు. కాని, ఆతను చెప్పగలదేమీ లేదు. ఆ రోజున ఉత్తరం ఏదీ తీసుకొని ఎవ్వరూ పోలీసు నాకాకి
వెళ్ళలేదు. కాని, ఆ విషయం కూడా నమ్మకంగా చెప్పలేదు. మధ్యాహ్నమే కిష్టయ్య ఎక్కడికో వెళ్ళేడు.

అంటే ఇంక లాభం లేకపోయింది. ఆ ప్రయత్నం ఆగింది.

చీకటి పడింది మొదలుకొని జనం ఒక్కరొక్కరే అడుగులో అడుగు వేసుకుంటూ ఊళ్ళోకి వస్తున్నారు. ఇంటి వద్ద ఏదో దుర్వార్త
వినబడుతుందనే ఆశంక. కానీ, అటువంటిదేమీ జరగలేదు. ఇంటిపై ఆకు కూడా కదలలేదు. కదలకపోవడం కూడా అనుమానించదగిందే.
ఎందుకు కదలలేదు?.... చడిచప్పుడు లేకుండా మూకుళ్ళు నాకేసేరు. గొంగళ్ళు భుజాన వేసుకున్నారు.

బొడ్డురావి వద్ద పదిమందీ చేరేరు. ఆలోచన ప్రారంభించేరు.

దొర ఆలోచన ఏమిటి గానీ. ఈ ప్రశాంత స్థితికి మోసపోరాదని అంతా ఏకాభిప్రాయానికి వచ్చేరు. తెల్లవారగట్ల ప్రజలంతా
ఆదమరచి వున్నప్పుడు పోలీసుల్ని తెచ్చి వూరు చుట్టేయ్యాలనుకుంటున్నాడో యేమో; తెల్దారు పల్లెలో వాళ్ళు చేసిందదే. గుర్రాల మీద
కూడా పోలీసు బలగం వస్తూంది. రెండేసి వూళ్ళని కౌగిలేస్తారు. సరిగ్గా తెల్లావారేముందే, మసక చీకటి వుండగా ప్రారంభం చేస్తారు.
బయటికి పోయేవాళ్ళని కూడా నిలేస్తారు.

అప్పుడు ప్రారంభమవుతుంది కొట్టుడు. పోలీసాళ్ళ ఫక్కీ అంతా ప్రజాశక్తిలో తు-చ తప్పకుండా ఇచ్చేరు. తమ రహస్యాలని బయట
పెడుతూందని, ఆ పత్రికని నిజాం సర్కారు నిషేధించింది. నిషేధించినా ఎల్లాగో వస్తూనే వుంది. చాటునా మాటునా కొందరు అందులో విషయాలు
చదువుతూనే వున్నారు. ఆ వార్తలంతా వింటూనే వున్నారు.

తెల్లారగట్ల పోలీసులు వస్తే రావచ్చుననే ఆలోచన తోచేక అందరూ రాత్రిపూటే వూరొదిలి పోయేరు. బావుల దగ్గిరికి చేరుకున్నారు.
ఆడవాళ్ళూ బిక్కు బిక్కుమంటూ ఇళ్ళల్లోనే వుండిపోయేరు.

తెల్లవారింది. సాయంత్రం అయింది. మళ్ళీ తెల్లవారింది. పోలీసుల పత్తాయే లేదు. శివరామిరెడ్డి ఆలోచనలూ బయట పడలేదు.
ఒక్కటి నమ్మిక చిక్కింది. ఆయన ఏం చెయ్యబోవడం లేదు.

ఎందుచేత?....

ఏం చేస్తాడో అన్న ప్రశ్నకెంత సమాధానమో దీనికీ అంతే సమాధానం. ఎందుకూరుకున్నాడంటే ఎవరేం చెప్తారు?

కాని, జనం మనస్సులు సమాధానం లేదని సంతృప్తిపడి వూరుకోలేవు. తామే ఒక సమాధానం కల్పించుకొంటాయి.

అలాగే ఇప్పుడూ సమాధానం కల్పితమయింది. జనం అంతా ఎదురు తిరిగేటప్పటికి దొర భయపడి వుంటాడు. వుంటాడేమిటి? భయపడ్డాడని
చాకలి మంగమ్మ రేవులో అన్నట్లు ఎవరో అన్నారు. మంగమ్మ గఢీలో పని చేస్తోంది. కనక నమ్మదగిన మాటే అయి వుంటుంది.
తీరా వెళ్ళి అడిగితే ఆమె ఆ మాటే ఎరగనంది. అయినా ఆ మాట ప్రచారం అవనే అయింది. అంతా నమ్మనే నమ్మేరు. "దొర
భయపడ్డాడ"నే మాట అందరి నోటా ప్రతిధ్వనించింది.

ఎంతో తటపటాయిస్తూ, భయంతో, పైకి తేల్చలేక తేల్చలేక వెలిబుచ్చిన ఈ అభిప్రాయం జనానికి జివ కలిగించింది. దొరలకి భయం
పుట్టించడం అంటే మాటలా?

ప్రతివారూ తాము చేసిన పనిలో దొరకి అంత భయం కలిగించినదేముందని ఆలోచించేరు. ఆలోచించినకొద్దీ ఆ రోజున తాము వేసిన ప్రతి
మాటా అరివీరభయంకరంగానే కనబడింది.

కిష్టయ్యతో సత్తెమ్మ పేచీ పెట్టుకుంటే తమకందరికీ చేటు వస్తుందని భయపడ్డవారు కూడా ఆ విషయాన్నిప్పుడు పూర్తిగా
మరిచిపోయేరు. ఇప్పటి ఆలోచనలు వేరు, కిష్టయ్య ఎదురు తిరిగితే తాను ఎంత దెబ్బ ఎల్లా కొట్టేసేవాడో మనస్సులోనే
వూహాయుద్ధం సాగించేరు. చివరకా వూహాయుద్ధం అంతా నిజమేననుకొనే స్థితికి వచ్చేరు.

రంగయ్య వచ్చి అడిగేసరికి అసలు జరిగిందేమిటో ఎవ్వరూ చెప్పగల స్థితి లేదు. వాళ్ళు చెప్తున్న కథాసాగరంలో నిజం ఏమిటో
ఆతనికి అంతు చిక్కలేదు.

పొలం దరిదాపులకైనా వెళ్ళని తల్లి ఏమీ చెప్పలేకపోయింది. అమ్మి కర్ర తీసుకు వెంటబడిందనీ, ఆమెని ఆపడం ఎవరితరం
కాలేదనీ మాత్రమే అమె చెప్పగలిగింది.

భార్య మరికొన్ని వివరాలు చెప్పింది. కిష్టయ్య వీపున సత్తెమ్మ జువ్వకర్ర విరగ్గొట్టిందంది. ఆ వార్తకి బలంగా చూరులోంచి
విరిగిన జువ్వకర్ర ముక్క తీసి చూపించింది.

ఈ ఘటన జరిగేక సత్తెమ్మ ఇంటిపట్టున వుండడమే లేదు. ఎప్పుడో వస్తుంది. ఇంత తిండి తింటుంది. వెళ్ళిపోతుంది. వెంకటయ్యతో
మళ్ళీ సంబంధం పెట్టుకుంటుందేమోనన్న అనుమానం మనస్సులో పీడిస్తున్నా వీరమ్మ ఆమెను ఆపడానికి సాహసించలేదు. ఏ క్షణంలో
పోలీసులు వస్తారో, దొరికితే మానానికీ, ప్రాణానికీ కూడా మొప్పం. అందుచేత వచ్చినప్పుడింత తిండి పెట్టి వెంట వెంటనే పంపేస్తూంది.
ఒక్కొక్కప్పుడామె తిండికీ రావడం లేదు. ఎక్కడ తింటున్నావన్నా, ఎక్కడుంటున్నావన్నా ఏమీ చెప్పదు.

రంగయ్యకి ఏం జరిగిందో, ఎల్లా జరిగిందో వివరాలు అర్థం కాకపోయినా తన భూమిని గ్రామం అంతా కలిసి కాపాడారనేది స్పష్టం
అయింది. తన అక్కగారి చొరవ ఆ పనిలో చాల వుపయోగించిందని కూడా గ్రహించేడు. వూరంతా సత్తెమ్మ చొరవని తెగ పొగిడారు.

మామగారి వద్ద తాను చేసిన ప్రతిజ్ఞా, దానిని అమలు జరిపేటందుకు వేసుకొన్న ఎత్తులు, చేయవలసి వుంటుందనుకొన్న పోరాటం, -
తన కర్తృత్వంతో నిమిత్తం లేకుండానే కార్యరూపంలోకి వచ్చేసేయి. తాను చేయవలసిన పని పూర్తయినందుకు సంతోషంగానే వుంది. అందులోనూ
తన అక్క చేసిన సాహసానికి బ్రహ్మానంద పడ్డాడు. ఆమె మీద ఎంతో భక్తి కలిగింది. ఆ భక్తిని ప్రదర్శించడానికి ఎన్నో
మార్లు ప్రయత్నించేడు. కాని, సత్తెమ్మ లక్ష్యం చేయనేలేదు.

రెండో వైపున కార్యం సానుకూల పడిన విధానానికి ఎంతో బాధా కలిగింది.

తానే వుంటే తానూ ఇప్పుడు జరిగిన పనినే చేసి వుండేవాడు. కిష్టయ్యని తరిమేసేవాడే. ఆతడు ఏమన్నా అంటే నాలుగు తగిలించేవాడే.
కోర్టుకెడితే ఓ చెయ్యి తానూ చూచేవాడు. అయితే అదంతా వ్యక్తిగతంగానే వుండిపోయేది. అందులో ప్రజలు చేయవలసిందల్లా తనకి
వ్యతిరేకంగా దొరలతో చేరకపోవడమే.

కాని, ఇప్పుడు జరిగింది వేరు. ఇందులో తన చెయ్యి ప్రత్యేకంగా ఏమీ లేదు. బాధ్యత మాత్రం తప్పదు. తన భూమి
కాపాడబడింది. కాని, ఒక తిరుగుబాటే జరిగిపోయింది. ఒక చిన్న విప్లవం. దాని ఫలితాలు కోర్టుల్లోనూ, సాక్షులతోనూ తేలవు.
తుపాకులతో పని తగులుతుంది.

ఈ నాలుగు రోజుల్లోనూ ప్రజల్లో కనిపిస్తున్న మార్పు చూసేసరికి రంగయ్యకు మరీ కంగారు పుట్టింది. మంది మంచి హుషారులో
వున్నారు. కొంతమంది సాము నేర్చుకొంటున్నారు. ఎందుకో వాళ్ళకే తెలియదు. తమరు చేసిన పనికి నిజాం పోలీసులు వస్తారని తెలిసి
తయారవుతున్నారా? పోలీసులు వస్తే చేతులూపుకొంటూ రారు. బందూకులతో వస్తారు. వీళ్ళూ, వీళ్ళ కర్రలూ ఏం చేస్తాయి? కర్ర
తిప్పుతూ, అడుగు వేస్తూ, గిరికీలు కొట్టి ఆయాసంతో చదికిలబడుతూంటే బందూకులున్నవాడికి భయమా? పోలీసులనెదుర్కోడానికీ సాము
నేర్చుకొంటున్నామని వాళ్ళూ చెప్పడం లేదు. కాని చేస్తున్నారు. అది చాలు, పోలీసులకి.

కలగబొయ్యే పర్యవసానాలు తలుచుకొన్నకొద్దీ రంగయ్యకి కంగారు ఎక్కువవుతూంది. తాను ఎరిగున్న ఒకళ్ళిద్దరితో ఇదేం మంచిది
కాదన్నాడు కాని, ఆ ఇది ఏమిటో చెప్పలేడు. దొర ఆక్రమించుకోబోతూంటే జనం అడ్డం వెళ్ళడమా? ఆ మాటని ఆతడే అనలేడు. ఆ
విధంగా అడ్డం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవ్వరినీ కొట్టలేదు. బాధించలేదు. మరి! తన అసంతృప్తి దేనికో తానే చెప్పలేడు.

కాని, అసంతృప్తి మాత్రం మనస్సుని కలిచేస్తూంది.



రెండో ప్రకరణం


తన బావికాడకయినా సరే బుడన్ రావడం సిలార్ సాయబుకేమాత్రం ఇష్టం లేదు. అయినా కూర్చోమని ఓ రాయి చూపించేడు. బుడన్
ఎంతకాలం కనబడకపోయినా సిలార్ విచారపడడు. అయినా మర్యాద కోసం చాలరోజులక్కనబడ్డావే అన్నాడు.

బుడన్ మందహాసం చేస్తూ ఏదో నసిగేడు. సిలారు దానిని వినిపించుకోనూలేదు. పట్టించుకోనూలేదు. ఆతని ఆలోచనలన్నీ ఒక్క ప్రశ్న
మీదనే కేంద్రీకరించి వున్నాయి.

"వీడెందుకొచ్చినట్లు?"

మరో ప్రశ్న దానికనుబంధంగానే మనస్సులో గిరికీలు కొడుతూంది.

"వీడెప్పుడు వొదిలిపోతాడు?"

బుడన్ తానెందుకొచ్చిందీ చెప్పలేదు. ఎప్పుడు పోయేదీ తెలియనియ్యలేదు. ఆతడు తన్ను గురించి కన్న, భారతదేశంలో అధికారంలో
మిగిలిన ఒకే ఒక ముస్లిం నవాబు భవిష్యత్తును గురించి ఎక్కువ బాధపడుతున్నట్లు కనిపించేడు. ఆయన్ని గద్దె నుంచి దింపడానికి
హిందువులు చేస్తున్న కుట్రలు పెద్ద ఎత్తున వివరించేడు. అవే గనక నెగ్గుతే కలగగల నష్టాల్ని ఏకరువు పెట్టేడు.

"మన ముసల్మానుల్ని బ్రతుకనిస్తారా?"

హిందువులకీ, ముసల్మానులకీ మధ్య జరగగల కొట్లాటల్లో ముస్లిములకు కలగగల నష్టాల్ని సవివరంగా బుడన్ చెప్పేడు. ముస్లిం
మతానికి, జాతికీ మహాప్రమాదం కనిపెట్టుకొని వుంది.

సిలార్ సాయబు ఎటువంటి పరిస్థితుల్లోనూ నమాజ్ మరచిపోడు. తన మతానికి ఏదో ప్రమాదం రాబోతూందని చెప్పే సరికి కళ్ళు
ఎత్తేడు. సావధానుడయ్యేడు.

బుడన్ ఈ విషయాన్ని గమనించి కూడా గమనించనట్లే చెప్పుకుపోయేడు.

"మన నవాబు పరిపాలిస్తుండగానే...."

ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు హిందూ ముస్లిం గలాటాలు జరిగేయో దానికి హిందువులే ఎలా కారణమో బుడన్ చెప్పుకుపోతున్నాడు. అల్లుడు
హోదాలో ఆతని యింట వున్నప్పుడు సిలార్ చెప్పిన ఔరంగాబాద్ మతకలహాల అనుభవాన్ని కూడా తన వాదనకు బుడన్
ఉపయోగించుకున్నాడు.

"....ఇంతింత అన్యాయాలు ముస్లిములకు జరిగిపోతున్నయ్యే, ఆయన బలమే లేకపోతే అసలు నిలవనిస్తారా?"

సిలార్ కొన్ని ఏళ్ళ క్రితం మొహర్రం పండుగలకి ఔరంగాబాద్‌లో వుండడం తటస్థపడింది. ఆతడక్కడుండగానే మతకలహాలు
చెలరేగేయి. ఆ కలహాల్లో చావు తప్పి బయటపడ్డవాళ్ళల్లో ఆతడొకడు. బుడన్ ఆ జ్ఞాపకాల్ని రేపి, మనస్సు
కలవరపరిచేడు. సిలార్‌కానాటి ఘటనలన్నీ మనస్సులో మెదిలాయి. ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళీ నెమరువేశాడు. బుడన్ చాల
శ్రద్ధగా విన్నాడు. మధ్య మధ్య ప్రశ్నలు వేస్తూ మరచిపోయిన వివరాలు మళ్ళీ చెప్పించేడు.

"అబ్దుల్ ఘనీ ఎంత మంచి డాక్టరు. ఎంత తెలివి. బీదా సాదా అంటే ఎంత ప్రేమ? అలాంటివాడిని హాస్పిటల్‌లో
ఆపరేషన్ చేస్తూండగా తల పగలగొట్టి చంపేసేరు...."

హత్యా వివరాలు చెప్పించి బుడన్ డాక్టరు మరణానికి సంతాపం వెలిబుచ్చుతూ కళ్ళు ఒత్తుకున్నాడు. పరుపులు కుట్టుకొని బ్రతికే
ఒక దూదేకుల సాయిబు దుకాణాన్ని దుండగీళ్ళు తగులబెట్టిన సంగతి చెప్తుంటే సిలారు కళ్ళు చెమ్మగిల్లేయి. ఆతని దుఃఖానికి
సానుభూతి తెలుపుతూ బుడన్ ఆవేశం ప్రకటించేడు.

"ఈ దురంతాలు చేసిన వాళ్లని...."

ఆ కొట్లాటల్లో ముస్లిముల పాత్ర తక్కువేం కాదనీ, మొదట్లో హిందువులదే పై చెయ్యి అయినా తర్వాత సర్కారు, పోలీసుల సాయంతో
వలసినంత ప్రతీకారం జరిగిందనీ ఆతడు ఎరుగును. కాని, సిలారుకు ఆ విషయం తెలియదు. కొట్లాటల ప్రారంభంలోనే చచ్చినంత
పనయి రైలు ఎక్కేసేడు. కొట్లాటలకు, హత్యలకు కారకులయిన వారిని ప్రభుత్వం అరెస్టు చేసిందన్నదొక్కటే అతనికి తెలుసు.
ఆ మాటనే చెప్పేడు.

నవాబు పాలన వుంది గనకనే ఆ మాత్రమైనా సాధ్యమయిందన్నాడు బుడన్. సిలారు తల వూగించేడు.

ఈమారు బుడన్ ముస్లిం మతాన్ని రక్షించేటందుకూ వృద్ధి పరచేటందుకూ ఖాజీ వంటి గొప్ప వాళ్ళు ఏ విధంగా పని చేస్తున్నారో,
హిందువులు వానికి ఏ విధంగా విఘాతాలు కలిగిస్తున్నారో చెప్పేడు.

సిలారుకు అవన్నీ తెలుసు. పల్లెటూళ్ళల్లో మాల మాదిగలకు ఇతర దళిత జాతులకూ తురక మతం ఇప్పించి, - వారిని ఇతర
కులాలమీదికి ఎగతోలేటందుకే - ఖాజీ తీవ్రమైన వుద్యమమే సాగిస్తున్నాడు. ఆ విధంగా మతం మార్చుకొన్న వాళ్ళ మీద పెద్ద
కులాల వాళ్ళు ఆర్థిక ఆంక్షలుపయోగించి లొంగదీసుకొంటున్నారు. ఆర్యసమాజం ద్వారా వారిని శుద్ధి చేస్తున్నారు.

ఖాజీ ముస్లిం మత ప్రచారానికి తీసుకున్న శ్రద్ధ మూలంగానే ఆయన భూముల్ని రైతులు వదలకుండా చేయిస్తున్నారని బుడన్ చెప్పేడు.

"మన మతంలోని కాస్త తలకాయల్ని ఏరి ఖతం చేసేస్తారు. ఆ తర్వాత మన వంతు. అలా జరగడానికి వీలు లేకుండా నిజాం
సర్కారు అడ్డం వుంది. అందుచేత ఇప్పుడాయన మీద కత్తి కట్టేరు. యూనియన్‌లో చేర్చి కాళ్ళు చేతులు కట్టేసి మన
పని పట్టాలని చూస్తున్నారు. నిజామ్ చాలా తెలివిగలవాడు. ఆయన ఆ ఎత్తు పసి కట్టేసేడు. నేను చేరను గాక చేరను
అన్నారు. హిందువులు తగ్గి వచ్చినట్లు కనబడుతూ ఆయన కాళ్ళకి ఎల్లాగైనా బంధం వెయ్యాలని చూస్తున్నారు. కాని అవేం సాగవు.
మన ఖాజీమియా, కాశింరజ్వీసాబ్ వాళ్ళంతా సర్కారుకు దీనిలోని మోసం చెప్తున్నారు. ఏమయినాసరే యూనియన్‌లో చేరేది లేదు
అన్నారు. హైదరాబాద్ ఆజాదీ ప్రకటించాలంటున్నారు...."

అర్థం అయినట్లుగా సిలార్‌ సాయిబు తల వూగించేడు.

ఆ ప్రోత్సాహంతో బుడన్‌కు హుషారు పుట్టింది. ముస్లింలకు ఆపద్భాంధవుడైన నిజాం ప్రభువు గొప్పతనాన్ని గురించి ఎంతో
వుత్సాహంతో చెప్పుకు పోయేడు.

ఆ మధ్యన ఆతడు హైద్రాబాద్ వెళ్ళినప్పుడు నిజాము కోఠీని అల్లంత దూరంనుంచి చూడగలిగేడు. నిజామును చూసేననుకొన్నాడు. ఆయన
పరివారంతో నగర వీధుల్లోకి బయలుదేరాడు. ఆ వేళకి సరిగ్గా రోడ్ల మీద నరసంచారం బంద్ అయిపోయింది. ఒక్క గంటసేపు రోడ్డు
వదలి పక్కన కూడా నడవనియ్యలేదు. ఎక్కడివాళ్ళనక్కడే ఆపేసేరు. ఉన్నట్లుండి పోలీసుల ఈలలు కీచు గొంతులతో వినిపించేయి.
ఒక జీప్‌లో మర తుపాకులతో సైనికులు కూర్చుని వుండగా అది ముందు బర్రున సాగిపోయింది. కొద్దిసేపటికి ఓ డజను
కార్లు వచ్చేయి. వాటిలో కొన్నింటికి సిల్కు తెరలు. అవి ఎంత వేగంతో వెళ్ళేయి. వాటికడ్డం వస్తే మరి బ్రతుకుందా? అటువంటి
ప్రమాదాలు జరగకుండేటందుకే దయామయుడైన ఆలా హజ్రత్ రహదారి బంద్ చేయించేసేరు!

ఆ కార్లు వెడుతూండగా తన ప్రక్కనున్నవారెవ్వరో "నిజామ్ సర్కారు" అన్నారు. ఎవరిని గురించి ఆ మాట అన్నారో, కనీసం ఏ
కారులో వున్నవారిని చూపి అన్నారో కూడా బుడన్‌కు తెలియదు.

కార్ల శబ్దాన్నీ, నడకనీ అనుకరించే శబ్దాలతో సాభినయంగా నిజాము హైద్రాబాద్ వీధుల్లో ఊరేగే పద్ధతిని బుడన్ మహోత్సాహంతో
చెప్తూంటే, సిలార్‌సాయిబు ఆశ్చర్యార్థకాలు వెలువరుస్తూ నోరు తెరిచి వింటున్నాడు. మాట మధ్యలో నవాబుకు మూడు వందల
మంది పెళ్ళాలున్నారుట కాదా అన్నాడు.

నిజాం నవాబుకు ఎందరు పెళ్ళాలున్నారో ఎవరికీ తెలియదు. ముస్లిం జాగీర్దార్లూ వాళ్ళూ నవాబు ప్రాపకం కోసం అందమైన కూతుళ్ళని
నవాబు అంతఃపురంలో వప్పచెప్తూంటారని జనవాక్యం. పైగా పెళ్ళాల సంఖ్య మనుష్యుని గొప్పదనానికి గుర్తుగా భావించే సమాజం. కనక
నవాబుకు గల భార్యల సంఖ్య అవసరాన్ని పట్టి పెరుగుతూంటుంది.

ముసిలి సిలార్ నిజాం భార్యల సంఖ్య వాకబు చేస్తూంటే బుడన్ వుత్సాహం పట్టలేకపోయేడు. సంఖ్య ఇంకా ఎక్కువగా వుంటుందని గంభీరంగా
చెప్పేడు.

"రోజుకో పెళ్ళాం చొప్పున మూడువందల అరవైమందో, అరవైనాలుగుమందో వున్నారంటారు."

సూర్యమానం లెక్కలు తీసుకోవాలో, చంద్రమానం లెక్కలు తీసుకోవాలో బుడన్ చటుక్కున తేల్చుకోలేకపోయేడు. అందుచేత నిజాం నవాబు
భార్యల సంఖ్యని కూడా ఇదమిత్థమనలేక పోయేడు.

ఈ భార్యలు, అనంతంగా వున్న పరివారం కోసం నవాబు సువారంలోంచి ఉదయం మొదలు సాయంకాలం వరకూ నెత్తి గంపల్లోనూ, నల్లని
కంచరగాడిదలు కట్టిన బళ్ళల్లోనూ ఆహారం పంపిస్తూంటారన్నాడు. బళ్ళల్లో వుండే పదార్థాల్ని ఆతడు చూడలేదు గాని రోడ్ల వెంబడి
ప్రతి మూలలోనూ, అన్నప్పుడూ కనిపిస్తూండే ఆ కంచరగాడిద బళ్ళ వైశాల్యమూ, వాటిలో ముందు వెనుకా కూర్చుండే చోపుదారుల సంఖ్యా
చూసి, దానికనుగుణంగా సువారంలోంచి వెళ్ళే పదార్థాల పరిమితిని వూహించుకొన్నాడు. అదే సిలారుసాయిబు ముందు వర్ణించేడు.

పచ్చటి గుడ్డల్లో తాంబళంపెట్టి నెత్తిన పెట్టుకొని ఒక్కొక్కమారు పదేసి, పదిహేనేసిమంది వెడుతూంటారు. అందుచేత నిజాం ఔదార్యం
చాల గొప్పదే అయి వుండాలి.

గంప పెద్దదేగాని, అందులో పిడికెడు మెతుకులు కూడా వుండవనీ హైద్రాబాద్‌లో వాళ్ళు చెప్పేరు. కాని, బుడన్ ఆ మాట
మాత్రం చెప్పలేదు. నవాబు సువారంలో వండుతారని తోచిన వంటకాల పేర్లన్నీ ఏకరువు పెట్టేడు. పులావు మంచి రుచిగా వుండాలంటే ఏమేం
సరుకులు, దినుసులు వెయ్యాలని తన అభిప్రాయమో అవన్నీ తడుముకోకుండా ఏకరువు పెట్టేడు. నవాబు పంపే గంపల నిండా అటువంటి
రసవత్తర పదార్థాలే వుంటాయని వర్ణించేడు. సిలార్ ఆ స్వాదు పదార్థాల రుచి తలుచుకొని నాలుకతో పెదవులు తడుపుకొన్నాడు.

బుడన్ మంచి మాటకారి. మనస్సులో ఎంతో కోపం, అసహ్యం పెనుగులాడుతున్నా సిలార్‌సాయిబు ఆలోచనలన్నింటినీ ఆ
మాటకారితనంతోనే కట్టేసేడు. ముస్లిం మత రక్షణకై ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఏలా పని చేస్తూందో, ఖాజీ మొదలయినవాళ్ళు ఎంత
కష్టం, ఖర్చూ వోర్చి రజాకార్లని సమీకరించవలసి వస్తూందో చెప్పేడు. రజాకార్లలో చేరి జెహాద్ సాగించవలసిన బాధ్యత
ముస్లిమయి పుట్టిన ప్రతి ఒక్కని భుజస్కంధాల మీదా వుందన్నాడు.

ఆ పవిత్ర కార్యక్రమంలో పాల్గోలేకుండా వయస్సు అడ్డం వచ్చినందుకు సిలార్ ఒక్క నిట్టూర్పు విడిచేడు.

అంతవరకు బహు జాగ్రత్తగా గ్రంథం నడుపుతున్న బుడన్ ఒక్క తప్పటడుగు వేసేడు. సిలార్‌కు తన మీద వున్న
అసహ్యం ఆతడెరుగును. కాని, అంత అసహ్యాన్నీ కప్పేసి, తన వుద్యమానికి అతని సహాయాన్ని సంపాదించగలిగానని సిలార్
నిట్టూర్పులో ఆతనికి దిలాసా దొరికింది. ఆ ధైర్యంతోనే ముంతాజ్ యోగక్షేమాలు అడిగి, ఆమె తనను గురించి ఎప్పుడన్నా అడుగుతుందేమో
తెలుసుకొనగోరేడు.

వెంటనే సిలార్ సావధానుడయ్యేడు. ముంతాజ్ పేరు ఎత్తే అర్హత కూడా బుడన్‌కి లేదని సిలార్ నమ్మకం. మరల వెనుకటి
సంబంధం పునరుద్ధరించే వుద్దేశం ఆతనికేమాత్రమూ లేదు.

సిలార్‌లో వచ్చిన మార్పును చూసి కూడా చూడనట్లుగనే బుడన్ సంభాషణను మార్చేడు.

మరో అరగంట కూర్చుని ఆ కబుర్లూ, ఈ కబుర్లూ చెప్పి లేచేడు. ముసలివాని ధోరణికి మనస్సు కుతకుతలాడుతున్నా పైకి
తేలలేదు. మరో రెండునాళ్ళల్లో ఖాజీ ఇంటి వద్ద ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సభ జరుగుతూందని సిలార్‌నూ రమ్మనీ
పిలిచేడు. ఈమారు సిలార్ వెనకటంత వుత్సాహం చూపలేదు. ఖాజీ ఇదివరకోమారు బుడన్‌తో బాంధవ్యం పునరుద్ధరించుకోమని
కబురు పెట్టేడు. ఇప్పుడు బుడన్ ఆ ప్రయత్నమే చేసేడు. ఇప్పుడు ఖాజీ రమ్మన్నదెందుకయినా అక్కడ ఈ విషయం మీద ఒత్తిడి
తెస్తారనిపించింది. సమాధానం ఇవ్వలేదు.

బుడన్ ఇంకా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా లేడు. వూరుకున్నాడు.

ఇద్దరూ బావి దగ్గర నుంచి బాట మీదికి వచ్చేరు. సాయంత్రం అయింది. పుంతలో దుమ్మంతా లేవగొడుతూ పెద్ద గొర్రెల మంద
వాళ్ళకెదురు వచ్చింది. దారి వదలి ఇద్దరూ పక్కగా నిలబడ్డారు. బుడన్ మందను చూస్తూన్నాడు. మంచి బలిసిన గొర్రెపొట్టేలు
మంద మధ్య సగర్వంగా నడుస్తూ ఆతని కళ్ళ ఎదుట నుంచి సాగిపోతూంది. హఠాత్తుగా ఆతనికి ఒక సంగతి తోచింది. రెండు రోజుల్లో
ఖాజీ ఇంటి వద్ద పెద్ద సభ జరుగుతూంది. వేట సంపాదించమని ఖాజీ కొంత డబ్బు తనకిచ్చేడు. వెంటనే మందకడ్డుపడి పొట్టేలు
కొమ్ములు పట్టుకొన్నాడు. దానిని మంద బయటికి లాక్కువచ్చేడు.

"సభ రోజున పులావు"

తన దూరదృష్టికీ, జేబులో మిగలగల డబ్బుకీ బుడన్ సంతుష్టితో కళ్ళు చికిలించి, చిన్న నవ్వు నవ్వేడు. సిలారు ముఖంలో
అయిష్టం కనబడింది. కాని, తాము ప్రారంభించవలసి వున్న జెహాద్‌కు ఖర్చు కాఫిర్ల నుంచే రాబట్టవలసి వుందనే ధర్మ
సూక్ష్మాన్ని బుడన్ వెలువరించేడు.

అప్పటికప్పుడే మంద నిలబడిపోయింది. గొల్లలు తమ పోతును వదలమంటూ ప్రాధేయపడుతున్నారు.

"నీకాల్మొక్కుతా. విడిచిపెట్టు దొరా!"

బుడన్ గొర్రెను పట్టుకొన్నది వదిలిపెట్టేటందుకా? ఆ సంగతి గొల్లలకీ తెలుసు. ఆతని క్రూర స్వభావం వాళ్ళకెరికే. మామ
దొడ్డిలోకి పంది వచ్చిందనే నెపంతో బుడన్ వడ్డెరవాణ్ణి పొడిచి చంపినవాడు కాదూ? ఆ కేసు కోర్టుల్లో మాసిపోయినా ప్రజల
మనస్సులో మాసిపోలేదు. ఆ క్రూరత్వాన్ని కట్టుకొన్న పెళ్ళామూ, పిల్లనిచ్చిన మామా కూడా మరిచిపోలేదు. గ్రామస్థులూ
మరిచిపోలేదు. ఆనాడు చేసినంత పనీ మళ్ళీ చేయగలవాడే. కనకనే గొల్లలు అంతంత దూరం నుంచే కాల్మొక్కుతున్నారు.

బుడన్ వాళ్ళ గోడు లెక్క చెయ్యలేదు. పోతు మెడలో తలపంచ కట్టి లాక్కుపోడానికి ప్రయత్నించేడు. అది కాళ్ళు బిగతన్ని
కదల నిరాకరించింది. బాట ప్రక్కనున్న సీతాఫలం కొమ్మ విరిచి దానితో పిర్రమీద రెండు అంటించేడు. పోతు ఈమారు నడవడానికి
వొప్పుకొంది. గొల్లలు వెంటబడ్డారు. సాధారణమైన జీవాన్ని ఇచ్చి దానిని దక్కించుకొనేటందుకు ప్రయత్నించేరు. దేవరపోతును విడిచి
మరొకటి తోలుకు పొమ్మన్నారు.

రెండో పోతును కూడా తీసుకెళ్ళడానికి బుడన్ సిద్ధమే. కాని, దేవర పోతయ్యేది. దెయ్యం పోతయ్యేది, దానిని మాత్రం
విడిచిపెట్టడు. వెంటబడ్డ గొల్లలకు ఖబడ్దార్ చెప్పాడు. వెళ్ళిపోతూ మామ వంక చూచి పళ్ళు ఇగిలించేడు.

"ఎల్లుండి తప్పకుండా రావాలి."

సిలార్ సమాధానం చెప్పలేదు. జెహాద్ దెబ్బ మొదట రుచిచూచిన గొల్లల వంక జాలిగా చూచేడు. తల వంచుకొని ఇంటికి వడివడిగా
నడిచేడు.



మూడో ప్రకరణం


శివరామిరెడ్డి పూజ పూర్తి చేసేడు. దేవుని బొమ్మ ఎదుట సాష్టాంగపడి లేచి నిలబడ్డాడు. దేవుని పాదాల వద్దనున్న పువ్వొకటి
తీసి చెవిలో పెట్టుకొని, సంతృప్తి దీపించే ముఖంతో దేవుని గది వదిలి బయటికి వచ్చేడు. గుమ్మం పక్కనే వేసిన తిన్నె మీద
ఒక్క క్షణం కూర్చున్నాడు. మనశ్శాంతితో సావధానంగానే పూజ చెయ్యాలి. సావధానానికి ఓ క్షణం సేపయినా కూర్చోడం ఒక సాక్ష్యం.
పూజ ముగియగానే లౌకిక కార్యాలకు వెళ్లిపోవడం దేవుని మీద తాత్పర్యం లేదన్నదానికి నిదర్శనమూను.

పరుగెత్తుకొని వచ్చిన మనమణ్ణి చంకనేసుకొని, వానితో కబుర్లు చెప్తూ పదడుగులు వేసేసరికి కిష్టయ్య వణికిపోతూ, రొప్పుతూ
రోజుతూ ప్రత్యక్షం అయ్యేడు. పంచలో చిరుగులు కనిపిస్తున్నాయి. తలగుడ్డ లేదు. పిక్కల మీదా చేతుల మీదా చీరుకుపోయి,
రక్తం చిమ్ముతున్న చారికలు కనిపిస్తున్నాయి.

అతని ఆకారం చూడగానే శివరామిరెడ్డి జరిగిన సంగతులను కొంత వరకు స్థూలంగా గ్రహించేడు. తెలంగాణా పరిస్థితుల్ని ఈ
ఏడాదిబట్టీ చూస్తున్నాక కిష్టయ్య కథని వూహించుకోడం కష్టమేం కాదు.

ఒక మూల మిలిటరీ, పోలీసులూ గ్రామాల మీద పడి మడతకొట్టుడు సాగిస్తూనే వున్నారు. రెండోవేపున మంది ఎక్కడో ఒకచోట
తిరగబడుతూనే వున్నారు..

తెల్దారు పల్లిలో జాగీర్దారు రౌడీల్ని చితక్కొట్టి తరిమేశారని పది రోజుల క్రితం తెలిసింది. ఈ ఘటనకు పదిరోజులు ముందే నిజాం
మిలిటరీ వూరు మీద దాడి చేసి కుక్కలు నాకేలా కొట్టేరని చెప్పేరు. కాని, తీరా చూస్తే జనం కసి పెరిగిందే గాని లొంగలేదు.
పాత సూర్యాపేటలో ఓ మూల పోలీసులు పేటల మీద పడి కొడుతూనే వున్నారు. రెండోవేపున కూలి ఎక్కువిస్తేగాని వీలులేదని పాలేళ్ళు
సమ్మె చెయ్యనే చేసేరు. వరంగలు జిల్లా నుంచీ అదే మాట. కరీంనగరు నుంచీ అదే మాట. ఇక్కడ తన వూళ్ళోనూ అదే
జరిగిందన్నమాట.

ఆ మాట తోచేసరికి శివరామరెడ్డి నిస్తబ్దుడైపోయేడు. తన వూళ్ళో ఇటువంటి తిరుగుబాటు వస్తుందని ఆయన వూహించలేదు. నిరుడు
వచ్చిన అల్లరిని అణిచేసేక వూళ్ళో జనం తలఎత్తే అవకాశం వుందని కూడా ఆయన తలచడం లేదు. అయినా చాల జాగ్రత్తగానే
ప్రజల ధోరణి ఎల్లా వుందో చూసుకొంటూనే అడుగు వేస్తున్నాడు. నెలక్రితం ఇద్దరు కౌలుదార్లని తప్పించేడు. వారంక్రితం మరొకరిని
వేరే భూమి చూసుకోమన్నాడు. ఏమీ గంద్రగోళం రాలేదు. వస్తే నెలక్రితమే రావలసింది. రావులయ్యకి శుద్ధ మొండిఘటం అని పేరుంది.
అతడంత సులభంగా భూమి వదులుతాడని అనుకోలేదు. కాని, భూమి ఎందుకు వదలమంటున్నారనేనా ప్రశ్నించకుండ వెళ్ళిపోయేడు. తర్వాత
ఏమన్నా చేసిపోతాడేమోననే భయంతో తానే ఆతడికి మరోచోట రెండెకరాలు చూపించేడు. నిరుడు వెట్టివ్యతిరేక అల్లర్లలో మంగలి
వెంకన్నని పోలీసులు కదల మెదలకుండా కీళ్ళు మణగకొట్టేరు. కొంప అంటించేసేరు. రెండు నెల్లు జైల్లో జొన్నరొట్టె తినిపించేరు.
వాడి ముఖం చూడ్డానికే ఏలాగో అనిపించింది. గడ్డం గీయమని పిలుస్తే ఏ గొంతు ముడో తప్పించేస్తాడనే భయంతో వాడిని తానే పనికి
పిలవలేదు. అయినా వాడే వచ్చి గుమ్మంలో వుంటున్నాడు. పొలం వదలాలనే సరికి దండం పెట్టి వెళ్లిపోయేడు.

అయినా ఎప్పుడూ వస్తుందని వూహించని చోట ప్రతిఘటన వచ్చింది. ఎంతో ఆలోచించి వేసిన అడుగు కాస్తా వైకుంఠపాళీ పాము నోట
పడ్డ పావులా అయింది. ఇదివరకు పొందిన విజయాలు కూడా ఈ దెబ్బతో తుడిచి పెట్టుకు పోతాయి.

కిష్టయ్య చెప్పింది విన్నాక గ్రామం అశేషం, ఆబాలగోపాలం, స్త్రీ పురుషులంతా కత్తులూ, బరిసెలూ తీసుకువచ్చేరని అనుకొన్నాడు.
వాళ్ళ పేర్లన్నీ ఏకరువు వేసేడు. వాళ్ళల్లో ఒక్కర్ని కూడా ఆతడు చూడలేదు. కాని, రమారమి నూరు, నూట ఏభయి మంది
వచ్చివుంటారని చూసినప్పుడు అనుకొన్నాడు. ఆ నూరు, నూట ఏభయి మందిలో వుండకపోతాడా అన్న పేరల్లా చెప్పేసేడు.

ఆతడు తన మీద కర్ర విసిరిన సత్తెమ్మని కూడా చూడలేదు. దూరాన్నుంచి వస్తున్న మందిని చూసేసరికే కాళ్ళు దడదడలాడేయి.
కళ్ళు భైరులు కమ్మేయి. సత్తెమ్మ విసిరిన జువ్వ వీపుమీద పడడానిక్కూడా వ్యవధినివ్వకుండా కళ్ళు మూసుకొని
కంచెకడ్డబడ్డాడు. కాని ఇప్పుడు మాత్రం తనను కొట్టిన వాళ్ళ పేర్లూ, కొట్టిన విధమూ తడుముకోకుండా చెప్పుకుపోయేడు.

ఆతడు శివరామిరెడ్డిలో ప్రతీకార దీక్ష కలిగించి తనకు కలిగిన అవమానానికి సాధ్యమైనంత భయంకరమైన శిక్ష విధింపచెయ్యాలనే
ఆ అబద్ధాలన్నీ ఆడేడు. కాని, వాని ఫలితం మరొకటయింది.

నిరుడు జరిగిన ఘటనల అనంతరం ఊరంతా, ఒక్క యింటి వాళ్ళు కూడా మిగలకుండా కర్రలూ, కత్తులూ తీసుకొన్నారంటే తాను తొందర
పడకూడదని శివరామిరెడ్డి నిశ్చయించుకొన్నాడు.

కిష్టయ్యని వూరడించి ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకురమ్మని సలహా యిచ్చేడు. ఆ వేషంలోనే డాక్టర్ సర్టిఫికెట్ సంపాదించడం
మంచిదనీ, పోలీసు రిపోర్టు ఇవ్వడం ముఖ్యమనీ కిష్టయ్య సలహా.

శివరామిరెడ్డి చిరాకుపడ్డాడు. తన బతుక్కి కిష్టయ్య కూడా సలహా ఇవ్వడమేనా? పైగా పనంతా పాడుచేసుకు వచ్చేడని కూడా
అనిపించింది.

* * * * *

ఆ వార్త వినగానే రఘునందనుడు పడుచుదనపు పెంకితనం చూపేడు. ఏదో ఒకటి చెయ్యాలి లేకపోతే సెంటు భూమి కూడా
దక్కనివ్వరన్నాడు. మా పాటుకి విలువే లేదా అంటున్న సత్తెమ్మ కళ్ళ ఎదుట కనిపిస్తున్నట్లనిపించింది. పాటుకి విలువ వుంది.
అంతేకాదు పట్టాకీ, ప్రభుత్వానికీ కూడా వుంది. ఆ విషయం నిరూపించకపోతే ఎవ్వర్నీ బ్రతకనివ్వరు.

శివరామిరెడ్డి దానికి సుతరామూ అంగీకరించలేదు. ప్రజల ధన మాన ప్రాణాల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిది. ప్రతి చిన్న
విషయానికీ ఎవరికి వారే పది మందిని పోగు చేసుకొని కర్ర తీసుకొంటామనడం సాధ్యం కాదు. ఈవేళ ఒకడు పది మందిని తెస్తే రేపు
రెండోవాడు పదిహేను మందిని లేవదీస్తాడు. దానికి అంతేదీ? అది సాధ్యమూ కాదు. అందరికీ ఆ సామర్థ్యమూ వుండదు. అందుకే ఓ
ప్రభుత్వమనీ ఓ ఏడుపనీ. ఇలా ఎవళ్ళకి వాళ్ళు అల్లరి చేసి రెండో వాళ్ళ ఆస్తిపాస్తుల్ని లాగేసుకోకుండా పన్నులిచ్చీ,
ప్రభుత్వమిచ్చీ నవాబునో, రాజునో పోషిస్తున్నా ప్రజల్ని హద్దుల్లో వుంచగల శక్తి ప్రభువుకి వుండాలి. కాని, ఇప్పుడీ
ప్రభువుకి ఆ శక్తి లేదు. ఈ ప్రభుత్వం రోజులు చెల్లిపోయేయి.

ప్రభుత్వం మారవలసిన అవసరాన్ని తెలుపుతూ మామగారు తెచ్చిన వాదాన్ని రాజిరెడ్డి కొంత సవరించేరు. కలవాళ్ళ ఆస్తిపాస్తుల
రక్షణకే ప్రభుత్వం ఏర్పడింది. ఆ రక్షణకు అవసరమైన హద్దుల్లోపల ప్రజల ప్రయోజనాలక్కూడా రక్షణ వుంటుంది. అది
నిజమే. కాని, ఇప్పుడు....

".... రోజులు చెల్లిపోయింది ప్రభుత్వానికి కాదు. సమాజంలోని ఆర్థిక వ్యవస్థకి. ఆర్థిక వ్యవస్థను కాపాడ్డానికే
ప్రభుత్వ యంత్రం. దానికి రోజులు చెల్లేయంటే అది కుక్క కాపలా కాస్తున్న ఆర్థిక విధానానికి రోజులు చెల్లిపోయాయన్నమాట."

శివరామిరెడ్డి ప్రశ్నార్థకంగా చూసేడు. రాజిరెడ్డి తన వాదాన్ని వివరించేడు.

"ప్రజలలో తమ స్థితిగతులయెడ అసంతృప్తీ, తమ బలం యెడ విశ్వాసం రగుల్కోనంత కాలం గడ్డిపరక కూడా వాళ్ళని
అణిచిపెడుతుంది. ఒక్కమారు ఆ పరిజ్ఞానం కలిగిందా ఎన్ని ఆయుధాలూ, సైన్యాలూ వున్న ప్రభుత్వమైనా సరే గడ్డిపరకలాగ
తుడుచుకుపోతుంది."

రఘునందనుడు బావతో వాదం వేసుకున్నాడు. మన కళ్ళకెదురుగా కనిపిస్తున్న మూకలు ప్రభుత్వాన్ని ఓడిస్తాయా?—అదీ అతని
ప్రశ్న.

జరుగుతున్న చరిత్రలోంచే రామిరెడ్డి వుదాహరణలిచ్చేడు. తన వాదానికి బలంగా.

"జమీందారీ విధానంలో ఏయే సంస్కరణలు తీసుకురావాలో సూచించవలసిందిగా మీర్జా ఇస్మాయిల్ కాలంలో కమిటీని ప్రభుత్వం నియమించింది.
ఇప్పుడు జాగీర్దార్ల చేతుల్లో వున్న న్యాయ, పోలీసు, నిర్మాణ శాఖల అధికారాల్ని రద్దుచేసి అవన్నీ ప్రభుత్వం చేతిలోకే
కేంద్రీకరింప చేసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వింటున్నాం. ఇవన్నీ ఏమిటి? ప్రజల ఎదుర్కోలు ముందు
ఆర్ధికవ్యవస్థ వేస్తున్న వెనక అంజే కాదా?"

ప్రభుత్వంలో వస్తున్న మార్పుల్ని ప్రజల తిరుగుబాట్లకి ఫలితాలనుగా స్వీకరించడానికి రఘునందనుడు ఒప్పుకోలేదు. దేశం మొత్తం
అభివృద్ధి కోసం మీర్జాయో, మరొకరో చేస్తున్న ఉదాత్త కృషి తప్ప వేరు కాదన్నాడు. ఇటువంటి స్థితిలో తిరుగుబాటు చేయడం
ప్రజల కృతఘ్నతకు నిదర్శనం.

రాజిరెడ్డి బావ ఆలోచనను తోసేసేడు. భావనలూ, ఆలోచనలూ గుబులుగా పుట్టుకురావు.

"మానవ జీవితాన్ని మించిపోయిన ఆలోచనలు లేవు. ఆచారాలూ లేవు. అవన్నీ సామాజిక ప్రవృత్తుల పరిణామాలూ, ప్రతిబింబాలూ
మాత్రమే."

* * * * *

కాని పెద్ద కొడుకు రమణారెడ్డిని వొప్పించడం, ఆపడం శివరామిరెడ్డికంత సులభం కాలేదు.

రమణారెడ్డి పోలీసు వుద్యోగి. ఆ శాఖకుండే లక్షణాలన్నీ మూర్తీభవించిన మనిషి.

సమయంలో నొక్కేయ్యకపోతే అసలు లొంగుబాటుకే రాదని అతని వాదం.

కాని, ఆ వాదాన్ని తండ్రి పూర్తిగా నిరాకరించేడు. కేవలం మోటబలంతో కర్ర పుచ్చుకొని అదలించడం వలన పని జరిగే ఆశ
లేదని నిరుటి ఘటనల తర్వాత కూడా ప్రజలు చూపుతున్న సాహసం చూస్తే అర్థం అవుతుంది. ఇంక సాగలాగుతే వాళ్ళు
బరితెగిస్తారు. అందుచేత తెలివి వుపయోగించాలి. ఏ చట్టాన్నీ అనుసరించని రాజ్యంలో ప్రజల్ని మాత్రం కట్టివుంచేదేముంటుంది?
కాంగ్రెసు చట్టబద్ధమైన ప్రభుత్వం కావాలనే అంటూంది. ఈ అల్లకల్లోలం నుంచీ దేశాన్ని రక్షించాలంటే చట్టబద్ధమైన ప్రభుత్వం
వుండాలి.

రమణారెడ్డికి తండ్రిని హేళన చేయగల సాహసం లేదు. కాని వాదనను వదలుకొనే పిరికిదనమూ లేదు.

"వాళ్ళు బానిస లంజ.... ఆ మాట గుర్తున్నంత కాలం శాంతం అన్నా, మరేదన్నా, అది గుర్తుండేటట్లు చేయడం బాధ్యత మనది.
బూటుమడమతో గొంతుముడి తొక్కిపెట్టి వాడి చోటు వాడికి చూపాలి. ధనియపు జాతి…."

జాతి లక్షణాలతో సహా విరుగుళ్ళు వర్ణించి చెప్పినా తండ్రి వినిపించుకోలేదు.

తండ్రి పట్టుదల ఎరిగినవాడవడంచేత స్వయంగా, స్వంత పూచీ మీద వ్యవహారంలో దిగడం ఇష్టంలేక రమణారెడ్డి రుంజుకుంటూ
వెళ్ళిపోయేడు.



నాలుగో ప్రకరణం


వెంకటయ్య శివరామిరెడ్డి వద్ద రెండేళ్లు పని చేసేడు. కాని, ఈనాడు తన యెడ ఆయన చూపిస్తున్న అభిమానమూ, ఆదరమూ
అననుభూతం. అలాగని శివరామిరెడ్డి భయంకరుడేం కాదు. కోపిష్ఠీ కాదు. ధూర్తుడూ కాదు. నోటిదురుసు మనిషి అసలే కాదు.
మనుష్యులని ఎంతో ఆప్యాయంగా, మర్యాదగా చూస్తాడు. అంత ఆప్యాయత చూపుతూన్నా అధిక పరిచయానికీ, చనువుకీ అవకాశం
ఇవ్వడు. ఆయన ఎదట పడడం అంటే ఒక విధమైన భయం, భక్తీ కూడా అనిపిస్తుంది.

అసలు పెద్దదొర పిలుస్తున్నాడనేసరికే వెంకటయ్యకి భయం పుట్టింది. తాను సత్తెమ్మను పెళ్ళి చేసుకోదలచిన వార్త ఆయన
వరకూ వెళ్ళిందని గ్రహించే సరికే వణుకు పుట్టింది. పెద్దవాళ్ళ యిళ్ళల్లో ఏం జరిగినా ఫర్వాలేదు. కాని, తనబోటిగాడు ఏం
చేసినా, చెయ్యకపోయినా ప్రమాదమే. నిరుడు కోమటి బంగారయ్య పక్కింటివాళ్ళ కోడలితో మాట్లాడాడని, నడివీధిలో బుర్ర గొరిగించి
వూళ్ళోంచి తరిమేసేరు. జాగీర్దారు రామచంద్రారెడ్డి కొడుకు బందూకు చూపించి తండ్రిని గదిలోంచి తరిమేసి, సవత్తల్లి పక్కలోకి
చేరుతాడు. బహిరంగం. ఎవ్వరూ పైకి చెప్పుకోరు. లోకం అల్లా వుంది. ఇప్పుడు పెద్దరెడ్డి తననేం అంటాడో?

భయపడుతూన్న సమయంలో ఆయన చెప్పిన వూరడింపు మాటలు వెంకటయ్యకి చాలా ఆశ్చర్యం కలిగించేయి. వితంతువులకు వివాహం చెయ్యడం
మంచి పని అనీ, ఆ పనికి సాహసించగల వాడు నిజంగా వీరుడనీ ఆయన అన్నారు. సరాసరి తనను భుజం తట్టకపోయినా, ఆ
మెచ్చుకోలు చాల వుత్సాహమే కలిగించింది.

కాని, రెండో వేపున అనుమానం కూడా బాధిస్తూనే వుంది. ఈ మెప్పుకోలూ, ప్రశంసా వట్టి తాటాకులు కట్టడమేనేమో!

ఆయన ముఖంలోగాని, స్వరంలోగాని ఆ అనుమానానికి ఆస్కారం కనబడలేదు. ధైర్యం కలిగింది. పైగా సాయం చేద్దామనుకొన్నానని ఆయనే
చెప్తూంటే, ఆ సాయం స్వరూపం ఎటువంటిదా యనే ఆలోచనలలో తేలిపోయేడు.

సాయం చెయ్యాలనుకొంటే దొర చెయ్యగలడు. తన తండ్రి తాతలు నాటి పాతిక ముప్పయ్యెకరాలు ఆయన స్వాధీనంలో వున్నాయి. అవి
తిరిగి యిచ్చెయ్యడం తక్కువ సాయమా? బహుశా దొర ఆలోచన అదేనేమో.

తన తాతా, తండ్రీ సరదా పడి ఆ భూమిలో కొంతమేర మామిడి తోట వేసేరు. ఇన్ని సపోటాలూ నాటేరు. తమరు సుఖపడలేక పోయినా
తరవాత వాళ్ళేనా ఇంత తింటారని వాళ్ళ ఆశ. కాని అది కాస్తా దొర చేతిలోకి పోయింది. కానైతే అన్యాయం జరిగిపోయిందనిపించింది.
కాని ఆయన చూపించిన కాగితాలలోని విషయం విన్నాక ఆ భూమి మీద ఆశ వదులుకొన్నాడు. తోట పెంచడానికీ, పంటలు చెడ్డప్పుడు
తిండికీ, పన్నుకీ తెచ్చిన ఋణాలూ పాపం పెరిగినట్లు పెరిగాయి. అప్పుడప్పుడు కట్టిన చెల్లులు వడ్డీక్కూడా సరిపడలేదు.
ఇచ్చిన నెయ్యీ, కోడిగుడ్లూ వగైరాలు నజరానాలవుతాయే గాని అప్పు తీరేటందుకవి సాయపడలేవు.

పెద్దాళ్ళు చచ్చిపోయేక దొర భూమిని తన చేతిలోకి తెచ్చుకొన్నాడు. తానే ఒబ్బిడిగా చేయిస్తూ, ఆదాయాన్ని అప్పులో తీర్పు
పెట్టి, వెంకటయ్య పెద్దవాడయ్యేనాటికి భూమి చేతికిద్దామని ఆయన సంకల్పం. కాని, వ్యవసాయంలో ఖర్చులన్నీ లెక్కేసుకుంటే
కిట్టి ఏడుస్తుందీ? అందుకేనేమో ఏడవగలుగుతేనే వ్యవసాయం అన్నారు.

అప్పు తీరడం మాట అలావుండగా వ్యవసాయంలో అప్పుడప్పుడు పెట్టిన పెట్టుబడులు కూడా జతపడి తుప్పుతినేసినట్లు ఆస్తిని
తినేసేయి.

ఆ ఆస్తి మీద జమాఖర్చులన్నింటినీ దొర అణా పైసలతో వ్రాసి వుంచేడు. ఇచ్చినా, పుచ్చుకొన్నా ప్రతి కానీ లెక్కలో వుంది.
అప్పు తీరలేదు. ఆస్తిని మించిపోయింది. చివరకు వెంకటయ్యను పిలిచి సంగతులన్నీ చెప్పేడు. అప్పటికాతడూ ఓ
యిరవయ్యేళ్ళవాడయ్యేడు.

దొర బజారు ధర కన్న మరో పది వేసి భూమిని తానే తీసుకొన్నాడు. మరో వంద పైగా అట్టే మిగిలింది. అది కొట్టేసేడు. దానికే
తాను బ్రహ్మానందపడుతూంటే ఓ పాతిక చేతిలో పెట్టేడు. నీ బ్రతుకు చూచుకోమన్నాడు.

అంత కట్టుదిట్టంగా చెయ్యిజారిపోయిన భూమి మళ్ళీ వస్తుందనే ఆశ లేకపోయినా, తోటలంటే తనకున్న అభిమానం కొద్దీ దొర మాటల్లో
వెంకటయ్య బోలెడు ఆశలు పెంచుకొన్నాడు. కాని, అంతలో ఆ ఆశలు నిరాశలేననిపించింది. సత్తెమ్మను పెళ్ళి చేసుకొంటాననుకొన్నప్పుడు
ఆయన సహాయపడదామనుకొన్నారు, కాని వూరికే కాదు గదా? ఇప్పుడా పెళ్ళీ లేదు. ఆ ఆశా లేదు. వెంకటయ్య తల వంచుకొనే తమ
పెళ్ళి చెడిపోవడం, రంగయ్య పట్టుదల చెప్పేడు.

శివరామిరెడ్డి సానుభూతితో తల పంకించేడు. ఆయనకా సంగతి తెలుసు. అన్నీ యిదివరకే విన్నాడు. తన అభిప్రాయం కూడా చెప్పేడు.

ఆస్తి లేకపోవడం తప్ప వాళ్ళ పెళ్ళి చెడిపోడానికి మరో కారణం లేదన్నాడు. కాస్త భూమో, పుట్రో వుంటే ఆ రంగయ్యా, ఆ
వీరమ్మా ఆటంకాలు చెప్పేవారేనా? ప్రపంచంలో తాను ఎన్ని చూడ్డంలేదూ?...

పెద్దరెడ్డి చెప్పకపోయినా వెంకటయ్యకు ఆ మాట తెలియదా? ఓ రావుగారి కూతురు ముసల్మానునే పెళ్ళి చేసుకుంది...

.....చదువుకొన్నవాడు గనక రంగయ్యకేనా కనీసం ఆ తెలివి వుండవలసింది. లేకపోయింది. ఏమనుకొంటే మాత్రం ఏం లాభం?...

దేశంయొక్క దురవస్థ తలుచుకొని శివరామిరెడ్డి ఒక్క నిట్టూర్పు విడిచేడు.

వెనకాధరువు లేని వాళ్ళని సంఘంలో కాకులల్లే పొడిచేస్తారు. అందుకే తాను వాళ్ళకింత ఆస్తరణ చూపాలనుకొన్నాడు. చూపించడమే.
తానేం పెట్టనక్కర్లేదు. పొయ్యనక్కర్లేదు. మరో అడ్డం లేకుండా చేసి వాళ్ళది వాళ్ళకిచ్చేస్తే చాలు. కాని దైవం
అనుకూలించలేదు.

ఆ మాటలు విన్నాక వెంకటయ్యకు మళ్ళీ ఆశ కలిగింది. వాళ్ళది వాళ్ళకిచ్చెయ్యడం అంటే..తన భూమి తనకిచ్చెయ్యడం గాక
మరేముంటుంది? తమరిద్దరిలో ఒకప్పుడేనా కొద్దోగొప్పో ఆస్తి అంటూ వున్నది తనకే. సత్తెమ్మ పుట్టింటి వాళ్ళు కాస్త
భూమిగలవాళ్ళయితే మాత్రం, ఆమెకా ఆస్తి మీద హక్కు ఎక్కడుంది?

కాని, కొద్దిసేపటికి తన ఆశలూ, ఆలోచనలూ తప్పుదారిన నడుస్తున్నాయని వెంకటయ్యకు అర్ధం అయింది. తమరిద్దరిలో
సత్తెమ్మకే ఆస్తి హక్కు వున్నట్లు రెడ్డి భావించడం ఆశ్చర్యం అనిపించింది. చాలసేపు వరకూ ఆయన చెప్పేదేమిటో
ఆతనికర్ధంకానేలేదు. రత్తయ్య గారి బోళ్ళపొలం తనక్కావాలని ఎందుకన్నాననుకొన్నావంటే తానేం చెప్పగలడు? ఆ అడగడానికీ
తనకు సాయం చేయాలనే సంకల్పానికీ గల సంబంధం చాలసేపటి వరకూ తోచలేదు. కాని ఏదో సమాధానం ఇవ్వాలి గనక ఇచ్చేడు.

"చిత్తం, చిత్తం."

అది ఆయన ప్రశ్నకి సమాధానమే కాదు. కాని శివరామిరెడ్డి దానిని గుర్తించినట్లే లేదు. తనలో తానే మాట్లాడుకొంటున్నట్లు
ఏమేమో చెప్పుకొని పోతున్నాడు. వెంకటయ్య నోరు తెరచి వింటున్నాడు. ఆయన ఆలోచనలన్నీ వింతగా కనిపిస్తున్నాయి.

నలుగురూ పోగడి పెళ్ళి చెడగొట్టేరని తెలిసి శివరామిరెడ్డి చాల విచారించేడు. అది అంతవరకూ వస్తుందనే అనుమానం ఆయనకు
మొదటి నుంచీ వుంది. కాని, రంగయ్య పెద్ద చదువులు చదువుకొన్నాడనీ, పట్నంలో మెసిలి నాలుగు సంగతులూ చూసినవాడనీ, కనక
ఫర్వా వుండకూడదని అనిపించింది. కాని తీరా చూసేసరికి తనది వట్టి భ్రమ మాత్రమేనని తేలిపోయింది. తీరా అంతా ముగిసినాక తాను
కలగచేసుకోడం మంచిదికాదని తోచింది. అప్పట్లో ఏదో జరిగిపోయింది. ముందు ముందుకు ఇటువంటి ఆటంకాలు రాకుండా చేయాలని ఆలోచించేడు.

ఆ భూమి సత్తెమ్మదే అయివుంటే ఆమె వెనకతగ్గే మనిషేనా? సమయానికి తాను చెయ్యూతనివ్వగలిగి వుంటేనా? సరే, ఇంకేనా
వూరుకోకూడదనుకొన్నాడు. వెంటనే తాను చెయ్యగలదేదో చేసిపారేస్తే ముందుకు పనికొస్తుందనుకొన్నాడు.

అందుకే బోళ్ళపొలం వదిలెయ్యమన్నది. ఎంత చాకిరీ చెయ్యనీ, నగలమ్మే పెట్టుబడి పెట్టనీ, ఆ భూమినెవ్వరూ ఆవిడదనరు. ఆ
భూమి ఆవిడదే అనిపించేస్తే? సొమ్ము సొమ్ములో వుంటుంది. ఆవిడకి ఆధరువూ ఏర్పడుతుంది. ఇంత రంతు చేసిన రంగయ్య ఆవిడ తన
నగలొలిచి భూమి మీద పెట్టిందని కొంచెమన్నా విశ్వాసం చూపుతాడా? అబద్ధం. ఆతనికి అభిమానం ఎంతుందో తెలిసేపోయింది. అందుకే తాను
కలగచేసుకొన్నాడు. అంతేగాని తరాలుగా వాళ్ళు చేసుకొంటున్న భూమి తనకి కావాలా? తనదని వ్యవహారం ప్రారంభిస్తే గాని
ముడిపడేటట్లు లేదు. అందుకని ఆ మాట అన్నాడు.

సత్తెమ్మ చేస్తున్న భూమిని ఆమెకివ్వడం కోసమే పుచ్చుకోదలచేనని రెడ్డి చెప్తూంటే వెంకటయ్యకు అసలు రహస్యం అర్థం అయింది.
ఆ కాస్తా అర్థం అయ్యేక ఆయన మీద తాను కల్పించుకొన్న సద్భావం పటాపంచలయింది. 'అమ్మ దొంగ ముండా కొడక'-అని
తిట్టుకొన్నాడు, మనస్సులోనే. పైకి అనే శక్తి లేదు.

సత్తెమ్మ జువ్వకర్ర తీసుకొని మంచి పనే చేసిందనుకొన్నాడు. దానిని గురించి ఏమిటి అభిప్రాయపడుతున్నాడో తేలడేమని పదిమాట్లు
అనుకొన్నాడు. ఆఖరుకు అదీ వచ్చింది. ఆ విషయంలో కూడా శివరామిరెడ్డి తనదే పొరపాటన్నట్లు చెప్తూంటే ఆశ్చర్యపడ్డాడు.

తాను చేయదలచిందేమిటో, ఎందుకో ముందుగానే సత్తెమ్మని పిలిపించి చెప్పేస్తే బాగుండిపోయేదని రెడ్డి ఇప్పుడు విచారపడుతున్నాడు.
ఆలాగ తాను చెప్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. భూమినన్యాయంగా లాగేస్తున్నాడేయని కంగారుపడింది...పాపం...ఇప్పుడనుకొంటే
మాత్రం ఏం లాభం? పని జరిగే పద్ధతేదో చూడాలి గాని....

ఆ 'పని జరిగే పద్ధతేదో' కూడా చెప్పేడు. కాని ఆ పధ్ధతి ప్రకారం పని జరిపించడానికి వెంకటయ్య మాత్రం ఇష్టం
చూపలేదు.

బోళ్ళపొలం మీద తనకేమీ ఆశ లేదంటాడు దొర. దిక్కుమాలిన ప్రపంచం. దొరలు భూముల నుంచి రైతుల్ని బేదఖల్ చేస్తున్నారనేదొకటి
వచ్చిపడింది గదా. ఆ మాటే తనకీ వచ్చింది. అనవసరంగా....ఇంక తాను అటువంటి అపనిందకు అవకాశం ఇవ్వతలచుకోలేదు.
తనకే కావలసి, బేదఖల్ చేయాలనే వుంటే సత్తెమ్మ చూపిన తొందరపాటుకి వూరుకొనేవాడేనా? ఒక్క రిపోర్టు వ్రాసి పారేస్తే
పోలీసులు వచ్చి ఆ వ్యవహారం ఏదో చూసుకుపోయేవాళ్ళే. ఆ వుద్దేశం తనకు లేదు. కనకనే పస్తాయించేడు.

ఉన్నట్టుండి శివరామిరెడ్డి వెంకటయ్య ముందు ఆలోచనలేమిటో తెలుసుకొనగోరేడు. అతడింకా సత్తెమ్మను పెళ్ళి చేసుకోవాలనే
వుద్దేశంలోనే వున్నాడా?

అలాంటి వుద్దేశం వుంటే బోళ్ళపొలం ఆతడే తీసుకొని చేసుకొనేటందుకు తాను సాయం చేస్తానన్నాడు. సత్తెమ్మతో చెప్పే పూచీ తానే
నెత్తిన వేసుకొంటాడు. అసలు సంగతి తెలుస్తే చల్లగా వూరుకుంటుంది. వెంకటయ్య పొలంలో వుంటాడు గనక ఆమె అనుమానించవలసిన పని
వుండదు. రంగయ్య కోర్టుకెక్కితే తాను చూసుకొంటాడు.

పెట్టుబడికి అవసరం అయితే డబ్బు తీసుకెళ్ళమన్నాడు.

కాని...

వెంకటయ్య నిరాకరించేడు. సత్తెమ్మను పెళ్ళి చేసుకొనేటందుకే అయినా ఆతడా పొలం వేపు చూడ్డానికి అంగీకరించలేదు. చాల మర్యాదగా
వద్దన్నట్లుగాకుండా నిరాకరిస్తూనే దొర వుద్దేశం తనకీ అర్ధం అయినట్లు తెలియచేప్పేడు.

సరిగ్గా ఈ మధ్యనే అనసూయమ్మ ఇంత తెలివిగా కాకపోయినా ఇదే మాదిరి ప్రతిపాదన చేసింది.

బోళ్ళపొలాన్ని ఆనుకొని ఆమెకు ఓ ఏభయ్యెకరాల చెలక వుంది. దానిని నరిసిరెడ్డి ఓ పాతికేళ్ళ నుండి చేస్తున్నాడు. ఆతనిని
దానిలోంచి బేదఖల్ చేయడానికి ఆమె అన్ని విధాలా ప్రయత్నించి విఫలురాలయింది. బోళ్ళపొలంలోంచి తన్ను పంపేసేరని విని ఆమె కబురు
పెట్టింది. అక్కడినుంచి పంపేసినా భయపడవలసినదేమీ లేదని అభయం ఇచ్చింది. తన పొలం చేసుకోమని సలహా యిచ్చింది. పక్క
పక్క పొలాలు గనక సత్తెమ్మను కలుసుకొంటూండ వచ్చునని ఉపాయం ఉపదేశించింది. తన పొలంలోంచి పొమ్మన్నాడే గాని నీ పొలంలోంచి
పొమ్మనడానికి రంగయ్యకేం అధికారం వుంటుందని చట్ట సూక్ష్మం చూపించింది. సత్తెమ్మ పొలం రాక మానదు. కోరడికి ఆవలా, ఈవలా
గనక మాటా మంతీ కష్టం కాదు. ఆ విధంగా ప్రలోభనం సాగించింది.

ఆ భూమి నుంచి నరిసిరెడ్డిని తరిమివెయ్యడానికై తన్ను పనిముట్టుగా వాడుకోగలననే ఆలోచనే ఆ అభిమానానికి మూలం. దానిని తానూ
ఎరుగును. కాని ఎరిగినట్లు అతడు తేలలేదు. ఏమీ ఎరగనట్లే మాట్లాడేడు. ఆ విధంగా దొంగతనంగా కలుసుకోడం తనకిష్టం
కాదన్నాడు.

ఆ కథ చెప్తూన్నా, శివరామిరెడ్డి ఆలోచనల్ని పసికట్టినట్లు తోపించకుండానే వెంకటయ్య మాట్లాడేడు. అయినా అసలు
వుద్దేశ్యాన్ని గ్రహించడం శివరామిరెడ్డికి కష్టం కాలేదు. కాని పైకి తేలలేదు.

వెంకటయ్య సెలవు తీసుకొని వెళ్లబోయే ముందు దొర మళ్ళీ ఇంకో మారు భరోసా యిచ్చేడు. ఎప్పుడైనా సరే, సహాయం కావలసి వస్తే
రమ్మన్నాడు.

"చిత్తం"

వెంకటయ్య తన తండ్రి తాతల నాటి పొలంలో కొద్ది చెలకయినా ఇస్తానంటాడేమోయని ఒక్క క్షణం ఎదురు చూసేడు. కాని
శివరామిరెడ్డి నోట అటువంటి మాట సూచనగా కూడా రాలేదు.

మళ్ళీ సెలవు పుచ్చుకొంటూ వెంకటయ్య దొర దొంగఎత్తుల్ని తిట్టుకొన్నాడు.

"ఎలక మీద పిల్లినీ, పిల్లి మీద ఎలకనీ ఎక్కించేటందుకా ఎత్తు?"

కాని, ఆ భావాన్ని ఛాయా మాత్రంగానైనా పైకి కనబడనివ్వలేదు. పైగా కనుమరుగయ్యేంత వరకూ వొంగి వొంగి దండాలు పెడుతూనే
వున్నాడు.



అయిదో ప్రకరణం


సాయంకాలం చల్లబాటువేళ బూడేమియా వచ్చేడు. గొడవల్లో పడిన తన భూముల వ్యవహారాల్ని గురించి వాకబు చేయడం ప్రారంభించేడు.
ఇంక అనసూయమ్మ సంతోషానికి మేరయే లేకపోయింది. లోపల అరుగు మీద కూర్చోపెట్టింది. స్వహస్తంతో చా తయారుచేసింది. తయారు చేసి
సిద్ధంగా యింట్లో నిలవ వున్న నాలుగు మురుకులు ప్లేట్లో పెట్టి ఎదట పెట్టింది. అవి తింటూండగానే చా కప్పులో పోసి ఎదుటకు
గెంటింది. చా త్రాగేక వేసుకొనేటందుకు తాంబాళంలో ఇన్ని ఆకులూ, వక్క, చూరూ, సున్నమూ సిద్ధం చేసింది. ఈలోపున తన భూములకు
సంబంధించిన కాగితాలన్నీ తెచ్చుకొని దస్త్రం విప్పింది.

అనసూయమ్మ తెచ్చియిచ్చిన చా రుచిని పొగడుతూ, కప్పు మీదుగా ఆమె ముఖం వంక చూస్తూ, గుటక వేస్తూ బుడన్ వ్యవహారాల
వివరాలు తెలుసుకొంటున్నాడు.

నరిసిరెడ్డి ఓ పాతికేళ్ళ క్రితం తన వద్ద ఏభయ్యెకరాలు కోరుకు తీసుకొన్నాడు. దానిని తిరిగి ఇవ్వమంటే కదలడం లేదు.
రెండేళ్ళ నుంచీ వాటిని స్వాధీనంలోకి తెచ్చుకోవాలని ఆమె విశ్వప్రయత్నం చేస్తూంది. కాని సాధ్యం కావడం లేదు. ఆ ప్రాంతాల్లో
పేరుపడ్డ జాగీర్దారు ఛోటేజాన్ వాళ్లకి మద్దతు.

ఆ ముల్లును తీసెయ్యడానికి ఆమె మార్గాలనన్వేషిస్తూంటే ఎవరో ఖాజీమహమ్మద్ రసూల్ పేరు సూచించేరు. ఆతడు మరో పెద్ద
జాగీర్దారు; ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకుడూను.

అనసూయమ్మ ఖాజీ వద్దకు రాయబారం నడిపించింది. ఈవేళ బూడేమియా హాజరయ్యాడు.

ఆమె ఖాజీని ఎరగదు. కాని బుడన్‌ను ఎరుగును. ఆతడొక హంతకుడుగా చుట్టుప్రక్కల గ్రామాలన్నింటా పరిచితుడే.
ఆతని ఆకారం, వేషబాషలూ చూస్తే ఈ మనిషి హత్యలు చెయ్యగలడా అనిపిస్తుంది. కాని, హత్య చేసేడు. దానికో పెద్ద కారణమూ
లేదు. పంది పడినది తన దొడ్డి కూడా కాదు. అదయినా మామగారిది. దానిని బల్లెంతో పొడిచేసేడు. దాని వెనకనే వస్తున్న ఆ
వడ్డెరవాళ్ళ కుర్రవాణ్ణి కూడా ఆ బల్లెంతోనే పొడిచేసేడు. ఆ దారుణానికి చుట్టుపక్కల పల్లెలన్నీ గగ్గోలెత్తిపోయేయి.
ఆకారానికీ, స్వభావానికీ మధ్యనున్న ఆ వైరుధ్యమే బుడన్ అందరికీ తెలియడానికి కారణం అయింది.

హత్యకేసు వచ్చినప్పటి నుంచీ అతడు ఖాజీ పక్క చేరేడు. ఖాజీ వద్దనున్న బలగం అంతా అట్లాంటి బాపతేనంటారు. కనీసం రెండు
హత్యలన్నా చేసిన ఘటికుడికి గాని ఆయన కొలువు లభించదని ఓ ప్రతీతి.

ఆ బుడనే నేడు తన యింటికి వచ్చేడు. మొదట వింతగానూ, తర్వాత వినోదంగానూ, వచ్చిన పని తెలిసేక శ్రద్ధగానూ ఆతడిని
ఆహ్వానించింది. ఆతడు తన భూముల వ్యవహారాలూ తెలుసుకొంటూంటే ఇంక తాను గట్టు ఎక్కినట్లేనని అనసూయమ్మ ఆనందపడింది. ఆ
వుత్సాహంలో ఆతడొక్కటడుగుతే తాను పది చెప్పింది. బుడన్ కూడా మంచి వ్యవహార జ్ఞానం కలవాడే. ఆతడొకటికి పది ప్రశ్నలు
వేసేడు.

గంటలు గడిచేయి. చీకటి పడింది. బుడన్ ప్రశ్నలుగాని, అనసూయమ్మ చెప్పవలసిన సంగతులుగాని పూర్తి కానే లేదు.

భోజనం అయ్యేక మళ్ళీ కూర్చున్నారు.

అనసూయమ్మ విప్పిన దస్త్రంలో రెండేళ్ళు కోర్టుల్లోనూ, బయటా నడచిన వ్యవహారాల తాలూకు కాగితాలు, అవసరమైన కౌలు
కదపాలతో, పన్ను రశీదులతో సమగ్రంగా వున్నాయి. అన్నీ ఉర్దూలో వున్నాయి. గుర్తుకోసం వ్రాసుకొన్న తెలుగుమాటల్ని పట్టి
అవసరమైన కాగితాల్ని ఆవిడ అందిస్తూంటే బుడన్ వాటిని సమగ్రంగా చదువుతున్నాడు. అందులో లా పాయింట్లు ఏరి చెప్తున్నాడు.

చాల రాత్రి అయింది. చదవవలసిన కాగితాలు కూడా పూర్తి అయ్యాయి. బుడన్ లేచేడు. ఏదో తప్పుచేసి క్షమాపణ కోరుకొంటున్నట్లు
ఒక్క మ్లానహాసం చేసేడు. రాత్రి బాగా గడిచిపోయిందన్నాడు.

"ఖాజీమియా వివరాలన్నీ అడుగుతారు. తెలుసుకోనిదే వెడితే...."

బుడన్ పడిన శ్రమకు అనసూయమ్మ అనుతాపం తెలిపింది. అంత రాత్రివేళ చీకట్లో నాలుగైదు మైళ్ళు వెళ్ళడం కష్టమని గుర్తు
చేసింది.

"పక్క వేస్తారు. పడుకోండి. పొద్దుటే వెళ్ళవచ్చు."

ఖాజీమియా తన కోసం కనిపెట్టుకొని కూర్చుంటారేమోనని సందేహాన్ని వెలిబుచ్చుతూ, ఇంత రాత్రి వేళ వెళ్ళడంలో వున్న ఇబ్బందుల్నీ,
వెళ్ళకపోతే చెడిపోగల పనుల్నీ బుడన్ ఏకబిగిలోనే వల్లించేడు. చివరకు ఆట్టే బలవంతం అక్కర్లేకుండానే అంగీకరించేడు.
ఆతనికి పక్క తెచ్చి వేసే బాధ్యతను ప్రక్కనే వున్న అత్తగారికి వప్పజెప్పి తాను లోపలికి వెళ్ళిపోయింది.

ఆమె గది దూరాన అక్కడికి కనిపిస్తూనే వుంది. ఓరగంట ఆమె ప్రవేశించిన గది వంక చూస్తూ బుడన్ ముసలమ్మకు అంత శ్రమ
ఇస్తున్నందుకు అనుతాపం తెలియబరచేడు.

సాయంకాలం నుంచీ వ్యవహారాల వివరణలో కోడలికి సాయపడుతూ ముసలమ్మ అరుగు మీదనే కూర్చుంది. కోడలికన్న ఆమె వ్యవహార
దక్షత బాగా వున్న మనిషి. బుడన్ ప్రశ్నలు కాలక్షేపానికి వేస్తున్నట్లు ఆమెకు అనిపించింది. కాని, ఏమీ అనలేదు.
ఎంతయినా కోడలికన్న పదేళ్లయినా చిన్నవాడై వుంటాడు. కోడలి అందం నలగకపోయినా వయస్సు?

ముసలమ్మ పక్క ఏర్పాట్లు చేయడం కోసం లోనికెళ్ళగానే బుడన్ కాలుస్తున్న సిగరెట్టును మట్టివేసి చరచర అనసూయమ్మ
ప్రవేశించిన గదిలోకి వెళ్లేడు.

మారుబట్ట కట్టుకొనేందుకు కట్టుబట్ట విడిచిన స్థితిలో, తలుపు చప్పుడు వినబడి అనసూయమ్మ ఉలికిపడింది. నేలనున్న చీర
కొంగు గుండెలకంటా లాక్కుని, దాని వెనక నిలబడి, తిరగబడి చూసింది. ఆశ్చర్యం, భయంతో ఆమె కళ్ళు పెద్దవయ్యేయి. ఏ
నగల కోసమో పొడిచి చంపడు కద?

"ఏం కావాలి?"

బుడన్ చిరునవ్వు నవ్వేడు.

"ముసలమ్మ పక్క ఇక్కడ వేశానంది."

భర్త హయాములో కడబట్టిన ఆస్తిని మళ్ళీ పూటుకొనేటట్లు చేయడానికి ఆమె కోడలి సౌందర్యాన్ని వుపయోగించింది. అనసూయమ్మను
పట్వారీ లక్ష్మీనారాయణకు అలవాటు చేసిందీవిడే. ఆ ఆడవాళ్ళు తెస్తున్న అవమానానికి కుంగిపోయి ఏమీ చేయలేక కొడుకు ఎక్కడికో
పోయేడు. అయినా ఆమె విచారపడలేదు. చండశాసనుడైన లక్ష్మీనారాయణ హత్య చేయబడినప్పుడు మాత్రమే ఆమె ఓమారు విచారపడింది.
అదయినా ఆతడు పొందిన దుర్మరణానిక్కాదు. తమ ఆస్తి వ్యవహారాలు పూర్తిగా గాడిని పడక పూర్వమే అకాల మరణం చెందినందుకు
మాత్రమే. అంతే.

అత్తగారి స్వభావం ఎరిగిన అనసూయమ్మ ఏమీ అభ్యంతరం చెప్పలేదు. ఆస్తి రక్షించుకోడానికి ఇది కూడా అవసరం
కాబోలుననుకొంది.

బుడన్ తలుపు గొళ్ళెం పెట్టేడు.

ముసలమ్మ వాకిట్లోకి వచ్చి చూసేసరికి బుడన్ కనబడలేదు. మళ్ళీ లోపలికొచ్చింది. కోడలి గదిలోంచి మాటలు వినబడుతున్నాయి.
ఒక్క క్షణం నిర్ఘాంతపోయినట్లు నిలబడింది. తరువాత సరిపుచ్చుకొంది. బుడన్ వట్టి సేవకుడు మాత్రమే. అతని వలన
జరగగల పనేమీ వుండదు. ఆ విషయం ముసలమ్మకు తెలుసు. కాని, వాణ్ణి కోడలు పక్కలోకి తీసుకొంది. ఇది అనవసరంగా లోకువ
పడడమేననుకొంది. కాని, కోడలి శారీరకావసరాన్ని గుర్తు చేసుకొని మనస్సు సరిపుచ్చుకొంది.

కాని, మరునాడు ఖాజీ ఈ వ్యవహారాన్ని సరిచెయ్యడానికై వెయ్యి రూపాయలు కావాలని కబురంపేడు. ఆ వార్త విన్నాక అనసూయమ్మ
తాను పడిన శ్రమ వ్యర్థం అయిందనే దుఃఖంతో అత్తగారి మీద విరుచుకుపడింది.

నువ్వు పడుకోమని పంపేవన్నాడంటుంది అనసూయమ్మ.

మనసుపడి తీసుకెళ్లావనుకొన్నానంటుంది ముసలమ్మ.

నెపం తన మీదనే పడినందుకు చురచురలాడింది అనసూయమ్మ. ముసిలిది మాత్రం తక్కువదా? ఆ ఇద్దరి సిగపట్లలో ఇంటి గోడల
మధ్య జరిగిపోయిన ఈ అవమానం నడివీధిన పడింది. నలుగురూ నవ్వేరు.

కోపం. పట్టరాని కోపం వచ్చింది అనసూయమ్మ వియ్యాలవారికి మాత్రమే. అత్తాకోడళ్ళ జగడం మధ్య ఈ వినోద గాధ వీధిని
పడగానే సావిత్రిని మామగారు పుట్టింటికి తోలేసేడు.

"దొరక్క దొరక్క తురకాడే దొరికాడా" యని అతడు హిందూ మతం మీద వున్న అపరిమితాభిమానాన్ని ప్రకటించేడు.

వియ్యపురాలికి పట్వారీ లక్ష్మీనారాయణతో వుంటూ వచ్చిన సంబంధాన్ని ఆయన ఎరక్కపోలేదు. బహుశా లక్ష్మీనారాయణ హిందువుడే
గనక ఆ వ్యభిచారం అవమానంగా తోచలేదేమో కూడా. వియ్యపురాలికి సావిత్రి ఒక్కర్తే కూతురు. నాలుగైదు వందల ఎకరాలకి
వారసురాలు.

అంత ఆస్తిని పొదుపు చేసి పెడుతూండడం చేత కొడుకు పెళ్ళి కాలంలో లక్ష్మీనారాయణను బావగారూ అని పిలిచి బాంధవ్యం
కలపడానిక్కూడా సిగ్గుపడలేదు.

ఈ పరిణామానికి నిజంగా అవమాన బాధననుభవిస్తున్నదీ, దుఃఖపడుతున్నదీ ఒక్క సావిత్రి మాత్రమే. అయితేనేం మామగారు బండి
ఎక్కించేక ఆ అవమానానికీ, దుఃఖానికీ కారణం అయిన తల్లి వద్దకు పోవడం తప్ప మరో శరణ్యం లేదు. కనబడనూ లేదు.

తండ్రి ఎప్పుడు పోయేడో, ఎక్కడికి పోయేడో సావిత్రి ఎరగదు. అసలాయన ఎక్కడికన్నా వెళ్ళిపోయేడో, చచ్చిపోయేడో కూడా
తెలియదు. తల్లి గడుపుతున్న జీవితంలాగే, ఆమె పునిస్త్రీతనం కూడా అభూతకల్పనేయేమో.

ఆమె తండ్రి అసలామెకు జన్మకారకుడే కాదేమో. అదీ తెలియదు సావిత్రికి. కాని, ఆ అజ్ఞాతవ్యక్తికే తండ్రితనం ఆపాదించింది.
తండ్రిలాగా అక్కున చేర్చి ముద్దాడిన లక్ష్మీనారాయణను చిన్నతనంలో బాబయ్యగారని పిలిచింది. కాని, జ్ఞానం తెలిసేక తల్లికి
ఆయనతో గల సంబంధం తెలిసేక ఆ విధంగా పిలవనూలేకపోయింది. తల్లిని గౌరవించనూ లేకపోయింది. తండ్రినామె యెన్నడూ చూడకపోయినా
ఆయనను గురించి ఎన్నో కల్పనలు చేసుకొంది. తల్లి మీద కోపం వచ్చినప్పుడు ముసలమ్మ అనే మాటల్ని పట్టి లక్ష్మీనారాయణ
తన తండ్రిని చంపించి వుంటాడని కూడా భావించింది. తల్లికి ఆ విషయం తెలుసుననే కల్పనతో ఆమెపై తీవ్రమైన అసహ్యం పెంచుకొంది.

కాని, సావిత్రి చాల మేదకురాలు. ఎంత ద్వేషం రగిలిపోతున్నా తల్లినొక్క ఎదురు ప్రశ్న వెయ్యగల శక్తి ఆమెలో లేదు. ఆ
అసమర్థత ఆమె ద్వేషం, అసహ్యం పెరగడానికే తోడ్పడింది. తల్లి ముఖం చూడరాదనే ఆమె నిర్ణయం. కాని....

తల్లి దగ్గర నుంచి పోడానికే ఆమె అత్తవారి యింటిని గురించి కలలుకంది. అన్ని ఆశలు లాగే ఆ ఆశ కూడా వ్యర్థమే అయింది.
తల్లి ఆస్తిని గురించి మగడూ, అతని వైపు బంధువులూ పెట్టుకొన్న ఆశలూ, చంపుకొన్న అభిమానాలూ చూసేక ఆమె మరీ
ఉడికిపోయింది.

ఒకనాడు సావిత్రి ధైర్యం చేసి భర్తను మందలించింది.

"లక్ష్మీనారాయణను మామగారూ అనీ పిలవడానికి అభిమానం అనిపించడం లేదా?"

వామనరావు గుడ్లింతచేసి భార్యముఖంలోకి చూసేడు. ఆ మందలింపునకు అభిమానమూ కలిగింది.

"మీ అమ్మనే అడక్కపోయేవూ ఆ మాట."

సావిత్రి చిన్నపుచ్చుకొంది. కళ్ళనీళ్ళు తుడుచుకొంది. ఆమెను ఊరడించడం కోసం వామనరావు అన్న మాటలూ, తెలిపిన అభిప్రాయాలతో
అతనిపై ఆమెకదివరకేమన్నా గౌరవం మిగిలితే అదికాస్తా తుడుచుకుపోయింది. వెళ్ళడానికి మరో చోటూ, ధైర్యమూ లేక అక్కడే
మగ్గిపోయింది గాని ఆమె మనస్సు అక్కడ కూడా నిలవలేదు.

"ఆవిడ వొంట్లో హుమ్మస్సుంది. పడుకుంది. మధ్య నీకేం? నాకేం? ఆ వెధవ కుక్కచాకిరీ చేస్తున్నాడు. కుక్క కాపలా కాచి ఆస్తి
పోగుచేసి పెడుతున్నాడు. ఏం తీపు తీసిందా?"

లక్ష్మీనారాయణ హత్య చేయబడినప్పుడు భర్త తన తల్లిని పరామర్శ చేయడానికి వెళ్లేడు. పైకి చెప్పలేదనుకోండి. కాని,
సావిత్రి ఎరుగు. తల్లి చాటుగా ఏడ్చింది. భర్త దిగులుపడ్డాడు. ఊరంతా పచ్చి పాల పరవాన్నం వండుకున్నారు. వాళ్ళతో
సావిత్రీ ఆనందించింది. పండుగ చేసుకోలేకపోయినా.
లక్ష్మీనారాయణ చావుకి సంతోషించవలసిన అపకారం ఆతడు సావిత్రికి చేయలేదు. బయటవాళ్ళకెంత దుర్మార్గుడైనా ఆవిణ్ణి కూతురులాగే
చూసుకొన్నాడు. అయినా, ఆయన దుర్మరణానికి అనుతాపం కూడా కలగలేదు. ఆ ద్వేషం అకారణం అయినా, అంత భయంకరం.

లక్ష్మీనారాయణ ఒకరోజు తెల్లవారగట్ల మంద బయలుకెళ్ళేడు. వెళ్లినవాడు మరి తిరిగి రాలేదు. అతని శవం కూడా
కనబడలేదు. ఎవ్వరో పదిమంది మీద పడి పక్కనున్న గుట్టల్లోకి లాక్కుపోయారనీ, పనసపొట్టు తరిగినట్లూ, ఖైమాకొట్టినట్లూ
నరికేసి పొలాలమీద చల్లేసేరనీ చెప్పేరు. నిజం ఎంతవరకో, రక్తపు మడుగు చూసినవాళ్ళు నలుగురినీ కేకేసి వెతకబొయ్యేసరికి
కుక్కలూ, నక్కలూ, కాకులూ, గద్దలూ ఆ మాంసఖండాల్ని విందారగించి వేసేయి. పంచాయితీ చేయడానికై ఒక్క శరీర భాగం కూడా
దొరకలేదు. అతనిపై మందికున్న ద్వేషం సీమారహితం.

సావిత్రి కూడా అసమర్థత పెంచిన ద్వేషంతో తబ్బిబ్బయిపోయింది. తల్లి చేస్తున్న పని మీదున్న అసహ్యంతో ఆమె కూడబెడుతున్న
ఆస్తినీ అసహ్యించుకొంది; ఆ ఆస్తి కోసం భూముల నుంచి లేవగొడుతున్న రైతుల మీద సానుభూతీ పెంచుకొంది. వాళ్ళు విజయం
పొందినప్పుడూ, లొంగక తల్లిని ఏడిపించినప్పుడూ మనస్సులోనే విజయానందమనుభవించింది. తన అసమర్థత, తన మెత్తదనం వలన
తాను ఏమీ చెయ్యలేకపోయినా, తాను ద్వేషిస్తున్న వాళ్లకి పరాభవం కలిగినప్పుడల్లా ఆమె ముఖం కళకళలాడింది. నిరుడు
వెట్టిచాకిరీ చేయడానికి ప్రజలు నిరాకరించి మంది సంగం పెట్టుకొన్నప్పుడు తాను ద్వేషిస్తున్న వాళ్ళంతా వొణికిపోయేరు. మరల
మిలిటరీ వచ్చి పద్దాలుని కాల్చేసి, జనాన్ని కొట్టినప్పుడే వాళ్ళ ముఖాలు వికసించేయి. కనక సావిత్రి మనస్సులో సంగాన్ని
అభిమానించింది. పోలీసు వాళ్ళు నిరాధారురాలిని చేసి హింసించేరనీ, బంధుగులంతా దూరంగా కొట్టేసేరనీ, విన్నప్పుడు చాకలి మంగమ్మని
పిలిపించి, తన బట్టలు వేసి, మొట్టమొదట ఆమెకు ఆశ్రయం ఇచ్చింది. తన అత్తవారివాళ్ళు వ్యతిరేకించినా లెక్కచేయలేదు.
ఆమె తన జీవితంలో స్వతంత్రించి చేసిన మొట్టమొదటి పని అదేనేమో!

సత్తెమ్మ ఆమెకు బాల్య స్నేహితురాలు. గ్రామం అంతా పెద్ద పులిని చూసినట్లు భయపడే కిష్టయ్యని జువ్వకర్రతో రెండు అంటించి
పొలంలోంచి తరిమేసిందని వింది. మహా సంతోషం కలిగింది. చాకలి మనిషి ద్వారా అభినందించింది. ఆమెను చూడాలనే కోరిక తెలిపింది.

తల్లిని సత్తెమ్మతో పోల్చుకొంది. వెంకటయ్యతో తన స్నేహితురాలికి గల స్నేహాన్ని ఆమె యెరుగును. కాని, అది కాదిప్పుడామెకు
కనిపిస్తూంట. తన భూముల్ని తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకొనేటందుకై తన తల్లి హత్యలు చేసినా, చేయించినా ఆమె సంతోషించేదేమో.
కాని, జరిగింది వేరు. ఆ ఘటనను తన భర్త రసవత్తర శబ్దాలతో వర్ణిస్తూ పక్కలు పట్టుకొని నవ్వుతూంటే ఆమె సిగ్గుతో
కుంగిపోయింది.

"పక్కలో చేరి పనులు చేయించుకోడం అలవాటయిపోయింది. వాడో లుచ్చా. తేరగా వస్తే మావాడింకోడున్నాడనే రకం. పక్కలోకీ చేరేడు.
భూమి స్వాధీనం చేయించాలంటే వెయ్యీ తెమ్మన్నాడు. వాడూ మొనగాడు. ఇప్పుడు ముండలిద్దరూ తిట్టుకొంటున్నారు. నువ్వు పంపేవన్నాడంటుంది
మీ యమ్మ. నీకు కావలసి తీసుకెళ్ళేవనుకున్నానంటుంది ముసిలిది. ముండలిద్దరూ సిగపట్ల గోత్రంలో పడ్డారు."

ఆ వినోద ఘట్టాన్ని తలచుకొని తలచుకొని పక్కలు పట్టుకొని నవ్వేడు. మధ్య మధ్య ఆయాసం వచ్చినప్పుడో నిముషం ఆగి,
మళ్లీ మొదటికి వస్తున్నాడు.

సావిత్రి సిగ్గుతో కుంగిపోయింది. మగడి మాటలు విని, తల్లి తెచ్చిన అప్రతిష్ఠ తలుచుకొని కళ్ళనీళ్ళు పెట్టుకొంది. ఆ నవ్వు
చూసి అసహ్యపడింది. ఇంత సిగ్గుమాలినవాడు. సానుభూతన్నా లేనివాడు తనకు మగడయ్యాడా అని దుఃఖపడింది. ఆ ఆవేశంలో మామగారు
కచ్చడం బండి గుమ్మంలో పెట్టి ఎక్కమన్నాడు. మారుమాట లేకుండా ఎక్కేసింది.

మామగారు తన్ను ఇప్పుడు పుట్టింటికి ఎందుకు పంపుతున్నాడో సావిత్రికి అర్ధం కాకపోలేదు. తన అమ్మగారిల్లు ఆ వూళ్ళోనే
లేకపోయినా దూరాభారంలో లేదు. రెండూళ్ళకీ మజరా గ్రామం వొక్కటే. దూరం కూడా రైతుల లెక్కలో రెండే రెండు చెలకలు అడ్డు. అయినా
మామగారు కచ్చడం బండి సిద్ధం చేసేరు. దాని వుద్దేశ్యం అర్థం అయింది. ఇదివరలో ఒకటి, రెండు మాట్లు తల్లిగారింటికి ఆమె
కాలినడకనే వెళ్లివచ్చింది. కాని, ఇప్పుడీ బండి! భూముల్ని త్వరగా చేతిలోకి తెచ్చుకోడానికై మామగారు వొత్తిడి తేదలచేడనీ,
దానికి ప్రస్తుత ఘటననుపయోగించుకోదలిచేడనీ గ్రహించింది. కాని పైకి ఏమీ అనలేదు. మగని మాటల వలన కలిగిన అసహ్యంలో
మాట్లాడక బండి ఎక్కింది. ఇటువంటి సిగ్గుమాలిన బ్రతుకు బ్రతుకుతున్నందుకు తల్లిని నాలుగూ తిట్టెయ్యాలనుకొంది. బండివాడిని
పొమ్మని కూడా చెప్పకుండా చరచర లోపలికి వెళ్ళింది.

ఏదో పని చేసుకొంటున్న తల్లి తలఎత్తి చూసేసరికి గుమ్మంలో కూతురు. కళ్ళు ఎర్రబడి వున్నాయి. చెంపల్ని కన్నీటి చారికలు.
ఆ కన్నీట తడిసి అంటుకుపోయిన ఒకటి రెండు ముంగురులు. అదిరిపోతున్న పెదవులు. నోటమాట చెప్పలేక, సహజమైన పిరికిదనంతో
వేలికి చీర కొంగు మెలి తిప్పుతూంది. ఆమెను చూడగనే తల్లికి అసలు విషయం అర్థం అయింది. కూతురుకు తనపై ఎంత అసహ్యమో
అనసూయమ్మ ఎరుగును. పండుగలకు పిలిచినా ఆమె రావడానికిష్టపడదు. ఇంటికి వచ్చి పండుగల డబ్బు ఆశతో వియ్యంకుడూ, ముట్టే
మంచి బట్టలూ, బహుమానాల ఆశతో అల్లుడూ ఆమెను బలవంతం చేసి పంపుతుంటారు. పండుగలకి తాను ఎంత విలువగల చీర తెచ్చీ
ఆమెచేత ఒక పట్టాన కట్టించలేకపోయేది. ఆ చీరనైనా తిరిగి వెళ్ళేటప్పుడుత్సాహంతో పట్టుకెళ్ళిందీ లేదు. ఎప్పుడూ ఏ చాకలికో
యిచ్చి వెనక పంపించడమే.

అటువంటి కూతురు అప్రత్యాశితంగా ఇప్పుడు గుమ్మంలో నిలబడిందంటే కారణం గ్రహించలేనంత తెలివితక్కువది కాదు, అనసూయమ్మ.
కూతురు చూపుల వెనక వున్న అసహ్యాన్నీ, ద్వేషాన్నీ సహించలేకపోయింది. అత్తింటి నుంచి వచ్చిన కూతుర్ని కుశలం అడిగి,
కూర్చోమని ఆహ్వానించాలనన్నా తోచలేదు. తమ యిద్దరి మధ్యా ఏదో వాగ్వాదం జరుగుతూ జరుగుతూ మధ్యలో నిలచిపోయినట్లూ, తాను
మళ్ళీ అందుకొన్నట్లూ, చిర చిర లాడుతూ తిట్టడం మొదలుపెట్టింది.

"ఈ వెధవ మూక కోసం కానిపనులన్నీ చేయవలసివస్తూంది. పైగా అంతా నన్ననేవాళ్ళే. ఫో, పాడు మొహం నాకు చూపించకు."

బుడన్ చేసిన ద్రోహం అత్తగారు తిట్టిన తిట్లూతో ఉడికిపోతున్న అనసూయమ్మ కూతురు మీద చీపురుకట్ట తీసింది.

తీరా తల్లియెదుట పడినాక సావిత్రికి మళ్ళీ పిరికిదనం ఆవహించింది. తల్లిని అనెయ్యాలనుకొన్న మాటలన్నీ మరిచిపోయింది.
అతికష్టం మీద అనునయిస్తున్నట్లు ఒక్కమాట అనగలిగింది.

"మేమే చేయమన్నామా?"

"అనేదేమిటి? రాణిగారు ఇప్పుడెందుకు వచ్చేరో తెలీదా? ఆస్తి రాసివ్వకపోతే పిల్లదాన్ని పంపేస్తానని మీ మామగారు పెట్టిన
కబురు అందింది."

సావిత్రికి ఈ వార్త కొత్త. అయితే కబురు కూడా పెట్టేడన్నమాట అనుకొంది. కూతురు ఆశ్చర్యాన్నిగాని, విచారాన్నిగాని
అనసూయమ్మ లెక్కచేయలేదు.

"డబ్బు. మాట్లాడితే డబ్బు. ఏ పనీ ఎవ్వరూ చేయమని చెప్పరు. ఏ సంగతీ నీకక్కర్లేదు. ఆ ముసిలిది చావుకి సిద్ధంగా
వుంది. ఆవిడకు కావలసింది అంతకంటె లేదు. ఇంక కావలసిందంతా నాకే. ఫోండి. ఈ భూమి లేకపోతే నాకేం గడవకపోదు."

అనసూయమ్మ మహాకోపంతో కూతురు రెండు భుజాల మీదా చేతులూ వేసి, గది బయటకు నెట్టివేసి తలుపులు భళ్ళున వేసుకొంది.

ఒక్క క్షణం సావిత్రి నిస్తబ్దురాలయి నిలబడిపోయింది. మరునిముషంలో ఏదో నిశ్చయం చేసుకొంది. గబగబ ఇల్లు విడిచి వీధిలోకి
వచ్చింది.

నలుదిశలా చీకట్లు కమ్ముకొన్నాయి.



ఆరో ప్రకరణం


షాహే ఉస్మాన్.... .... జిందాబాద్
ఆజాద్.... హైద్రాబాద్
షాహే....
ఆజాద్....

ఊరి పొలిమేరల్లో లారీ నిలబడింది. నిలబడడమే తడువుగా ఇరవైమంది పక్కలకెగబ్రాకి క్రింది కురికారు. లోపలి నుంచి అందించిన
కర్రలు, కత్తులు, జంబియాలు, భర్మార్లూ అందుకొన్నారు. పెద్దగా నినాదాలిస్తూ ఊళ్లోకి బయలుదేరేరు.

ఇరవైమందీ చేతులు విసురుతూ, ఎవరికి తోచినప్పుడు వారు, తోచిన నినాదం ఇస్తూ కదిలి వస్తూంటే ఆ గలభా ఏమిటో తెలియక
శీతారామపురం యావత్తూ కాళ్ళువిరగ తొక్కుకుంది. శివరామిరెడ్డిదొర మిలిటరీనీ తోడు తెచ్చేడే యన్నారు. అన్నదే తడువుగ ఎక్కడి
పని అక్కడే వదిలిపెట్టి పారిపోయేటందుకు ప్రయత్నించేరు. తమ భర్తలు, తండ్రులు, అన్నలు, తమ్ములు తప్పించుకు పోయేటందుకు
అవకాశం కలిగించేటందుకై ఇళ్లల్లోని ఆడవాళ్ళంతా చటుక్కున వీధిలోకి వచ్చేసేరు. గంద్రగోళం వినవచ్చినవైపుగా పరుగులెత్తుతున్న
పిల్లగాళ్ళని కేకపెట్టి పిలుస్తున్నారు. వినిపించుకోకపోతే అరిచి తిడుతున్నారు. అప్పటికీ తిరక్కపోతే వెంట పరుగెత్తి
పట్టుకొని జబ్బ పాయిసాలు, రెండు మొట్టికాయలూ బహుకరించి లాక్కువస్తున్నారు.

ఇంతలో వీధి మొగకు వూరేగింపు వచ్చింది. అందరికీ ముందు ఇద్దరు అరబ్బువాళ్ళు అరచేతి వెడల్పు పట్టాకత్తులు దూసి
నడుస్తున్నారు. ఏదో అరుస్తున్నారు. గొంతులు బొంగురుపోయి మాట తెలియడమేలేదు. వాళ్ళ వెనకనే పెద్ద బల్లెం తీసుకొని బుడన్
వస్తున్నాడు. తాను ఎరిగున్న మొహాలూ, తనను ద్వేషించే మొహాలూ కనబడగానే ఆతడు స్వరం హెచ్చించేడు.

షాహే ఉస్మాన్....

అంతవరకూ ఇష్టం వచ్చినట్లల్లా అరుస్తున్న ఇరవై కంఠాలూ ఒక్కమారు కలిశాయి.

.....జిందాబాద్.

ఆ దృశ్యం చూసీ, అరుపులు వినీ అదిరిపోయి ఆడవాళ్ళంతా ఇళ్ళల్లోకి బిలబిలలాడుతూ దూరిపోయారు. జనం కంగారు చూసేక ఊరేగింపులో
వాళ్ళ ఉత్సాహానికి మేరలేకపోయింది. నినాదాలు మళ్ళీ గాడి తప్పేయి.

ఊరేగింపులో అందరి చేతుల్లోనూ కత్తులో, కటార్లో, బరిసెలో, బర్బీలో, బందూకులో, జంబియాలో, దుడ్డుకర్రలో వున్నాయి.
నినాదానికి వూతం యిచ్చేటందుకు ప్రతివాడూ చేతులు విసురుతున్నాడు. ఎగురుతున్నాడు. ఉన్నట్టుండి, ఆవేశం పట్టలేక, అడుగువేస్తూ,
కర్రో, కత్తో తిప్పుతున్నాడు. పల్టీలు కొడుతున్నాడు. పరవళ్ళు తొక్కుతూ ఊహా కల్పిత శత్రువుల్ని అంత దూరాన
నిలబెట్టడానికి హైరాణవుతున్నాడు. ఆతని కర్రదెబ్బ శత్రువులకేగాక తమకే తగిలే ప్రమాదం వుండడంచేత చుట్టూ వున్నవారు
గబగబ తప్పుకొని ఆతడు ఆయాసపడేటందుకు అవకాశం కలిగిస్తున్నారు. ఆ కంగారులో ఒకరిమీద ఒకరుపడి ఆదాబ్
చెప్పుకొంటున్నారు.

ఈ ఆవేశాలు అంటురోగంలో అందరికీ అంటుకొంటూ రావడం చేత ఊరేగింపు అడుగడుగునా నిలిచిపోతూంది.

గమళ్ళపుల్లమ్మ దుకాణం వద్దకు వచ్చేసరికి ఊరేగింపుకు దాహం వేసింది. చూస్తూండగానే ఆ దాహం విదాహం అయింది. దుకాణానికి గిరాకీ
తగిలినందుకు పుల్లమ్మ ఆనందపడింది. ఆమె రెండు చేతులూ ఆ ఆనందాన్ని అందుకోడానికి చాలలేదు. కూతుర్ని పిలిచింది. ఈ
గంద్రగోళంలో తమకు దెబ్బలు ఎక్కడ తగులతవోననే భయంతో పుల్లమ్మ మగడూ, అల్లుడూ అరగంట క్రితమే పారిపోయారు.

పుల్లమ్మ ఆనందాన్ని అల్లంత దూరంనుంచే చూసి కోటమ్మ పరుగెత్తి వచ్చింది. దొడ్డిదారిన ఇంట్లోకెళ్ళి నెత్తీ నోరూ కొట్టుకొంది.

"వూళ్ళో మమ్మల్నెవర్నీ బ్రతకనియ్యవుటే పుల్లమ్మ తల్లీ!"

పోలీసులూ, మిలిటరీవాళ్ళూ, ఇట్లాంటి వూరేగింపుల్లోవాళ్ళూ దుకాణాల్లో మస్తుగా తాగి ఊరంతా అల్లరి చేసిన ఘటనలు అనేకం కోటమ్మ
వింది. ఒకటి రెండు తానూ చూసింది. పుల్లమ్మ ఆమె వాదాన్ని ప్రత్యాఖ్యానం చేసింది.

"నాలుగు పైసాలొచ్చేవి వదులుకోమంటావుటమ్మా కోటమ్మ వదినా?"

బుడన్ దుకాణంలోకి వస్తూనే ముందుగానే ఓ పది రూపాయల నోటును పుల్లమ్మ కందించేడు. ఈ బేరంలో బాగా కిట్టుబాటు కాగలదనే ధైర్యం
అదే. ఆ పదీ కంటబడకపోతే "ఈ పీడ ఎలాగ వదుల్చుకోడం కోటమ్మా?" యని వెంటబడేదే. ఆట్టే నష్టపడకుండా వాళ్ళని
వొదుల్చుకొనేటందుకు తానూ తొందరపడి వుండేది.

కోటమ్మ నిరాశతో తల వ్రేల వేసుకొని లేచి వచ్చింది.

మరల వూరేగింపు కదిలింది. కాని ఈ మారు మనుష్యులలో ఆ గాంభీర్యం లేదు. చేతులలో ఆయుధాలు పైకి లేవడం లేదు. అడుగులూ
సరిగ్గా పడడం లేదు. కాని త్రాగుడు మత్తులో అల్లరీ, భీభత్సం ఎక్కువ ప్రారంభించేరు.

నడి బజారుకు వూరేగింపు వచ్చింది. అడుక్కునేందుకు తిరుగుతున్న ముసిలి ముష్టివాడు దారి తొలిగి ఒక పక్కగా నిలబడ్డాడు. వానిని
దాటి వూరేగింపు కొంత దూరం నడిచింది కూడా. ఇంతలో అతనిచేత నినాదాలు చెప్పించాలని ఎవరికో, ఎందుకో తోచింది. వెంటనే పిలిచేరు.

నలుగురూ వాని చుట్టూ చేరేరు. నినాదాలు చెప్పమన్నారు.

షాహే ఉస్మాన్...

ఆజాద్...

ఆ ముసిలివాడికి ఈ గొడవేమీ అర్ధం కాలేదు. వానికి తాను అనవలసిందేమిటో, ఎందుకనాలో తెలియలేదు. తన్ను పట్టుకొన్న వాళ్ళు
తాగి వున్నారు. వాళ్ళ చేతుల్లో కర్రలూ, కత్తులూ వున్నాయి. భయంతో వాని నోరు బిగుసుకు పోయింది.

చివరకు వాని భయం నిజమే అయింది.

ముష్టివాని నోట తాము చెప్తున్న మాటలు రాకపోయేసరికి ఊరేగింపులో వాళ్లకి మహాకోపం వచ్చింది. ఆలాహజ్రత్ జిందాబాద్ అని
చెప్పని వాళ్ళు హైద్రాబాద్ ఆజాదీకి వ్యతిరేకులే అయి వుంటారు. అంతా ఆ విషయాన్ని ఏకగ్రీవంగా అంగీకరించేరు. ఒక్కపెట్టున
నాలుగువైపుల నుంచీ అసమ్మతి ప్రతిధ్వనించింది. ఆ అసమ్మతిలో ప్రతీకారాన్ని వాంఛించేరు.

"మారో బద్మాష్‌కో "

కర్రలతో పాటు బల్లేలు లేచేయి. ఒక అరబ్బువాని కత్తిపోటుతో ముసిలివాడి ప్రాణం పోయింది. బరిసెపోట్లూ, కత్తిపోట్లతో
తిండిలేక ఎండి వరుగులావున్న ముసిలాడి రక్తం నేలని కాలవ కట్టింది.

ఇళ్ళల్లో తలుపుల వెనకా, తడకల వెనకా నిలబడి చూస్తున్న ఆడవాళ్ళూ, పిల్లలూ ఆ దురంతాన్ని చూసి గొల్లుమన్నారు.

ఆ అరుపులు విన్నాక, రక్తం కళ్ళబడ్డాక ఊరేగింపుకు తెలివి వచ్చింది. ముసిలివాడి కాళ్ళు చేతులు ఇంకా కొట్టుకొంటూ తన్ను
హత్యచేసిన వారి మీదికురకడానికి ప్రయత్నిస్తున్నట్లనిపిస్తూంది. ఒక్కమాటు ఒళ్ళు కంపరం పుట్టింది. నిలవలేకపోయేరు.
ముందొకడు ఉరికేడు. వాని వెనుక మూక అంతా ఉరికింది.

ఊరేగింపులో వాళ్ళు పారిపోతూండడం గమనించి, ముసిలివానికి సహాయం చేయడానికై ఇళ్ళల్లో వున్న జనం బిలబిలలాడుతూ పరుగెత్తి
వచ్చేరు. పరుగెత్తి వస్తూ పెద్దగా గోల చేస్తున్నారు.

ముసిలివానిని చూడడానికి వస్తున్న జనాన్ని చూసేక ఊరేగింపులో వాళ్ళ కాళ్ళు మరింత చురుగ్గా కదిలేయి. తమ మీదికే వారంతా
వస్తున్నారనిపించింది. ఇంకా ఇంకా వేగంగా పరుగెత్తే ప్రయత్నంలో బోర్లపడుతున్నారు. లేస్తున్నారు. తమకంటే ముందుపోతున్న వాళ్ళని
పిలుస్తున్నారు. ఒకటే కోలాహలం.

ఊరి బయట లారీ నిలబడి వుంది. తాను తెచ్చి దింపిన జనం నినాదాలను కట్టిపెట్టి, వెర్రికేకలు పెడుతూ వురుకు వురుకున
వస్తూంటే డ్రైవరుకు కంగారు పుట్టింది. ఏదో ములిగిందనుకున్నాడు.

కండక్టరు హేండిల్ వేసేడు. ఇంజను స్టార్టు కాకుండా మొరాయిస్తూంది. చివరకి గుర్రు, బర్రుమంది. ఇంజన్ ఆగిపోకుండా చేసే
ఆదుర్దాలో డ్రైవరు బండిని కదిపేడు. జనం ఎక్కుతూన్నది ఆతడు గమనించనూ లేదు. గమనించినా మాననూ లేదు. రేకులు పట్టుకొని
పైకెగబ్రాకుతున్న వాళ్ళల్లో ఒకడు చుప్తాగా క్రిందబడ్డారు. ఇద్దరు ఈడిగిలబడ్డారు. నాలుగువైపులనుంచీ ఆదుర్దాగా అరుపులు
వినబడ్డాయి.

"ఠహరో, ఠహరో"

అంతా కష్టపడి లారీలోకెక్కేరు. ఆ భారాన్ని ఈడవలేక అసంతృప్తి తెలుపుతున్నట్లు లారీ ఇంజను గురుగుర్రుమంటూంది. భయం లేదనే
భరోసా చిక్కేక అందరికీ మళ్ళీ గొంతులు విడ్డాయి.

పాకిస్తాన్....మిల్ గయా,

షాహే ఉస్మాన్...

...జిందాబాద్.

ఆజాద్...

...హైద్రాబాద్.

ఇత్తెహాదుల్ ముస్లిమీన్, కాశిం, రజ్వీల కీర్తికి ఊరేగింపు జోహారులర్పించింది. ఆ నినాదాలతో శ్రుతి గలుపుతూ లారీ పరుగుతీసింది.



ఏడో ప్రకరణం


ఒక మహావీరునికి జరిగే మర్యాదలతో ముసిలి ముష్టివాని శవం గ్రామ వీధులలో కదిలింది. అదివరలో ముష్టి పెట్టడానికి
విసుక్కున్న వాళ్ళు కూడా రెండు చేతులా పువ్వులు శవం మీద చల్లేరు. జాలితోనో, అసహ్యంతోనో ఈ ముసలాణ్ణి యముడు కూడా
మరిచిపోయేడన్నవాళ్ళే నేడాతని మరణానికి కంటతడి పెట్టారు.

నేడాతడు అమ్మా, అయ్యా అని అడుక్కుతినే ముష్టి ముసిలాడు కాదు. దిక్కూ, దీమూలేని అనాధుడూ కాదు. ఉస్మాన్ షాహీకి జైకొట్ట
నిరాకరించిన ప్రజాతంత్రవాది. హైద్రాబాద్ స్వతంత్రంగా వుండాలన్న నినాదాన్ని పలక నిరాకరించిన దేశభక్తుడు. ఆశయానికై
అసువులర్పించిన ధీరుడూ, త్యాగధనుడూనూ.

నిజాము పరిపాలన నిష్ఠుర యమలోకానికి పర్యాయం. జాగీర్దారీ దురంతాలకు, వెట్టిచాకిరీకి. కరువుకు, అవిద్యకు పుట్టిల్లు.
తెలంగాణా ప్రజానీకం ఆ పీడ వదల్చుకోవాలనే ఎప్పుడూ కలలు కంటున్నారు. అందరూ ఆ మాటనే బైటకు చెప్పలేకపోవచ్చు. ఉస్మాన్
షాహీ పోవాలని తాము పైకి చెప్పలేకపోయినా, ఆ విధంగా చెప్పగలవానిని అభినందించకుండా వుండలేరు. ముసలివాడు వద్దని అనలేదు.
కాని, కావాలనీ అనలేదు. కనకనే ఆతడు వారి కళ్ళల్లో ఒక మహాయోధుడయ్యాడు.

ఆతని మరణ ఘట్టాన్ని గురించి కోటమ్మ అతిశయోక్తులేమీ చెప్పలేదు. తాను కన్నవీ, విన్నవీ మాత్రమే చెప్పింది. గోడల చాటు
నుంచి విన్నవాళ్ళూ, కన్నవాళ్ళూ ఆ మాటల్ని రుజువుపరిచేరు.

కోటమ్మ గమళ్ళ పుల్లమ్మ ఇంటి నుంచి తిరిగొస్తూ కోమటి పేరయ్య ఇంటి మూలకొచ్చింది. పేరయ్య భార్య పిలుస్తే లోనికెళ్ళింది.
వూరేగింపు వూళ్ళోకి వస్తూన్న వార్త తెలియగానే పేరయ్య దుకాణం మూసేసేడు. గల్లా పెట్టి పాతిపెట్టేడు. విలువయిన సరుకులు తలో
మూలా దాచేసేడు. కొట్టు గది తాళం వేసి, చెవులు మొలలో దోపుకొని ఇంట్లోంచే కాదు-వూళ్ళోంచి కూడా వుడాయించేడు.

ఊరేగింపు వాళ్ళ కంటబడితే కొట్టు సగం ఖాళీ అయిపోతుంది. గల్లా పెట్టె కూడా తరుచుగా ఖాళీ అయి తేలిక అయిపోతూంటుంది. బాబ్బాబు
నీ కాల్మొక్కుతానన్నా తన్నులూ, తాపులూ మాత్రమే దక్కుతాయి. ఆ భయంతోనే ఆతడు జారుకొన్నాడు. ఇంట్లో ఆడాళ్ళు బిక్కుబిక్కుమంటూ
వుండిపోయారు. మాటకారి కోటమ్మ వాకిట్లో కనిపించేసరికి ప్రాణాలు లేచొచ్చేయి. పిలిచేరు.

వాళ్ళ వాకిట్లోనే ఆ దురంతం జరిగింది. అది చూస్తూంటే వాళ్ళకెంతో బాధా, దుఃఖమూ కలిగింది.

అతడో ముష్టివాడు. ఆతని పేరు ఎవ్వరికీ తెలియదు. ఆకారం చూస్తే ముసిలివాడల్లే వున్నాడు. వాళ్లకి జ్ఞానం వచ్చినప్పటి
నుంచీ ఆతడు ముష్టి ఎత్తుకొనే బతుకుతున్నాడు. అందుచేతనే ఆతనికా నామధేయం.... ముసిలి ముష్టాడు.

ఊరేగింపులో వస్తున్న వాళ్ళని అతడు తిట్టేడా, తిమ్మేడా? వాళ్ళొస్తూంటే దారిచ్చి ఓ పక్కగా నిలబడ్డాడు కూడా. వూరేగింపులో
వాడే ఎవడో ఆతణ్ణి "ధోతీ ప్రసాద్" అని ఎగతాళిగా పిలిచేడు. మిగతావాళ్ళంతా నవ్వేరు. ముసలాడేదో పెదవులు కదిలించేడు.
ముసిలి బోసి నోటి వాళ్ళకదో అలవాటు. అస్తమానూ పెదవులూ, దవడలూ ఆడిస్తుంటారు. అంతేగాని ఆతడేమీ అని వుండడు. అన్నాగానీ
ఎవరికీ వినిపించలేదు అదేమిటో. బోసి నోరు కదిలించేడే తప్ప ఏమీ అనే స్వభావం కలవాడు కాదని కోటమ్మ తన అభిప్రాయం
చెప్పింది.

ఆ తర్వాత బుడన్‌గాడో, ఎవ్వరో....ఆ వూరేగింపులో ఆమె బుడన్‌నే ఎరుగును. కనక వాని పేరే నోటికి
చటుక్కున వచ్చేసింది...బహుశా బుడనే అయి వుంటాడు. దగ్గిరికొచ్చేడు.

"పాకిస్తాన్ మిల్ గయా" -అనమన్నాడు. ముసలాడేమీ అనలేదు...

మరోడెవరో షాహే ఉస్మానన్నాడు. జిందాబాద్ అనమన్నాడు...ఉహు ముసిలాడు నోరు విప్పలేదు.

ఆజాద్ హైద్రాబాద్ - అనమన్నారు. అదీ అంతే. వాళ్లకి కోపం వచ్చింది. ఎవడో బల్లెం ఎత్తేడు. ముసిలాడు కదలలేదు.
అరబ్బు వాడు కత్తితో పొడిచేడు.

ముసిలి ముష్టివాని త్యాగనిరతీ, దేశభక్తినీ తలచుకొని గ్రామం అంతా వుద్రేకపడింది. రంగయ్య ఆ వార్త వినగానే పరుగెత్తుకొని
వచ్చేడు. పెద్దదొర కొడుకు రఘునందనరెడ్డీ, అల్లుడు రాజిరెడ్డీ ఊరేగింపు బయల్దేరే వేళకి వచ్చేరు.

చేతులు వికారంగా చాచి, కాలుతున్న బూడిదలో బోరగిలా పడి వున్న ముసిలివానిని చూసి రంగయ్య చాల వుద్రేకపడ్డాడు. ఇత్తెహాదుల్
ముస్లిమీన్ రజాకార్లు సాగిస్తున్న దౌర్జన్య చర్యల వార్తలు కొత్తవేం కాదు. వాటికి ప్రభుత్వం మద్దతు బాగా వుంది. సందేహం
లేదు. లేకపోతే సంస్థానంలో నాలుగువేపులా జరుగుతున్న ఘటనలకర్థమేలేదు.

ఏడాది క్రితం కాంగ్రెస్ జెండాను ఎగరవేసినందుకు వరంగలు జిల్లాలో మొగిలయ్యను హత్య చేసేరు. ఆ హంతకులు కత్తులూ, కటార్లతో
ప్రదర్శనలు చేస్తూంటే అధికార్లు అంతా ఆనందించారు.

ఈ మధ్య ముస్లిం గూండాలు మట్టివాడలో మనుష్యుల్ని కొట్టేరు. కొంపలు దోచేరు. తగులబెట్టేరు. మొత్తం నాలుగయిదు లక్షల
రూపాయల ఆస్తి నష్టపరిచారు. నిజాం ప్రభుత్వం దుండగీళ్ళని శిక్షించడానికి బదులు ధ్వంసం అయిన ఆస్తి నాలుగు లక్షలు కాదనీ
75 వేలది మాత్రమేననీ ప్రకటనలు చేసింది. 75 వేల ఆస్తి నష్టానికి గూండాలని నొక్కెయ్యనక్కర్లేదనా ప్రభుత్వం
ఆలోచన?

ఇవన్నీ ప్రభుత్వం మీద ఆతనికి విశ్వాసం అనేది లేకుండా చేస్తున్నా, ముసలి ముష్టివాని హత్య విషయం రిపోర్టు చేయడానికై
పోలీసు పటేలు ఇంటికి విసవిసా నడిచేడు. వెళ్ళినా జరిగేదేమీ వుండదు. అదీ తెలుసు. కాని చదివింది వకాలతు. ఆ చదువు
ప్రభుత్వ యంత్ర పరిధుల్ని దాటి ఆలోచించనివ్వదు.

తీరా వెళ్లేసరికి పోలీసు పటేలు ఇంట్లో లేడన్నారు. రెండోమాటు అడిగితే అసలు వూళ్ళోనే లేడన్నారు. ఇంక తానే బాధ్యత వహించి
అయిదారు మైళ్ళ దూరంలో వున్న పోలీసు నాకాకి మనిషిని తోలేడు.

పోలీసుల రాకకోసం ఎదురు చూస్తూ జనం తమ కళ్ళ ముందు జరిగిపోయిన ఈ ఘోర దురంతాన్ని గురించి కథోపకథనం సాగిస్తున్నారు.

ఇత్తెహాదుల్ ముస్లిమీన్ రజాకార్లూ, దేశముఖుల గూండాలూ పోలీసులూ వూళ్ళల్లో సాగిస్తున్న దౌర్జన్యాల కథలు పలుముఖాల
వినబడుతున్నాయి. దౌర్జన్యాల వార్తలతో ప్రారంభమయిన కథలు ప్రతిఘటన గాథలలోకి మారేయి.

విసునూరు దేశముఖు గూండాలు మోహనరెడ్డిని నానా హింసలు పెట్టేరు. ఆయన చచ్చిపోయేడని కొందరన్నారు. బ్రతికే వున్నాడని
మరికొందరన్నారు. మోహనరెడ్డి బ్రతికి వున్నాడో లేదో తేలకపోయినా ఆయనను గూండాలు చచ్చిపోయేటంతవరకూ కొట్టేరని రంగయ్యకి
అర్ధం అయింది. కొట్టిన రౌడీలంతా రొమ్ములు విరుచుకు తిరుగుతున్నారనే కనిపిస్తూంది. రౌడీ నాయకుల్లో ఒకడన్న మేరె రంగయ్యని
తాను మొన్న నల్లగొండలో చూసేడు.

ఇంతకీ మోహనరెడ్డి చేసిందేమిటి? దేశముఖు ధర్మాపురంలో రైతుల్ని లేవగొట్టి భూములు ఆక్రమించాలని చూసేడు. మోహనరెడ్డి సంగం
పెట్టి రైతుల్ని నిలబెట్టేడు. దేశముఖు పోలీసుల్ని తెచ్చి రెడ్డిని అరెస్టు చేయించేడు. జైలులో వేయించేడు. కాని ఆయన అక్కడ
ఎన్నో రోజులుండలేదు. జైలులోంచి పారిపోయి వచ్చేడు. వచ్చి కూర్చున్నాడూ? మళ్ళీ జనాన్ని పోగుచేసేడు. ఓ రోజున రౌడీలు ఆయనని
దొరికించుకొని కొట్టేరు. ఆ కొట్టడం కూడా బహు అమానుషంగా. మర్మ స్థానంలోనూ, కళ్ళల్లోనూ కారం కూరేరుట.

ఇల్లాంటి హింసల్ని కూడా ధిక్కరించి ప్రజ తిరుగుబాటు చేస్తూంది. ఎదురుదెబ్బ కొడుతున్నారు. అవన్నీ వింటూంటే తన భూమిని
విడిపించడానికై గ్రామస్థులు చూపిన సాహసం గుర్తుకొచ్చింది. ఆ ఆలోచన తట్టగానే ముసిలి ముష్టివాని మరణంలో ఏదో చెప్పలేని
ఉదాత్త భావం రంగయ్యకి కనబడింది.

తెల్దారుపల్లి జాగీర్దారు కూడా భూముల్లోంచి రైతుల్ని వెళ్ళగొట్టి, వాటిని ఆక్రమించాలనే బయల్దేరేడు. ధర్మాపురం,
తెల్దారుపల్లి, తమ సీతారాంపురం....ఓ వూరేమిటి, పల్లేమిటి? సర్వత్రా భూస్వాముల యావ ఒక్కటేలా కనిపిస్తూంది. ఊళ్ళో
వున్న భూమినీ, చుట్టుప్రక్కల వూళ్ళనీ కూడా చుట్టబెట్టాలనేదొక్కటే పరమార్థం అనుకొంటున్నట్లనిపిస్తూంది. తెలంగాణా సమస్యే
ఇది.

జాగీర్దారు తెల్దారుపల్లికి తన మనుష్యుల్ని పంపేడు. వాళ్ళని గ్రామ ప్రజ యావత్తూ ఎదుర్కొని తరిమేసేరు. ఆ కసితో
జాగీర్దారు నెలా పదిహేను రోజుల క్రితం వూరంతా తగులబెట్టించేసేడు.

తెల్దారుపల్లి ప్రజల పోరాట గాథ ప్రజల నోట మహారసవంతంగా అభివర్ణితమవుతూంది.

పది రోజుల క్రితం జాగీర్దారు రౌడీలు సాంబయ్యగారి పొలం ఆక్రమించడానికి మళ్ళీ వచ్చేరు. కొంపలు తగులపెట్టేక గ్రామస్థులకు
కుసులు లొంగి వుంటాయని వాళ్ళ అంచనా. కాని జరిగింది వేరు. మంది రౌతులూ, వడిసెలలూ యథేచ్ఛగా వాడేరు. ఆడవాళ్ళూ.
ముసిలివాళ్ళూ సహా రౌడీల్ని చితక్కొట్టేరు.

నాలుగు వందల మంది ఆడా, మగా, పడుచూ, ముసిలీ అనకుండా వచ్చిపడ్డారు. గూండాల వద్ద బందూకులూ, జంబియాలూ, కత్తులూ,
కర్రలూ, జంజాలూ వున్నాయి. రైతుల వద్ద ఒక్కటీ లేదు. అయితే మాత్రం వెనకాడేరా? ఆరుగురికి బందూకు దెబ్బలు తగిలేయి.
ఒకరేనా జంకేరా?

తన వూళ్ళోని పడుచువారు కర్రసాము నేర్చుకొంటున్న ఘటన రంగయ్యకి గుర్తు వచ్చింది. బందూకుల ముందు కర్రలేం చేస్తాయని తాను
నవ్వుకొన్నాడు. ఏమీ చెయ్యలేవు. ఆ మాట నిజమే. ఇక్కడ ప్రాముఖ్యత మనుష్యులది. వారి చేతుల్లో వున్న కర్రలవీ కాదు;
బందూకులవీ కాదు.

తమ్మినేని అప్పయ్యగారికి గుండు దెబ్బ తగిలింది. అంత బాధలోనూ ఆయన ఓ రౌడీని నేల పడగోట్టేడు. వేగినాటి
లక్ష్మయ్యగారికి కత్తిపోటు తగిలింది. ఆయన లొంగలేదు. చేతిలో వున్న దుడ్డుకర్ర తీసుకొని రౌడీని జందెప్పెట్టుగా వేసేసేడు.

ఆడవాళ్ళు రౌతులందిస్తూంటే మగాళ్ళు వడిసెలలు విసిరేరు. గూండాలకు రషీద్ అన్నవాడు నాయకుడట. వాడు పారిపోతూ, పారిపోతూ
ఆడవాళ్ళకి దొరికేడు. పొలం మీద పేచీలోకి పోలేక పొలిమేరల్లో కూర్చున్న ముసిలాళ్ళూ, ముతకాళ్ళూ, ఆడవాళ్ళూ వాడిని పట్టుకొని
పులుసులోకి ఎముక లేకుండా చితక పొడిచేరు. తాను పంపిన రౌడీ మూక పని ఎల్లా చేస్తున్నారో చూస్తూ దగ్గర్లో గట్టుమీద
తెల్దారు పల్లి జాగీర్దారు నిలబడి వున్నాడు. అతడిని చూడగానే జనం అటూ తిరిగేరు. ఈ ఉప్పెన చూసి అతడు ఖమ్మం దాకా
ఒకటే పరుగు.

ఒక్కొక్క కధ జనంలో మరుగుతూన్న నూనెలో పడ్డ నీటి చుక్కలా పని చేస్తూంది. ప్రజలుద్రేకం, ఆవేశంతో ఉడికిపోతున్నారు.

సాయంకాలం వేళకి పోలీసు నాకాకి వెళ్ళిన మనిషి వచ్చేడు. అక్కడ జరిగిన ఘటనలు చెప్పేసరికి ప్రజల వుద్రేకాల్ని
పట్టశక్యం కాకుండా పోయింది.

ముసిలి ముష్టివాణ్ని ఇత్తెహాదుల్ ముస్లిమీన్ రజాకార్లు పొడిచి చంపెసేరని చెప్తే అమీను మరేం కొంప మునిగిపోలేదులే అన్నాడు.
పోలీసు పటేల్ ఫిర్యాదు చేస్తే తప్ప తనకేం సంబంధం లేదన్నాడు. మరోమాటు చెప్పేసరికి మండిపడ్డాడు. చచ్చింది నువ్వు కాదు
గదా?....రిపోర్టిచ్చే పని నీకేం వచ్చింది?....ఎవరివో సంగం వాడివల్లే వున్నావే...యని కర్ర తీసుకొని రెండు కొట్టేడు.
జైలులో పెట్టకుండా తరిమేసినందుకు సంతోషపడుతూ ఆతడు పారిపోయి వచ్చేడు.

ఫిర్యాదుకు పట్టిన గతి విన్నాక జనం గర్జించింది. తెల్దారుపల్లి మహిళల వీర గాథలతో ఉబ్బితబ్బిబ్బులయిపోతున్న మహిళా
లోకం ముందడుగు వేసింది. వాళ్ళ ప్రోత్సాహంతో మగాళ్ళు కదిలేరు. పెద్ద సమారోహంతో ముసిలివాని శవాన్ని వూరేగింపు తీసేరు.
చుట్టుప్రక్కల నాలుగు మూడు పల్లెల్లోని డప్పులూ తాళాలూ వచ్చేయి. వందలూ, వేలూ జనం పోగుపడ్డారు. ఒక్కొక్క మనిషి వచ్చి
చేరిన కొద్దీ జన సముద్రంలో ఒక్కొక్క కెరటం లేస్తూంది.

ముసలి వానిని హత్యచేసిన రజాకార్ల మీద కోపం వుండొచ్చు: తాటస్థ్యం వహించడం ద్వారా పోలీసులు రజాకార్లకి ప్రోత్సాహం
ఇస్తున్నారనే నమ్మకం వుండొచ్చు. ముసిలివాని మరణంలో ఉదాత్తతా కనబడవచ్చును. కాని, రంగయ్యకి మాత్రం ఆతని శవాన్ని
వురేగించడం, దానికంత సమారోహం నచ్చలేదు.

ఆతని అభ్యంతరాలు పలు ముఖాలు. కొన్ని పైకి చెప్పగలడు. కొన్ని చెప్పలేడు.

అన్నింటికన్నా పెద్ద అభ్యంతరం వూరేగింపు జరపడానికి ప్రభుత్వం అనుమతి లేకపోవడం. ఇప్పుడైతే తప్పంతా రజాకార్లదీ,
ప్రభుత్వోద్యోగులదీ. కాని అనుమతి లేనిదే వూరేగింపు జరపడం తప్పంతా తమ నెత్తిన వేసుకోవడం అవుతుందని ఆతని అభిప్రాయం.
చట్టరీత్యా సమస్యల పరిష్కారానికి పూనుకోకుండా చట్ట ధిక్కారానికి పూనుకొంటే పోలీసుల దౌర్జన్యాలకో కారణం కల్పించిన వాళ్ళం
అవుతామని ఆతని అభ్యంతరం.

రెండోవేపున మనస్సులో మరో సందేహం కూడా లేకపోలేదు. ముసిలి ముష్టివాడు ప్రజలనుకొంటున్నంత త్యాగం చెయ్యగలడనే నమ్మకం
అతనికి లేదు. నిజాం వుండాలో, పోవాలో అతనికేం తెలుసును? పాకిస్తానంటే ఏమిటో, హైద్రాబాద్‌కు ఆజాదీ అంటే ఏమిటో
ముసిలి వాడికే గాదు. ఇక్కడున్నవాళ్ళల్లో ఎందరికి తెలుసు? ఆ నిర్భాగ్యులు తెగ తాగి క్రిందూమీదూ ఎరగని దశలో చంపేసేరు.
వానినిప్పుడు బ్రహ్మాండ నాయకుణ్ణల్లే వూరేగించడంలో అర్థం ఏమిటి?

కాని, ఈ అభ్యంతరాన్ని అందరి వద్దా చెప్పగల ధైర్యం లేదు. ధైర్యంగా తాను చెప్పగలిగిన అభ్యంతరాన్ని జనం ఖాతరు
చెయ్యలేదు.

* * * * *

ప్రొద్దువాటాలే వేళకి రఘునందనరెడ్డి చెల్లెలి మగనితో సహా వచ్చి జరిగిపోయిన దురంతానికి విచారం తెలిపేడు. వందలూ, వేల
సంఖ్యలో తీర్థప్రజలా పోగుపడ్డ జనం మధ్యకు వెళ్ళలేక అంత దూరాన వీధి మొగలో తిన్నెమీద నిలబడ్డాడు. పెద్దరెడ్డి
కొడుకుకు అభివాదం చేయవచ్చిన కొందరు పెద్దవాళ్ళు సమీపించి మాట్లాడగల ధైర్యంలేక అంతదూరంలోనే నిలబడిపోయేరు.

నిశ్శబ్దంగా ఒకరి మొగాలొకరు చూసుకుంటూ నిలబడి వుండడం ఏలాగో అనిపించింది. అయినా తన అంతస్థుకి తక్కువయిన వాళ్ళని ఎల్లా
పలకరించాలో చేతగాక రఘునందనుడు తికమకపడ్డాడు. దగ్గరికి రమ్మనడానికి మనస్సు వొప్పడంలేదు. తనకంటె పెద్ద వయస్సు
వాళ్ళు తనకంత దూరంనుంచే భయప్రపత్తులతో పరిశీలనగా చూస్తూ చేతులు కట్టుకొని నిలబడ్డం ఎల్లాగో అనిపిస్తూంది.
మాట్లాడ్డానికేనా ప్రక్కన మనిషి లేడు. కూడా వచ్చిన బావమరిది జనం మధ్య ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆ మనిషిని
ఎక్కడో చూసినట్లనిపించింది. కాని గుర్తు రాలేదు.

జనం శవాన్ని కదిలించే ప్రయత్నాలు చేస్తూంటే వుండబట్టలేక దూరాన కనిపించిన రంగయ్యకు కబురంపేడు. పొలం విషయంలో జరిగిన
గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకొని రంగయ్య మొదట జంకేడు. కాని తప్పలేదు.

రఘునందనుడు ఆ విషయమే ఎత్తలేదు. గతంలో పరిచయం లేనందుకు సంకోచం ప్రకటించాడు. శవాన్ని పోలీసులు వచ్చేవరకూ కదల్చకుండా
వుంచకపోతే వచ్చే ఇబ్బందుల్ని జ్ఞాపకం చేసేడు. అందులోనూ తగులబెట్టేస్తే మరేమన్నా వుందా?

రంగయ్య ఔడు కరిచేడు. అనుమతి లేకుండా వూరేగింపు జరపడం తప్పనేంతవరకే తనకు తోచింది. ఇప్పుడు రఘునందనుడు జ్ఞాపకం
చేసినది అంతకన్న ప్రమాదకరమయిన తప్పిదం. హత్యతో సంబంధించిన వ్యవహారం ఆయె.

కాని, ఈ అభ్యంతరాన్ని కూడా జనం ఖాతరు చేయలేదు. పోలీసు అమీను ధోరణి విని వాళ్ళంతా మహా ఆవేశపడుతున్నారు. జనం మధ్య
తానెన్నడూ చూసివుండని కొత్త మొగం కనబడింది. వేలు పెట్టి లెక్కపెట్టగల ప్రత్యేకత ఆ మనిషిలో కనబడకపోయినా, చుట్టూ
చేరిన గ్రామ యువకుల సంఖ్యే అతనిని రంగయ్యకు చూపింది. తన అక్కగారు కూడా ఆయనతో మహా పరిచయం వున్నట్లు ఏమిటో
మాట్లాడుతూంది. అసలు సంరంభం అంతా అక్కడే వున్నట్లు తోచింది. రంగయ్య ఆయన దగ్గిరికెళ్ళేడు. ఎందుకు చెప్తున్నాడో
ఎరక్కుండానే వూరేగింపును ఆపడంలో తోడ్పాటు కోరాడు. అంతా చెప్పాక గుర్తు వచ్చింది. ఆయన పేరు కూడా తెలియదు. అడిగేడు.

"తమ పేరు...."

ఆ యువకుడు సగౌరవంగా అభివాదన చేసేడు.

"సత్తిరెడ్డి...."

మనిషిలాగే పేరు కూడా సర్వసాధారణమైనదే. ఆ పేరు కొందరికి భయోద్రేకాలు కలిగించి వుండేదేమో. కాని రంగయ్యకు ఆ పరిచయం
లేదు. రజాకార్లు చేస్తున్న ఇల్లాంటి దురంతాలను ప్రభుత్వం ద్వారానే ఆపించాలి గాని ప్రజలు చెయ్యి చేసుకోడం మంచిది కాదన్నాడు.
నిజామే దీనిని ప్రోత్సహిస్తున్నాడనే వాదం వస్తుందనే ఆలోచనతోనో యేమో నిజాం ఈ మధ్యనే చేసిన ఫర్మానా మాట జ్ఞాపకం చేసేడు.
దౌర్జన్యకారుల్ని అణిచేస్తామన్న ఆ ప్రకటన మీద హైద్రాబాద్‌లో తనకు కలిగిన అనుభవం విశ్వాసాన్ని
కలిగించకపోయినా ప్రస్తుతం జనాన్ని వెనక్కి లాగిపట్టేందుకు దానిని ఉదహరించక తప్పింది కాదు. ఆ వూరేగింపు సాకు చూపి,
పోలీసులు మళ్ళీ దాడులు చేస్తే?

సత్తిరెడ్డి ఎంతో శాంతంగా, తాను చెప్పింది ఓ వాదనే కానట్లు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూంటే రంగయ్యకు ఏమనడానికీ తోచలేదు.
పోలీసులు దాడిచేయడానికి ఓ సాకు కూడా కావాలా? సాకు దొరక్కుండానే చేసుకోవాలనే తాపత్రయానికి బదులు చీటికి మాటికి మీదపడే
దురలవాటు మానిపించాలన్నాడు. వాళ్లకి ఏదయినా సాకే. షావుకారు రంగయ్య పిండిప్రోలు దేశముఖు తనకు బాకీ వున్న జొన్నలు
ఇవ్వాలనడిగినందుకు ఆయన మీద కేసులు పెట్టించేడు. ఆ మనిషి దొరకలేదని ఆయన భార్యని నానా బాధలు పెట్టేరు. జొన్నలు
ఇవ్వాలనడమే ఓ సాకు అయితే మరి కానిదేమిటి?

నల్లగొండ జిల్లాలో నిరుడు 25 మందిని చంపేసేరు. పదహారు వేల మందిని కొట్టేరు. పదిహేను లక్షల రూపాయల ఆస్తి నాశనం
చేసేరు. నూరుమంది వరకూ పడుచుల్ని చెరిచేరు. వీటన్నింటికీ సాకులే వున్నాయా?

అంతవరకూ ఎందుకు? ఈ ముసిలివాణ్ణి చంపడానికి వాళ్ళు చూపించిన సాకు ఏమిటి?

రంగయ్య అన్నీ విన్నాడు. పరిస్థితులు ఇల్లా వున్నాయి గనకనే తొందరపడకూడదని నీతి చెప్పేడు.

కాని సత్తిరెడ్డి చెప్పింది దానికి ప్రత్యక్ష విరుద్ధం.

ప్రతి పేటలోనూ వలంటీరు దళాల్ని కూర్చుకొని దౌర్జన్యం చేస్తున్న వారిని కాస్త అదుపులో పెట్టాలన్నాడు. ప్రజల పోరాటాల
నుండి నేర్చుకోవలసిన పాఠాలలో అదొకటి. ఒకటి కాదు. అతి ముఖ్యమైనదని ఆయన అభిప్రాయం.

నిజాం నవాబు ప్రభుత్వం మధ్యయుగాలనాటి అనాగరిక ప్రభుత్వం అన్నాడు. దానిని ఇల్లాగే సాగనిస్తే అసలు మనుష్య జాతి
అభివృద్ధినే అవమానపరచడం....

ఆ మాటలకి ప్రజలు హర్షం వెలిబుచ్చుతున్నారు! ఏడాది క్రితం పోలీసులూ, మిలిటరీ వచ్చి మడతకొట్టుడు సాగించినా
గుర్తులేదన్నమాట. పైగా ఎవరో తన్ను అవహేళన చేయడానికా అన్నట్లు రాజకీయ నినాదం ఒకటిచ్చేరు.

"నిజాము భారత యూనియన్‌లో చేరాలి."

నిజానికి ఆ నినాదం అంగీకారమే. కాని, ఆ ఇచ్చిన మనిషీ, సమయమూ చూస్తే తనను హేళన చెయ్యడానికే
వుద్దేశించినట్లనిపించింది.

ఆ నినాదం ఇచ్చింది నరిసిరెడ్డి కొడుకు భాగ్యరెడ్డి. ఆతనికి యూనియనేమిటో, దానిలో నిజాము చేరడం ఏమిటో తెలియదు. పది
రోజుల క్రితం బొగ్గులబండి తోలుకొని హైద్రాబాద్ వెళ్లేడు. పట్నంలో ముసల్మానులంతా హడావిడి చేస్తున్నారు. ఆతడదేమిటని వాకబు
చేసేడు. నిజాం మంత్రులు అయిదుగురు ఢిల్లీలో సర్కారుతో మాట్లాడ్డానికి వెళ్ళేరట. కాంగ్రెసువాళ్ళు నిజాము యూనియన్ లో
చేరిపోవాలన్నారట. వెళ్ళిన వాళ్ళల్లో ఇద్దరు పనికిరాదన్నారుట. ముగ్గురేదో షరతులు పెట్టేరుట. [3] ఇత్తెహాదుల్
ముస్లిమీన్ చేరవద్దని చెప్తూంది. వాళ్ళ నాయకుడు కాశిం రజ్వీ రంకెలేస్తూ ఏదో కరపత్రం వేసేడు. భాగ్యరెడ్డి ఓ కరపత్రం
సంపాదించి, మడతపెట్టి బొడ్డులో దోపుకొని పదేపదార్ధంగా తీసుకొచ్చేడు. యూనియనన్నది కొత్త మతం ఏమన్నా కాదు గదాయని తన్ను
ప్రశ్నించేడు.

[3] 1947 జూలై 25న ఢిల్లీలో సంస్థానాధీశుల సభ జరిగింది. దానికి నిజాము తరపున ఛత్తారీ నవాబు, ఆలీయార్ జంగ్,
పింగళి వెంకట్రామారెడ్డి, మాంక్షన్, అబ్దుల్ రహీమ్‌లు హాజరయ్యేరు. కొన్ని షరతులతో నిజాము యూనియనులో చేరడానికి
ఛత్తారీ నవాబూ, మాంక్షనూ, ఆలీయావర్ జంగూ సమ్మతించారనీ, మిగతా యిద్దరూ వ్యతిరేకించారనీ ఆ రోజులలో పత్రికలలో వార్తలు
వచ్చేయి.

తాను ఎంతో ఓపికతో రాజకీయ విషయాలు చెప్పేడు. ఆ భాగ్యరెడ్డి ఆనాడు తాను చెప్పినవన్నీ తన మీదికే
తిప్పికొడుతున్నట్లనిపించింది.

ఛత్తారీ నవాబు యూనియన్‌లో నిజాము చేరవచ్చునన్నాడు. ఆయన్ని చంపుతామని ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ గంతులేసింది.
వాళ్ళే నేడు ఈ ముసిలాడిని చంపేసేరు. అటువంటి దుర్మార్గులు యూనియన్‌లో చేరవద్దంటున్నారంటే అదేదో మంచిదై వుండాలి.
భాగ్యరెడ్డి ఆ ఆలోచనతోనే ఆ నినాదం ఇచ్చేడు.

జనానికి ఆ మాత్రమూ తెలియదు. యూనియన్ అనే మాటను వాళ్ళెన్నడూ వినలేదు. కోటమ్మ అడిగింది.

యూనియనంటే 'బ్రిటిష్' అని భాగ్యరెడ్డి ఒక్క కేక పెట్టేడు. తెలంగాణాను ఆనుకొని వున్న కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు
బ్రిటిష్ ప్రాంతాలు. నందిగామ, బెజవాడ, పల్నాడు మొదలయినవన్నీ బ్రిటీష్ ప్రాంతాలు. అక్కడ తమర్ని పీడించే వెట్టీ, ఈ
దురన్యాయాలూ ఇంతగాలేవని చెప్పుకొంటారు. నిత్య జీవితంలో ఎన్నోమాట్లు 'బ్రిటీష్' లోకి పోయి బ్రతుకుదామని కలలు కన్నవాళ్ళే.
అందుచేత యూనియన్ అంటే బ్రిటీష్ ప్రాంతాలే అనే వ్యాఖ్యానం వినబడగానే వాళ్ళ ఉత్సాహం వురకలేసింది. కొత్తగా వున్న మాటను
వదలి పాత మాటనే వుపయోగించేరు.

"బ్రిటిష్‌లో చేరిపోవాలి."

బ్రిటిష్ వాళ్ళు పోతాం మొర్రో అంటూంటే, వీళ్ళు వాళ్ళతో చేరిపోతామంటూ నినాదం ఇవ్వడం రంగయ్యకు వెగటు అనిపించింది. మాట్లాడకుండా
వెనుతిరిగేడు. ఇంటికి వెళ్లేవరకూ తరుముకొస్తున్నట్లు నినాదాలు వినిపిస్తూనే వున్నాయి.

కొంతసేపు జనం బ్రిటీష్‌లో చేరిపోవాలని గంతులేసేరు. పోలీస్ అమీన్ కొట్టిన దెబ్బలు చిమచిమలాడుతూంటే ఆతడన్న మాటలు
గుర్తు చేసుకొని ప్రొద్దుటి వార్తాహరుడు 'సంగం జిందాబాద్' అన్నాడు. ఈ మాట అంతా అందుకున్నారు. సంగం అందరికీ తెలిసినది.

'సంగం జిందాబాద్'

'బ్రిటిష్‌లో కలవాలి, ---- నినాదాల మధ్య శవం లేచింది. కొండరాళ్ళ మధ్య పెద్ద హోరుతో పరవళ్ళు తొక్కుతూ
ఉరకలు వేసే వాగులాగ ఇరుకు వీధులలో జనప్రవాహం కదిలింది.

వూరేగింపు సిలార్ ఇంటివద్దకు వచ్చేసరికి ముంతాజ్ రెండు చేతులతో ఇన్ని పూలు శవం మీద చల్లింది.

వీధిలో దారికడ్డంగా ప్రవహిస్తున్న మురుగుజాలు మీదుగా వురకలు వేస్తూ జనం కదిలింది.

నినాదాలు పిక్కటిల్లేయి. ముసలి ముష్టివాని దుర్మరణానికి విచారపడుతూ వీధిలోకి వచ్చిన సిలార్ చెవులు మూసుకొని యింట్లో దూరేడు.

జనం గర్జించింది.

"నిజాం సర్కార్.... ముర్దాబాద్...."



ఎనిమిదో ప్రకరణం


తెల్లవారేసరికి పదిమంది పోలీసులతో అమీన్ వెంటరాగా సర్కిలినస్పెక్టరు రమణారెడ్డి వూళ్ళోకి రానూవచ్చేడు—వాళ్ళ వుద్దేశం
తెలిసి జనం సర్దుకొనేలోపున పదిమందిని అరెస్టూ చేసేడు—ఎందుకు అరెస్టు చేసేడో అర్ధం అయ్యేలోపున వొళ్ళు కదుములు కట్టేలాగ
కొట్టనూ కొట్టేడు. అందరినీ లాక్కుపోయి గఢీలో పెట్టేడు. కచేరి సావట్లోని కటకటాల గదిలో పడేసేడు. అప్పుడు విచారణకు
పూనుకొన్నాడు.

రమణారెడ్డికి ముసిలివాడిని ఎవరు చంపేరో తెలుసుకోవడం ముఖ్యం కాదు. శవాన్ని ఏంచేసేరని అడగలేదు. పోలీసులు వచ్చేదాకా వుంచక
ఎందుకు కదిపేరని ప్రశ్నించలేదు. అసలు వెనకటిరోజున రజాకార్లు వూళ్ళోకి వచ్చేరనీ, వచ్చి ఓ అమాయకుణ్ణి చంపేరనీ
ఆయనకు తెలుసునో, తెలియదో కూడా అర్థం కాలేదు. ఆయన ప్రశ్నలన్నీ సత్తిరెడ్డి అనేవానికోసం. అతడెక్కడున్నాడు? ఎక్కడ
నుంచి వచ్చేడు? ఎక్కడికెళ్ళేడు? ఎప్పుడొచ్చేడు? ఎప్పుడెళ్ళేడు? ఎవరితో మాట్లాడేడు? ఏం మాట్లాడేడు? ఇదీ ధోరణి. ఆ
ప్రశ్నలకో అంతు లేదు. ఆపులేదు.

ఎంత కొట్టినా ఎవ్వరూ ఏమీ చెప్పలేదు. చాలామందికి సత్తిరెడ్డి ఎవరో తెలియదు. అంతా ఆ మనిషిని చూసేరుగాని ఆయన్ని గురించి
ఎరగరు. తమకు తెలిసింది కాస్తా చెప్పినా రమణారెడ్డి వూరుకోడు. కనక వాళ్ళు చూసేమని చెప్పడానికి కూడా సిద్ధపడలేదు.
ఆయన్ని ఎరిగిన వాడల్లా వెంకటయ్య ఒక్కడే. ఏమీ ఎరగనని తప్ప ఆతని నోట మారుమాట రాలేదు.

రమణారెడ్డి అన్నీ తెలుసుకొనే వచ్చినట్లు తోచింది. ఊరేగింపులో ఆ వీధిలో వాళ్ళ యింటి వద్ద మంచినీళ్ళిప్పించలేదా, వీళ్ళ యింటి
వద్ద మాట్లాడేవు కాదా యని అట్టిపుట్టి ఆనవాళ్ళతో అడుగుతున్నాడు. కూపీ యిచ్చినవాడెవరో వివరంగానే యిచ్చేడు. రమణారెడ్డి
ప్రశ్నలకి వెంకటయ్య ఆశ్చర్యపడ్డాడు. తన కంటితో చూసినట్లే అడుగుతూంటే ఆశ్చర్యంగాకేముంది? కాని, ఆ భావాన్ని పైకి
కనబడనివ్వలేదు. ప్రారంభించినప్పటిలాగే చివరకంటా ఒక్కటే మాట. "ఏమీ తెలియదు....." ప్రశ్నలు వెయ్యలేక ప్రాణం
చాలొచ్చి రమణారెడ్డి వెంకటయ్యని వేరే గదిలో పడేయించేడు.

వెంకటయ్యని వేరే గదిలో పడేసేరనీ, క్రూరంగా కొడుతున్నారనీ వార్త తెలిసి సత్తెమ్మ మ్రాన్పడిపోయింది. చేతిలో పని పారేసింది.
కోటమ్మని సాయం పిలిచింది. ఇద్దరూ గఢీకి బయలుదేరేరు.

వెళ్ళి తాను ఏం చేయదలచిందో సత్తెమ్మ ఆలోచించనేలేదు. వెంకటయ్యని కాపాడాలి. అంతే దృష్టి.

బయలుదేరుతూ కోటమ్మని పిలిచింది. కోటమ్మ, వెంకమ్మ, మంగమ్మ, లక్ష్మి వగైరాలని పేరు పేరున పిలుస్తూనే చంటి బిడ్డను
చంకనేసుకుంది. 'ఎక్కడికి పోతున్నావే నీ తాడు తెగా' యని ఆశీర్వదిస్తున్న భర్త వేపు థూత్కారంగా చూస్తూ గబగబా అడుగు
వేసింది. మనవాళ్ళని ఎందుకు పట్టుకొన్నారో, ఎందుక్కొడుతున్నారో కనుక్కుందాం రమ్మని రంకె వేస్తుంటే ఆ యమ్మా, ఈ యమ్మా ఓ
పది మంది కదిలేరు.

వీళ్ళు వెళ్ళేసరికే గఢీ గుమ్మంలో చాల మంది చేరి వున్నారు. అంతా ముసిలీ, ముతకా, పిల్లా, మేకాను. తమ కొడుకునో,
అల్లుణ్ణో, తమ్ముణ్ణో తండ్రినో కొట్టవద్దని వేడుకోడానికీ, వాళ్ళు ఏమీ ఎరగరని చెప్పుకోడానికీ, చేరేరు అంతా. లోపల నుంచి
వినిపిస్తున్న గద్దింపులూ, మొర్రో మొర్రో మన్న యేడ్పులూ వింటూ నీరసంగా, నీరవంగా గోడలకి జేరబడిపోయి వున్నారు. మధ్య
మధ్య ఒకడు లేస్తాడు. ఏదో గుర్తు వచ్చినట్లు సర్కిల్ దగ్గరికో, అమీన్ వద్దకో తూలితూలిపోతూ బయలుదేరుతాడు. అతని
వెనక్కాల మిగిలినవాళ్ళు కూడా లేస్తారు. కదులుతారు. ఎవరికివారికే అధికారితో మాట్లాడ్డానికి భయం. కాని, ఎవరో ఒకరు
సాహసం చేస్తే పనిలో పని తానూ ఓ మాట అనడానికీ, తనవాడు కూడా ఒకడక్కడున్నాడని గుర్తు చేయడానికీ మిగిలిన వాళ్ళు
లేస్తారు.

వెళ్ళి ప్రాధేయపడుతున్నారు. అపరాధం చెప్పుకొంటున్నారు. కాల్మొక్కుతామని నోటితో అనడమేగాక క్రియా రూపంలో కూడా కాళ్ళ ముందు
సాగిలపడుతున్నారు. "బాంచల" మంటున్నారు. ఆ వుద్యోగి గదుముతే నిరాశతో మళ్ళీ వచ్చి ఆ వీధి గోడల్నే, ఆ చెట్లనే
ఆశ్రయిస్తున్నారు.

గఢీ గుమ్మంలోకి వచ్చేసరికి అక్కడ చుట్ట కాలుస్తూ కూర్చున్న ఒకడు కోటమ్మను పలుకరించేడు.

"కారపుముంత తెచ్చేవా?"

కోటమ్మ వులికిపడింది. సత్తెమ్మ తిరిగి చూసింది. ఆ పలకరింపు ఎవరినో ఇద్దరికీ అర్ధం కాలేదు. ఆ కూర్చున్నవాడు కూడా
వాళ్ళని ఆ సందిగ్ధ స్థితిలో ఆట్టేసేపు వుంచలేదు. తన పలకరింపు వుద్దేశాన్ని పక్క వాడికి వివరించేడు. ఇద్దరూ
నవ్వుకొన్నారు.

"ఈవిడ బండ మీద ఆడాళ్ళని కూర్చోబెట్టుకుని కళ్ళల్లో కారం గుండ ఎల్లా కొట్టాలో నేర్పుతూంది."

"మొగుడి కళ్ళలోనా?"

ఇద్దరూ విరగబడి నవ్వేరు. మొదటివాడు లేచి నిలబడ్డాడు. ఆరోజున ఆమె బండ మీద చేసిన అభినయమూ, గంతులూ మిత్రుని
ముందర ప్రదర్శిస్తూంటే నవ్వలేక డొక్కలు పట్టుకు దొర్లిపోయేరు.

కోటమ్మ పదడుగులు వేసి సత్తెమ్మ చెవిలో వూదింది.

"వీడో ఖుఫియా, ఆ రోజున బండ మీద నేను అన్న మాటలన్నీ విన్నాడన్నమాట. లంజ..."

సత్తెమ్మ వాడి ఆకారాన్ని గుర్తుపెట్టుకోడానికై వెనక తిరిగింది. కోటమ్మ ఆమె చేయి పట్టుకు గుంజింది.

గఢీ గుమ్మంలోకి వెళ్ళేకగాని సత్తెమ్మ తాను చెయ్యవలిసింది ఏమిటని ఆలోచించలేదు. తాను ఎందుకొచ్చింది? వెంకటయ్యను విడుదల
చేయమని ఎవరిని అడుగుతుంది? వెంకటయ్య నీకు ఏమవుతాడంటే? ఏం చెప్తుంది? ఈ మధ్య జరిగిన గంద్రగోళాల అనంతరం తాను
వచ్చిన పని చెప్తే నలుగురూ నవ్వరా?

ఈ నగుబాటు నుంచి బయటపడటానికి ఆమెకో మార్గం తోచింది. సుమిత్రతో తనకు స్నేహం వుంది. ఆమెతో చెప్పొచ్చు. చెల్లెలి మాట
రమణా రెడ్డి కాదనగలడా? జైలులో పెడితే పెట్టేరు, కొట్టకపోతే సరి. ఆ మాత్రం సాయం సుమిత్ర చేయలేదా? సత్తెమ్మ పక్క
గుమ్మాన చటుక్కున లోనికి చొరబడింది.

లో గుమ్మంలో కిష్టయ్య ఎదురయ్యేడు.

సత్తెమ్మను చూడగానే బోళ్ళపొలం కథ గుర్తు వచ్చింది. కసి తీర్చుకొనేటందుకు సమయం వచ్చిందనుకొన్నాడు. దారికడ్డంగా
నిలబడ్డాడు.

"ఎక్కడికి?"

సత్తెమ్మ వినిపించుకోలేదు. వినిపించుకొనేటట్లూ లేదు. పక్కకు తప్పించుకొని చర్రున లోపలికెళ్ళింది. ఆమె వెనకనే వస్తున్న
కోటమ్మను ఆపు చేసే హడావిడిలో కిష్టయ్య సత్తెమ్మ మాట మరిచిపోయేడు.

వెంకటయ్య గురించి ఏమీ చెప్పక పూర్వమే సుమిత్ర ఆమె రాకలోని వుద్దేశాన్ని అర్ధం చేసుకొంది. అరెస్టులూ, కొట్టుళ్ళూ గురించి
వాళ్ళూ వింటున్నారు. ఇల్లు బాగా లోపలగా వున్నా దెబ్బలు తింటున్న వాళ్ళు పెడుతున్న గోల, కేకలు లోనికి వినిపిస్తూనే
వున్నాయి. కాని, ఎవ్వరూ ఏమీ చెయ్యగలది లేదు. బహుశా అలా దెబ్బలు కొట్టడం కొత్తగా తోచనేలేదో యేమో. వాళ్ళెన్నడూ
ఇట్లాంటి ఘటనల్లో ఇదేమని అడగడం వుండదు. అడిగినా విషయం తెలుసుకొనేటంతవరకే. అంతకు మించి కలగచేసుకొంటే వినేవాళ్ళెవరు?

సత్తెమ్మ ఆక్రోశానికి సుమిత్ర చెప్పగల వోదార్పు మాట ఒక్కటీ లేకపోయింది. అప్పుడే ఆవేపు వచ్చిన శివరామిరెడ్డి
ప్రశ్నించేడు.

"ఎవరా సత్తిరెడ్డి?"

"అదేమో చిన్నబాబు చెప్పాలి."

సత్తిరెడ్డి రఘునందనుణ్ణి చూసి తన కాలేజీ సహాధ్యాయి యని గుర్తించేడు. ఆతనితో మాట్లాడేడు కూడా. ఆ అవకాశాన్ని సత్తెమ్మ
వుపయోగించుకొంది.

సత్తిరెడ్డి తన తమ్ముడితో మాట్లాడిన విషయం రమణారెడ్డికీ తెలుసు. కాని, ఆ మాటనాతడు పైకి రానివ్వలేదు. ఆతనికి
కావలసింది సత్తిరెడ్డి ఎవరని కాదు. ఆ విషయంలో తన తమ్మునికంటె తనకే బాగా తెలుసు. కావలసిందల్లా
అతడెక్కడున్నాడనేది. దానికై అతడినడిగి ప్రయోజనం లేదు. అందుకే ఆ రోజున సత్తిరెడ్డి తన తమ్ముడితో కూడ మాట్లాడేడని
తెలిసినా రమణారెడ్డి పట్టించుకోలేదు. ఆ విషయం శివరామిరెడ్డికి తెలియదు. ఆశ్చర్యం ప్రకటించేడు.

అక్కడే వున్న రఘునందనుడు ఆ మాటను ఒప్పుకొన్నాడు.

"కాలేజీలో నా సహాధ్యాయి. నిన్న కనిపించడమే. మళ్ళీ ఈ మధ్య చూడలేదు."

తనకు దొరికిన అవకాశాన్ని సత్తెమ్మ చివరికంటా వినియోగించుకొంది. సత్తిరెడ్డి చదువుకొన్నవాడు. పెద్దయింటి వాళ్ళతో
పరిచయాలున్నవాడూను. ఆతడెవరనీ, ఎక్కడున్నాడనీ పాలేరుతనం చేసుకు బ్రతికేవాళ్ళని అడుగుతే వాళ్ళేం చెప్తారు?

పైకి చాల బలమయిన ప్రశ్నే. సబబుగానే కనిపిస్తూంది. కాని శివరామిరెడ్డికి నమ్మకం కలగలేదు.

"నీకు తెలియకపోవచ్చు. కాని, వెంకటయ్యకి?...."

ఆ ప్రశ్నకు సత్తెమ్మ వద్ద సమాధానం లేదు. రాజిరెడ్డి ఆమెకు సాయం వచ్చేడు. సత్తిరెడ్డి కోసం విచారణ జరుగుతూందని
ఆతనికింత వరకు తెలియదు. తెలిసే వుంటే ఇంతక్రితమే......

ఏమి చేసి వుండేవాడో మాట పూర్తిచేయకుండానే రాజిరెడ్డి కచేరీ సావడి వైపుగా చరచరా నడిచేడు.

ఆతడు వెళ్ళేసరికి ఆడవాళ్ళూ, ముసలివాళ్ళు అంతా గఢీ గుమ్మంలో చేరేరు. తమ వాళ్ళందర్నీ విడుదల చేయమంటున్నారు. గొల్లున
గోల పెడుతున్నారు. రమణారెడ్డి కోపంతో గంతులేస్తున్నాడు.

ఆతని విచారణ ఇప్పుడు సత్తిరెడ్డిని గురించీ కాదు. ఆతడెక్కడున్నాడనీ కాదు. యూనియన్‌లో చేరాలన్న వాళ్ళెవరు?
నిజాం సర్కారు కన్న యూనియన్‌లో ఏం వొరుగుతుందనీ? ....

అల్లాంటి ద్రోహం తలపెట్టిన వాళ్ళ చర్మం వొలిపించేస్తాడు. కాంగ్రెసు ఏమన్నా అడ్డుకుంటుందా? సంగం సాయం వస్తుందా?

అది జరిగే పని కాదు. సంస్థానాల వ్యవహారాలల్లో మేమేమీ కలగచేసుకోమని పటేల్ అన్నాడు. గవర్నర్ జనరల్
మౌంట్‌బా‌టెన్ హామీ వుంది. ఈ ముండలేం చేస్తారు?.....

నవాబు పాలనలో ఇంత తిండేనా తింటున్నారు. యూనియన్‌లో చేరితే ఇంక మనుష్యులు కూడా మిగలరు.....

నిముషానికో ఫక్కీ బుజ్జగింపు, బెదరింపు, రంకెలు, అనునయం, ఆశలు చూపడం, శిక్షాదండం ఝళిపించడం ... రమణారెడ్డి
ఏకపాత్రాభినయం నడుపుతున్నాడు.

అక్కడున్న జనంలో ఆ మాటల అర్ధం, రాజకీయ పరిణామాల రహస్యమూ తెలిసిందెందరికి? ఆతని మాటల్లో వాళ్ళకి తెలిసిందల్లా
శిక్షా భాగం మాత్రమే.

రమణారెడ్డి చీరుతాను, చంపుతాను అంటూంటే తమ బంధువుల విడుదల కోసం వచ్చిన జనం వడవడ వణికిపోయేరు. బాంచలమంటూ తమ
అల్పత్వం ప్రకటించి ఆ శిక్షాస్మృతి బారి పడకుండా తప్పించుకు పోవాలని మహా శ్రమ పడుతున్నారు.

ఆ దృశ్యం చూసే సరికి రాజిరెడ్డికి చాల వెగటు కలిగించింది. పెద్ద బావ మీద ఆతనికెప్పుడూ సదభిప్రాయం లేదు. రెండో వైపునా
అంతే. రమణారెడ్డి పెద్ద కుటుంబాల ఆధిక్యతా ప్రాముఖ్యతా రక్షింపబడాలనే ధోరణి గలవాడు. కాని దానిని కాపాడుకొనే శక్తి
లేని దుర్బలుడు. ఆ దౌర్బల్యమే ఆతని సంసారంలో చిచ్చు పెట్టింది. భార్యా భర్తల మధ్య మహాద్వేషాన్ని కల్పించింది. అయినా
దానిని గుర్తించగల నేర్పూ, ఓర్పూ కూడ ఆతనిలో లేదు. ఆతని దృష్టిలో చెల్లెలి మగడు ఓ అభాజనుడు. మనుష్యుల్లో ఎక్కువ
తక్కువలు లేవనీ, జాగీర్దారీ, జమీందారీ పద్దతులు సంఘాన్ని అగాధంలోకి ఈడుస్తున్నాయనీ చెప్పే పరమ కమ్యూనిష్టు. మర్యాద
నిలుపుకోవాలనే వాంఛ కూడా లేని శుద్ధ అవివేకి.

అనేక సమస్యల మీద బావా, బావమరుదులిద్దరూ అనేక మార్లు చర్చలు జరిపి ఇద్దరూ ఒకే నిర్ణయానికి వచ్చేరు. ఇంక
మాటలనవసరం అని ఒక్కమారే అనుకున్నారు.

అటువంటి మరిది ఈ సమయంలో రావడమూ, వచ్చినవాడు నోరు మూసుకు కూర్చోక సత్తిరెడ్డి సంగతి వాళ్ళకేం తెలుసు,
నన్నడగమనడముతో రమణారెడ్డి అగ్గిపుంత అయిపోయేడు. చిరాకు పడ్డాడు. అరక్షణంలో ఉభయులూ ఘంయ్‌మన్నారు.
ప్రజలు విస్తుబోయి చూస్తున్నారు.

రాజిరెడ్డి చిరాకు ప్రజల మీదికి తిరిగింది.

"ఇంత మంది వున్నారు. మీ వాళ్ళని లాక్కుపోలేరూ? మీకు అడ్డం ఎవరు రాగలరు?"

ఓ ముసిలివాడు రాజిరెడ్డి ప్రతిపాదనను ఖచ్చితంగా నిరాకరించేడు.

"బాంచలం అంత పనా?"

వాళ్ళ మెత్తదనం చూసే ఇంతింత దారుణప్పనులు చేయగలుగుతున్నారని రాజిరెడ్డి అభిప్రాయం. కాకపోతే వూళ్ళో వాళ్ళ మీద ఈ దాడి
ఎందుకు? రజాకార్లు వచ్చి ఓ ముసిలాణ్ణి చంపడం ఏమిటి? ఆ సత్తిరెడ్డి ఎవరు? ఈ ముత్తిరెడ్డి ఎక్కడికెళ్ళేడని
ప్రశ్నలేమిటి? ఎవరు చంపేరని ఏమన్నా అడిగేరా? ఒక్క రౌడీని అరెస్టు చేసేరా?.... జనం నోరు మూసుక్కూర్చుంటే ఇల్లా
దబాయిస్తారు.

బావమరిది మాటలు వింటున్న రమణారెడ్డి కోపం పట్టలేకపోయేడు. ఆతని మీద ఇంతకాలంగా పేరుకొని వున్న అసహ్యం కట్టలు
తెగింది. దానికి తోడు తన వుద్యోగంలో అలవడే చురుకుదనం ఒకటి. రెండూ కలిసేయి. ప్రక్కనున్న టేబిలు మీద పడి వున్న
హోల్డరునందుకొన్నాడు. అలవాటు పడ్డ చురుకుదనంతో అరక్షణంలో రివాల్వరు చేతికి వచ్చింది. మరుక్షణంలో రివాల్వరు రాజిరెడ్డి
వేపు తిరిగింది.

అంతవరకూ తాంబేలు నడకలా సాగుతున్న ఘటనలు విద్యుద్వేగాన్ని అందుకొన్నాయి.

రాజిరెడ్డి వెనకనే ఇంట్లో వాళ్ళంతా కచేరీ చావడి వేపు వచ్చేరు. ఎవరూ ఏమనడానికీ, ఏమి చెయ్యడానికీ కూడా వ్యవధి
లేకుండానే బావ, బావమరదుల మధ్య ఘర్షణ పెరిగిపోయింది. రమణారెడ్డి హోల్డరు నందుకొటుండగనే సుమిత్ర ప్రమాదాన్ని
పసికట్టింది. అన్నగారి స్వభావం ఎరిగి వుండడం చేత భర్తకు కలగనున్న అపాయాని గ్రహించడం కష్టమేం కాదు. మగణ్ణి
కాపాడుకోవాలంటే వెంటనే కదలాలి. ఒక్క అంగలో సావిడి మీదకొచ్చింది. క్రింద దొర్లుతున్న రూళ్ళ కర్ర తీసుకొంది. ఆమె
వుద్దేశాన్ని అన్నగారు గ్రహించేలోపున రివాల్వరు పట్టుకొన్న చేతి మీద ఒక్క దెబ్బ కొట్టింది.

రివాల్వరు ఎగిరి అంత దూరాన పడింది. పడిన అదురుకి పేలింది. పేలుడు చప్పుడు వినగానే గుమ్మంలోని జనాన్ని తోసుకుంటూ,
తొక్కుకుంటూ పోలీసులు పారిపోయేరు.

ఆ ధ్వని విని రాజిరెడ్డి వెనక్కి తిరిగేసరికి రమణారెడ్డి చెల్లెలి గొంతు నులుముతున్నాడు. ఒక్క క్షణం క్రితం తన తల
మీదుగా పోయిన మృత్యుచ్ఛాయలనాతడు ఎరగనే ఎరగడు. కాని తన భార్య యిప్పుడు మృత్యుచ్ఛాయలో వున్నదని గ్రహించేడు.

తడుముకోకుండా, ఎక్కడ తగిలేదీ ఆలోచించకుండా ఊతం తీసుకొని ఒక్క తన్ను తన్నేడు.

దూది మూట మీద తన్నినట్లు మెత్తని చప్పుడు. ఆ అదురుకి ఊపిరి పట్టిపోయి గతుక్కుమన్న ధ్వని. ఆయువుపట్టులో తగిలిన
తన్నుకి రమణారెడ్డి చెల్లెలు గొంతు వదిలి తన డొక్కలు పట్టుకొన్నాడు. మరుక్షణంలో నేలని దొర్లాడేడు.

* * * * *

సుమిత్ర వెనువెనుకనే వున్న సత్తెమ్మ సమయం కనిపెట్టింది. వంట చెరుకు నరకడానికై తెచ్చి గోడకు జేరవేసిన గొడ్డలి
చటుక్కున అందుకొంది. వెంకటయ్యను వుంచిన గది తాళం చెవులు ఎవరి వద్ద వున్నాయంటే చెప్పేవారెవరు? ఇచ్చేవారెవరు? చేతిలో
వున్న గొడ్డలితో ద్వారబంధం పేళ్ళు రెండూడగొట్టింది. పరిస్థితులన్నీ చూస్తూ ఏమీ చెయ్యలేక గదిలో కుంటుకుంటూ అలగం తొక్కుతున్న
వెంకటయ్య తలుపులు విడిపోగానే వొక్క వురుకులో బయటికి వొచ్చేడు. వస్తూనే ఉచ్చులనుంచి బయటపడ్డ పెద్ద పులిలా
బొబ్బరించేడు.

"ఇంకా చూస్తారేం?"

ఆతడు పెట్టిన కేకతో జనం నిస్తబ్దత వొదిలి బయటపడ్డారు. రాజిరెడ్డి వుపన్యాసం కదిలించలేకపోయినా ఒక్క కేకతో
తిరగబడి చూసింది. ఆ ఆడాళ్ళే, ఆ ముసిలాళ్ళే, ఆ బానిసలే. ఒక్క ఉదుటున లోనికి తోసుకొచ్చేరు. పెద్ద కోలాహలం మధ్య
కచేరీ సావడి గది తలుపులు విడిపోయాయి.

ఖైదీలంతా విడుదలయ్యేరు. పెద్దపులులు బయటపడ్డట్లే, వస్తూనే అటూ యిటూ చూసేరు. ఉదయం నుంచీ తమరిని యమకొట్టుడు
కొట్టించిన రమణారెడ్డి అక్కడ పడుండాలి. కనిపించలేదు. కనిపిస్తే కీళ్ళు విప్పేసి వుండేవారు. మంది అంతా హడావిడిలో వుండగా
రఘునందనరెడ్డినీ, అమీనునూ తోడు చేసుకొని శివరామిరెడ్డి పెద్ద కొడుకును ఇంట్లోకి పట్టించుకుపోయేడు. ఆ సంగతినెవ్వరూ
గమనించనేలేదు. లోనికున్న ద్వారం మూతబడింది.

జనం అటూ యిటూ చూసేరు. కసితీర్చుకొనేటందుకు మనిషి అక్కడ లేడు. ఇంక అక్కడున్న కుర్చీలూ, బల్లలూ, మంచాల మీద కసి
తీర్చుకొన్నారు. క్షణంలో అవన్నీ విరిగిపోయేయి. తర్వాత అంతవరకూ తమని బంధించిన గది తలుపులు బద్దలు కొట్టేసేరు. ఆ
గది వాళ్ళ అసమర్థతకి మూర్తిమంతం. బానిసత్వానికి చిహ్నం. వాళ్ళ లోకువతనానికి నిదర్శనం. తిరుగుబాటులో మొట్టమొదట
వాళ్ళు దానినే ధ్వంసం చేసేరు.

ఇంతలో ఇంటి మిద్దెనెక్కిన అమీను కచేరీ సావడిని ధ్వంసం చేస్తున్న జనాన్ని బెదిరించేటందుకు రైఫిల్‌తో కాల్పులు
ప్రారంభించేడు. అతడంతకన్న చేయగలది లేదు. ఆ యింట్లో కచేరీ సావడి వేరే ఆవరణలో వుంది. చుట్టూ వున్న ఎత్తయిన
ప్రహరీ గోడ ఇంటికీ దానికీ చూపులు కూడా లేకుండా చేసింది.

మొట్ట మొదటి తుపాకి చప్పుడుతో జనం వీధిలోకి వచ్చేసేరు. ఏ వైపు నుంచో నినాదం వినవచ్చింది.

"సంగం జిందాబాద్."

చెల్లా చెదురుగా నడుస్తూ పరుగెడుతూ గంతులేస్తున్న జనం నిలబడ్డారు. వెంకటయ్య ఎక్కడిదో ఎర్ర జెండా తీసేడు. కర్రకి
తగిలించి పైకెత్తి కుంటుకుంటూ అడుగు వేసేడు. ఏ గర్రలమీద కర్ర దెబ్బలు కదుములు కట్టి కమిలిపోయి వున్నాయి.

జనం ఆతని వెనక చేరి నినాదాలిస్తూ గ్రామం వైపు నడిచేరు.

వీధిలో వూరేగింపు నడుస్తూంటే ప్రతి ఇంటి ముందూ హారతులిస్తున్నారు. పువ్వులు చల్లుతున్నారు.

గాలిపాటున ఎర్రజెండా రెపరెపలాడుతూ జనాన్ని పిలుస్తూ, నడిచింది.

* * * * *

జనం అంతా చెదిరిపోయేక రాజిరెడ్డి భార్యను చేయిపట్టుకు లేవదీసేడు. ఒక్క పావుగంట కాలంలో నడిచిన ఆ ఘటనల వేగంతో ఆమె
కాలుచేతులాడకుండా అయిపోయింది.

"లే, పోదాం."

ఆమె వెనక్కి తిరిగి చూసింది. లోనికి వెళ్ళే తలుపు వేసి వుంది. ఇంక ఆ దారి బందయింది. కాలి వద్ద పడి వున్న రివాల్వరును
దూరంగా తొసేసింది. ఇద్దరూ గఢీ వదిలి బయటకు వచ్చేసేరు.

వారి వెనుక చాకలి మంగమ్మ వుంది. బట్టలు ఇవ్వడానికామె వచ్చింది. ఈ గంద్రగోళం అంతా చూస్తూ ఓ ప్రక్కన నిలబడింది.
బట్టలు అక్కడ వదిలిపోవడమో, మళ్ళీ తేవడమో తేల్చుకోలేక ఒక్క క్షణం తటపటాయించింది. చివరకు వదిలిపోవాలనే
తేల్చుకొంది.

ఎవరో ఎదురుగా వున్నట్లే, వప్ప చెప్పుకొంటున్నట్లే బట్టలు లెక్కపెట్టి అరుగుమీద పెట్టింది. అటూ యిటూ చూసింది. సుమిత్ర
తోసేసిన రివాల్వరు కనబడింది. మూటకట్టి తెచ్చిన గుడ్డలో దానిని పెట్టుకొని వీధిలోకి వచ్చేసింది.

దూరం నుంచి పిలుపు వినవస్తూంది.

"సంగం జిందాబాద్"

మంగమ్మ హడావిడిగా ఆ వైపు పరుగెత్తింది.

సమాప్తం.





*** End of this LibraryBlog Digital Book "Onamaalu" ***

Copyright 2023 LibraryBlog. All rights reserved.



Home