Home
  By Author [ A  B  C  D  E  F  G  H  I  J  K  L  M  N  O  P  Q  R  S  T  U  V  W  X  Y  Z |  Other Symbols ]
  By Title [ A  B  C  D  E  F  G  H  I  J  K  L  M  N  O  P  Q  R  S  T  U  V  W  X  Y  Z |  Other Symbols ]
  By Language
all Classics books content using ISYS

Download this book: [ ASCII | HTML | PDF ]

Look for this book on Amazon


We have new books nearly every day.
If you would like a news letter once a week or once a month
fill out this form and we will give you a summary of the books for that week or month by email.

Title: Kattula Vantena - Mahidhara Rama Mohana Rao
Author: Ramamohan Rao, Mahidhara, 1909-2000
Language: 
As this book started as an ASCII text book there are no pictures available.


*** Start of this LibraryBlog Digital Book "Kattula Vantena - Mahidhara Rama Mohana Rao" ***


కత్తుల వంతెన

రచన:

మహీధర రామమోహనరావు

విశాలాంధ్ర ప్రచురణాలయం,

విజయవాడ – 2.



ప్రచురణ : నెం 563

ద్వితీయ ముద్రణ

ఏప్రిల్ 1965

ముద్రణ:

సోమేశ్వర ప్రింటింగు ప్రెస్,

విజయవాడ – 2.



విశాలాంధ్ర ప్రచురణాలయం 1961లో నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన నవల.



అమ్మకు

నాన్నకు



'కత్తులవంతెన'



భూతకాలపు అలవాట్లూ, ఆచారాల నుంచి, భావికాలపు ఆదర్శాలనందుకొనేటందుకు మానవుని ప్రయత్నం అనవరతం సాగుతూనే వుంటుంది. ఈ
రెండు కాలాలనూ కలుపుతున్న వర్తమాన కాలాన్ని ఒక వంతెనతో పోల్చవచ్చు.

అయితే ఈ వంతెనపై మానవుని ప్రయాణంలో క్షణక్షణం ఎదురు దెబ్బలు తగులుతాయి. తల బొప్పి కడుతూంటుంది. అలవాటయిన
భూతకాలపు పరిధుల్లో నిలబడలేడు. కనిపించని భయాలతో అదురు పుట్టించే భవిష్యత్తు మీద ఆశ వదులుకోలేడు. ఆతని ప్రయాణం
ఆగదు. కాని, బంధనాలేవో, ఇంధనాలేవో భేదం చూడలేని సందిగ్ధస్థితి ఆతనినడుగడుగునా వేధిస్తుంది. ఆతడు అడుగు పెట్టిన
వంతెన మామూలు వంతెన కాదు.

కత్తులవంతెన!

కాని ఆ కత్తుల వాడీ, వంతెన నిడివీ ఆతని ఆ వేగోద్వేగాల్ని నిలవరించలేవు. మందంగానో, దురితంగానో అతని అడుగు ముందుకే.
మున్ముందుకే.

వారి వారి రచనల నుంచి గీతభాగాల నుపయోగించుకొంటూ, మిత్రులు శ్రీ శ్రీ, ఆరుద్ర, దాశరధి గార్లకు కైమోడ్పులు
సమర్పిస్తున్నా.

రచయిత.

విజయవాడ,

15-8-1961.



....కట్టిరి
కాలానికి కత్తులవంతెన.

- అజ్ఞానపుటంధయుగంలో
ఆకలిలో ఆవేశంలో
తెలియని ఏ తీవ్రశక్తులో
నడిపిస్తే నడిచి మనుష్యులు –

- అంతా తమ ప్రయోజకత్వం
తామే భువి కధినాధులమని,
స్థాపించిన సామ్రాజ్యాలూ,
నిర్మించిన కృత్రిమ చట్టాల్ –

- ఇతరేతర శక్తులు లేస్తే
పడిపోయెను పేకమేడలై!

….

- చిరకాలం జరిగిన మోసం,
బలవంతుల దౌర్జన్యాలూ,
ధనవంతుల పన్నాగాలూ
ఇంకానా! ఇకపై చెల్లవు.

- ఒక వ్యక్తిని మరొక వ్యక్తీ,
ఒక జాతిని వేరొక జాతీ
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా! ఇకపై సాగదు.

శ్రీ శ్రీ



ఒకటో ప్రకరణం


"ఎన్ని చెప్పినా వినిపించుకోవు చూడు, మీ ఇంజనీయరుగారి యోగ్యత."

ఉద్రేకంతో సుజాత కంఠం పట్టేసింది. ఆ ఆవేశానికి వంతపలుకుతున్నట్లు కట్టుకొన్న తడిబట్ట బుసబుసలాడింది.

నిలువు నీళ్ళతో విసవిసా వచ్చి ఎదుట నిలబడిన సుజాత సవ్వడికీ, ఆమె కుపిత స్వరానికీ వులికిపడి కల్యాణి తల
ఎత్తింది. తడిసి, వంటినంటియున్న వలిపంలో ఆమె మొగ్గ విడుతున్న పువ్వులా వుంది. ఆరోగ్యం చిందుతున్న స్త్రీత్వం వొంపులు
తీరలేదు ఇంకా.

ఆమె పెదవులు కోపంతో వణుకుతున్నాయి. అభిమానరేకలు కళ్ళల్లో నీలిగా మసలుతున్నాయి.

"బట్టలన్నా మార్చుకోకుండా వచ్చేశావేం?"

సుజాత 'గంయ్' మంది.

"అదిగో మాట మరిపిస్తున్నావు. నువ్విస్తున్న అలుసుదనమే."

కల్యాణి చిరునవ్వు నవ్వింది.

ప్రక్కవాటాలో కాపురం వున్న ఇంజనీరు యువకుడు వట్టి జడభరతుడని ఆమె అవహేళన చేస్తుంది. తామెవ్వరూ లేవకపూర్వమే అతడు
పని మీదకు వెళ్ళిపోతాడు. అంతా నిద్రలు పోయాక ఎప్పుడో అపరాత్రి వేళ తిరిగి వస్తాడు. డ్యూటీ లేని రోజుల్లో తప్ప ఆయన
కనిపించడు. మనిషి నెమ్మదైనవాడు. ఫలితంగా సుజాత ఆయనకు 'జడభరతుడ'ని పేరు ప్రసాదించింది. ఆ జడభరతుడు ఈవేళ తాను
నూతి వద్ద నీళ్ళు పోసుకుంటుండగా చూసేడని కోపం చేస్తూంటే కల్యాణి చిరునవ్వు నవ్వింది.

రాత్రి పదిగంటలయింది. ఆయన ఇప్పుడే వచ్చాడు. ఆ మనిషికి సుజాత ఏం చేస్తూందో తెలుసుననడానికి అవకాశం లేదు. పైగా
రాజగోపాలం అంటే కల్యాణికి ఒక సదభిప్రాయం వుంది. మిగిలిన రెండు వాటాల్లోనూ ఆడవాళ్ళే గాని, మగవాళ్ళు లేరు. వున్నవాళ్ళు
కూడ ఒక్క రామలక్ష్మమ్మ తప్ప వయసులో వున్నారు. దానినాతడవకాశం చేసుకొని అతిపరిచయం పెంచుకోడానికి ప్రయత్నించలేదు.
కొంతమందిలాగ తన వాటాలో నలుగురినీ చేర్చి అల్లరి చేయడం లేదు. ఆ భయంతోనే తాను మొదట అతనిని మూడోవాటాలో చేర్చుకోడానికి
ఒప్పుకోలేదు. తన స్నేహితులొకరి మాట తోసెయ్యలేక సాహసించింది. రాజగోపాలం తానుంచిన విశ్వాసాన్ని కాపాడుకొంటున్నాడు. ఇప్పుడు
సుజాత అతడు మగపోడిమలు మొదలెట్టాడంటూంది. తనకు నమ్మకం లేదు. కాని, ఆ మాట పైకి అనలేదు.

"బట్టతోనే పోసుకుంటున్నావు కదా!"

తన అభిమానాన్ని చులకన చేస్తున్నట్లు తీసుకొని సుజాత చర్రుమంది.

"ఒంటినంటుకున్న తడిబట్టలతో వీధులనిండా మగవాళ్ళున్నా ఏ చెరువునుంచో నీళ్ళు తెచ్చుకోవడం మీ బ్రాహ్మలకి అలవాటు."

తమ అగ్రహారం జీవితపు అలవాట్లను గురించి ఈ మాదిరి అవహేళనలు వీరేశలింగంగారి కాలం నుంచీ వినబడుతూనే వున్నాయి. తమ వూరు
అంతకూ మంచినీళ్ళకు ఆధారం తూర్పు దిక్కునున్న పెద్దచెరువు. మొన్నటి వరకూ వాడకం నీళ్లక్కూడా దొడ్లో నూతులుండేవి కావు.
స్నానం చేసి రెండు బిందెల నీళ్ళు తెచ్చుకొని వంటలకుపక్రమించేవారు. ఆచారం, ధనహీనత మూలంగా నీళ్ళకు మనుష్యుల్ని
పెట్టుకోలేరు. ఫలితంగా ఎందరెన్ని వెక్కిరించినా, మంచినీళ్ళ సరఫరాకు తగిన సౌకర్యాలు ఏర్పడితే తప్ప అక్కడ ఈ అలవాటు
పోవడం లేదు.

ఈ అలవాటును గురించి తప్పు పట్టుకొంటేనూ, అవహేళన చేశారని కోపం తెచ్చుకొంటేనూ లాభం లేదు.

కల్యాణి ఇంత వరకూ సుజాత అభిమానాన్ని పెద్దగా లెక్క చేయలేదు. సుజాత మాట దురుసుతనం వున్నా ఇంతవరకు కులం పేరు పెట్టి
మాటలని వుండలేదు. తమ భిన్న కులాల్ని పేర్కోనూలేదు. ఆ మాటతో కల్యాణి సర్దుకు కూర్చుంది.

"ఏం జరిగిందేం....?"

ప్రశ్నించిందే గాని, ఆ సమయంలో ఆమె ముఖ భంగిమ చూస్తే నవ్వు వచ్చింది.

"ఎందుకల్లా పుప్పిపన్ను సలుపుతుంటే పెట్టినట్లు మొహం అల్లా పెడతావు?" ....

సుజాత మరీ మండిపడింది.

"నీకు నవ్వులాటగా వుండదూ? నీళ్ళు పోసుకొనేటప్పుడు మగాళ్ళు చాటు నుంచి...."

కల్యాణి పక్కున నవ్వింది.

"జన్మ తరిస్తుంది పోదూ?"

సుజాత మహా కోపంతో దులపరించుకొంది. "సిగ్గూ-ఎగ్గూ లేకపోతే సరి."

ఆమె ఆవేశంతో కాలు నేల తాటించి గిరుక్కున తిరిగింది. ఊసలా దూసుకుపోయింది.

కల్యాణి చదువుతున్న పుస్తకం మూసి లేచింది.

* * * *

సుజాత నుంచి జరిగిందంతా విన్నాక తప్పు ఆమెదేననిపించింది కల్యాణికి.

పచ్చపువ్వులా వుంది వెన్నెల. ఆ వెల్తురు కంటికి చల్లగా వున్నా వేసవి కాలపు బెజవాడ వేడికి ఒళ్ళంతా ఆవిర్లు వస్తూంది.
సుజాత పడుకునే ముందు నీళ్ళు పోసుకోవాలనుకొంది.

ఇంటి చుట్టూ ఎత్తయిన గోడ. దొడ్డి నిండా నారింజలూ, బత్తాయిలూ అరటి బోదెల మధ్య నూయి. వెన్నెల నీడల్లో గచ్చు వేసిన
నూతి పళ్ళెం మిలమిలలాడుతూ ఆహ్వానించింది.

అయితే ఆమె ఒక్క విషయం మరిచింది. మగవాళ్ళెవరూ లేని తమ రెండు వాటాల వాళ్ళకే గాక, ఆడవాళ్ళెవరూ లేని మూడో వాటా
మనిషికి కూడా ఆ పెరట్లోకి వచ్చే అధికారమూ వుంది. అవకాశమూ వుంది. ఆ యింట్లోకి వచ్చిన ఏడెనిమిది మాసాల్లోపూ అతడా
పెరటి చాయలకే అడుగు పెట్టలేదంటే అది వేరు మాట. అవసరం లేకపోయింది. ఈ వేళనే వచ్చాడు.

నగ్నంగా తాను నీళ్ళు పోసుకొంటున్నట్లు తెలిసే అటు వచ్చాడంటుంది సుజాత.

"ఈ మగాళ్ళందరికీ ఇదో తెగులు."

కల్యాణికి ఆమె ధోరణి సమ్మతం గాలేదు.

"మన అందం మీద మనకి మమకారం వుండడంలో తప్పేం లేదు. ఆ మమకారాన్ని సిగ్గూ-అభిమానమూ రూపంలో కాపాడుకొంటూనే వున్నాం. కాని
సుజాతా! ఎదుటి వాళ్ళ యోగ్యత మీద కూడా కనీసవిశ్వాసం వుంచాలి."

సుజాత నిష్ఠురం ఆడింది.

"అంతే నువ్వలా అనవూ? రాధక్కా!"

ఆ మాటకేమనాలో కల్యాణికి తోచలేదు. సుజాతదంతా వేప నాగలి పన్ను. ఆమెకెప్పుడేం గుబులు పుడుతుందో ఎవరికీ అర్థం కాదు.
డబ్బుంది. తల్లీదండ్రీ గారాం చేశారు. ఫలితంగా చిలిపితనం-చిన్నతనం వయస్సు వస్తున్నా మారలేదు. ఈ వేళ నెత్తిన
పెట్టుకొన్న మనిషిని రేపు ద్వేషించదనే నమ్మకం లేదు. రాజగోపాలంతో వ్యవహారం అంతే జరిగింది. ఓ నెలరోజులు పాఠాలంది,
కబుర్లంది. చుట్టూ తిరిగింది. అప్పుడాయనలో కనిపించని మగతనం హఠాత్తుగా ఓ రోజున ప్రత్యక్షమయింది. ఆడవాళ్ళే వున్న
యింట్లో మగాడిని అద్దెకు చేర్చడమేమిటంది.

ఒక దశలో లేనిపోని ఇబ్బందులు కలిగించి ఆతడే లేచిపోయేటట్లు చేయాలని చూస్తూందా అనిపించింది. కాక చిన్నతనపు అల్లరి చేష్టే
కావచ్చు. ఏదయినా ఫలితం అంతే.

రాజగోపాలం డ్యూటీ మార్పుల్లో ఒక్కొక్కప్పుడు రాత్రి పన్నెండు ఒంటిగంటకు గాని రాడు. అంత రాత్రి వేళ తమరిని పిలువడానికి
సంకోచిస్తాడని వరండాకున్న కటకటాల తలుపు తెరచి వుంచేది. వానిని సుజాత అతి శ్రద్ధగా మూస్తూందనే సంగతి ఒకటి రెండు
రోజులకు గాని ఆమెకు తెలియలేదు. ఇదేమిటంటే, "ఏ అర్ధరాత్రో ఆయన వస్తాడని తెరిస్తే దొంగలు దూరరా?" అంది.

మరల అటువంటి పరిస్థితి ఏర్పడకుండా కల్యాణి జాగ్రత్తపడింది. అతడు వచ్చి బటను నొక్కితే ఆమె గదిలో గంట మోగుతుంది.
వెంటనే లేస్తుంది. తలుపు తీసి పలకరిస్తుంది.

"మీరీ వేళ పెంద్రాళే వచ్చినట్లున్నారే."

"భోజనం అయిందా?"

"చేతిలో ఆ పత్రికలేమిటి?"

ఇల్లాగే ఏవేవో ప్రశ్నలు వేస్తూండేది. ఆతడు 'ఊ' అన్నాడో, 'ఉహూ' అన్నాడో ఆమె వినిపించుకొనేది కాదు. అతడేదో
అనేవాడు. ఆమె చిరునవ్వు నవ్వేది.

క్రమంగా ఆ ఇద్దరూ అటువంటి అర్థంలేని సంభాషణలకు ఎదురు చూడడం అలవాటయింది. ఏడెనిమిది గంటలకే వచ్చిన రోజున కూడా,
తలుపు తియ్యవలసిన అవసరం లేని సందర్భంలో కూడా ఆయన సైకిలు చప్పుడు వినబడేసరికి కల్యాణి గుమ్మంలోకి వస్తూంది.
ఒక్కొక్కప్పుడాతనిని తన హాలులోకి ఆహ్వానించి చర్చలూ, కబుర్లూ వేస్తూంది.

పక్క వాటాదారుతో ఆమె ఆ విధంగా చనువుగా వుండడం సుజాతకు నచ్చలేదు.

కల్యాణి చూపుతున్న ఈ ప్రత్యేక శ్రద్ధను సుజాత యెన్నోసార్లు వేళాకోళం చేసింది. చిన్నప్పుడు నేర్చుకొన్న డాన్సులకు
పర్యవసానంగా మనస్సులో ఏర్పడ్డ కృష్ణ ప్రేమా, కాలేజీలో తెలుగు లెక్చరరు దేశంలో వ్యాపిస్తున్న భగవద్విరోధాన్ని
ప్రతిఘటించేటందుకు తీసుకొన్న శ్రద్ధా ఫలితంగా ఆమెలో ఏర్పడ్డ కృష్ణ భక్తీ ఈ వేళాకోళాలకు కావలసినంత పుష్టినిస్తూ
వచ్చాయి.

కల్యాణి మీద కోపం వచ్చినపుడూ, ఆప్యాయత పెరిగినప్పుడూ ఆమెను 'రాధక్కా' అని పిలిచేస్తూంది. అది అమాయకత్వమో,
చిన్నతనమో, అభంధ్రాతనమో – అతి గడుస్తనమో అర్థం కాదు.

అల్లాంటి సందర్భాలలో కల్యాణి ఒక్క మందహాసంతోనే ఆమె నోరు కుట్టేస్తూంది. కాని, ఈమారు చిరాకు కలిగింది. చివాలున లేచి
నిలబడింది.

"పొరపాటు జరిగింది దిద్దుకొందాం."

"నీకెందుకులే అంత కష్టం."

అప్పటికే గుమ్మం వరకూ వెళ్లిన కల్యాణి నిలబడింది.

"శ్రీ కృష్ణపరమాత్మ పుట్టిన పవిత్ర భారత భూమిలో ఇల్లాంటి అపభ్రంశపు పనులు జరగడం ఘోరం...."

"మనం చేసే అవకతవకలు...."

కల్యాణి నిలబడకుండా వెళ్లిపోతూనే సమాధానం ఇచ్చింది.

"ఆదర్శ పురుషుల్ని పట్టే...."

అప్పటికే ఆమె వీధి తలుపులు తీసిన చప్పుడు వినిపించింది.

* * * *

మెట్ల మీద నుంచి చూస్తే డాబా మీద ఎవరూ వున్నట్లు లేదు. కల్యాణి గబగబా పైకి వచ్చింది. పైన అడుగు పెట్టగానే వెనక
నుంచి పలకరింపు వినబడి వులికిపడింది.

"సావట్లో దీపం లేకుంటే నిద్రపోయారనుకొన్నా."

కల్యాణి ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.

"మీరిక్కడున్నారా?"

గూడకట్టు పంచా, భుజాన తుండూ, ప్రక్కన పిట్టగోడ మీద సబ్బుపెట్టె – ఆతడు స్నాన ప్రయత్నంలో వున్నాడని చెప్తున్నాయి.

"స్నానానికి సన్నాహంలో వుండి ఇక్కడ నిలబడ్డారేం? పొద్దు పోలా?"

"ఉదయం వెళ్లేటప్పుడు కుళాయి క్రింద కడవ పెట్టడం మరిచా"

తన అజాగ్రత్తకు క్షమాపణ చెప్పుకుంటున్నట్లు వినిపించాయి ఆ మాటలు.

"మా పనిమనిషితో చెప్తా వుండండి, మాకు పట్టేటప్పుడే నీళ్ళు మీకూ పట్టి పెడుతూంటుంది."

"మళ్ళీ అదో శ్రమా."

"శ్రమకేముంది, పనిమనిషి చేసేదానికి నా శ్రమేముంది....ఇంత రాత్రయినా ఈవేళ వేడిగాలి తగ్గలేదు...."

ఆమె అడగని ప్రశ్నకు రాజగోపాలం సమాధానం ఇచ్చాడు.

"నూటపదిహేను డిగ్రీలుంది వేడి ఈవేళ"

"అందుకే అంత తాపం ఎత్తిపోతూంది. పోయి స్నానం చేయండి ఆలస్యమయింది."

"నూతి వద్ద ఎవరో వున్నట్లనిపించింది. వచ్చి ఇక్కడ కూర్చున్నా"

ఆతడు బుద్ధిపూర్వకంగా అటు వెళ్ళలేదు. అంతవరకు స్పష్టమయింది. అయితే స్నానం చేస్తున్నవారిని చూశాడా? సుజాత బహుశా తన
తెలివితక్కువతనానికి ఏడుస్తూందేమో.

"పట్నంలో పదేళ్ళనుంచి వుంటున్నా మా పల్లెటూరి అగ్రహారపు అలవాట్లు పోలేదు. మా వూరెడితే చెరువుకెళ్ళి పీకలబంటిగా నీళ్ళలో
దిగితే తప్ప ఏదో లోపం అనిపిస్తూనే వుంటుంది. అభావంలో నుయ్యి. చేద క్రింద పెట్టాలనిపించదు. ఎవరికన్నా ఇబ్బంది
కలిగిస్తానేమోనని గాని నూతెడు నీళ్ళూ అవగొట్టాలనిపిస్తూంటుంది."

"అబ్బెబ్బే! ఇబ్బందేముంటుంది?"

ఆ మాట అనేశాక గాని ఆమె చెప్పిందంతా ఒక సామాన్యాంశం మాత్రమేనని తోచలేదు, చటుక్కున మాట మార్చేడు.

అతనికి తల నుంచి పెద్ద భారం దింపినట్లయింది. అయితేనేం ఒక పడుచు నీళ్ళు పోసుకొంటుండగా తానక్కడికి వెళ్ళేడు. తప్పెవరిది,
ఎటువంటిది – అని ఆలోచించకుండా ఇల్లాంటి సందర్భాలలో పల్లెటూళ్ళలో పెద్ద పెద్ద రభసలు జరగడం అతడెరుగు. ఇందాకటి నుంచీ
అతని మనస్సులో అదే బెరుకుతూంది. నిజంగానే రభస ప్రారంభమయిందని అతడెరగకపోయినా ఇప్పుడు మాత్రం ఆ భయం లేదు.

కల్యాణిని అతడు మనస్సులోనే అభినందించాడు. నూతి వద్ద వున్న మనిషి కల్యాణి. మూడో వాటా అమ్మాయి అయితే! సుజాత ఈమధ్య
తన మీద ఏదో కసి పూనినట్లు వ్యవహరిస్తూందని అతనికెందుకో అనిపిస్తూంటుంది. ఆమె కాకపోవడం సంతోషకరం. కల్యాణి తన
తప్పును కప్పి పుచ్చుకునేటందుకు ఇతరుల్ని అల్లరి పెట్టదు. అదీ అతని ఆలోచనే. దానికీ కారణం లేదు. అతనికి
అనిపించింది, అంతే.

భయం తీరాక ఆతనిలో ఒక ఉత్కంఠ కలిగింది. నూతి వద్ద తాను చూసిన ఆమె నగ్నంగా వున్నట్లనిపించింది. ఆ దశలోనే స్నానం
చేస్తూండి వున్నట్లయితే ఇంత నిస్సంకోచంగా కల్యాణి మాట్లాడుతుందా? అందుచేత తన భావన పొరపాటేననిపించింది.

"పోయి స్నానం చేసి వస్తా."

ఆమె ప్రక్కకు తప్పుకొని దారి ఇచ్చింది. సన్నని చందన పరిమళ పరివేష్టనం ఆమె చుట్టూ ఒక అదృశ్య వలయాన్ని
కల్పించింది. ఆ వలయంలోంచి మెట్ల వేపు అడుగుపెడుతూ వెనక తిరిగేడు.

"తెలియకుండానే అయితేనేం అటువేపు వచ్చినందుకు చాల విచారంగా వుంది."

"ఇల్లా ఎంత కాలం ఇబ్బంది పడతారు? సాయం రాగలవారెవ్వరూ లేరూ యింట్లో?"

ఆమె వాక్యాన్ని రాజగోపాలం మరోలాగ అర్థం చేసుకున్నాడు. ఒక్క నిముషం ఆలోచించేడు.

"మిమ్మల్ని ఎంతో కాలం ఇబ్బంది పెట్టను"

కల్యాణి అతని ముఖం వేపు చూసింది.

"త్వరలోనే శుభలేఖలు...."

రాజగోపాలం సిగ్గు ప్రకటించాడు.

"అబ్బెబ్బే!"

ఒక్క క్షణంలో సర్దుకున్నాడు.

"గది మారుస్తా."

ఆతడు వుండడం తమకు బాధాకరంగా లేదని చెప్పడానికి కల్యాణి చాల ఆదుర్దా చూపింది.

"మాకేదో కష్టం కలిగిస్తున్నామనుకొని ఇల్లు మార్చనక్కర్లేదు. మీకు కష్టంగా వుంటే అది వేరు మాట."

"నేనే మీకు ఇబ్బంది కలిగిస్తూంది...."

"అదేం లేదు. ప్రొద్దుట ఎప్పుడో ఏడుగంటలకెడతారు. రాత్రి పదన్నా అవుతూంది వచ్చేసరికి. మేము బాధపడిపోతున్నామని మీరు
ఇంటికి రావడం మానుకొంటున్నారేమిటి?"

"బాగుందండోయ్"

"అయితే మరో విధమైన ఇబ్బంది లేకపోదు సుమండీ."

రాజగోపాలం అదేమిటోనని కంగారు పడ్డాడు. కల్యాణి చిరునవ్వు నవ్వింది.

"మాటక్కూడా పొరుగున మనిషి తోడు వుండడం లేదని తప్ప...."

రాజగోపాలం అమ్మయ్య అనుకొన్నాడు.

"అది మాత్రం తక్కువ ఇబ్బందా?"

"మీరల్లా అనుకోవద్దు. మీరు వెడితే వచ్చేవాళ్ళెలాంటి వాళ్ళవుతారో. దుంగరాజుని వద్దని కొంగరాజుని తెచ్చుకొన్న కప్పల
బ్రతుకవుతుంది. మాకేం బాధ లేదు. ఇల్లు మార్చుకోకండి."

దుంగరాజు పోలిక తెచ్చినందుకు కల్యాణి వేలు కొరుక్కుంది. రాజగోపాలం నవ్వుకొన్నాడు.

* * * *

కల్యాణి తిరిగి వచ్చేసరికి సుజాత పడకకుర్చీలో పడుకొని వుంది. పైన తిరుగుతున్న పంకా గాలికి ముంగురులు ముఖాన
కదులుతున్నాయి. మూసిన కనుగొలుకుల్లో ఒక్కొక్క ముత్యం దీపపు వెలుతురులో మిల మిలలాడుతూంది.

ఆ కన్నీరు చూసి కల్యాణి జాలి పడింది. తన అనాలోచితపు పనికీ, అనాగరికమైన అలవాటుకీ దుఃఖిస్తూందని గ్రహించింది.
కనురెప్పల కదలికలలో ఆమె మేలుకొనే వున్నదనీ, తన రాకను గమనించిందనీ అర్థమయింది.

కాని ఏమీ అనలేదు.

కల్యాణి మనసులో కొంటెతనం పొటమరించింది.

"అడిగేశా. భయమా ఏమిటి? ఎందుకీ తుంటరి పని చేశావు-అనేశాను."

సుజాత ఏమీ అనలేదు. ఒకమారు కళ్ళు తెరచి చూసి, మళ్ళీ మూసుకుంది.

"మన దేశంలో పడుచు వాళ్ళంతా ఇల్లా తయారవుతున్నారు. ఆశ్చర్యం ఏం వుంది? చుట్టుప్రక్కల మగాళ్ళెవరూ లేకుండా చూసి చీరలు
పట్టుకు చెట్టెక్కెయ్యడం ఒక్కటేనా? చేయి చాటు పెట్టుకొంటే ఆ కాస్తా మాత్రం అడ్డం ఎందుకని యుద్దఖైదీల్ని నడిపించినట్లు
చేతులెత్తించిన శ్రీకృష్ణుడు మనకు భగవానుడు. ఆ వంశీమోహనుడు మనకాదర్శం. ఇంక పడుచువాళ్ళల్లో ఉన్నత భావాలు
కలగాలంటేనూ, కలిగించాలంటేనూ మన తరమా? మన దురదృష్టం, ఈ పుచ్చు వంకాయల్లోంచే తక్కువ పుచ్చులు ఏరుకోవడం తప్ప
వేరుగతి లేదు."

కల్యాణి తనను ఎగతాళి చేస్తూందని గ్రహించి సుజాత కళ్ళు విప్పింది.

"మనిషిలోని బలహీనతల్ని కన్న ఉదాత్తతలను ఆదర్శంగా తీసుకో...."

కల్యాణి ఆ మాట పూర్తిగాకుండానే నవ్వేసింది.

"రాధ మహత్వం గీతాబోధ విన్నదాని ఫలితం కాదు మరి. ఆమెకు మహత్వం కల్పించిన గుణాన్ని కృష్ణుడి బలహీనతగా జమకడితే
ఎట్టాగే చిట్టితల్లీ!"

సుజాత నోరు తెరిచింది, కల్యాణి మళ్ళీ బుకాయించింది.

"కనీసం మన ఆడంగితనాన్ని కాపాడుకోకపోతే ఎల్లాగ? ఇల్లు ఖాళీ చేసి పొమ్మన్నా."

"నీకంత కష్టం వద్దు."

"మళ్ళీ ఇప్పుడీ మాటేమిటి?"

సుజాత ఒక్క నిముషం వూరుకొంది.

"రేపో, ఎల్లుండో నాన్నగారొస్తారు. అటు తర్వాత నేనే మారుతా."

కల్యాణికి ఆమె పెంకితనం చూశాక కోపం వచ్చింది.

"నీవేం సిగ్గు పడక్కర్లేదు. నూతి దగ్గర స్నానం చేస్తున్నది నేనని చెప్పా, ఆ సిగ్గేదో నన్నే చుట్టుకొంటుంది."

కల్యాణి వెనుతిరిగి చూడకుండా గది వదలి పోయింది.



రెండో ప్రకరణం


సుజాత అన్నట్లు ఒకటి రెండు రోజుల్లో కాకపోయినా వారం తిరగకుండానే శేఖరం వచ్చేడు. వచ్చేటప్పుడు పెద్ద బుట్టనిండా
మామిడిపళ్ళూ, బస్తాలో మామిడికాయలూ, కొబ్బరికాయలూ, బియ్యం, పప్పులు, వూరగాయలు ఒక రిక్షా సామాను వేసుకు వచ్చాడు.

గుమ్మంలో అడుగు పెడుతూనే శేఖరం కూతుర్ని కుశల ప్రశ్న వేశాడు.

"ఏమిటమ్మా! అంత త్వరగా రమ్మని వ్రాశావు. ఒంట్లో బాగుందా?"

ఎదురుగా కల్యాణి వుండడమూ, వస్తూనే ఆ ప్రశ్న అడగడముతో సుజాత ఉక్కిరిబిక్కిరి అయింది. తన తండ్రి వెంట రాజగోపాలం
కూడా వుండడంతో అబద్ధమే ఆడక తప్పింది కాదు.

"మామిడిపళ్ళ రోజులయిపోతున్నా మీకు మా సంగతే జ్ఞాపకం రాలేదు."

"సుజాత మీకోసం బెంగెట్టుకొంది. పాపం! బుచ్చిపాప!"

కల్యాణి పరాచికమాడింది. కాని, సాధారణమైన ఆ పరాచికంలో సుజాతకు ఎత్తిపొడిపే వినబడింది.

రాజగోపాలం సెలవు పుచ్చుకొని తన వాటాలోకి వెళ్ళిపోయాడు. శేఖరం అతని గుణగానం చేశాడు.

"చాల మంచి కుర్రవాడు. ఎగ్జిక్యూటివు ఇంజనీరు ఆఫీసులో పనుండి వచ్చా. వెళ్ళేసరికి కనిపించేడు. ఎక్కడో చూసినట్టనిపించింది.
వెళ్ళి అయ్యా నాకు ఫలానా పని కావాలన్నా. దగ్గరుండి ఆ పని పూర్తి చేయించినాడు. ఈ కుర్రవాడే దొరికి వుండకుంటే వారం రోజులు
ఆఫీసు చుట్టూ తిరిగినా పని జరిగేదే కాదు."

తన తండ్రి పొగుడుతూంటే సుజాత మొగం చిట్లించింది. దానిని గమనించి కల్యాణి చిరునవ్వు నవ్వింది.

''ఏ ఆఫీసులోనూ పనులేమిటో.. తెగ పెరిగి పోతున్నాయి. దానితో సమానాంతరంగా పనిచేసేవాళ్లల్లో బద్ధకం బలిసిపోతుంది.''

''యూనియన్లంటారు. సమ్మెలంటారు. జీతాలు ఎక్కువ కావాలంటారు. కానీ లంచాలు పుచ్చుకోకూడదనీ, పని జరిపించడంలో శ్రద్ధ
చూపాలనీ చెప్పేవాళ్లు ఒక్కరూ కనిపించరు'' అన్నాడు శేఖరం.

''ప్రతి చిన్న పనికీ త్వరగా కావాలని నాన్నగారే లంచాలు పెడతారు. ఇంజినీర్లకు ఈ వేళ మామిడిపళ్ల గంపలు తెచ్చారా లేదా
నాన్నారూ!''

శేఖరం కూతురు మాటలకు సిగ్గుపడలేదు. నొచ్చుకోలేదు. సన్నగా నవ్వాడు.

''డబ్బు ఇవ్వడానికీ ఖర్చు పెట్టడానికీ బాధ ఏముంటుందమ్మా! డబ్బు ఇచ్చినా పనులు జరగడం లేదని కాని...''

పనివాళ్లలో పని ఎగ కొట్టే స్వభావం పెరుగుతూండడం, సంఘ శక్తిని దుర్వినియోగం చేస్తూండడం మీద వాక్యోపవాక్యంగా చర్చ
నడిచింది.

''రైలు పెట్టెలుంటున్నాయి. పాకీ దొడ్లకన్నా కనాకష్టంగా వదిలేస్తున్నారు. ప్లాట్‌ఫారంమీద చీపురు కట్టలతో మనుషులు
కూర్చొని ఉంటారు. బాగు చేయండర్రా అంటే.. తాము డ్యూటీలో లేమంటారు. క్రిందటి మాటొచ్చినప్పుడు చూడలేకా, చెప్పలేకా,
కంప్లెయింట్సు బుక్కులో రాశాను. ఇంక చూడు. వాళ్ల యూనియను‌ వాళ్లట. వచ్చి పడ్డారు''

రాజగోపాలం తన అనుభవాన్ని జత కలిపి ఆ మాటను ఆమోదించాడు.

''మా వర్కుషాపులోనూ అదే స్థితి.''

''మొన్న స్టేట్‌ బస్‌ డ్రైవర్‌ ఒళ్లెరుగని సివాలాడిపోయేడు. బస్టాండు దగ్గర్లో
ఫుట్‌పాత్‌ మీద ఒక కుటుంబం సామాన్లు పెట్టుకుని కూర్చుంది. మగవాడు రిక్షాకోసం వేళ్లాడు. ఇంతలో ఓ బస్సు
బుర్రున వచ్చింది. ఆవిడ పిల్లని లాగేసి వెనక్కి పారిపోయింది. బస్సు ఫుట్‌పాత్‌ ఎక్కి సామాన్లను
దున్నేసింది. పెద్దగండం తప్పింది. ఆ బెదురుతో ఆవిడ బస్సువాడిని చెడామడా తిట్టింది. కండక్టరు ''మీదనుంచి పోలేదని
సంతోషించక తిడతావా?'' అంటూ ఆమె మీదకు లేచాడు. చుట్టూ ఉన్న వాళ్లం కలుగచేసుకున్నాం. రిపోర్టు చేశాం. ఆ క్షణం నుంచి
యూనియన్‌ వాళ్లు నా వెంట పడ్డారు. విన్నారుగా... నిన్న వాళ్ల ధోరణి, బండిని మీదకు తోలడం, ఈ మారు మీదనుంచే
తోలుతామని ఆమెను కొట్టబోవడం అన్నీ వెనక్కి పెట్టి ''తిట్టడమేమ''ని వాళ్ల వాదం.

కల్యాణి ఎంతో ఆవేశంతో చెప్పుకొంటూ పోయింది. సుజాత అన్నీ విని చిన్న వ్యాఖ్యానం చేసింది.

''ఊళ్లో పనులన్నీ నెత్తినేసుకోవడం, జైళ్లకెళ్లడం, ఆస్తులు నాశనం చేసుకుని పెళ్లాం పిల్లల్ని ఏడిపించడం ఒక గొప్ప
ఆదర్శమని వీరంతా నేర్పిందేగా? చదువులు పాడుచేసుకొనీ, ఉద్యోగాలు వదులుకొనీ ఏదో పెద్ద త్యాగం - మహాకార్యం చేసేసినట్లు
చెప్పుకొంటూ కూలాళ్ల కూలి డబ్బుల్లో వాటాలకు సిద్ధపడుతున్న జనం వేలమంది మీ అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఇప్పుడు
విచారపడి ఏం లాభం?''

తన జీవితం మీదనే కూతురు చేసిన వ్యాఖ్యలకు శేఖరం నిర్ఘాంతపోయాడు. తన పదమూడో ఏట చదువు మధ్యలో వదిలేసి, గాంధీగారి
వుద్యమంలో చేరాడు. ఆ నాటి నుంచి తాను జైలుకు వెళ్లని వుద్యమం ఏదీ లేనేలేదు. దానివల్ల తాను చాలానే నష్టపోయాడు. కానీ,
దానికి తాను ఎన్నడూ విచారించలేదు. కాంట్రాక్టుల్లో మళ్లీ బోలెడు సంపాదించాడు. అది వేరు. కానీ దేశం స్వతంత్రమయిందంటే అది
తన శ్రమ ఫలితమేనన్నంత ఆనందం కలుగుతోంది. కానీ, ఈ వేళ తన కన్నకూతురు నోట విన్న మాటతో చబుకుతో
కొడుతున్నట్లనిపించింది. బోర్ట్సల్‌ జైలులో అల్లరి చేసినాడని తగిలించిన కొరడా దెబ్బలు కూడా అంత బాధ
అనిపించలేదు.

కల్యాణికి ఆ వ్యాఖ్య రుచించలేదు.

''ఏదో నష్టం కలిగించిందనే ఆలోచనతో మంచిపని మంచిపని కాకుండా పోతుందా? త్యాగాన్నీ, ప్రజాసేవను....''

సుజాత ఆమె మాటను పూర్తి కానివ్వలేదు.

''నాన్నగారు త్యాగం చేసిందేమిటి? చదువు, ఆస్తి, కుటుంబ సుఖం. మీరంతా త్యాగం అనేదానిని ఆయన చేయకుండా ఉంటే బాగా
చదువుకోగలిగేవాడు. మంచి ఉద్యోగంలోనో, మంత్రిపదవిలోనో ఉండేవాడేమో. ఆ రోజున ఆయన చేసిన త్యాగాలే, ఈ వేళ త్యాగ
ఫలితంగా వచ్చిందన్న స్వాతంత్య్రంలో సుఖపడ్డానికి కావాల్సిన హంగులు లేకుండా చేసింది. నాన్నగారు ఆ రోజున ఏ పని చేశారో..
ఈ వేళా అదే పని చేస్తున్నారు. తేడా మాత్రం ఆ రోజుల్లో పికెటింగులకోసం వెళ్లిన ఆఫీసులకు దరఖాస్తులతో వెళ్తున్నాడు. ఆ
రోజుల్లో జైలుకెళ్లినందుకు సంతోషించారు. ఈ వేళ డబ్బు ఇచ్చి పని త్వరగా జరిగినందుకు సంతోషిస్తున్నారు. ఆఫీసుల్లో పని
జరక్కుండా గాని, త్వరగా చేయించగల శక్తిగానీ నాన్నగారికప్పుడూ, ఇప్పుడూ కూడ లేదు. మీరు దేశాన్ని ఏం మరమ్మతు
చేయగలిగారు? నా వుద్దేశంలో చట్టాలంటేనూ.. ప్రభుత్వం అంటేనూ అవిధేయత చూపడం ఆదర్శంగా నిలిపేరు. దాని ఫలితం ఈ వేళ
వేయింతలుగా కనిపిస్తోంది. మీరు సృష్టించిన దయ్యప్పిల్ల భేతాళుల్లాగా పెరిగింది. అనుభవించాలి మరి!''

ప్రపంచం, మానవజాతి అంటే ఏదో కసి, ద్వేషం నింపుకొంటున్నట్లు మాట్లాడుతున్న కూతురు వంక శేఖరం నోరు తెరిచి చూశాడు. తన
కూతురు నోట్లో నాలికలేని మెత్తని కూచి అనే భావం అతనికెన్నడూ లేదు. ఆమె మాటకారితనం, చురుకుదనం చూసి ఆయన చాలమాట్లు
గర్వపడ్డాడు. ఇంకా పెద్దకూతురు చాలా మేదకురాలు. ఏదో బీ.ఏ. అయిందనిపించిందేగానీ, చల్లగా మొగుడితో కాపురం చేసుకొంటోంది. ఈ
రెండో కూతురు చురుకుదనం మీద ఆయన తన జీవిత సార్థక్యాన్ని కల్పించుకొంటున్నాడు. కానీ, ఇప్పుడామె దాని పునాదినే
తవ్వేస్తుంది. ఆమెలో ఇటువంటి భావనలు కలిగించినదెవరో ఆయనకు అర్థం కాలేదు. మనిషి గిలగిలలాడిపోయాడు.

ఆ మాటే తనను ప్రశ్నిస్తే కల్యాణి ఏం చెప్పగలదు?

''మన దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన వాళ్ల త్యాగాల్ని అవహేళన చేయడమే ఈ కాలేజీల్లో చెబుతున్న చదువైతే.. నా
కూతురికి చదువు లేకపోవడమే మేలంటాను. దీనిచేత చదువు మాన్పించేస్తాను'' శేఖరం మండిపడ్డాడు. సుజాత చదువు పోవడం ఆ
సమస్యకు పరిష్కారం కాదని, కల్యాణి ఎరుగును. కానీ, ఆ మాట ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. అవే మాటలు
నవలల్లోకి ఎక్కించినా... తెలుగుదేశం మాట్లాడ్డం లేదు. నాయకులూ, మహానాయకులు విద్యార్థుల్ని, దేశ సమస్యలకు దూరంగా
ఉండండని చెప్పడానికి ఆ వాదాల్నే కొద్ది తేడాలో తెస్తున్నారు. త్యాగాలకు, పార్టీ భేదాలు, పద్ధతి బేధాలు తెస్తున్నారు.
కొన్ని రకాల త్యాగాలకు అయిదెకరాల విలువ కల్పించారు. ఇవన్నీ సుజాత ఆలోచనా ధోరణికి మూలకారణాలు కావూ?

శేఖరం తన కూతురు విద్యావిషయంలో శ్రద్ధ తీసుకోనందుకు అప్పుడు విచారపడ్డాడు. కానీ, వానిని తెలియపరిచిన ధోరణి విన్నాక
సుజాత ధోరణికి తండ్రి కూడా కారణం కాకపోలేదని గ్రహించింది.

''ఎల్లా అయినా మీ బ్రాహ్మలకున్న విజ్ఞానం మా వాళ్లకు వూదర పెడితేమాత్రం వస్తుందటమ్మా???''

ఆ మాటలకు కల్యాణి చచ్చేటంత సిగ్గుపడిపోయింది.

''కులాల్ని పట్టి ఆలోచనాధోరణులు ఏర్పడవు బాబుగారూ?''

''ఎలా ఏర్పడతాయనే దానిమీద మాట లెందుగ్గాని, ఇప్పుడెల్లాగ దాని మనస్సులో సరియైన విలువల్ని కల్పించడం?''

''అది దేశాన్నే ఎదుర్కొంటున్న సమస్య'' అనడం తప్ప కల్యాణికి మరో సమాధానం దొరకనేలేదు.



మూడో ప్రకరణం


భోజనంవద్ద కూర్చున్న తర్వాత శేఖరం నెమ్మదిగా కూతుర్ని కబుర్లలో దించడానికి ప్రయత్నించాడు. కాని, ఆమె నిరాకరించినట్లు
కిమ్మనకుండా కూర్చుంది. అన్నీ విని చిట్టచివర 'గంయ్' మంది.

''మీ కూతురు ఎం.ఏ. చదివిందనీ, మంచి వుద్యోగంలో వుందనీ చెప్పుకోగల ప్రతిష్ఠ కావాలి మీకు. అంతకు మినహా మా యోగక్షేమాలు
మీకు పట్టేయా?''

ఆ అభియోగానికి శేఖరం అదిరిపోయాడు. రామలక్ష్మమ్మ చారు గిన్నెలో పోస్తూ సమాధానం ఇచ్చింది.

''తమ బిడ్డలు బాగున్నారనే ప్రతిష్ఠ కోరడంలో తప్పేముందే? పదిమందీ తన కూతుర్ని వేలు పెట్టి చూపి, చెడ్డగా
మాట్లాడుకోవడం సంతోషంగా ఉండాలంటావా?''

శేఖరం అక్కగారిని వూరుకోమన్నట్లు సైగ చేశాడు.

''ఈ పూట చారు అంత రుచిగా లేదే అక్కా!''

సుజాత తండ్రి ముఖం వంక ఆశ్చర్యంగా తేరిపారి చూసింది.

''ఏం లోపం? చక్కగా వుంటేను?''

రామలక్ష్మమ్మ నవ్వింది.

''ఏ పూట కాపూట గిన్నె ఖాళీచేసే వెధవచారు బాగులేదంటే చూడు అత్తయ్య మాట్లాడ్డం లేదు. నూరేళ్ల బ్రతుకు
బాగుండాలనుకోవడంలోనూ, బాగుండేట్టు చేయాలనుకోవడంలోనూ తప్పేముందమ్మా!''

సుజాత పెంకితనంగా మారాం చేసింది.

''నాకింక ఈ పాడు చదువు వొద్దు. నాకు చదవాలని లేదు''

శేఖరం కూతురు మురిపింపును లెక్కచేయలేదు.

''తమ బిడ్డలు తమకంటే సుఖపడాలని, బాగుండాలని కోరడం సహజం. కాకపోతే మనుష్య జాతి ఈనాడున్న దశకి రాకనేపోవును''.

మాట్లాడుతూ మాట్లాడుతూ చటుక్కున కూతురువైపు తిరిగేడు.

''ఇష్టంలేని చదువు సాగించడంలో అర్థం లేదు. మానెయ్యి పోనీ! పెళ్లి చేసుకొందుగాని...''

తన మాటను అంత శీఘ్రంగా తండ్రి ఒప్పేసుకోవడంతో సుజాత ఏమీ అనలేకపోయింది.

''నిజంగానేనా?''

''ఆ అనుమానం ఎందుక్కలగాలి? నెలకి నూరు రూపాయలు ఆదా జరిగే పద్ధతిలో...''

''చూసేరా? కేవలం డబ్బు లాభం....''

శేఖరం నవ్వేడు.

''ఈ వేళ నీ మనస్సు బాగోలేదు. చదువుకోమంటే మా ప్రతిష్ఠ కోసం బాధపడుతున్నానన్నావు. పోనీ డబ్బు మిగులుతుందంటే పిల్లల
బాధ చూడ్డంలేదంటావు. చదువుకున్న కూతురుతో అన్నీ చిక్కేలా ఉంది''

''పొరపాటున మాకు చదువు చెప్పిస్తున్నారు. అంటే మరి కాదంటారేం?''

సుజాత పేచీకి కాలుదువ్వుతున్నట్లనిపించి శేఖరం సంతృప్తిపడ్డాడు. ఆమె మనస్సులో ఏదో ఉంటుంది. చెప్పదు. పెద్దవాళ్లు
తెలుసుకోవాలి. ఊహకొచ్చినవేవీ కాదంటుంది. ఆమె మనస్సులో ఉన్న అంశం కూడా వాటిలో వుండొచ్చు. కాని, ఒప్పుకోదు. ప్రతిదానికి
అడ్డం వేస్తుంది. ప్రస్తుతం ఆ ధోరణిలో ఉందన్నమాట. ఇందాక కల్యాణివద్ద తెలిపిన భయాలన్నీ వట్టివేననిపించి, అతనొక
నిట్టూర్పు తీసుకున్నాడు. ఇంకా తానుకూడా చెలగాటం ధోరణిలోకి జారేడు. గమ్మున సుజాత అడ్డుకుఒంది.

''అదిగో చూడండి.. మీరు చెప్పింది చేయించడానికి ఎంతలా మారుతున్నారు? ఆ మాట మీద నిలబడండి. నా ఇష్టం
వచ్చినవాడిని...''

''కనీసం ఆ మొగుడెవరో నాన్నకేనా చెప్తావా, చెప్పవా?'' - అంది రామలక్ష్మమ్మ. సుజాత పులుకూ పులుకూ చూసింది.

''పెళ్లి చేసుకొనేది నేనా...''

ఆమె తన మాట పూర్తిచేయకపోయినా శేఖరమే పూర్తిచేశాడు.

''ఈ రోజుల్లో అల్లుళ్లు మామగార్లకే మొగుళ్లు. వాళ్ల కోరికలన్నీ తీర్చలేక మా గుండెలు గరిసెలు పడిపోతున్నాయి.''

''కట్నం కావాలనే మగవాణ్ణి మీరు ఎన్ని బ్రతిమాలినా నేనొప్పుకోనండోయ్''

''మేం బ్రతిమాలడం ఏం వుండదమ్మా. అంతా నీ యిష్టం అన్నాం కదా?''

''చెప్పడానికేం! తీరా మోసి ఎదుట పడేసరికి కమ్మారి అబ్బాయేనా? అందులో పెద్దకమ్మారా? చిన్న కమ్మారా? ఎన్ని
ప్రశ్నలు...''

''అయితే కులం కూడా దాటిస్తానంటావా యేమే?'' అంది భయంభయంగా రామలక్ష్మమ్మ.

కూతురుతో చెలగాటం ఆడుతున్న ధోరణి నుంచి శేఖరం బయట పడనేలేదు.

''నువ్వూ సరే. దాని ఇష్టం అన్నప్పుడు ఏ కులం అయినా ఒప్పుకోవలసిందే... అయితే ఒక్క షరతు, ముందు మాత్రం కాస్త మా
చెవిని వేస్తే అవసరమైన కాపులో వుంటాం''

దానికి సుజాత ఇచ్చిన సమాధానాన్ని మాత్రం అతడు సున్నితంగా తీసుకోలేకపోయాడు. ధోరణి చూస్తే ఏదో వాదం కోసం చెప్పినట్లు అని
అనిపిస్తుంది. కంఠం చూస్తే వెనకనేదో కథ వుందనిపిస్తూంది.

''మీరు షరతులు పెట్టండి. మరో డజను షరతులు నేను పెడతా. కానీ, జరగాల్సిన దానికీ షరతులతో నిమిత్తం లేదు. ఫలానా
మనిషిని పెళ్లి చేసుకోవాలనే ఇష్టం తన జ్ఞానానికి అందేసరికి అడుగు తీసుకునే దారులు ఏవీ కనిపించే అవకాశమే వుండదు.
ఇతరుల అభిప్రాయం తెలుసుకొని నిర్ణయానికి వచ్చే ధోరణిలో మనిషి ఉన్నాడంటే... ఆ మనిషి విషయమై అతనికి శ్రద్ధ
కలగలేదనుకోవాలి. ఫలితం ఏమిటి? నేను పెళ్లి చేసుకొనే ముందు ఆ మాట చెప్పానా నమ్మొద్దు. పెళ్లి చేసుకొన్నాక చెప్పానా
విచారపడొద్దు.

చెలగాటం కొనసాగించాలనే వుత్సాహం శేఖరం మనస్సులో ఇగిరిపోయింది. ఆలోచించి ఆలోచించి అక్కను సంప్రదించాడు.

''ఏమిటి దీని ధోరణి?''

రామలక్ష్మమ్మ నిర్లక్ష్యంగా తోసేసింది. ''ఏమీలేదు. అదెప్పుడూ అంతే. రాలుగాయి''.

అంతకంటే ఆమెనుంచి అతనికి సహాయం లభించదు. ఈ మారు మళ్లీ కొత్త సమస్యతో కల్యాణిని సలహా కోరాడు. ఆమెకు ఏమీ
తెలియదు. కానీ, ఆమె ప్రశ్నలతో మాత్రం ఏదో తెలుసుననే అనుమానం కలిగింది.

''కులాంతరం అయితే మీకు ఇష్టం కాదా?''

''నాకైతే ఆ పట్టింపులు లేవు. కానీ, వాళ్ల అమ్మ వుంది. దాని అన్నదమ్ములున్నారు. వాళ్లెవరూ ఒప్పుకోరు. కష్టాలకూ -
సుఖాలకూ ఆదుకొంటున్న వాళ్లని వొదులుకోవాలంటే...''

సుజాత ఏ వుద్దేశంతో మాట్లాడినా... ఆమె ఆలోచనలకు కారణం లేకపోలేదని కల్యాణి గ్రహించింది. దానిని గురించి ఇంకా చర్చ
కొనసాగించదలచుకోలేదు.



నాలుగో ప్రకరణం


''నమస్కారమండీ!'' అంటూ తెల్లవారేసరికి గుమ్మంలో హాజరయిన మంగారావును చూడగానే కల్యాణికి చాలా విసువు కలిగింది. అతని
వెనకే నిలబడ్డ ఆర్.‌టి.సి. కండక్టరు, మరో ఇద్దరు ఆమె క్రోధాన్ని ద్విగుణీకృతం చేశారు. ఆ కండక్టరు
ముఖాన విచారం గాని, పశ్చాత్తాపం గాని వున్నట్లు ఆమెకు అనిపించలేదు. తన నిర్లక్ష్యం వల్ల ఒక కుటుంబం నిష్కారణంగా
చచ్చిపోయి ఉండేదే... అనే బాధకు బదులు తనకే ఏదో అన్యాయం జరిగిపోయిందన్నట్లు బుంగమూతి పెట్టేడు.

వారిని వీధిలోంచే పంపెయ్యడానికి కల్యాణి ప్రయత్నించి విఫలురాలయింది. ఇంక మర్యాదకోసం వారిని లోనికి పిలవక తప్పలేదు.

''ఏమిటి మళ్లీ వచ్చారు?''

''తమరిని...''

''ఇలాంటి విషయాల్లో మీ యూనియనువాళ్లు కలుగచేసుకోవడం అప్రతిష్ఠ సుమీ అని మొదటి రోజుననే చెప్పాను. యూనియన్‌
సభ్యుడు హత్యలు చేసినా సమర్థించే స్థితికి వచ్చేరా అవి యూనియన్లు అనిపించుకోవు. రౌడీ గ్యాంగులకు, వాటికీ పేరు తేడా
మాత్రమే మిగులుతుంది. ఆ మాటకు ఆ రోజున వచ్చిన వెంకటేశ్వర్లుగారట, ఆయన ఔనన్నాడు. యూనియను ఈ విషయంలో కలుగ
చేసుకోదన్నాడు. మరి మిమ్మల్నెందుకు పంపేరో?''

''చందాలన్నీ ఇన్నాళ్లూ జేబులో వేసుకుని, ఈవేళ నీ పాట్లు నువ్వు పడమన్నారు లంజకొడుకులు...'' అంటూ కండక్టరు దుబ్బు
క్రాపు ఎగరేసేడు.

మంగారావు కోప్పడ్డాడు.

''నోరు ముయ్యవోయ్‌... మొనగాడివి బయలుదేరేవు''

కండక్టరు భద్రం గప్‌చిప్‌మని ఊరుకోవడం కల్యాణికి ఆశ్చర్యమనిపించింది. ఆమె ఎదుట, వారిచేత తనదే
పొరపాటనే మాట చెప్పించలేకపోయాడు వెంకటేశ్వర్లు. అలా చెప్పమనే సరికి ఎంత ఎగిరేడు? ఈ వేళ మంగారావు 'నోరుమూయమన్నా'
వూరుకోవడం ఆశ్చర్యమే అనిపించింది.

మంగారావే ఆ సందేహం తీర్చేడు.

''యూనియను కమ్యూనిస్టులది. తల్లిగొంతు కోయగలవాడికి పినతల్లి చెవులు బీరపువ్వులంటారు. దేశానికే ద్రోహం చేసేవాళ్లు మనిషికి
ద్రోహం చేయడంలో ఆశ్చర్యం లేదు. అమాయకుల్ని సంఘాలనే పేరెట్టి ఆడించినంతకాలం ఆడించారు. తీరా సమయం వచ్చేసరికి
తప్పుకొన్నారు.''

కల్యాణికి పరిస్థితి అర్థమైంది. ప్రజల ప్రాణాలు, బాధ్యతలు సమస్యలలోకి రాజకీయాలు ప్రవేశించాయన్నమాట.

''ఈ మాట నిన్ననే చెప్పి ఉంటే.. ఇంత తకరారు ఉండేదికాదు''

మంగారావు సంతోషించాడు. కండక్టరు భద్రం యూనియన్‌ను ఒక వరస తిట్టాడు.

''లంజకొడుకులు... పేటలోకి ఎల్లా వస్తారో చూస్తా''

ఈ మారు మంగారావు అతడిని నిరోధించలేదు.

''తమరు పొరపాటులో వున్నారనిపించింది. ఈ కేసెంతటిది? మంత్రిదగ్గరికెడితే ఒక్కనిమిషంలో ఆర్డర్లు పాసై పోతాయి. కానీ, తమ
మంచితనం మీద మచ్చ తొలగదు. అందుకోసం ఆఖరు పర్యాయం. హైదరాబాద్‌కు వెళ్లేలోపున మరో ప్రయత్నం చేద్దామని
వచ్చా''

కల్యాణి నిశ్శబ్దంగా అన్నీ విని, ఓ మాట అందించింది.

''యూనియన్లంటే ఇంతవరకు...''

ఆమె ఏమనుకుంటుందో వినగల ఓపిక మంగారావుకు లేదు. ఆమె తనను యూనియను ప్రతినిధిగా భావించడం చేతనే అంత మొండిగా మాట్లాడిందనే
భావం అతనికి ఏర్పడింది.

యూనియన్లలో కమ్యూనిస్టులు చేరి వాటినెలా దుర్వినియోగం చేస్తున్నారో గుక్కతిప్పుకోకుండా చెప్పాడు.

ఈ మధ్య రైల్వే వాళ్లలోనూ ఇలాంటిదే వచ్చింది. పెట్టెలు బాగు చెయ్యలేదని ఎవరో ప్రయాణీకుడు కంప్లెయింటు చేశాడట. అధికారులు
వెంటనే ఇద్దరిని సస్పెండు చేశారు. వాళ్ల తరఫున నిలబడడానికి బదులు యూనియను పని అశ్రద్ధ చేశారని వాళ్లని
కోప్పడింది. రెండో వైపున స్టాఫ్‌ చాలడం లేదని, మరికొందరిని వేయాలని మహజర్లూ గంద్రగోళం ప్రారంభించారు. అబ్బే!
ఏ అవకాశం దొరికినా చాలు, గవర్నమెంటు మీద బ్రహ్మాస్త్రంలా ప్రయోగించడమే గాని ...''

కల్యాణి ఇంక భరించలేకపోయింది. గతరాత్రి జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. వెంటనే వెళ్లి శేఖరాన్ని పిలిచింది. ఆ హడావుడి
చూసి రాజగోపాలం వచ్చాడు. అంతమంది శ్రోతల ముందు తన సిద్ధాంతాలను చెప్పగల అవకాశం దొరకడం మంగారావుకు ఎంతో ఉత్సాహం
కలిగించింది.

కానీ, దాని ఫలితాలు మాత్రం అతననుకొన్న విధంగా వుండకపోవడంతో అతనికి ఎంతో క్రోధం కలిగింది.

''దేశాన్ని ఏ గతికి తెచ్చావురా దేవుడా?'' అని శేఖరం ఆకాశంకేసి చూసి అంగలార్చాడు.

కల్యాణి ఇంక భరించలేకపోయింది.

''మిష్టర్‌!"

మంగారావు ఆమె వంక చూశాడు.

''ఇంక నాకు పనుంది. క్షమించి...''

''మేం వచ్చిన పనిమాట ఏమన్నారు?''

''అదెల్లా సాధ్యం?''.... అన్నాడు రాజగోపాలం అమాయకంగా.

మంగారావు సగర్వంగా సలహా ఇచ్చాడు.

''చుట్టుపక్కలవాళ్లు కండక్టరు పేరు తప్పుచెప్పారనీ, ఈ పేరు గలవాడు ఆరోజున తమరు చూసిన వారూ ఒకరు కాదనీ...''

కల్యాణి ఒక నిశ్చయానికి వచ్చినట్లు ఖండితంగా చెప్పింది.

''అలా జరగదు''

మంగారావు భద్రాన్ని అతనితో వాళ్లిద్దరినీ బయటకెళ్లమన్నాడు.

''మీరు నడుస్తుండండయ్యా! అమ్మగారితో మాట్లాడి వచ్చేస్తా.''

భద్రం రుంజుకున్నాడు.

''ఈ బ్రతిమాలుకోడాలు....''

మంగారావు గర్జించాడు.

''వెళ్లాలి''

మిత్రులిద్దరూ భద్రాన్ని తీసుకుపోయారు. మంగారావు నెమ్మదిగా ప్రారంభించేడు.

కల్యాణి ఆడది. పొరుగూళ్లో వుద్యోగం చేసుకుంటూంది. అటువంటి వాళ్లు నలుగురితో, అందులోనూ భద్రంలాంటి వాళ్లతో పేచీ
పెట్టుకోకూడదు. అదిగాక ప్రతి చిన్నదానికీ ఇల్లా సాగదియ్యకూడదు.

''ప్రాణాలు తియ్యడానికి సిద్ధం కావడం చిన్న విషయమా?''

''ఇక్కడెవరూ చావలేదుగా'' అన్నాడు మంగారావు.

శేఖరం, రాజగోపాలం నోరు తెరిచారు.

కల్యాణి ప్రశ్నించింది.

''ఆడదాన్ని, పొరుగూళ్లో ఉన్నాగనక ఈ కేసు తీసేసుకోవాలంటారు''

''కేవలం అలా కాదు. కొంచెం ఆలోచించమంటాను. అంతే''

''మనం ఏ కాంగోలోనో లేము. బెజవాడలాంటి పట్నంలో...''

''ఒక్కొక్క సందర్భంలో ఎంతో బలమైన ప్రభుత్వం కన్నా కాంగోలాంటి అనాగరిక దేశమే మేలు. అక్కడ ఒకరికి ఏదన్నా మంచి
చెడ్డా జరిగితే వాళ్ల తెగవాళ్లంతా ఆసరా అవుతారు. ఇంక బెజవాడ అయితేనేం. హైదరాబాద్‌ అయితేనేం. మహాపట్నం
కన్నా మహారణ్యం క్షేమమనిపించే ఘట్టాలుంటాయి''

తన విజ్ఞానానికి తానే ఆనందిస్తున్నట్లు మంగారావు పకపకా నవ్వాడు. రాజగోపాలం వైపు తిరిగి ''ఏమంటారు??'' అన్నాడు.
అతని ముఖంలో అసహ్యమే గానీ అంగీకారం కనబడలేదు. వున్నట్లుండి మంగారావు గంభీరంగా ముఖం పెట్టాడు.

''మరి నే సెలవు తీసుకుంటా''

కల్యాణి లేచింది. మంగారావు రెండడుగులు వేసి ఆగాడు.

''ఇంకోమారు ఆలోచించండి''

కల్యాణి ఇంక పట్టలేకపోయింది.

''హంతకులకు రాజకీయపు ముసుగు వేయకండి. దేశాన్ని అడవి మృగాలతో నింపొద్దు''

''నేననుకుంటూనే వున్నా. మీరంతా కమ్యూనిస్టులు.''

మంగారావు విసవిస వెళ్లిపోయాడు.

''ఆడదానివి, వాడన్నమాటా నిజమే. పొరుగూళ్లో వున్నావు. రౌడీ వెధవలతో పని...''

శేఖరం మాటలతో కల్యాణి గుండెల్లో నిజంగానే బెదురు పుట్టింది. బెజవాడలో రౌడీగ్యాంగులు చేస్తున్న అల్లరి కథలు ఆమె చాలా
వింది. ఆ నాయకుడు వారికి అండ. ఈ షావుకారు కొడుకులు వీళ్లు. ఆ కులం వాళ్లంతా ఇలాంటి పనులకు మద్దత్తే. అంటూ
అనేకరకాల కబుర్లు చెబుతుంటారు. నిజం ఏమిటో తెలియకపోయినా వాటిని విన్నాక పాడు బెజవాడ వదిలిపోదామని ఎన్నో
మాట్లనిపించింది. అయితే ఇంతమంది ఆడవాళ్లు వుద్యోగాలు చేస్తున్నారు. ఏటేటా ఇన్నివేల మంది జనాభా పెరుగుతూనే ఉంది. వాళ్లకి
లేని భయం నాకేమిటని సర్దుకొంటూంటుంది. శేఖరం మాటలు విన్నాక భయం పుట్టినా.. రాజగోపాలం అభినందనతో మరల మనస్సు
నిలదొక్కుకుంది.

''ఇల్లాంటి దౌర్జన్యాలు మనం భయపడ్డకొద్దీ పెరుగుతాయి. మంచి పనిచేశారు.''



అయిదో ప్రకరణం


రాజగోపాలంగారి కోసం ఎవరో వచ్చినట్లున్నారని రామలక్ష్మి చెప్తుంటే కల్యాణి తలుపు తీసింది.

''రాజగోపాలం అనే జూనియరు ఇంజనీరు....''

''పక్కవాటాయేనండి. వారు....''

''నా కుమారుడు.''

ఆఫీసుకు వెళ్లేరనదలుచుకొని కూడా ఆగి లోనికి ఆహ్వానించింది.

''దయచేయండి. వారు ఆఫీసుకు వెళ్ళేరు''

లోనికి తప్పుకోబోతున్న కల్యాణి ఆయన పిలుపునకు నిలబడింది.

''చూడండి''

''ఎండలో నిలబడ్డారు.''

''ఫర్వాలేదు, మా వాళ్లు కూడా వచ్చారు. ఆమెగారు ఇక్కడుంటుంది. నేను పోయి అతన్ని కలసివస్తా''

''ఇంకా చెప్పేరు కాదేం, ఎక్కడున్నారు వారు?''

కల్యాణి ఆయన వెనువెంట వెళ్లింది.

''మీ అబ్బాయిగారున్న ఇల్లు ఇదే. దయచెయ్యండి."

''అబ్బాయి వున్నాడా?''

కృష్ణంరాజే సమాధానమిచ్చాడు

''వారు పక్కవాటా వారు. అతడిని నేను తీసుకొస్తా. నువ్వు వారింట్లో ఉండు''

''వెడుదురుగాని లెండి, దిగి కాస్సేపు కూర్చోండి.'' అంటూ కల్యాణి ఆహ్వానించింది.

ఆమె చేతి ఆసరా తీసుకుని సావిత్రమ్మ రిక్షా దిగింది.

''వెయ్యి కాలాల పాటు వర్ధిల్లు తల్లీ!''

కల్యాణి చిరునవ్వుతో ఆశీర్వచనం స్వీకరించింది.

''ఇల్లా రండి''

గుమ్మంలో రామలక్ష్మమ్మ స్వాగతం ఇచ్చింది. సావిత్రమ్మ చిరునవ్వుతో ప్రశ్నించింది.

''మీ కూతురా? మంచిదమ్మా! అదృష్టవంతులకు గాని అల్లాంటి సంతానం లభించదు''

''ఈ రోజుల్లో మాటా మర్యాదా తెలిసిన వాళ్లెందరమ్మా!'' అని మొచ్చుకోలులో భార్యకు వంత కలిపాడు కృష్ణంరాజు.

కల్యాణి చిరునవ్వు నవ్వింది. రామలక్ష్మమ్మనూ, సుజాతనూ పరిచయం చేసింది.

''తమరిప్పుడు ఆయనకోసం వెళ్లొద్దు. ఆఫీసైతే దగ్గరే అనుకోండి. కాని, ఎండ మండిపోతోంది. ఒక్కక్షణం కూర్చోండి. స్నానం
చేయండి''

రామలక్ష్మమ్మ ఆమెను బలపరిచింది.

''అల్లా చెయ్యండి. ఎప్పుడు బయలుదేరేరో కాస్సేపు విశ్రాంతి తీసుకోండి''

సావిత్రమ్మ అంగీకరించింది.

''తెల్లవారగట్ల ఎప్పుడో బయలుదేరాం''

''ఎప్పుడో తొమ్మిదింటికి రావాల్సిన బండి. యిప్పుడు మూడయింది.''

కృష్ణంరాజు దంపతులు కబుర్లలో కలిసిపోయారు. కేవలం ఆడవాళ్ల మధ్య కూర్చుండి కబుర్లు చెప్పడానికి ఏలాగో ఉన్నా..
అరవయ్యేళ్లు దాటాక బెజవాడ వేడిని తట్టుకోవడానికి జంకే కలిగింది.

''పట్నంలో ఒకరి సంగతి వేరొకరు పట్టించుకోవడమే అరుదమ్మా. ఇదివరకు మావాడు మరోచోట ఉండేవాడు. అదెక్కడో నాళ్ల నడుమ
ఉంది. చీకటి పడింది. వెతికి వేసారా. ఒక ఇంట్లో జరిగింది చెప్తా. ఇంట్లో ఆడమనిషి ఎదురుగా కనిపిస్తూంది. మాట్లాడదు''

''ఘోషా యేమో'' అంది సుజాత

కృష్ణంరాజు అసంతృప్తిగా తలతిప్పేడు.

''రాజసాలు సాగినప్పుడు , దివాణంలో ఏ మారుమూలనో ఉండేటందుకు అవకాశం ఉన్నప్పుడు ఘోషా సాగించినా అర్థం ఉంది. కాసావాడో,
దాసీ మనిషో సమాధానమిస్తుంది. దోసెడు కొంపలో మా బట్టలేని దరిద్రంలో...

''ఘోషా అనేది సరైన పద్దతే అనుకుంటే... ఇంటి వైశాల్యంతో, మనిషి ఐశ్వర్యంతో పనేముంటుంది? జరిగించుకోవాలసిందే'' అంది
కల్యాణి.

సావిత్రమ్మ నవ్వింది.

''మంచి వుజ్జీవే దొరికావు. వారికి వాదం ఉంటే ప్రసాదం కూడా అక్కర్లేదు''

భార్య మాటలు రుజువు పరుస్తున్నట్లు కృష్ణంరాజు హుషారుగా అందుకొన్నాడు.

''మన ఆచారాలూ, అలవాట్లూ మధ్యలో వచ్చినవే. మధ్యలో పోయేవే. ఆడుదాన్ని చేలోపుగా ఉంచుకొనేటందుకు ఇంట్లో
మూసిపెట్టాల్సిందేననుకొన్నారు. ఆడదాన్ని కష్టపడకుండా చేసేటందుకూ మూసిపెట్టారు కొందరు. మూసిపెట్టి నిభాయించుకోగలవాళ్ళు ఘోషా
పెట్టారు. లేనివాళ్ళకది లేదు. అదే గొప్పనుకొనో, అలవాటైపోయో సాగకపోయినా జరిగించేవాళ్ళు కొందరు. అనుభవించిన వాళ్ళం దాని
బెడద వదల్చుకొంటూంటే, అదేదో మంచి పద్ధతీ, మర్యాదైన పద్ధతీ అని ఎగబ్రాకే వాళ్ళు కొందరు...''

''బాగుంది మీ ధోరణి. మీకేదో వెర్రి అనిపించింది గనక ప్రపంచానికంతకూ అనిపిస్తుందా ఏం?'' - అని సావిత్రమ్మ మాట
కలిపింది.

''బాబయ్యగారింట్లో కోడళ్లకీ ఘోషాలు లేవన్నమాట''

''లేకపోలేదు. కొంత నయం. పుట్టిళ్ళ అలవాట్లు ఓ పట్టాన పోతాయా?'' అంది సావిత్రమ్మ.

''పుట్టిళ్ళ అలవాట్లంటావేం? చదువు సంధ్యలు లేని పల్లెటూళ్ళఅలవాట్లు అనక!''

''ఈ మారు ఈ కొడుక్కి చదువుకొన్న పిల్లనే వెదికిచేద్దురుగాని లెండి'' అని సావిత్రమ్మ మగణ్ణి వేళాకోళం చేసింది.

సుజాత లోపలి గదిలోంచి కల్యాణిని పిలిచింది... ''అక్కా!''

కల్యాణి లేచింది.

''తమరిద్దరూ స్నానాలు చేయాలి. అంతవరకూ ఆ నీరసం అల్లాగే ఉంటుంది. లేవండి''

వృద్ధదంపతులిద్దరూ స్నానం చేసి, బట్టలు మార్చుకొనే వేళకి కల్యాణి ఫలహారాలు అమర్చింది.

కృష్ణంరాజు అభ్యంతరం చేప్పాడు.

''మీకీ శ్రమ ఎందుకు తల్లీ. మాతో కూడా మిఠాయిలున్నాయి''

''ఉండనివ్వండి. అబ్బాయి వున్నారు'' అంది రామలక్ష్మమ్మ.

కల్యాణి వారి అభ్యంతరాన్ని చొరనివ్వలేదు.

''మీకు బరువైన ఆహారం పెట్టడం లేదు. ఫలహారం అంటే కేవలం ఫలాహారమే. ఈ మామిడి పళ్లు సుజాతగారి పొలంలో పండాయి. వాళ్ల
నాన్నగారు మొన్ననే తెచ్చి ఇచ్చారు''

కృష్ణంరాజు హాస్యమాడేడు.

''ఈ కేకులు, బిస్కట్లు మీ పొలంలో పండలేదుగదా?''

కల్యాణి చిరునవ్వు నవ్వింది.

''అంతేమరి. మాకు పొలాలంటూ లేవు. ఊళ్లో దుకాణాలే మా పొలాలు.''

కప్పుల్లో ఐస్‌క్రీమ్‌ వారి ముందుకు వచ్చింది.

''ఇదొక విధంగా మీ అబ్బాయిగారు ఇచ్చిందే అనుకోండి. ఐస్‌ కావాలని వెళ్ళేటప్పుడు చెప్పేం. మీరు వచ్చేముందే
ప్యూన్‌ చేత పంపేరు.''

కుమారుడు పంపిన ఐస్‌తో తయారు చేసిన ఆ 'క్రీమ్' ఆ దంపతులకుత్సాహకరం కాలేదు.

ఉన్న మూడు వాటాల్లో ఒక్క రామలక్ష్మమ్మ తప్ప మిగతా ఇద్దరూ పడుచువాళ్లు. పెళ్ళిళ్లు కానివాళ్లు. ఉద్యోగాలకనో,
చదువులకనో ఒంటరిగా కాపురాలున్నారు. వెనక పెద్దతోడు కనిపించదు. పైగా ఏ వస్తువులో కావాలని చెప్పేటందుకూ, పంపించేటందుకూ
చనువుకూడా ఏర్పడింది. ఇదేమీ ఆ వృద్ధ దంపతులకు బాగా అనిపించలేదు. కానీ, పైకి అనలేరు. ఒకరి మొహాలొకరు చూసుకున్నారు.
కల్యాణి ఇంత మర్యాద చేయడంలో కూడా గూఢమైన భావం ఉందనే వారికి తోచింది.

సావిత్రమ్మ కొడుకు జీవిత పద్ధతుల వివరాలు ప్రశ్నించింది. అందులో కొడుకంటే ఉన్న ప్రేమా, ఆతురతనే కల్యాణి గమనించింది.

''వచ్చేసరికి బాగా రాత్రవుతుందా అమ్మా?''

''పదీ, పదకొండూ, ఒక్కొక్కసారి రెండూ అవుతుంది''

తల్లిప్రాణం ఆ మాటకు తల్లడిల్లిపోయింది.

''అంత రాత్రి వరకూ పనే?''

కల్యాణి వివరాలు తనకు తెలియవంది.

''డ్యూటీలుంటాయి. ఇతర సమయాల్లో స్నేహితులనో... ఏ సినిమాలకన్నా వెడతారు''

''ఇంటిదగ్గర కనిపెట్టుకొని ఉండేవాళ్లెవరూ లేరు కదా?'' అని రామలక్ష్మమ్మ వ్యాఖ్యానించింది.

సావిత్రమ్మ లేచి ఓ మారు ఇల్లంతా చూసొచ్చింది. మూసిఉన్న తన కొడుకు వాటాలోకి ఉన్న తలుపులన్నింటివద్దా ఒక్కో క్షణం
నిలబడి కళ్లు వత్తుకుంది.

''వేళకాని వేళల్లో తిండి తింటున్న కొడుకు ఏం చిక్కిపోయాడో'' అని ఆమె ఆదుర్దా.

''త్వరలోనే ఓ ఇంటివాడైతే...''

కల్యాణి చిరునవ్వు నవ్వింది. పెళ్లి అయితే వేళలు తప్పించే డ్యూటీలు ఏమవుతాయనుకుంది.

రామలక్ష్మమ్మ ప్రశ్నించింది.

''బంధువుల్లో ఈడూ జోడూ అయిన అమ్మాయిలున్నారా?''

''లేకేం.. బోలెడంత మంది. పదేసి వేలు కట్నాలు ఇస్తామంటున్నారు''

''మరింకేం?'' అంది రామలక్ష్మమ్మ.

''కానీ, వాళ్లెవ్వరూ చదువుకోలేదు''

''ఆ పట్టుదల తండ్రిగారిదా? కొడుకుగారిదా?''

తన కొడుక్కి చదువుకొన్న పిల్లనే చేయబోతున్నానని ఒక అరగంట క్రితమే చెప్పిన మాటను కృష్ణంరాజు మరచాడు. కొడుకు కోరిక
మీద అసంతృప్తి ప్రకటించాడు.

''మా తరం వరకూ భార్య చదువుకొందా? లేదా? అనే ప్రశ్న మాకు రాలేదు. సంప్రదాయం, మర్యాద, ఆస్తిపాస్తులు... ఇవే
చూశాం. మా వాళ్లున్నారు. ఆవిడ పేరు నావిడ గుర్తుపట్టలేదు''

ఆయన మనస్సులోని ద్వైవిధ్యాన్ని సర్దుబాటు చేయబోయింది కల్యాణి.

''మీ రోజులు వేరు. ఆ కాలంలో చదువుకొన్నా చదువుకోకున్నా మనిషికి భూములే జీవనాధారం. వ్యవసాయం చేసుకునేవారు. వ్యవసాయం
అనేసరికి కుటుంబంలో నలుగురన్నదమ్ములూ కలిసి మెలిసి కాపురం చేయాలి. ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దే ఆడవాళ్లకి కావలసింది
పనినేర్పు. వంటావార్పుల్లో దక్షత. ఇల్లు చక్కబెట్టుకొనే మెలకువ.''

''పనినేర్పూ, వంటావార్పుల దక్షతా ఈ వేళ మాత్రం అక్కర్లేదూ? ఆడదన్న తర్వాత...''

''అది కాదండీ మామ్మగారూ! మీ ఇంజినీరు కొడుకున్నారు. పెళ్లి చేసుకొన్నాక ఆయన మీ ఇంట్లోనే ఉండిపోరుగద?''

''వుద్యోగం వుందిగా?''

''పోనీ మీరు నలుగురూ వచ్చి కొడుకుదగ్గర ఉండగలరా?''

సావిత్రమ్మ తలతిప్పింది.

''అబ్బే! లంకంత ఇల్లూ, కామాటమూ ఎక్కడవుతుంది?''

అసలా ప్రశ్నకే అర్థం లేనట్లు కృష్ణంరాజు దానిని త్రోసేశాడు.

''పొలం పుట్రా లేనివాళ్లు మాత్రం? కామాటం అంతా ఎత్తికట్టుకుని కొడుకుల్తో వుద్యోగపు వూళ్ళు వూరేగుతారా యేం?''

''ఔనా మరి! తమ కాలం నాటి అవసరాలు వేరు. ఈ కాలపు అవసరాలు వేరూ అనడం...''

''అంత పెద్ద వంటలు వండనక్కర్లేకపోవచ్చు. పెద్ద ఇళ్ళు సంబాళించనక్కర్లేకపోవచ్చు. కానీ, మగడూ, పిల్లలూ గాలి తిని
బతకరు కదా? తనకైనా వంట వంటే, వండడం పని అనుకొన్నాక చదువుకొన్న పిల్లే కావాలనడంలో అర్థం ఏమిటి? త్రాసులూ,
తక్కెళ్లతో తూచీ, ఔన్సు గ్లాసులతో కొలిచీ వంటచేయాలా?''

కేకులూ, ఐస్‌క్రీమూ ఇంట్లోనే తయారుచేశానన్నప్పుడు ఆయన ఒక్క గంట క్రితమే చదువుకున్న వాళ్ళకుండే సర్వతోముఖ
ప్రజ్ఞను మెచ్చుకొన్నాడు. ఇప్పుడు ఈ ఎత్తిపొడుపు.

''ఎవరో హాస్యం కోసం అన్న మాటలూ, వ్రాసిన కథలూ మాటకేం లెండి. చదువురాని వాళ్ళలో వంటరాని వాళ్ళు లేరూ? మా పెత్తల్లి
కూతురుంది. ఏభయ్యేళ్లొచ్చేయి. మనిషికి ఎన్ని బియ్యం కావాలో ఈనాటికెరగదు. ఆ మధ్య నేనోమారు చూసివద్దామని వెళ్లా.
'మామూలుగా పెట్టేదానికన్నా మరో శేరున్నర పోశాను. చాలదంటావా?' అంది. అందుచేత చదువుకోని ఆడవాళ్లంతా అంతే అననా?''

కృష్ణంరాజుకు ఏం చెప్పాలో తోచలేదు. సావిత్రమ్మ మగని పక్క నిలబడింది.

''ఇంతకీ చెప్పొచ్చేది... వాడికి చదువుకొన్న పిల్ల కావాలి. అందుకే టలాయిస్తున్నాడు''

"మంచిదే. అల్లాగ పట్టుపట్టే మగవాళ్ళు కొందరుంటే తప్ప ఆడపిల్లల చదువుమీద ఎవరూ శ్రధ్ధ చూపరు."

"ముందెవరో శ్రధ్ధ చూపుతారంటే ఏం వొరుగుతుంది? ఈవేళ వరకు అటువంటి పిల్లలు మా కులంలో బాగా తక్కువ. చదువుకొన్న
కొద్దిమందీ అందుబాటులో వుండరు."

"చదువుకొన్న పిల్ల కావాలన్నప్పుడు, దానికి అంగీకరించాక, ఆ పిల్లని చూసుకొనే పనికూడా ఆయనకే వదలండి...." అంది
రామలక్ష్మమ్మ సమస్యకు తానేదో పరిష్కారమార్గం చూపుతున్నట్లు. కాని, ఆ పరిష్కారం వాళ్ళిద్దరిలో ఎంత ఆందోళన తెచ్చిందో
అక్కడున్నవారెవ్వరూ గమనించలేదు. 'ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఇద్దరు పిల్లలున్నారు. ఆ ఇద్దరిలో ఎవరిని ఏరుకొన్నా
సంతోషమే,'నని బాహాటంగా ప్రతిపాదించినట్లే వులికిపడ్డారు.

"కులంకాని కులం వాళ్ళని కావాలంటే...."

కృష్ణంరాజు కంఠస్వరం విని కల్యాణి ఉలికిపడింది. నాలుగురోజుల క్రితం శేఖరమూ అదే భయం ప్రకటించాడు. "ఏమిటీ ఆ కులం
గొప్ప"-అనుకొంది. కాని పైకేమీ అనలేదు.

నిజానికి కులం ప్రసక్తి వచ్చాక సంభాషణ ఎక్కడికక్కడే తెగిపోతున్నట్లే అనిపించింది.



ఆరో ప్రకరణం


జీవితంలో ఎదురుపడ్డ వాళ్ళంతా తమవైపే ఆకలిగా చూస్తున్నారనే హెచ్చరిక కొందరిని అనుక్షణం వెంబడిస్తూంటుంది. ఎవరో తట్టి
చూపించేవరకూ తమ ఎదుట కనిపిస్తున్న వాటిని కూడా చూడలేరు కొందరు.

సరిగ్గా కల్యాణి విషయంలో జరిగిందంతే. బహుశా అది తన మనస్సును కూడా గుర్తించకపోవటం వలన కావచ్చు. రాజగోపాలం పెళ్ళి
విషయంలో తల్లిదండ్రుల్ని ధిక్కరించడం సంతోషం కన్న సానుభూతి చూపవలసిన విషయంగా ఆమెకు తోచిందంటే మరో అర్ధం లేదు. గట్టిగా
నిలబడమనీ, మేమంతా నీ ప్రక్కనున్నామనీ దిలాసా ఇవ్వడం అవసరమన్నంతవరకే ఆమె ఆలోచనలు వెళ్ళేయి.

"కులం కాని కులంలోంచి భార్యను ఏరుకుంటాడేమోనన్న భయం ఎందుకు కలగాలి? మీ అబ్బాయి చాలా యోగ్యుడు. తల్లిదండ్రుల మాట
కాదనడు లెండి.'-- అంటూ రామలక్ష్మమ్మ ఊరడించినా ఆ దంపతులకు విశ్వాసం కలుగలేదు. విశ్వాసం కలగకపోవటానికి తగిన
ఘటనలేం జరగలేదు. అసలు కొడుకును చూడకుండానే, ఆతనితో మాట్లాడకుండనే వారిలో ఆ అవిశ్వాసం ఏర్పడింది. దానికి కారణం
అవసరంలేదు. అంతస్సాక్షి సూచన.

అనుకొన్నట్లుగానే రాజగోపాలం తల్లిదండ్రుల ప్రతిపాదనలన్నింటినీ నిరాకరించాడు.

ఒకరోజు రోజంతా తల్లిదండ్రులూ, కొడుకూ తమ వాటా విడిచి బయటకు రానేలేదు. మధ్య మధ్య వినిపించిన రంకెలతో కృష్ణంరాజు కంఠం
చర్చాంశాన్ని నలుగురికీ వివరించింది.

ఎంత వినకూడదనుకున్నా ఏవేవో మాటలు చెవిని పడుతూనే వున్నాయి. రెండు వాటాల మధ్యనున్న తలుపులూ, గోడలూ వారి రహస్యాలను
కాపాడలేకున్నాయి.

పడుచుల ఆకారాలు, వారి తండ్రులివ్వగల కట్నాలు- కానుకలు వారి కుటుంబాలు చేకూర్చగల ప్రతిష్ఠలు ఉదాత్తానుదాత్త
స్వరితాలలో కృష్ణంరాజు కొడుకు మనస్సుకు పట్టించ ప్రయత్నిస్తున్నాడు. కాని, అవన్నీ విఫలమైనట్లే తెలిసిపోయింది.

"చేతి కందుబాటులో వున్నదని నాటక మాడాలనుకుంటున్నావేమో. ఆస్తంతా నా స్వార్జితం."-- అంటూ కృష్ణంరాజు ఇచ్చిన అంతిమసందేశం
వినబడ్డా, ఆయన పేర్కొన్న పిల్ల తానేనేమోననే అనుమానం కూడా ఆమెకు కలగలేదు. ఆ బెదిరింపును కొడుకేమాత్రం లక్ష్యం చేశాడో
కూడ ఆమె వినలేదు.

ఆ మాట విన్న రామలక్ష్మమ్మ కృష్ణంరాజును అభినందించలేక పోయింది.

"ఒక మూల ఆస్తికీ పెళ్ళికీ లంకెపెడుతూ, రెండో వేపున అది దైవనిర్దిష్టం అని ఆత్మ వంచన చేసుకోవడం దేనికో?"

తెల్లవారగట్ల ఎవ్వరితోనూ చెప్పకుండా కృష్ణంరాజు భార్యతో రైలుకి వెళ్ళిపోయాడు. ఆ రోజునుంచీ రాజగోపాలం తమరందరినీ తప్పించుకు
తిరుగుతున్నట్లనిపించింది కల్యాణికి. వివాహవిషయంలో తల్లిదండ్రుల్ని ధిక్కరించినందుకు తామంతా తప్పుపడతామనుకున్నాడేమో. తమ
వివాహవిషయంలో తమ ఇష్టమే చెల్లాలని కోరే యువకులు ఎందరున్నారు? ఎన్నో బాసలు చేస్తారు. కలలు కంటారు. కోపగించి
కొన్నాళ్ళు తిండి తిప్పలు మానేస్తారు. కాని చివరకు తండ్రి గద్దింపో, తల్లి ముద్దింపో, ఆస్తి బద్దింపో, బంధువుల ప్రోత్సాహమో
ఏదో ఒకటి దిగ తీసేస్తుంది. చప్పబడి జీవితాన్ని ప్రవాహంలో వదిలేస్తారు. కొంతకాలం వెనుకటి ఆశలు మనస్సుల్ని ఎరియ
పెడతాయి. తరవాత మరిచిపోతారు. మంచి కీలక సమయంలో కాస్త మాట ఆసరా, చేయూత దొరికినవాళ్ళు తమ కోరికల్ని
ఫలింపచేసుకొంటున్నారు. తల్లిదండ్రులు అంగీకరించి చేసిన వివాహాలకన్న ధిక్కరించి చేసుకొన్నవి తక్కువ సుఖ పడడం లేదని
నిరూపించారు. బంధువులనీ, ఆస్తుల్నీ, స్వజనాన్నీ, సమాజాన్నీ కూడ ధిక్కరించి ఆశయాలకోసం ఎంతైనా త్యాగం చెయ్యగలరు.

కల్యాణి ఆలోచన ప్రకారం రాజగోపాలం ప్రస్తుతం ఆ పరిస్థితిలో వున్నాడు. తమకున్న పరిచయంలో తాను ఆ ఆసరా ఇవ్వడానికి
తగివున్నానని కూడ అనుకుంది.

కాని, అతడే ఆ అవకాశం ఇవ్వలేదు. వెనుకటికన్న ముందే ఇంట్లోంచి లేచిపోతున్నాడు. చాలా ఆలస్యంగా వస్తున్నాడు. అతడెందుకు
తప్పించుకు తిరుగుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. నాలుగు రోజుల అనంతరం ఒక సాయంకాలం అతడు డాక్టరు మంజులత యింట్లో తేనీటి
విందుకు హాజరయ్యాడు. ఆమె చెల్లెలు పరీక్ష ప్యాసయినందుకు టీ పార్టీ ఇచ్చింది. ఆశ్చర్యం, సంతోషం కలిగాయి.

"మా ఇంజనీరుగార్ని నువ్వెరుగుదువా?"

మంజులత కల్యాణి ఈడుదే, విశాఖపట్నంలో చదువుతున్నప్పట్నించీ ఇద్దరికీ స్నేహం వుంది. ఇప్పుడామెయే కళానికేతనం హైస్కూలుకు
వైద్య సలహాదారు. కల్యాణి కళానికేతనంలోనే పని చేస్తూంది.

"మీ ఇంజనీరంటే?"

మంజులత అనని మాటను వూహించుకొని కల్యాణి ముఖం జేవురించింది. మంజులత పరీక్షగా చూసింది. "ఏం కథ?"

కల్యాణి నవ్వింది.

"లేనిపోనివి వూహించుకోకు."

మంజులత ఆమెను తీసుకెళ్ళి రాజగోపాలం ముందు కూర్చో బెట్టింది.

"మీకూ నాకూ పరిచయం ఎల్లాగో మీరీవిడకు చెప్పండి."

రాజగోపాలం కంగారు పడ్డాడు. మంజులత పకపక నవ్వింది.

"మేమిద్దరమూ ఇంటరు కాకినాడలో చదివేము."

వారిద్దరినీ ఆ టేబులు వద్ద వదిలి మంజులత మిగిలిన అతిథుల్ని పలకరించడానికి వెళ్లిపోయింది.

వారం పదిరోజులుగా తాను కనబడకపోవడానికి ఏవేవో కల్పిత కారణాలతో క్షమాపణ పూర్తి చేసుకొనే వేళకు మనస్సు కుదుటపడింది.
తన తండ్రి మాటలను ఆమె వినలేదు. ఆ విశ్వాసం కుదిరాక అతడికి తన మనస్సులోని సంఘర్షణను చెప్పడం సులభమే అయింది.

"మా అమ్మ కన్నీళ్ళు చూస్తుంటే మన జీవితాల కింతే ననిపిస్తుంది. అనుకొన్నదేదీ జరగదు. జరగకపోతే కలిగే బాధను మనం
ఎరుగుదుంగనక మన తర్వాత తరాల వాళ్ళయినా మన ఆశయాలకనుగుణంగా నడుచుకోగల అవకాశం కల్పిద్దామనే దొక్కటే సంతృప్తి.
అదొక్కటే మనబాధకుపశాంతి."

అతని వాక్యాలతో కల్యాణి అంగీకారం చూపలేదు.

"మీరు జీవిస్తున్న పరిస్థితులే మీ తర్వాత తరం కాలంలోనూ వుంటాయనుకోకండి. భిన్న పరిస్థితులలో ఆశయాలుకూడా భిన్నంగానే
వుంటాయి. ఈనాడు మీరు సాధించలేకపోయాననుకునే ఆశయాలు ఆనాటివాళ్ళకి ఆచారాలే కావచ్చు."

"అదీ నిజమే."

"అందుచేత ఎవరి ఆశయాలను వారు కాపాడుకోవాలే గాని, భవిష్యత్తరాలకోసం..."

రాజగోపాలం వాదంకోసంకన్న తన మనస్సులోని ద్వైవిధ్యాన్ని వివరించడంకోసం ఎక్కువ బాధపడ్డాడు.

తన అన్నలకు లేని చదువు తనకు లభించడానికి తన తండ్రే కారణం. ఆయన తన అభివృధ్ధి కోరేడు. ఎంత డబ్బు కావాలన్నా
పంపించాడు. ఇప్పుడాయన మాటను తాను తోసేస్తుంటే ఎంతో బాధపడుతున్నాడు. తాను కాదంటున్న ఆయన మాటకూడా తన భవిష్యత్తును కోరి
చెప్పుతున్నదే. ఆయన కోరిక కూడా పెద్దదేం కాదు. వివాహం విషయంలో వచ్చింది పేచీ. కన్యను ఎన్నుకునే హక్కు తనకిచ్చాడు.
అయిష్టం అయిన సంబంధం చేసుకోమననన్నాడు. కట్నం వదలుకోవడానికి వొప్పుకున్నాడు. ఆయన కోరిందల్లా ఒక్క చిన్న విషయం.
చేసుకొనే పిల్లను తమ కులంలోంచే చేసుకోమంటారాయన. అది ఆయన నమ్మకం. నీకు ఫలానా కులం పిల్లను చేసుకోననే నియమం లేదు
కదా! ఏ కులం నుంచైనా చేసుకుంటావు. కనుక ఈ పిల్లను. మరో పిల్లను చూసుకోమన్నాడు. వాళ్లంతా మా కులం వాళ్ళే. అన్ని
కులాలలో మాదొకటి. ఆయన చెప్పిన సవరణకు ఎందుకు అంగీకరించకూడదు?

కల్యాణి అతనిని నిలవరించింది.

"వివాహం విషయంలో కులభేదాల్ని పాటించరాదనే మీ నియమం ఎందుకోసం?"

రాజగోపాలం ఆలోచించాడు.

"వివాహం ప్రేమ ప్రధానం కావాలి."

"బాగుంది. ప్రేమ అనేదెప్పుడూ ఏకవ్యక్తినిష్ఠం. ఫలానా వ్యక్తి తనకు కావాలనుకోవడమే కాదు. ఆ వ్యక్తి లభించకపోతే తన
బ్రతుకే లేదన్నంత తీవ్రమైన భావోద్వేగాన్నది కలిగిస్తుంది. అల్లాంటప్పుడు నాన్నగారి మాటకోసం లొంగిపోతున్నాననుకునే మనిషి
ప్రేమ ఎరగడని చెప్పాలి. అనుభూతిలో లేక కేవలం భావనా మాత్రంగా వున్నప్పుడు మాత్రంగా వున్నప్పుడు మాత్రమే మీరు
చెప్పినట్లు 'పోనీలే సర్దుకుపోదాం' అనుకోగలరు."

రాజగోపాలం ఏమీ అనలేకపోయాడు. తన మనస్సులో అటువంటి వుద్వేగమే వున్నదనీ, దాని మూలంగానే తండ్రిమాట కాదన్నాననీ
చెప్పలేకపోయాడు.

"మా అమ్మ. ఆమె కన్నీళ్ళు పెడుతూంది. అది చూస్తే బ్రతుకు మిద విరక్తి కలుగుతూంది. కేవలం నా స్వార్థం కోసం, నా సుఖం
కోసం కన్నతల్లిని ఏడిపిస్తున్నానే అనే బాధ కలుగుతూంది."

కాని స్వార్థం-నిస్స్వార్థం అనే మాటల కిక్కడ ప్రయోజనం లేదని కల్యాణి అభిప్రాయం.

"మీ అమ్మగారు కన్నీళ్ళు పెట్టవలసిందేమీ లేదు. తమ మాట ఏదో సాగలేదనే ఉడుకుబోతుతనం తప్పిస్తే......"

తల్లికి ఉడుకుబోతుతనం అన్న మాట రాజగోపాలానికి కష్టం అనిపించింది. చటుక్కున మాట తెంపేసేడు.

"ఇల్లాంటి సమస్యలు చర్చల్లో తేలవు. ఎవరి ఊహాశక్తిని బట్టి వారు పరిష్కరించుకోవలసిందే గాని...."

తానన్న ఏదో మాట అతనికి కష్టం కలిగించిందని కల్యాణి గ్రహించింది. బహుశా తల్లిని గురించిన ఆ వ్యాఖ్య రుచించకపోవచ్చు.
వెంటనే క్షమాపణ చెప్పుకొంది.

"క్షమించండి. మీ స్వంత వ్యవహారాలలో అధిక జోక్యం చూపించాననుకొంటా."



ఏడో ప్రకరణం


ఒక్క నిముషం ఉభయులూ మాటలేవీ తోచనట్లు కూర్చుండి పోయారు. కొత్త విషయంలోకి సంభాషణ మార్చడం ఎల్లాగో ఇద్దరకూ
తోచడంలేదు. అంతకంతకు ఆ నిశ్శబ్దం మెదడులోని ఆలోచనలను అణిచేస్తుంటే కుర్చీల్లో ముళ్ళమీదున్నట్లున్నారు. మంజులత రాక ఆ
సమయంలో దైవచోదితంగా కనబడింది. ఇద్దరి ప్రాణాలూ లేచివచ్చాయి.

"మాటా మంతీ లేకుండా కూర్చున్నారు. దెబ్బలాడుకున్నారా యేం?"

ఇద్దరూ వులికిపడ్డారు. కాని వారి సమాధానానికి ఆగకుండానే మజులత అటువైపుగా వచ్చిన చెల్లెల్ని పిలిచింది.

"మాయా?"

మాయ ఇరవై రెండేళ్ళ యువతి. ఆమె ఎం.ఎస్.సి. పాసయిన ఉత్సాహంలోనే మంజులత ఈ టీ పార్టీ ఇస్తుంది. మాయ యూనివర్సిటీ
ప్రథమురాలిగా రావడం ఆమెకెంతో సంతోషంగా వుందని పరిచయ వాక్యాలలోనే కల్యాణి గ్రహించింది. మాయ నభినందించింది.

"ఇంకేం చెయ్యాలనుకుంటున్నారు?"

మాయ సిగ్గుపడింది. ఆమె బదులు మంజులతే చెప్పింది.

"ఈ ఏడాది విశ్రాంతి తీసుకొంటుంది."

"నో, నో. ఏ రీసెర్చి ఇన్స్టిట్యూట్లోనో చేరి డాక్టరేట్ కు ప్రయత్నిస్తా."

మాయ కంఠంలో వూహించని కాఠిన్యం ఏదో వినబడి కల్యాణి వులికిపడింది. అంతవరకూ తాము చర్చిస్తున్న విషయమే మనస్సులో
మెదిలింది. వివాహ విషయమే ఇక్కడా అక్కచెల్లెళ్ళమధ్య ఘర్షణకు కారణం అయిందేమోననిపించింది. చదువుకొని సంపాదించుకుంటున్న
రాజగోపాలం, యూనివర్సిటీలో అగ్రశ్రేణిలో ప్యాసైన మాయ వివాహ విషయంలొ పరాధీనంగా వుండాలిసిందేనా? ఎవరో ఒకరు వారి
ఇష్టానిష్టాలను పాలించవలిసిందేనా? అనిపించింది.

కాని మంజులత అంత సులభంగా తన వోటమిని అంగీకరించలేదు. చెల్లెలి మాట కార్కశ్యాన్ని గుర్తించనట్లు నటించింది. నవ్వింది.

"పరీక్షలయి ఇంటికి వచ్చినప్పటినించీ నలతగానే వుంది. ఓ ఏడాది విశ్రాంతి తీసుకోమంటే జీవితం అంతా కొల్లబోయినట్లు బాధ
పడుతూంది."

మాయకూడా నవ్వేసినట్లే మాట్లాడినా దృఢంగానే తన మాటను చాటుకుంది.

"అబ్బ! ఈ డాక్టర్లొకళ్ళూ, జ్యోతిష్కులొకళ్ళూ- వీళ్ళ దగ్గరుంటే లేని రోగాలు వచ్చేటట్లు చేస్తారు. ఆటో-సజెషన్ ?
రాయిలా వుంటే చూడండి నలతగా వున్నానంటుంది. బాబోయ్! అక్కా! ప్రేమకీ, అభిమానానికీ కూడా ఓ హద్దు వుండాలే మాతల్లీ! అతి
అయితే భరించలేం."

డాక్టరు మంజులత నవ్వేసినా లోలోపల పళ్ళు కొరుకుతూందనిపించింది, కల్యాణికి. రాజగోపాలం లేచేడు.

"మీరూ వస్తున్నారా ఇంటికి?"

కల్యాణి సందేహించింది. ఒక్క పావుగంటక్రితం కలిగిన వైముఖ్యం నుంచి ఆమె ఇంకా తేరుకోనేలేదు. అతనితో కలిసి మూగిగా నడుస్తూ
వెళ్ళడంలో సొబగు కనిపించలేదు.

"మీరు నడుస్తూండండి."

రాజగోపాలం వెళ్ళిపోయాడు.

కల్యాణి చదువును గురించీ, కాలేజీనిగురించీ, స్నేహితులను గురించీ అనేకరకాల ప్రశ్నలువేసి మాయను సంభాషణలోకి దింపడానికి
ప్రయత్నించింది. కాని ఆమె ఏకాక్షర సమాధానాలను మించి పలకలేదు.

వున్నట్లుండి మంజులత "తిరపతి పోయొద్దాం. నువ్వుకూడా రా కల్యాణీ. ఇంకా సెలవులున్నాయికదా?" - అంది.

కల్యాణి వులికిపడింది. మాయ చిరునవ్వు నవ్వింది.

"మా అక్కకీ మధ్య మనుష్యులమీద విశ్వాసం పోతూంది."

"సమానాంతరం లొ మానవాతీత శక్తుల మీద విశ్వాసం పెరుగుతూందంటారా?"

ఇంతసేపటికి మాయను మాటల్లో పెట్టగల అంశం దొరికినందుకు కల్యాణి ఆనందించింది.

"మీరిక్కడున్నారు. కనక వినలేదు. కాని, మెయిన్ హాలులో ఒక పత్రికా సంపాదకుడు భగవంతుని మీద ప్రజలలో భక్తి
వ్యాపింపచేయవలసిన అవసరాన్ని గురించి ఒకటే...."

డాక్టరు మంజులత చెల్లెలి వంక ఘృణాపూర్వకంగా చూసింది.

"మనం జీవితంలో అన్నీ సాధించగలమనే ధీమా మన అల్ప జ్ఞానానికి చిహ్నం. నువ్వు ఎంత చదువు, ఎంత పరిశోధించు, నీ
పరిశోధనలకీ, చదువులకీ అందకుండా మిగిలిపోయిందింకా ఎంతో ఎంతెంతో మిగిలివుంటూనే వుంది...."

"దానికి మనం కొన్ని పిచ్చి ధోరణులు స్వయంగా తెచ్చిపెట్టుకోవాలని అర్థమా?"- అంది మాయ.

కల్యాణి విచారం ప్రకటిస్తూ డాక్టరు ముఖంలోకి చూసింది.

"ఈ వేళ తెనుగుదేశాన్ని వంద, రెండు వందల యేళ్ళ పూర్వానికి తీసుకుపోవాలనే ప్రయత్నం కసిగా చేస్తున్నారు కొందరు. రేడియో
తిప్పు, వేంకటేశ్వర సుప్రభాతం. పత్రిక తియ్యి, శిథిలం అయిపోతున్న దేవాలయోధ్ధరణకు విరాళాలు, వేంకటేశ్వరుడి ప్రత్యక్ష
మాహాత్మ్యపు కథలున్నూ. నవలలు తియ్యి, మహత్తర విజ్ఞానానికి గోరీ కట్టి పురాణ గాథల పునరన్వేషణలు. డాక్టరుగారూ!
మీది ప్రత్యక్ష ప్రమాణం మీద ఏర్పడిన శాస్త్రం. మీరూ...."

మంజులత ఏదో నిర్ణయానికి వచ్చినట్లు ముఖం పెట్టింది.

'''పోనీ వాళ్లందరూ ఛాందసులు గనక చేశారు. చెప్పేరు.' అనేసేస్తావు. కానీ, ఈ వేళ సమాజంలో కమ్యూనిస్టులు వంటి మొండి
నిరీశ్వరవాదులు కూడా దేవుణ్ణి కాదనకుండా ఉండగా...''

ఒక కమ్యూనిస్టు గృహం కట్టుకొని గృహప్రవేశంతోపాటు సత్యనారాయణ వ్రతం చేశాడు. మరొకాయన తిరుపతివెళ్లి భార్యతో సహా
ముండనం చేయించుకుని వచ్చాడు. సాంఘికంగా పూర్వాచారాలన్నీ తోసిపుచ్చిన వీర కమ్యూనిస్టు వనిత నేడు శివపూజ వేళ తప్పకుండా
చేస్తుంది. ఒకాయన భార్య క్రీస్తుకు కొలుపులు ప్రారంభించింది. కొడుకు చనిపోతే క్రీస్తులాగ మూడోరోజున లేస్తాడని ఆమె శవాన్ని
కదలనివ్వలేదు. తన వాదనల బలహీనతను కమ్ముకొనేటందుకు సాక్ష్యంగా ఆమె బోలెడన్ని ఉదాహరణలు, పేర్లు సంతరించింది.

''కమ్యూనిస్టులంటే మీకు ఇష్టం కాదే. మీరు వారినే సాక్ష్యం ఎందుకు తీసుకుంటున్నారు?''

కల్యాణికి ఆశ్చర్యమే కలిగింది. కానీ, మాయ తెలిపిన అభ్యంతరం వేరు.

''కమ్యూనిస్టుల్లో నువ్వు చెప్పిన పనులు జరిగే ఉండొచ్చు. అందరూ మీ వెంకటేశ్వరుల్నో, క్రీస్తునో, మరో దేవుడినో
స్వీకరించారని చెప్పలేవు కదా?''

''ఈ చర్యల్ని ఆ పార్టీ ఖండించలేదు. నిషేధించలేదు. కనుక ఆమోదించినట్లే భావించాలి.''

మాయ సర్దుకొంది.

''నేను వాళ్ల తరఫున వకాల్తా పుచ్చుకోలేదు. నీ ప్రశ్నకి సమాధానం వాళ్లనే చెప్పుకోనీ. ఒకవేళ వాళ్లకి నీ వాదనలే
నచ్చినా.. భగవంతుడి అస్తిత్వం నిరూపించబడదు. విజ్ఞాన శాస్త్రాలు బుట్టకెక్కవు''

కల్యాణి ఆలోచించింది.

''మా అన్న ఓ కమ్యూనిస్టు. మా వదిన సాయి భజన చేస్తుంది. అది మత స్వేచ్ఛను అమలు జరపడమనీ, శాంతియుత
సహజీవన సూత్రాన్ని ఇంట్లోంచి అమలు జరిపి చూపిస్తూన్నాననీ మా వాడి పరితృప్తి,

పదేళ్ల క్రితం ఆ వదినే మా అందరికీ నిరీశ్వరతత్వం బోధించింది. కానీ, ఈ వేళ ఇల్లా ఎందుకయింది? తన కొడుకు పరీక్ష
పాసైతే మూలేశ్వరుడి గుళ్లో కొబ్బరికాయలు కొట్టించింది. మగడు లంఖణం చేస్తే మార్కండేయ స్వామికి మొక్కుకుంది. ఇదంతా
ఎందుకొచ్చిందీ? ఎల్లా వచ్చిందీ? అని మా అన్నే ఆశ్చర్యపడతాడు. శాస్త్రవిజ్ఞానం, తార్కిక దృష్టీ, పట్టుదలా చూపడం
తగ్గేసరికి ఫలితం ఏమయింది? వాళ్లననుసరించినవాళ్లే ఈ వేళ ఎన్నో మూర్ఖాచారాలు సాగిస్తున్నారు. కానీ, డాక్టరు గారూ!
విశ్వాసం ఒక్కటీ చాలదు. దానిని కనీసం కొంతవరకయినా అమలు జరిపే ఆలోచన ఉండాలి. కమ్యూనిస్టులైనా అంతే. కాకున్నా
అంతే..''

''నిరీశ్వరతత్వం బోధించిన నాటికన్నా మీ వదిన పదేళ్లు పెరిగింది. ఆ పదేళ్లలో సత్య పరిజ్ఞానం కూడా కలిగిందని యెందుకు
భావించకూడదు?''

''మీ అన్నయ్యని నేనొక విధంగా అర్థం చేసుకుంటున్నా. ఆయన సహించకపోతే ఇంట్లో అడుగడుక్కీ పేచీ. కొట్లాట. ఆమె చేసే
దానిని సహించకపోతే భార్యను కొట్టాలి. వదిలేయాలి. అదిమాత్రం వాంఛనీయమా?''... అని మాయ తానెరగని భాస్కరాన్ని
సమర్థించింది.

కల్యాణి ఆమెను పుచ్చిపోయేలా చూసింది.

''ఆడవాళ్లు మూర్ఖులూ, పెంకివాళ్లూ అనే సదభిప్రాయం...''

''తమ మూర్ఖత్వం గ్రహించిన వాళ్లెవరూ మూర్ఖులు కారు''



ఎనిమిదో ప్రకరణం


పనిలో ఉండగా ఫోన్‌ మీద ఎవరో పిలుస్తున్నారనే కబురు వచ్చింది. రాజగోపాలం హడావిడిగా వచ్చాడు.

డాక్టర్‌ మంజులత తన్ను తిరుపతికి రమ్మని పిలుస్తూంది.

''ఏమిటా హడావిడి?''

''వెళ్లాలనిపించింది. కారు వీధిలో పెట్టా''

సెలవు దొరకడం, బట్టలు చాకలి వద్ద ఉండడం, దేవుడి మీద నమ్మకం లేకపోవడంలాంటివేమీ మంజులత ఉత్సాహాన్ని ఆపలేదు.
అతనికి తప్పించుకొనేటందుకు దారి దొరకలేదు.

''ఏమిటీ హఠాత్తుగా నేనెందుకు జ్ఞాపకం వచ్చాను?''

మంజులత దానికి కారణాలు వేళ్లు మడుస్తూ ఏకరవు పెట్టింది.

ఒకటి మగాడివి.

రెండు నాతో చదువుకొన్నావు.

మూడు కారు డ్రైవు చేయగలవు.

''దాని అర్థం డ్రైవరు రావడం లేదన్నమాట''

''లేదు''

''మాయ?''

''ఊహూ''

''కల్యాణి టీచర్ని తీసుకెడదాం''

''ఒకటి చెప్పు?''

''కానీ....''

''నిన్ను నేను పిలవడానికి కారణం అడిగేవు కాదూ!''

''ఆ...''

''కల్యాణి టీచర్ని పిలవమనడానికేమిటి కారణం?''

రాజగోపాలం సమాధానం చెప్పలేకపోయాడు. మంజులత నవ్వింది.

''నాకు కావాల్సింది నువ్వు''

రాజగోపాలం ఏమీ అనలేకపోయాడు. ఆఖరు ప్రయత్నంగా భోజనం మాట ఎత్తేడు.

''దాని అర్థం నీకు రావడం ఇష్టం లేదు. అంటే నేను ఎందుకు వెళ్తున్నానో నీకులు తెలుసు. ఆ అవసరం కలిగించడంలో
కారణభూతులైనవారిలో నువ్వొక్కడివని నాకు తెలుసు. అది నీకు తెలుసు. అంతేనా?''

''అంటే...?''

''మాయ వూళ్లోలేదు''

రాజగోపాలానికి ఆశ్చర్యం కలిగింది. మాయ భయపడినదే జరుగుతూంది. తాను చేతిగాజులమ్మి ఆరువందల రూపాయలు తెచ్చి ఇచ్చిన
విషయం మంజులతకు ఎలా తెలిసిందో? ఆమెకు తెలియకుండా చేయాలనే మాయ తనకు ఆ పని అప్పగించింది. కానీ, ఆ రహస్యం
బయటపడింది. ఆవలివైపు నుంచి మంజులత ప్రశ్నిస్తూ ఉంది.

''ఔనా కాదా?''

''నీ ప్రశ్న నాకు అర్థం కాలేదు''

''మాయకు డబ్బెక్కడిది?''

''నీ అంత అప్పగారు ఉండగా.. ఆమెకు డబ్బులోపమెందుకుంటుంది?''

''అదో ఎత్తిపొడుపా?''

''అల్లా ఎందుకనుకొంటావు?''

''దాని చేతిగాజులు నువ్వు అమ్మిపెట్టలేదూ?''

రాజగోపాలం నవ్వేడు. త్రోసివేసేడు.

''ఎంత గంద్రగోళంలో పెట్టావు మంజులతా? మరో వస్తువుకు మార్చివేయడానికి ఎంత కథ కల్పించేవు?''

మంజులత లక్ష ప్రశ్నలు వేసింది.

మార్చి ఏం తీసుకొంది? నన్ను తీసుకెడితే మరో పాతికో, పరకో పడ్డా వేద్దును కదా? ఆ పనికి నిన్నే ఎందుకు నియమించింది? ఆ
విధమైన ఘట్టం వచ్చినప్పుడు నాతో ఎందుకు చెప్పేవు కాదు?

''నేనింత ఆలోచించలేదు మంజులతా!'' ....... అనేదొక్కటే ఆ ప్రశ్నలన్నింటికీ అతడిచ్చిన సమాధానం.

''అదిప్పుడో సన్యాసిని...''

''ఇప్పుడు సన్యాసం పుచ్చుకొందామన్నా ఇచ్చేవాళ్లెవరున్నారు?''

''అతి తెలివి చూపకు''

రాజగోపాలం నవ్వుకొన్నాడు.

''ఆ 'ని' ద్వితీయా విభక్తి ప్రత్యయం అన్నమాట. సరే''

''పెళ్లి చేసుకొనేటందుకు తిరుపతి వెళ్లింది''

''అది నిలిపేటందుకు నువ్వు తిరుపతి....?''

అసలు విషయం ఎరిగిన రాజగోపాలం ఒక్క నిట్టూర్పు తీసుకున్నాడు.

''ఉద్యోగంలో స్థిరపడేవరకూ నువ్వు పెళ్లి కూడదంటావు''. అంది మంజులత.

''నా మాటకు ప్రపంచం ఎంత విలువ ఇస్తుందో పరీక్షకి పెట్టాలంటావు''

''పోనీ అల్లాగే అను''

మరో పదిహేను నిమిషాల్లో న్యూబ్రిడ్జి వద్ద మంజులత కారును అందుకొన్నాడు.

అప్పటికే సాయంకాలం అవుతోంది.

''గుంటూరులో భోజనం చేద్దాం''

''నిద్ర?''

''దారిలో, ట్రావెలర్సు బంగళాలో''

''అచ్చా...!''

స్టీరింగ్‌ కిందినుంచి జరిగి మంజులత అతనికి చోటునిచ్చింది. ఆమె స్థానంలోకి రాజగోపాలం జరిగేడు. కీ యిచ్చివదిలిన
టాయ్‌కారులాగా సిమెంటు రోడ్డు మీద కారు జరజర పరుగెత్తింది.

గుంటూరు వెళ్లేసరికి సన్నని తుంపర ప్రారంభమైంది.

''పెట్రోలు సంగతి చూడు''

మొట్టమొదట కనబడిన బంక్‌ వద్ద కారు నిలిపేడు. కీపరువచ్చి ట్యాంకు నింపేడు. మరో రెండు టిన్నులకు పట్టి లగేజీ
బాక్సులో పెట్టాడు.

మరలా హోటలు వద్ద కారాగింది. ఇద్దరూ భోజనం చేసి వచ్చారు.

''చలిగా ఉంది. ఫ్లాస్కులోకి పాలు తీసుకో''

సర్వరు ఫ్లాస్కు తెచ్చి అందించాడు. బుట్టలో ఇన్ని పళ్లు తీసుకొంది.

''నడు''

''చీకటి, వర్షం. నాకు దారి తెలియదు. ఈ వేళప్పుడు వెళ్లక తప్పదంటావా?''

మంజులత ఏమీ మాట్లాడలేదు. తనవైపున్న తలుపు సరిగ్గా పడిందో లేదో చూసుకుంది. 'విండో స్క్రీన్' బిగించింది. రాజగోపాలం కారు
కదిపాడు.

ఊరు దాటినతర్వాత మంజులతే ప్రారంభించింది.

''ఇదివరలో ఆడవాళ్లను అర్థం చేసుకోవడం కష్టమనేవారు. బహుశా ఇప్పుడు మగాళ్లని అర్థం చేసుకోవడం కష్టం అవుతోంది.''

రాజగోపాలం ముఖాన విరిసిన చిరునవ్వు కారులో ఉన్న ఆ చీకట్లో మంజులత చూడగలగడం సాధ్యం కాదు.

''మగ-ఆడ అని కాదు. అసలు ఒక మనిషిని మరో మనిషి అర్థం చేసుకోవడం ఎప్పుడు సాధ్యమైంది? ఏ క్షణంలోనైనా ఒకడు
రెండో వాణ్ణి ఏదో ఒక కోణం నుంచే చూడగలుగుతారు. ఆ కోణం చూసే మనిషియొక్క తక్షణ ప్రయోజనాన్నిబట్టి ఉంటుంది. ఆ
ప్రయోజనాన్ని గుర్తించిన రెండో వాడు ఎప్పుడూ హెచ్చరికగానే ఉంటాడు.''

''అర్థం కారని తెలిసినా ఆడ-మగ ఒకరినొకరు ఆరాధ్య దేవతలుగానే భావిస్తున్నారు. అర్థం కాకపోవడం ఆరాధనకి
అవసరమేమో...''

''రెండోవారి సాన్నిహిత్యం వల్ల స్త్రీపురుషుల్లో అనుభూతం అయ్యే మానసికోన్నతిని గుర్తించగలగడం ఆరాధనకు మూలం''

''అదోరకమైన పిచ్చి, నిషా, కవితాపరిభాషలో అమృతత్వపు అనుభూతే అంటే అననీ. దానికంతకన్నా పెద్దమాట....''

''మనిషి జీవితం బహుముఖం. స్త్రీ-పురుష సంబంధం, అతని జీవితంలో ఒక ముఖం మాత్రమే. అదొక ప్రధానమైన భాగంకూడాను.
అందుచేతనే ఆ అనుభూతి ఒక నిషాలాంటిది. ఆ అమృతత్వం మనకు అనుభూతం కానేకాదు. దానిలో నిషా ఉండదు. అదో పిచ్చీ
కాజాలదు''

కారు ఒక రోడ్డు కూడలివద్దకు వచ్చింది. కూడలిలో ఉన్న టీస్టాల్‌లో ఒక బల్లమీద ఇద్దరు ముగ్గురు మగవాళ్లు
కూర్చుండి ఉన్నారు. వారికెదురుగా నిట్రాటనానుకొని ఒక ఇరవయ్యేళ్ళ పడుచు నిల్చుని కబుర్లు చెప్తూంది. మగవాళ్ల ముఖాలు
అక్కడున్న పెట్రోమాక్సులైటు వెలుతుర్లో దేనికో నిరీక్షిస్తున్నట్లు కనబడుతున్నాయి. రాజగోపాలం కారు ఆపేడు. మగవాళ్లిద్దరు
గబగబ బయటకు వచ్చారు. ఈలోపున లోనున్నవాడు కళ్లతోనే ఆమెతో ఏమో మాట్లాడాడు. ఆమె వేళ్లు కదిపింది. తల తిప్పింది.
అదంతా మంజులత కారులోంచి చూస్తూనే ఉంది.

రాజగోపాలం వారినుంచి తాను పోవాల్సిన రోడ్డును గురించి తెలుసుకుని మరల బయలుదేరాడు. టీ స్టాల్‌ పాకలో జరుగుతున్న
ఘట్టాన్ని గురించే ఆలోచిస్తూ మంజులత చాలా సేపటివరకు ఏమీ మాటాడలేదు. చివరకు మాట్లాడినప్పుడు కూడా ఆ విషయమే మనస్సులో
మెదులుతూంది.

''మనుష్యుడు నీతిని, నైతిక ప్రవర్తననూ, ధర్మాన్నీ ఎన్నడూ లెక్కచేయలేదు. మనుష్యుడే కాదు. మన దేవతలూ అంతే.
దేహావసరాలకి ఉదాత్తత కల్పించేందుకు చేసే ప్రయత్నాలలో ఆడుది దేవత అవుతుందా? మగాడు దేవుడు అవుతాడా?''

ఎదురుగా వస్తున్న లారీ హెడ్‌లైట్ల కాంతికి కళ్లు జిగేల్మంటూంటే రాజగోపాలం కారునడక మందగింపజేశాడు. అతడిస్తున్న
సిగ్నల్సును లెక్కచేయకుండా లారీవాడు పూర్తి హెడ్‌లైట్ల కాంతిలో, గమనవేగం తగ్గించకుండా బుర్రున దూసుకుపోయాడు.

''స్కౌండ్రల్స్‌!''

రాజగోపాలం మరలా రోడ్డుమీదకు కారును తెచ్చేడు. తెగిపోయిన సంభాషణను మరలా అందుకొన్నాడు.

''సహస్ర నామార్చన భగవంతుడి అస్తిత్వాన్నీ, ఆరాధన స్త్రీపురుషుల్లో దైవత్వాన్నీ సృష్టించగలిగితే.. మరి
సాధ్యంకానిదేముంది?''

టీ స్టాల్‌లో కనబడిన యువతిని ఆ పురుషులు దేవతగా భావిస్తున్నారో.. నేలకు అడ్డంగా భావిస్తున్నారో ఊహించేందుకు
ప్రయత్నిస్తూంది మంజులత.



తొమ్మిదో ప్రకరణం


ట్రావెలర్సు బంగళావద్ద రెండు కార్లు కనబడేసరికి మంజులత నిరుత్సాహం ప్రకటించింది.

''చచ్చాం. ఖాళీలేదుకాబోలు''

మరో కారువచ్చి గుమ్మంలో నిలబడగానే కొత్తగా వచ్చినవారెవ్వరో చూడ్డానికి వచ్చినట్లు ఒక బంట్రోతు హాజరయ్యాడు.

''ఏమన్నా ఖాళీలున్నాయా?''

ఆడగొంతుక వినబడి లోనుంచి ఎవరో కేకకవేశారు.

''ఎవర్రా వచ్చింది?''

''ఏం తాగివున్నాడా? అలా అరుస్తున్నాడు?''

మంజులత ప్రశ్నకు బంట్రోతు సమాధానం చెప్పగల స్థితిలో లేడు.

రాజగోపాలం తలుపు తీసుకొని బయటకు అడుగుపెట్టాడు.

''నేను చూసివస్తా వుండు''

అతడు గబగబా మెట్లు ఎక్కి హాలులోకి వెళ్లాడు. పడక కుర్చీలలో అర్ధశాయిలై ఉన్నవారిలో ఒకరు తనకు పరిచితుడే. ఆయన
బెజవాడలో వకీలు. రెండో వ్యక్తి కొత్తవాడు. వకీలుకు ప్రాక్టీసుకన్న ఆస్తుల మీద ఆదాయం హెచ్చు. పార్టీమీద కన్న
ప్రజాసంక్షేమ కార్యాలుంటే అందులోనూ మహిళల అభివృద్ధికి సంబంధించిన పనులయెడ అధికోత్సాహం చూపుతాడు. స్త్రీల అభివృద్ధికీ,
పరిరక్షణకూ, సంక్షేమానికీ ప్రభుత్వం స్థాపించిన సంస్థలన్నింటితో ఆయనకు పరిచయం వుంది. అయితే ఆ సంస్థలకు చెందిన
మహిళామణుల్ని ఆయన ఒకమారు తన ఇంటికి ఆహ్వానించాడనీ, అప్పుడాయన భార్య పెద్ద రభస చేసిందనీ చెప్పుకొంటారు. ఆయన
నైతిక ప్రవర్తన మంచిది కాదంటారు. కానీ, ఆయన అభిప్రాయం ఆ విషయంలో కేవలం భిన్నం.

''పెళ్లయింతర్వాత ఆడవాళ్లకి అంగోస్త్రం చుట్టబెట్టే స్వభావం అలవడుతుంది.'' - అనేది ఆయన వ్యాఖ్య.

వకీలు వెంకట్రావు తనను ఎరగడు. సాధికారంగా ప్రశ్నించేడు.

''ఎవరు మీరు? బంగళా అంతా 'ఆక్యుపై' అయిఉంది''

''బంగళా ఎట్టెండరుకోసం వెతుకుతున్నా''

వకీలు గాంభీర్యం తగ్గలేదు.

''నే చెబుతున్నాగా''

రాజగోపాలానికి చిర్రపుట్టింది.

''ఎట్టెండరు నువ్వా, ఓయినీ... ఏం వేషం వేస్తున్నావోయ్‌...''

వకీలు వెంకట్రావ్‌ ఒక్కక్షణం ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. అతని పక్కనున్న అతడు రాజగోపాలం దూకుడు చూసి
సర్దుబాటు చేయడానికి పూనుకొన్నాడు.

''కొత్తవాళ్లతో మాట్లాడేపద్ధతి నేర్చుకోలేకపోతే చాలా ఇబ్బందులున్నాయి'' అంటూ రాజగోపాలం నెమ్మదిగా కలహం నుంచి
తప్పించుకొన్నాడు.

కలహం తప్పినా బంగళాలో ఆశ్రయం దొరకలేదు. ఒక గదిలో మహిళా సంక్షేమ శాఖలో ఉద్యోగం చేస్తున్నావిడ ఉంది. వేరొక గదిలో
ఆ శాఖలోనే పనిచేస్తున్న మరొకావిడ ఉంది. తిరుపతి నుంచి తిరిగి వస్తూ వకీలు వెంకట్రావు, అతని స్నేహితుడూ చీకటి పడడం
చేత బంగళాలో ఆగారు. వారు మధ్యహాలునాక్రమించారు.

రాజగోపాలం పరిస్థితి అర్థం చేసుకున్నాడు. మంజులతతో సంప్రదించేడు.

''కారులోనే పడుకోలేవూ?''

మంజులత వెనకసీటులో ఉన్న సామానులు సర్దుకుని పడుకుంది. కారును ఆవరణలో ఉన్న ఒక చెట్టుకిందకు చేర్చి రాజగోపాలం బండి
లోనే కూర్చుండిపోయాడు. అప్పటికి సన్నచినుకు దట్టమై వర్షం ప్రారంభమైంది. పైన చల్లగా ఉన్నా కారులోపల చాలా ఉక్కగా
ఉంది.

''మనం అరుగుమీద వేద్దాం పక్క'' అంది మంజులత.

''మావూళ్లో ఒకాయన ఉండేవాడు. ఆయన చిన్నతనంలో ఒకప్పుడు పొలాలవెంట వెడుతూ అనాలోచితంగా జంటకూడుతున్న గుర్రాలను
సమీపించాడట. మరుక్షణంలో చుట్టుపక్కల పొలాలలో ఉన్న రైతులంతా కర్రలతో పరుగెత్తి వచ్చి, గుర్రం నోటిలోంచి ఆయన్ని
బయటకు లాగేరు. ఆ అశ్వ ప్రణయానికి చిహ్నంగా ఆయన చేయి మొండి అయిపోయింది.''

మంజులత నవ్వింది.

''వాళ్ల ప్రణయ కలాపాలకు మనం...''

''సందేహం ఏం ఉంది?''

కాని మంజులతా, రాజగోపాలం వీధి వరండాలో పక్కవేయడం ఎవరికీ ఏవిధమైన ఆటంకం కలిగినట్లు అనిపించలేదు.

ఓ రాత్రివేళ గదులన్నీ ఖాళీచేసి, జనం రెండు కార్లలో వెళ్లిపోయారు.

''మనం కూడా పోదామా?'' .... అప్పటికి ఒంటిగంటే అయ్యింది. మంజులత అంగీకరించలేదు.

''అటెండర్‌ని పిలిచి ఒక గది బాగుచేయమను. వేణ్నీళ్లు పెట్టించు''

''స్నానం అవీ అయ్యేవరకు ఆలస్యమవుతుందేమో''

రాజగోపాలం ఆ పనులు పురమాయించి మరల పడకేశాడు. లోపల పోతుగుర్రాలున్నంత వరకు అతడు నిర్లక్ష్యంగా నిద్రపోలేకపోయాడు.
డాక్టర్‌ మంజులతను అవమానానికి గురి అయ్యే స్థితికి వదలడం అతను ఊహించనూ లేకపోయాడు. అందుచేత అతడంతవరకు
ఆదమరిచి నిద్రపోలేదు. ఇప్పుడా భయం తీరింది. ఒళ్ళెరగని నిద్రపట్టింది.

తెల్లవారకముందే మంజులత స్నానాదికం పూర్తిచేసి రాజగోపాలం పడుకున్న చోటుకు వచ్చింది. అతడతిప్రశాతంగా నిద్రపోతూఉన్నాడు.
లేపడానికి మనసొప్పలేదు. కాని, తమ ప్రయాణం తొందరిస్తూంది.

''గోపాలం!''

అతడు కళ్లు తెరిచేడు. ఎదురుగా కూర్చుని తన భుజం మీద చేయివేసి తట్టుతున్న ఆమెవైపు చూసి చిరునవ్వునవ్వేడు. అతడు
కళ్లు తెరవడం చూసి ఆమె లేచి నిలబడింది.

''లే...''

ఆమె చేయిచాచింది. అలవోకగా ఆమె వేళ్లు అందుకుని అతడొక్క వూపులో లేచి నిలబడ్డాడు. లేవడం ఆలస్యమైనందుకు సంజాయిషీ
చెప్పుకొన్నాడు.

''వాళ్లు వెళ్లిపోయే వరకూ నిద్రే పట్టలేదు.''

''ఆ ప్రణయకాండ అంత రసవత్తరంగా వుందా?''

ఒక పడుచు ఒక మగవాడితో ఆ తీరున ప్రసంగించటం అతనికి కొత్తగా ఉంది. కళ్లు విప్పార్చి చూశాడు. మంజులత గ్రహించింది.

''నీకు మెడికల్‌ కాలేజీల జీవితం అనుభూతం కాదు. అక్కడికెళ్ళేక 'ఫైనర్‌ సెంటిమెంట్స్' నిర్మూలం
అయిపోతాయి. మాటల్లో, చేతల్లో మోటుతనం, నిర్లజ్జత మప్పడానికి లెక్చరర్ల దగ్గరినుంచి గట్టి ప్రయత్నాలు చేస్తారు''

రాజగోపాలం ఏమీ అనలేదు. ఒక్క నిమిషం పోయాక మంజులతే ప్రశ్నించింది.

''బహుశా ఆ గదిలోంచో, ఈ గదిలోంచో తమరిని రక్షించాలని అరుపులు వినిపిస్తాయని, ఓ దుడ్డుకర్రతో సహా రెడీగా ఉండి
ఉంటావు. కానీ, అల్లాంటివేమీ లేకుండా 'మానభంగాలు' అతి ప్రశాంతంగా జరిగిపోయాయి. బహుశా నీ భారతీయత ఆ పరిస్థితికి చాలా
పరితాప పడుతూండి ఉంటుంది.''

రాజగోపాలం చిరునవ్వు నవ్వేడు.

''మగాళ్లు కుక్కలనీ, పందులనీ నువ్వు తిట్టలేదు. అందుకు సంతోషంగానే ఉంది''

మంజులత ఆలోచనలో పడింది. రాజగోపాలం త్వరగా తన పనులు ముగించుకువచ్చాడు. అట్టెండరు కాచి తెచ్చిన పాలకప్పుల ప్రక్క,
తాను వచ్చేటప్పుడు గుర్తుంచుకుని తెచ్చిన బిస్కట్లు పెట్టి ఆమె కూర్చుని వుంది.

''పెద్ద ప్రయత్నమే చేశావే?''

మంజులత ఒక అరగంట క్రితం వదిలిన సంభాషణను అందుకొంది.

''మగవాణ్ణి పంది అనీ, కుక్క అనీ తిట్టలేదేమన్నావు. అందరూ తిట్టేదే నేనూ అనడం అనవసరం. పైగా జాగ్రత్తగా
ఆలోచిస్తే ఈ వేళ మగవాడు తన మనస్తత్వానికి తగిన ఫలితాన్ని పదహారణాలా అనుభవిస్తున్నాడు.''

''ఒక్కటి మరిచిపోవద్దు. మగవాడిలో ఉన్నదొక మగతనమేకాదు. అది అతని స్వయంవ్యక్త లక్షణం. మరొకటుంది. చొరవ
తీసుకొని ప్రపంచం అంతా తనదేననే మొండితనంగా అడ్డుపడే స్వభావం. అది సమాజంలో అతనికున్న స్థానాన్ని పట్టి సంక్రమించిన
లక్షణం. మీ ఆడవాళ్లు మొదటిదానిని కోరుతారు. రెండో దాని ఫలితాన్ని అనుభవిస్తారు''

''సరిగ్గా నేచెప్పదలచుకొన్నదదే. ఔనుగానీ, ఆడ-మగ ఒకరినొకరు కోరుకోవడం తప్పంటావేమిటి?''

''ప్రతి ఆటకీ కొన్ని నియమాలుంటాయి. ఆ నియమాలు వదిలేస్తే ఆ ఆటే లేదు. అంతే ఇదీను.''

''ఎగ్జాక్ట్‌లీ! ఆటపాటలు మనుష్య సంకల్పితాలు. కనుక వాటికి నియమాలుంటాయి. స్త్రీపురుష సంబంధాలు
దైవనిర్ణీతాలు. ప్రకృతి సహజం. వాటికి మనుష్యుడు కొన్ని నియమాలను జతచేశాడు. ఆ నియామాలను మగాడు లెక్కచేయలేదు. ఆడదేం
చేయలేక వానిని కుక్కా-పందీ అని తిట్టింది. ఇప్పుడు తిట్టవలసిన పనేముంది? తానుకూడా సమవుజ్జీగా నిలబడింది''

''అవినీతిలోనా?''

''అందరూ కాదన్నదానిని ఒకడు చేస్తే అవినీతి. అందరూ ఒప్పుకొన్నదీ నీతే''

రాజగోపాలానికది మింగుడుపడినట్లు తోచలేదు. కిటికీలోంచి చూస్తుంటే తమ కారు వెనక ఎవరో ఉన్నట్లు కనిపించింది. కారులో సామాను
ఎవరన్నా తస్కరించడం లేదుకదా? తల బయటకు పెట్టాడు.

''ఎవరా కారుదగ్గర?''

ఒక పాతికేళ్ల పడుచు వికవికలాడుతూ తొంగిచూసింది. రాజగోపాలం ఆమెనక్కడి నుంచి పొమ్మన్నాడు. ఆమె ముఖాన నవ్వు మిగలలేదు.
కోపంగా తప్పుకొని కొంచెం అవతలగా అతనికి కనబడేలా గోడనానుకొని నిలబడింది.

రాజగోపాలం మాట్లాడుతూ... మాట్లాడుతూ ఒకటి రెండు మాట్లు తిరిగి చూశాడు. మంజులత ప్రశ్నించింది.

''ఆవిడ కన్ను-ముక్కు తీరు బాగుంది కదూ!''

రాజగోపాలం అంగీకరించాడు.

''అందమైన విగ్రహం''

''ఇక్కడ నీ మనస్సులో ప్రతిబింబిస్తున్నది మగతనం అంటావా? సమాజం ద్వారా సంక్రమించిన చొరవంటావా?''

''రెండూ కొద్దోగొప్పో కలిసివుండొచ్చు''అన్నాడు రాజగోపాలం ఆలోచిస్తూ.

''ఆమె స్థితి కూడా కొంచెం ఇంచుమించు అదే. ఉన్న తేడా ఒక్కటి. ఆమెలో స్త్రీత్వపు ఆకాంక్షకన్నా చొరవ ప్రముఖంగా
వుంది.''

రాజగోపాలం ఆశ్చర్యంగా ఆమెవంక చూశాడు. మంజులత త్రాగుతున్న కప్పు క్రింద పెట్టేసి లేచింది.

''గతంలో లేనిదీ, ప్రస్తుతం ఆడుదానికి లభించినదీ సంపాదించుకొనే అధికారమూ, అవకాశమున్నూ. తల్లిదండ్రులు ఒప్పుకొంటున్నారు.
భర్తలు ప్రోత్సహిస్తున్నారు. కానీ, రెండోవైపున ఇందాక నువ్వు చెప్పావే... సమాజంలో వారికున్న స్థానం ఇచ్చిన చొరవ అని,
దానిని ఈ వేళ ఆడదానికీ ఇచ్చారు. ఏమంటే మగవాడికున్న స్థానం ఆర్థిక మూలం. ఆడదానికి ఆ స్థానం లభ్యమైంది. అందుచేత
దాని చొరవకు కావలసిన పూర్వరంగం ఏర్పడింది. మరి మగాడికి మిగిలిందేమిటి? తరాల తరబడి నేర్చుకొన్న మెలకువలూ,
కూర్చుకొన్న హంగులూను.''

''మంజులతా! కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు చేశామంటే బాగానే వుండొచ్చు. కాని...''

''సమాజం ఏమవుతుందని నీ భయం. ఏమీ అవ్వదు. మనం కొత్త నియమాలూ, నీతులూ ఏర్పాటు చేసుకొంటాం. మళ్లీ మామూలుగా
సాగిపోతుంది. అయితే ఒక్కటి. ఒక్కళ్లనే అంటిపెట్టుకొని 'యావజ్జీవం హోష్యామి' అనుకోడానికి గతంలో ధర్మం కారణం చేశారు.
ఈనాడు ప్రేమ అంటున్నారు. దాని వెనకనున్న నిర్బంధం ఒక్కటే...''

రాజగోపాలం అడ్డుపడ్డాడు.

''ధర్మం అన్నది నిర్బంధం వల్ల అంటగట్టింది కావొచ్చు. కానీ, ప్రేమ అలాకాదు. ఇక్కడ స్త్రీపురుషుల ఇష్టం, అనిష్టం
ప్రేమకు మూలం. ప్రతిషేధకం అవుతూంది. ఇష్టాపూర్తిగా తెచ్చుకొన్నది నిర్బంధం ఎలా అవుతుంది?''

''నీ ధర్మం కానీ, ప్రేమ కానీ దాంపత్య సంబంధాల్ని ఒక నియమంలోకి తేవడం కోసమే. ఏ నియమం లేని దాంపత్య సంబంధాలు
ప్రకృతి సిద్ధాలు. పశుపక్ష్యాదులున్నాయి. మనం తయారుచేసుకుని చెండనాడుకొనే నియమాలేవీ వానికి లేవు. అవసరం కలిగినప్పుడు
ఎదుట వున్నదానితో కలుస్తుంది. ఆ అవసరం ఏమిటి? సంతానావసరం. ఆ జ్ఞానం వానికి లేకపోవచ్చు. కానీ, ఆ అవసరమే
వానిలో ఆ చైతన్యాన్ని ఉద్బుద్ధం చేస్తుంది. ఆ అవసరాన్ని తీర్చలేనికాలంలో దానికాస్మరణే ఉండదు. మానవుడు
భగవన్నిర్మితమైన ఈ స్వేచ్ఛా ప్రపంచాన్ని తలకిందులు చేశాడు. ఫలితంగా భయంకరమైన గంద్రగోళం ఏర్పడింది. అందుకే
బతకలేడు. దానినుంచి బయటపడలేడు. బయట పడడం కోసం మరింత గంద్రగోళం కల్పించుకున్నాడు. ఆ ఎక్కువ గంద్రగోళాన్ని
అభివృద్ధి అని అనుకొంటున్నాడు. అనుకోనీ... కానీ... ఆ అభివృద్ధినికూడా అట్టే రోజులు హరాయించుకోలేడు...''

రాజగోపాలం ఆమె ధోరణిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించేడు. అడ్డు ప్రశ్నలు వేశాడు. మళ్ళీమళ్ళీ చెప్పించాడు. చిట్టచివరకు
ఆమె వాదనలకూ, ప్రశ్నలకూ పూర్తి సమాధానం ఇవ్వగల జ్ఞానం తనకు లేదన్నాడు.

''నువ్వు అనేకరకాల సమస్యలు తెచ్చావు. సమాజ నిర్మాణానికి సంబంధించినవి కొన్ని. సామాజిక ఆలోచనలకు సంబంధించినవి
కొన్ని. జీవశాస్త్రం, జన్యుశాస్త్రం, జంతుశాస్త్రం, పరిణామవాదం... ఇవన్నీ చదివినవాడు గాని, నీ ప్రశ్నలకు తలవూపడం
తప్ప సమాధానం ఇవ్వలేడు''

అతడు తప్పించుకోచూస్తున్నాడని మంజులత భావించింది.

''నేను అందులో చదివినవి కొన్నే...''

''అదే ముప్పు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ...''

''నేను చెప్తున్నాగాని, అడగడం లేదు.''

''అన్నింటికన్నా ముఖ్యమైనది సమాజవిజ్ఞానం. ఒక్క కమ్యూనిస్టు తప్ప నీ ప్రశ్నలకు నాలుగు దిక్కుల నుంచి
ఎదుర్కొనలేదు.''

మంజులత చప్పరించేసింది.

''వాళ్లు మరీ అధ్వాన్నం. ఆడుదాన్ని దాని స్వేచ్ఛకు వదిలే బదులు నలుగురం కలిసి పంచేసుకుందామంటారు. చిన్నపిల్లలు
ఐస్‌ ఫ్రూటు తలొకడూ, తలోమారూ చప్పరించేసినట్లు''

రాజగోపాలం ఆమెవేపు చూశాడు.

''నా అనుభవం వేరు. బహుశా మగాణ్ణిగనకనేమో''

''ఏమిటయ్యా దాని అర్థం?''

''నేను సంస్కృతంలో మాట్లాడలేదు. వాళ్లతో నాకు పరిచయంలో ఆ అనుభవానికి అవకాశం లేకపోయింది."

రాజగోపాలం తన మాటను రెట్టించాడు. మంజులతకు చాల కోపం వచ్చింది.

''నీకు మాట మర్యాద కూడా తెలియదు''

సీటులో దూరంగా జరిగింది మంజులత. రాజగోపాలం భుజమ్మీద చెయ్యివేసి అదిమి పెట్టేడు.

''కోప్పడకు'

ఎదురుగా వస్తున్న లారీ కింద తాను పడిపోకుండేటందుకు రాజగోపాలం తన దృష్టినంతనూ రోడ్డుమీదనే కేంద్రీకరించాడు. చాలసేపటివరకూ
ఉభయులూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. చివరకు మంజులత పలకరించింది.

''నువ్వు కమ్యూనిస్టువా?''

ఇప్పుడామె కంఠంలో కోపరేఖలేదు. ఆసక్తి మాత్రమే కనిపించింది.

''ఈ వేళ తెనుగుదేశంలో కమ్యూనిస్టుల్ని గురించి తెలిసి వుండేటందుకు కమ్యూనిస్టే అయి వుండక్కర్లేదు''

''మరి....''

''వాళ్లని గురించి నీకు ఎల్లా తెలుసో... నాకూ అల్లాగే తెలుసు. అయితే తెలిసింది మాత్రం వేరు''

మంజులత మాట్లాడలేదు. కొంతసేపున్నాక రాజగోపాలమే ప్రసంగం ప్రారంభించాడు.

''నీ మాటలే ఆలోచిస్తున్నా''

''మంచిది. బాగా ఆలోచించు''

రోడ్డుప్రక్క చేలో ఒక చెట్టుక్రింద ఆవొకటి కట్టేసి ఉంది. దాని చుట్టూ ఆంబోతు అలగం తొక్కుతూ ఆవువేపు వెళ్లినవారిని
తిరగ్గొడుతోంది. నలుగురైదుగురు పశువుల కుర్రాళ్లు అంత దూరంలో నిలబడి ఆంబోతుకు ప్రోత్సాహం ఇస్తున్నారు.

''మానవుడు భగవంతుడి కల్పన అనేది నీ అభిప్రాయం కావొచ్చు. జీవ పరిణామంలో అదొక ఉన్నతోన్నత దశ అని నేను
భావిస్తా''

''అయితే నేను చెప్పింది మరీ సత్యం. మానవుడు తన పూర్వుల ఆచారాలూ, అలవాట్లూ అతిక్రమించి చేటు తెచ్చుకున్నాడు.''

ఉభయుల మనస్సుల్లోనూ మెదులుతున్నవి ఆవూ-ఆంబోతూ. ఒకచెట్టు వెనక నిల్చుని వానివేపే చూస్తున్న ఒక కన్నెపిల్లను దాటి
కారు ముందుకు పోయింది.

''జీవ పరిణామంలో మానవుడికి పూర్వులొక్క జంతువులేనా? అతఃపూర్వపు తరం చెట్టుచేమలు, ఇంకా ఇంకా వెనక్కి వెడితే చేపలు
వగైరాలు మన ప్రపితామహులు''

రాజగోపాలం ఎటు లాగుతున్నాడో అర్థం కాక మంజులత మిడుతూ మిడుతూ చూస్తుంది.

''మనం ఇప్పుడు పరిగణించే లింగభేదం అనేది జీవ పరిణామంలో ఒక దశలో వచ్చింది.

''వచ్చిన నాటి నుంచే తీసుకుందాం''

మంజులత సర్దుబాటుస్వభావం పెద్ద భారాన్ని తగ్గించింది.

''ఆ తర్వాత కూడా ఈ లింగభేదం ఎన్నో పరిణామాలు పొందింది.''

''ఎన్ని పరిణామాలు పొందినా.. దాని ప్రయోజనమూ, ఫలితమూ ఒక్కటే. సంతానం!''

రాజగోపాలం నవ్వాడు. మంజులత ఆశ్చర్యంతో అతనివంక చూసింది.

''అక్కడే వుంది పొరపాటు. మనిషి వద్దకు వచ్చేసరికి లింగభేదం కేవలం సంతాన ప్రయోజనమేనన్న స్థితి పోయింది.''

''మరి?''

''మనలో దాని ప్రయోజనం సంప్రయోగసుఖం''

మంజులత ఆలోచిస్తూ కూర్చుంది.

''లతా! మనం పశువుల అలవాట్లకు పోవాలనుకున్నా పోలేం. సంతానావసరం తెలియకపోయినా పశువు దానిని
ఇన్‌స్టింక్టివ్‌గా ఫీలవుతుంది. గర్భం ధరిస్తే దానికి సంగమేచ్ఛ ఉండదు. గర్భధారణకు అవసరమైన స్థితి
ఏర్పడినప్పుడేగానీ, దానికా ఇచ్ఛ ఉండదు. మనిషిలో అల్లాకాదు. ఇక్కడ గర్భధారణ అనుషంగికం. ఋతువుకాని సమయంలో కూడా
స్త్రీకి కామేచ్ఛ ఉంటుంది. గర్భధారణానంతరం కూడా సంప్రయోగానికి స్త్రీ విముఖురాలు కాదు. నేను విన్నదే నిజమైతే స్త్రీ
ప్రసవానంతరం పచ్చివొంటిమీద ఎక్కువ కామవాంఛననుభవిస్తుంది. ఇవేమీ జంతువుల్లో లేవు. ఉంటే దాచుకోగల శక్తి లేదుగనక లేదనే
చెబుతాం. ఇదంతా మనుష్యుడి అవతరణలోనే ఉన్న, వచ్చిన పరిణామం. నీకేమన్నా సందేహం వున్నా... ఈనాటి మెలకువలు
చూశాకయినా అది తీరాలి. నేడు కుటుంబ నియంత్రణ కోసమో, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనో ఆడా-మగా అనేక శస్త్రచికిత్సలు
చేయించుకొంటున్నారు. మందులు వాడుతున్నారు. వారెవరూ సంప్రయోగవాంఛను కోల్పోవడం లేదు. డాక్టర్‌గా నీకీ విషయం
కొత్తగాదు''

''అక్కడే దైవంయొక్క నియమాన్ని మనం ధిక్కరిస్తున్నామనడం...''

రాజగోపాలం నవ్వాడు.

''నువ్వు దేముడో, రాముడో అంటే నాకు పేచీలేదు. 'మూడు నాళ్లాయెరా మువ్వగోపాలా' అని భక్తిపారవశ్యంలో మనిగిపోవడమే ఆ
ధిక్కారానికి వాగ్రూపం. మన ఆలోచనల వల్ల కలిగే సిగ్గును దాచి పెట్టుకొనేందుకు కాకపోతే.. ఈ విషయంలో దేముడి ప్రసక్తి
ఎందుకు?''

మంజులత మనసులోలేని విశ్వాసాన్ని మాటలతో ఒత్తి ఒత్తి పలికింది.

''దైవం సంగమాన్ని సంతానలబ్ధికోసమే కల్పించాడు కనుక''

ఆమె మాటకు నవ్వాలో, విచారపడాలో తెలియక బాధపడుతున్న వాడిలా మొహం పెట్టేడు రాజగోపాలం.

''నువ్వు మగనాలివి''

అతడేమి చెప్పబోతున్నాడో మంజులత గ్రహించింది.

''నాకు పిల్లలు కావాలనే వుంది.''

''కాని కలగలేదు''

''లేదు''

''ఆరేళ్ల కుటుంబజీవితం అనంతరం నువ్వ కన్యవుగానే...''

''దేవుడివ్వనిదానికి....''

''నిన్ను ఆడదాన్ని చేసిందీ ఆ దేవుడేనా? మరొకడా? మంజులతా!''

ఆమె మాట్లాడకుండా కూర్చుంది. రాజగోపాలం ఏమీ అనలేదు.

''కొంచెంసేపు నువ్వు తీసుకో'' కారు ఆగింది. మంజులత చోటు మారింది. మరల బండి సిమెంటు రోడ్డుమీద చిరచిరలాడింది.



పదో ప్రకరణం


యూనివర్సిటీ నుంచి మంజులత తిరిగి వచ్చేసరికి బాగా ఆలస్యమైపోయింది. సత్రం గదిలో రాజగోపాలం ఆమెకోసం ఎదురుచూస్తున్నాడు.

దీర్ఘాలోచనలో మునిగివున్న మంజులత నొక్క నిమిషం చాల పరిశీలనగా చూశాడు.

''ఏం అల్లా వున్నావు?''

భోజనం చేస్తున్నప్పుడు కూడా ఆమె ఏమీ మాట్లాడలేదు.

''అతను కనిపించాడా?''

తల తిప్పడమే దానికి సమాధానం.

''అల్లా తిరిగివద్దాం రా''

''ఎక్కడికి?''

''ఎక్కడికైనా సరే''

రాజగోపాలం కారు తీసుకుని గది గుమ్మంలోకి తెచ్చాడు. మంజులత వచ్చి కూర్చుంది. ఆమెమీదుగా వంగి అతడు ఆవలివేపు తలుపును
గట్టిగా లాగివేశాడు. అతని స్పర్శకు ఆమె వణికిపోయింది.

''ఏం వంట్లో బాగోలేదా?''

మంజులత మాట్లాడలేదు. ఆమె చేసిన ధ్వనికి ఏదన్నా సమాధానం చెప్పుకోవచ్చు.

కారు కదిలింది. ఆమె అతనికి దగ్గరగా జరిగింది. అతని చేయి ఆమెను చుట్టుకొని రొమ్ములమీద నిలిచింది. ఆమె అతని చేతిని
నెమ్మదిగా తప్పించి పక్కకు జరిగింది.

''గోపాలం! ఒక్క ఆడదానికోసం మగవాడు ఆమె మినహా ప్రపంచమే లేదనేంత తాదాత్మ్యం పొందడం సాధ్యమేనంటావా?''

రాజగోపాలం ఒక్క నిమిషం ఆలోచించాడు. సరాసరి సమాధానం ఇవ్వలేదు.

''ఇప్పుడా సమస్య ఎందుకొచ్చింది?''

మంజులత ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేదు.

''మధ్యాహ్నం నేనాతడిని చూశా''

అతడెవరో రాజగోపాలానికి తెలుసు. మాయ ప్రేమించిన యువకుడు. అతడిక్కడ యూనివర్సిటీ కాలేజీలో లెక్చరర్‌. ఆ
వివాహానికి మంజులత ఇష్టపడలేదు. ఆ అయిష్టాన్ని లెక్కచేయకుండా మాయ ఇంటినుంచి వెళ్లిపోయింది. ఆమెను వెతుక్కుంటూ మంజులత
తిరుపతి వచ్చింది. అతనిని చూడడానికి వెళ్లింది.

''ఏమన్నాడు?''

''వాళ్లకి పెళ్లి చేయకపోతే యావజ్జీవం శిథిలంగా గడుపుతాడనిపించింది. ఆ కుర్రవాడు మా కులంలోనే ఎందుకు పుట్టిఉండకూడదు?''

రాజగోపాలం నవ్వాడు.

''నువ్వు ప్రేమించి పెళ్లిచేసుకున్నావు. నీకు ప్రేమమీద నమ్మకం లేదు. కులాంతరుణ్ణి పెళ్లిచేసుకున్నావు. కులాంతర వివాహాలమీద
నమ్మకం పోయింది''

''లేదు. నాకిప్పుడేం నమ్మకం లేదు. ప్రేమించామనుకున్నాం. వయస్సు, చదువు, ఆలోచనలు అన్నీ ప్రేమ ఏర్పడడానికి
అవసరమైనవన్నీ సమంగానే వున్నాయనుకొన్నాం. కానీ, ఇప్పుడు నా జీవితం ఏమిటి? కులం, గిలం, మతం, జాతి మనుషుల్ని
విడదీయరాదన్నా... కానీ మా కుటుంబం భిన్నకులీనత ఫలితంగానే విచ్ఛిన్నం అయ్యింది. గోపాలం! వద్దయ్యా! మాయకూడా నాలాగే
దిక్కు మొక్కు - తోడు నీడ లేని జీవితం గడపరాదయ్యా! మగడు మరోలా అయినా కనీసం బంధువులనీ తనవాళ్లనీ ఏ కొద్దిమందో
మిగులుతారు...''

డాక్టర్‌ మంజులత కుటుంబ జీవితం భగ్నమయిందనే గాని, వివరాలేమీ తెలియని రాజగోపాలం ఆమెకేమీ సమాధానం
చెప్పలేకపోయేడు.

మంజులత తనతోపాటుగనే మెడికల్‌ కాలేజీలో చదివిన రంగనాథరావును పెళ్లాడింది. మొదటి ఏడాది నుంచి హౌస్‌
సర్జన్‌గా పనిలో చేరినంతవరకూ ఇద్దరూ అతి సన్నిహితంగా మెలిగారు. భిన్నకులాలు వారి మైత్రికి, ప్రేమకు ఆటంకం
కాలేదు. పెళ్లిచేసుకున్నారు. ప్రాక్టీసుపెట్టారు. కానీ, వారి దాంపత్యం ఒక్క ఏడాదికన్నా శాంతంగా సాగలేదు. మూడేళ్లు నిండేసరికీ
ప్రాక్టీసులు, నివాసాలు పూర్తిగా విడిపోయాయి. ఇప్పుడొకరి పేరు చెబితే వేరొకరు సహించే స్థితికూడా లేదు.

''భోజనాలలో, ఆచారాలు - అలవాట్లలో కులాల మధ్యనున్న తేడాలు అధిగమించలేమోయి మా పేచీకి మూలం నీవు ఎరుగుదువా?''

రాజగోపాలం తలతిప్పాడు.

''రంగనాథం తల్లీ, తండ్రీ మా పెళ్లి అయ్యాక మావద్దనే ఉంటూ వచ్చారు. వాళ్లకి మాంసం ఏపూటా లేనిదే ముద్ద దిగదు. మేము
శ్రీవైష్ణవులం. ఆ ఇంట పుట్టిన నాకు మాంసం అంటే అసహ్యం. డాక్టరుగా అస్తమానం మాంసమ్ముద్దల్ని ముట్టుకొనే
నాకసహ్యమేమిటనకు. భరించలేనంత వెలపరం''

''రంగనాథం తినడా?''

''తింటే తింటాడు. నేను తినను''

రాజగోపాలం ఆ ద్వేషాలను అర్థం చేసుకొనేటందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు.

''అతని తల్లిదండ్రులకు ఎందుకు పుట్టిందో నేను మాంసం తినేటట్లు చేయాలనిపించింది. నేను ఎదిరించాను. వాళ్ల ఎత్తులూ, నా ప్రతి
ఘటనా వివరాలెందుకు గానీ, చివరకు నాకు మహాకోపం వచ్చి వాళ్ళని ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నా.''

రాజగోపాలం నవ్వాడు.

''రంగనాథరావు ఈ గొడవనెరగడా?''

''ఎరుగును. అతని అభిప్రాయం నేను కులాహంకారం చూపిస్తున్నాననే.''

''అరే!''

''ఆ అభిప్రాయం ఏర్పడడానికీ కారణం వాళ్ళేనంటే నమ్ముతావా?''

''చెప్పొచ్చునా?''

''ఒకమారు ఒక కేసు చూసివచ్చి, చాలా అలసిపోయి ఉన్నానేమో. గదిలో ఉన్న రెండో మంచం లాక్కొని పడుకున్నా. నిద్రపోయా. నా
కాళ్లు అతని తలగట్ల దిశగా ఉన్నాయట. దానిని వాళ్ళు తప్పు అన్నారు.''

''మగడనే కాదు. ఎవరు పడుకున్నా కూర్చున్నా వాళ్లవైపు కాళ్లు జాపడం తప్పేకదా?''

''అది మనుష్య మర్యాదగా నువ్వు చెప్తున్నావు. ఆ విషయం నేనూ వొప్పుకొంటా. కానీ, వాళ్ల అభిప్రాయం అదికాదు. మగడుగా
రంగనాథం నానెత్తిని కాళ్లు పెట్టొచ్చు. భార్యగా, ఆడదానిగా అతడున్న దిశకు నేను కాళ్లు జాపరాదు. పడమటి దిశగా ముస్లింలు
కాళ్లుచాపనట్లు. అదీ అసలు రహస్యం''

''చిక్కే.''

''ఆ విషయంలో నేను చాల జాగ్రత్త తీసుకుంటా. ఆ రోజున నేను అలిసివున్నాను. ఎటు పడుకున్నదీకూడ తెలియదు. కాని,
రంగనాథం నమ్మలేదు. దానికీ కారణం వుందిలే. ఒకమారతడు పడక కుర్చీలో కూర్చున్నాడు. నేను ఎదురుగా మరో కుర్చీలో వున్నా.
వున్నట్లుండి వెనక్కి వాలి, కాళ్లూ రెండూ నామీదకు కుర్చీచేతుల మీద పెట్టేడు. నేనది తప్పన్నా.''

రాజగోపాలం ఆశ్చర్యంగా చూశాడు.

''కాళ్లు తగలకుండానే మీరు కాపురం చేస్తున్నారా?''

మంజులత అతనివైపు చురుక్కుమనేలా చూసింది.

''నీ మగతనపు దురహంకారం పోనిచ్చుకొన్నావు కాదు. అతడూ అలాగే అన్నాడు. ఎన్నిమార్లు తన కాళ్లని ఒళ్లో
పెట్టుకోలేదన్నాడు. గోపాలం! మగడు - పెళ్లాం గదిలో చూపించే 'ఇన్టిమసీ' వేరు. గది బయట జీవించే సాన్నిహిత్యం వేరు.
నువ్వింకా బ్రహ్మచారివి...''

రాజగోపాలం చాలా సేపటివరకూ ఏమీ మాట్లాడలేదు. కారు నెమ్మదిగా కదిలిపోతూంది.

''మంజులతా!''

''ఏమిటి చెప్పు''

''నీ కథ వింటే నాకొకటి స్పష్టంగా కనిపిస్తుంది. అది నిజమో, అబద్ధమో తెలియదు. ఒకటి చెప్పు...''

''ఇప్పుడా కథలన్నీ ఎందుకు పోనిద్దూ''

''కాదు అవసరం. చాలా అవసరం''

''నీకా?''

మంజులత చిరునవ్వు నవ్వింది. రాజగోపాలం ఒక్క నిమిషం ఆగాడు.

''ఎందుక్కాకూడదు?''

మంజులత ఒక్క నిట్టూర్పు విడిచింది.

''మీ వివాహానికి అతడి తల్లిదండ్రులు ఒప్పుకొన్నారా?''

''నేనెరిగినంత వరకు...''

''వాళ్లు మీతో ఉండకపోతే మీ కుటుంబం విచ్ఛిన్నం అయ్యేదా?''

''గోపాలం! మీరు బ్రాహ్మణుల ఆడపిల్లల్ని చేసుకోకండి. మీప్రేమల్ని, ఏకాగ్రతల్నీ అధిగమించిపోయే 'ఇన్ఫీరియారిటీ
కాంప్లెక్సు' మీమనసుల్ని కుంగదీస్తూంటుంది. ఆ దశను అధిగమించేసరికి కాలం చాలా గడవాలి.''

రాజగోపాలం నవ్వాడు.

''నీదొక ప్రత్యేకమైన స్థితి. కానీ, వాళ్ళు మీ వద్ద వుండడం...''

''ప్రత్యక్షంగా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది''

ఇద్దరూ చాలసేపు నిశ్శబ్దంగా ఉన్నారు.

''ఒకపని చెయ్యి."

''ఏమిటది?''

''మాయా - వాళ్ళూ పెద్దవాళ్ళని దగ్గర పెట్టుకోవడం వల్ల గల ప్రమాదాల్ని గుర్తింపచెయ్యి.''

''నీ మీద మీవాళ్ళు ఆశలు పెట్టుకొన్నట్లే అతనిమీద వాళ్ళవాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని వుంటారు''

మరల కొంత సేపు నిశ్శబ్దం.

''నువ్వు చెప్పిన 'కాంప్లెక్సు' సార్వజనికం కాదు. ఇంక భిన్న కులాల మధ్య వివాహాలు సుఖకరం కావాలంటే కుటుంబంనుంచి
విడిపోవడం ముఖ్యమనేభావం నాకు కొంతకాలంగా అనిపిస్తూంది''

''విడిపోతే...''

''నువ్వు శ్రీవైష్ణవకులస్తురాలివి. నేను సుక్షత్రియుడిని. మన తల్లిదండ్రుల ఆచారాలు, అలవాట్లు, జీవన పద్ధతులు
భిన్నం కావొచ్చు. కానీ, మనం, కాలేజీలు, హాస్టళ్ళు, చదువులు, ఉద్యోగపరిస్థితులు.. ఇవన్నీ మన అలవాట్లు, జీవిత
పద్ధతులను సరిసమానం చేశాయి. అందరి విషయంలోనూ ఇది ఇంతే. కనుక - పాత కొత్తల్ని వేరుగా ఉంచడమే కొత్తది కాలు
నిలదొక్కుకోడానికి అవసరం''

''అమ్మల్నీ, నాన్నల్నీ ఏంచేస్తావు?''

ఆ ప్రశ్నే తాను కల్యాణిని అడిగిన మాట మరిచిపోయాడు.

''తప్పదు మంజులతా! వాళ్లకి కావాల్సిన డబ్బు ఇవ్వడమో ఏదో ఒకటి చెయ్యాలి."

''ఇవ్వలేని సంపాదనలైతే...''

''చెప్పలేను. నూతన పరిస్థితులు సమష్టికుటుంబాల విచ్ఛిత్తిని కోరుతున్నాయి. దానివల్ల ఇబ్బందులు కొన్ని ఎదుర్కోవాలి.
అయితే తప్పదు. ఆ ఎదుర్కోవడంలోనే ఆ దారేదో కనబడుతుంది.''

మంజులత ముఖంలో ఏదో విచారం కనబడింది.

''వాళ్ళ కంగీకారం కాకుంటే...?''

''చెప్పు. తర్వాత ఎవరికష్టసుఖాలు వాళ్ళు చూసుకోవాల్సిందే''

మంజులత కంఠం గాద్గదికం అయ్యింది.

''మాయకు కూడా నా తిప్పలు తప్పవూ...''

రాజగోపాలం కారు పక్కకు తీసి చెట్టుకింద నిలబడ్డాడు. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. చాలా దూరం వరకూ అటూయిటూకూడా
గ్రామాలున్న సవ్వడికూడా లేదు.

అతడామెను దగ్గరకులాక్కొని కళ్లు వొత్తేడు.

''పెళ్లి చేసుకోవడం తిప్పలు తెచ్చుకోవడం అంటావేమిటి లతా!''

ఆమె సర్దుకుంది.

''కారు తిప్పు పోదాం''

కారు కొంతదూరం వచ్చింది.

''నీ సిద్ధాంతం ప్రకారం నేనూ మాయకు దూరంగా వుండవలసిందేగా?''

''ఇప్పుడు మాయ నీకు దగ్గరయిందంటావా?''

మంజులత మాట్లాడలేదు.

''మనం 19వ శతాబ్దాన్ని వదిలేసి రమారమి అరవయ్యేళ్లయింది మంజులతా!''

''ఔను''

చాలా సేపు ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. తిరుగు ప్రయాణంలో కారు వేగం అందుకుంది. ఒక్క అరగంటలో సత్రం ముందు
నిలబడింది. మంజులత ముందు దిగింది.

''కానీ, ఎవరికర్మ ఎలా ఉందో... ఏం చేస్తాం.''



పదకొండో ప్రకరణం...


''నాలుగు రోజుల నుంచి ఇంటికి రావడం లేదు. ఎక్కడికి వెళ్లారు?'' ... అనే ప్రనశ్నతో కల్యాణి తలుపు తెరిచింది.
అతడేదో సమాధానం లాంటిది గొణిగాడు. అదేమిటో ఆమెకు అర్థంకాలేదు. అంతకన్నా తెలుసుకొనేందుకు ఆమె ప్రయత్నించలేదు. ప్రశాంతంగా,
చిరునవ్వులు చిందుతున్న ఆమె ముఖం చూడగానే, ఆ నాలుగు రోజులు తానేదో తప్పుపనిలో మునిగివున్నాననిపించేటంత విచారం కలిగింది.
రాజగోపాలం తన వాటాలో ప్రవేశించాడు.

అతనికింతవరకు కల్యాణియెడ గాఢమైన అనురాగం ఉంది. పైకి తేలకోయినా అతడామెకోసం ప్రపంచాన్నే వొడ్డేస్తాడు. తండ్రి
బెదిరింపులు, తల్లి అనునయాలు అతని భావాలకు గంటు పెట్టలేకపోయాయి. సుందరియైన మంజులత పక్కనవున్నా.. అతని మనస్సు
కల్యాణితోనే ఉండగలంత ఏకాగ్రత ఉంది.

కానీ, నాలుగు రోజుల అనంతరం అనతి మనస్సు మంజులత కోసం ఆరాటపడే స్థితికి పాల్పడింది. ఆ నాలుగు రోజుల్లో అతను తాను
ఊహిస్తున్న వ్యక్తికి భిన్నమైన వ్యక్తిని చూశాడు. అతి సన్నిహితంగా ఉన్నా.. ఆమె చనువు ఇవ్వలేదు. ఆ చనువు
ఇవ్వకపోవడం అతని మనస్సును అస్తమానమూ ఆమెవైపునకే ఆకర్షిస్తూంది. ఆమె కళ్లు, చేతికందుతూనే దూరంలో ఉండిపోయిన ఆమె
శరీరాంగాలు, నిరంతరం పెదవులపై చిందుతూండే హాస్యం, ఆ హాస్యం వెనక దాగివున్న నైరాశ్యం, తనకు రహస్యాలు చెప్పడం వల్ల
కలిగిన లోకువ, ఆ రహస్యాలకు మూలంలో ఉన్న వ్యక్తుల ఎడ అతనిలో ఏర్పడిన జుగుప్స - ఆమె చుట్టూ ఆకర్షణీయమైన
ఓ గుడి కట్టాయి. ఆమె స్పర్శ ప్రారంభంలో కలిగించలేని ఉద్రేకాన్ని కలిగిస్తూంది. ఆ నాలుగు రోజుల సాహచర్యం ఆమెతో ఇంకా
కాలం గడపాలనే కోరికను పెంచుతూంది.

వేల సంవత్సరాలుగా రక్తంలో కలిసిపోయేలాగ ఊదరపెట్టిన నిత్యవినీతుల సంస్కారాన్ని అణచివేసే అనుభవాలు లేకపోవడం అతనికో
పెద్దచిక్కు అయిపోయింది. ఎంతో సందేహిస్తూ ఆమె రొమ్ముల మీదికి పాకిన చేతులు, చీరమడతల్లో చిక్కుపడిన చేతులు నెమ్మదిగా
త్రోసివేయబడ్డాయి. ఆమె తన చేతుల్ని తీసివేయడంకన్న మరేమీ చేయలేదు. అదేంపనన్నా హెచ్చరించలేదు. కారులోనూ, సత్రపు
గదిలోనూ కూడా తానావిధంగా స్పృశించబోయిన తర్వాత కూడా ఆమె తనస్థానాన్ని మార్చుకోలేదు. ఆ సమయంలో తానంతకన్న ముందుకు
పోలేకపోయాడు. ఆమెను లేపడానికై చెయ్యివేసినట్లు రొమ్ములు తాకేడు. ఆ వుపాయం కోసం గంటలతరబడి మేలుకొని, అనేక ఆలోచనలు
చేశాడు. కానీ, తన స్పర్శకామె మేలుకొనగానే చటుక్కున చేయితీసేసుకున్నాడు. ఆమె లేచి కూర్చుని ''ఎందుకు లేపే"వంది.
''నిద్రలో మూలుగుతున్నావు. ఏదో పాడుకల వచ్చి ఉంటుంది. లేపాను'' అని అతడు అబద్ధమాడేడు. అది అబద్ధమని
తానెరుగును. ఆమెను తాకడం తన వుద్దేశం. అందులోనూ ప్రత్యేక ప్రదేశంలో తాకాలి. చీకట్లో తెలియక ముట్టుకొన్నానని
తప్పుకొనేటందుకు వీలుగా ఉండాలి. గదిలో కటిక చీకటి. ఒక అడుగు ఎడంలో ఆమె పక్కవేసుకుంది. ఏ దొంగలోవచ్చి తాము
నిద్రపోతుండగా బట్టలు పట్టుకుపోకుండా తలుపువేశారు. అన్నీ అనుకూలంగా ఉన్నాయి. నిద్రలో ఆమె శ్వాసను బట్టి ఆమె శరీరాంగాల
స్థానాలను వూహించుకున్నాడు. స్పర్శలో తన వూహ సరిగ్గానే వుందని గ్రహించాడు. ఆమె ఏమీ అనలేదు. తన పిరికిదనానికి
నవ్వుకున్నదేమోనని ఇప్పుడనిపిస్తూంది. ఆమె లేవకపోయినా, లేచి ఎందుకు లేపేవని నిలదీయకపోయినా, అతని స్పర్శ
ఆమెకిష్టమేనని భావించవచ్చుననుకొన్నాడు. కానీ, అలా జరగలేదు. ఆమె తన అబద్ధాన్ని నమ్మేసి నిద్రపోయింది. ఇంక అదే
అబద్దమాడలేడు. మరో ఉపాయం తోచలేదు. ఆమె రొమ్ముల కాఠిన్యాన్ని శరీర మృదుత్వాన్నీ తలచుకొని తాను
అనుభవించలేకపోతున్నాననేదొక్కటే అనుతాపం మిగిలింది.

మంజులత మీద మనసుపారినాక అతనికి ఒక పెద్దసందేహం కలిగింది. తాను కల్యాణిని ప్రేమిస్తున్నాననుకొన్నది నిజమేనా?
కల్యాణితో

మాట్లాడేప్పుడు తన మనస్సుఏదో అనిర్వచనీయమైన సంతృప్తితో నిండి ఉంటుంది. ఆమె మాటకు అడ్డుకూడా వెళ్లకుండా మాట్లాడుతూంటే
వినాలనిపిస్తుంది. ఆ స్వరం, కళ్లు, పెదవుల మందహాసం, కనుబొమ్మలు, నుదురు, నుదుటను దోబూచులాడే అలకలు అతని
కళ్లనూ, మనస్సును కూడా నిర్వికల్ప స్థితిలో పెడుతున్నాయి. ఆమె ఎదుట అతడు అనామయ స్థితిని అనుభవిస్తాడు.

కానీ మంజులత... ఆమె అతనికొక సమస్య. ఒక జ్వాల.

ఈ ఇద్దరిలో తన మనస్సు ఎవరిని అభిలషిస్తుంది? అదే అతనికి కొరుకుడుపడలేదు.

రెండు రోజులు మంజులత విషయం మరిచిపోవాలనుకున్నాడు. కానీ, మనస్సులో ఆమెను గురించిన ఆలోచనలు మెదులుతూనే ఉన్నాయి. అయినా
వెళ్లలేదు. మూడోరోజు సాయంకాలం బిసెంటు రోడ్డుమీద హోటలుకెదురుగా నిలబడ్డాడు. మంజులత కారులో వెడుతూ ఆగింది. పలకరించింది.

''కనబడ్డంలేదేం?''

పనుందన్నాడు. కానీ, అదనపు పనేమీ లేదు. అది అబద్ధం. మంజులత కనిపెట్టింది. చిరునవ్వు నవ్వింది. ''''తీరుబడి
చేసుకురావయ్యా''

అతడు తలూపేడు. కానీ, వెళ్లలేదు. ఆమె పిలిచిన వెంటనే వెడితే తనను లోకువ కట్టి ఆడిస్తుందని భయం. ఆ మాట తోచగానే,
కల్యాణి విషయంలో తనకాభయం కలగదనే సంగతి గుర్తుకువచ్చింది. ఆశ్చర్యం కలిగింది.

మంజులత తన మగడు 'ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు'తో బాధపడి తనను బాధపెట్టేవాడంది. ఇప్పుడు తన మనస్సులో కలిగిన భావం
ఆ 'కాంప్లెక్సు'జన్యమేనా? కానీ, ఆ మాటను ఒప్పుకోలేకపోయింది మనస్సు. అయినా అతను వెళ్లలేదు.

ఆమె పిలిచినందుకు గాక, తనకు పని ఉండడం చేతనే ఆమె ఇంటికి వెళ్లేననుకొనేటందుకు మరునాడు అవకాశం చిక్కింది.

వర్కు షాపులో పని చేస్తున్న మెకానికు రామచంద్రం తన భార్య రుగ్మత విషయంలో రాజగోపాలం సహాయం కోరేడు.

అతని భార్యకు ముట్టుకుట్టు వ్యాధి వుంది. ప్రతినెలా విపరీతమైన బాధ. ఆ మూడురోజులే కాదు. నెలనెలా కలుగుతున్న ఆ బాధ
కామె క్షీణించిపోతూంది. లేవలేని స్థితికి వస్తూంది. ఆపరేషను చేయించాలన్నారు. మనులత వయస్సుకు చిన్నదైనా హస్తవాసి
మంచిదన్నారు. ఆమెకు సిఫార్సు చెయ్యాలి.

"తమకు ఆమె తెలుసు. మా జీతాలు తమరెరగనిది కాదు. రోజు కూలిగాడిని. ఏదో కొద్దిగా ఇచ్చుకొంటాను. తమరు చెప్పండి."

రాజగోపాలం ఆలోచించేడు. తన సిఫార్సును మంజులత లెక్కచేస్తుందా యనే సందేహం. ఆ సందేహానికి కారణం లేదు. కల్యాణి విషయంలో
అతనికటువంటి సందేహమే కలగదు. కల్యాణితో స్నేహం కన్న మంజులతతో తన స్నేహం చిరంతనం. అయినా ఆమె స్వభావం ఏమిటో
అతనికి అర్థం అయినట్లే లేదు. చివరకు ఆమెతో తనకంత పరిచయం లేదన్నాడు.

కాని, రామచంద్రం నమ్మలేదు. పది రోజుల క్రితం మంజులత స్క్యూబ్రిడ్జి వద్ద గోపాలాన్ని కారులోకి పిలిచింది. ఇద్దరూ
గుంటూరుకేసి వెళ్ళారు. మళ్ళీ నాలుగురోజులవరకూ అతడు వర్కుషాపుదిశలకే రాలేదు. అందుచేత తన అంచనాలు తనకున్నాయి. తన
అంచనాల ప్రకారం మంజులత గోపాలం చెప్పిన మాట వినితీరాలి. కాని, ఆ మాట పైకి అనక పోయినా, సూచనగానేనా అనకుండా
ఉండలేకపోయాడు.

మంజులతతో తన పరిచయం చాలదూరం పోయిందనుకోవడం గోపాలానికెంతో గర్వ కారణం అనిపించింది. పట్టణంలో మంచి పేరున్న లేడీ
డాక్టరు. అందకత్తె. బంధుత్వాల రీత్యా మంచి మంచి వుద్యోగాలలో వున్న కుటుంబంలోనిది. ఆమెతో సాధారణ పరిచయం వుందనుకోవడంకూడా
గొప్పగా భావించే జనం, తమ పరిచయం ప్రగాఢమైనదిగా భావించడం అతనికి సంతృప్తికన్న అధికమైన ఒక భావాన్ని కలిగించింది.
కాని, ఆ సంతృప్తిలో కూడా సందేహం మెరుగుతూనే వుంది.

"నాకు ముఖపరిచయం తప్ప విశేషం లేదయ్యా!"

కాని, అతడు ఫోను తీసేడు. రామచంద్రం ముందు ఆమెతో తనకున్న పరిచయాన్ని ప్రకటించుకోదలచుకోలేదు.

"నమస్కారం."

"మీతో చిన్న పనుంది."

ఏమిటీ నమస్కారాలూ, మన్నింపులూనని మంజులత ప్రశ్నిస్తూంటే అతడు చిరునవ్వు నణచుకొంటున్నాడు.

"మీకు అవకాశం ఎప్పుడుంటుంది?"

అతడు నిర్ణయించుకొన్న వేళకి రాజగోపాలం మంజులత గుమ్మంలో హాజరయ్యాడు.

గుమ్మంలో కారు వుంది. నర్సు 'మెడిసిన్ చెస్టు'తో మెట్ల మీద వుంది. అతనిని చూడగనే మంజులత నిలబడిపోయింది.

"మా బ్రతుకులింతే. ఏ క్షణమూ మాది కాదు. నిన్ను రమ్మన్నా, ఏదో కాంపు కేసుమీద బయలుదేరుతున్నా. నువ్వు వస్తావని
ఎరుగుదును. బల్లమీద చీటి పెట్టాను."

నర్సు 'చెస్టు' కారులో పెట్టేసి తలుపు తెరిచి పట్టుకుని నిలబడి వుంది. ఆమెను పిలవవచ్చినవారు ఎదురుగా నిలబడి
తొందరపెడుతున్నట్లు చూస్తున్నారు. ఆ చూపులు ఆమెకు కోపం కలిగించాయి.

" టాక్సీలో వెడుతూండండి. మీ వెనకాలనే వస్తున్నా."

వాళ్ళు వెళ్ళలేదు. కాని, ఆమెవైపు చూడడం మాని ప్రక్కకు తిరిగేరు. ఆమె ప్రశ్నించింది.

"ఏదన్నా ప్రత్యేకంగా మాట్లాడాలా?"

అయిష్టంగానే ఆహ్వానించింది.

"ఎంతసేపు ఆలస్యమవుతుందో యేమో. లేకపోతే నిన్నూ రమ్మందును. కారులో మాట్లాడుకొనేవాళ్ళం."

వెంటనే చిత్రంగా కల్యాణి ఙ్ఞాపకం వచ్చింది. ఆమెతోనైతే ఈ విధంగా వెళ్ళకూడదనుకొనేవాడినేనా అనిపించింది.

అతని సందేహాన్ని గమనించి మంజులత మళ్ళీ రమ్మంది.

"రాత్రి తొమ్మిదింటికిరా, అప్పటికి నేను బహుశా వచ్చేస్తా. రావడం ఆలస్యమైనా వుండు. బాగా రాత్రయితే ఇక్కడే పడుకో.
నర్సు ఆ ఏర్పాటు చేస్తుంది."



పన్నెండో ప్రకరణం


అతనికి వెళ్ళాలనిపించలేదు. తాను హోటలునుంచి తిరిగివచ్చేసరికి గుమ్మంలో రామ చంద్రం కని పెట్టుకొని వున్నాడు. డాక్టరు ఎంత
అడిగిందో, తన శక్తికి మించిపోతుందేమో, ఏం చెయ్యాలి? అని అతని ఆదుర్దా. కాని రాజగోపాలం ఇంకా డాక్టరుతో మాట్లాడనేలేదు.

"బాబుగారు! దానికి ప్రాణ భిక్ష తమరే పెట్టించాలి. దాని బాధ చూడలేకున్నాను. అదెంతో కాలం భరించలేదు కూడా."

రామచంద్రం కళ్ళు వొత్తుకోడం రాజగోపాలానికి ఆశ్చర్యం కలిగింది. భార్య విషయంలో ఇంత ప్రేమాభిమానాలు చూపుతున్నవాడు ఆడపిల్లను
కనబడనివ్వడు. వాళ్ళ చెంగుపట్టుకు తిరుగుతూ మోటు హాస్యాలు ఆడుతూంటాడు. ఆశ్చర్యం కలిగింది, అడిగేడు.

"పెళ్ళాం మీద ఇంత ప్రేమ వున్నవాడివి రాజక్కని క్షణం వదలవేమోయి?"

రామచంద్రం కొంచెం సిగ్గుపడ్డాడు. ఆశ్చర్యమూ కలిగింది.

"నా భార్య అనుకొంటున్నది కట్టుకొన్న పెళ్ళాం కాదండి. తెచ్చుకొన్నది. మా ఇద్దరికీ మనసు కలిసింది వచ్చేశాం."

ఆమె అతనికి మరో ప్రాణం. నెలలో ఏ రెండు మూడు రోజులో తప్ప ఆమె ఆరోగ్యంగా, మూలగకుండా వుండదు. ఆమెను
బాధపెట్టకుండేటందుకే రాజక్క.

అదో చిత్రమైన సంబంధం. ప్రేమ లేకపోయినా శరీరసంబంధం వుంది. శరీరావసరాల్ని తీర్చలేని చోట, తీరడానికి అవకాశం లేని చోట
ప్రేమ వుంది. మంజులత ఆనాడన్న మాటలు గుర్తు వచ్చాయి.

"మనకు చిన్న పిల్లలయెడ ప్రేమ వుంది. దానిని వాత్సల్యం అంటాం. తల్లిదండ్రులూ, దేవునియెడా ప్రేమను భక్తి అంటాం.
సంస్కారంలోనో, సమాజ హోదా లోనో, ఆర్థికంగా మనకంటే సన్న వాళ్ళ మీద ప్రేమ వుంటుంది. దానిని అభిమానం అంటాం. వీటికి
పాత్రులయ్యేవాళ్ళ స్త్రీ పురుష భేదాలు మనకనవసరం. స్త్రీ పురుషుల మధ్య వాంఛ వుంది. దాని నిదివరకు కామం అన్నారు.
ఇప్పుడు ప్రేమ అంటున్నారు. పేరు ఏం పెట్టినా అది కామమే. ఈ ప్రేమ భిన్న లింగాల మధ్యనే వుంటుంది.

రామ చంద్రానికి భార్య యెడ వున్న భావానికి మంజులత ఏం పేరు పెడుతుందో? అతనికి వాగ్దానం చేసేడు. రామచంద్రం ఎంతో బరువుగా
తిరిగి వెళ్ళిపోయాడు.

అతడు వెళ్ళిపోయాక రాజగోపాలాన్ని వేయిప్రశ్నలు చుట్టుముట్టేయి. ఈ మధ్యకాలంలో తన మనస్సులో మెదులుతున్న ఆలోచనల
కొసలవి. ప్రేమ ఒకచోట, శరీర సంబంధాలొకచోట వుండడం తప్పా? తప్పయితే వాటినొప్పుకోడానికి రామచంద్రం ఎందుకు సందేహించడం
లేదు? తనకు మంజులతతో అతడూహించే సంబంధం లేకపోయినా వుందనడం తనకి వుత్సాహం కలిగిస్తూందే? మనస్సునూ శరీరాన్నీ ఆకాంక్షలో
వుంచే భావన తప్పా?

అతనికి మంజులత వాదనలు గుర్తు వచ్చాయి, "ప్రేమ మానసిక స్వాతంత్ర్యాన్ని కొరుతుంది. అటువంటి సందర్భంలో ఆ స్వేచ్ఛను
అరికట్టే నియమాల పేరుతో ప్రేమను ఎందుకు సంకుచితపరచాలి?" అని ఆమె వాదన.

అతడారాత్రి పదయినా, పన్నెండయినా మంజులతను చూచితీరాలనుకొని బయలుదేరేడు. అది కేవలం సాకు మాత్రమేననీ, మంజులతలోని
ఆకర్షణే తన్ను లాక్కుపోతూందనీ అతనికి అంతరాంతరాల్లో తెలుసు.

అతడు వెళ్ళిన అరగంటలోపలనే డాక్టరు తిరిగి వచ్చింది. ఆమె ముఖం క్రోధఘూర్ణితంగా వుంది. మనిషి చాల అలిసిపోయి వుంది.

రాజగోపాలాన్ని సోఫాలో చూడగానే ఆమె సర్దుకొంది.

"నీ భోజనం అయిందా?"

"ఆహా!"

అక్కడికక్కడే నిలబడి వీధి మొగలో వున్న హోటలునుంచి కాఫీ తెప్పించి ఇచ్చే వరకూ ఆమె కదలలేదు. డ్రైవరు తెచ్చిన
ఫ్లాస్కులోని కాఫీ కప్పులో పోసి స్వయంగా అతనికిచ్చింది.

"కూర్చో వస్తా."

రాజగోపాలం ఎదురుగా బల్లమీద వున్న ఒక తెలుగునవల తీసుకున్నాడు. సోఫాలో జేరబడ్డాడు.

"ఏమిటాలోచిస్తున్నావు?" అనే ప్రశ్నకు రాజగోపాలం వులికి పడ్డాడు. గడియారం వేపు చూసేడు. తానా పుస్తకం తీసి గంట
గడిచింది. కాని, ఒక్క పేజీ కూడ తిరగెయ్యలేదు.

తనకాపుస్తకం ఆసక్తి కలిగించనే లేదన్నట్లు దానిని నిర్లక్ష్యంగా బల్ల మీద పడేసేడు. మంజులత వెంటనే దానిని సర్దింది.
రాజగోపాలం నాలుక కరుచుకొన్నాడు.

"క్షమించు."

మంజులత చిరునవ్వు నవ్వింది.

"నాకు వస్తువులు చిందరవందరగా వుండటం ఇష్టం కాదు."

"నాకూ అంతే."

"స్వంతం అయితేనే ఆ నియమం పాటిస్తా వనుకుంటా."

తనమనస్సులోని ఆలోచనలను ఆమె గ్రహించిందా అనిపించింది. అందుచేత వచ్చినపని చెప్పేడు.

వైద్యవృత్తి విషయం వచ్చేసరికి మంజులత ముఖం గంభీరమయింది. ఆమెకు రామచంద్రం భార్య పరిస్థితితోపాటు అతనికి రాజక్క తో
గల సంబంధం గురించి కూడా చెప్పేడు. అదేమో కారణం.

"నూట ఏభయి రూపాయలివ్వగలిగితే తీసుకురా."

రాజగోపాలం ఆశ్చర్యం ప్రకటించాడు. అమెరికను హాస్పిటలులో అన్ని ఖర్చులూ కలిపి అంతవరకు అవుతాయంటే రామచంద్రం జంకి
మంజులత కోసం ఆశపడ్డాడు.

"నెలంతా పనిచేస్తే నువ్వడిగిందాంట్లో సగం ఆదాయం రాదు మంజులతా!"

"ఆరేళ్ళు చచ్చి చదివి నేర్చుకొంటేనేగాని అతడికి కావలసిన ఆపరేషన్ చేయగల శక్తి రాలేదు గోపాలం!"

అతడింకా మాట్లాడబోయేసరికి ఆమె మాట మార్చేసింది. దానిని మరల తెచ్చేసరికి చెప్పేసింది.

"మనం సోవియటు రాజ్యంలో లేము. ఆదాయాన్ని బట్టి ఫీజులు నిర్ణయించడానికి."

"అక్కడైతే వైద్య సౌకర్యం వుచితమే నంటారు."

ఆ మాటలోని ఎగతాళికి మంజులత మనస్సు చురుక్కుమంది.

"పెళ్ళాం మీద అంత ప్రేమ వున్నవాడు ఈ ఫీజు ఇవ్వడం అంత కష్టం కాదు."

రాజగోపాలానికి తాను చేసిన పొరపాటు అర్థం అయింది. మంజులత ప్రేమ అనే మాటను సహించలేదు.

"నిజమే! థాంక్సు!"

రాజగోపాలం లేచేడు.

"కూర్చో."

"అతనికి చెప్పాలిగదా!"

"మరెల్లా తెస్తాడు?"

రాజగోపాలానికి ఆమె ధోరణి అసహ్యం కాలేదు.

"ఏదో తంటాలు పడతాడు."

మంజులత అతని ముఖంలోకి చూసింది.

"ఒక్క మాట వింటావా? డాక్టరు ఫీజు ఎగకొట్టాలనే భావనకు ప్రేమ అనే అంత పెద్ద పేరు తగిలించవద్దను. నిజం చెప్పాలంటే
ఖర్చు లేకుండ స్త్రీ సుఖం పొందడానికి పెళ్ళి. ఆ పెళ్ళి ఖర్చు కూడా అక్కర్లేకుండా ఆడదాన్ని సంపాదించే ఉపకరణం ప్రేమ."

ఆమె వ్యాఖ్యకు రాజగోపాలం అదిరిపోయేడు.

ఆడవాళ్ళ దృష్టిలోంచి నువ్వు వ్యాఖ్యానం చేశావు."

"నువ్వేమంటావు?"

"కానీ సంపాదించనక్కర్లేకుండా భారం అంతా మగాడి నెత్తిన పారేసి ఇంట్లో పెత్తనం చలాయించడానికీ, మగాడిని అనుభవించడానికీ ఆడది
పెళ్ళి చేసుకొంటూందా?"

"సంపాదించుకోలేని ఆడుదాని విషయంలో నువ్వా మాట అనొచ్చు. కానీ, ఆ సంపాదించుకోలేని స్థితికి ఆడదాన్ని తెచ్చిన దాని దుష్ఫలితం
అది."

ఇద్దరూ ఒక్క నిముషం వూరుకున్నారు. మంజులత మరల చెప్పింది.

"నేనీవేళ వెళ్ళిన కేసు ప్రసూతి కేసు కాదు. గర్భ స్రావం. ఆమె భర్త అమెరికాలో వున్నాడు. ఈమె ఇక్కడ ఎవడినుంచో
గర్భం తెచ్చుకొంది. ఆ కుటుంబం విచ్ఛిన్నం కాకుండేందుకు బంధువులు మందిచ్చారు. చక్కని పడుచు. నిష్కారణంగా చచ్చిపోయింది. నువ్వు
చెప్పే పెళ్ళిళ్ళూ, ప్రేమలూ ఆమెను బలితీసుకొన్నాయి. ఒక సాధారణమైన కామ కార్యానికి పెద్ద పేర్లు తగిలించి
మహాపవిత్రస్ఫూర్తి నిస్తున్నారు. మనం సృష్టించిన ఆ దయ్యం మన ప్రాణాల్నే తీస్తూంది. గోపాలం! స్త్రీ పురుష సంబంధాన్ని
కేవలం కామ కార్యంగానే వదిలేసి, దానికి స్వేచ్ఛనిస్తే సమాజంలో దుర్మరణం అవసరం ఏం వుంది?"

రాజగోపాలానికి సమాధానం తోచనూలేదు. ఆలోచించగల స్థితిలోనూ లేడు. రామచంద్రం భార్య యెడగల సానుభూతి ముందు మంజులత సిధ్ధాంతాలు
కేవలం శుష్క ప్రియాలుగా కనిపించాయి. వెలపరం కలిగింది.

"డ్రైవరు వెళ్ళిపోయి వుంటాడు. రిక్షా పిలిపించనా?"

"వద్దు. దగ్గరనేగా. నడిచిపోతా."

రాజగోపాలం ఇంటికి వచ్చేవరకూ రామచంద్రం కల్యాణితో మాట్లాడుతూ కూర్చున్నాడు. అతనిని చూడగనే లేచి నమస్కరించేడు. గోపాలం
అతనికో పాతిక రూపాయలు అందివ్వబోయాడు.

"ఆ విషయంలో నువ్వే ప్రయత్నం చేసుకో. నీకు నేనివ్వగల సాయం ఇంతే."

రామచంద్రం ముఖం వాడిపోయింది. ఒక్క నిట్టూర్పు విడిచేడు. డబ్బు నిరాకరించేడు.

"వద్దు బాబుగారూ! మాకు అందుబాటయిన చోటుకే వెడతాం."

"ఎక్కడైనా డబ్బు కావలిసిందేగా."

"చిత్తం. కల్యాణమ్మగారు రేపు ఒక డాక్టరువద్దకు తిసుకెడతామన్నారు."

మంజులత-కల్యాణి-రాజగోపాలం కల్యాణి స్నిగ్ధ హృదయాన్ని మనస్సులోనే అభినందించాడు.

"ఆమె దేవతలాంటివారు."

"చిత్తం. చిత్తం."

రామచంద్రం అతని మాటలకు అంగీకారం తెలిపేడు.

"ఆమె మాటలు వింటూంటే మరల నా రంగమ్మ బతికి వచ్చే ఆశ వుందనిపించింది."



పదమూడో ప్రకరణం


గది తలుపు తాళం నొక్కి రాజగోపాలం వెనక్కి తిరిగేడు. కాని వాకిట్లోకి వెళ్ళేదారి బంద్.

గుమ్మంలో అడ్డంగా కూర్చుని సుజాత ముగ్గులు దిద్దుతూంది సుద్దతో. పదిరోజుల క్రితం జరిగిన సంభాషణ అనంతరం సుజాత అతనికి
కనిపించడమే లేదు. కనిపించినా మూతీ ముక్కూ తిప్పి మొగం చాటు చేసుకొంటూంది. ఆమె కతనిమీద చాలా కోపం వచ్చిందన్నమాట. ఆ
కోపాన్ని అతడు లెక్క చేయదలచలేదు. ఒక కన్యకు ఆమె చేస్తున్న అనాలోచితపు పనిని గురించి హెచ్చరించడం అతడు తప్పుగా
భావించలేదు. తాను చేసింది మంచిపనే. దానికామె కోపగించడం చిన్నతనపు అజ్ఞానం తప్ప వేరు కాదు. ఆమె కాలేజీలో చదువుతున్నా,
మంచి తెలివిగా మార్కులు తెచ్చుకొంటున్నా అతనికి చిన్న పిల్లగానే కనిపిస్తూంది. అందుచేతనే ఆమె కోపాభిమానాలు, ప్రేమానుతాపాలు
ముద్దుగా కనిపిస్తున్నాయేగాని ఆమెలోని యౌవన ప్రాదుర్భావాన్ని మనస్సుకు తగలనియ్యడం లేదు.

సుజాత గుమ్మానికడ్డంగా బైఠాయించింది. అతనిని చూడకుండేటందుకు తల బాగా దించుకుంది. తనను చూశాక తప్పుకునే ప్రయత్నం
చెయ్యకపోవడం ఆమె రాజీ ధోరణిలో వుందనిపించింది.

రాజగోపాలం పలకరించాడు.

"ఈవేళ ప్రొద్దుటే ముగ్గులకు కూర్చున్నారేం?"

సుజాత తల ఎత్తలేదు. అతడి మన్నింపులో ఎగతాళి ప్రతిధ్వనించింది. తల వంచుకునే మూతి వంకరలు తిప్పింది. ఆ వెక్కిరింత
రాజగోపాలానికి అర్థం అయ్యే అవకాశంలేదు. కాని, ఆ నిశ్శబ్దంలోనే ఆమె ముఖ భంగిమ అతనికి కనబడింది. అతడేమనడానికీ
వ్యవధి లేకుండనే వీధి గుమ్మంలో కూరలమ్మి కేకేసింది.

"ఏం వున్నాయి?"

కూరలమ్మి ఆశ్వాసాంతగద్యవంటి దొకటి చదివింది. సుజాత ఆ మాట వినిపించుకోకుండానే తట్ట ది౦పించింది. పై మెట్టుమీద కూర్చుని
క్రింద మెట్టు మీద కూరగాయల గంపా, ఇంకా క్రింద కూరగాయలమ్మి—దాటి, తోసుకుపోదామన్నా సాగనివ్వను సుమా అన్నట్లు వెనుతిరిగి
చూసింది.

"అయ్యగోరు ఎలతారుగామాలమ్మా!"

గంపలోని కూరగాయల్ని తల్లక్రిందులు చేస్తూ సుజాత మాట్లాడలేదు.

"తొందరలేదులే కానియ్యి."

రాజగోపాలం ఆ మాట మర్యాదకు మాత్రమే అన్నా, సుజాత యథార్థంగానే స్థిరపరిచింది. కూరలమ్మి మాట విననట్లు నటించింది.

"ఎండువరుగులకు కూడా ఆ ఖరీదేమిటమ్మీ!

వరుగులంటారేమిటమ్మా! నవుజులు. ఎక్కడా గింజన్నా కట్టలేదు గదమ్మా!"

కూరలమ్మి నదరుగావున్న బీరకాయ ఒకటి విరిచింది. పుచ్చగింజల్లా మిలమిలలాడాయి. దానిని వీధిలోకి పారేసింది.

"తమ ఇష్టం వచ్చినవి ఏరుకొండమ్మా. వర్షాలకి పాదులన్నీ కుళ్ళిపోయాయి."

"ఈ వంకాయలు మనుష్యులు మేసేటందుకా, గేదెలకి వండి పెట్టాలనా?"

రాజగోపాలం నవ్వేడు.

"సమస్యే! డాక్టరు మంజులతని అడగాలి. తిండిలోకూడా పశుధర్మాలను వదిలి మనుష్యుడు పాడైపోయాడంటు౦దో యేమో."

"సుజాత పశువులు మనుష్యుల అలవాట్లు చేసుకోవాలంటూంది కాబోలు." అంది అప్పుడే వీధి గుమ్మంలో అడుగుపెట్టిన కల్యాణి.

"అప్పుడే స్నానం పూర్తిచేసుకుని బయలుదేరేరే!

అది కేవలం పలకరింపు. తాను ఎక్కడికీ పోవాల్సిన పనిలేకున్నా స్నానం చేసెయ్యలేదూ. గోపాలం చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.
కల్యాణి ఆహ్వానించింది.

"వచ్చి లోపల కూర్చోండి. ఇంత ప్రొద్దుటే వెళ్ళాలా పనిలోకి!"

సుజాత ధోరణి చూసి ఆమె ఏదో ఖయ్యాళీలో ఉందనిపించింది. కొద్దిసేపట్లో సర్దుకుంటుంది. అంతవరకు ఎవరుచెప్పినా వినదు. ఆమె
స్వభావం తెలిసిన కల్యాణి రాజగోపాలాన్ని లోనికి ఆహ్వానించింది.

"దారిలో ఉడిపి బ్రాహ్మల సువారం ఒకటుంది కదా౦డి. ఇటుతిరిగి, అటుతిరిగి ఎనిమిదింటికి వర్కుషాపుకు చేరుతాం."

"అంతేకద. రాండి. ఈపూట మేం కాఫీ ఇచ్చుకుంటాం.

రాజగోపాలం కాదన్నా కల్యాణి వినిపించుకోలేదు.

"ఎంతకాలమైనా మొగమాటమేనా? రా నాయనా! అంతల్లా చెప్తూన్నప్పుడు."

అంతవరకూ ఆవలి గుమ్మంలో నిల్చున్న రామలక్ష్మమ్మ నెవ్వరూ గమనించనేలేదు.

ఆ రోజున యింట్లోవున్నజనం అంతా వీధి గుమ్మంలోనే వుండడం చూసి గోపాలానికి ఆశ్చర్యమయింది. ఇటువంటి స్థితిని ఈ ఏడెనిమిది
నెలల్లో అతడు చూడలేదు. కల్యాణి వాటాతలుపు తెల్లవారగట్లే తెరుచుకుంటుంది. తాను లేచేసరికి ఆమె స్నానాదికం పూర్తిచేసి హాలులో
చదువుకొంటూనో వ్రాసుకొంటూనో కనిపిస్తుంది. వీధిలోకి వచ్చేసరికింకా మూడోవాటా తలుపులు తెరిచేవుండవు. ఈవేళ అవీ తెరిచారు.
సామాన్యంగా ఆవేళకు పళ్ళు తోముతూవుండే సుజాత గృహాలంకరణలో వీదిగుమ్మంలో వుంది. ఏ వంట ప్రయత్నాలలోనో ఉండే రామలక్ష్మమ్మ
అరుగుమీదికి తీరుబడిగా వచ్చింది. ఏదో విశేషం వుందనిపించింది.

తన వెనుక సంభాషణ సాగిపోతున్నా సుజాత వినిపించుకోలేదు. తల త్రిప్పలేదు.

"కాకరకాయలెల్లాగ? పండబారినా పనికివచ్చేవి అవొక్కటే."

తాను మొగమాటపడుతున్నానన్న మాటను రాజగోపాలం అంగీకరించలేదు.

"ఇంకా వ్యవధివుంది గదాయని. నా శిష్యురాలు పెడుతున్న ముగ్గులు చూస్తున్నా."

ఆ మాటలోని శ్లేషకు రామలక్ష్మమ్మ నవ్వింది. కల్యాణి చిరునవ్వు నవ్వింది.

"అందుకే అత్మారాముడు శాంతిస్తే ముగ్గుల అందమూ, ముగ్గులు పెట్టే అమ్మాయి చందమూ తెలుస్తాయి."

సుజాత కోపంతో చుర్రున తిరిగి చూసింది.

"నీ అందం నాకెక్కడినుంచి వస్తుంది.?"

రామలక్ష్మమ్మ మేనకోడల్ని కోప్పడింది.

"హాస్యానికంటే కస్సుమంటావేం తెలివే అమ్మా!"

సుజాత సమాధానం ఇవ్వలేదు. కల్యాణి మాట మార్చింది.

"ఈవేళ ఆదివారం కదా, సెలవులేదా? ఇల్లు అద్దెకు తీసుకోవడమేగాని ఏ రోజునా ఓ గంట కూడా కూర్చోరేం?"

ఏదో తప్పుచేసి సమాధానం చెప్పుకొంటున్నట్లు రాజగోపాలం గొణిగాడు.

"ఏ స్నేహితులతోనో..."

"అయితే ఇల్లు మీకు శత్రువన్నమాట."-అంటూ సుజాత వెనక్కి తిరక్కుండానే మాట అందించింది.

"నా అనుకొనే మనిషి లేకుంటే ఇల్లేమిటి, బ్రతుకే ఓ శత్రువు." అంది రామలక్ష్మమ్మ వేదాంత ధోరణిలో.

కల్యాణి దారితీయగా రాజగోపాలం హాలులో అడుగుపెట్టేడు,

"సుజాత పార్టీ ఇస్తూంది."

వీధిలోంచే సుజాత నిరాకరించింది.

"అల్లాంటిదేం లేదండోయ్."

కల్యాణి నవ్వింది. రాజగోపాలం కూడా ఏదో అనబోయి, వీధి గుమ్మంలో రిక్షా ఆగిన చప్పుడు వినిపించి వెనుతిరిగేడు.

రిక్షా నుంచి దిగిన వ్యక్తిని చూడగానే ఆశ్చర్యం అయింది. అతడు తన మిత్రుడు వెంకట్రావు. అనుకోకుండా ప్రత్యక్షమయిన
మిత్రుణ్ణి చూసేసరికి ఎంతో సంతోషం కలిగింది.

పలకరించడానికి నోరు తెరిచేలోపునే ప్రక్కన మరో రిక్షా నిలబడింది. అందులో కనిపిస్తున్న పడుచు అతని భార్య కాబోలు. తన
మిత్రుడు పెళ్ళికూడా చేసుకొన్నాడన్నమాట. ఆ సంగతే తనకు తెలియదు. ఎప్పుడో నాలుగేళ్ళక్రితం కాలేజీనుండి ఇద్దరూ విడిపోయారు.
తరవాత మరి కలుసుకోలేదు. ఒకరిపోబడి ఒకరెరగరు. కాని, ఈవేళ తన మిత్రుడు భార్యతోసహా తన గుమ్మంలో దిగేడంటే అతడు
తన విషయం వాకబులోనే వున్నాడన్నమాట. కాని, అతనివిషయం తాను ఎన్నడూ తెలుసుకొన ప్రయత్నించలేదు అనిపించి సంకోచం
కలిగింది.

తన మిత్రుడు ఆ యింట్లోనే మరో వాటావారికి బంధువులై యుండవచ్చుననే తోచలేదు. సుజాత ధర్మమాయని తన కాలశ్యమైయిందిగాని లేకుంటే
అతడెంత చిక్కునపడేవాడోననిపించింది.

వెనక్కి గుమ్మం వెలుపలకొక అడుగు వేశాడు.

"ఏమోయ్ వెంకట్రావు! గుడ్ మార్నింగ్."

ఆ వుత్సాహంలో వీధిలోకి పరుగెత్తేవాడే. మధ్యలో కూరలగంపా, అటూ ఇటూ ఇద్దరు పడుచులూ ఉండడంతో అక్కడే కదం తొక్కవలసి
వచ్చింది.

వెంకట్రావు తిరిగి చూశాడు. మిత్రుణ్ణి గుర్తుపట్టాడు.

"అరె గోపాలం! మేము వస్తున్నామని నీకు ఎల్లా తెలిసిందోయ్, ఈ ఊళ్లోనే ఉంటున్నావా? సంతోషం."

వెంకట్రావు అంతదూరంనుంచే భార్యకు పరిచయంచేశాడు.

"మా రాజబాబు అంటూంటానే, అతడే,"

తనను మిత్రుడు అదివరకే భార్యకు పరిచయం చేశాడు. తాను మాత్రం అతణ్ణి ఎప్పుడూ తలచుకోనన్నాలేదు. ఆ మాట తోచి
రాజగోపాలం మనస్సు ఖిన్నమయింది. అతడు చూపిన ఆత్మీయతకు హృదయం పొంగివచ్చింది.

తన నెత్తిమీదుగా సాగిపోతున్న ఆ పలకరింపులూ, పరిచయాలూ వింటున్నా కూరలమ్మి చాటు కావడంవలన ఆవలివారెవరో సుజాతకు అర్థం
కాలేదు. తన అక్కా, అక్కమగడూ మెయిలులో దిగుతారని ఎరుగును. అయితే అతడికీ, రాజగోపాలానికి పరిచయం వుండి వుంటుందనే
అనుమానం కూడా ఆమెకు లేదు. కంఠస్వరం పరిచితంగా వినిపించగానే తొంగిచూసింది. కళ్ళు విప్పారేయి.

"రా బావా"

చేతిలోని కూరలు గంపలోనే విసిరేసి వాకిట్లోకి వురికింది.

"మా అక్కయ్యేది?"

"నువ్విక్కడున్నావుగదా యని ఇంటిదగ్గరే దిగవిడిచి వచ్చా."

"పనిలో పని నువ్వూ దిగబడిపోకపోయినావూ, ఇంత బెజవాడ పట్నంలో మగ ముఖమే కనబడదనుకున్నావా?"

"అప్పచెల్లెళ్ళున్నచోట మగసాయానికి లోటుండదని నే నెరగనంటావు."

"స్వానుభవం మరి."

రామలక్ష్మమ్మ ఇంట్లోంచి, వసంత వీధిలోంచీ రావడంతో ఆ బావా మరదళ్ల పరిహాసాలు కట్టుబడ్డాయి. వసంత, రామలక్ష్మమ్మ
ఒక్కమారు ఒకరినొకరు కుశలప్రశ్నలు వేసుకున్నారు.

వసంత ఎదురొచ్చి కల్యాణిని కౌగిలించుకొన్నంత పనిచేసింది. చెల్లెల్ని దగ్గరకు తీసుకొంది. రాజగోపాలానికి నమస్కారం తెలిపింది.
మగనికి సామానులు దింపి౦చి రిక్షావాళ్ళని పంపించే బాధ్యత వప్పచెప్పింది.

ఆ హడావిడి, పరిచయాలూ చూస్తూ విస్తుబోయినట్లు నిలబడ్డ రాజగోపాలాన్ని వెంకట్రావు భుజం తట్టి కదిపాడు.

"ఏమిటి చూస్తున్నావు? నీ కర్ధం కాలేదన్నమాట. సుజాత నా మరదలు. ఇదిగో ఈమె నా శ్రీమతి! తెలిసిందా? బాగుంది.
నువ్విక్కడున్నావేమిటి? ఆ వాటాలో సువ్వున్నావు. చాలా సంతోషం. అయిదేళ్ళు దాటింది మనం కలుసుకొని."

రాజగోపాలం ముఖంలో సంతోషం వ్యక్తమయింది.

"నేనిక్కడున్నాక ఎంత దగ్గరబంధువులేగాని, నువ్వు మరో యింటి కెళ్ళడానికి వీలులేదు."

సుజాత వారి సంభాషణను కనిపెడుతూనే వుంది.

"ఔను బావా! తప్పకుండా అల్లాచెయ్యి. ఇంట్లోవదలి, తాళం పెట్టేసి, మళ్ళీ రాత్రి పదిగంటలకే దర్శనం ఇస్తారు."

"అయితే మావాడి రాకపోకలమీద కన్నేసే వుంచావన్నమాట."

కల్యాణి చిరునవ్వు నవ్వింది.

"మీకోసమే ఆయన్నీవేళ నిలేసింది. లేకపోతే పావుగంటక్రితమే సైకిలు ఎక్కివుండేవారు."

వెంకట్రావు తల అడ్డంగా తిప్పేడు.

"గోపాలం నా స్నేహితుడని సుజాతకేం తెలుసు! నాకోసం నిలేసిందంటే నే వొప్పుకోను. తనకోసమే నిలేసివుంటుంది."

వెంకట్రావు రాజగోపాలం ముఖంవంక చూశాడు. అక్కడ వుత్సాహం కనబడలేదు. సుజాత కోపం నటించింది.

"మీతోనే ప్రపంచం వుందనుకోవడం మీ మగాళ్ళ...."

ఆమె సగంలో ఆగిపోయింది. తర్వాత మాట అనడానికి సాహసించలేకపోయింది. వెంకట్రావే అనేశాడు.

"తెగులంటావు. అనకుండా మానేసేవు. మాటలు కొంచెం నేర్చుకొంటున్నావన్నమాట."

నలుగురూ నవ్వేరు.

"ఇంట్లోకి నడవండి. వాకిట్లో ఈ నిలువుజీతం ఏమిటి?"

రామలక్ష్మమ్మ వసంతచేయి పట్టుకొని దారితీసింది. ఆమె మెట్లెక్కుతూ వెనుతిరిగింది.

"మీ నేస్తాన్ని ఆపండి. కాఫీ త్రాగి వెడతారు."

"నీ రాకతో నా కాఫీ చల్లారిపోయింది. ఒక్క నిముషం ఆలస్యమైతే...."

"ఏమీ చల్లారలేదు, రండి" అని కల్యాణి ఆహ్వానించింది. రామలక్ష్మమ్మ సిద్దంగావున్నా టిఫినుమాట జ్ఞాపకంచేసింది.

"అలాగే పిన్నిగారూ!"

రాజగోపాలం తనవాటా తెరిచి మిత్రుడినాహ్వానించాడు. వెంకట్రావు అతనికి నమస్కరిస్తూనే వెనక్కి తిరిగి మరదల్ని పిలిచేడు.
వసంత వచ్చింది.

"చెల్లెలితో కబుర్లుచెప్తూ నన్ను మరచిపోకుమీ."

వసంత నవ్వింది. అక్కకుబదులు సుజాత సమాధానం ఇచ్చింది.

"నీసంగతేదో మీ 'హోస్టు' చూసుకోవలసిందే. నీకూ, మాకూ రామ్ రామ్."

రాజగోపాలం మిత్రుడికి దిలాసా ఇచ్చేడు.

"ఏమోయ్ ఇంట్లో అయితే నీకు కాఫీనీళ్ళే గతి. నడు హోటలుకి."

ఆ ఇద్దరి సలహాలూ, ప్రతిపాదనలూ వెంకట్రావుకు నచ్చలేదు.

"మా దంపతులనిల్లాగ వేరు పెట్టించడం మీకు క్షేమంకాదు సుమా."

వసంత రెండు గ్లాసులతో మంచినీళ్ళు తీసుకువచ్చింది. సుజాత గద్దించింది.

"బాగుందే. వాళ్ళని వీధిలోంచే అల్లాగ పంపేద్దామనా. లోపలకి పిలు."

వసంత నవ్వుతూ కాలు లోపలికి తీసుకొంది.

"ఇది మనిల్లుకాదు. రండి."

వెంకట్రావు అంగీకరించాడు.

"ఎవరింట్లో వారి అలవాట్లు పాటించవలసిందే. రావోయ్."



పధ్నాలుగో ప్రకరణం


రాజగోపాలం తన వాటాను మిత్రుడి ఆధీనంలో పెట్టి బయలుదేరేడు. అతడు గుమ్మ౦లోంచి దిగుతుండగా కల్యాణి పలకరించింది.

"ఈవేళ సాయంకాలం నలుగురం కలసి సరదాగా భోజనం చేద్దాం. హోటలుకి వెళ్ళకండి. పెందరాళే వచ్చెయ్యండి."

గుమ్మం దిగుతుండగా కల్యాణి మామూలుగా వచ్చి ఏదోమాటలు పెట్టి ఆలస్యం చేయడం అలవాటయింది. అతని మనస్సు ఆ సాక్షాత్కారం
కోసం ఎదురుచూస్తూంది. ఈవేళ ఇంట్లో ఇంతమంది వుండడంచేత ఆమె కనబడదేమో ననుకున్నాడు. కాని, వచ్చింది. అతని మనస్సు ఆ
ఆహ్వానానికి ఉరకలే వేసింది.

"విందు మీరు చేస్తున్నారా? సుజాతా?"

ఆ ప్రయత్నమంతా సుజాతదేనని కల్యాణి చెప్పింది.

"నేను మీ చెవిని వెయ్యకుండానే వెళ్ళిపోతారేమోనని...."

రాజగోపాలం నవ్వేడు.

"నాతో మాట్లాడనివారింటి విందుకు నే రావడం...."

సుజాత కోపం అభినయించింది.

"ఆవిడ మనస్సులోని ఆలోచనలన్నీ నాకు అంటకడుతూంది. అదేం నమ్మకండి."

"మీ మాటలకేం గాని, మీ స్నేహితుడితో మీరూ వుండాలిసిందే."

వెంకట్రావు గుమ్మంలో నిలబడి వారి సంభాషణలని గమనిస్తున్నాడు. సుజాత మాటకు అతడు భయం ప్రకటించాడు.

"అంటే నువ్వురాకపోతే నాకూ అన్నం పెట్టరన్నమాట. బాబ్బాబు! మధ్యని నేను మాడిపోతాను. ఎక్కడున్నా నువ్వు
వేళకందుకోవాలోయ్!"

రాజగోపాలంకూడా హాస్యధోరణి నందుకున్నాడు.

"అయితే నువ్వునాకు 'హాస్టేజి' వన్నమాట."

కల్యాణి నవ్వింది.

"ఏమి చేదు మేస్తున్నారండి. విందుచేస్తాం రమ్మంటే శ్రమయట. హాస్టేజియట."

రాజగోపాలంకూడా ఆమెతో నవ్వుకలిపాడు.

బయలుదేరేముందు వెంకట్రావు"ఈరోజుకు సెలవుపెట్టలేవా?" అన్నాడు.

"నాకు పనిలేదు. కాని, మరొకరికోసం ఈ వేళ పనికి వెడుతున్నా. త్వరగానే వస్తా."

"మళ్ళీ రాత్రిబండికే వెడతాం. త్వరగా రా."

"ఎక్కడికెడతావులే."

అది అభ్యర్ధన కాదు. విశ్వాసం. మిత్రుని ఆదేశం. సుజాతా మాట కలిపింది.

"రావడంవరకే నీ యిష్టంగాని వెళ్ళడం మా యిష్టం."

వెంకట్రావు హాస్యమాడేడు.

"ఆ 'మా'లో రెండో మనిషి ఎవరు? రాజగోపాలమా?"

రాజగోపాలం ఆ 'మా'లో కలియడానికి ఒప్పుకోనట్లు సమాధానం ఇచ్చాడు.

"మా కేవలం బహుత్వబొధకం. కల్యాణి వున్నారు. మమ్మగారున్నారు."

వెంకట్రావు సుజాతవేపు చూసేడు. కాని ఆమె అప్పటికే వెనుతిరిగి లోపలికి అడుగు పెడుతూంది.



పదిహేనో ప్రకరణం


వెంకట్రావు మిత్రుని గదినంతనూ కలయచూసేడు. బ్రహ్మచారి గది అయినా పరిశుభ్రంగా వుంది. మిత్రుడి అలవాట్లు నెరిగి వుండడంచేత
అతనికి ఆశ్చర్యం కలగలేదు. కాలేజీ హాస్టలులో అతని గది ఎప్పుడూ పరిశుభ్రంగా వుండేది. తనతోపాటు రెండోవాడు కూడా
పరిశుభ్రతను పాటించకుంటే ఒప్పుకొనేవాడు కాదు. చొక్కాలు మంచంమీద వుండకూడదు. పుస్తకాలు మంచంక్రింద వుండకూడదు. చదువుకొనే
టేబిలు మీద దువ్వెనా, కూర్చునే కుర్చీ వీపున తడితుండూ, తలుపున చొక్కావంటి వతనిగదిలో ఎవ్వరూ చూసివుండరు.

అదే గది. వున్న తేడా అల్లా పుస్తకాల సంఖ్య. నాల్గయిదు ఆల్విన్ రాక్ లు గోడలకు తగిలించీ, గోడలనానించీ నిలబెట్టే
వున్నాయి. వాటి నిండుగా పుస్తకాలు, మంచం తలాపున వున్న టేబుల్ మీద వరసలో పేర్చిన పుస్తకాలు. అన్ని పుస్తకాలు
వెంకట్రావు వ్యక్తుల ఇళ్ళలో చూడలేదు.

"ఈతనికి పుస్తకాల పిచ్చి బాగా ఎక్కువయిందన్నమాట."

వెనకనే వున్న వసంత సమాధానం ఇచ్చింది.

"ఇతర పిచ్చిలకన్న పుస్తకాల పిచ్చి మంచిదేకదా!"

"అంత భయంకరమా! తెగచదవడమేనా? ఫలానా విషయం అనిలేదు. ఏ పుస్తకం దొరికినా అడ్డపడతాడు. ఇప్పుడెలావున్నాడోగాని."

సుజాత కూడ అక్కడేవుంది.

"అక్కకి బాగా తెలుసు. వాళ్ళిద్దరూ ఏవేవో పుస్తకాల గురించి వాదనలు వేసుక్కూర్చుంటారు."

అతడేం మాట్లాడలేదు.

"పుస్తకాలు కొనడమేనా, చదవడం ఉందా?" అనిపించింది. తిరిగేసేడు. అన్ని పుస్తకాలూ గుర్తు తెలియలేదు.

వెంకట్రావు ఒక్కొక్క పుస్తకమే తీశాడు.

"రుచులు మారేయి" అనుకొన్నాడు.

టేబిలు మీదున్న పుస్తకాలన్నీ తెలుగువి. కొత్తగా వస్తున్న నవలలన్నీ అక్కడున్నాయనిపించింది. వాటి మీద తేదీలు
వేసివున్నాయి. అన్నీ ఆ యింట్లోకి వచ్చింతర్వాత కొన్నవే. ఒక తెలుగునవలమీద కల్యాణి సంతకం పెట్టి వుంది. దాని నావిడ
బహుమతి చేసింది కాబోలు ననుకొన్నాడు. ఆ పుస్తకంలోనే ఆమె ఫోటో కార్డు సైజుది వుంది.

అయితే ఆమె సంతకం వున్న పుస్తకాలు అయిదారు వుండడమూ అన్నింటా ఆమె ఫోటోలు వుండడం చూశాక మిత్రుని అభిమానం అర్థం
అయిందనుకొన్నాడు. అయితే అది ఏక పక్షమా? ఉభయత్రా వుందా?

వసంత గదిలోకి రావడంతో అతడా పుస్తకాలను సర్దేశాడు. అతడు పుస్తకాలు సర్దుతూండడం గమనించి ఆమె వ్యాఖ్యానించింది.

"ఎవరన్నా బాగుందంటే సరి వెంటనే బజార్లో కొనితెస్తారుట."

"ఎవరన్నారట?"

"సుజాతే."

కాని, సుజాత బాగున్నదనడంచేత కొన్న పుస్తకం ఒక్కటీ లేదనిపించింది. కాని పైకి ఆ మాట అనలేదు.

"అంటే సుజాత పుస్తకాలను గురించి మాట్లాడేటంతగా చదువుతూందన్నమాట."

సుజాత చదువు కేవలం కాలక్షేపం చదువు మాత్రమే. తండ్రికి ఆస్తి బాగా వుంది. అక్కడినుంచి బయట పడ్డానికిదో దారి. అంతే,
తండ్రికో బలహీనత. తాను చదువుకో లేదు. తన సంతానం అంతా బాగా చదువుకోవాలని ఆయన వూహ. కంట్రాక్టరుగా బాగా సంపాదించేడు.
కొడుకులు ముగ్గురు పెద్ద చదువులు చదివి మంచి వుద్యోగాల్లో వున్నారు. ఒక కొడుకు అమెరికాలో చదువుకొచ్చేడు. కూతుళ్ళు ఇద్దరూ
ఆయన కోరికను పాటించలేదు. పెద్ద కూతురు వసంత బి. ఏ. చదువుతూ ప్రేమ వలలో చిక్కింది. పెళ్ళి చేసుకొని చక్కగా
మగడితో కాపరం చేస్తూంది. రెండో ఆమె మీద ఆయన ఎంతో ఆశ పెట్టుకున్నాడు.

ప్రేమ-అనురాగం చిన్నతనంలోనే చదువుకు అడ్డం రాకూడదని విధవ చెల్లెల్ని తోడిచ్చి కాపురమే పెట్టించాడు. తన వివాహానంతరం
కొద్ది రోజుల్లోనే మరదలి స్వభావాన్ని వెంకట్రావు గ్రహించేడు.

"కల్యాణి వుందిగా. దానికా యావ విపరీతం. దాని ప్రక్కనుంటే రాళ్ళక్కూడా చదువుకోవాలనిపిస్తుంది."

ఈమారు మిత్రునిగదిలో పుస్తకాలు ఎల్లా చేరేయో అర్థం అయింది.

"ఆమె ఏం చదువుతారు ఎక్కువగా?"

"ఏం చెప్పను?"

"నిజమే చెప్పు."

"అంటే...."

"ఆమెకు వేని మీద అభిమానమో..."

"ఇంగ్లీషు పుస్తకాలూ చదువుతుంది. కాని తెలుగంటే అభిమానం. వాళ్ళ నాన్నగారు కాంగ్రెసువాదట."

"అంటే-- ఈవిడ కమ్యూనిష్టా?"

"కమ్యూనిష్టులకిగాని తెలుగు పట్టదనా?"

"ఏం చదువుతూన్నారంటే వాళ్ళ నాన్నగారు కాంగ్రెసు వాదంటావేం?"

"ఆయన పనికట్టుకు సంస్కృతం చెప్పించారట."

"గాంధీగారి మాట ప్రకారం ఆయన చిన్నప్పుడు కాలేజీ వదిలేసి వుండాలి."

"సంస్కృతం చదవాలనే వాళ్ళంతా చిన్నప్పుడు కాలేజీలు వదిలి వుండాలనే సిధ్ధాంతం......"

వెంకట్రావు నవ్వేడు. తాను వేసిన వికట ప్రశ్నకి ఆమె బదులు తీర్చింది.

"గాందీగారు స్కూళ్ళూ, కాలేజీలూ, కోర్టులూ వదలమన్నది ఒకందుకు; వీళ్ళు అర్థం చేసుకొన్నదింకొకటి. అసలు భాషకూ, విద్యకూ
స్వంతం అనీ, పరాయి అనీ విశేషణాలు తగిలించేరు. పరాయి భాషలూ చదువులూ మాని మనదంటూ సంస్కృతం మీద పడ్డారు. కొన్నివేల
మంది జీవితాలు పాడయి శుధ్ధఛాందసులు తయారయాక గానీ మన భాష అనే సంస్కృతం మరణించి చాల కాలమయిందనీ ఆ ప్రేతాన్ని
కౌగలించుకొని ప్రయోజనం లేదనీ అర్థం కాలేదు. మళ్ళీ కాలేజీలకు ఎగబడ్డారు."

"మన భాష చావలేదు. అది సంస్కృతం కాదు."-అని వసంత అడ్డుకుంది.

ఆమెది తెలుగు అభిమాన శాఖ. ఆ భాషను గురించి ఆమెకు కొన్ని అభిప్రాయాలూ, అభిమానాలూ వున్నాయి. వెంకట్రావు ఎరుగును. వెంటనే
తన పొరపాటును సర్దుకొంటూనే ఆమెను ఎగతాళి పట్టించాడు.

"మనకు ఉత్తర-దక్షిణాలు లేకుండానే చేసిన భాషను మనదనడం పొరపాటే."

తెలుగు భాషలో ఉత్తర- దక్షిణాలు తెలిపే పదాలే పోయేటంతగా సంస్కృతం మన భాషను అణచివేసిందని వసంత విచారం.

"ఒక మహానుభావుడు సాహిత్య అకాడమీలో స్థానం కోసం రాత్రికి రాత్రి జ్ఞానోదయం అయిందన్నాడు. అంతవరకూ ద్రావిడ భాషల్లో
తెలుగొకటి అన్నవాడల్లా ఆ జ్ఞానోదయం అయాక తెలుగు సంస్కృతంలోంచి పుట్టిందన్నాడు. మీరు మరో అడుగు ముందుకు వేసి సంస్కృతమే
మన భాష అంటున్నారు. అకాడమీ అధ్యక్షత మీదగానీ చూపు పడిందేమిటి?"

వెంకట్రావు నవ్వడంతప్ప సమాధానం ఇవ్వలేదు. వసంత అతనిని చేయిపట్టుకుని కుర్చీనుంచి లేవదీసింది.

"లేవండి. భోజనానికి."

"అదే అనుకొంటున్నా. మీరంతా భోజనాలు కానిచ్చేసి, నా కాకలి లేదనుకొంటు...."

"మీకా అనుమానం ఎందుక్కలిగింది? మీ మగతనానికి అవమనం జరగనిస్తామా?"

వెంకట్రావు కదిలేడు.

"మనం నల్గురం కలిసేనా?"

"ముందు మీరు..."

"వద్దమ్మాయి! ఆకలితో మీరు పిల్లుల్లా చూస్తూంటే నాకు ముద్ద దిగదు."

"మేం ఎదటపడంగా. అత్తయ్యదే వడ్డన."

"నువ్వు ప్రక్కన లేకుంటే ముద్ద...."

"కల్యాణి ఏమనుకుంటుంది?"

"అందుకే నల్గురం కూర్చుందాం."

"కల్యాణి సిగ్గుపడుతుందేమో?"

"నీ మాట చెప్పు."

ఆమె కేమన్నా అభ్యంతరం వుందేమో వెంకట్రావు సరాసరి కల్యాణినే అడిగాడు. ఆమె నవ్వింది.

"ఆడవాళ్ళు ముగ్గురు భోజనానికి కూర్చున్నారంటే కొన్ని దశాబ్దాల గాథలూ, దేశ విదేశాల చరిత్రలూ కబుర్లలోకి వస్తాయి.
భరించగలమనుకుంటే..."

సుజాత బావను హాస్యమాడింది.

"పోనీలే, నిన్న కొన్న కొత్తచీర బావకి.."

వెంకట్రావు నవ్వాడు.

"పై వేషం వేయిస్తావు సరే..."

"దానితో వాదులాడ్డంలో మీకు ఆకలి తోచేలాగ లేదే"-అని వసంత అతని వాగ్ధోరణికి అడ్డుకట్ట వేసింది.

కల్యాణి నవ్వింది.

"వేషం మారిస్తే స్వభావం మారుతుందా?"

"అంటే కథలూ, చరిత్రలూ మాకు పట్టవనా?"

సుజాత చటుక్కున అందించింది.

"అబ్బో! ఆడపిల్లల కథలూ, వాళ్ళని ఏడిపించిన చరిత్రలూ చెప్పుకోవడం మీ తర్వాతే.."

"మీరు..."

వెంకట్రావు మాటలు పూర్తి చేయకుండానే సుజాత అందుకుంది.

"మా కథల్లో మగవాళ్ళు 'విలన్లు'. అంతే."

"జీవితంలోనేగాని మీ కథల్లో హీరోలు వుండరంటావు."

అతని మాటలోని మెలికను వెంటనే అందుకోలేక సుజాత నోరు తెరిచింది. వెంకట్రావు నవ్వేడు.

"అయితే ఒక్కమాటన్నా మా ప్రతాపం మీ నోట వినవలసిందే."

రామలక్ష్మమ్మ వచ్చి అందర్నీ భోజనాలకు పిలిచింది.

"కల్యాణమ్మా! నువ్వు కూడా రామ్మా!"

వసంత, కల్యాణి ఆమెకు సహాయం చెయ్యడానికి వెంట వెళ్ళేరు.

భోజనాల గదిలో అడుగుపెడుతూ వెంకట్రావు తన వెనకనే వున్న సుజాతను భార్యకు చూపించేడు.

"చీర సింగారించినా మీ చెల్లెల్ని మగరాయడే ననుకొంటారు సుమా!"

అతడామాట ఎందుకన్నాడో అందరికీ అర్థం అయింది. నవ్వేరు. సుజాత లెక్క చేయలేదు.

"నువ్వు తినే పిట్ట తిండికి నలుగురు వడ్డించాలా ఏం బావా?"

"నీ చేత వంట చేయించాలంటే నీకో బకాసురుణ్ణి వెతకాలన్న మాట."

"బకాసురుడూ, కీచకుడూ...."

వెంకట్రావు మరదలి మాట పూర్తి కానివ్వలేదు.

"మగాళ్ళలో తెగలంతే నంటావు?"

సుజాతకు బాగా కోపం వచ్చేసింది.

"కాకుంటే కొందరు బృహన్నలలూ, మరికొందరు గోపాలకృష్ణులున్నూ."

మాట జారాక సుజాత నాలుక కరుచుకొంది. వసంత విదలించింది.

"ఏమిటే నువ్వు మరీను."

అక్క గదమడంతో సుజాత గమ్మునైపోయింది. వెంకట్రావు వదలలేదు.

"మీరీవిడ చేత మహా భారతం కంఠోపాఠం చేయించినట్లుందే...."

"అక్క చెప్తేగాని ఏం చదవాలో తెలియంది మీ మిత్రుడికి...."

వెంకట్రావు ఆమె వేపు ఓరగా చూసి తల పంకించేడు.

"అయితే అతని పనులన్నింటిమీదా గట్టినిఘాయే వుంచావన్నమాట."

కల్యాణి చిరునవ్వుతో తల తిప్పుకొంది. వసంత తన అసమర్థతను ప్రకటించింది. "అబ్బ! ఏమిటండీ! దానితో పాటు మీరూ చిన్న
పిల్లలయిపోతున్నారు."

"ఆవిడ అక్కగారిని పెళ్ళి చేసుకొన్నాను గదా యని ముసిలితనం వచ్చేసిందంటావేమిటి?"

ఇంతలో వీధి గుమ్మం వద్ద ఎవ్వరో పిలిచినట్లయి అలా మాటలు నిలిపేరు.

"గోపాలం గారు వచ్చారేమో" అంది కల్యాణి. కాని ఎవరిదో కొత్త గొంతు తనకోసం వాకబు చేస్తూంది.

"కల్యాణి గారున్నారా?"

"నీకోసమే" నంది వసంత.

రామలక్ష్మమ్మ వచ్చిన వారిని కూర్చోబెట్టింది.

"పేరేమిటన్నారు?"

"కృష్ణవేణి. వారు నన్నెరుగరు. భోజనం చెయ్యనివ్వండి. కూర్చుంటాం."

కల్యాణి కా పేరు కొత్తగా తోచింది. భోజనం ముగించడానికి తొందరపడుతుంటే వెంకట్రావు వారించేడు.

"కూర్చున్నారు గదా! ఎందుకంత తొందర?"

రామలక్ష్మమ్మ లోనికి వచ్చి కృష్ణవేణి వచ్చిన పని చెప్పింది.

"పేరంటానికి పిలువ వచ్చారు."

కల్యాణి గుర్తుచేసుకొంది.

"మా స్టూడెంటు హైమకు పెళ్ళి అన్నారు. బహుశా ఆమె అక్కగారు వచ్చి వుంటారు."



పదహారో ప్రకరణం


మిత్రుని గదిలో ఒక నిద్ర తీసి లేచేసరికి వసంత కాఫీ కప్పుతో హాజరయింది. భార్యా భర్తలిద్దరూ కాఫీ తీసుకుంటూ కబుర్లు
చెప్పుకొంటున్నా, వారి మనస్సులలో రాజగోపాలాన్ని గురించిన ఆలోచనలే సాగుతున్నాయని ఇద్దరూ త్వరలోనే గ్రహించగలిగేరు.

"మీ మిత్రుడెవరు?"

వెంకట్రావు భార్య ప్రశ్న అర్థం కానట్లు నటించేడు.

"వర్కుషాపులో మెకానికల్ ఇంజనీరు."

మగని కొంటెదనానికి వసంత ఆనందించింది. ఈ మారు స్పష్టంగానే అడిగింది.

"కులానికి...."

వెంకట్రావు కనుబొమ్మలెత్తేడు.

"ఏం కథ?"

వసంత మనస్సు విప్పలేదు.

"వూరికెనే..."

వెంకట్రావు మాట్లాడలేదు. వసంత అందించింది.

"మన....."

"తెలియదోయ్."

"అతిశయాలు పోతారు."

వెంకట్రావు ప్రశ్నార్ధకంగా చూసేడు.

"డబ్బులేదు. లేనివారికులం ఏదైతేనేం?"

"మీకున్న డబ్బేమిటో...."

వెంకట్రావు నవ్వి భార్యను చేరదీసుకొని ముద్దు పెట్టుకొన్నాడు. వసంత అతని కౌగిలిలో వొదిగింది.

"నువ్వున్నావు. నాకు డబ్బు మాట సమస్య కాలేదు."

శేఖరం అల్లుడికి డబ్బు వుండవలసి వుంటుందనే విషయంలో అశ్రధ్ధ చూపలేదు. సత్యాగ్రహాలు, కృష్ణ జన్మస్థాన గమనాలలో
ఆస్తి పోయి కుటుంబం తిండికి కటకటపడిన ఘట్టాల నాతడు మరవలేదు. అందుచేత వెంకట్రావు ఆస్తిపాస్తుల సంగతి వాకబు
ప్రారంభించేడు. ఏమీలేదని విన్నాక పెదవి విరిచేడు. కాని వసంత వూరుకోలేదు. ఆ పెళ్ళిని సాధించితీరింది.

"ఎవ్వరైనా అంతే..."

"ఏం మరదలు కన్నేసిందనే అంటావా?"

వసంత కళ్ళు తెరిచింది.

"అటువంటిది మా యింటా వంటా కూడ లేదు."

"నేనెరుగనా యేమిటి?"-అన్నాడు వెంకట్రావు ఎగతాళిగా.

"ఏం ఎరుగుదురు?" అంటూ వసంత కోర చూపులు చూసింది.

"మొదటిమాటు నిన్ను పలకరించినప్పుడు మంచి నడి శీతాకాలంలో ఐస్ క్రీం నోట పెట్టుకొన్నంత ఆనందం అయింది."

వెనుకటి జ్ఞాపకాలకు వసంత నవ్వింది. అతని ఒడిలోంచి లేచింది.

"మిత్రులిద్దరూ ఒకే జాతి పక్షులా?"

"వాళ్ళు చెత్తరెయ్యలు." (క్షత్రియులు)

తన ప్రశ్నకది సమాధానం కాకున్నా మరో ప్రశ్నకు కావలసిన సమాధానం వచ్చింది. ఒక్క క్షణం వూరుకొంది. మరల ఏదో
అనుమానిస్తూనే అంది.

"మన వాళ్ళేమో ననుకొన్నా."

"మన కులంలోవాళ్ళు తప్ప మగవాళ్ళు కారా?"

వసంత ఏమీ అనలేదు. వెంకట్రావు ఓ నిముషం వూరుకొని మళ్ళీ అన్నాడు.

"ఈ రోజుల్లోకూడా కులాన్ని పట్టి మనుష్యుల మంచి చెడ్డల్ని ఆలోచించే ధోరణి....."

వసంత సగంలోనే అందుకొంది.

"అదేం మాటండీ."

"పోనీ, నీ మాట చెప్పరాదూ?"

వసంత ఏమీ అనలేదు.

"మన అనుమానం నిజమేనా?"

వసంత తల తిప్పింది.

"చెల్లాయి చూపు అటున్నట్లే తోస్తుంది."

అక్క-బావకూ ప్రతి పదిహేనురోజులకీ ఓ మారు వ్రాసే జాబుల్లో సుజాత గత అయిదారుమాసాలుగా రాజగోపాలం అనే ఇంజనీరు ప్రసక్తి
ఏదో విధంగా తెస్తూండడం వారు గమనించారు. రాజగోపాలం అనే ఇంజనీరూ, తాను రాజబాబు అనే మిత్రుడూ ఒకరేనని తోచకపోయినా అతని
అలవాట్లను గురించీ, మాటలూ-చేతలూ గురించీ వ్రాస్తున్నదేదో పరిచితం అయినట్లే తోచింది వెంకట్రావుకు. అన్ని మాట్లు ఆ పేరు
ఎత్తి వ్రాస్తుంటే ఇద్దరికీ ఒకే ఆలోచన మెదిలింది. కాని ఆ మాట గట్టిగా అనుకోలేదు. ఏమంటే ఆ రాజగోపాలం ఎవరో,
ఎలాంటివాడో, వివాహితుడో ఏమో. పైగా కాంగ్రెసువాడైనా త్న మామగారికి కులాభిమానం, పట్టుదలా హెచ్చు. వాటిని గురించి కొంతవరకైనా
తెలుసుకుంటే తప్ప సుజాతకు ఆ ఆలోచనను సూచించను కూడ రాదు.

ఇద్దరూ ఈవేళ కలిసి ఇక్కడికి రావడంలో ఆ ఆలోచనే ప్రథమ స్థానం ఆక్రమించింది. తాను హైద్రాబాదు ఏదో పనిమీద
వెళ్ళవలసి వచ్చింది. పది పదిహేనురోజులవుతుంది. వసంత తానూ వస్తానంది. అతడు తిరిగి వచ్చేవరకూ వసంత బెజవాడలో
వుంటుంది. పరిస్థితులు గమనిస్తుంది. తిరిగి వచ్చేటప్పుడు వెంకట్రావు దిగుతాడు. అప్పుడేం చెయ్యాలో ఆలోచిస్తారు. కాని, ఇక్కడ
పరిస్థితులు చూస్తే ఒక కొలిక్కి వచ్చి కూర్చున్నట్లనిపించింది.

వెంకట్రావు ఒక్క క్షణం వూరుకున్నాడు.

"సుజాత కాయన తప్ప మరో చూపే లేదు" అంది వసంత.

"కల్యాణి ఎరుగునా?"

తన చెల్లెలు ఆలొచనలు కల్యాణికి ఎందుకు తెలియాలో వసంత కర్థం కాలేదు

ఏమో....."

"గోపాలం అభిప్రాయం....."

"ముందు మా నాన్న ఒప్పుకోవాలిగదా!"

వెంకట్రావు ఆచి ఆచి స్పష్టంగా చెప్పేడు.

"కొనబోయే గేదె, పెట్టబోయే బచ్చలిపాదులా వుంటుంది మన వాదం. ఒక్కటి గుర్తుంచుకో. నీ చెల్లెలు నువ్వు కాదు. దాని మనస్సులో
ఓ ఆలోచన పడింది. ఆ పని సాధించేటందుకు నీలాగ వెనకా ముందూ ఆడదు."

వెనుకటి స్మృతులు వసంతను గిలిగింతలు పెట్టేయి. వసంత వెంకట్రావును వివాహమాడడానికి ఒప్పుకొన్నా తండ్రి 'సై' అననిదే ముందుకు
అడుగు వెయ్యనంది. వెంకట్రావుకు ఆస్తి లేకపోవడం తప్ప కులం పేచీ లేకపోవడంచేత ఆటంకం కలగలేదు. ఆమె కాస్త గట్టిగా
చెప్పేసరికి ఆయన మెత్తపడ్డాడు.

"నాదే వేరుకులం అయివుంటే మన పెళ్ళి జరిగివుండేది కాదు"- అని అతడు చాలా మార్లు భార్యను దెప్పేడు.

"ఇంతకాలం పెంచిన వాళ్ళని కాదనడం ఎల్లాగండి?"-అని విస్తుపోవడం తప్ప ఆమె వద్ద మరో సమాధానమూ లేదు.

"అలా జరిగివుంటే ఏం చేసేవారు?" అని ఆమె ప్రశ్న.

"నీ ఇంట్లో మకాం పెట్టి, కాపురం చెడగొట్టి లేవదీసుకు తెచ్చుకొనేవాడిని."

వసంత అంత భయంకరమైన పనికి ఒప్పుకొని వుండేది కాదు. ఆ మాట చెప్పడానికి సందేహించనూ లేదు.

"ఏడాదో రెండేళ్ళో బాధగా వుండేదేమో, తర్వాత బహుశా మీ గుర్తే రాకపోవచ్చు."

వసంత చెప్పింది నిజమని వెంకట్రావుకూ తెలుసు. అది అంతే జరిగివుండేది. అయినా ఆ మాట విన్నప్పుడు మనస్సుకు కష్టమే
కలిగింది.

"మరచిపోనిచ్చే వాడినని నీ వూహ?"

జరిగివుండని పరిస్థితులని వూహించుకొని ఆ దంపతులు అనేక పర్యాయాలు తమ మనస్తత్వాల్ని తిరగేసి నవ్వుకున్నారు. వెంకట్రావు
అదే జ్ఞాపకం చేశాడు.

"నవ్వుతాలు కాదు. కులం పట్టింపు మీనాన్న కుండొచ్చు. నాన్న పట్టింపు నీకుండొచ్చు. కాని మీ చెల్లెలి కదేం పట్టదు. మీనాన్న
నోరు నొక్కగలది అదే."

చెల్లెలు తన మగడు వూహిస్తున్నంత మొండి కాదని వసంత అంది.

"మొండితనం మాట నేను చెప్పలేదు. ఆ మధ్య నీకో వ్యాసం చూపా, గుర్తుందా?"

కాలేజీ చదువులు, యూనివర్శిటీ పరీక్షలు, హాస్టళ్ళలో జీవనం, హోటళ్ళలో భోజనం ఇవన్నీ దేశంలోని వివిధ కులాల వారి
సంస్కార భేదాల్ని చదును చేసేస్తున్నాయి. కులాన్ని మాటల్లోనే తప్ప సంస్కారంలో కనబడని నూతనతరం తయారవుతోంది. శరీర
నిర్మాణానికి సంబంధించినంతవరకు నీగ్రో-మంగోలియను, ఆర్యను- సెమెటిక్ జాతుల మధ్య కనపడేపాటి కొద్దిపాటి భేదాలవంటివి కూడా
మనదేశం లోని కులాల మధ్య లేవు. ఈ నూతన యుగంలో కులభేదాన్ని చూడడం ఒక మానసికమైన జబ్బు- అనేది ఆ వ్యాసకర్త
భావం.

"దానినామధ్య కత్తిరించి పంపించా. దానికి ఏం వ్రాసిందో చూశావుగా! మనం వ్రాసేవరకూ కులాల మధ్య అంత పేచీయే వుందని
ఎరగనంది. దాని మనస్తత్వం వేరు. నాకు తెలుసు. కాని ఇక్కడున్న సమస్య వేరు. అతని చూపు...."

ఆ విషయం ఇద్దరికీ తెలియదు.



పదిహేడో ప్రకరణం


పెళ్ళికూతురు వేషంలో గుమ్మంలోకి ఎదురువచ్చిన హైమవతిని కల్యాణి గడ్డం పుణికి పలకరించింది. సిగ్గుతో రెప్పలల్లారుస్తూ,
తలవంచుకుని హైమవతి ఆమె ప్రక్కనే వత్తుకొని లోనికి నడిచింది.

కల్యాణి వెంట వచ్చిన వసంతనూ, సుజాతనూ, కృష్ణవేణి ఆహ్వానించింది. కల్యాణి రాకకోసం తన చెల్లెలు పడుతున్న ఆదుర్దాను
వివరించింది. కల్యాణి ఆమె యెడ జాలి చూపింది.

"వెర్రి పిల్ల."

"పెళ్ళి నాలుగు రోజులూ మీరిక్కడనే వుండాలి." అంది కృష్ణవేణి.

"అయిదు రోజులు పెళ్ళి చేస్తారా?" అని ప్రశ్నించింది. కృష్ణవేణి తలతిప్పింది.

"లేదండీ, ఒక్కరోజే. ఇంకా చెప్పాలంటే ఒక్క గంటే."

కల్యాణి సంతోషం తెలిపింది.

"అదే సుఖం. డబ్బు ఖర్చు. శరీరం హైరాణ. అయిదురోజుల పాటు ఒకరు మర్యాదలు చేయడం. ఒకరు పొందడం అనే పరిస్థితి
ఫలితంగా తగువులు. ఇదే మంచిది. ఇప్పుడు ఐదు రోజుల పెళ్ళి ఎవ్వరూ చెయ్యడంలేదు.

"ఆ రోజులు వేరు, ఆ సరదాలు వేరు. ఇప్పుడెంతసేపు పీటల మీద నుంచి ఎంత త్వరగా లేచిపోదాం, పెళ్ళాం పక్కలోకి ఎంత
త్వరగా వస్తుందనేగాని ఓ ముద్దు-ముచ్చటా అని వుందా ఏమన్నానా? మా రోజుల్లో ఇల్లాగేనా: పెళ్ళి అనేది ఒక్క పెళ్ళి కొడుకూ
పెళ్ళి కూతురూ కోసమేనా? అయినవాళ్ళు పదిమందీ చేరడం, బంధుత్వాలు జ్ఞాపకం చేసుకోవడం, సరదాగా ఆ అయిదారు
రోజులూగడపడం...."

కల్యాణి వెనుతిరిగి చూసింది. కృష్ణవేణి పరిచయం చేసింది.

"మా అమ్మమ్మ. హైమను పెంచినదీవిడే. మన హైమ టీచరు వీరే నమ్మా."

కల్యాణి నమస్కరించింది. ముసలమ్మ చాల సంతోషపడింది.

"అన్నగారిని గురించి తలచనైనా లేదు. మీరు రాలేదని మహా ఇదయిపోతుంది. వచ్చేవు తల్లీ! మంచి పని చేశావు."

కృష్ణవేణి అందరికీ కాఫీలు తెచ్చి యిచ్చింది.

కల్యాణి పెళ్ళి కూతుర్ని దగ్గరకు తీసుకొంది. ముసలమ్మ వెళ్ళిపోతూ అభ్యర్థించింది.

"పసుపు రాయించుకోకుండా వెళ్ళకండి తల్లీ. మన ఆచారాలు ఆచారాలే."

"అల్లాగే మామ్మగారూ!" - అని కల్యాణి దిలాసా యిచ్చింది.

"పెళ్లికొడుకు ఎల్లా వున్నాడు?"

హైమ సిగ్గుపడి తల వంచుకొంది. కల్యాణి గడ్డం పట్టుకొని పైకెత్తింది. హైమవతి మరింత సిగ్గుపడి కళ్ళు మూసుకుంది. కల్యాణి
నవ్వింది.

"నీల మేఘ శ్యాముడా?"

హైమ మాట్లాడలేదు. కాని ఒకరోజున పాఠంలో ఆ శబ్దానికి వ్యావహారిక రూపం చింతబొగ్గు అని చెప్పిన మాట గుర్తుకువచ్చింది.
నవ్వొచ్చింది. కాని ఆచుకొంది. బిగబట్టిన పెదవుల మధ్య రేఖా మాత్రంగా కనబడుతున్న మృదుహాసం ఆ వర్ణనను నిరాకరించింది.
కల్యాణి వదలలేదు.

"అసలు చూసేవా?"

హైమ అంగీకార సూచకంగా తలవూచింది.

"వచ్చేడన్న మాటేనా?"

హైమ మాట్లాడలేదు. కల్యాణి ఆమె బుగ్గమీద చిన్నగా మీటింది. ఆమె మరింత సిగ్గుపడి ఒత్తుకుపోయింది.

"ఏం చేస్తున్నాడు?"

"ఎం.బి.బి.ఎస్., మూడో యేడు...."

సన్నగా వినబడీ వినబడకుండా హైమ అన్నమాటకు కల్యాణి ఆశ్చర్యం వెలిబుచ్చింది.

"ఆయన చదువు సగంలో వంది. నీవీ ఏడాది స్కూల్ ఫైనలులో వున్నావు. అంటే చదువింకా ప్రారంభమే కాలేదన్నమాట. ఇప్పుడే
పెళ్ళికింత తొందరేం వచ్చిందమ్మా?"

ఆ ప్రశ్నకు హైమ ఏమీ సమాధానం ఇచ్చింది. ఆమె కంఠం ఎంతో మృదువుగానే వున్నా, ఆ ప్రశ్న రావడం కష్టం అనిపించినట్లే
అర్థం అవుతుంది.

"వాళ్ళ అన్నకూడా ఆ మాటే అన్నాడు. అవునుగాని తెలియక అడుగుతాను, బి.ఏ. ప్యాసయితే మగడిలోటు భర్తీ అవుతుందా?"

సుజాతకు తానుకూడా ఒకనాడీ ప్రశ్న వేసినట్లు జ్ఞాపకం వచ్చింది. దానికి కల్యాణి ఇచ్చిన సమాధానం సంతృప్తి కలిగించలేదు.
'ఇప్పుడేం చెప్తావు?" అన్నట్లు ఆమెకళ్ళు వుత్సాహంతో దీపించాయి. దానిని గ్రహించినట్లు కల్యాణి చిరునవ్వు నవ్వింది.

"మొగుడులోటు తీరుస్తుందా అంటే మనం మొగుడినుంచి ఏం కోరుతున్నాము - అన్నదానిమీద ఆధారపడి వుంటుంది."

తనకు చెప్పిన పధ్ధతిలోనూ, ఇప్పటి ఎత్తుగడలోనూ తేడా వున్నదని సుజాత గ్రహించి శ్రధ్ధగా వింటూంది.

ముసలమ్మ మొగమాటంలేకుండా అనేసింది. వయస్సు ఆమెకు శ్రీరామరక్ష.

"ఇన్ని యుగాలనించీ ఆడది మగాడినుంచి ఏం కోరుతూంది? కడుపు-కడుపునకింత తిండీ, కడుపు నిండిన పిల్లలూ...."

ఆ మాటల్లోని అసభ్యతను కల్యాణి పట్టించుకోలేదు. చాలా జాగ్రత్తగా తూచినట్లు మాట్లాడింది.

"మీరన్నది నిజమే. స్థూలంగా చూస్తే ఇంతవరకు పరిస్థితి అలాగే వుంది. అయితే ఈవేళ మగవాని స్థితీ, లోకం తీరుకూడా
మీనాడున్న్నట్లు లేవు. ఆడుది కూడా కొద్దోగొప్పో సంపాదించుకోవడం, తనకాళ్ళ మీద తాను నిలబడుతూ, మగడి సంపాదనకు
వేన్నీళ్ళకు చన్నీళ్ళులా తోడు చెయ్యడం అవసరం అవుతూంది.

"డాక్టరీ చదివేవాడుకూడా అన్నం పెట్టలేక, పెళ్ళాన్ని సంపాదించుకోమంటాడా?"

ముసలమ్మ ప్రశ్న విన్నాక తానా చర్చ రేపినందుకు కల్యాణి చింతించింది.

"హైమ పెళ్ళికొడుకు సమస్య కాదిది. లోకం స్థితి చేప్పేను మామ్మగారూ!"

సుజాత తృప్తిపడలేదు. చర్చ మధ్యలో తెగిపోవడం ఆమెకు నచ్చలేదు. అయితే తాననుకొన్న దారికి తేవడం ఎల్లాగో అర్థం
కాలేదు. అందుచేత ఆ మాటనే సాగతీసింది.

"అదిమాత్రం ఎందుక్కాదు? పెళ్ళికొడుకు ఇంకా డాక్టరు కాలేదుగా?"

డాక్టరుకాని మగడికి ఎస్.ఎస్.ఎల్.సి చదువుతున్న భార్య సంపాదించి పెడుతుందంటున్నట్లనిపించి ముసలమ్మ నవ్వింది.

"నువ్వెవరి అమ్మాయివో నేనెరుగను. ఒక్క మాట అడుగుతా చెప్పు. తప్పట్టుకోకేం?"

ప్రశ్నలకు సమాధానం అనేటప్పటికి సుజాత సందేహించింది. కాని వాదం పెట్టుకున్నాక ఎదటివాళ్ళ ప్రశ్నలు విన ననడం ఎల్లా?
సమాధానం మాట తర్వాత.

"అడగండి. తప్పు పట్టుకోవడం ఏముంది? పెద్దలు తప్పుమాట అనరు."

వసంత గడుస్తనాన్ని హైమ గ్రహించింది. తన అమ్మమ్మ మాట తూలకపోయినా, మోటుగా అనేస్తుంది. అందుచేత తానే అందుకుంది.

"మా టీచరుగారు చెప్పింది నిజమే మరి....."

"పోవే భడవకానా... నీ సంగతి చెప్తా" నంటూ ఆమె మనమరాలిని గదిమి సుజాతవేపు తిరిగింది.

"అవునుగాని, గునపం లాంటి కుర్రాడొచ్చి పెళ్ళిపీటలమీదికి రమ్మంటే, వుండు ఈ బి. ఏ. సంగతి ఏదో తేలనియ్యమని
కూర్చొంటావా?"

సుజాత బిడియపడింది. నవ్వింది.

"చదువయ్యేదాకా నేనొప్పుకోను."

కాని ఆ మాటలో అంత విశ్వాసం కనబడలేదు. ముసలమ్మ ఆ లోకువను పట్టుకొని నిగ్గదీసింది.

"నా దగ్గరెందుకు చెప్తావుగాని, ఇల్లాంటి కబుర్లు ఈ డెబ్బయ్యేళ్ళలో వెయ్యిన్నొక్కమార్లు విన్నా. మొగుడు నచ్చలేదని గదిలోకి
వెళ్ళడానికి మొరాయించిన వాళ్ళే మొగుణ్ణి మళ్ళీ మంచం దిగనియ్యరు." అంటూ ఆమె తన హాస్యానికి తానే నవ్వుకొంది.

"పోవమ్మా నీ మాటలూ నువ్వూను. వినేవాళ్ళం మాకే సిగ్గవుతూంటే...."

కృష్ణవేణి మాటలనామె లెక్కచేయలేదు.

"మీరంతా అంతే. గదిలో తలుపుచాటున గజ్జెలగుర్రాలు. వాకిట్లో మొగుడిచాటున నంగనాచిలు."

కల్యాణి ముసలమ్మను దారిలోకి లాగడానికి ప్రయత్నించింది. కాని ఆమె వొప్పుకోలేదు.

"చదువైతేగాని పెళ్ళి కూడదు అంటే వచ్చిన మంచి సంబంధం దాటిపోవచ్చు. నచ్చిన వరుడు దాటిపోవచ్చు."

"దాటిపోయే వరుడు నచ్చినవాడైతే మాత్రం ఏం లాభం? ఆమె కతడు నచ్చినా, అతనికామె నచ్చలేదు. అది తప్పిపోవడం
మంచిదేకదా?"

వసంత వాక్యాన్ని కృష్ణవేణి సమర్థించింది. "అంత దగ్గితేనే వుండని ముక్కు తుమ్ముతే వుండేనా? దానినేం చేసుకొంటాం?"

"చదువైతే గాని పెళ్ళి చేసుకోకూడదనేదీ ఈ పరీక్ష యిస్తేగాని పెళ్ళి పీటలమీద కూర్చోననేదీ ఒక నిర్బంధం కాదు. సామాన్య
సూత్రం. ఆకాశదీపం, దానిని బట్టి మనం ఎక్కడున్నదీ తెలుసుకుంటాం. ఎటు పోవాలో తెలుసుకుంటాం. అంతవరకే."

ఇంటికితిరిగి వచ్చేవరకూ వసంత ఆలోచిస్తూనే వుంది. గుమ్మంలో అడుగుపెట్టేసరికి వెంకట్రావు ప్రశ్నించనే ప్రన్శించేడు.

"అల్లా వున్నావేం?"

సుజాత అనేసింది.

"చదువులో పడి ఇరవై మూడేళ్లు వెళ్ళేవరకూ పెళ్ళి చేసుకోవడం మంచిదా, చెడ్డదాయని తేల్చుకోలేక విచారపడుతూంది కాబోలు."

"ఫలానా ఫలానా వాళ్ళు భార్యా భర్తలని భగవంతుడు రాసిపారేస్తాడు. సప్త సముద్రాల అవతల వున్నా వాళ్ళు
భార్యాభర్తలవాల్సిందే. మీ అక్కకి కేటాయించిన మగాణ్ణి నేను. పాపం ఏం చేస్తుంది? దేవుడు చేసిందానికి తాను విచారపడ్డం
దేనికి?"

వసంత అతని ఎగతాళికి నవ్వింది.

"డిగ్రీ పుచ్చుకొని మూడేళ్ళాయింది. ఇంతవరకు ఒక్క కాని సంపాదించలేదు. సంపాదిస్తాననే ఆశా లేదు. మరెందుకు చదివినట్లు?"

"నువ్వే చెప్పు" అన్నాడు వెంకట్రావు.

వసంత ఏదో ఆలోచనలో మునిగివున్నట్లుగా ఒక్కొక్కమాటే అంది.

"ఆడదానికి చదువు ఙ్ఞానం కోసమే గాని డిగ్రీకోసం కాదన్నాను. అదే సిసలనిపిస్తూంది."

కల్యాణి ఆమెవంక జాలిగా చూసింది. వెంకట్రావు ఒక్క క్షణం ఆలోచించేడూ.

"ఈ చర్చ ఎందుకు వచ్చిందో తెలియదు. ఆడవాళ్ళుకూడ సంపాదించుకొనే స్థితి వుండాలిసిందేనని ఛాందసపు ముసలాళ్ళు కూడా
వొప్పుకొంటున్నారు. తమ పిల్లల్ని చదివిస్తున్నారు. మా రత్నం బాబయ్య సంగతి చూసేవుగా? చెట్టంత కొడుకు చచ్చిపోయేడు. ఈ
వేళ ఆ కూతురు స్కూల్ ఫైనల్ చదువుకుంది గనక ఎక్కడో టాఇపిస్టుగా చేరింది. వాళ్ళు వీధిన పడకుండా మిగిలారు...."

కల్యాణికూడా ఆమె జిఙ్ఞాస సరియైన దారిలో లేదంది.

"చదువు ఆడదానికి డిగ్రీకోసం కాదు. ఙ్ఞానం కోసం" అన్నమాట ఒక దశలో ఒక రాజీపధ్ధతిలోకి వచ్చింది. ఆడది
చదువుకోవాలన్నవాళ్ళ కామాట ఒక విజయం. అదివాళ్ళ ఆలోచనలకొక సరిహద్దుకూడా."

వసంత తల తిప్పింది.

"ఇంక నీ తర్కం అంతా వినిపిస్తావు. కాని, ఇది తర్క విషయంకాదులే తల్లీ! ఇది జీవితం."

"తర్కం అన్నది జీవితాన్ని అర్ధం చేసుకొనేటందుకో ఉపకరణం. దాని నంత సులువుగా తోసెయ్యకు."

ఆమె అభిప్రాయం ఏమిటో తనకు తెలియలేదన్నాడు వెంకట్రావు.

"ఏముంది? అంతవరకూ చదువుకొన్న ఆడది చెడిపోతుందన్న వాడు ఆ మాట వదిలేశాడు. చదువుకోవడం మంచిదే కాని కాలేజీ చదువు
వద్దన్నారు. కాని మళ్ళీ ముందడుగు పడకుండా బంధం వేశారు."

వెంకట్రావు తలూపేడు.

"ఔను. ఇప్పుడు కాలేజీ చదువులకీ వొప్పుకుంటున్నారు. ఉద్యోగాలకీ వొప్పుకుంటున్నారు. ఉద్యోగం చెయ్యకపోడం, చెయ్యక్కరలేక
పోవడం వేరు, చెయ్యలేకపోవడం వేరూను."



పద్ధెనిమిదో ప్రకరణం


హైమవతి రిక్షాదిగి గబగబ ఇంట్లోకి రావడంతో వారి చర్చ ఆగిపోయింది. ఆ సమయంలో వచ్చిన పెళ్ళి కూతురును చూడగానే కల్యాణి
ఆశ్చర్యపడింది. అందులోనూ తామూ ఆమెను వదిలిందప్పుడేనాయె.

చటుక్కున కల్యాణి లేచింది.

"మీతో పనుండి వచ్చా" నంది హైమవతి. "అక్కడ మాట్లాడదామనుకొన్నా కుదిరింది కాదు."

ఏదో చాల అవసరమైనదే అయివుండాలి, అనుకొంది కల్యాణి. ఇద్దరూ లోపలిగదిలోకి వెళ్ళేరు. శిష్యురాలిని తనతో పాటు మంచం మీద
కూర్చోబెట్టుకొని వీపు నిమిరింది.

"ఏమిటమ్మా!"

హైమ చాలా సేపటివరకూ మాట్లాడలేదు. కాని, కల్యాణి బుజ్జగించి చెప్పించింది. ఆ చెప్పిందేమీ అర్థం కాలేదు.

"మీరు దగ్గరుండాలి. గొడవలేమీ రాకుండా మాట దక్కడం ఎల్లాగో చెప్పాలి."

కల్యాణి గుచ్చిగుచ్చి అడిగింది.

మధుసూదనంగారికో చెల్లెలుంది. ఆమె మన స్కూలులోనే టీచరు. కమలమ్మ గారు.

"నిజం?"

"ఊ."

"మీ వాళ్ళంతా చూస్తే చేదస్తులల్లే కనిపించారు. ఈ సంబంధానికెల్లా వొప్పుకొన్నారు?"

పేచీ ఏమిటో కల్యాణికి అర్థం అయింది. కమలమ్మ వితంతు వివాహం చేసుకొంది. అది ఈ ఛాందసులకెల్లా నచ్చుతుంది?

"నేనే పట్టుపట్టేను."

"మధుసూదనంగారితో పరిచయంవుందా?"

"ఆయన పట్టుదలమీదనే స్కూలులో చేరా"

కల్యాణి నవ్వింది.

"గ్రంథకర్తవే. ఇది మూడేళ్ళనాటి పరిచయం అన్నమాట."

హైమ మాట్లాడలేదు.

"ఊ..తర్వాత, నువ్వు చేసుకుంటానంటే మాత్రం కులం ఏమవుతుంది పాపం."

"ఆయన కట్నం వద్దన్నారు."

"డబ్బు లాభం వస్తే కులంపోయినా సరేనన్నమాట."

"అలకపాన్పూ, పిలకపాన్పూ వగైరా లాంఛనాలూ, సరదాలూ, సంప్రదాయాలూ కూడ వుండవంది మా అక్క, గుర్తుందా?"

"ఔను. నేనో, వసంతో అవన్నీ అనవసరమే నన్నాం కూడా."

"అది మధుసూదనంగారిని వెక్కిరించడం."

"ఎందుకు?"

"ఆయనే అటువంటి తతంగాలేవీ వద్దని వ్రాశారు."

"గట్టి కుర్రాడులాగే వున్నాడు. కట్నం వద్దని, ఎడంచెయ్యి చాచకుండా! నాకో మాటు చూపిస్తావా, మీ ఆయన్ని."

"వీధిలో వున్నారు."

కల్యాణి ఆశ్చర్యపడింది.

"ఆయన్ని వీధిలో పెట్టి, నువ్వు...."

"మొగమోటపడ్డారు."

"గట్టిదానివే, రా!"

మధుసూదనం వచ్చాకగాని అసలు సమస్య కల్యాణికి అర్థం కాలేదు. అర్థం అయినా దానిని విప్పడం ఎల్లాగో బోధపడలేదు.

కమలమ్మ వితంతువయ్యీ వివాహం చేసుకోడం హైమవతిని పెంచినవారికి సమ్మతం కాదు. కాని, ఆమె చేసుకొంది. వీళ్ళు ఎప్పుడో
బంధువులవుతారనీ, అప్పుడు తన వివాహం వారి కయిష్టం కావచ్చు ననీ ఆమె వూహించలేదు. వూహించడానికి ఏదన్నా అవకాశం వున్నా
ఆమె మానేది కాదు. చేసుకొంది. తల్లి-తండ్రి, అన్న అందరూ వొప్పుకొన్నారు. చేసుకొంది.

ఆమె ఆ మాదిరిగా వివాహం చేసుకోడం మధుసూదనాన్ని అనర్హుణ్ణి చేయలేదు.

అతడు మంచివాడు.

ఎం.బి.బి.ఎస్. చదువుతున్నాడు.

కట్నం అక్కర్లేదు.

కోరి చేసుకొంటున్నాడు.

పిల్ల పట్టుదల వుంది.

కాని పెళ్ళిలో కమలమ్మ అక్కడికి వస్తుంది. ఆమె పిల్లడున్నాడు. అల్లరివాడు. మేనమామ వానిని వదలడు. ఆ పంక్తి
బాహ్యులతో భోజనంకి కూర్చోవడమెల్లాగ?

"ఈ సమస్య వస్తుందని నాకు తెలుసు. నాన్నగారు ఎరుగుదురు" అన్నాడాతడు.

"రిజిస్ట్రేషను చేయిస్తే..."

"నాన్నగారు అదే వ్రాశారు."

"కాని, అమ్మమ్మ వొప్పుకోలేదు."- అంది హైమ తల వంచుకొని.

కల్యాణి ఆశ్చర్యం ప్రకటించింది.

"ఎందుకని? సమస్య తేలిపోతుందే?"

మధుసూదనం సమాధానం ఇచ్చేడు.

"హైమకి తల్లీ-తండ్రీ లేరు. ఏదో అమ్మమ్మ పెంచింది. పిల్లనీ- కొబ్బరి బొండాన్నీ చేతిలో పెట్టినట్లు రిజిస్ట్రారు ఆఫీసులో
పెళ్ళేమిటి? దిక్కూ-మొక్కూ లేనట్లు? ఇంట్లో సలక్షణంగా సంప్రదాయ పధ్ధతిలో జరగవలసిందేనంది ముసలమ్మగారు."

"నువ్వేమన్నావు?"

"నాన్నగారు నీ పెళ్ళి నీ ఇష్టం అన్నారు. రమ్మంటే మేం వొస్తాం, వద్దంటే రాము అన్నారు. అమ్మ కూడా అన్నీ నా యిష్టానికే
వదిలింది. అయితే చెల్లి రావడానికి అవాంతరం లేకపోతేనే తాను వస్తానంది. చెల్లికి రావడం రాకపోవడం రెండూ సమానమే. కాని,
పిలిచి అవమానకరంగా ప్రవర్తించేరంటే వాళ్ళు చిన్నప్పుడు పాలు తాగిన దాసీదాని రంకులు సహా కడిగేస్తుంది."

కల్యాణి నవ్వింది.

"ఔను. అవమానించడానికి పిలవడం ఎందుకు?"

"మా కృష్ణవేణి అక్కయ్య ఆలోచన అది. మా పిన్ని 'సై' అంది. మా అమ్మమ్మ..."

"ఏమంది?"

"ఏమంటేనేం లెండి. ఆడాళ్ళలో పుట్టిందీ ఆలోచన. ఆచారాలు, బ్రాహ్మణ్యం చెడగొడుతున్న వాళ్ళని మర్యాద చేయడం వాటిని
ప్రోత్సహించడమేననే నిర్ణయానికి వచ్చేరు."

"ఇంతకీ కీలకం నీ చేతిలో వుందని తేలుతూంది. నీ అభిప్రాయం ఏమిటి?" అంది కల్యాణి. మధుసూదనం కొంచెం ఆలోచించేడు.

"నాకు ప్రత్యేకంగా దేనిమీదా పట్టుదలలేదు. సంప్రదాయ పధ్ధతిలో తప్పేముంది?"

ఏమీ లేదు."

మధుసూదనరావు ముఖం వికసించింది.

"అందుకే వొప్పుకున్నా."

కల్యాణి ఆలోచించింది. ఆమెకు సమస్య ఎక్కడుందో అర్థం కాలేదు.

"ఇంక పేచీ ఏమిటి?"

మధుసూదనరావు ఆశ్చర్యపడ్డాడు. ఇంతచెప్పినా ఈమెకెందుకు అర్థం కాలేదా అనిపించింది.

"వాళ్ళు అక్క వొస్తే అవమానిస్తారు."

"పిలువకు."

"అయితే అమ్మా రాదు."

"రావద్దను."

"నాన్న కూడా."

"అమ్మతోపాటే ఆయనా...."

"వాళ్ళెవళ్ళూ రాకుండా పెళ్ళేమిటి?"- అంటూ నిరుత్సాహపడి పోయాడు మధుసూదనరావు.

కల్యాణి అతనివేపు చుసింది.

"ఇంతకీ నీకు ఒడుగయిందా?"

హైమ నవ్వింది. మధుసూదనం సిగ్గుపడ్డాడు.

"బ్రాహ్మడివి. ఒడుగు కాలేదు. మరి మీ సంప్రదాయ వివాహం జరగడం ఎల్లాగోయి?"

కల్యాణి విరగబడి నవ్వింది. మధుసూదనరావు సిగ్గుపడిపోయాడు. కల్యాణి గంభీరురాలయింది.

"'పాత కొత్తల మేలుకలయిక ' అనే సూత్రం చెప్పడానికైతే బాగానే వుంది. కాని, కార్యరూపంలో అది సాధ్యం కాదు- అనే విషయం
అర్థం అయిందా? పాతనుంచి చాలదూరం వచ్చేశావు. ఇంక నువ్వు ఏదైతేనేమనే స్థితి లేదు. నువ్వు ఏరుకొన్నదను, అంగీకరించినదనూ,
ఆ మార్గం ఏదో కొత్త పరిస్థితులకనుగుణంగా వుండాలిసిందే. ఏమైతేనేం అంటే లాభం లేదు."

మధుసూదనరావు ఆలోచిస్తూ కూర్చున్నాడు. చివరికి అడిగేడు.

"నన్నేం చెయ్యమంటారు?"

"నేనేం చెప్పను? నాకేం తెలుసు?"

అతడు మళ్ళీ వూరుకున్నాడు.

"మీ నాన్నగారికీ నీకూ పేచీలేమన్నా వున్నాయా?"

"ఏమల్లా అడిగేరు?"

అతని ముఖంలో ఆశ్చర్యం కనబడింది.

"నీ పెళ్ళి విషయం నువ్వే చూసుకోమని ఎందుకు వదిలేసేరు?"

హైమవతి మధుసూదనరావు ముఖం వంక చూసింది.

"మా వాళ్ళూ అదే భ్రమలో వున్నారు."

"అది భ్రమేనా?"

మధుసూదనరావు విచారపడ్డాడు.

"వివాహం బాధ్యత వధూ-వరులకు సర్వాత్మనా విడిచిపెట్టాలంటాడాయన."

"కొంపదీసి మీ నాన్న కమ్యూనిస్టు కాదు గదా."

మధుసూదనం మళ్ళీ ఆశ్చర్యపడ్డాడూ.

"ఏం? ఏల్లా అనుకున్నారు?"

"ఏమంటే ఇల్లాంటి జనం వాళ్ళల్లోనే కనిపిస్తున్నారు. మనం రోడ్ల కూడలిలోకి వచ్చాం. ఇప్పుడు కాస్త దారి చూపడం అవసరం.
బొప్పిలు కట్టి నేర్చుకోలేమా అంటే ఎందుకు నేర్చుకోలేము? సమాజం ఇంతవరకూ రాలేదూ? ఇన్నివేలూ, లక్ష సంవత్సరాలు
కమ్యూనిస్టుల మొహం ఎవరికేనా తెలుసా? అయితే ఇప్పుడున్నారు కనక, వాళ్ళేదో ఉధ్ధరిస్తారనుకుంటున్నాం గనక వాళ్ళకేసి చూశాం.
మీరే నేర్చుకోండి మంచి చెడ్డలు అని వాళ్ళొదిలేస్తున్నారు. అందుకడిగేనులే."

"ఆయన చెప్పిందాంట్లో నాకేం తప్పు కనిపించలేదు. నువ్వు ప్రేమించిన కన్యను పెళ్ళి చేసుకోమని స్వేచ్ఛ ఇచ్చిన వారెందరు?"

"బాగానే వుంది."

"ఆయన కట్నంతీసుకోవడం తప్పు అని చెప్పేరు."

"చాలా మంచిపనే చేశారు. కాని వివాహం జరిపించేబాధ్యతను ఎందుకు తీసుకోలేదు?"

మధుసూదనం తలవంచుకున్నాడు.

"ఆయన రిజిస్ట్రేషను సూచించారు. వీళ్ళు సాంప్రదాయపధ్ధతి అన్నారు. నేను దేనిలోమాత్రం తప్పేముంది అల్లాగే ఒప్పుకుందామన్నా."

"అయితే?...."

"సాంప్రదాయ పధ్ధతి అయితే నీకు ఒడుగు కావాలి. నాకు కులాలు, బ్రాహ్మణత్వం మీద నమ్మకం లేదు. నేను తీసేసిన జంద్యం నీకు
వెయ్యను కనక...."

"చచ్చాం రా, దేవుడా! ఈ తెలుగుదేశం ఏమయిపోతూంది? తాను మంచిది కాదనుకున్నది కొడుకు చేత వొప్పించలేకపోయారు? మా
అన్నయ్యొకడు. మీ నాన్న మరొకరు! దొడ్డ కమ్యూనిస్టులురా దేవుడా. ఏపనీ చెయ్యకుండా సోషలిజం వచ్చేస్తుందిలే అని వీళ్ళ
వూహ కాబోలు. బలే."

"అందులో నా తప్పూ వుంది."

"సరిలే, ఇప్పుడేం చేస్తావు?"

"వాళ్ళు ఆలోచిస్తున్నారని చెప్పిన సంగతులు విన్నాక పెళ్ళి ఇప్పుడు చేసుకోను అనేద్దామనుకుంటున్నా."

హైమ కన్నీళ్ళు పెట్టుకొంది.

"ఆ యింట్లోంచి ఎన్నడుపోతానా అనుకొంటున్నా. నేనే తొందర పెట్టా...."

"అదా సంగతి. మరి దానికేమంటావు?"

"మీరు చెప్పండి."

"ధైర్యం వుందా?"

"చూద్దాం."

"రిజిస్ట్రేషను జరగాలేగాని సాంప్రదాయ పధ్ధతి నేనొప్పుకొనను."

"ఇదివరకే ఒప్పుకొన్నాగా."

"మార్కు ట్వెయిన్ కథలోకి మల్లే ఈ సమస్యకి పరిష్కారం సాధ్యం కాదు..."

మధుసూదనరావు లేచేడు. కల్యాణి హైమను ప్రక్కకి పిలిచింది.

"దీనిని నువ్వే పరిష్కరించగలవు."

"ఎల్లా?"

"వాళ్ళ ఆలోచనలు తెలిసినాయి. వానిని అమలు జరపడానికి చేసే ప్రతి ప్రయత్నాన్నీ నువ్వే ఎదుర్కో..."

"ఇందాకా మీరు వచ్చే ముందే ప్రారంభించా, అందుచే మా అక్క కొంచెం పక్కపక్కగానే వుంది."

"భారత మహిళాత్వం ప్రతిష్ఠాకరమైన బిరుదేం కాదు. మంచికోసం అయినా గట్టిగా నోరు చేసుకోవడం ఈ దశలో ముఖ్యం. కానీ...."



పంధొమ్మిదో ప్రకరణం


గవర్నరుపేట మార్కెటు వద్దకు వచ్చేసరికి పువ్వులదుకాణాలు కనబడి జ్ఞాపకం వచ్చింది, తన మిత్రుడిభార్య వచ్చింది. ఆమె
చెల్లెలూ, కల్యాణి వున్నారు. తనను విందుకు పిలిచారు. వాళ్ళకి ఏదన్నా తీసుకెళ్ళడం మర్యాద అనిపించింది.

ఆడవాళ్ళకి పువ్వులకన్న అందమైన బహుమతి ఏముంది? కల్యాణికి గులాబీలంటే మహా ప్రీతి. ఏ రోజునా టేబిల్ మీద 'వాజ్' లో
చక్కగా విచ్చిన గులాబీ అమరుస్తుంది.

సైకిల్ దిగేడు. పువ్వులదుకాణాలు కళ్ళుకుట్టేలా వున్నాయి. ఎర్రని గులాబీలు, తెల్లని మల్లెలు, సన్నజాజులు, పచ్చని
చామంతులు, రెండురంగుల్లో కనకాంబరాలు... దుకాణ దారు ఏమియ్యమంటా రన్నాడు. రాజగోపాలానికి తెలియదు. అతడెప్పుడూ పువ్వులు
కొని వుండలేదు. ఎన్నికొంటే సరిపడతాయో ఎరగడు. బహుమతి, సంతుష్టి కలిగించాలి. అందుచేత మూక ఉమ్మడిగా కొట్టువాడికే
పురమాయించేడు.

"ఇయ్యి."

దుకాణదారు పరిస్థితిని అర్థం చేసుకొన్నాడు. బడ్డీలో క్రింద వున్న సామానుల్లోంచి చిన్న వెదురుపేళ్ళబుట్ట తీసేడు. తన
వద్దనున్న వేర్వేరు రకాల పువ్వులతో దానిని నింపుతున్నాడు. రాజగోపాలం చూస్తున్నాడు. కొంచెం గులాబీలు ఎక్కువ వెయ్యమనే సలహా
తప్ప అతను కాదనలేదు. ఎంతఖరీదు పెట్టి కొనాలో ఎరుగడు. అయితే వాళ్ళు తనను పీనాసి అనుకోకూడదు. అంతే. అదొక్కటే
ఆలోచన.

అతని స్థితిని అర్థం చేసుకొని దుకాణదారుడే ప్రశ్నించేడు. ఇంట్లో వున్నది ముగ్గురు ఆడవాళ్ళేననీ, ఇంట్లో పెళ్ళో మరేదో
అల్లాంటిదో జరుగుతున్న సందర్భం కాదనీ తెలుసుకొన్నాడు. తానదివరకే చేర్చినవి కొన్ని తీసేశాడు. మరికొన్ని చేర్చాడు. గంప
తెచ్చి సైకిలుకి పెట్టేడు. బుట్ట ఒకటి సైకిలుకి తగిలించి ఇంటికి తీసుకెళ్ళడం రాజగోపాలానికి నామోషీ అనిపించింది. అందులో
పువ్వులు. ఏమిటి కథ? యని కనుబొమ్మలెవరన్నా ఎత్తితే తాను సిగ్గుపడిపోవలసిందే తప్ప ఏమీ అనలేడు. ఎప్పటిదాకానో
వాయిదా లేకుండా అక్కడే వినిపించిందా ప్రశ్న.

"ఏమిటోయ్? అన్ని పువ్వులు కొన్నావు? ఏం కథ?"

దారిన పోతున్న రంగారావు కంటబడనే పడ్డాడు. ఇంక టాంటాం చేసేస్తాడు. అతనినోటికి శుధ్ధీబధ్ధం లేదు. అనేదీ అనకూడనిదీ
లేదు. డబ్బావాగుడు.

పూవులతో అతని కంటబడడం బాగులేదనిపించింది. ఏదో కూడని పని చేస్తూ పట్టుబడిపోయినట్లు కంగారు పడ్డాడు.

"నాకు కాదోయ్."

"నీ కథ పువ్వులట్టుకెళ్ళేదాకా రాలేదని నాకు తెలియదంటావేమిటి?"

రాజగోపాలం సిగ్గుపడ్డాడు. రంగారావు భుజం తట్టేడు.

"బ్రేవో. ఈ పువ్వులున్నయే ముట్టుకుంటే వాడిపోయేటట్లా వుంటాయా? కంచు కోటల్లో గూడు కట్టుకున్న హృదయాల్ని కూడా బయటకి
తీసుకురాగలవు. కానీ నన్ను మాత్రం మరచిపోకు, నీకక్కర్లేనిది నాది. ఏమంటావు? అదిగో మాట్లాడ్డం లేదు. ఉన్నవన్నీ నువ్వే
చుట్టపెట్టేద్దామనా? అరగదు సుమా!"

రంగారావు మూర్ఖుడు. లేకపోతే స్నేహితుని ముఖం అంతకంతకు రంగుమారుతూండడం గ్రహించగలిగేవాడే.

మిత్రుడిమాటలకు రాజగోపాలం ఎంతో అసహ్యించుకొన్నాడు. ఈయనకూతుర్ని చేర్పించడం కోసం వెళ్ళినప్పుడే తనకు కల్యాణి పరిచయం
అయింది. ఆమె మాటమర్యాదా, నిరాడంబరమైన ఆప్యాయతా అతనినాకర్షించేయి. అంతక్రితం రెండునెలలనుంచి ఇంట్లో వున్నా అద్దె
ఇవ్వడం తప్ప అతనికి పరిచయమే లేదు. అతనిని ఆకర్షించిన గుణాలే రంగారావులో భిన్నమైన ఫలితాలు కలిగించాయి. అతడికామె
సులభసాధ్య అనిపించింది. అనుకూలాలు వుంటే ఆమె తనదవుతుందని ఆశ. రాజగోపాలం ఆయింట్లోనే వున్నాడు. కనక అతడీపాటికి ఆమెను
లోబరచుకొనేవుంటాడని వూహ. ఆ యింట్లోనే మరోపడుచుకూడా వుండడం మంచి వేటకి అనువనిపించింది. ఆ అభిప్రాయాన్ని అతడదివరకే
రాజగొపాలం అదృష్టాన్ని అభినందించడంలో వ్యక్తపరచాడు.

"ఎల్లా అయినా అదృష్టవంతుడివి."

"వండినమ్మకు ఒకకూరే. మధూకరం వానికి పదికూరలు."

ఈ విధంగా తన ఎదుటా చాటునా కూడ అంటూనే వున్నాడు. ఆ అదృష్టం ఏమిటో, కూర ఏమిటో పైకి ఎన్నడూ అనకపోయినా గోపాలానికీ
తెలుసు. మిత్రులకూ తెలుసు. అందరూ నవ్వేవారు. అతడు సిగ్గుపడేవాడు. వూరుకొనేవాడేగాని అదిలించలేకపోయేవాడు. ఇప్పుడా
బలహీనతకు విచారం కలిగింది. ఎంతో ఆవేశమూ వచ్చింది. భుజం మీద వున్న చేతిని తొలగించడంలో అరచేయి గుప్పిట లంకించుకొన్నాడు.
బలంకొద్దీ నలిపివేయడంలో వేళ్ళనరాలన్నీ ఒత్తుకుపోయి రంగారావు గిలగిలలాడిపోయాడు.

"అబ్బ! మోటు సరసం చెయ్యకోయ్."

గోపాలం మరోమారు పిడికిట్లో చేయి నలిపేడు. ఈ మారు రంగారావు మెలితిరిగే పోయాడు. అప్పుడే వారి మోటు సరసాలు చుట్టుప్రక్కల
వాళ్ళ కంటబడ్డట్టనిపిస్తూంది.

"వెధవమాటలెప్పుడూ అనకు, ఇడియట్!"

పళ్ళు బిగించి నెమ్మదిగా తనకు మాత్రమే వినిపించేలా అన్న మాటలతో రంగారావు కళ్ళు తెరిచేడు.

రాజగోపాలం ఆ చేయి వదిలేసేడు. అతని ముఖంలోని రౌద్రాన్ని చూసి రంగారావు పిల్లే అయిపోయాడు. ఎదుర్కోగల ధైర్యం లేదు.
నైతికంగానే కాదు. శారీరకంగా కూడా. అతని పిడికిలి బిగింపులో నలిగిపోయిన అరచేతి నరాలు ఇంకా స్వస్థలాలకు చేరుకోలేదు.
సలుపుతున్నాయి. పైగా రాజగోపాలానిది కసరత్తుచేస్తూ మంచి స్థితిలో కాపాడుకుంటూ వస్తున్న శరీరం. నోటమాట కూడా రాక
ఒక్కక్షణం అతని ముఖంవంక చూస్తూ నిలబడిపోయేడు.

తాను ఎంతో సహృదయంతో కొన్న ఆ పువ్వులమీద అంత అసహ్యకరమైన వ్యాఖ్య వచ్చాక వానినింక తీసికెళ్ళాలనిపించలేదు.
పట్టుకెళ్ళినా ఆ యువతులకు వాటినివ్వలేడు. తన మిత్రుడి దుష్టభావన ఆ పువ్వులను వెంటాడుతూనే వుంటుంది. జుగుప్సతో
ఆపువ్వుల్ని తీసేసుకోమన్నాడు, దుకాణదారుని.

తనమాట గోపాలం మనస్సులో కలిగించిన అసహ్యంయొక్క పరిమితి గ్రహించి రంగారావు చల్లగా జారుకున్నాడు.

ఆ ఘటనను వింటూ చూస్తున్న దుకాణందారు వీరాస్వామి రాజగోపాలం స్థితికి విచారపడ్డాడు.

"ఒక్కొక్కళ్ళ నోరూ, కళ్ళూ, మనస్సూ అల్లాంటివి బాబూ!"

పక్క దుకాణంవాడు సానుభూతి తెలిపాడు.

"తమరెల్లా వూరుకున్నారోగాని బాబయ్యా! నా మట్టుకి కొట్టు దిగొచ్చి గూబకదలెయ్యాలనిపించింది నా కొడుకుని."

వీరాస్వామి పువ్వులు సర్దేసుకొని డబ్బులు తిరిగి ఇస్తూంటే రాజగోపాలానికి ఆశ్చర్యం కలిగించింది. అతడు డబ్బుగురించి
ఆలోచించడంలేదు. ఆ పువ్వులు తన చేతిలోంచి పోవాలి.

దుకాణం వీరాస్వామి అతనిని వదలలేదు.

"బాబూ! కష్టం పెట్టుకోకండి, ఇంకేదన్నా తీసుకెళ్ళండి. బత్తాయిలు తెప్పించమంటారా? కుర్రాణ్ణి పంపుతా."

రాజగోపాలం ఏమనేలోపునే మనమడిని పంపి దగ్గరలోవున్న కొడుకు పళ్ళదుకాణంలోంచి రెండు డజన్ల బత్తాయిలు తెప్పించాడు. కుర్రాడు
స్వంతబుధ్ధి నుపయోగించి మంచిగా ముగ్గిన ఒకడజను అమృతపాణీ అరటిపళ్ళు కూడా తెచ్చేడు.

"చక్రకేళీలు మంచివున్నాయి తెమ్మంటారా?"

కుర్రవాడి ప్రశ్నకు వీరాస్వామే సమాధానం ఇచ్చేడు.

"ఎర్రి సన్నాసీ! అయ్యగారికని చెప్పి మంచి పళ్ళు తెమ్మనలేదంట్రా? ఎల్లు, లగెత్తు, ఓ డజను చాలతాయంటారా, మరో అర
డజను ఏయమంటారా? ఒరేయి నాలుగు పుంజీలట్రా, నాలుగు..." పరుగెత్తుతున్న కుర్రాడు అతడు చూపిన వేళ్ళు గమనించి తలవూపి
తుర్రుమన్నాడు.

గుమ్మంలో కల్యాణి ఎదురయింది. ఆమె తనకోసమే ఎదురుచూస్తున్నట్లు వీధిగుమ్మంలోకి వచ్చింది.

"ఏమిటవి? ఏదో తెచ్చినట్లున్నారే."

రాజగోపాలం ఏమీ అనలేదు. రిక్షావాడితో బుట్టలోపలికి తెమ్మన్నాడు.

అమ్మగారు చూపిస్తారు. లోపలికి పట్టుకెళ్ళు."

ఆమె బుట్ట సావట్లో పెట్టించి అతనిని లోనికి ఆహ్వానించింది. అతడు ప్రొద్దుట తన వాటాను మిత్రుడి అధీనంలో పెట్టి వెళ్ళేడు.
ఇప్పుడందులో చొరవతీసుకొని ప్రవేశించడం సబబు కాదనిపించింది. తటపటాయిస్తున్నాడు. అది గ్రహించి కల్యాణి ఆహ్వానించింది.

"నీళ్ళు పోసుకుంటారా?"

"తర్వాత."

"వేన్నీళ్ళున్నాయి."

"వెంకట్రావు ఏడీ?'

"నీళ్ళు పోసుకుంటున్నారు."

రాజగోపాలం వూరుకున్నాడు. వసంత ఎక్కడున్నదనే ప్రశ్న వెయ్యలేదు. కాని కల్యాణి గ్రహించింది.

"బట్టలకోసమా? వసంత లోపలుంది. తలుపు తెరిచే వుంది. అన్నట్లు మీతో చెప్పకుండా మూడువాటాల సరిహద్దులూ చెరిపేశాం. ఇల్లా
వెళ్ళొచ్చు. రాండి."

కల్యాణి దారిచూపుతూ వుంటే అతడామె పడకగది ప్రవేశించాడు. దానిలోంచి ఎడమదిక్కుగా సుజాత పడకగదిలోకున్న తలుపూ, కుడిదిశగా
తన వాటాలోకున్న తలుపూ తెరిచి వున్నాయి. ఆ గది తాను పడకకుపయోగించడం లేదు. అందులో తన పెట్టే, బట్టలూ వున్నాయి.

ముందుగది తన పడకగది. ఎవరి ఇంట్లోకో వెడుతున్నంత సంకోచంగా నెమ్మదిగా తలుపు నెట్టేడు. "త్వరగా రాండి" యని హెచ్చరించి
కల్యాణి వెళ్ళిపోయింది.

స్నానం చేసి దుస్తులు మార్చుకొని వచ్చేసరికి హాలులో నలుగురూ కొలువుదీరినట్లు కూర్చున్నారు. తనకు చోటు ఏది నిర్ణయించారో,
అటూ ఇటూ చూసేడు. కల్యాణి ప్రక్కన ఖాళీ వుంది. ఆమె ఆహ్వానిస్తున్నట్లు కొద్దిగా కదిలింది. ఆ కదలికనే ఆహ్వానంగా
తీసుకొని అటునడిచేడు.

"ఇంత కాలానికి మిమ్మల్ని ఇంటివద్ద అస్రసంజ వేళ చూసింది ఈవేళే ననుకుంటా."

రాజగోపాలం ఏమీ మాట్లాడలేదు. కల్యాణి కాఫీ పోసి కప్పు అందించింది. ఆమె ఆదరణను చూస్తూంటే ఒక్క గంట క్రితం రంగారావు
అన్నమాట ఙ్ఞాపకం వచ్చింది.

"మీకు చాలా శ్రమ ఇస్తున్నా."

సుజాత నవ్వింది. వెంకట్రావు వ్యాఖ్యానించేడు.

"అర్థంలేని మర్యాద మాటలు బాగా నేర్చేవే."

రాజగోపాలం అదేమిటన్నట్లు చూసేడు.

"లేకపోతే కాఫీ ఇస్తూంటే శ్రమ కలిగిస్తున్నాని క్షమాపణ చెప్పుకుంటావేమిటి?"

రాజగోపాలం నవ్వేడు.

"ఒకరు చేసిన మంచిపనికి అభినందించడం....."

"నీకు కాఫీ ఇవ్వడం మంచిపని అంటావు?"

రాజగోపాలం నిరుత్తరుడయ్యాడు. రామలక్ష్మమ్మ అతనినా చిక్కులోంచి బయటకు లాగింది. కాని, అది మరో కొత్త చిక్కు
తెచ్చిపెట్టింది. ముగ్గురు పడుచులు, అందులో ఇద్దరు అవివాహితల ఎదుటపట్టుకొని 'పెళ్ళెప్పుడంటే' ఏం చెప్తాడు? సాధారణంగా
ఇచ్చే సమాధానమే అతడూ ఇచ్చేడు.

"ఇప్పటినుంచీ తొందరేమిటండి?"

వెంకట్రావు ఇల్లాంటి సదవకాశాన్ని జారవిడవలేడు.

"ఏమిటోయ్! తొందరలేదంటున్నావు. ప్రేమలేఖలు వ్రాసే వయస్సు రాలేదంటావా యేం? కొంపతీసి....."

"అందరికీ నీ అంత తొందరగా జ్ఞాననేత్రం వికసిస్తుందా?"- అన్నాడు గోపాలం చిరునవ్వుతో. వసంత భర్తకేసి చూసి, కళ్ళతో
నవ్వింది.

వెంకట్రావు ఏమీ జంకలేదు.

"మనం ప్రేమించి పెళ్ళి చేసుకోవడం మంచిదనుకొన్నప్పుడు ప్రేమలేఖ మంచి మీడియం కాదూ? ముసలమ్మ కబుర్లు చెప్తారేమిటి?"

పనికట్టుకొని పెళ్ళి, ప్రేమ, ప్రేమలేఖల వైపునకు సంభాషణను లాగుతున్నట్టనిపించి రాజగోపాలం ఇరుకున పడ్డాడు. తన గదిలో
పుస్తకాలన్నీ తిరగేసి కల్యాణి ఫోటోలు చుసి వుంటాడనిపించింది. వానిని తీసి పెట్టెలో భద్రపరచకుండా తెలివితక్కువపని చేశాడా?

సుజాత సంభాషణను మరోదిశ కీడ్చింది.

"ఈ మధ్య కాలేజీలో మా తెలుగు లెక్చరరు అన్నట్లే చెప్పేవు బావా! ఆడపిల్లల్ని అల్లరిపెట్టటంలో మగకుర్రాళ్ళు చూపించే
మెలకువల్ని పట్టి వాళ్ళ వరార్హతల్ని నిర్ణయించాలన్నాడులే..."

రాజగోపాలం ఆశ్చర్యం ప్రకటించాడు.

"అంటే...."

వెంకట్రావు పకపక నవ్వేడు.

కల్యాణి ముఖంలో అసహ్యం కనబరచింది.

"ఆడపిల్లల్ని ఏడిపించడం మగతనానికి గుర్తు అవడం సిగ్గుమాలిన మాట అని ఖండించకుండా నవ్వి ఆనందించడం బాగాలేదు."

ఎందుకా సిగ్గుమాలిన నవ్వు అన్నట్లే కుండ బద్దలు కొట్టినట్లు మొగంమీదనే అనేసరికి వెంకట్రావు నవ్వు టక్కున నిలచిపోయింది.

"క్షమించండి."

"పాడు పనులు చేసి గొప్పగా సమర్థించుకోవడం మీ మగాళ్ళకో..." అంటూ సుజాత మాట మధ్యలోనే ఆపేసింది.

"నీఅక్కమగడినయిన అపరాధానికి నన్నంటే అన్నావు. పడాలి. ఏం చేస్తా, కాని మగాళ్ళందర్నీ కలిపి తిడితే చిక్కులున్నాయే,
ఇక్కడ మా గోపాలం ఒకడున్నాడు."

సుజాత మేనత్త వెనక్కి తలతీసుకు దాగింది. వెంకట్రావు ఈ మారు సరాసరి కల్యాణిని ప్రశ్నించేడు.

"ఏమండీ! ప్రేమలేఖలూ, ప్రేమ ప్రకటనా మహా పాపిష్ఠి కార్యాలయితే ప్రేమను గురించి అన్ని పెద్ద కబుర్లు చెప్పటం
దేనికి?"

తాను ప్రేమిస్తున్న యువతి తన్ను అర్ధం చేసుకొన్నట్లు కనబడ్డంలేదు. తన అభిప్రాయాన్ని ఆమెకు చెప్పడం ఎల్లాగో తెలియడం
లేదు. ఎంతో ఆలోచించి గోపాలం చిన్న ప్రేమలేఖ వ్రాసేడు. తీరా అది అందచేస్తే ఎల్లాంటి ఫలితాలు వుంటయ్యోనని తానీ వారం
పదిరోజులనుంచీ జంకుతున్నాడు. దానిని తాను జేబులోనే పెట్టుకు తిరుగుతున్నాడు.

హఠాత్తుగా గుర్తువచ్చింది. జేబు తడుముకున్నాడు. నిన్నటి చొక్కా కాదిది. వెంకట్రావు సంభాషణ నెంతసేపూ ప్రేమలేఖ వేపే ఎందుకు
లాగుతున్నాడో అర్థం అవుతుంది.

జేబు తడుముకోవడం చూసికూడా వెంకట్రావు చూడనట్లే నటించడంతో అతని అభిప్రాయం స్థిరపడింది.

"కాస్త ఎర్రగా, బుర్రగా వున్న అమ్మాయికల్లా ఓ ప్రేమలేఖను పోస్టు చెయ్యడం....."

"చిన్న సవరణ. ఎర్రగా బుర్రగానేకాదు నల్లగా నీలమేఘఛ్ఛాయలో వున్నా ప్రేమలేఖలు పొందడానికి అనర్హురాలు కాదు."

వసంతరంగు నలుపు. కల్యాణి చిరునవ్వు నవ్వింది.

"మీరు అడిగిన ప్రశ్న న్యాయమే. కాని ప్రేమలేఖ లందుకోవడం ఆడపిల్లకు అవలక్షణంగా భావించేటంతకాలం కష్టమే మరి."

వెంకట్రావు ఆ విధంగా ఎన్నడూ ఆలోచించలేదు.

"మా అక్కగనక.." సుజాత ఏదో అనబోయింది. కాని వసంత చెల్లెల్ని గదమాయించింది.

"ఏమిటే ఆ అధిక ప్రసంగం...."

"పర్వాలేదు లెద్దూ. నీకు ప్రేమలేఖ వ్రాయగల మగాడిని నేనొక్కణ్ణే యని నాకు తెలీదంటావా?" అంటూ వెంకట్రావు భార్యను
సమాశ్వసించాడు.

"చాలులెండి ప్రజ్ఞ..." అని మగణ్ని గదిమినా వసంత అసలు ప్రశ్న గాడి తప్పకుండా దారికి తెచ్చింది.

"ప్రేమలేఖ అంటూ ఒకటి పుట్టిందంటే అది వ్రాసినమగాడితో, ఆడదానికిష్టం వున్నాలేకున్నా పెళ్ళయితీరవలసిందే నన్నమాట."

తానా విధంగా ఎన్నడూ ఆలోచించలేదని వెంకట్రావు ఒప్పుకున్నాడు.

కల్యాణి పరిస్థితులల్లాగే వున్నాయంది.

"మనకు కావలసిందేమిటో మనం ఎరుగుదుము. కాని, దానిని తెచ్చుకొనే దెట్లో తెలియదు. ప్రతి విషయంలోనూ మనం అంగీకరించగల
భాగం, అంగీకరించలేని భాగం వుంటాయి. అల్లాగే ప్రేమ విషయంలోకూడా. మనం అంగీకరించేది నూతనభావన. అంగీకరించలేనిది అనుశ్రుతంగా
వస్తున్న అలవాటుకు భిన్నమైన ఆచరణ..."

వెంకట్రావు ఆమె అభిప్రాయాన్ని కాదనలేకపోయాడు. అంగీకరించడానికీ మనస్సు వొప్పలేదు.

"మీ అభిప్రాయాన్ని ఒప్పుకుంటే మనం ట్రయల్ మారేజెస్ ను కూడా స్వీకరించవలసిందే కద?" అన్నాడు వెంకట్రావు.

"ట్రయల్ మారేజి అనడంలో మీ వుద్దేశం ఏమిటో మరి. మనం ప్రథమ దర్శనంలోనే ప్రేమ అంకురించడం సర్వ సామాన్య సూత్రంగా
భావించం. అది కేవలం ప్రబంధ శృంగారానికే పరిమితం. పరిచయం ముదిరి వివాహం ముడిపడేవరకూ కొంత వ్యవధి పడుతుంది. ఆ
వ్యవధిలో పరిచయం అనేక స్థాయిలలో తెరిగి నిలిచిపోవచ్చు. వివాహం చేసుకోవాలనే భావతీవ్రత ఏర్పడకుండానే ఆగిపోవచ్చు.
వివాహానికి పూర్వమే అనేక దశలవరకూ పెరిగి నిలిచిపోయిన పరిచయాలు బోలెడు......"

వెంకట్రావు తన అజ్ఞానాన్ని మరల అంగీకరించవలసి వచ్చింది.

".....వివాహానికి అనంతరస్థితినే మనం తీసుకొంటే....."

"అయితే వివాహాత్పూర్వం తన భార్యకు ఎవరో ప్రేమలేఖలు వ్రాశారన్న పరిజ్ఞానం ఈర్ష్యాహేతువు కాకూడదు."

"ఆ మాట తలుచుకోవడానిక్కూడా కష్టంగా వుంది."

కల్యాణి ఏమీ అనలేదు. మిత్రులిరువురూ వెలుపలికి వచ్చేసి సిగరెట్లు ముట్టించారు. వెంకట్రావు జేబులోంచి ఒక మడత తీసి
గోపాలంచేత బెట్టేడు.

అదేమిటో అర్థం అయినా రాజగోపాలం ఎరగనట్లు నటించాడు:

"ఏమిటిది?"

"విష్ యూ గుడ్ లక్!"



ఇరవయ్యో ప్రకరణం


తాను వ్రాసిన ప్రేమలేఖ తన మిత్రుని చేతిలోంచి తిరిగి వచ్చాక ఇంక సమస్యను అతనిముందు పెట్టడమే మంచిదని రాజగోపాలం
భావించాడు. కాని, ఆ అవకాశం రెండు రోజులవరకూ లభించలేదు. లభించినప్పుడు తనవిషయం చెప్పే అవసరం మిగలలేదు.

ఆ పూట కాఫీ తీసుకొన్నాక మిత్రులిద్దరూ గోపాలం పడకగదిలో కూర్చున్నారు. టేబుల్ ఫాన్ ఝుమ్మంటూంది. తన మిత్రుడేదో
ఆలోచనలోపడి కొట్టుకుంటున్నట్లు చూశాడు.

"ఏమిటోయది. అల్లా వున్నావేం?"

చేతిలోని సిగరెట్టునుసి దులుపుతూ వోరగా చూశాడు.

"నిన్నరాత్రి మేము వచ్చేసరికి మీరు నిద్రపోవడం లేదు."

ఆ మీరులో రెండోమనిషి కల్యాణి.

రాజగోపాలానికి కొంతరాత్రివేళ తెలివివచ్చింది. పక్కనున్న పరుపుమీద వెంకట్రావు కనబడలేదు. లేచాడు. డాబాతూము ప్రక్క
పెట్టిన కూజాలో నీళ్ళు గ్లాసెడు వంచుకు త్రాగి లేచాడు.

"చాల వుక్కగా వుంది."

కంఠధ్వని విని రాజగోపాలం అటుతిరిగేడు. వెన్నెలలో, తెల్లని పరుపుమీద నల్లకలువపువ్వులా కల్యాణి కనిపించింది. అతనిని
చూడగనే ఆమె లేచి కూర్చుంది.

అతనికి నోట మాట రాలేదు. నత్తుతూనే పలకరించాడు.

"మీరూ నిద్రపోలేదు."

కల్యాణి చిరునవ్వు నవ్వింది.

"ఇప్పుడే తెలివొచ్చింది."

ఆమె ఆవలగావున్న పరుపుకూడా ఖాళీగానే వుంది.

తన మిత్రుడు భార్యను వెంటబెట్టుకొని సినీమాకు పోయివుంటాడనుకున్నాడు. అయితే తాము పడుకోబోయేటప్పటికే సినీమా రెండో ఆట
ప్రారంభమైపోయి వుంటుందనే విషయం అతనికి జ్ఞాపకం రాలేదు.

"వాడికి సినీమాపిచ్చి జాస్తి."

కల్యాణి ఏమీ అనలేదు. చిరునవ్వు నవ్వింది. అందులో ఏదో రహస్యం వుందనిపించింది. అర్థంకాలేదు.

"టైమెంత అయిందో?"

"మూడు దాటివుంటుంది."

"అబ్బ! సినీమాకెళితే ఈపాటికి రావలిసిందేనే,"

అప్పుడూ ఆమె ఏమీ అనలేదు. వెంకట్రావూ తానూ ఎక్కడ చదివేరో ఏమిటో అడిగింది. ఏదో కాలంనింపడానికి మాట్లాడుతున్నట్లుంది.

చల్లని గాలి తిరిగింది. ఆమెకు తన మనస్సులోని మాట చెప్పాలని ఎంత ప్రయత్నిస్తున్నా అవకాశమే దొరకడం లేదు. ఇప్పుడు
మంచి అనుకూలమైన సమయం దొరికింది. కాని చెప్పలేకుండా వున్నాడు. లేచి అటూ ఇటూ పచారుచేసి ఆమె ఎదటికి వచ్చి నిలబడ్డాడు.

"కల్యాణి గారూ?"

ఆమె ఆగి తలఎత్తి తన ముఖంలోకి చూసింది. కాని ధైర్యం చాలలేదు.

ఇంతలో మెట్లకింద చప్పుడైంది. చటుక్కున కల్యాణి నిలబడింది. భుజంపట్టుకొని నెమ్మదిగా నొక్కింది.

"వెళ్ళి పడుకోండి. మేలుకున్నట్లు కనబడొద్దు."

అతడామె చేయి పట్టుకొని చేతిలోకి తీసుకున్నాడు. ఆమె నెమ్మదిగా విడిపించుకొంటూ రెండో చేయి తన గుండెలమీద వేసింది.

"వెళ్ళండి. పడుకోండి."

అతడు కదలలేదు. ఆమె నెమ్మదిగా నెట్టింది. తానుపోయి తన పరుపుమీద పుస్తకంలా పడుకొని కన్నుమూసింది. మెట్లమీద
చప్పుడయింది. అతడూ చటుక్కునపోయి పడుకున్నాడు. కల్యాణి కళ్ళుతెరచి చిరునవ్వునవ్వడం వెన్నెట్లో కనిపించింది. అతని
మనస్సు మల్లెలు పూచింది.

మెట్లమీదినుంచే వెంకట్రావు పలకరించాడు.

"తెలివొచ్చిందిటోయ్?"

రాజగోపాలం మాట్లాడలేదు. కళ్ళు తెరవలేదు. వెంకట్రావు అక్కడే నిలబడి సిగరెట్టు ముట్టించాడు. నెమ్మదిగా తన పరుపుమీద
చేరేడు. అతని వెనకనే మునివ్రేళ్ళ మీద నడుస్తూ వసంత తన పరుపుమీద చేరింది. కల్యాణి ఆదేశం అతనికప్పుడర్థమయింది.

అ దంపతులు సిగ్గుపడతారని ఆమె నిద్ర నటిస్తుంది.

ఆ సానుభూతి తనకామెను సన్నిహితపరచింది. భుజమ్మీద వేసిన చేయి, గుండెలమీద వుంచిన చేయి, పడుకొని నిద్రనటించమన్న
అనునయం, నెమ్మదిగా త్రోసిన త్రోపు- కొన్ని వందల పుటల గ్రంథానికి వ్యాఖ్యానం చేశాయి.

కల్యాణి తనది. ఇంక సందేహం అక్కరలేదు. తన జీవితం ఆమె స్పర్శతో పల్లవితం అవుతుంది.

ఆ ఇద్దరిమధ్యా మిగిలిన ఆ గుప్తరహస్యం వారినా పగలంతా ఆనంద తరంగాలపై తేలించింది. ప్రతిచిన్న అవకాశం చూసుకొని
వాళ్ళకళ్ళు నవ్వుకొన్నాయి. కాఫీ అందించడంలోఒక్క క్షణం వారి వ్రేళ్ళు మూగపోయాయి. ఫలాహారం అందించినప్పుడూ చీర కొంగు అతనిని
పరామర్శ చేసింది.

వెంకట్రావుప్రశ్న ఈ పరిణామాలన్నింటిని పక్కకి తోసేస్తుంది. వాళ్లు వచ్చేసరికి నిద్రపోవడంలేదు- అదేం ప్రశ్న అనిపించింది.

"గదిలో ఫాన్ వుంది. ఇక్కడే పడకవెయ్యకపోయావా?"

వెంకట్రావు శుష్కహాసం చేశాడు.

"మా రాక...." మధ్యలో ఆపి ముఖం కేసి చూశాడు.

రాజగోపాలం తల ఎత్తేడు.

"మీ రాక... ఆగేవేం?"

"ఏం లేదు...."

వాళ్ళు రాకపోతే కథేముంది ? తానామెముందు నోరు విప్పలేక పోయేవాడు. ఆమె బయటపడేదారి వుండేది కాదు. ఎవరి మనోభావాలను వారే
జీర్ణం చేసుకోవలసిందే. కాని వెంకట్రావు కేం తెలుస్తుంది? తానెంత సాయపడ్డాడో ...

"పక్కలో పెళ్ళాం లేకుండా ఒక్క రాత్రి కూడా పడుకోలేను అనుకోడం నాకు తలవంపు అనిపించడంలేదు. నేను దానికి ప్రేమ అని పేరూ
పెట్టడం లేదు. ఒక మనిషి ఒకే మనిషిని ప్రేమించగలడు, కామించాగలడు. కాని అవిరెండూ ఒక చోట వుండవు."

రాజగోపాలం బీరువాలో దేనికో వెతుకుతున్న వాడల్లా ఆగి తిరిగ్చూశాడు.

"ప్రేమ లేని కామం అవినీతి. సంఘం దాన్ని నిరసిస్తుంది."

వెంకట్రావు మ్లానహాసం చేశాడు.

"నిన్నరాత్రిటిది నాకో అనుభవం."

అతడీ వారం రోజుల కార్యకలాపాల్నీ వర్ణిస్తూ మంజులత విషయం తెచ్చేవరకు రాజగోపాలం సావధానుడయ్యేడు.

తామంతా క్లాస్‌మేట్సు కదా, "బోర్డు చూసి మన మంజులతేనేమోనని వెళ్ళేను. మాటవరసకన్నా చెప్పేవు కాదేం? ఆవిడ
ఇక్కడే వుందని..."

"ఏమిటో ఆ దృష్టే లేకపోయింది."

"సరి. చాలా ఆప్యాయంగా పిలిచింది. తన గొడవంతా చెప్పింది. చివరనేమందో తెలుసా? అంత ప్రేమించి పెళ్ళి చేసుకొన్నా జీవితంలో
సుఖం లేకపోయింది. అర్ధరాత్రి వెన్నెట్లో తెల్లటి మల్లిపువ్వు లాంటి పక్కమీద ఒత్తిగిలి పుస్తకంలా పడుకున్నప్పుడు తట్టిలేపి
సరసన కూర్చునే దివ్య సుందర విగ్రహం కోసం కలలు కంటూనే వున్నా. కాని మధ్యాహ్నం ఏ పన్నెండు గంటలవేళో హాజరవుతారు
మీరంతా. వళ్ళు మండిపోతుంది. పీక పిసికెయ్యాలనిపిస్తూంటుంది."

ఆ మాట నాతడు ఆహ్వానంగా తీసుకొన్నాడు. రాత్రి మళ్ళీ వెళ్ళేడు, పొద్దుపోయేవరకూ కబుర్లు చెప్పేడు. అక్కడే పక్క వేశాడు.
చల్లగా మేడగది తలుపు వేసేశాడు. అర్ధరాత్రీ, వెన్నెలా, మల్లెపువ్వులాంటి పరుపూ వగైరాలతో నిమిత్తంలేకుండానే ఆమె అతనిని
ఆక్రమించింది. కాని ఆ సంగమంలో సారస్యం కనబడలేదు. దివ్యసుందర విగ్రహం కొసం కలలుకనే మంజులత మాటలూ చేష్టలూ అతడి
మనస్సుకి పాకీ దొడ్డికి పోయివచ్చినంత సుఖాన్నీ, అసహ్యాన్నీ కలిగించేయి. ఆ విసురున ఇంటికి వచ్చేడు. తనభార్యను
తానువిపరీతంగా ప్రేమిస్తున్నాడు. ఆమె సాంగత్యంలో తన మనస్సులోని అసంతుష్టిని పోగొట్టుకోవాలనుకున్నాడు.

రాజ గోపాలం కళ్ళువిప్పార్చి మిత్రునిగాథ విన్నాడు.

"కామంవుండేచోట ప్రేమ వుండేటట్లయితే నిన్నరాత్రి నాభార్యని బాధించివుండను. తన స్నేహితురాలికిగాని, నీకుగాని మెలకువవచ్చి, మేం
కనబడకపోతే నవ్వుతారంది. సిగ్గుపడి పోవలసి వస్తుందని బ్రతిమలాడింది. కామం ప్రేమను చేరనిచ్చేదైతే నేను నిన్న నామెమాట
వినకపోయేవాడినా? ఆమె మనస్సు కష్టపడుతూందని తెలుసు. రబ్బరుబొమ్మలా నాచేతుల్లో వుంది. ఎరుగుదును. అది సుఖంకాదు.
తృప్తీలేదు. సరిగ్గా మంజులతతో గడిపిన సమయంలో కలిగిన అసంతృప్తే."

తన భార్యతో తాను గడిపిన క్షణాలను గురించి వెంకట్రావు చెప్తోంటే ఆశ్చర్యం కలిగింది. అటువంటి ఆత్మీయవ్యవహారాలను ఒకరితో
వొకరు చెప్పుకోగలరని అతడెప్పుడూ అనుకోలేదు. అటువంటి సమస్యకు తానేం సమాధానం చెప్పగలడు? ఆరోగ్యంలేని
బలహీనులైనవాళ్ళూ, వయస్సు వడిమళ్ళిన రెండో మూడో పెళ్ళి వాళ్ళూ, వయస్సులో వున్న ఆరోగ్యవంతురాళ్ళని కట్టుకొని, తిండి
పెట్టలేకపోయినా ఏటేటా పిల్లల్ని కనిపించే మనస్తత్వం గురించి ఇదివరలో ఓ మారు వెంకట్రావే ఉపన్యసించేడు.

"దొంగదెబ్బతీసే రౌడీలరకం వీళ్ళంతా. నిత్యజీవితంలో పెళ్ళాలతో ఏడవలేక, చంటిపిల్లల చాటున తమ మగతనపు ప్రతిష్ఠ
కాపాడుకొంటారు."

కొంచెం ఇంచుమించు అటువంటి మనస్తత్వమే వెంకట్రావు ఆచరణలోనూ కనబడింది. ఇష్టంలేని సమయంలో మగతనం చూపించి విసిగించి ప్రజ్ఞ
నిలుపుకొనే ఈ మనస్తత్వానికి మూలం ఏమిటో....

తాను పుస్తకాలలో చదివింది తప్ప ప్రత్యక్షానుభవం లేదు. ఆ చదివిన ఆలోచనలతోనే సమాధానం చెప్పడానికి ప్రయత్నించేడు.

"ప్రేమలేనిచోట కామతృప్తికి ప్రయత్నించకూడదనేది మన మనోబలం, మన సంస్కారం- వీనికి సంబంధించిన సమస్య. నీకు సంస్కారం
వుంది. మనోబలం చూపలేకపోయావు. ఆ బలహీనతమీద నీ సంస్కారం తిరుగుబాటు చేస్తూవుంది."

వెంకట్రావు ఏమీ మాట్లాడలేదు, చాలసేపటివరకూ. రాజగోపాలం ఆఫీసుకుపోయే సన్నాహాలు చేసుకొంటున్నాడు.

"ఈవేళ రాత్రి బండిలో మేమిద్దరం హైదరాబాదు వెళ్ళిపోతున్నాం. వచ్చినప్పుడు మేము ఒకటనుకొన్నాం. అది జరిగే అవకాశంలేదని
మాకు అర్థం అయింది. వెళ్ళేముందు నీకు 'కంగ్రాచ్యులేషన్సు ' చెప్తే తప్పు పట్టుకోవుగా."

"నువ్వు అనుకొన్నదేమిటో, అర్థమయిందేమిటో నాకు తెలియలేదు."

"అర్ధం కాకపోవడంవలన మునిగిపోయిందేమీ లేదులే."

ఒక్క నిముషం పోయాక అన్నాడు.

"జీవితానికి సరిపడా డిసప్పాయింట్‌మెంట్! దురదృష్టవంతురాలు!"

ఏ విషయమూ బయటపడి తీవ్రమైన మనస్తాపానికి గురికాక పూర్వమే సుజాత నక్కడినుంచి తీసుకుపోవలసిన అవసరాన్ని ఆ దంపతులు
గ్రహించేరు. కాని, సుజాత కదులుతుందా? సెలవుల్లోకూడ ఆమె యింటికి పోలేదన్నారు. దానికికారణం రాజగోపాలమేనని వెంకట్రావు
వచ్చినరోజునే గ్రహించేడు.

నిజంచేత సుజాతను కదల్చడం ఒక పట్టాన సాధ్యం కాలేదు. అజంతా-ఎల్లోరాలు చూడాలనే కుతూహలం కూడా ఆమెను కదిలించ లేదు.

"అబ్బ! ఈ ఎండల్లో సంచారమేమిటర్రా" - అని విసుక్కుంది.

"విజయవాడ ఉదకమండలంలా వున్నదేమే!" - అంది వసంత.

"కాకపోతే మాత్రం? ఇంటిపట్టున కూర్చుంటాంకద!"

"ఓ నెల్లాళ్ళు తిరిగిరాకుండ, ఏమిటే గుడి పాములా ఇంటికి అంటుకుపోతానంటావు? పెళ్ళయి మొగుడు పిల్లలూ అంటూ ఏర్పడ్డాక
కదలాలన్నా కదలగలవా?" అని రామలక్ష్మమ్మ మేనకోడల్ని ప్రోత్సహించింది.

"అబ్బ! నీకిక్కడ కష్టంగా వుంటే ఆ నెల్లాళ్ళూ నువ్వే తిరిగిరా అత్తా! నేనూ అక్కా కారియరులో తింటాం."

వెంకట్రావుకు అర్థం అయింది. పెళ్ళయిన వాళ్ళకన్నా ఎక్కువ 'జెలసీ' చూప్తూంది. కల్యాణినీ, అతనినీ వొంటరిగా ఒకయింట్లో
వదలడం ఇష్టంలేకనేమో ఈ గడసరితనం అనిపించింది. వసంత నవ్వింది.

కల్యాణి ఈ చర్చలన్నీ వింది.

"ఎందుకర్రా దాని నంత బలవంతం చేస్తారు!"

"చూడక్కా? రానుమొర్రోమంటూంటే..."" అని సుజాత గారం గుడిచింది.

కాని ఆమె బయలుదేరింది. అక్కా బావా నిష్టురంగా మాట్లాడేసరికి కదిలింది. కాని షరతు పెట్టింది.

"ఒక్క పదిరోజులంటే పదిరోజులేనర్రోయి."



ఇరవయ్యొకటో ప్రకరణం


వీధిలో కల్యాణికోసం ఎవరో అడుగుతూండడం విని రాజగోపాలం తన గది తలుపు తీసుకొని వరండాలోకి వచ్చాడు. ఎదుట కనబడిన
వ్యక్తిని ఎక్కడో చూచినట్లుంది. గుర్తురాలేదు. ఆహ్వానించాడు.

"దయ చెయ్యండి."

వరండాలో కుర్చీ చూపేడు. నారాయణరావు కూర్చుని జేబురుమాలుతో మొగం వత్తుకొన్నాడు.

"వర్షాలు పడ్డా దిక్కుమాలిన వూళ్ళో ఇంత వుక్కపెడుతూంది."

రాజగోపాలం చిరునవ్వు నవ్వేడు.

"తెనుగు జిల్లాల్లో మూడు కాలాలు. వేసవి కాలం, వర్షాకాలం, శీతాకాలం. ఇక్కడ ఈవూళ్ళో ఒక్కటే కాలం. వేసవికాలం.
మిగిలినవి రెండూ అతిథులు."

"బాగా చెప్పేరు." అన్నాడు నారాయణరావు.

"తమరు కల్యాణీదేవిగారికి..."

"నేను వారింట్లో అద్దెకుంటున్నానంతే."

"ఈ యిల్లు వారిదేనా?"

"కాదండీ. వారూ, మరొకరూ కలిసి ఇల్లు అద్దెకు తీసుకున్నారు....."

"తమరు సబ్- టెనెంట్..."

"అంతేనండి."

రాజగోపాలం లేచేడు- "వారు లోపల వున్నారనుకుంటా, కూర్చొండి వస్తారు."

"తొందరలేదు, తొందరలేదు."

కొద్దిసేపటిలోనే కల్యాణి వీధిలో ఎవరో కొత్తవారు పచారు చేస్తూండడం గమనించి వచ్చింది.

"ఎవరు కావాలండి!"

"తమరేనా కల్యాణీదేవిగారు..."

తన ప్రియ శిష్యురాలు హైమవతి అన్న అని తెలిసి కల్యాణి చాలా సంతోషించింది. లోపలి చావడిలోనికి పిలిచి కూర్చోబెట్టింది.

"తమరు మా చెల్లెలి యెడల చూపిన ఆత్మీయతకు అభివాదనలు తెలపడానికి వచ్చేను."

"ఆ విషయంలో నా ప్రత్యేకత ఏమీ లేదు. హైమ సులభంగా ఆత్మీయత పెంచుకొంటుంది. ఎదుటివాళ్ళలో ఆమె చూసేమంచి ఆమె లోని మంచికి
ప్రతిబింబం మాత్రమే."

నారాయణరావు స్కూలు పరిస్థితులను గురించీ, చెల్లెలి చదువును గురించీ తెలుసుకొన్నాడు.

"ఆమె చదువు ఆలస్యమైపోయింది. మంచి తెలివిగలదీ, చురుకైనదీను."

నారాయణరావు అనుతాపం వెలిబుచ్చాడు.

"ఆమె చదువుగురించే కాదు, ఆమె విషయంలోకూడా నేను శ్రధ్ధ తీసుకోవడం అన్యాయమే చేశాను. మా పినతల్లిగారివాళ్ళు ఛాందసులు.
ఆడపిల్లకి చదువేమిటన్నారు. మళ్ళీ ఎందుకో చేర్పించారు. చదువుతూంది. ఇప్పుడే పెళ్ళి, ఏం బాగులేదు. మొన్న
మీరువచ్చినప్పుడన్నారట. అదే సిసలు. నేనూ అదే అన్నాను. కాని ఏం చెయ్యగలం?"

ఆయన అంత బ్రహ్మాండంగా స్వీకరిస్తున్న తన ఆ అభిప్రాయం ఏమిటో కల్యాణికి జ్ఞాపకం రాలేదు.

"తమరామె చదువును గూర్చి పట్టించుకోలేదని నేననలేదే. నాకా మాటే తెలియదే."

నారాయణరావు ఆశ్చర్యంనుంచి తేరుకొని నవ్వేడు. తన మాటకు వచ్చిన వ్యాఖ్యానం విన్నాక అతడు క్షమాపణ చెప్పుకున్నాడు.

"క్షమించండి, నా అభిప్రాయాన్ని సరిగ్గా చెప్పలేకపోయాను తప్ప, వేరేం లేదు."

కాని, కల్యాణికి ఆయన మాటల్లో విశ్వాసం కలగలేదు. తన అభిప్రాయాలను అంగీకరించడంలో ఏదో ఎత్తు వుందనుకోకపోయినా, గిరీశం
ధోరణి వుందనిపించింది.

ఆయన తన అభిప్రాయాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషు మూడు భాషల్లోకి అనువదిస్తూ తంటాలుపడి వివరిస్తుంటే కల్యాణి చిరునవ్వు
నవ్వింది. అయితే అంతా విన్నాక ఆయనమీద సదభిప్రాయమూ కలగలేదు. ఆయన అనుతాపాన్నీ అంగీకరించలేదు.

తల్లిదండ్రుల్ని కోల్పోయేనాటికి హైమవతి రెండేళ్ళది. ఆమెను పినతల్లి తీసుకొచ్చి పెంచింది. అప్పుడప్పుడు నూరో, ఏభయ్యో పంపడం
తప్ప ఈ పదారేళ్ళల్లో చెల్లెల్ని గురించి అతడు శ్రధ్ధ చూపలేదు. అయిదారేళ్ళ క్రితం వచ్చినప్పుడోమారు చూడడం తప్ప ఆమె
ఆయనను చూడనూ లేదు. అటువంటి వ్యక్తి ఈవేళ ఓమారు చుట్టపుచూపుగా వచ్చి, అసలు కష్టమంతాపడి పెంచిన వాళ్ళకి వంకలు
పెడుతున్నట్లనిపించింది.

"ఇంకా మేలేకదా. కనీసం హైమ కిష్టం-అయిష్టం కనుక్కొని..."

నారాయణరావు సిగరెట్టు తీసేడు.

"అభ్యంతరం లేదుగదా?"

కల్యాణి 'ఏష్‌ట్రే' టీపాయి మీద పెట్టి ఆయన కూర్చున్న సోఫా ప్రక్కకు నెట్టింది.

"థ్యాంక్సు. వెనుకటి రోజులు కావుగా, పాతికేళ్ళ కుర్రాణ్ణి కూడా ఎందుకు చేసుకోవని బాయించి పెళ్ళిచేసెయ్యడానికి..."

కల్యాణి ఒప్పుకుంది.

"ముసలమ్మగారే ఈవేళ తనకీ పెళ్ళికుదరడంలో కారణం అని హైమ అంటూంది.."

నారాయణరావు తగ్గేడు.

"నిజమే ననుకోండి. కాని, మరో నాలుగేళ్ళు ఆగితే బాగుండేది కదా అని. ఆగితే దాని కాలేజీ చదువూ అయ్యేది. పాతికేళ్ళక్రితం
ఆడపిల్ల చదువుమాట ఎవరికిపట్టిందంది మా కృష్ణ. అల్లా వస్తే ఆమాట నిజమేననుకోండి."

కల్యాణి చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది.

"కాలంలో మార్పు వచ్చినా, ఆచారాల్లోనూ పధ్ధతుల్లోనూ ఎన్నిమార్పులొచ్చినా అలవాట్లంటూ వుంటాయికదా. మనిషి మనస్సుమీద తర్కం
ప్రభావంకన్న అలవాటుప్రభావం అధికంగా వుంటుంది. ఆడపిల్లనో అయ్య చేతిలో పెట్టెయ్యడం ముఖ్యమనే ఆలోచించడం
మనకలవాటు..."

నారాయణరావు నవ్వేడు.

"అందరికీ అనకండి. తమరున్నారు. మీ పెద్దవాళ్ళకా అలవాటెందుకు రాలేదు?"

ఆప్రశ్నకు కల్యాణి ముఖంలో అసంతృప్తి కనబడింది. నారాయణరావు సర్దుకొన్నాడు.

"ఇంతకీ-ఇది అలవాటనడంకన్న అజ్ఞానం అనుకోవాలంటా."

"మన ఆచారాలు మారడంతో మనఅలవాట్లలో కూడ తప్పనిసరిగా మినహాయింపులూ, సవరణలూ వచ్చితీరుతాయి. వయస్సు వచ్చేక పెళ్లి
చేయడం ఆచారం అయింది. ఇప్పుడు తమకు నచ్చితే ఇచ్చే అలవాటు మార్చుకొని పిల్లదానికి నచ్చేటట్లయితేనే ఇవ్వడం అలవాటు
చేసుకొంటున్నారు. ఇంతకీ హైమకీ వరుడు నచ్చేడు..."

నారాయణరావు ముఖంలో కొంచెం నిర్వేదం కనబడింది.

"నచ్చడమా! ఆ మాట దాని మానసికస్థితిని తెలపడానికి ఏ మాత్రమూ చాలదు. 'మోర్ లాయల్ దేన్ ది కింగ్' అంటాం చూడండి!
కాబోయే అత్తవారి విషయంలో అది చూపుతున్న శ్రధ్ధా- భక్తీ చూసి ఆ కుర్రాడే అదిరిపోయేడు. ఏమందో కాని మా కృష్ణవేణి
నిన్నల్లా ఏడుస్తూంది. మా అమ్మమ్మ ఇప్పుడీ పెళ్ళితలపెట్టి తప్పుపనయిందని ఏడుస్తూంది."

కల్యాణికి చాలా ఆశ్చర్యం కలిగింది. హైమ చాల నెమ్మదైన పిల్లయని ఆమె ఎరుగును.

"అదేమిటి? మీరేదో అసంభవ విషయం చెప్తున్నారు. హైమకి తమవాళ్ళ మీద వెర్రి ఆప్యాయం."

కాని అదీ నిజమేనని నారాయణరావు చెప్పిన దానిని పట్తి తేల్చుకోక తప్పింది కాదు. ఆ వెనుకటి రోజున కృష్ణవేణి బజారు
కెళ్ళి పెళ్ళి సామానులు తెచ్చింది. హైమ వాటిని చూచి మూతి ముడిచింది. ముఖ్యంగా పానకపు బిందెలు చూసేక ఆమెకెంతో తామసం వచ్చింది.

"కట్నం గిట్నం లేదు కదా, అన్నయ్య అయిదువేలు పెళ్ళి ఖర్చు కిస్తున్నాడాయె, ఆ డబ్బు ఖర్చు చేసి కాస్తశుభ్రమైన
వస్తువులు తెస్తేనేం?" అంది.

"పెళ్ళి చేసుకొన్న వెధవముండ పునిస్త్రీదవుతుందా? ఆ మొహాని కీబిందె చాలునులే-" అని ఈసడించిందట కృష్ణవేణి.

నారాయణరావు ఆ ఘటనను సవిస్తరంగా చెప్పడానికి సిగ్గుపడ్డాడు.

"హైమ ఆమాట వినేసరికి మండిపడింది. ఆ బిందెలు రెండూ పెరట్లోకి విసిరేసింది. అటునుంచి వస్తున్న మా ముసలమ్మగారికి కొట్టుకొని
ఆమె గోలెత్తేసింది."

"బహుశ నువ్వుకూడా నా అత్తారివాళ్ళని అవమానం చెయ్యాలనే కుట్రలో చేరివుంటావు. అందుచేత భగవంతుడా శాస్తి చేశాడు." అంటూ
హైమ అమ్మమ్మను వూరడించడానికి బదులు తిట్టిపోసింది.

"మీ సంప్రదాయం తగులడ్డట్టే వుంది. నాకీ యింట్లో పెళ్ళి అక్కర్లేదు. రిజిస్ట్రాఫీసులో జరగవలసిందే" నని ఆమె పట్టు
పట్టింది.

"ఆ మొగుడు కుర్రాడు మహా సౌమ్యుడు. దాని ధోరణి చూసి దిగ్భ్రమ చెందేడు. శాంతపరచడానికి ప్రయత్నించేడు. కాని అదే
వినలేదు. మనుష్యుల మర్యాద చాటునైనా వుంచనివారు ఎదుట అసలే వుంచలేరు. 'వీళ్ళచేత అవమానింపబడేవాళ్ళు నా అత్తారయ్యారంటే
నాకు తలవంపు-' అంది. అతడు నా వద్దకు వచ్చేడు. నేనేం అనను! దానిమీద నాకేం పలుకుబడి వుంది. 'నీ అయిదువేలూ
మిగులుతాయి. పాతికరూపాయల ఖర్చుతో పెళ్ళయిపోతుంది. వాళ్ళకి అవమానం తప్పుతుంది.' అదీ దాని పాట."

హైమవతి పులివేషం ఎందుకు వేసిందో కల్యాణికి అర్థం అయింది. 'భారత మహిళ' బిరుదం ప్రతిష్ఠాకరం కాదు సుమీ యని తానే అంది.
సంతోషం కలిగింది. కాని పైకేమీ తేలలేదు.

"అయితే ఇప్పుడేం చెయ్యాలి? కృష్ణవేణి గా రామాట అనడం బాగులేదు. పిల్లవాడి బంధువులయెడ మర్యాద భావం లేనప్పుడు నటన
లాభంలేదు. మర్యాదగాని అమర్యాదగాని చూపనవసరంలేని పధ్ధతికి సిధ్ధపడాలి."

నారాయణరావు 'నిజమే' నన్నాడు.

"కాని, దాని ధోరణి, గంతులు చూస్తే ఆ అత్తారివాళ్ళు ఏమనుకుంటారూ?"

"ఏమీ అనుకోరు. తమకవమానం చేయడానికి కుట్రచేశారని తెలిసినా ఏమీ అనకుండా వూరుకున్న కోడలు మహా యిల్లాలని ఎవరూ
అనుకోరు. అల్లాగే వూరుకొంటే ఆమెకా ఇంట్లో సద్భావం మిగులుతుందని ఎప్పుడూ అనుకోకండి. ఇప్పుడు మిమ్మల్ని సలహాఅడిగిన మగడే
రేపటినుంచి సందుదొరికితే వెక్కిరిస్తాడు."

నారాయణరావు ఏమీ మాట్లాడలేదు.

"అవన్నీ అటుంచండి. తన అత్తవారివాళ్ళనే కాదు. సంబంధబాంధవ్యాలు పెట్టుకోదలచుకొన్నచోట ఇల్లాంటి కుట్రధోరణులు రాకూడదు.
మీరేం అనుకుంటున్నారో తెలియదుగాని ఆమె చూపిన ధోరణి సరియైనదేననుకొంటా."

"ఆ హంగామా, అల్లరీ, ఏడ్పూ చూస్తే మీరల్లా అనరు."

"ఆ విషయం నేను చెప్పలేను. ఆ ధోరణి ఏ మోతాదులో చూపించాలనేది పరిస్థితుల్ని బట్టి ఎవరికివారు నిర్ణయించుకొంటారు."

నారాయణరావు వూరుకున్నాడు.

"తమరంటే హైమకి చాల మంచిఅభిప్రాయం వుంది. తమరు కలగచేసుకొని పరిస్థితి చక్కబరుస్తారని వచ్చాను."

"అంటే?..."

సాంప్రదాయక పధ్ధతిలో జరిగే వివాహంలో తాను పీటమీద కూర్చోడు. రిజిస్టరు చేయించడానికి పద్దెనిమిదేళ్ళు నిండలేదు. అది
ఆటంకం. ఇంత జరిగేక ఆ యింట్లో వుండనంటుంది. "మీ యింటికి పోదాం నడవ" మని మగడిని లేవదీస్తూంది.

కథ చాలా దూరం పోయిందని కల్యాణి గ్రహించింది. వీలుచిక్కితే ఆ నవదంపతుల కనుకూలంగా సర్దుబాటు చేయాలనుకుంది. ఆ వరుడివేపు
ఆర్థికస్థితినామె యెరుగును. మొన్ననాతడే చెప్పేడు. తండ్రి అతని చదువునే అతి కష్టమ్మీద నెట్టుతున్నాడు. అక్కడికెడితే
హైమ చదువు సున్నే. ఇంత జరిగేక ఈయింటవున్నా అంతే అవుతుంది. పైగా ఆమె వుండదుకూడా.

"పెళ్ళిఖర్చు అయిదువేలు మీరివ్వడం ఏమిటి?"

"దానిపెళ్ళికి అయిదువేలిస్తానని నేను వ్రాశాను. అది కట్నంగా ఇచ్చినా, ఖర్చుచేసినా సరేనని నా అభిప్రాయం."

"దానిని చెల్లెలికివ్వడంకూడా మీ వుద్దేశమా?"

నారాయణరావు ఆలోచించాడు.

"ఆ విషయం నేనూహించలేదు."

"ఇస్తే అల్లుడికివ్వాలి, లేదా వూళ్ళో బాజాభజంత్రీలకు ఖర్చయిపోవాలి. అంతేగాని ఆడపిల్లకేం ఇవ్వక్కర్లేదు."

కల్యాణి కంఠంలో వినిపించిన అవహేళనకు నారాయణరావు కంగారుపడ్డాడు.

"తమచేత పెడతాను ఆ అయిదువేలు, ఇష్టం వచ్చినట్లు చేయించండి. కాని, పెళ్ళికానిదే హైమ ఇల్లుకదలడం నాకిష్టంలేదు."

"పెళ్ళి అయిపోవడమే ముఖ్యమన్నమాట."

"లేకపోతే వాళ్ళింట్లో హైమహోదా ఏమిటి?"

"ఏ హాస్టలులోనో పెట్టి చదివించండి. చదువయ్యాకనే ఇద్దరూ పెళ్ళి చేసుకొంటారు."

"లాభం లేదు. ఇంతవరకూ వచ్చేక ఎంతో నిగ్రహశక్తి వుంటే తప్ప చదువుమీదికి దృష్టి పోదు."

కల్యాణి ఆలోచనలో పడింది.



ఇరవైరెండో ప్రకరణం


ఆ పూట రాజగోపాలం వచ్చేసరికి ఇంకా కల్యాణి స్కూలునించి రాలేదు. స్నానం చేసి బయటకు వచ్చేసరికి రామలక్ష్మమ్మ
పలకరించింది.

"నీక్కూడా వుత్తరం రాయలేదుకదు నాయనా."

ఆమె సుజాతకోసం ఎదురుచూస్తూంది. సుజాత వుత్తరంకూడా వ్రాయలేదు. కాలేజీలు తెరిచేస్తున్నారు. దాని ముందుమాట ఏమిచేస్తే బాగుంటుందని
ఆమె రాజగోపాలాన్ని అడుగుతుంది. సుజాత విషయంలో ఆమెకన్న రామలక్ష్మమ్మ ఎక్కువశ్రధ్ధ చూపుతూంది.

ఈ పట్నవాసపు జీవితం వదిలి పల్లెకిపోయి వుండాలని ఆమె భయం. ఆ లంకంత లోగిళ్ళు ఊడవడం, రెండడ్డగిన్నెలు వార్చడం.

"ఇంకా సంసారాలు ఈదగల ఓపిక లేదమ్మా తల్లీ!" అంటూంటుంది కల్యాణితో. అవే మాటలు, ఆలోచనలు, ఆశలూ, కోరికలు ఈ పది
పదిహేను రోజులనుంచీ వినివిని విసుగుపుట్టింది. ఆమెనుంచి తప్పించుకొనేటందుకు వీధిగుమ్మంలోకి వచ్చి నిలబడ్డాడు.

గుమ్మంలో గోపాలాన్ని చూసి మంజులత కారు ఆపింది.

"ఇప్పుడే వచ్చావా?"

అతని ఆహ్వానంకోసం నిరీక్షించకుండానే కారుతలుపుతోసుకొని బయటకువచ్చింది.

"ఎక్కడా కనబడ్డంలేదేం?"

దానికేం సమాధానం చెప్పాలో అర్థంకాలేదు. 'పనేముంద 'నిపించింది. కాని అనలేకపోయాడు.

"నీవార్త తెలుస్తూనే వుంది. మొన్ననే వెంకట్రావు చూసి వచ్చానన్నాడు."

మంజులత నవ్వింది.

"జెలసీ..."

"ఆశా, అధికారమూ వుంటే తప్ప జెలసీ వుండదు లతా!"

మంజులత అతనిని ఒరుసుకునేలా వచ్చింది. "మనిషిమర్యాదే మరిచిపోయావేం. ఇల్లా గుమ్మంలో నిలబెట్టేనా మాట్లాడ్డం? నడులోపలికి.
కల్యాణి లేరా?"

గోపాలం ఒక్కడుగు పక్కకు వేశాడు.

"ఇంట్లో ఎవ్వళ్ళూ లేరు."

"భక్తురాలూ వాళ్ళూ కూడా."

రాజగోపాలం ముందుకు నడుస్తున్నవాడు చటుక్కున ఆగేడు.

"అదేమిటి? నా భక్తులంటే? సన్యాసం పుచ్చుకొన్నాననుకొన్నావా?"

మంజులత నవ్వింది.

"సరసుడికీ సన్యాసికీ తేడా వుండదు. నువ్వెరగనట్లు నటించినా సుజాత నిన్ను కళ్ళతో తాగేస్తుందని ఎవరూ ఎరగరంటావు?"

ఆ విషయం చర్చల్లోకి రావడం రాజగోపాలానికిష్టంలేదు.

"పెళ్ళికావలిసిన పిల్ల. అన్యాయంగా మాట్లాడకు."

మంజులత నవ్వింది.

"నీ మాటేమిటి?"

"పెళ్ళిళ్ళు కుదర్చడం వయసుమళ్ళినవాళ్ళు చేసేపని."

మంజులత ఠీవిగా గదిలోకి వచ్చి మెడలో వున్న స్టెత్ స్కోప్ బల్లమీద పడేసింది. ఎదుట గోడనున్న పెద్దఅద్దంముందు నిల్చుని
జుట్టు సవరించుకొంది.

"అల్లా కూర్చో."

ఆమె వెళ్ళి మంచం మీద కూర్చుంది. గోపాలం తన కుర్చీ కిటికీవద్దకు లాక్కుని కూర్చున్నాడు.

"ఏమక్కడ కూర్చున్నావు."

"ఇక్కడికే బాగా కనిపిస్తున్నావు."

మంజులత అతనివేపు చూసింది.

"నేనిల్లా పడుకుంటే నీ కభ్యంతరం లేదు గదా."

అతడేమీ అనలేదు. మంజులత మంచంమీద వెల్లకిలా పడుకుని చేతులు తలక్రింద పెట్టుకుంది. గోపాలం ఫాన్‌వేసి ఆమె వేపు
తిప్పేడు.

"థ్యాంక్సు."

అతనివేపయినా తిరక్కుండా ప్రశ్నించింది.

"నిన్ను ఒక సంజాయిషీ కోరుతున్నా."

"ఏమిటా కొత్తమాట."

"నువ్వీమధ్య తరుచుగా మనస్సులో మెదులుతున్నావు."

రాజగోపాలం గాంభీర్యం చూపేడు.

"అది తప్పుపనే మరి."

"వేళాకోళం కాదు."

"అంటే... నీకు ... నా..."

"అబ్బ! ఆపు. దానికేదో పవిత్రమైన పేరు తగిలించి హత్య చేయకు. మనుష్యులం మనుష్యులుగానే బ్రతుకుదాం."

"ఏదో పవిత్రమైన పేరు తగిలిస్తానేమోననే భయం ఎందుకు? పేరు పవిత్రం కాకుంటే ఆ భావమే పవిత్రం కాకూడదూ."

మంజులత వూరుకొంది. ఒక్క క్షణమైనాక ఉన్నట్లుండి ఒక ప్రక్కకు తిరిగి ఒక మోచేతిమీద ఆనుకుని లేచింది.

"ఎంతో స్వల్పవిషయాలలోకూడ మనుష్యుడి జీవితం ఓటమి పొందుతూనే వుంటుందెందుచేత?"

రాజగోపాలానికామె మాట అర్థంకాలేదు. ఆ మాట అనేసి మంజులత వెల్లకిలా తిరిగింది.

"మాయ పెళ్ళి చేసేసుకుంది."

"నన్నడుగుతే మంచిపని చేసిందంటాను.

మంజులత చోళీలోంచి ఒక వుత్తరం తీసి చేతికిచ్చింది. అతడు పూర్తిగా చదివేవరకూ ఆగి ప్రశ్నించింది.

"బాగుందా వరస."

రాజగోపాలం ఆ ఉత్తరాన్ని మళ్ళీ ఆమెకందించాడు.

"మనుష్యుడు ఎప్పుడూ దెబ్బే తింటాడని ఎవరు చెప్పేరు లతా! నువ్వు అనుకొన్నవన్నీ జరగకపోవచ్చు. అది మనుష్యుని వైఫల్యం
కాదు."

ఏదో జ్ఞాపకం వచ్చినట్లయి మంజులత విరగబడి నవ్వింది.

"మా వూళ్ళో ఓ వడ్రంగి ఓ మాట అన్నాడనేవారు. ఆ రోజుల్లో ఆడపిల్లలకు పెళ్ళిసంగీతం మహాజోరుగా చెప్పించేవారట. ఇంటింటా
హార్మోనియంలూ, ఫిడేళ్ళూ వచ్చేయి. ఎవళ్ళో వేళాకోళానికి 'వీరయ్యా హార్మనేపెట్టె చెయ్యగలవా' అన్నారట. అతడు పెట్టె
చూశాడు. అటూ ఇటూ తిప్పేడు. 'ఆరు మానికల పెట్టె చెయ్యగలను కాని బాబూ! మూలుగు పెట్టలే' నన్నాడట. నాదీ అదే
దుఃఖం."

మాయకు చదువు చెప్పించింది. మనిషిని చేసింది. కాని ఆమెను తన యిష్టానుసారం మలచుకోలేకపోయింది. శ్రీవైష్ణవి తంబళ్ళ
కుర్రవాడిని పెళ్ళి చేసుకుంది. రాజగోపాలం నవ్వుకున్నాడు.

మంజులత ఆవలించింది.

"ఒక్క గంటసేపు లేపకు."

"సంజవేళ నిద్రేమిటి?"

నిద్రకీ చావుకీ వేళేమిటయ్యా? గాలిబ్ గీతం మాటమాటకు జ్ఞాపకం వస్తూందీమధ్య-

'ఎవరితో చెప్పికొందు
నా దురదృష్టాన్ని?
చావే రాకుంది ఎంత
కావాలనుకొన్నా.'"

"ఇందాకా నేను అనుక్షణం జ్ఞాపకం వస్తున్నానన్నావు."

మంజులత నవ్వింది.

"నేను అనుక్షణం కోరుతున్న మృత్యువూ, రాకుండా వున్న మృత్యువూ నువ్వేనేమో."

రాజగోపాలం లేచేడు. గదిలో సగభాగం పర్యాలోకన చేస్తున్న టేబుల్‌ఫాన్‌ను ఆమె మీదికే స్థిరంగా నిలిపేడు.

"ఈ నిద్రనుంచి లేవకపోతే బాగుండుననిపిస్తూంది."

ఆమెలోని ఆ నైరాశ్యం ఏమిటో రాజగోపాలానికి త్వరలోనే అర్థమయింది.

"బోర్డు బోర్లించేసి, ఏదో మారుమూల ఇంట్లో ఇల్లా వుండిపోగలుగుతే..."

" ఆ జీవితం ఎంతో కాలం మింగుడుపడదు మంజులతా! మొగం మొత్తేస్తుంది."

నిద్ర ఒత్తుకొనివస్తుంటే మంజులత ఆ మగతలోనే అంది.

"మనకు అనుభవంలోకి వచ్చే అవకాశం లేనిదానిమీద ఆశ ఎక్కువ."

ఆమె శ్వాస సమానాంతరంలో పడింది.

రాజగోపాలం నెమ్మదిగా అరుగుమీదకి వచ్చి గది తలుపు జేరవేశాడు.

"గుమ్మంలో డాక్టరుగారి కారు వుంది."

అప్పుడే లోపలినుంచి వచ్చిన కల్యాణి మాటకు గోపాలం తిరిగి చూసేడు.

"ఆవిడ లోపల వుంది."

"మీకు మంచి, ఎక్కువ పరిచయమే వున్నట్లుంది."

రాజగోపాలం ఆ మాటకు 'ఆ' అన్నాక గాని, ఆమె కంఠంలో ఏదో ప్రత్యేకత వుందనిపించలేదు.

"ఏమల్లా అన్నావు?"

"ఏమన్నాను?"

అదో వింత ప్రశ్న. రాజగోపాలం ఆమె ముఖంలోకి చూసేడు. కాని, కల్యాణి వెనుతిరిగి పోతూంది. అతడు పిలవబోయాడు. కాని, ఆమె
అప్పటికే లోగదిలోకి వెలిపోయింది. అతడక్కడే అరగంటపైగా కూర్చున్నా ఆమె లోపలినుంచి తొంగికూడా చూడలేదు.

మంజులత నిద్రలేచి కల్యాణిని చూడడానికై లోపలికి వెళ్ళింది. పకపక నవ్వుతూ పరుగెత్తి వచ్చింది. టేబిల్ పైనున్న స్టెత్
స్కోపు మెడలో వేసుకుంటూ అతనినెగాదిగా చూసింది.

"ప్రేమ అనేది చాల ప్రమాదకరమైనదిలా కనిపిస్తూంది. ప్రేమించబడేవాడు అదృష్టవంతుడా, అభాగ్యుడా అంటే చెప్పలేమనిపిస్తూంది.
మనం ప్రేమించేదానివేపు ఇతరులు చూడనేరాదనే ఆస్తి యాజమాన్య స్వభావం వుందే చాలభయంకరం. మనం ప్రేమించే దేవుణ్ణి ప్రపంచంలో
ప్రతి ఒక్కళ్ళూ ప్రేమించాలంటాం. ప్రేమించనని మొరాయిస్తే నవఖాలీలూ, జబ్బల్పూరులు సృష్టించేస్తాం. ఆ దేవుడికి ఏకాంతశిక్ష
వెయ్యం. కాని ప్రేమించేవాళ్ళనీ, దేవుళ్ళనీ, దేవతలనీ పొగుడుతాం. అరాధిస్తాం. కాని, ఆ దిశగా మరొకరు క్రీగంటచూసినా
దుడ్డుకర్ర తీస్తాం. అది దేవత్వమా, అసురత్వమా?"

రాజగోపాలం గదిలోంచి బాగ్ తీసుకొచ్చేడు.

"అదృష్టవంతుడూ, అభాగ్యుడూ అనేది ప్రేమకు సమాధానం లభించడంమీద ఆధారపడి వుంటుంది. ఇంక ప్రేమించడంలో మనిషికీ భగవంతుడికీ
పోలికేమిటి? ఒళ్ళో పెట్టుకు లాలించి, ఊచగలవే గాని రబ్బరు బొమ్మకు పాలు కుడపగలవా? దేవుడూ అంతే. కృష్ణుడిబొమ్మ
చేయికూడా కదపలేదు గనకనే....

శ్లిష్యతి కామపి చుంబతి కామపి
రమయతి కామపి రామాం
పశ్యతి సస్మిత చారుపరా
మపరా మనుగచ్ఛతి వామాం ||

అంటూ రామప్రియరాగంలో కళ్ళు అరమోడ్చ గలుగుతున్నాం."

మంజులత ఒక్క క్షణం అతనివైపు చూసింది. గుమ్మంవేపు నాలుగడుగులువేసి తిరిగివచ్చింది. చటుక్కున అతనిని కౌగలించుకొంది.

రాజగోపాలం ఆశ్చర్యంనుంచి తేరుకొనేలొపునే వీధిగుమ్మంలో మంజులత 'బైబై' అంటూంది. మరుక్షణంలో కారు గుర్రుమంది. బాబా అంది.
మరల నిశ్శబ్దం.

"మీ ఇద్దరికీ మంచి ఎక్కువ పరిచయమే వున్నదే"- అన్న మాటకర్థం ఏమిటో ఇప్పుడు తెలిసింది. నిస్తబ్ధుడైపోయేడు.



ఇరవైమూడో ప్రకరణం


కల్యాణి ముభావంగా దూరదూరంగా వుండడం రాజగోపాలానికెంతో వేసట కలిగిస్తూంది. ఆమె దూరంగా వుండడానికి కారణం ఎరుగును. కానీ,
తనకు మంజులత ఏమీ కాదనీ, కల్యాణే సర్వస్వమనీ ఆమెకు చెప్పడం ఎల్లాగో అర్థం కావడంలేదు.

మంజులతను తాను ముట్టుకోకపోలేదు. కాని, ఆమె యెడ తనకు ప్రేమవుందని చెప్పలేదు. ఆమెను కూర్చిన ఆలోచనలు ఆమె ఎదురుగా
వున్నంతసేపే వుంటాయి. కాని, కల్యాణి తన ఆలోచనాపథాలన్నింటా సాక్షాత్కరిస్తుంది. అంగప్రత్యంగ సౌష్ఠవం వున్న స్త్రీలలో
కల్యాణే కనబడుతుంది. పువ్వులదుకాణాల మధ్య ఆమె జ్ఞాపకం వస్తుంది. అందమైన పుస్తకం కనబడితే ఆమెమూర్తి పర్సు
తీయిస్తుంది. మంచంమీద పడుకొన్నప్పుడెప్పుడేనా మంజులత గుర్తు వచ్చినా ఆమెను అనుభవించ పోయినా విరక్తి కలుగుతుందేగాని, ఆశ,
ఆకాంక్ష కలగవు.

ఇవన్నీ కల్యాణికి చెప్పడం ఎల్లాగ? తాను ప్రేమించే పడుచు ముందు ఏమీ దాచరాదనీ, భార్యతో మనసు విప్పి మర్మాలన్నీ
చెప్పెయ్యాలనీ అంటారు. కాని, ఎల్లాగ? మనుష్యుని మనస్సు తప్పిదాలను బయట పెట్టుకోగల ధైర్యం చూపలేదు. తప్పు
వొప్పుకోవడం వేరు. అందులో ఎరగనితనం, అమాయికత్వం వుంటుంది. కాని, తప్పిదాలు చెప్పుకోవడం వేరు, తాను ప్రేమిస్తున్నపడుచుతో
తనపతనాలను చెప్పుకోవడం ఏ వుద్దేశంతో? నవలల్లో వ్రాసేటట్లు ఏ నిద్రపోతుండగానో, పరాగ్గా వుండగానో ఎవరో అందకత్తె
తనకు తపోభంగం కలిగించింది కాని నేనేమీ ఎరగనని చెప్పుకోడానికా? లేకపోతే భవిష్యత్తులోకూడా నేనిల్లాగే వుండొచ్చు. నా స్వభావం
ఇంతే. ఆడది కనిపిస్తే నారక్తం ఉడుకెత్తిపోతుంది. అల్లాంటి ఘట్టం కనబడ్డా, వినబడ్డా బాధపడకని చెప్పడానికా? కేవలం
నీవేలోకంగా వుంటానని చెప్పడం - చూపడం ఎల్లాగ?

రాజగోపాలానికి ఏమీ పాలుపోలేదు. కల్యాణి ఏదోపనిమీద వీధిలోకి తొంగిచూసింది. గోపాలం కుర్చీలో కూర్చుని వున్నాడు. పలకరించింది.

"రేపు మధ్యాహ్నం చిన్న టీపార్టీ వుంది. మనింట్లో. తమరూ వుండాలి"

రాజగోపాలం లేచి నిలబడ్డాడు.

"మీరీ రెండు రోజుల్నుంచీ నామీద ఎందుకో కోపంగా వున్నారు. నేను...."

"మీమీద కోపంకన్న నామీద అభిమానం ఎక్కువయింది. అంతే...."

"అంటే నాకర్థం కాలేదు."

"అయితే చెప్తా వినండి. నాకోరిక ఒక్కటే. మీ మనస్సు ఎటుందో నిర్ధారణచేసుకొని నడవండి"

"మీవుద్దేశం నాకర్థమయింది. కాని...."

"దానికి మీరు సంజాయిషీ ఇవ్వనక్కర్లేదు. అవన్నీ మరోమాటు. నాకిప్పుడు తీరికలేదు."

కల్యాణి వెళ్ళిపోయింది. రాజగోపాలానికి ఏం చెయ్యాలో తోచలేదు. ఏంచెప్పాలో అర్థంకాలేదు.

ఓఅరగంటలో ఆమె గొంతుక మరల వినబడింది. మరుక్షణంలోనే ఆమె గదిలోకి వచ్చింది.

"మనస్సులోని మాట దాచుకోడం అసహ్యంగావున్నా ఏంచెయ్యాలి – ఎల్లాచెప్పాలి అనేది చెప్పడానికి వ్యవధి కావలసివచ్చింది.
నామనస్సులో ఈ నాలుగు రోజుల నుంచీ మెదులుతున్న రెండు మాటలూ చెప్పేస్తా. కోపం తెచ్చుకోకండి."

రాజగోపాలం చనువుతీసుకొని చేయిపట్టుకొన్నాడు. తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టేడు.

"అనేమాటలేవో అను. నన్ను లేనిపోని జెలసీతో బాధ పెట్టకు."

"నేను జెలసీతో బాధపడుతున్నానని మీరు చింత పడొద్దు. జెలసీ అట్టిది. సామాజికమైన ఒకభావన. సమాజంలో ప్రస్తుతం
వస్తున్న మార్పులతో అదీ తగ్గుతుంది. ఫర్వాలేదు. కాని ఇందాక చెప్పేనే ఆత్మాభిమానం అన్నది : అదే ఈవేళ బలీయంగా వుంది
నాలో...."

"ఆత్మాభిమానం చంపుకోవలసిన పరిస్థితులు నేను కోరడం లేదు."

"బహుశా వాటంతటవే వస్తున్నాయి. నన్నేం చేయమంటావని మీ అభిప్రాయం కాబోలు. మన సమాజంలో ఇంతవరకూ వుంటూవచ్చిన పరిస్ధితులు
మగవాడికి ఆడుది లొంగివుండాల్సిన పరిస్థితులను కలిగించాయి. అల్లా పడివుండాలనే భావాన్నీ కలిగించాయి."

రాజగోపాలం గదిలో పచారుచేస్తున్నవాడల్లా నిలబడిపోయేడు.

"ఇంక రెండేమాటలు. అడ్డు రాకండి. మనసమాజం ఇంకావెనకబడే వుంది. అయినా ఆడుది తనబ్రతుకు తాను బ్రతకగలననే ధీమా
క్రమంగా వస్తూంది. ఇదో సంధిదశ. మగవాడు దక్షిణ నాయకత్వం వహిస్తూ ఆడవాళ్ళకి బాధ్యతలన్నీ వప్పచెప్పబోతే సాగేదశ
లేదు, అంతే. 'మోముపయి చేలచెరంగిడి ఏడ్చే' రోజులు పాతికేళ్ళ క్రితం పోయాయి. అటుతర్వాతే నే పుట్టా."

కల్యాణి మారుమాటకు అవకాశం ఇవ్వకుండా చరాలున లేచి వెళ్ళిపోయింది. రాజగోపాలం ఖిన్నుడయ్యాడు. తాను చెప్పదలచిందేదో వినలేదని
కోపం వచ్చింది. అభేద్యమయిన సంబంధం ఏర్పడ్డానికిముందే ఎదుటివాళ్ళ తలతిక్కలూ, తప్పు ధోరణులూ, అర్థంకావడం
మంచిదేననిపించింది.

ఆ ఆవేశంలో టీపార్టీకి తానుండకూడదనుకొన్నాడు. కాని, ఆలోచిస్తే తన కోపాన్ని ఆవిధంగా చూపడం మంచిది కాదనుకొన్నాడు.

తాను కోపం తెచ్చుకోవడంకూడా అన్యాయమే అనిపించింది. ఏమంటే ఆమె వ్యతిరేకించేవిధంగా తన పనులూ ఆలోచనలూ సాగడం లేదూ.

హైమవతి దంపతుల కోసం ఏర్పాటుచేసిన చిన్న విందు అది. వారిద్దరు, మంజులత అతిథులు.

కల్యాణి యువదంపతుల వివాహవిశేషాలను తెలుసుకోవడంలో అత్యధికోత్సాహం చూపుతూంటే రాజగోపాలం తన్ను విస్మరించినట్లే
బాధపడుతున్నాడు. మంజులత రాగానే ఆమెకాతని ప్రక్కనే సోఫాలో చోటు చూపెట్టింది.

మంజులతను తనప్రక్కనే కూర్చోబెట్టడం అతనికి కక్షగా కనిపించింది. మంజులత కూడా ఆ రోజున అంత హుషారుగా కనిపించలేదు.
కల్యాణే ఆమెను కవ్వించి మాట్లాడుతూంది. కాని ఆమె తనధ్యాసలోనే పడివుంటూంది.

టీలూ, టిఫిన్‌లూ అయినాక కల్యాణి యువదంపతులతో మాట్లాడుతూవుండగా రాజగోపాలం నెమ్మదిగాలేచి తన గదిలోకి
వెళ్ళిపోయాడు. డాక్టరు మంజులత అతనిని అనుసరించింది.

"ఏమయ్యా! ప్రేమాయణం మాటలాడుకోలేని దశకు వచ్చినట్లుందే;"

రాజగోపాలం వులికిపడ్డాడు. మంజులత తనవెనకనే వున్నదని అతడింతవరకు గమనించలేదు.

"అందుకే పెళ్లీ – ప్రేమా ఒకచోట వుండలేవంటాను. ఆడది కావాలంటే పెళ్ళి చేసుకో. ప్రేమ కావాలంటే పెళ్ళిమాట తలపెట్టకు."

రాజగోపాలం ఆమె మాటలను హాస్యంగా తోసివెయ్యాలనుకున్నాడు.

"నువ్వసలు పెళ్ళే పనికిరాదంటావనుకుంటాను."

మంజులత నవ్వింది.

"అది యోగులకు. పెళ్ళి నీబోటి రోగులకు."

"నాకేం జబ్బు."

"అజీర్ణం. హరాయించుకోలేవు."

రాజగోపాలం చిరునవ్వు నవ్వేడు.

"నువ్వు హరాయించుకోడం అంటే జ్ఞాపకం వచ్చింది. మావూళ్ళో ఒకాయన వుండేవారు. నువ్వుచెప్పినట్లు హరాయించుకొనే శక్తి ఆయనకు
ఎక్కువే అనేవారు. నేనెరగననుకో, మనిషిని చూసిన గుర్తుకూడా చాలతక్కువే. ఆయన దక్షిణనాయకత్వానికి ఫలితంగా
నలుగురైదుగురు అడుక్కుతినేవాళ్ళూ, ఒకరౌడీ, ఇద్దరు అంట్లు తోముకొనీ, వ్యభిచారం చేసీ బ్రతుకుతున్నవాళ్ళూ, మావూరికి
లభ్యమయ్యారని చూపించేవారు. ఆయన తెచ్చి అందించిన రోగాలతో తీసుకుంటూ ఆయన భార్య ఇద్దరు వెర్రివాళ్ళని, మతిభ్రష్టుల్నీ
వూరుకిచ్చింది."

"ఆ రోజుల్లో అల్లా సాగింది వాళ్ళ ప్రభ."

"అదే నేననేదీను. ఆడదాని విషయంలోనూ, సంతానం విషయంలోనూ ఆయన ఏమాత్రపు కనీసబాధ్యతా చూపించలేదంటాం మనం. ఓమారాయనకి
చలి జ్వరం వచ్చిందట. 'నాలుగురోజుల నాడు ఓఆడ'ుదోమ ఎగురుతూంటే ఊరికే పోనియ్యడమేమని దగ్గరికి తీసుకున్నాను. ఇదీ
ఇల్లాంటిదీ మనకేం కొత్తకా'దన్నాడట. నువ్వు అయితే ఆయన్ని రోగుల్లోకి చేరుస్తావో, యోగుల్లోకి చేరుస్తావో మరి."

ఆ వెక్కిరింతను మంజులత నిర్లక్ష్యం చేసింది.

"ఏమిటయ్యా! ఈవేళ మరో కొత్త మాట తెచ్చావు. ప్రేమారాధన పేరుతో ఒక్కళ్ళతోనే 'యావజ్జీవం హోష్యామి' అంటూ వుండాలన్నావు.
ఈవేళ ఆ ప్రేమకి మరో బాధ్యతని జంటచేస్తున్నావులా వుంది. మానవుడి నాగరికత అంతా ఆతని స్వేచ్ఛకేదో రూపంలో బంధనాల
కల్పనకేనా?

అల్లా అల్లా
వీళ్ళతో ఎల్లా?"

రాజగోపాలానికి ఆమె పాటతో నవ్వు వచ్చింది. కాని నిలవరించుకొన్నాడు.

"ఒక దశలో మగాడు బాధ్యతారహితంగా ప్రవర్తించడం నేర్చుకొన్నాడు. ప్రవర్తిస్తున్నాడు. ఆ బాధ్యతారాహిత్యంలో స్త్రీ పురుషుల
సమానత్వం కోరుతానంటావు?"

"బాధ్యతపేరుతో ఆడదాని సంకెళ్ళు మగాడికి మార్చేబదులు వాటిని కృష్ణలో పారేసి ఈ ప్రపంచాన్ని ఇల్లా బ్రతకనియ్యమంటాను."

హఠాత్తుగా వెనుకవేపున కల్యాణి కంఠం వినిపించింది.

"ప్రేమ అనేది నిగ్రహానికీ, బాధ్యతకూ మారుపేరు. స్త్రీ పురుషులు ఏర్పడిన నాటి నుంచీ వారి మధ్య సంబంధాలున్నాయి. ఆ
సంబంధాలలో నిగ్రహం, బాధ్యత ప్రవేశపెట్టడానికి పెళ్ళిని ఒక ఉపకరణం చేశారు. అందుచేతనే అది ఎన్నడూ కృత్రిమంగానే
వుండిపోయింది. అయినా నిగ్రహానికీ, బాధ్యతకూ సహజమైన బలాన్ని కల్పించగల ప్రేమ పరిణితి పొందడానికి కొన్ని భౌతికావసరాలు
కావాలి. ఈనాడవి ఏర్పడ్డాయి. ఆ ఏర్పడడాన్ని పెళ్ళి-ప్రేమలమధ్య పోటీరూపంలో చూడగలుగుతున్నామంటాను."

రాజగోపాలం మాట్లాడలేదు.

"మీ ప్రేమోపాసకులు నిత్యజీవితాన్ని గంద్రగోళంలో పెడుతున్నారు. దుర్భరం చేస్తున్నారు. ఆటవిక జీవితాన్నీ, జంతు ప్రకృతినీ
అర్థం చేసుకోవచ్చు. కాని ఈ నియమాలు, నిర్బంధాలు, నిషేధాలు, ఆరాధనల మధ్య అతి సహజమైన ఆకలిదప్పుల్లాంటి
సాంగత్యవాంఛను గబ్బు పట్టించేస్తున్నారు. నాగరికత తెచ్చిన యంత్రాగారాలతో పాటు ఈ ప్రేమోపాసనా మందిరాలు కూడ నేలకూల్చాలంటే
బాగుంటుంది. కాని కల్యాణి గారూ! ఏమిటీ ప్రేమదాహం?"

కల్యాణి నవ్వింది. రాజగోపాలం సమాధానం ఇచ్చాడు.

"ఆకలిదప్పులు వ్యక్తికి పరిమితాలు. దాని కష్ఠనిష్ఠురాలననుభవించేదతడే. అయినా ఆతని క్షేమం కోసం దానికీ నియమ
నిర్బంధాలు విధిస్తున్నాం. సాంగత్యం అనేది రెండో మనిషినీ, సంగాన్నీ కూడా కలుపుకొంటుంది. కాళ్ళు నావి కాకుంటే కాశీ దాకా
నడవమన్నట్లు ఇతరులేమైపోతేనేం అనుకోగలమా?"

మంజులత కపటభీతినభినయించింది.

"మీరిద్దరూ ఇప్పటికొకే పడవమీదకి వచ్చేశారు. నేను నిష్క్రమించడం మంచిది."



ఇరవైనాలుగో ప్రకరణం


కల్యాణి స్కూలులో వుండగా కబురు వచ్చింది.

"మీ నాన్నగారొచ్చేరు."

రామలక్ష్మమ్మ పక్కింటి కుర్రవాడొకడిని పిలిచి, వాని ద్వారా కబురు పెట్టింది. కల్యాణి హెడ్‌మిస్ట్రెస్‌తో
చెప్పి వెంటనే బయలుదేరింది.

ఆమె వచ్చేసరికే రామలక్ష్మమ్మ ఆయనకు కాఫీ పెట్టి ఇచ్చింది. అంత యోగ్యురాలైన కుమార్తెను కన్న తల్లిదండ్రుల్ని
అభినందించింది. ఆయన ఇతర సంతానం గురించీ ఆస్తిపాస్తుల గురించీ ప్రశ్నలువేసి సమాచారం తెలుసుకొంది.

"ఆస్తులకేం బాబూ! ఈవేళుంటాయి, రేపుపోతాయి. మళ్ళీ వస్తాయి. కాని ప్రతిష్ఠ, మర్యాద పోతే మరి రావు. మా తమ్ముడున్నాడు.
మీలాగే కాంగ్రెసులో జైలుకెళ్లేడు. గుడ్డిగవ్వ లేకుండా ఆస్తంతా పోయింది. ఈమధ్య నీమధ్య ఏవో కంట్రాక్టులంటూ పెట్టుకున్నాడు.
రోజు బాగుంది నాలుగు రాళ్ళు వెనకేసేడు. ముగ్గురు కొడుకులు. అంతా ప్రయోజకులయ్యేరు. తలోమూలా వున్నారు. పెద్ద కూతురికి
పెళ్ళయింది. అల్లుడు ఇంజనీరు. కలకత్తాలో ఏదో వుద్యోగంలో వున్నాడు. మొన్ననే వచ్చివెళ్ళేరు. రెండోపిల్ల వుంది. కాలేజీలో
చదువుతూంది. ఇంకావిడని ఓఅయ్య చేతిలో పెడితే అక్కడికి జీవితంలో అతడు చెయ్యగల శుభకార్యాలన్నీ అయినట్లే. నాకు మాత్రం
ఎవరున్నారు? వాళ్లనే పెట్టుకొని వుంటున్నా."

దక్షిణామూర్తి ఆమె కథనంతనూ 'ఆహా:, ఔనౌను' లతో వ్యాఖ్యానిస్తూ ప్రోత్సహిస్తున్నాడు. కల్యాణి వస్తూనే రామలక్ష్మమ్మ
తోడును అభినందించింది.

"అమ్మను కూడా తీసుకురాకపోయారా?"

"పెద్దవదిన పిల్లలు వచ్చేరు. ఆమె నిండుపొద్దుల మనిషి. ఇంట్లోంచి అమ్మ కదలడం ఎల్లా కుదురుతుందమ్మా!"

"పెద్దవదినయ్యాక, మరోవదిన. లేకపోతే ఓ అక్కయ్య. ఇంక ప్రాణానికి కాస్త విశ్రాంతి ఎప్పుడు?"

దక్షిణామూర్తి నవ్వి కల్యాణి వీపు నిమిరేడు.

"సంసారంలో విశ్రాంతి ఏమిటమ్మా? నువ్వింకా పెళ్లీ, పిల్లలు లేరు గనక ఇంట్లోతోడు అంటే అర్థం కావడం లేదు గాని...."

-అంది రామలక్ష్మమ్మ.

"బాగుందండీ. పెద్దాళ్ళుంటే కాస్త విశ్రాంతి ఇవ్వడానికిబదులు పీక్కు తినెయ్యడమేనా?"

"తప్పు తప్పు" అని దక్షిణామూర్తి కూతుర్ని మందలించేడు.

కల్యాణి గ్రామంలో ఎరిగివున్న వాళ్ళనీ, బంధువుల్నీ, పరిచితుల్నీ గురించి ప్రశ్నలు వేసింది. ప్రతిఇంటా జనన-మరణాల
లెక్కలు తేల్చుకోవడం ఆమెకో సరదా. తమ వూరు నుంచి ఎవరు వచ్చినా విన్న వార్తలే వినడం. అడిగినవే అడగడం –
ప్రతిమారూ ఆ వార్తలు ఏదో కొత్తగానే వినిపిస్తూంటాయి.

తండ్రీ బిడ్డల్ని మాట్లాడుకొనేటందుకు వదలి రామలక్ష్మమ్మ ఇంట్లో ఏదో పని చూసుకొనేటందుకు వెళ్ళిపోయింది.

కల్యాణి ఇరుగుపొరుగుల్ని గురించీ, తన జీవిత పద్ధతుల్ని గురించీ, ఉద్యోగ పరిస్థితులూ తండ్రికొక్కొక్కటే చెప్పింది.

దక్షిణామూర్తి ఆమె వుత్సాహానికి ఆనందించేడు.

"పొరుగు కూడా మంచి వాళ్ళే దొరికారు. ఈ వాటాలో...."

"ఓ మెకానికల్ ఇంజనీరున్నారు. ఒక్కరే వుంటున్నారు పెళ్లీ అవీ లేవు. చాల మంచివారు. అన్నట్లు మీరు కృష్ణాబారేజి చూశారా?
రేపు వెడదాం. రాజగోపాలంగారుకూడా వస్తారు. ఓమారు ఉండవల్లీ అవీ చూసొద్దాం."

దక్షిణామూర్తి చిరునవ్వు నవ్వుతూ కూతురువంక ఆప్యాయంగా చూసేడు.

"సాయంకాలం బండికి పోవాలమ్మా!"

కల్యాణి ససేమిరా పనికిరాదంది.

"అదేమిటి నాన్నారూ! రాకరాక వచ్చేరు. కాలిజోడన్నా వదలకుండా మళ్ళీ ప్రయాణమంటారు. అదేం కుదరదు."

"చూడమ్మా! చిన్నపిల్లదానివా? అల్లాగంటావు! ఈమారు అమ్మా నేనూ వస్తాం, తప్పకుండా ఒక్క వారం వుంటాం. ఓఇరవై రోజుల్లో
అన్నయ్య రావాలనుకుంటున్నాడు. వాళ్ళ పార్టీ మీటింగులేవో వున్నాయట. వీలు చిక్కితే అమ్మను పంపిస్తా."

తనతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడ్డానికే తన ఇతరపనులన్నీ విడుచుకువచ్చానంటూంటే కల్యాణికి అర్థంకాలేదు. బహుశా ఏదో
పెళ్ళి సంబంధం అయి వుంటుందని సావధానురాలయింది. కాని ఆయన వెంటనే చెప్పలేదు. 'కాళ్ళూ చేతులూ కడుక్కుని బట్టలుమార్చుకురా.
వివరాలు సావకాశంగా మాట్లాడుదా' మని కాలయాపన చేస్తున్నాడు. అంత అవసరమైన పనేమిటో సూచనగానైనా తెలుస్తే
బాగుండుననిపించింది.

"ఓ ఉత్తరం రాసి పడెయ్యకపోయారా? అదీగాక ఓ పదిరోజుల్లో దసరాసెలవలిస్తున్నారు. పండక్కి ఎలాగా వస్తున్నాను కదా."

"నువ్వక్కడికి వచ్చేకనే ఆమాటచెప్తే నీకు ఆలోచించుకొనేటందుక్కూడా వ్యవధి వుండదు. ఉత్తరంలో అన్నీ వ్రాయలేము. మంచిదీ
కాదు. అందుకోసం స్వయంగా రావడమే మంచిదని బయలుదేరా."

సందేహం లేదు. పెళ్లిసంబంధమేననుకొంది. తన ఆలోచనలు కూడా చెప్పేసి ముందుకు సాగడానికి అవకాశం దొరికిందనిపించింది. అయితే ముందు
రాజగోపాలాన్ని తండ్రికి పరిచయం చేయడం అవసరం.

"పది నిముషాలలో వస్తానుండండి. చిన్నపని మరిచిపోయా."

ఆమె జోడువేసుకొని గబగబ వీధిలోకి వచ్చింది. నాలుగిళ్లకావల వకీలు యింట టెలిఫోన్ వుంది. దానినుపయోగించడం అలవాటుంది.

వకీలు భార్య కల్యాణిని ఆహ్వానించింది. ఇద్దరూ బజారుకెళ్ళడం అలవాటుంది. పిలిచింది.

"నాన్నగారొచ్చేరు. వెళ్లిపోవాలి."

కల్యాణి రాజగోపాలాన్ని ఫోన్‌మీద అందుకోడానికి ప్రయత్నించింది. కాని అతడు దొరకలేదు. రాగానే ఇంటికి రావలసిందనే
కబురుపెట్టి తిరిగి వచ్చింది.

తండ్రి ఆలోచిస్తున్న విధమూ, సాధ్యమైనంతసేపు సాగారించి అసలు విషయం తేల్చకుండడమూ గమనించి ఆయన పెళ్ళిసంబంధం గురించి
మాట్లాడవచ్చేరాయనీ అనిపించింది. ఆయన మనస్సులో ఏదో వ్యథ.

"ఏమిటాలోచిస్తున్నారు?"

దక్షిణామూర్తి ఉలికిపడ్డా డు. తేరుకుని, ఆమెను తన ప్రక్కన సోఫాలో కూర్చోపెట్టుకొన్నాడు. కూర్చుంటూండగా నెమ్మదిగా తాను
వచ్చినపని చెప్పేడు.

"ఆతడొచ్చాడు."

"ఎవరతడు?"

కల్యాణి చక్రాల్లా కళ్ళుచేసి తండ్రివంక చూసింది. ఆమెప్రశ్నతో దక్షిణామూర్తి ప్రపంచంలో పడ్డాడు. పూర్వవివరణ లేనిదే
తానన్నమాట కల్యాణికి తెలియడం సాధ్యంకాదు. ఆతడనే సర్వనామం ఎవరినుద్దేశించేడో చెప్పాలి.

"ఆనందరావు."

ఆనందరావు ఎవరో మనస్సుకు గోచరం అయింది. కాని, ఆ పేరు పదేళ్లనుంచి ఇంట్లో వినపడ్డం లేదు. అందుచేత ఆ మనిషిని
గురించేనాయని అనుమానం కలిగింది.

ఆనందరావు అనే వ్యక్తి పదహారేళ్ళక్రితం తన పదోయేట తనకి తాళి గట్టేడు. ఆనాడేమిటో తాను చాలా అవకరంగా వుండేది. తను
అందంగా లేనని ఆ యిరవయ్యేళ్ళ యువకుడు మొరాయించినా తండ్రి గదిమేసి పెళ్ళి చేసేడుట. కారణం తమ తండ్రులిద్దరూ స్నేహితులు.
ముస్తఫాలీఖాను చేత ఒకే రోజున ఎముకలు విరగ్గొట్టించుకొని ఏడాది పాటు బళ్ళారి జైలులో పులుసు-ముద్దా తిన్నారు. ఆ స్నేహాన్ని
పిల్లల పెళ్ళితో ఇంకా దృఢపరచాలనుకొన్నారు. కాని, ఆ ప్రయత్నం రెండు కుటుంబాలమధ్య తగని ద్వేషాన్ని కలిగించింది.

ఆ పెళ్ళయిన ఏడాదికే తండ్రి పోయేడు. ఆనందరావు తర్వాత దేశం వదలి పోయేడు. అమెరికా వెళ్ళేడన్నారు. తిరిగి
వచ్చాడన్నారు. ఎక్కడో వుద్యోగం చేస్తున్నాడన్నారు. కాని స్వగ్రామం రాలేదు. భార్యఅన్న కన్యను పలకరించలేదు.

మరోపెళ్ళి చేసుకొన్నాడన్నారు కూడా. అంతతో అతని చరిత్ర అవసరంకూడా ఆ ఇంటికి లేకపోయింది.

ఇన్నాళ్ళకి ఆతడు రావడమేమిటి? ఆమెకు అనుమానమే అనిపించింది.

"ఎవరా ఆనందరావు నాన్నారూ?"

"అతడే నీ మగడు."

ఆ విశేషణానికి కల్యాణి ముఖం చిట్లించింది.

"నాకు మగడింకా ఏర్పడ్డాడనుకోవడం లేదు నాన్నగారూ!"

దక్షిణామూర్తి సోఫాలో జేరగిలబడిపోయాడు.

"మనం అనుకోనివి చాలా సందర్భపడుతుంటాయి. వానిలో ఇదొకటి. ఇల్లాంటి వాటినే అనిచ్ఛాప్రారబ్ధాలంటారు."

పదిహేనేళ్ళక్రితం జరిగిపోయిన ఒక దుర్ఘటనను జ్ఞాపకం చేసుకోవాలనే వుత్సాహం లేకపోయినా, అసలావ్యక్తి ఇన్నేళ్ళతర్వాత
ఎందుకు రావలసి వచ్చిందో తెలుసుకోవాలనే వాంఛను అణచుకోలేకపోయింది. ఆమె ప్రశ్నించకుండానే యావద్విషయాలూ పూసగుచ్చినట్లు
దక్షిణామూర్తి చెప్పేడు.

నాలుగురోజులక్రితం ఆనందరావు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ రావడం సరాసరి తమ యింటికే వచ్చాడు. తన భార్యను
తీసుకెళ్ళడానికే వచ్చానన్నాడు. ఇప్పుడు తమయింట్లోనే వున్నాడు.

అంతవరకూ గ్రామస్తులు కల్యాణి దురదృష్టవంతురాలుగా జాలిచూపేరు. రత్నంవంటి అమ్మాయి. అందం వుంది. చదువుంది గుణం వుంది.
అల్లాంటిదాన్ని మగడు ఒల్లకపోవడమేమిటి. దాని దురదృష్టం కాక అన్నారు. ఆనందరావురాకతో అంతా ఆమె అదృష్టానికి
పొంగిపోతున్నారు. ఆమె సుఖపడేరోజులు వచ్చాయన్నారు.

కల్యాణి అన్నీ విని ఆఖరున 'ఉహూ' అని ఒక్క దీర్ఘం తీసింది. అది సంతృప్తికి చిహ్నమో, అసంతృప్తికి ప్రతినిధో అర్ధం
కాలేదు.

దక్షిణామూర్తి ఒక్కనిముషం ఆలోచించి గ్రామస్తుల అభిప్రాయంలో ఆమె సుఖపడుతుందనీ, అదృష్టవంతురాలనీ అనుకోడానికిగల కారణాలు
చెప్పేడు.

"నెలకో వెయ్యి రూపాయలు జీతంలో వున్నాడట."

"ఆ భార్య పోయిందట."

"ఆమెకెవ్వరూ పిల్లలు లేరట."

"వయస్సు ముప్ఫయ్యారు, ముప్ఫయ్యేడే – ఇంకా చిన్నవాడే!"

ఇవన్నీ ఆమె మగని అర్హతలు. కల్యాణి వేనికీ సుముఖతా, వుత్సాహమూ చూపలేదు. దక్షిణామూర్తి ఆగి ఆగి ఆ మంచి
లక్షణాలన్నీ మెదడుకు పట్టేటందుకు వ్యవధినిస్తూ వుచ్చరించేడు. చివర తన అభిప్రాయం కూడా కలిపేడు.

"నువ్వేమీ తొందరపడకు. ఆలోచించుకో. చదువుకొన్నదానివి."

ఆయన వుద్దేశంలోకూడా ఆనందరావువైపు మొగ్గున్నట్లే కల్యాణి భావించింది. ఖచ్చితంగా చెప్పేసింది.

"దీనిలో ఆలోచించేటందుకేముంది నాన్నారూ! ఎవరో వీధినపోయే బుద్ధిమంతుడొకడు ఇంటిదాకావచ్చి మీ అమ్మాయి నాపెళ్ళామండోయంటే మీరంతా
ఎల్లా వూరుకున్నారు?"

చెంపకాయ తగిలినట్లయి దక్షిణామూర్తి ఉలికిపడ్డాడు. కాని, ఆయన కుమార్తెభావాన్ని సరిగ్గా గ్రహించలేదని మరుమాటలోనే అర్థం
అయింది.

"వీధేపోయే వాడెవరో కాదమ్మా, ఆతడే, అంత గుర్తుపట్టలేకపోయామంటావా?"

"ఆతడే కావచ్చు. గుర్తుపట్టడంలో పొరపాటు లేకపోవచ్చు. కాని, అసలు పొరపాటు బాంధవ్యం కలపడంలోనే వుంది!"

దక్షిణామూర్తి తల తిప్పుకొన్నాడు.

"అంతేనంటావు."

"మరోలా అనుకొనేటందుకవకాశం లవలేశమూ లేదు,"

ఒక్క క్షణం ఆయన మాట్లాడలేదు.

"ప్రస్తుత పరిస్ధితికి మా తెలివితక్కువదనం కూడా కొంత కారణం కాదుగదా అనిపిస్తూంది."

"ఏ విధంగా?"

"నీకు పెళ్ళేకానట్లు మేముకూడా నటించడం...."

ఆనందరావు ధోరణి తెలిసిపోయాక దక్షిణామూర్తి తన కుమార్తె భవిష్యత్తుగూర్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నాడు, ఆనాడే.

మగడు విడిచిపెట్టాడనే భావన ఆడపిల్లల్ని ఎంత కుంగదీస్తుందో ఆయన తన జీవితంలో చాలమందిని చూసేడు. తనకు పెళ్ళయిందనీ,
ఫలానావాడు తన మగడనీ వాళ్ళు ఎరిగి వుంటారు. కాని ఆ ఫలానావాడు మగని బాధ్యతలను స్వీకరించడు. అయినా ఆశ వదలదు.
జీవితమంతా వ్యర్థమైపోయినట్లు విలవిల్లాడిపోతారు. క్రుంగిపోతారు.

ఆ దశ తనకూతురు అనుభవించరాదనుకున్నాడు. అల్లుడు తనకూతురంటే అసహ్యించుకొంటాడని గ్రహించాక పుస్తెలు తీసిపారేశాడు. ఆమెకు
పెళ్ళేఅయినట్లు కాదన్నాడు. ఆతనిప్రసక్తి యింట్లో రాకుండా జాగ్రత్త పడ్డాడు. వూళ్ళోవాళ్ళు గుర్తు చెయ్యకుండా ఆమెను చదువుకు
పంపేసేడు.

వయస్సుతో కల్యాణి సౌందర్యం వికసించింది. అల్లుడూ విదేశాలనుంచి వచ్చేడన్నారు. కూతురికి తెలియకుండానే మరోమారు ప్రయత్నం
చేశాడు. ఆతడు నిరాకరించేడు. కూతురికి మరోపెళ్ళి చేసుకోమన్నాడు. కావలిస్తే కాగితం వ్రాసి ఇస్తానన్నాడు.

దక్షిణామూర్తి మండిపడ్డాడు.

"నీకు పిల్లనిస్తానని వచ్చానుగాని, ఇదివరకే నీకిచ్చినట్లు నేననుకోవడంలేదు. నీకిస్తాననడమే ఆమెకు మరోపెళ్ళి ప్రయత్నంలో
వున్నానని అర్థం. నీ కాగితంముక్క అవసరంలేదు-" అన్నాడు.

ఆనందరావు నెమ్మదిగా వివాహం అయ్యేవరకూ నెలనెలా డబ్బు పంపుతానన్నాడు.

"మంచో, చెడ్డో పెళ్లిచేసుకొన్నా, ఆమెజీవితం నాశనంచేయడం నా అభిమతంకాదు. ఆవేశపడి ఆమె జీవితాన్ని అల్లరిపాలు చేయకండ"ని
సలహాకూడా ఇచ్చేడు.

దక్షిణామూర్తి వచ్చేసేడు. ఒకటి రెండు నెలలు మనిఆర్డర్లు వచ్చాయి. ఆతడు తిరగకొట్టేడు. తర్వాత అవీ ఆగిపోయేయి.
కల్యాణి పెళ్ళిలో తప్ప చూసి వుండని ఆ ముఖాన్ని గుర్తుపట్టలేనిస్థితి. ఇంట్లోవాళ్ళు కూడా ఆమెకు పెళ్ళయిందనే భావనను
వదలుకొన్నారు. ఆపేరే గుర్తు రాదు. ఆమెకు పెళ్ళిప్రయత్నాలూ చేశారు. కాని చదువులోపడి కల్యాణి అటువేపు దృష్టిసారించలేదు.
ఇన్నాళ్ళకామె దృష్టి పెళ్లివేపు మళ్లింది. హాస్యంలోనో, మాటల్లోనో ఆమె పెళ్లివిషయాలు వూహిస్తూందని స్పష్టమయింది. సరిగ్గా ఆ
సమయానికి ఆనందరావు హాజరయ్యేడు. అది మంచికనుకోవాలో, చెడ్డకనుకోవాలో దక్షిణామూర్తి నిర్ణయించుకోలేకున్నాడు.

కాని కల్యాణికి ఆ విషయంలో భిన్నాభిప్రాయంలేదు. తనకు పెళ్ళిఅయిందనే విషయాన్ని ఆమె స్వీకరించదు.

"నిజంగానే అయిందనే అనుకుంటున్నారా?"

ఆ సరాసరి ప్రశ్నకు దక్షిణామూర్తివద్ద సమాధానం లేదు. వూరుకున్నాడు.

"మొదట చేసినపని పొరపాటని మీరే అనుకొన్నారు. దానిని దిద్దుకున్నారు. మంచిపని చేసేరంటాను. పదేళ్ళపిల్లకి కట్టడానికి
ప్రాముఖ్యత ఇవ్వవద్దు. నాలుగేళ్ళ మేనమామ కూతురు నిద్రబోతూండగా గణపతి కట్టిన తాళిబొట్టుకి సింగమ్మ ఇచ్చిన
విలువకన్న దానికి హెచ్చు విలువ వుండదు. లేదుకూడా. లేనిపోనిఆశలు పెట్టుకొని లేకుండాపోయిన పెళ్ళికొడుకును గురించి నా మనస్సులో
అర్థంలేని అభిమానాలు, సెంటిమెంట్సూ కలిగించలేదు. సంతోషం. నాకాళ్ళ మీద నేను నిలబడగలిగేటట్లు చేశారు. నాకిష్టం వచ్చిన
వరుణ్ణి ఏరుకొనే అధికారం కూడా ఇచ్చారు. అవునా?"

దక్షిణామూర్తి నిశ్శబ్దంగా తల తిప్పేడు.

"మరిప్పుడీ ఆలోచన ఎందుక్కలిగింది?"

"వివాహం అన్నది అంత సులువుగా త్రెంచి పారెయ్యగలిగేటట్లు తోచడం లేదమ్మా!"

"ఇదివరకొకరు మీలో ఇందుకు విరుద్ధమైన అభిప్రాయం కలిగించారు."

"అవును."

"అదే సరయినది. ఆ అభిప్రాయాన్ని వదలకండి."

దక్షిణామూర్తి విచారంతో తలతిప్పేడు.

"ఆనందరావు ఎదటకు రానంతకాలం అది బాగానే వుంది. కాని ఆతడు వచ్చి నేనున్నాననేసరికి కేవలం ఆత్మవంచన మాత్రంగా
పరిణమించింది."

కల్యాణి ఆలోచించింది. తండ్రి చెప్పిన మాట యధార్థం. శుభలేఖలు, పురోహితుడు, బాజాభజంత్రీల వాళ్ళు, గ్రామస్థులు బోలెడంత
మంది ఆ వివాహం జరిగిందనడానికి సాక్ష్యం. తర్వాత జరిగిన ఘటనలు ఒకపొరపాటనుకొంటారు.

ఒక మారు తన తండ్రి ఓ కథ చెప్పేడు. ఆయన మద్రాసులో పెనిటెన్షియరీ జైలులో వుండగా ఒక వ్యక్తి ఫోర్జరీచేసి జైలులో
పడ్డవాడు అగతగిలాడు. ఆతడు కాగితాలనే కాదు, జీవితాలనే ఫోర్జరీ చెయ్యగల సమర్థుడని తెలిసింది – ఆతడిది గుంటూరు.
నెల్లూరు జిల్లాలో ఓపల్లెటూరులో ఒకయింట నాతడు ఒక అందమైన పడుచును చూసేడు. ఆమెకు ఆస్తికూడా వుంది. ఆమెను అడిగితే
తండ్రి తిట్టి తరిమేశాడు. అతడింక ఫోర్జరీకి పూనుకున్నాడు. ప్రెస్సుకి వెళ్ళి రెండేళ్ళక్రితంవున్న ముహూర్తానికి శుభలేఖలు
అచ్చువేయించాడు. ఒక పురోహితుడికి, నలుగురు బళ్ళవాళ్ళకి, భజంత్రీల మేస్త్రికి, ఆ వూళ్ళో వ్యతిరేకపక్షంవారికి డబ్బిచ్చి
లొంగదీసుకొన్నాడు. కోర్టులో ఈ కూట సాక్ష్యంతో జరగనిపెళ్ళి జరిగిందని రుజువిప్పించి పెళ్ళాన్ని తెచ్చుకొన్నాడుట.

ఆ సాక్షులసహాయంతోనే నేడు ఆనందరావు తన భర్తృత్వం చలాయించదలస్తున్నాడు.

అయితే ఆ దురంతకుడితో కాపురం చెయ్యడం ఇష్టపడక ఆ నెల్లూరమ్మాయి ఆత్మహత్య చేసుకొందన్నారు. తానంత బలహీనురాలు కాదు.
ప్రయత్నించనీ చూద్దామనుకొంది.

ఈ నూతన పరిస్థితులలో తనవారంతా ఎల్లా ఆలోచిస్తున్నారో?

దక్షిణామూర్తి ఆలోచించేడు.

"చెల్లాయి వొప్పుకుంటే...." అన్నాడు పెద్దన్నగారు.

"దానిని నిర్బంధించకండి" అన్నాడు చిన్నన్న.

"అమ్మ ఆలోచన కూడా తీసుకోవలసిందే" నని దక్షిణామూర్తి వివరించేడు.

"మంచో చెడ్డో జరిగిపోయిందేదో జరిగిపోయింది. కల్యాణికి వయస్సు వచ్చింది. మొదట అనుకున్నట్లు పెళ్ళిచేసివుంటే అదోవిధంగా
వుండేది. అలా జరగలేదు. దైవలిఖితం. ఇప్పుడు ఆనందరావే వచ్చి అడుగుతున్నాడు. ఇతరవిధాలైన లోట్లులేనప్పుడు ఇంక తామంత
పట్టుదల చూపరా"దనేది ఆవిడ అభిప్రాయం.

"వాళ్ళిద్దరికీ బ్రహ్మ అల్లావ్రాసి పడేశాడు. వాళ్ళని విడదియ్యడం మనుష్యబుద్ధికి సాధ్యంఅయ్యే పనికాదు. అందుచేతనే మనం
పెళ్ళిచేయాలని ఎంత ప్రయత్నించినా సాగలేదు. వద్దన్నవాడే తిరిగొచ్చాడు."

కల్యాణి లేచి నిల్చుంది.

"నాన్నగారూ?"

దక్షిణామూర్తి తలఎత్తి చూశాడు.

"నాకు పెళ్ళికాలేదు. ఆనాటి నాటకంలో నాపాత్ర ఏమీలేదు."

ఆ కంఠస్వరం విని ఆయన చకితుడయ్యాడు.

"నాకిష్టం వచ్చినప్పుడు నాకిష్టమైనవానిని చేసుకొంటాను. మానుతాను. నాయిష్టం. ఆ స్వాతంత్ర్యం మీరిచ్చేరు. వుందనుకొనేటట్లు
చేశారు. ఈ వేళ మళ్ళీ కాదనకండి. వీధేపోయే పెద్దమనిషిని చూపించి నాకు వరస కలపవద్దు."



ఇరవయ్యయిదో ప్రకరణం


ప్లాట్‌ఫారంమీద రైలుకోసం ఎదురుచూస్తూ నిలబడి దక్షిణామూర్తి మరోమారు కుమార్తెను హెచ్చరించాడు.

-"పట్టుదల చూపవలసిన ఘట్టాలు వున్నాయి. మరచిపోవలసిన అవసరాలూ వున్నాయి."

-"మరోలా చెప్పాలంటే తెగేదాకా లాగకూడదు."

అంతవరకూ అన్నీ వింటూ కూర్చున్న కల్యాణికి ఒకసంగతి గుర్తుకు వచ్చింది. తండ్రి ఈవిషయంలో రాయబారి మాత్రమేనా? ఆయన
అభిప్రాయం ఏమిటి?

"ఇంతకీ మీ స్వంత ఆలోచనలేమిటి?"

"నీ మనస్సులో ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చేశాక ప్రత్యేకంగా నేను చెప్పేదేముంటుంది?"

కల్యాణి ఏమీ మాట్లాడలేదు. ఒక్కనిముషం ఆగి దక్షిణామూర్తే చెప్పేడు.

"ఒక అన్యాయం జరిగినమాట నిజమే. దానిని సర్దుకొంటానన్నప్పుడు ఎందుకు సందేహించాలి? – అంటాను."

"మీకు నేను చెప్పవలసిందాన్ని కాను."

"సందేహించకు."

"పెళ్ళి విషయంలో చేసుకొనేవాళ్ళ అభిప్రాయాల్ని పాటించాలి కదా?"

"లేకుంటే తెలుగుదేశంలో ఇంతవరకు వచ్చిన అభివృద్ధికి అర్థంలేకుండా పోతుంది."

"ఆ విషయంలో ఆడ-మగలమధ్య తేడాచూపించకూడదు."

"మనం ఏభయ్యేళ్ళక్రితం వున్న స్థితిలోనే లేము. తప్పకుండా నువ్వుచెప్పిందే న్యాయం."

"ఔనా మరి, ఇదివరకు ఒకమారు ఆ అభిప్రాయాన్ని నిరాకరించేరు. ఇప్పుడు మరోమారు అదే పని చేయకండి."

దక్షిణామూర్తి అప్రతిభుడయ్యేడు.

"ఈ విషయంలో మేం చెప్పేదీ, చెప్పగలదీ సలహామాత్రంగానే వుంటుందమ్మా!"

"ఇంతవరకూ మీరు చెప్పిందంతా సలహామాత్రమే అయితే...."

దక్షిణామూర్తి మరల వొక అడుగు వెనక్కి వేశాడు.

"నీ మీద వున్న ప్రేమా, చనువూ, మా వయస్సు పెద్దరికపు కర్తవ్యజ్ఞానమూ మా కంఠాలలో ఆజ్ఞల్లాగ ధ్వనించినా వానినల్లాగే
తీసుకోనక్కర్లేదు. అది కేవలం మా సలహా మాత్రం...."

"మీ సలహాలకు నా సవరణ...."

"ఏమిటది?"

"నాకు పెళ్ళయిందనే ఆలోచనే మీ మనస్సుల్లోకి రాకూడదు."

దక్షిణామూర్తి చిన్నగా నవ్వేడు.

"పోనీ భవిష్యత్తులో...."

"ఎందుకు చేసుకోను?"

"చేసుకోవాలనుకొన్నప్పుడు ఇతణ్ణి కూడా ఆలోచనలోనికి తీసుకోవచ్చు కదా!"

"కట్టుకొన్నవాళ్ళని విడిచిపోతాడనే మచ్చ చిన్నదేంకాదు. అటువంటివానిని పెళ్ళి విషయంలో ఆలోచించే ప్రమాదం ఎవరూ
తెచ్చుకోకూడదని నావూహ."

దక్షిణామూర్తి ఏమీఅనలేదు. కొంత సేపు వున్నాక మరల అన్నాడు.

"నీ అభిప్రాయాన్ని బహుశా మనింట్లో ఎవ్వరూ కాదనరు. కాని...."

"ఏమిటి?"

"ఈవిషయంలో నీచూపు మరోచోట...."

తండ్రి ప్రసంగం మారుస్తున్నాడని గ్రహించి కల్యాణి నవ్వుకుంది. ఆ ప్రశ్నకాక్షణంలో సమాధానం ఇవ్వడానికామె సిద్ధంగా లేదు.

"మీకు చూపించకుండా చేసుకోను కదా!"

కూతురు గడుస్తనానికి దక్షిణామూర్తి నవ్వుకొన్నాడు.



ఇరవయ్యారో ప్రకరణం


స్టేషనునుంచి బయటకు వచ్చేసరికే రోడ్డుదీపాలు వెలుగుతున్నాయి.

కల్యాణి మనస్సంతా గందరగోళంగా వుంది. తాను ఎన్నుకొన్న వరుణ్ణి తండ్రికి చూపి పరిచయం చేయాలనుకుంది. తన అన్నగారు ఓమారు
వచ్చినప్పుడు రాజగోపాలంతో పరిచయం చేసుకున్నాడు. అతనిని వరుడుగా ఎన్నుకోవడంలో అభ్యంతరం ఉండకూడదనే భావాన్ని మొదట
కలిగించివాడు అన్నగారే. ఆయనతో మాట్లాడి వచ్చినాక అన్న భాస్కరానికి మంచి అభిప్రాయం ఏర్పడింది.

"బ్రాహ్మణులం, మిగిలినవాళ్ళకన్న ఉత్తమసంస్కారం మాకుంది అని ఆత్మవంచన చేసుకోవడమేగాని ఆయనకన్న బ్రాహ్మణుల
మనుకునేవాళ్ళు ఎందులో గొప్ప?"-అని భాస్కరరావు ప్రశ్నించేడు. మరో రోజున ఏదోమాటల సందర్భంలో తమమధ్య వయోభేదం
పరిగణించనక్కర్లేదనే భావంకలగడానికి తోడ్పడ్డాడు.

పదేళ్ళకన్యకూ పదేళ్ళకుర్రవానికి పెళ్ళిచేయడం తప్పే. ఆడవాళ్ళు ఒక్క ఏడాదిలో పెరిగిపోతారు. ఆమెకు వయస్సు వచ్చేసరికి
అతడింకా గుంటపువ్వులు పూస్తుంటాడు. కాని ఇరవయ్యేళ్ళ యువకుడు పాతికేళ్ళపడుచును పెళ్ళిచేసుకోవడం అభ్యంతరం కాకూడదు. ఇద్దరూ
పూర్ణయౌవనంలో వుంటారు."

ఆ మాట తమరి నుద్దేశించి చెప్పినదికాదు. లోకవృత్తంగా చెప్పేడు. కాని అది తమకు సరిపడుతూ౦ది. ఏదో వాకబులో రాజగోపాలం
తనకన్న ఏడాది చిన్నవాడని తేలింది. అన్నమాటలతో ఆ తేడా విషయమై అనుమానాలున్నా తొలిగిపోయాయి.

తనతో సమంగా అతడుకూడ తనయెడ మమకారం చూపుతున్నాడని తెలిసాక ఆమెకింక సందేహమే లేకపోయింది. తన అన్నమాటలను పట్టి ఈ
సంబంధాన్ని నిర్ణయించుకోడానికి ఆయన తోడ్పడతాడు. ఇంక తండ్రీ-తల్లీ, మిగిలిన బంధువులూ. తండ్రి సిద్దాంతరీత్యా కులభేదాన్ని
అంగీకరించడు. కాని, తనకూతురు మరోకులం వానిని పెళ్ళిచేసుకోవడం ఇష్టమవుతుందో, అవదో, మొదట కాదన్నా ఆయన్ని
వొప్పించవచ్చు. ఆ విషయంలో తన అన్నసాయం తీసుకోవచ్చు. కాని తల్లి! అక్కలు! మిగిలిన అన్నలు! అందులో కొందరి
అత్తారివాళ్ళు ఛాందసులు. తను మరోకులంవాడిని పెళ్ళిచేసుకుంటే పూర్వకాలంలోలాగ అక్కలకి శిక్ష విధించి పుట్టిళ్ళకి తోలెయ్యడం
జరక్కపోవచ్చు. వెలేస్తామని వూళ్ళోవాళ్ళు బెదిరించకపోవచ్చు. కాని, తమ పిల్లలకి మంచి సంబంధాలు రావనో, సాటివాళ్ళు
వెక్కిరిస్తారనో, తమ అక్కల్ని పుట్టింటికి పంపకపోవచ్చు. ఎంతమందికి ఇష్టంలేకపోయినా, అంతమందికీ ఇష్టంలేకపోయినా, తాను
భయపడక్కర్లేదు. వాళ్ళుకాదంటే వాళ్ళ ఇళ్ళ కెందుకెళ్ళాలి? వెళ్ళదు. వెళ్లకుంటే జరగదనే భయం తనకులేదు.

అందుచేత దసరా సెలవులకు వెళ్ళేటప్పుడు పల్లెటూళ్ళు చూడ్డం పేరుతో రాజగోపాలాన్ని తీసుకెళ్ళి అందరికీ పరిచయం చెయ్యాలనే
ఏర్పాటులోవుంది.

కాని హఠాత్తుగా కొత్త సమస్యలు పుట్టుకొచ్చేయి. నిజంచేత అది పాతసమస్యే. కొత్త చిగుళ్ళు తొడిగింది. ఈ విధమైన
పరిణామాన్ని ఆమె ఊహించలేదు. అందుచేత ఏం చెయ్యాలన్న ఆలోచనా కలగలేదు. హఠాత్తుగా తన అంచనాలు కదిలిపోయాయి.

ఇంతవరకు తనవాళ్ళు వర్ణా౦తరుణ్ణి పెళ్ళి చేసుకోవడానికి ఆటంకపెడతారేమోనని మాత్రమే సందేహిస్తూంది. ఇప్పుడు తను
జరిగినట్లు భావించదలచుకోక పోయినా, సంఘం దృష్టిలో జరిగిపోయిందనుకొంటున్న పెళ్ళికి తన్ను దఖలుపరిచేస్తారు. తన తండ్రి
రాయబారం వుద్దేశం అది.

కల్యాణి ఈ అన్యాయాన్ని తృణీకరించదలచినది. తనకు పెళ్ళికాలేదనే ఇంతవరకు అనుకుంటూ౦ది. దానిని ఆత్మవంచనగా
తీసుకోదలచలేదు. ఆ అభిప్రాయంమీదనే అందర్నీ ఎదిరించాలి. అయితే ఈ సమస్యను రాజగోపాలం ముందుపెట్టాలా? ఏవిధంగా పెట్టడం?
బొమ్మలపెళ్ళికన్న విలువలేని దానిని గురించి అతనితో చెప్పడంకూడా దానికి లేనివిలువ నివ్వడమే అవుతుంది కదా? చెప్పకపోతే
మోసపుచ్చినట్లు భావిస్తాడనే ఆలోచన అమెకురాలేదు, ఇంతవరకూ. ఈ నూతన పరిణామాలదృష్ట్యా అతనితో చెప్పడం అవసరమా?

ఆమె ఏమీ తేల్చుకోలేకుండా వుంది. ఒక్కవిషయంలో ఆమెకింతవరకు దృడాభిప్రాయం వుంది. ఎవరుకాదన్నా రాజగోపాలాన్ని పెళ్ళిచేసుకుంటుంది.
ఇప్పుడే దానిస్థానే మరో అంశం నిలబడింది. ఎవరు ఔనన్నా ఆనందరావును అంగీకరించదు.

ఆమె ఆలోచనలో ఉండగానే రిక్షా సెంటరుదాటి ఏలూరు రోడ్డుకి తిరుగుతూంది. బాగా చీకటిపడింది. ఇంటికివెళ్ళి వంట వండుకోవడానికి
బద్ధకం అనిపించింది. బద్దకంగావున్నా, పనిఒత్తిడి వున్నా, పనిమనిషిని పంపించి కారియరు తెప్పించుకోవడం అలవాటు. అ రోజున
మరచింది. ఇప్పుడు వెళ్లి వండుకోలేదు. ఆకలి వేస్తూంది. హోటల్లోనే తిని వెళ్లిపోవాలనుకుంది. రిక్షావానిని పంపేసింది.

హోటళ్ళ సెంటరుకి వచ్చేసరికి సైకిలు దిగుతూ రాజగోపాలం కనిపించేడు. అతడే దూరంనుంచి ఆమెను చూసి వచ్చేడు.

"చీకటి పడ్డాక ఇల్లా నడిచివస్తున్నావెక్కడినుంచి?"

"స్టేషనుకెళ్ళా. నాన్నగారొచ్చేరు."

ఆయనను తీసుకురావడానికే వెళ్ళిందనుకొన్నాడు.

"ఏరీ?"

అప్పటికే ఒకళ్ళిద్దరి దృష్టి తమమీద వుండడం గమనించి కల్యాణి తొందరచేసింది.

"మధ్యాహ్నం వచ్చేరు. వెళ్ళిపోయారు. బండికి పంపేసి వస్తున్నా."

"ఇద్దరూ హోటలులోకి నడిచేరు. గోపాలం తమరిద్దరికీ టిక్కెట్లు తీసుకున్నాడు. కుటుంబాలతో వచ్చిన వారి కోసమని 'స్క్రీన్'
లతో వేరుపరచిన చిన్నగదిలోకి సర్వరు దారిచూపేడు. అందులో ఒకేటేబిలు వుంది. దానికి రెండువేపులా రెండుకుర్చీలు. తనకుర్చీకూడా
కళ్యాణి కుర్చీప్రక్కనే ఉండేటట్లు సర్వరుచేత మార్పించేడు.

భోజనం పూర్తిచేసి ఇద్దరూ వీధిలోకి వచ్చారు. రాజగోపాలం రెండు కిళ్ళీలు కట్టించి తెచ్చేడు.

"ఎమిటింక? ఇంటికేనా?"

కల్యాణి గడియారం చూసింది. ఎనిమిదే అయింది.

"ఏదన్నా సినీమాకి వెళ్ళాలంటే చాలా వ్యవధి వుంది."

రాజగోపాలం ఆమె ప్రతిపాదనకు అంగీకరించేడు. కాని, అంతవరకూ ఏం చెయ్యడం? ఏ పార్కులోనన్నా కూర్చోవాలనుకుంటే బెజవాడలో
అటువంటి అలవాట్లూ లేవు. అందుకు వీలయిన పార్కులూ లేవు. జనం మధ్య ఒంటరిగా ఓగంట కాలక్షేపం చెయ్యాలంటే రోడ్డు
బ్రిడ్జిమీదికి వెళ్లి కృష్ణకేసి చూస్తూ ఆనందించాలి.

"రా. విశాలా౦ధ్ర ఆఫీసులోకి వెడదాం. చాలామందిని ఎరుగుదును. ఏ పేపర్లో చూస్తూ కాలక్షేపం చేయొచ్చు."

కల్యాణి అంగీకరించలేదు. ఆమె తలనొప్పిగా వుందంది.

"ఇంటికే పోదాం."

ఆమెతోకలసి సినీమాకు పోవడంలోవున్న ఆనందాన్నీ, సంతృప్తినీ రాజగోపాలం వొదులుకోలేకపోయాడు. ఇద్దరూ హోటలులోకే వెళ్ళేరు. కాఫీ
సెక్షనులో టేబుల్సన్నీ ఇంచుమించు ఖాళీగానే వున్నాయి. భోజనాలవేళ.

ఒక చిన్నటేబుల్ వద్ద ఇద్దరూ కూర్చున్నారు. రెండుకాఫీలు చెప్పి ఇద్దరూ బాతాఖానీ ప్రారంభించారు.

"మధ్యాహ్నం ఫోన్‌చేశా. కబురందలేదా. ఎక్కడికి వెళ్ళేరు?"

రాజగోపాలం ఆ రోజున తాను ఎక్కడికి వెళ్లిందీ వివరించి చెప్పేడు.

"మీనాన్నగారు హఠాత్తుగావచ్చి ఎందుకంత తొందరగా వెళ్లిపోయారు?"

"ఇంటికెళ్ళేక చెప్తా. చాలా సంగతులున్నాయి."

ఆమె స్టేషనునుంచి వస్తూ చేసిన ఆలోచనకు భిన్నమైన వాగ్దానం. ఆ ప్రశ్నవస్తుందని ఆమె వూహించలేదు. ఇప్పుడు వచ్చింది.
ఇంక దాచడంలో అర్థంలేదు. వెంటనే చెప్పేసి కర్తవ్య౦ ఏమిటో ఇద్దరూకల్సి తేల్చుకోవడం మంచిదని తోచింది. లేచింది.

"లేవండి, సినీమాకు రేపురావచ్చు. ఈ వేళకి"

ఇంతసేపూ వుండి బాగుంటు౦దనుకొన్న ఫిలిం చూడకుండా పోవడం రాజగోపాలానికి ఒప్పుదలకాలేదు. తొమ్మిది అయింది కూడా.

"తొమ్మిదయింది. నెమ్మదిగా పోదాం. మనమూ వెళ్ళేసరికి ఆట వదిలేవేళ అవుతుంది.

హాలు చేరేసరికి తొమ్మిది దాటింది. కాని మొదటి ఆట విడిచేటందుకు అరగంట వ్యవధివుంది. రెండో ఆటకి పల్చపల్చగా జనం
చేరుతున్నారు.

పోర్టికోలో ఖాళీగా వున్న కుర్చీలను ఆక్రమి౦చేరు. ఆమెను కూర్చోబెట్టి రాజగోపాలం వీధిలోకి వచ్చేడు.

"సబ్బయిపోయింది. పక్కకొట్టులో తెస్తా. కూర్చో."

కళ్యాణి అక్కడే కూర్చుని చట్రాలలో బిగించిన రాబోయే ఫిల్ముల తాలూకు స్టిల్సు చూస్తూ వాని కథలను అర్థం చేసుకోవడానికి
ప్రయత్నిస్తూంది.

వెనక ఎవరో పిలిచినట్లయి తిరిగి చూసింది. పది పన్నెండేళ్ళ కుర్రాడు. చింకిరిగుడ్డలూ, మాసిన జుట్టూ- సినీమా హాళ్ళబయట
గేట్లలో నిల్చుని, సందుల్లోంచి మూడు ఆటలూ చూసి రాత్రి అక్కడే ఏ పేవ్‌మెంటు మీదనో పడుకుని నిద్రపోయే కుర్రాళ్ళలో
ఒకడు.

"ఎవరిని?"

"మీతో వచ్చినోరు. అక్కడున్నారు. పిలుచుకురమ్మన్నారు."

"ఎక్కడున్నారు?"

"గేటుప్రక్క."

ఆవార్త అందించి వాడు మరోమూలకు పరుగెట్టిపోయేడు.

"ఎందుకబ్బా! అనుకుంటూ కల్యాణి గేటులోకెళ్ళింది. అక్కడ రాజగోపాలం లేడు. ఎదురుగా అంతదూరంలో ఒక చిన్నకారుంది. ఇంజను
పిల్లికూతలు పెడుతూంది.

కల్యాణి రాజగోపాలంకోసం అటూఇటూచూస్తూ రోడ్డువేపు రెండడుగులు వేసింది. హఠాత్తుగా ఎవరో భుజమ్మీద చెయ్యేసేరు. వులికిపడి
వెనక్కి తిరిగింది.

ఒకపడుచువాడు మంచిదుస్తులలో తనప్రక్కనే నిలబడి జబ్బదొరికించుకొన్నాడు.

"రా. ఇంటికిపోదాం."

కల్యాణి వాని స్పర్శకు జలదరించింది. అంత చనువుగా భుజమ్మీద చెయ్యివెయ్యడమూ, అధికారం-దర్పం చూపుతూ ఇంటికి పోదాం
రమ్మనడమూ ఆమెకు దిగ్భ్రమను కలిగించాయి. దానినుంచి తేరుకునేలోపునే అమెచేత వాడు రెండడుగులు వేయించేడు.

కల్యాణి కాలునిలదొక్కుకొని చెయ్యి విడిపించుకోబోయింది.

"ఎవడ్రా నువ్వు?"

ఆమె నోటినుంచి మాట వస్తూండగానే వాడామె ముఖంమీద బలంకొద్దీ చరిచాడు. ఆ దెబ్బకు కళ్ళు బైరులుకమ్మాయి.

నీచార్థబోధకం అయిన ఏకత్వప్రయోగం తన మగతనాన్ని అవమానిస్తున్నట్లు అరిచేడు.

"పాడుముండా! ఇష్టం వచ్చినప్పుడల్లా సినీమాలపేరుపెట్టి ఇదో నాటకమా" యని మరోచరుపు నెత్తిన వేసేడు. తల
దిమ్మెక్కిపోయింది. ఆమె మనస్సు, కరచరణాలు ఆమె స్వాధీనంలోంచి తప్పిపోయినట్లయింది. ఏదో కలలో జరుగుతున్నట్లు,
మసకచీకట్లో చూస్తున్నట్లు తెరవెనక మాటలు వింటున్నట్లు అనిపిస్తున్నాయి. జరుగుతున్న ఘటనలలో తనపాత్ర ఆమెకర్థం
కాకు౦డాపోయింది.

వాడి భార్య ఈమె. చాల గర్విష్టి. ఖర్చుపరురాలు. మగణ్ణి లెక్కచేయదు. రోజూ మూడాటలూ సినీమాలు చూడాలిసిందే.
అర్ధరాత్రిదాకా వూరుమీద బలాదూరుగా తిరగాలిసిందే. ఆమె సుఖంకోసం ఆ మగాడు అడ్డమైన చాకిరీ చేస్తున్నాడు, ఇంటా-
ఆఫీసులోకూడా. ఓ పూటా కూడొ౦డి పెట్టదు. ఆఫీసునుంచి వచ్చేసరికి తాళంపెట్టి పోతుంది. పక్కి౦టివాళ్ళకేనా ఇవ్వదు. ఆవిడ
సినీమానుంచి వచ్చేదాకా వాడల్లా రోడ్డుమీదపడి ఏడ్వవల్సిందే.

__సినీమాహాలువద్ద అప్పుడప్పుడే చేరుతున్న జనానికి అర్థం అయిన కథ అది.

"మొగుడుముండాకొడుకు సాయంకాలం ఇంటికొచ్చేసరికి తలుపు తాళంపెట్టివుంటే కోపంరాదూ"—అందో స్త్రీ కంఠం.

"పైగా ఇంటికి రమ్మని నెమ్మదిగా అంటే ఎవడ్రానువ్వని డబాయించడంకూడానూ" మరో పురుషకంఠం.

"ఎవరది?"

"భార్యకాబోలు, ఇంటివద్ద పోట్లాడివచ్చింది."

"అబ్బే పొరుగింటివాడితో సినీమాకొచ్చింది. మొగుడు చూసేడు."

"సినీమాలంటూ వొచ్చేక ముండలు పేట్రేగిపోతున్నారు."

కల్యాణిని నడిపిస్తూ ఆ యువకుడు తన బాధలు చెప్పేడు.

"దీన్ని కట్టుకున్నాక తిండికీ, నిద్రకీ కూడా మొహంవాచిపోతున్నా." నంటూ మళ్ళీ ఓగుద్దు మెడమీద వేసేడు.

కల్యాణి మనస్సు స్తంభించిపోయింది. వాడు చెప్తున్నది తన్ను గురించేనా యనే ఆశ్చర్యం కలుగుతూంది. కాని పైకేమీ చెప్పలేదు
ప్రతిఘటించ లేదు. కాలు నిలదొక్కుకోవాలనే అభిప్రాయమే కలగడంలేదు.

చుట్టుప్రక్కలవాళ్ళంతా ఆ యువకుడికి తలో సాయంచేయడానికి నడుంకట్టేరు.

"ఏయ్ రిక్షా."

ఒకరు రిక్షాను పిలుస్తూంటే మరొకడు ప్రక్క నిలబడివున్న చిన్నకారు డ్రైవరుతో మాట్లాడి సర్వం సిద్ధంచేశాడు.

ఆ యువకుడామెను కారువరకూ తోసుకొచ్చేడు. ఒకరు తలుపు తీశారు. నలుగురూ చుట్టూమూగి చోద్యంచూస్తుంటే వాడామెను లోపలి
నెట్టబోయాడు___"ఎక్కు."

ఒక్కమారుగా ఆమెకు చైతన్యస్ఫూర్తి కలిగింది. గిజాయించి చేయి విడిపించుకొని పారిపోబోయింది.

కాని, రెండోఅడుగు వెయ్యడానికిక్కూడా ఖాళీ లేదు. చుట్టూ జనం, భజన చేస్తున్నట్లు తలోమాటా అంటున్నారు. హితచింతకులల్లే
ఉపదేశాలిస్తున్నారు. తిడుతున్నారు. బెదిరిస్తున్నారు.

"ఎక్కడికమ్మా! ఆ రాలుగాయితనం. పచ్చని కాపురంలో నిప్పులోసుకుంటావు---" అంటూ ఒక ఆడుది నిలేసింది.

"మంచిపని కాదు తల్లీ? వెళ్ళు."

"తిరగమరిగిన ఆడది మాట వింటుందా? ఆడది తిరిగి చెడింది. మగాడు తిరక్క చెడ్డాడన్నమాట వూరికే పుట్టిందా?"

"మక్కలిరగతన్నెహే!"

"ఏమయ్యోయ్! కొడతావని బెదురుతూంది కాబోలు. ఏం చెయ్యకయ్యోవ్."

వాడు బ్రతిమలాడడం ప్రారంభించాడు.

"చెప్పకుండా లేచివచ్చావనే కోపంకొద్దీ ఒకటేసాననుకో. ఇంకెప్పుడూ ఏమీ అనను. రా."

ఆమెకు వాడెవ్వరో గుర్తొచ్చింది. బస్సు కండక్టరు భద్రం ఆ మాటే అరచి చెప్పింది.

"ఇదంతా మోసం. వీడో బస్సు కండక్టరు. భద్రం అని. నాకు వీడేమీ అవడు."

ఆ పేరు గుర్తించడం మరీ కొంప మునిగింది. బస్సు కండక్టరు వుద్యోగం ఓ ఉద్యోగమా యనే నిరసనతో ఆమె మగణ్ణి కాద౦టూ౦దనే
వ్యాఖ్యానం వచ్చేసింది.

"కండక్టరైతే మగాడు కాకపోయాడా?"

"అంత బ్రతిమాలుతున్నప్పుడు...."

"పోనీలేవే కండక్టరుపని మానేసి,. మరో వుద్యోగం చూస్తానులేవే. రా." __అంటున్నాడు భద్రం.

కల్యాణి అరచింది. పెనుగులాడింది. కాని, ఆ వలయం లోంచి ఈవలకు రాలేకుండావుంది. సినిమాకొచ్చిన వాళ్ళో తెలియదు. చోద్యం
చూడ్డానికొచ్చేరో తెలియదు. అందరూ మూగుతున్నారు. ఆమెను నొక్కేస్తున్నారు. భద్రం చేతుల్లోకి, కారులోకి వప్పచెప్పేయ్యడానికి
సిద్దం అవుతున్నారు. వాళ్ళు తనమాట వినిపించుకోవడం లేదు. అసలు తనమాట ఎవరికీ వినిపించనంత గొడవ చేస్తున్నారు.

"కాపురం గడ్డలు చేసుకోకు."

"పట్టింపులొస్తాయి. పేచీలొస్తాయి. మొగుడూ, పెళ్ళామూ అన్నాక ఏవీ రాకుండాఉంటాయా?"

"బస్సుకండక్టరు, టిక్కట్టుకలక్టరూ గాక అందరికీ జిల్లాకలక్టరు ఉద్యోగాలు వస్తాయా?"

"ఏదో కోపంలో మగపీనుగు ఓదెబ్బ వేస్తే ఎంత అల్లరి చేస్తుందో చూడు."

"మాంచి వేషంలో వుంది."

"రంగేళీ సరుకులాగే వుంది."

"గట్టి సరుకు."

వెకిలి నవ్వులు. కల్యాణి తల తిరిగిపోతూంది. ఒక కేక పెట్టింది. ఏడ్పొచ్చేస్తూంది. చుట్టూ జనం గొంతు మార్చింది.

"మరో రెండు తగిలించి కారులో పారేసి లాక్కుపోక చూస్తావేమయ్యా!"

"అతగాడి లేవకనిపెట్టే నాటకమాడుతూంది."

ఆలస్యమవుతూంది. జనం పెరుగుతున్నారని భద్రం తొందరపడుతున్నాడు. కాని కల్యాణి ప్రతిఘటన మానలేదు.

"కాళ్ళూ చేతులూ కట్టి కారులో పారెయ్యి."

కాని, ఆపని జరిగే లోపున భద్రం నెత్తిమీద మరమరాలబండిలో మండుతున్న కుండ భళ్ళుమంది. కణకణలాడుతున్న బొగ్గులు,
మండుతున్న కర్ర చితుకులు చెదిరేయి. రాజగోపాలం సబ్బు తీసుకుని హాలు వద్దకు వచ్చేసరికి అక్కడ జనం మూగివున్నారు.
ఏమిటోనని చూడబోయేసరికి కల్యాణి చీర కొంగులా అనిపించింది. కాని ఆమె కనిపించలేదు. బెజవాడ సినీమాహాళ్ళ వద్ద రౌడీగుంపులు
చేస్తున్న అల్లర్ల కథలు చాలావిన్నాడు. నలుగురైదుగురు చేరి సినీమాలు చూడవచ్చిన ఒంటరికత్తెల్ని ఎత్తుకుపోతారు. కొన్ని
సందర్భాలలో ఒకరాత్రో, ఓ రోజో దాచి వదిలేస్తున్నారు. కొన్ని సందర్భాలలో వూళ్ళే దాటించేస్తున్నారు. ఆ కథలు విన్న
రాజగోపాలం తన కళ్ళముందు అటువంటి ఘటనే జరుగుతూందని గ్రహించడంలో ఆశ్చర్య౦లేదు. లోపల జొరబడ్డాడు. ఒక ఆడదికూడా ఈ
దురంతంలో సాయం. తీరా చూసేసరికి తన కల్యాణే వాళ్ళ చేతుల్లో నలిగిపోతూంది. చటుక్కున పక్కనే వున్న మరమరాలబండిలో
మండుతూన్న పిడత తీసేడు. చెయ్యి చుర్రుమంది. దానితోనే భద్రం మొగాన కొట్టేడు.

నిప్పులు, మండుతున్న పుల్లలు మధ్య పడేసరికి జనం ఒత్తిగిలేరు. మొగంమీద కుండ బ్రద్దలయిన వేడికి భద్రం కల్యాణి చేయి
వదిలేశాడు. కాని, రాజగోపాలం వానిని వదలలేదు. అతని చెయ్యి పట్టుకుని మెలితిప్పేసేడు. ఆ బాధకు మెలితిరిగిపోతూంటే ఒక్క
తన్ను తగిలించేడు. దానితో భద్రం బోరగిలపడి రోడ్డుమీద కొంత రక్తం చూపించేడు.

రాజగోపాలం కనబడగానే కల్యాణి అతని ప్రక్కకు చేరింది. ఆమె తన చేతికి అడ్డం అవుతుందనిపించి కసిరేడు.

"తప్పుకో వీడి సంగతేదో చూస్తా."

ఆ క౦ఠానికి కల్యాణి బిక్కచచ్చిపోయింది. ఓదార్పుకుబదులు గదమాయింపు. ఒక్కమారు ఏడ్చేసింది.

రాజగోపాలం క్రిందపడ్డ భద్రాన్ని లాగి నిల్చోబెట్టాడు.

భద్రానికి మిత్రులెవళ్ళూ అక్కడ కనబడలేదు. సినీమాకు జనం బాగా చేరారు. కొద్దిమందే వున్నప్పుడు విషయం తెలియక
వంతపాడేవాళ్ళు దొరుకుతారు. అదంతా బూటకమని ఎరిగినా ఆ కొద్దిమందే 'మనకెందుకులే' యనో, కలగచేసుకుంటే దెబ్బలుతగులుతాయని
భయపడో చూసీ చూడనట్లూరుకుంటారు. కాని, జనం పెరిగాక, తమ చేష్టకు వ్యతిరేకత వచ్చేక దురంతకులు చల్లగా తప్పుకుంటారు.
అంతవరకూ ఆ దురంతానికి సాయం చేసినవారే "ఎంత అన్యాయం" అని ఆశ్చర్యమూ కనబరుస్తారు. వీలుతప్పితే తమవాడిని అప్పటికి
వదిలేసి, తరవాత బయటకు తెచ్చుకుంటారు. కసితీర్చుకుంటారు.

రాజగోపాలం అంతవుధృతంగా మీదపడిపోవడంతో వాళ్ళు హడలిపోయారు. చల్లగా జారుకున్నారు.

రాజగోపాలం భద్రాన్ని నిలవబెట్టి మరొక్కటి తగిలించేడు.

ఈమారు జనం వానిని చీల్చెయ్యడానికి సలహాలిస్తున్నారు. విషయం తెలియగానే అంతా తిట్టేరు. ఇద్దరు గుద్దేరు. మిగిలినవాళ్ళు
ఏమేం చెయ్యాలో సలహా ఇస్తున్నారు.

"మండెలు తిప్పెయ్యండి."

"చేతులు విరిచెయ్యండి."

చిన్నకారువాడు జనం విసురు తనమీదకు తిరక్కుండా కారునడుపుకొని బర్రున వీధిమొగ తిరిగేసేడు. ఆ ఖాళీలో జనం తోసుకొచ్చేరు.
వాళ్ళలో ఓ పోలీసువాడూ హాజరయ్యేడు. అంతవరకూ ఎక్కడో కునికిపాట్లు పడుతున్నపోలీసు అంతమంది ఒకచోట గుమికూడడం
సహించలేకపోయేడు.

"నడవండి, పోండి. ఇంతమంది ఎందుకు చేరేరు."

పదిమందీ అటూ ఇటూ కదిలేరు, ఎవరికి వారే ఏదో చెప్పబోయేరు. పోలీసువానికి విసుగు వచ్చింది.

"ఏయ్ వాడినెందుకు కొడుతున్నావు?"

అంతవరకూ పిల్లిలావున్న భద్రం పోలీసురాకతో రాజగోపాలాన్ని మింగేసేలా చూసేడు.



ఇరవయ్యేడో ప్రకరణం


కల్యాణి ఇంకొక్కక్షణం అక్కడుండనంది. జనం పెరుగుతున్నారు. అంతా తలోమాటా అంటున్నారు. తలకొట్టేసినట్లుంది.

"ఇంటికి పోదాం."

రాజగోపాలం ఇరుకునపడ్డాడు. ఆవల పోలీసువాడు దబాయిస్తున్నాడు.

"ఎందుకు ఇతణ్ని కొట్టేవు? రా. పోలీసు స్టేషనుకి."

ఈ దురన్యాయం చేసినవాడు తప్పించుకొంటున్నాడు. తాను నేరస్థుడు అవుతున్నాడు. భద్రం అమాయకత్వం నటిస్తున్నాడు. వాడు
పరిస్థితులు గ్రహించేడు, కల్యాణి తనమీద నేరం చూపలేదు. అది ఆవిడ ప్రతిష్ఠకు భంగం. కనక నెమ్మదిగా తప్పుకుంటుందని
వాడు గ్రహించేడు. ఆ ధైర్యంతో రాజగోపాలంమీద ఎగిరిపడుతున్నాడు.

"ఈ నాకొడుకు వట్టినే నన్ను కొట్టేడు."

కాని, జనం చెప్పిన మాటల్నిపట్టి పోలీసు భద్రాన్ని గదమక తప్పిందికాదు.

"నోరుముయ్యి."

ఫిర్యాదుచేయడానికి రాజగోపాలం పోలీసుస్టేషనుకు వెడదామన్నాడు. కల్యాణి వద్దంది.

"మన సంస్కారంఅది. నాకు సానుభూతి లభించడానికి బదులు రేపటినుండి నాకు చిత్రచిత్రాలైన పేర్లు పెడతారు. ఈ వూరినుంచి
లేచిపోవడంతప్ప నాకు దారుండదు. మీకు పుణ్యముంటుంది. వూరుకోండి."

పోలీసువాడూ నెమ్మదిగా అదే సలహాఇచ్చాడు.

వీణ్ణి లాక్కుపోయి లాకపులో కీళ్ళుతీసి వదిలేస్తాం. మీరు వెళ్ళిపో౦డి. కేసుపెడితే ఆ అమ్మకే అవమానం. ఈ మొండిలంజాకొడుకులికి
సిగ్గా, బిడియమా?"

రాజగోపాలం ఇటువంటి ఘటనలు జరిగేయన్నప్పుడు చెప్పిన సలహాల్ని మరచిపోలేకపోయేదుడు.

"సినిమా హాలుల దగ్గరా, రాజవీధుల్లోనూ ఈ రౌడీలు మితిమీరిపోతున్నారు. ఎరిగినవాళ్ళేనా తగిన....."

జనంలోంచి ఎవరో నవ్వేరు.

"ఈయనెవరో అమాయకుడల్లేవున్నాడు."

ఈ భద్రం కొంతకాలం కమ్యూనిస్టు జెండా పుచ్చుకు గంతులేసేడు. వీడో రౌడీఅని తెలిసి వీడికీ మాకూ సంబంధంలేదని వాళ్ళు విశాలాంధ్రలో
వేసేశారు. వెంటనే కాంగ్రెసు నాయకుడొకాయన వానిని చేరదీసేడు.

ఆ కథ వినేసరికి భద్రం కీర్తి ఆ వీధిలో గుభాళిస్తూందని రాజగోపాలం గ్రహించేడు. రౌడీలకు రాజకీయపుముసుగు లభించిందంటే
మనచేతులు దాటిపోయిందన్నమాటే ననిపించింది. ఆ భయాన్ని పోషిస్తూ ఒకడు రహస్యంగా చెవిలో వూదేడు.

"మీకీ సంగతి కొత్తదల్లేవుంది. వీడు ఆ వీధిలోవున్న భజన సమాజం మనిషి. వాళ్ళకీ హాలుయజమాని బలంవుంది, రేపువచ్చే
ఎన్నికలకోసం వాళ్ళనీయన పోషిస్తున్నాడు. ఆయన మంత్రివర్గం గ్రూపులోవాడు, అంటే గవర్నమెంట్ క్కూడా మామగారన్నమాట."

ఆ రాజకీయ సంబంధాలు ఎంతవరకు నిజం. చెప్పేవాడెవరు? అతడికివన్నీ ఎల్లాతెలుసు? అనే ప్రశ్నలు అతని మనస్సులో
చేరనేలేదు. వేర్వేరుపత్రికలలో వస్తున్నవార్తలు, చెవులబడుతున్న కథలు వింటుంటే నమ్మకపోవలసిన అవసరం కనబడలేదు.
కాని హృదయం ఆ అన్యాయానికి ఆక్రోశించక మానలేదు.

"మనం అడవిజంతువుల్లో బ్రతుకుతున్నామా?"

ఆ హితచింతకుడు నవ్వేడు.

"అడవిజంతువులకి సినిమాహాళ్ళు౦డవు. మంత్రుల బలమూ వుండదు."

ఆయనే ఓ రిక్షాను పిలిచేడు. రిక్షావాడు రాజగోపాలాన్ని ఆహ్వానించేడు.

"బాబయ్యా! కేసులు గీసులు తర్వాత చూసుకుందురుగాని, మీతో మాట్లాడుతున్న నాయుడు సంగతి తెలీదుమీకు. వాడే ఇవన్నీ పక్కనుంచి
చేయిస్తుంటాడు. ముందు రిక్షా ఎక్కండి."

రాజగోపాలం దిగ్భ్రమ చెందేడు. అక్కడున్నవారిలో ఎవరిని నమ్మాలో తెలియడంలేదు. నాయుడు వెళ్ళిపోయాడు. పోలీసువాడు భద్రాన్ని
తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వాడు దూరంనుంచి వెనుతిరిగి చూస్తూ బెదిరిస్తున్నాడు.

"కొడతావేం? నా తడాఖా చూద్దువుగానిలే, నా కొడకా!"

పోలీసువాడు గెంటుతున్నా వాడు తిరిగితిరిగి చూస్తూనేవున్నాడు. తిడుతూనేవున్నాడు. పోలీసువాడు వానిని అరెస్టుచేశాడో, అల్లరికాకుండా
కాపాడుతున్నాడో అర్థం కావడం లేదు.

దిగ్భ్రమ చెందినట్లు నిలబడిపోయాడు.

"నడు కళ్యాణీ!"

ఇద్దరూ రిక్షా ఎక్కికూర్చున్నారు.

"ఏమిటీ దురన్యాయం?"

కల్యాణి దుఃఖ౦ కట్టలుతెంచుకుంది. అతని ఒడిలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూంది. అతడు ఏం సమాధానం ఇవ్వగలడు?
ఏమని వూరడించగలడు? ఆమెదుఃఖ౦ చూస్తే అతనికీ కళ్ళనీళ్ళు తిరిగేయి. జాలిగా వీపు నిమిరేడు.

రిక్షావాడు ఝణఝణ చప్పుడుచేస్తూ రంయ్ న తొక్కుకుపోయాడు.



ఇరవయ్యెనిమిదో ప్రకరణం


తమ వీధిమొగకు రాగానే గోపాలం ఆమెను లేవదీశాడు. కల్యాణి కళ్ళుతుడుచుకుని కూర్చుంది. అతని చేతిఆసరాతో రిక్షా దిగింది.

రిక్షావాడు వెళ్ళిపోయేముందు సానుభూతి తెలిపేడు.

"అయ్యగారున్నారు గనక పెద్దగండం తప్పింది న౦జకొడుకులు మరీ బరితెగిస్తు౦డారు. పోయొత్తా బాబూ!"

వాడు వెళ్ళిపోయినా కల్యాణి అడుగువెయ్యలేదు. వీధి అంతా నిశ్శబ్దంగావుంది. అంతా తలుపులువేసుకు పడుకున్నారు. రాజగోపాలం
తనవద్దనున్న తాళంతో వీధిగేటు తెరిచేడు.

"మామ్మగారెక్కడి కెళ్ళారు?"

రామలక్ష్మమ్మ కల్యాణితోపాటు అతనికీ మామ్మే.

"కృష్ణలంకలో బంధువులున్నారు. చూసివస్తానంది. వెళ్ళిందికాబోలు."

కంఠంలో దుఃఖచ్ఛాయలు కరగలేదు.

"రా."

అమెచేయి పట్టుకున్నాడు. తమయిద్దరిమధ్య పరిచయాన్ని ఎంతవరకు ప్రదర్శి౦చవచ్చునో అతనికి అర్థంకావడంలేదు.
ఇంట్లోనేవున్నా రామలక్ష్మమ్మకు కూడా తమ సన్నిహితత్వం అర్థంకాకుండా మెలుగుతున్నారు. ఇప్పుడు నడివీదిలోంచి ఆమెను
పొదివిపట్టుకుని తీసుకెళ్ళడం ఎవరన్నా చూస్తే? చూస్తేనేమో అతనికి తెలియదు. నలుగురూ తమకు వరసకలుపుతారు. తప్పేంలేదు.
తామెల్లాగు కొద్దిరోజుల్లో పెళ్ళి చేసుకోవాలనుకొంటూనే వున్నారు.

కాని, కల్యాణే దానికి అభ్యంతరం చెప్తూంది, పెళ్ళి అయినతర్వాత పరిస్థితి వేరు. అది జరక్కుండానే తాము దగ్గరగా
వుంటున్నట్లు తెలిస్తే వచ్చేపేర్లు వేరు.

"నా కాళ్ళు కదలడంలేదు."

అతిక్షీణంగా దుఃఖమయంగా వినబడ్డ ఆమెకంఠం అతని హృదయాన్ని కలచివేసింది. శ౦కలు గాలికి వదిలాడు. పొదివిపట్టుకుని
నడిపించేడు. ఆమె అతనిమీద వొరిగిపోయి కంఠం కాగిలించుకుంది.

ముంగిలిదాటాక కటకటాలతలుపులు తాళం. మెట్లెక్కేక వేర్వేరు వాటాతలుపులు తాళం. తమ జీవనసమభాగిత్వానికున్నన్ని ఆటంకాలూ.
తొందరపడి లాభ౦లేదు.

లోనికి వెళ్ళేక ఆమె నాతడు చేతులలోనే ఎత్తుకొని, తీసుకుపోయి మంచంమీద పడుకోబెట్టి తాను ప్రక్కన కూర్చున్నాడు.

ఆమె నీరవంగా, నీరసంగా కళ్ళప్పగించి మిద్దెవేపు చూస్తూంది. అతడామెమీదుగా వొరిగి అర్ధశాయియై ఆమె ముఖంలోకే చూస్తున్నాడు.

అతనిచూపు తన ముఖంమీదే వుండడం గమనించి ఆమెకళ్ళ నీళ్ళుతిరిగేయి. అతడు చెంపలు తుడుస్తూంటే ఆచేతినితీసి గుండెలకదుముకుంది.

"మీరు రాకుంటే నా గతి ఏమయేదో...."

"నేను రాకపోవడం ఎల్లా సాధ్యం కళ్యాణీ!"

ఆమె అతని చేతిని మరల చెంపల కానించుకొంది.

"ముఖం అంతా మండుతూ౦ది."

అమెనోట జరిగిన ఘటననంతా వివరంగా తెలుసుకున్నాక ఆమెనాతడు గాఢ౦గా కౌగిలించుకొన్నాడు.

"నేనా సమయంలో నిన్ను కసురుకున్నాను. క్షమించుతావు కదూ!"

ఆ సమయంలో ఆమె తనన౦టిపెట్టుకు వ్రేలాడుతూంటే అతడు కదలలేదు. ఆ రౌడీకి అవకాశ౦ ఇచ్చినట్లువుతుంది.

కల్యాణి అతనివీపున చేతులువేసి, అదుముకొని అతని క్షమాపణను స్వీకరించింది.

లేచి నీళ్ళుపోసుకోవాలి. బట్టలు మార్చుకోవాలి. ఆ మాలిన్యం వదల్చుకొంటేతప్ప నిద్రకూడా పోలేదు. కాని, ఎల్లాగ? కాలూ చెయ్యీ
కూడ కదల్చలేనంత అవశత్వం.

"కొంచెం టీగాని, కాఫీగాని త్రాగితే ఓపిక చేరుతుంది. తెచ్చిపెట్టనా?"

రాత్రి పదిగంటలవేళ టీ కావాలంటే సెంటరు కెళ్ళాలి. రెండో ఆటముగిసేవరకూ అక్కడ ఒకటిరెండు హోటళ్ళు తెరిచివుంటాయి.

కాని కల్యాణి అతనిని కదలనివ్వలేదు.

"నేను౦డలేను. భయంగా వుంది."

అతని కౌగిలింతలు, మూర్కొనడాలు, ముద్దులు ఆమెకు ధైర్యం కలిగించలేకపోయాయి.

"మామ్మ బంధువులింటికి వెళ్ళడంకూడ ఒకవిధంగా మంచిదే అయింది. నేనొక్కర్తెనూ ఈ గదిలో పడుకోలేను."

ఆ గదిలోనేకాదు, ఒంటరిగాకూడ పడుకోలేకపోయింది. ప్రతిష్ఠ కోసం పళ్ళుబిగపట్టుకుని కొంతసేపు పడుకొంది. కన్ను మూసేసరికి
ప్రత్యక్షం అవుతూ, ఆ ఘటన ఆమెను అంతరంతరాల్లోంచీ కలిచివేస్తూంది. ఏడ్పువచ్చింది.

ఏం చెయ్యాలో తోచక, ఆమె నిద్రపోయే వరకూ రాజగోపాలం ఆమె ప్రక్కనే కూర్చుని వున్నాడు. ప్రక్కన చేతికందేటంత దూరంలో
తనమంచం వేసుకున్నాడు. కాని, ఆమెను వదలిపోయి నిద్రపోవడానికి మనసొప్పడం లేదు. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని
అలాగే కూర్చున్నాడు.

కల్యాణి అతనిని తనమీదకి లాక్కుంది.

"పడుకోండి."

"నువ్వు నిద్రపో."

అతడామెను అర్థం చేసుకోలేదు. కల్యాణి ఈమారు తనమంచం మీదనే పక్కకు జరిగింది.



ఇరవైతొమ్మిదో ప్రకరణం


తెల్లవారేముందు గోపాలానికి తెలివి వచ్చింది. కల్యాణి తన కంఠాన్ని కౌగలించుకొని పడుకొనేవుంది. ఒళ్ళు కొంచెం వెచ్చగా
వున్నట్లుంది.

ఆమె తనప్రక్కన వుండడం అతనికెంతో తృప్తీ, సంతోషమూ కలిగిస్తూంది. గాలికి చెదిరిన జుట్టు సవరించేడు. బుగ్గలు నిమిరేడు.
కల్యాణి ఒక్కమారు కళ్ళు తెరిచింది, చిన్న చిరునవ్వు కనబడింది. అతనిని మరింత దగ్గరగా లాక్కుని మరల కన్ను
మూసుకుంది.

వీధిలో పనిమనిషి కాబోలు తలుపు తట్టింది. మామూలుగా ఆవేళకు కల్యాణి తలుపు తీసి వుంచేసేది. కాని ఈవేళ ఆమె లేవలేదు.
లేవగలిగే స్థితిలో కూడలేదు.

రాజగోపాలం మెల్లగా ఆమె చేతిని తప్పించి లేచేడు. కల్యాణికి తెలివివచ్చింది. అతనిని లేవనీయడం అమెకిష్టంకాదు. నడుం
కౌగలించుకుని ఒడిలో తలపెట్టుకుంది. అతడు అప్యాయంతో తల నిమరబోయేడు. కాని ఆమె ఆ చెయ్యితీసి చేతపట్టుకుంది.

"జుట్టంతా పచ్చిపుండులా వుంది."

ఆస్థితి అతనికి జాలికలిగిస్తూంది. ఆమె అంతబేలగా ఉంటుందని అతడూహించలేదు. ఆమె కౌగిలింతలలో అతనికి విలాస-విభ్రమాలు,
శృంగారావేశమూ కన్నా పరాశ్రయంకోరే బేలతనేమే కనిపిస్తూంది. అతనికి చాల జాలికలిగింది.

"కళ్యాణీ!"

వీధిలో మరల పనిమనిషి పిలుపు. ఆమె కదలికలోనే పిలుపు విన్నదని అర్థం అవుతూంది.

"నువ్వు పడుకో. నే తలుపుతీస్తా."

ఆమె ఆలోచించింది.

"వెళ్ళండి."

తమరిద్దరూ ఒక్క మంచ౦మీదనే పడుకున్నట్లునుకోకుండా జాగ్రత్తపడడం తప్ప వారప్పుడు చేయగలది లేదు.

రాజగోపాలంవాటా తాళంకూడా తీసిలేదు. అతని మంచం కల్యాణి గదిలోనే వుంది. రెండువాటాలమధ్య తలుపు మూసినా రాత్రి కల్యాణి
స్నానంచేసి వదలిన తడిచీర, నీళ్ళబిందె రాజగోపాలం వాటాలోనే వున్నాయి. ఆ వాటాలమధ్య తలుపుగడియ కల్యాణి గదిలోనికే వుంది.
కనక ఆ ద్వారం వాడుకోగలిగేరు. దొడ్డిలోనున్న గదిలోకి వెళ్ళడానికి భయపడి అతని వాటాలోని వసారామీద స్నానంచేసింది. ఆ
చిహ్నాలన్నీ అల్లాగే ఉండిపోయాయి. వాటినన్నిటినీ దాసీమనిషి చూస్తుంది. కాని, చెయ్యగలిగేది లేదు. ఇప్పటికే పావుగంట నుంచి
పిలుస్తూంది. ఇంకా ఆలస్యమైతే ఏమిటో విశేషమని వీధివీధంతా చేరగలరు.

పనిపనిషి వచ్చేసరికి ఆమె లేవలేదు. దాసీమనిషికి తలుపు తీస్తూనే రాజగోపాలం ఆమె ఊహించుకోగలగడానికి ఉపోద్ఘాతం
ప్రారంభించేడు.

"నిన్నరాత్రి మీ అమ్మగారికి జబ్బుచేసింది. తెల్లవార్లూ పలవరింతలు, కేకలు, ఇప్పుడిప్పుడే కొంచెం నిద్రపోయారు."

'మీరు కల్యాణిగారి గదిలోంచి వస్తున్నారు. రామలక్ష్మమ్మగారు లేదా'...యనే ప్రశ్న దాసీమనస్సులోనే మెదిలింది. కాని ఆమె
ఆ ప్రశ్న వేయలేదు.

దాసీ కల్యాణిని "ఎమిటమ్మగారూ" అని ఆరోగ్యం సంగతి అడిగింది. చేయిపట్టుకు చూసింది.

"కొద్దిగా వెచ్చగా వుంది."

కల్యాణి ఏమీ అనలేదు. దాసీమనిషి సహాయంతో ముఖం కడుక్కుంది. ఆమె కాఫీ కాచి తెచ్చేసరికి రాజగోపాలం ఆమె మంచంప్రక్కన
కుర్చీవేసుక్కూర్చున్నాడు.

"ఏమన్నా జడుసుకున్నారేమో అయ్యగారూ"...అంది ఆమె అనారోగ్యానికి కారణాలు వెతుకుతూ దాసీమనిషి లచ్చమ్మ.

కల్యాణి ఏమీ అనలేదు. తన భయానికి కారణం ఏమిటో లచ్చమ్మకు తెలియనివ్వడం ఇష్టంలేదు. దానివలన ఎన్నో
ఇబ్బందులున్నాయి. ఇరుగూ—పొరుగూ వింతగా చెప్పుకుంటారు. అనేకపేర్లు పెడతారు. కల్పనలు ప్రారంభిస్తారు. దానికితోడు పిల్లలూ,
ఇతరటీచర్లలో ఎంతో చిన్నదనం. అందుచేత కనుసంజ్ఞచేసి గోపాలం ఏమీ చెప్పకుండా వారించింది.

"రాత్రి అన్నంకూడా వండుకున్నట్టు లేదమ్మగారూ!"

తండ్రిని సాగనంపడానికై వెళ్లి స్టేషనునుంచి వస్తూ హోటలులో భోజనం చేశాననడంతో దాసీ మరోప్రశ్న వేసింది.

"నీళ్ళకాగు కనపడ్డంలేదమ్మా!"

"రాత్రి గోపాలంగారు స్నానంచేసేరు. వారివాటాలో వుంది."

"అయ్యగారూ! తలుపుతీస్తారా బయటపెడతాను."

కల్యాణి ఇప్పుడే౦ అక్కర్లేదంది.

"నేను నీళ్ళుపోసుకోను ఈ పూట. మధ్యాహ్నం నీళ్ళు పెట్టవచ్చునులే."

లచ్చమ్మ మరోపేచీ వేసింది.

"మబ్బేసింది. అయ్యగారైనా పోసుకుంటారు."

దాసీదాని పట్టుదల అర్థం అయింది. అదేదో రహస్య పరిశోధనకుపక్రమించిన ఉత్సాహంలో వుంది.

"అయ్యగారికి నీళ్ళమాటటు౦చుదాం. పాపం వారికి తెల్లవార్లూ నిద్రలేకుండా చేశాను. నువ్వు హోటలుకి వెళ్లి ఇడ్లీ పట్టుకురా."

గోపాలం తనకు వద్దనబోయాడు. కాని కల్యాణి కనుసంజ్ఞతో వారించింది.

పరుపుక్రిందినుంచి డబ్బులు తీసియిచ్చి దాసీలచ్చమ్మను పంపేసింది.

"బంకనక్కిరికాయలా పట్టుకొంది."

కల్యాణి అతనిసహాయంతో లేచింది. మధ్యతలుపు తీసుకొని వెళ్లి రాత్రి తానావాటాలోకి వెళ్ళినట్లుచూపే గుర్తులన్నీ తీసేసింది. మళ్ళీ
మధ్యతలుపు బిగించింది.

"కాగు అట్లాగే వుంచండి. దానినే తీసుకురానివ్వండి."

"ఏమిటీ దాగుడు మూతలు కళ్యాణీ! ఈ వేళనే రిజిస్ట్రారాఫీసుకు రాసిపడేద్దాం, పదిహేనో నాడు పోయినట్లయితే రిజిస్టరు
చేస్తారు."

నిన్నటి ఉదయం –సరిగ్గా ఇరవైనాలుగ్గంటలక్రితం ఆ ప్రతిపాదనకు ఆమె మహోత్సాహంతో సరేననేది. కాని ఇప్పుడనలేకపోయింది.
కారణం ఏమిటో అతనితో చెప్పనూ లేకపోయింది. తాను జరిగిందనుకోని పెళ్ళిఒకటి జరిగిందని చెప్పుకోవడంలో అర్థంఏమిటి? కాని
ఆమాట నాతో ముందెందుకు చెప్పలేదు? ఈ రహస్యం ఎందుకని? గోపాలం తప్పుపడితే.

నిన్నటివరకూవున్న పరిస్థితివేరు. ఈవేళ ఆనందరావు అనేవ్యక్తి బయటపడ్డాక వచ్చిన పరిస్థితివేరు.

"దాసీదాని కోసం రిజిస్ట్రారాఫీసుకి పరుగెత్తుతామా యేమిటి?"

ఇంతవరకూ అ ప్రసక్తి ఎందుకుతేలేదన్న ఎత్తిపొడుపు ఆమాటలో వినబడి రాజగోపాలం నొచ్చుకున్నాడు. కళ్యాణి వూహించింది. తన
అభిప్రాయం అదికాదని సంతృప్తిపరుస్తూ అతని చేయి చేతిలోకి తీసుకొంది.

"నిన్న మిమ్మల్ని నాన్నగారికి పరిచయం చెయ్యాలని ప్రయత్నించా."

తానాసమయానికి అందకపోవడం చాల దురదృష్టం అన్నాడు.

"పోనీ మనం ఇద్దరం వెళ్ళివస్తే."

కల్యాణికా ఆలోచన బాగుందనిపించింది. తానెన్నుకున్న వరుణ్ణి తనవాళ్ళందరూ చూడగలుగుతారు. ఆనందరావు అక్కడేవున్నాడు గనుక
అసలుపరిస్థితి ఏమిటో వివరంగా గోపాలానికే తెలుస్తుంది.

"మీరు వస్తారా? వెడదామా?"

రాజగోపాలం అమెకళ్ళలో కనబడిన అశ్రువులు చూసి కదిలిపోయేడు.

"ఎందుకురాను కళ్యాణీ! నీకా అనుమానం ఎందుక్కలిగింది?"

అతని కౌగిట కల్యాణి ఒదిగి గుండెలమీద తలఆన్చింది.

వీధిగేటు చప్పుడయి ఇద్దరూ విడిపోయారు. లచ్చమ్మ ఇడ్లీతో లోపలికడుగు పెట్టేసరికి కాతడు తన కుర్చీలో వున్నాడు.

"ఇంత ఆలస్యం చేసేవేమే?"

"ఎంతకీ కట్టివ్వలేదమ్మా!"

దాసీమనిషి గ్లాసుకడిగి మంచినీళ్ళు తెచ్చి పెట్టింది.

"అమ్మగారూ! పొయ్యి రాజవెయ్యనా?"

"అక్కర్లేదు. నేను హోటలునుంచి తెప్పించుతాలే." అన్నాడు రాజ గోపాలం.

కాని, కల్యాణి ఆపనిని లచ్చమ్మకే వప్పచెప్పింది.

"రొట్టె కూడా తీసుకురా."

"మరి క్యారియరెవరికమ్మగారూ!"

"ఏమిటే వెధవప్రశ్నలూ నువ్వూనూ, గోపాలంగారున్నారుగా. ఆయన్నే హోటలుకెళ్ళి రమ్మంటావా?"

"ఆఫీసుకెడతారననుకున్నానమ్మగారూ!"

"మామ్మగారుకూడా లేరు. ఈవేళ వారిని కాస్త తోడుండమన్నా."

ఒకయువకుణ్ణి తోడు౦డమనడంలోని ఔచిత్యమేమిటో లచ్చమ్మ కర్థం కాలేదు. కాని ఏమీ అనలేదు.

"మీకు మందేమిటమ్మగారూ!"

రాజగోపాలం సమాధానం ఇచ్చేడు.

"నేను డాక్టరుగారిని తీసుకొస్తాలే."

డాక్టరును తీసుకురావలసిన ఆలోచనే వుందంటే ఏదో పెద్దజబ్బే చేసి౦దన్నమాట.

"ఈవేళ మధ్యాహ్నం ఒంటిగంట వేళప్పుడో బండి వుండాలి. ఓవారం సెలవుపెట్టి ఇంటికి వెడతా. గోపాలంగారు తోడొస్తారు. నువ్వు
స్కూల్లో నా సెలవుచీటీ ఇవ్వాలి."

సెలవుపెట్టి తల్లి దండ్రుల వద్దకు వెళ్ళి పోవలసిరావడమూ, దారిలో గోపాలం తోడు కావలిసిరావడమూ ననేసరికి లచ్చమ్మకు
నిజంగానే గాభరా కలిగింది. గోపాలం రాత్రిఅంతా అమెవద్ద వుండవలసినంత అవసరం వుండేవుంటుందని తృప్తిపడింది.

లచ్చమ్మ వెళ్ళింతర్వాత గోపాలంకూడా లేచేడు.

"నేనూ సెలవుపెట్టి వస్తా."



ముప్ఫయ్యో ప్రకరణం


హఠాత్తుగా కూతురు గుమ్మంలో గుర్రబ్బండి దిగుతూంటే, అప్పుడే వీధిలోకి తొంగిచూసిన భాగ్యమ్మ బ్రహ్మానందపడింది. ఆమె
ఒక్కర్తేగాక మరో యువకుడు కూడా బండిదిగడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. అతడిదెన్నడూ చూసిన ముఖం గాదు. వయస్సులో
వున్నాడు. దృఢమైన శరీరం, నీటయిన దుస్తులూ, తేటయిన ముఖమూ, వ్యక్తిగా అతనిలో అభ్య౦తరకరమైనది ఆమెకు కానరాలేదు.
కాని తనతో వెంట బెట్టుకుని రావడంలోనే వుంది, అభ్యంతరం.

భాగ్యమ్మ కూతురుకుశలంకన్న, ఈ అవజ్ఞతకు సంజాయిషీ అడగడం అవసరమని భావించింది.

"ఆయన ఎవరే."

ఆ కంఠంలోనే మందలింపు ధ్వనిస్తూంది. అది ఎందుకో కూడా కల్యాణి గ్రహించింది. దానిని లెక్కచేయదలచుకోలేదు. ఇటువంటి ఘట్టం
రావచ్చునని ఆమె ఎరుగకపోలేదు. తల్లికే కాదు అక్కడకు వచ్చినవారందరికీ ఒకమారు పరిచయంచేయడానికై పిలిచింది.

"గోపాలంగారూ!"

బండివానికి డబ్బులిచ్చిపంపేసి అతడు నెమ్మదిగా వచ్చి ఆమె ప్రక్క నిబడ్డాడు.

"మేమూ, వీరూ ప్రక్క ప్రక్క వాటాల్లో ఉంటున్నాం, ఇంజనీరు, పేరు రాజగోపాలంగారు. మావూరు చూద్దురుగాని రమ్మనితీసుకొచ్చా."

రాజగోపాలం మందహాసంచేస్తూ అందరికీ నమస్కరించేడు.

భాగ్యమ్మ విషయం అర్థం కాకపోయినా, అతనిని ఆప్యాయంగా ఆహ్వానించింది.

దక్షిణామూర్తికి పరిస్థితి అర్థమయిందనిపించింది. మొన్నటిరోజున తనపొరుగునవున్న ఇంజనీయరు గురించి చెప్పడంలో కనబరిచిన
వుత్సాహం గుర్తుకువచ్చింది. అప్పుడామె మాటలలో కనబడని విశేషం ఇప్పుడు గోచరించింది.

మొన్న తాను అందచేసిన సమాచారానికిది సమాధానమేమో అనిపించింది. అదే అయితే ఆమె చాలతెలివితక్కువగా
వ్యవహరిస్తూ౦దనుకోవాలి—అనుకొన్నాడు.

భాస్కరరావుక్కూడా తండ్రికి కలిగిన అనుమానమే తట్టింది. కాని ఏమీ అనలేదు. ఆ యింట్లో రాజగోపాలానికి పరిచితుడాతడొక్కడే.
అతనంటే సదభిప్రాయంవుందికూడా. ఆతడు రాజగోపాలాన్ని తన ఇంటికి తీసుకెళ్ళేడు. కూర్చుండి కబుర్లు చెప్పేడు. ఆతనిరాకకు కారణం
గ్రహించడానికి త్రిప్పిత్రిప్పి ప్రశ్నలు వేసేడు.

బిడియపడుతున్నట్లు మాటమాటకూ కళ్ళువొ౦చుకొంటున్నా అతనినుంచి భాస్కరం కొత్తగా ఏమీ తెలుసుకోలేకపోయేడు.

వాళ్ళ వెనక పదిహేనునిముషాలకు కల్యాణి వచ్చింది. ఒక నిముషం వదినతో మాట్లాడినా, ఆమె వారిద్దరున్నచోటికే వచ్చింది.

"మీరు స్నానం చెయ్యరాదూ. రాత్రి ప్రయాణంలో బడలికచేసివుంటుంది, లోపల వేడినీళ్ళున్నాయి."

"బట్టలు తెచ్చుకొస్తా."

కాని అతనిసంచీ తెప్పించడానికి భాస్కరం స్వయంగా వెళ్ళేడు.

కల్యాణి మాట్లాడుతూ, మాట్లాడుతూ మధ్యలో నెమ్మదిగా అందించింది.

"మావదినతో చెప్పా, సినిమాహాలుదగ్గరసంగతి."

"వద్దనుకొన్నావు."

"అవసరమని తోచింది."

రాజగోపాలం ఏమీ అనలేదు.

కల్యాణి వేడినీళ్ళుతోడి స్నానాలగదిలో పెట్టింది. సబ్బువుంచింది. దండెంమీద తుండు వేసింది. అతనికి దగ్గరుండి ఒక్కొక్కటే చూపించి
తలుపు జేరవేసి యింట్లోకి తిరిగివచ్చింది.

గుమ్మంలో వదిన కనిపించింది. పరాయి మగవాని విషయంలో ఆమె చూపుతున్న శ్రద్ద అతిఅవుతూందని ఆమె అభిప్రాయం.

"పరాయి యువకుడియెడ అంత ఆప్యాయం చూపడం సాంప్రదాయం కాదు కళ్యాణీ!"

"ఇంతవరకు నాస్వంతంఅన్న మనిషి ఏర్పడలేదుగనక దేశంలో మగవాళ్ళంతా నాకు పరాయివాళ్ళేకాదా వదినా!"

"అదే మొన్నటిపరిస్థితి తెచ్చిపెట్టింది. ఇప్పుడన్నా మగతోడు అవసరాన్ని గుర్తిస్తావా?"

"గిరీశం చెప్పినట్లే వుంది వదినా! మగతోడు అవసరంచూపించడంకోసమే నన్నమాట ఆ దొంగవెధవ పని."

మాణిక్యాంబ నిరుత్తర అయింది.

అయితే తల్లి ఆ ఘట్టం విన్నప్పుడు తన కూతురికి కలిగిన ఆపదకు విచారపడి వూరుకోలేదు.

"ఆడపిల్లలు వంటరిజీవితం అందుకే మగవాళ్ళు కాదంటారు. మాటలురాని నలుసైనా మగకుర్రాడిని చంకనేసుకు వెడతారు ఊరికేనా?"

"ఒంటరితనం ఏమిటమ్మా! మూడులక్షలు జనాభావున్న పట్నంలో."

"నా అన్నవాడు లేనిచోట ఎందరున్నా అడవిలో వున్నట్లే..."

"నా అనేది ఎవరి ముఖాన్నైనా వ్రాసి వుంటుందేమిటి? ఆపదలో అయినవారెవరో వాళ్ళే మనవాళ్ళు."

"అయితే...."

"అయితే లేదు గియితే లేదు. అది అంతే" నని కల్యాణి వెళ్ళిపోయింది.

కాని భాస్కరరావేమంత సులభంగా వదిలిపెట్టలేదు. పైగా అతనికి విషయంచాలవరకు తెలిసింది కూడా.

"మన నవలలూ, సినీమాలల్లో మాదిరిగా 'విలన్' బారినుంచి కాపాడిన కృతజ్ఞతా యిది."

"అది జరిగింకా 36 గంటలు మించలేదు, కదా అన్నా!"

"అయితే ఇది బాగా, వేళ్ళు..."

కల్యాణి వూరుకోలేకపోయింది. ఆమెకా అన్నగారి స్వభావం తెలుసు. ప్రతిదానినీ వేళాకోళాలు, వెక్కిరింతల్లో తేలగొట్టి చులకన
చేసేస్తాడు.

"వొరేయి, నువ్వు ఔచిత్యంకూడా మరిచిపోతున్నావు."

"వేళ్ళూనుకొను-- అనే శబ్దం ప్రేమవిషయంలో వాడడం ఉచితం కాదంటావు. మాకంటే మీరేనయమర్రా! ఏశబ్దం ఎక్కడవాడాలో
కాస్తజ్ఞానమేనా ఉంది. మొన్న మానేస్తం ఒకడు పెళ్లిచేయిస్తానని తయారయ్యాడు. పురోహితులనోట్లో మన్నుకొట్టడందాకా పనికి
వస్తున్నారుగాని, ఏం మాట్లాడాలో, మాట్లాడకూడదో నేర్వలేదుగా. అతగాడు ఏంచేసాడో తెలుసా? మంగళసూత్రంకట్టే ఆచారాన్ని
శవాలంకరణమనేశాడు. ఆ మాట మంచి గమకంగా కనపడి౦ది కాబోలు, ఓపావుగంటలో పదిమాట్లకు తక్కువగాకుండా వుపయోగించేడు. ఆ
పెళ్ళికూతురుకు ఖర్మం ఆ మాంగల్యంవుంటేగాని పెళ్ళికాదనే నమ్మకంతో కట్టించుకొంటూంది. అయితే చేయిస్తున్నది దండలపెళ్లి.
తాళిబొట్టుకు దానిలో ఛాన్సు లేదు. కనుక పెద్దలు పూలమాలతో కలిపి దానిని వేయి౦చేశారు. మా పెద్దమ్మ అది
ఎరగడు....."

"నెత్తిమీద వూదొత్తులబుడ్డితోనైనా కొట్టకపోయిందా?"

"అయ్యబాబోయ్! అందుకేగాదుటే, ఆడదాని స్వాతంత్ర్యంగురించి మాట్లాడడం తగ్గించేశా౦."

"ఉద్దరించారు."

అయితే ప్రస్తుతం నన్ను ఆయనతో మాట్లాడమంటావు."

"ఏమీ అక్కర్లా, నువ్వు అమ్మ, నాన్న, వదినలతో మాట్లాడు."

భాస్కరం ఆశ్చర్యంగా చూశాడు.

"అయితే అన్ని ఏర్పాట్లూ చేసుకుని...."

"లేదన్నా, ఇంకా ఏ ఏర్పాటూ చేసుకోలేదు."

"ఇప్పుడు మేం నిశానీ సంతకం చేయాలంటావు. పొట్టి సంతకమా, పొడుగు సంతకమా?"

అతని మనస్సులోని కష్టాన్ని కల్యాణి గ్రహించింది.

"అన్నాయ్! కొంచెం సెన్సిబుల్‌గా వుండు....ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనే దానిని అంగీకరించినప్పుడు పెళ్ళిళ్ళుకుదర్చడంలో
మనకుంటూవచ్చిన ఆలోచనల్ని కూడా సవరించుకోవాలి. ఫలానా వాడిని ప్రేమించాలని అంచనావేసుకుని 'ఏమంటావన్నా' అని నీసలహా
అడగరు. మంచిది కాదంటే చీరకొంగు దులిపినట్లు దులిపేసి, ఇంకెవడున్నాడు మనం ప్రేమించతగినవాడని చూడరు. ప్రేమ అనేదానిని
మన స్వాధీనం తప్పిపోయిన దశలోకాని గుర్తి౦చలే౦. ఇంక చేయగలదల్లా...."

"అది తప్పుదారిన పడిందనిపిస్తే......"

"ఆ ప్రేమకు అర్హుడు కాకపోతే....."

"అదొక బులపాటం- ఇన్‌ఫాట్యుయేషన్ మాత్రమేనని తేలిపోతే....."

భాస్కరం మనస్సులో ఎన్నో సమాధానాలులేని ప్రశ్నలు. వానికి చెల్లెలిచ్చిన సమాధాన౦విని అతడు స్తంభించిపోయేడు.

"యంత్రంవద్ద పనిచేసే వాడికి దానిమోత తెలియడం అది ఆగిపోయినప్పుడే."



ముప్ఫయ్యొకటో ప్రకరణం


రాజగోపాలం బట్టలు మార్చుకుని వచ్చేసరికి దక్షిణామూర్తి కాఫీకి అహ్వానించాడు. టేబుల్ వద్ద పరిచితమైన ముఖాన్ని చూసి సంతోషం
వెలిబుచ్చేడు.

'తమరెప్పుడు దయచేశారు? ఈవూరేనా తమది?"

నారాయణరావుక్కూడా అంత ఆశ్చర్యమూ కలిగింది. అక్కడ ఒకేయింట్లో ఉండడమే కాదు, వెంటవెంట వుంటున్నాడుకూడా నన్నమాట.

"మీరిద్దరూ కలిసేవచ్చేరా?"

రాజగోపాలం తలవూపేడు. అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోయినా నారాయణరావుది ఆ వూరుకాదనే విషయంలో సందేహంలేదు. ఒక
వూరివాళ్ళే అయితే పరిచయం కాకపోయినా కనీసం ముఖపరిచయమేనా వుండదా? ఆరోజున కల్యాణిగాని నారాయణరావుగాని ఒకరినొకరు
ఎరిగివున్నారనిపించలేదు.

దక్షిణామూర్తికీ ఆశ్చర్యమే కలిగింది.

"మీరిద్దరూ తెలుసునా?"

రాజగోపాలం తలతిప్పేడు. నారాయణరావు సమాధానం ఇచ్చేడు.

బెజవాడలోనే పరిచయం. ఒకమారు చూశా."

రాజగోపాలానికి కుతూహలం కలిగింది.

"ఆరోజున మీరు కల్యాణి గారిని ఎరిగివున్నట్లనిపించలేదు."

"అదంతా ఓదురదృష్టగాధ. నేనీ ఇంటివారి అల్లుణ్ణి."

వీరు మా అల్లుడుగారే."----అని దక్షిణామూర్తి నారాయణరావును బలపరిచేడు.

అది మరీ ఆశ్చర్యం కలిగించింది. అల్లుడంటే? ఏ అక్కమగడోనా? అంత దగ్గర బంధువును కల్యాణి ఎరక్కపోవడం. ఆయన
కల్యాణిని ఎరక్కపోవడం సంభవమా?

హఠాత్తుగా కల్యాణి అతనిని వెతుక్కుంటూ ప్రవేశించింది. మీరక్కడున్నారేమోనని అన్నయ్యగారింటికెళ్ళా ఏదీ నిన్న మీకిచ్చింది?"

"నా సంచిలోనే వుంది. తాళం ఇదిగో."

దక్షిణామూర్తి ఆ సాన్నిహిత్యాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నాడు.

కల్యాణి అతని చేతినుంచి తాళంచెవి అందుకుంటూ ప్రక్కకుచూసింది. నారాయణరావును గుర్తుపట్టింది. సంతోషం తెలిపింది.

"ఎప్పుడొచ్చేరు?"

"ఒక వారం దాటింది."

"ఇంకా వుంటారా? ఈఊళ్ళో బంధువులున్నట్లే చెప్పలేదే."

నారాయణరావులేచి ఆమెకు కుర్చీ ఇచ్చేడు.

"మా ఇంట్లో మాకే మర్యాద చేస్తున్నారు. బలేవారేనే. కూర్చోండి."

కల్యాణివంక ఆశ్చర్యంతో చూస్తున్న తండ్రికి తమ పరిచయం ఎక్కడిదో వివరించింది.

"వీరి చెల్లెలు హైమావతి నా స్టూడెంటు. ఈ మధ్యనే ఆమె పెళ్ళిలో పరిచయం అయ్యారు."

తానిదివరకే కల్యాణిని చూసినట్లుకూడా ఆనందరావు చెప్పలేదని దక్షిణామూర్తికి గుర్తువచ్చింది.

"మీరు చూసినట్టేనా చెప్పలేదే?"

ఆ మాటలోని లోతును కల్యాణి గమనించలేదు.

"మీరు మాట్లాడుతూండండి, గోపాలంగారూ! మీరూ ఎరుగుదురేమో. మా హైమ అన్నగారు....వూళ్లోకి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకొని
వచ్చినందుకు ధన్యవాదాలు."

వారికి పరిచయాలు కలపవలసిన పనిలేకపోయినా అమె వరకు తమ బాంధవ్యం ఎరగదని దక్షిణామూర్తి గ్రహించేడు. ఆనందరావు
ఆమెను తానెవరో చెప్పకుండా చూసేడు. మాట్లాడేడు. అదేమీ చెప్పకుండా కేవలం ధర్మబుద్దితోనే తాను వచ్చినట్లు చెపుతున్నాడు.

కల్యాణి సావట్లోంచి తిరిగి వస్తూంటే గుమ్మంలోనే తల్లీ, వదినా కనబడ్డారు. వారు ఎవరికోసమో వచ్చినట్లు అక్కడ నిలబడి
వున్నారు. ఆమెను చూసి నవ్వుతున్నారు.

"ఆయన్ని ఎరుగుదువు?"

కల్యాణి వారి ప్రశ్నను వినిపించుకోకుండానే వెళ్ళిపోతూ - "ఎవరిని?" అని అడిగింది. మరుక్షణంలో చేతిలో గొలుసుతో వచ్చింది.

"ఏమన్నావు? ఆయన్ని నెల క్రితమే కాదటమ్మా చూసేను. అంతలోనే మరిచిపోతామేం!"

ఆ ప్రశ్న వేశాకగాని అసలు పరిస్థితి ఆమెకు గోచరం కాలేదు. తనకంటే అయన హైమవతి అన్నగా తెలుసు. తన ఇంట్లో
వాళ్ళెల్లా ఎరుగుదురు! ఆ ఆలోచన తోచగానే అనుమానం కలిగింది. తన తండ్రి చెప్పింది ఈయన్నిగురించా? కాదనిపించింది. అయన
చెప్పింది ఆనందరావు. ఈయనపేరు నారాయణరావు. ఊళ్ళోకివచ్చి అందర్నీ పరిచయం చేసుకుని వుంటాడు.

"ఆయన్ని మీరంతా ఎల్లా ఎరుగుదురు?"

మాణిక్యాంబ సమాధానం ఇచ్చింది.

"ఆయన మన బంధువే కాదటమ్మా!"

కల్యాణి కాశ్చర్యం అయింది.

"నాలుగైదుమార్లు ఆయనా వచ్చేరు. నేనూ వెళ్ళేను. ఎప్పుడూ చెప్పనేలేదు సుమా, నీకేమౌతారు?"

తల్లి నిట్టూర్చింది.

"ఔను. పదిహేనేళ్ళక్రితం ఓపూట చూసినమనిషి గుర్తు ఎల్లా వుంటాడు?"

"అంటే?"

"ఆయనే నీ మగడు --" అంది వదిన.

కల్యాణి చుర్రుమనేలా చూసింది.

"ఏమిటొదినా ఆమాట!"

"తప్పేమందే." అని తల్లి సమర్థించింది.

"అమ్మా!"

ఆస్వరానికి తల్లి వులికిపడింది.

"నా మగణ్ణి నే చూసుకోగలను. దారేపోయే దానయ్యకెవరికో కన్యాదానం చేయనక్కర్లేదు."

సావట్లో వున్న ఆనందరావుకామాట ఎక్కడ వినబడుతుందోనని భాగ్యమ్మ నోరు నొక్కుకుంది.

"ఎంత అప్రతిష్ఠే కూతురా!"

వదిన మాణిక్యా౦బముఖం వెల్లనయ్యింది.

తల్లిని అదరగొట్టేసిందేగాని ఆనందరావురాక అంతవరకూ పట్టాలమీద సాఫీగా నడిచిపోతున్న తన జీవితశకటాన్ని తలక్రిందులు
చేసేస్తూందనే విషయం స్పష్టమైపోయిది. అతడూళ్ళో మకా౦వేసి, తనవాళ్ళ౦దర్నీ తిప్పేసుకున్నాడు -- అనిపించింది.

రెండురోజుల క్రితం సినిమాహాలువద్ద ఘటన కళ్ళముందు మెదిలింది. అక్కడున్న నలుగురూ తన్ను సాయంపట్టి కండక్టరు భద్రంతో
కారెక్కి౦చెయ్యటానికి సిద్దమయ్యారు.

ఇక్కడ తల్లి, తండ్రి, బంధువులూ యావన్మందీ ఆనందనారాయణ రావుకు తన్ను వప్పగించేస్తున్నట్లుంది.

అక్కడ రాజగోపాలం తన్ను బయటకు తెచ్చేడు. ఇక్కడ అతడు ఆ సహాయం చేసేటట్లులేడు.

"నీకు పెళ్ళయి౦దనే మాటే చెప్పేవుకావు,"

తన్నేదో మభ్యపెట్టడానికీ, మోసంచేయడానికీ తాను ప్రయత్నించినట్లు భావిస్తున్నాడనిపించింది. తామసం కలిగింది.

"చిన్నప్పుడోమాటు టైఫాయిడ్ పడ్డాను. అంతకంటే చిన్నతనంలో కోరింతదగ్గుతో ఆరునెలలు బాధపడ్డానని మా అమ్మ చెప్తూంటుంది.
ఎవరో ఏదో, వేరో, తీగో కంటెలా చుట్టియిస్తే మెళ్ళో వేసేరట."

కల్యాణి చరచర వెళ్ళిపోయింది. మరల కనిపించినప్పుడామె చాల వుదాసీనంగా వుంది. కనుపొట్టలుబ్బినట్లున్నాయి. తాను గతదినం
వూరుకు బయలుదేరి వచ్చేటప్పుడిచ్చిన బంగారపుగొలుసును తెచ్చి తన సంచిలోపెట్టేసింది.

"మనం ఏర్పరచుకోదలచిన బాంధవ్యం గురించి మీరేమీ చింతపడొద్దు. మీరేదో వాగ్దానం చేశారని నేను అనుకోవడంలేదు."

ఆమె ఆమాటలతో వెళ్లిపోబోయింది. రాజగోపాలం పిలిచేడు.

"రిజిస్ట్రారాఫీసుకి తెలియపరుద్దామంటే వద్దన్నావు. ఇందుకేనా?"

"మిమ్మల్ని ఈవేళ నేనిక్కడకు తీసుకువచ్చింది ఇందుకే. సమ్ముఖాన తెలుసుకొన్న విషయాలు నేను ఇచ్చేరంగులో కనిపించవు."

"నువ్విచ్చేదే౦ రంగు!"

"మీరెరుగుదురురనుకుంటాను."

కల్యాణి తన పొరపాటు ఎంతనష్టం కలిగిస్తూందో ఇప్పుడిప్పుడే తెలుసుకోగలుగుతూంది. తాను అంగీకరించినా, అంగీకరించకపోయినా అతనితో
పెళ్ళయిపోయింది. సంప్రదాయం_ చట్టం అతనికి తనను స్వాధీనం చేసేస్తున్నాయి. తనకిష్టంలేకపోతే ఆ మగణ్ణి కాదనొచ్చు. వేరుగా
ఉండొచ్చు. కాని, తను పెళ్ళికాని కన్య కాదు. ఎవరిని పెళ్ళి చేసుకోవడానికి ఏ చట్టం, సంప్రదాయమూ కూడా అంగీకరించదు.
అంతే కాదు శిక్షిన్తుంది. ప్రేమించిన వానిని కాపాడబోతే తనకు పదేళ్ళ శిక్ష. తననాతడు కాపాడబోతే ఆయనకైదేళ్ళు
శిక్ష....దీనికి కారకుడైన వ్యక్తిని కోర్టులు ఏమీ చెయ్యలేవు.

ఆ మాటనే అంతక్రితమే భాస్కరరావు ఆమెకు వివరించేడు.

"నేను పెళ్ళ౦దనుకోవడంలే" దంది తాను,

"ఏమన్నా అనుకో, నువ్వింక పెళ్ళిచేసుకోలేవు. చట్టం వొప్పదు."

తాను వివాహం అయిందని వొప్పుకుంటే విడాకులకు దరఖాస్తు పెట్టవచ్చు. అది లభిస్తేనే తనకు పెళ్ళి.

అంటే-మొదటిపెళ్ళిని గుర్తి౦చితేనే -మరో అడుగు, గుర్తించకపోతే అదీ లేదు.

మొండితనంగా పదిమాట్లు వల్లించుకొంది.

"నాకు పెళ్ళికాలేదు."

కాని ఆ జపం-తపం-తాపం-కోపం ఏమీలాభంలేదు.

ఏడుపొచ్చింది. తన అసమర్థతకు, అసహాయతకు నిస్పృహ పొందింది.

తాము బయలుదేరేముందు రాజగోపాలం ఒక బంగారు గొలుసు తెచ్చి తన మెడలో వేశాడు. తాను అభ్యంతరం చెప్పినా అతడు వినిపించుకోలేదు.
ఊరినుంచి వచ్చేక ఇద్దువుగానన్నాఅతడు ఒప్పుకోలేదు. అతని వుత్సాహం, ఆనందం తనను అంగీకరి౦పచేసింది.

"మీవాళ్ళు వొప్పుకొన్నా వొప్పుకోకపోయినా నువ్వు నాదానివి. ఇదే మనవివాహానికి గుర్తు. మీవాళ్ళు ఇష్టపడకపోయినా నిన్ను
నాభార్యగా తెచ్చేసుకొంటాను." -- అన్నాడాతడు.

తాను ఈ పరిణామాన్ని వూహించలేదు. తనవాళ్ళంతా తనను సమర్థిస్తారనీ, ఆనందరావు అవమానభయంతో తప్పుకొనిపోతాడనీ భావించింది.
కాని నిజంచూస్తే ఇప్పుడు తాను ఏకాకి, తనను భార్యగా తీసుకుపోతానన్న రాజగోపాలంకూడా వెనుకంజ వేశాడు.

కల్యాణి నిరుత్సాహంచూసి రాజగోపాలం కి౦చపడ్డాడు.

"నీకు నేనుచెయ్యగల సహాయం...."

"ఏమీలేదు. నాకు నేనుతప్ప సాయం చెయ్యగల వారెవ్వరూ లేరు."

ఆమె వెళ్ళిపోయింది. సాయంకాలం మెయిలులో బెజవాడకు బయలుదేరేవరకూ రాజగోపాలానికి ఆమె కనపడలేదు. ఇంట్లోంచి బయటకురాలేదు.

రిక్షా ఎక్కుతూండగా నమస్కారంతెలుపుతున్న కల్యాణి ముఖం చూసి రాజగోపాలం స్తంభించినట్లయిపోయాడు. సినీమాహాలువద్ద జరిగిన
ఘటనకు బెదిరిపోయి, తెల్లవార్లూ తననంటిపెట్టుకున్న కల్యాణి మరల కనిపించింది. కాని కంఠంలో ఆ బలహీనత లేదు. గంభీరంగానే
వుంది. అక్కడ చేరిన బంధువుల ముందు ఎంతో సామాన్యంగానే వారు వీడ్కోలు తీసుకొన్నారు.

రిక్షా ఎక్కేటప్పుడు గోపాలం భాస్కరాన్ని పిలిచేడు.

"మీకు అభ్యంతరం, పనీ, లేకుంటే...."

భాస్కరం 'అదేం మాట' అన్నాడు.

"నేనూ స్టేషనువరకూ వస్తున్నా."



ముఫ్ఫయి రెండో ప్రకరణం


రాజగోపాలం వెళ్ళిపోయాక భాస్కరరావు తండ్రివద్ద విచారం వెలిబుచ్చేడు.

"దాని జీవితం భగ్నమయింది. అది అతనిని అంగీకరించదు. కావాలనుకొన్న మనిషి చెయ్యిజారిపోయాడు."

ఆ మాటకు ఆయన ఏమీ అనలేకపోయాడు. వయస్సు వచ్చిన గాని ఆడపిల్లకు పెళ్ళిచేయడం సబబు కాదనుకోన్నవాడు మంచి సంబంధం
దొరికిందనీ, తన ప్రాణమిత్రుడే కోరి చేసుకొంటున్నాడని అప్పుడు మెత్తబడ్డాడు.

"మా ఆనందం ఎం. ఎస్. సి. ప్యాసయ్యాడు. స్కాలర్ షిప్ మీద అమెరికా వెడుతున్నాడు. వాడు స్వదేశం తిరిగి రావాలనీ, మంచి
శాస్త్రవేత్తగా మన దేశానికి వుపకరించాలనీ ఆశ. అందుకోసం వాడిక్కడికి తిరిగి రాక తప్పని బంధనం ఒకటి ఏర్పరచాలని నా
సంకల్పం. నీ పిల్లను ఇవ్వు."

దక్షిణామూర్తి తన విశ్వాసాలను గుర్తు చేసుకొని కొన్నాళ్ళు ఆట౦కపరిచేడు.

"కల్యాణి పదేళ్ళదోయి."

"వాడు దేశానికి తిరిగి వచ్చేసరికి ఆమెకూ వయస్సు వస్తుంది."

"కట్నం ఇవ్వలేను."

"పెళ్ళిఖర్చులుకూడా నేనే పెట్టుకుంటా."

"కుర్రాడు ఇష్టపడ్డాడా?"

"వాడికి ఏం తెలుసు? నే చెప్పానంటే వింటాడు."

నిజం ఆలోచిస్తే ఆ వివాహం జరపడం తనకు పూర్తిగా అంగీకారంకాలేదు. ప్రాణమిత్రుని పట్టుదల ఒక్కటే ఆయన్ని
ఆలోచనలోపెట్టింది. మంచి సంబంధం వచ్చినప్పుడు పదేళ్ళయినా పెళ్లి చేసెయ్యడంలోని సిద్దాంతవిఘాతాన్ని గూర్చి
బాధపడనక్కర్లేదనిపించింది. భార్య వొప్పుకోవడమే కాదు. పట్టుబట్టింది. బంధువులు, వూళ్ళోవాళ్ళు అందరూ అది జరిగించడానికి
ప్రోత్సాహం-సహాయం దండిగా ఇచ్చారు. వాళ్ళంతా చూసి౦దొక్కటే. కుర్రాడు చదువుకొన్నాడు. మంచిభవిష్యత్తుంది. రూపసి, గుణవంతుడు.

అందులో భారతీయతకీ, పితృవాక్యపరిపాలనాశ్రద్ధకీ చాల సన్నిహితసంబంధం వుంది. అందుచేత కుర్రవాని అభిప్రాయం ఖచ్చితంగా
తెలుసుకోవాలనే శ్రద్ధ ఎవరికీలేదు. కుర్రాడు పెళ్ళిక౦త సుముఖుడుగా లేదన్నవారుకూడా విశేషంపట్టింపు చూపలేదు. ఏదో
చిన్నతనం, సిగ్గు, చదువుమీద శ్రద్ధ...వగైరాలన్నీ సమాధానాలుగా అమిరేయి.

ఆనాటికథలన్నీ గుర్తుకువచ్చేయి. కుర్రవాడు భారతీయతకు పెద్దమర్యాద ఇవ్వలేదు. పిల్ల మెళ్ళో పుస్తె ముడేసేవరకే అది
నిలబడింది. తర్వాత నాకీపెళ్ళి ఇష్టంలేదన్నాడు. అంతవరకూ కొడుకు భక్తి శ్రద్దల గురించి తండ్రికున్న విశ్వాసం,
అన్యాయంచేశానే యని దుఃఖపడడానికే పనికొచ్చింది.

దక్షిణామూర్తికిప్పుడు మరోవిధంగా కూతురుకు తాను అన్యాయంచేశానని బాధకలిగింది. ఆమెకు తానింతవరకూ పెళ్ళి చెయ్యలేకపోయాడు.
ఆమెకు పాతికేళ్ళు పైబడ్డాయి. ఇప్పుడాతడే వచ్చి తనభార్యను తీసుకెడతానన్నాడు, బాగానే వుందనిపించింది. ఆ అభిప్రాయాన్ని
బలపరుస్తూ అంతవరకూ జ్ఞాపకమైనా వచ్చివుండని చట్టసంబంధమైన అభ్యంతరాలన్నీ కళ్ళముందు కనబడ్డాయి. ఊళ్ళోవాళ్ళు మళ్ళీ
పెళ్ళినాడుచూపిననంత వుత్సాహమూ చూపించారు. తాను మళ్ళీ మెత్తపడ్డాడు.

కాని, అసలువిషయాన్ని పదిహేనేళ్ళనాడు మరచినట్టే నేడూ మరచేడు. ఆ దాంపత్యాన్ని సాగించవలసిన ఇద్దరూ అంగీకరించేరా? ఆ
మాటనెవ్వరూ పట్టించుకోలేదు.

చట్టం-ధర్మం-ఆచారం-సెంటిమెంటు-అన్నీ సాయపడుతున్నాయి. వీళ్ళిద్దరినీ కలపాలి-కలపాలంటున్నాయి. కాని, ఆ కన్య అభిప్రాయం
ఏమిటి? చట్టానికి-ధర్మానికీ ప్రాతిపదికయైన మానవతాసమాలోచన తమలో లుప్తమైపోయింది.

దక్షిణామూర్తి ఆత్మగ్లానితో నీరవంగా వెళ్ళిపోయాడు.

కాని తల్లి భాస్కరాన్ని చాల కఠినంగా మందలించింది.

"నువ్వే రేపెడుతున్నావివన్నీ, దానికేం తెలుసు? ఎంత ఆప్యాయంగా పలకరించింది. ఎంత బాగా కబుర్లు చెప్పింది?...."

తమ చిన్ననాడు మగడు వీధిలోవున్నాడంటే ఆ వీధిన నడవడానికి తామంతా సిగ్గుపడేవారు. యేభయ్యేళ్ళు దరిబడ్డా ఈవేళ కూడా తాను
మగనిముందు ఏ కుర్చీలోనో కూర్చోడానికి సిగ్గూ- బిడియమూ పడుతుంది. అల్లాంటిది తనకూతురు ఆయనతో చాలసరదాగా మాట్లాడింది.
బెజవాడలోనే వాళ్ళు మాట్లాడుకున్నారు. లేకపోతే ఇన్నేళ్ళు తన్ను వదిలేసుకున్నందుకు అభిమానం చూపదూ? కోపం ప్రదర్శించదూ?
బ్రతిమాలించుకోదూ?

అతనిదగ్గరకుపోవడం ఇష్టంలేక, వెనకటి కోపమే ఇంకావుంటే అతడున్న వైపుకేనా వెడుతుందీ?

ఇవి రెండూకూడా జరగలేదుగనక వాళ్ళిద్దరూ బెజవాడలోనే సఖ్యపడిపోయారనీ ఇక్కడ కోపంనటిస్తూ తమరిని బుట్టలో
పెట్టచూస్తూందనీ ఆమె సమాదానపరచుకొంటూ౦ది.

వాళ్ళు సఖ్యపడితే భాస్కరరావే చెడగొడుతున్నాడని ఆమె అభిప్రాయం.

అతడు కమ్యూనిస్టు, తండ్రి జైళ్ళకెళ్ళీ, కాంగ్రెసులో చేరీ ఇంట్లో నానా మాలకూళ్ళూ కలిపితే, కొడుకు వర్ణసంకరమే
చేసిపెట్టాడని ఆమె అభిప్రాయం.

అతడు చేసుకున్నది బ్రాహ్మణుల పిల్లే అయినా అమెకాతని యెడ ఆ అభిప్రాయం గట్టిగా వుంది. వర్ణాంతర వివాహాలకెన్ని౦టికో
అతడు పౌరోహిత్యం నిర్వహించేడు. తన మామగారితోనే తమ పౌరోహిత్యపు సాంప్రదాయం పోయింది. ఈనాడు తనభర్త యథావిధిగా తద్దినాలు
పెడతాడు. నమ్మకం వుండికాదు, భక్తితో. కాని, భాస్కరానికి ఆ భక్తీ లేదు. 'చచ్చిపోయినవాళ్ళు ఒక్కరోజు బ్రతికివచ్చి
విస్తరేసుక్కూర్చుంటే మీరెవ్వరూ ఈ తద్దినాల ప్రసంగం తెచ్చివుండ'రనేది అతని వ్యాఖ్యానం.

అల్లాగే అర్థంతెలియని మంత్రాలతో విసువుకలిగించేకన్న ఉపన్యాసాలు మంచివని సభాముఖంలో దంపతులచేత ప్రమాణాలు చేయించాడు.
అదోవిధంగా ఫర్వాలేదనుకుంటుంటే ఇప్పుడు కిరస్తానీవాళ్ళల్లా రిజిస్ట్రేషను చేసుకో౦డంటున్నాడు. ఇవన్నీ ఆమె దృష్టిలో
వర్ణసంకరం, మతసంకరమే. మామూలుగా భిన్నంగా ఆ యింట ఎవ్వరేమనుకొన్నా అది భాస్కరరావు బోధల ఫలితమే అంటుంది. దానికి
'దుష్ట' అనే విశేషం చేర్చకపోయినా ఆమె అభిప్రాయం అదే.

తల్లి ఆ ఆరోపణ చేసినప్పుడల్లా భాస్కరరావు నవ్వేస్తాడు. ఇప్పుడూ అంతే చేశాడు.

"కబుర్లు చెప్పినవాణ్ణి మొగుడుగా వొప్పుకున్నట్టేనా ఏమమ్మా!"

"మగడు – పెళ్ళాం సంబంధం కాదంటే పోతు౦దట్రా."

"పదిహేనేళ్ళక్రితం తండ్రి పట్టుదలతో మెళ్ళో తాడుముడేసినందుకే మొగుడుతనం స్థిరపడిపోయేటట్లయితే చాలకష్టం అమ్మా! ఈ వీధిలో
ఆడపిల్లలు చాలమంది చిన్నప్పుడు బొమ్మలాటల్లో నాచేత తాళికట్టించుకున్నారు. అమ్మా- నాన్న ఆట ఆడి సిగ్గునటించేరు.
ఉత్తుత్తి విస్తరేసి అన్నంకూడా పెట్టారమ్మా! వాళ్ళెవరో జ్ఞాపకం వచ్చినా బాగుండును."

చిన్నవయస్సులో గడ్డిమేటుచాటునా. మంచాల క్రిందా, తలుపుల వెనుకా తనతో కోడెగాలాడిన అమ్మాయిలు గుర్తువచ్చేరు. కాని, ఆ
విశేషాన్ని తల్లిముందు చెప్పలేకపోయేడు.

అతడు తెచ్చిన వుపమానానికి భార్య విరగబడి నవ్వింది.

ఇంట్లోగనక సరిపడింది. ఈమాటే వీధిలో అంటే మగాళ్ళదాకా అక్కర్లేదు. ఆ ఆడాళ్ళే చీపురుకట్టతో....."

భాస్కరరావు బుర్రగోక్కున్నాడు.

"నువ్వేనా సాక్ష్యంగా వుంటావుకదా? మీకిదేం పోయేగాలం. మగణ్ణి అల్లాకొడుతున్నారు? మీరు భారతమహిళలు కాదా/ సీతా- సావిత్రుల
రక్తం మీలో ప్రవహించడం లేదా? రాణి రుద్రమ్మలూ, ఝాన్సీలక్ష్ములూ అంటే మొగుణ్ణి కొట్టమనా? – అని నువ్వడగవా?"

మాణిక్యాంబ నవ్వింది.

"అందుకే మెళ్ళోతాడు వేయడం దాగుడుమూతల్లో పురివెనుకనో, అటకలమీదనో కోడెగాలాడడంతో మగడూ- పెళ్ళాలయిపోయారే
మగువా!"---అన్నాడు తల్లి దగ్గరలేకుండా చూసి.

పెళ్ళికిపూర్వమే తానాతనితో కోడెగాలాడినచోట్లు జ్ఞాపకం వచ్చాయి. ఆ రహస్యాలు తమకే తెలుసు. అవన్నీ కితకితలు
పెట్టినట్లయి నవ్వింది.

అమ్మమ్మ నరసమ్మమాత్రం అది ఉత్తుత్తి పెళ్ళికాదు సుమా అని హెచ్చరించింది.

"శాస్త్రీయంగా, అగ్నిహోత్రసాక్షిగా జరిగిందిరా....."

అంతేకాదు ఆ పెళ్ళిజరిగిన ముహూర్తానికి చాలబలం ఉన్నదనే విషయాన్ని కూడా ఆమె నిరూపించింది.

"పదిహేనేళ్ళయితేనేం, పాతికేళ్ళయితేనేం, ముక్కుకి తాడుపోసి లాక్కొచ్చింది."

భారతి పత్రికలలో వెలువడే గోపాలకృష్ణమాచార్యులుగారి జాతకాల వ్యాసాలన్నీ ఆమె అతిశ్రద్దతో చదివించుకొని వింటుంది.

భాస్కరరావు ఆశ్చర్యార్ధకాలతో అపహాస్యం చేశాడు.

"ఔనుసుమీ అమ్మమ్మా! బహుశా ఇంతకాలందాకా ఆ తాడు దొరకలేదనుకుంటా, ఏమూలో పడేసి మరచిపోయి వుంటుందేమోనమ్మా!"

"ఒరేయి భడవా! తప్పుడుకూతలు కూయకురా."

తల్లి వాపోయింది.

"చిన్నప్పటినుంచే వాడొక్కలాగే వున్నాడు. ముప్ఫయ్యేళ్ళొచ్చినా బాధ్యతలు వొంటబట్టలేదు. నీ ఇష్టం వచ్చిన వాళ్ళింట్లో తిను.
స్నేహాలు చెయ్యి. కాని, నీ అనాచారం మొగుడు-పెళ్ళాల మధ్యకి తీసుకురాకు. పెళ్ళి అనేది అంత చులకనగా చూడకు." అని ఆమె
ఆక్రోశించింది.

తన అభిప్రాయాల్ని తల్లికెల్లా బోధపరచాలో ఆతనికి అర్థం కాలేదు. పెళ్లి అంటే అగౌరవం లేదు. కాని, జగత్తుకంతకూ
క్షేమమూలకంగా దాన్ని భావించవద్దంటాడు. దాని ఆధ్యాత్మికతయెడ ఆతనికి విశ్వాసం లేదు. అదొక సామాజిక ప్రక్రియ.
మనుష్యునిలో మానసికోత్తేజాన్నీ, ఉత్తమాభిభావనల్నీ, ఆత్మిక ఏకత్వాన్ని సాధించేటంతవరకే దాని మన్నింపు, ఈ ఉదాత్త
స్థితికి మనుష్యుని లేవదియ్యలేనిది మంత్రాలుచదివినా, మాటలుచెప్పినా, చట్టాలు బలపరిచినా – రిజిస్ట్రారాఫీసు బైండుపుస్తకాల్లో
నమోదయినా పెళ్లి కాదు – అంటాడాతడు. కాని భాగ్యమ్మకు అవన్నీ అర్థంచేసుకొనే ఓపికలేదు. ఆచారం, సాంప్రదాయం వాటినిదాటిన
దాంపత్యాలనామె వూహించదు. వూహించలేదు.

"మామ్మా! మనవెంకటమ్మకెందరు పిల్లలు?"

ఆ ప్రశ్న వెనకనున్న రహస్యాన్ని ఆడవాళ్ళిద్దరూ గ్రహించేరు.

వెంకటమ్మకూ వారికీ సంబంధం లేదు. వాళ్లు ఎరిగివున్న ఒక బంధువుకామెతో సంబంధంవుందనేతప్ప ఆమె వాళ్ళకులానికి చెందిన మనిషికూడా
కాదు.

ఆమెకు పిల్లలెందరో భాస్కరానికి లెక్కకావలసీ కాదు. వెంకటమ్మను 'మన'లో చేర్చడంలోనేవుంది ఆతనిప్రశ్నకు కీలకం.

వెంకటమ్మ కార్యంఅయిన కొత్తలో మగణ్ణి మీద చెయ్యి వెయ్యనియ్యలేదు. ఆమె అప్పటికే తమయింటిముందున్న ఇంట్లోకి కాపురం
వచ్చిన స్కూలుమాస్టరు యువకుడితో ప్రేమకలాపాలు సాగిస్తూంది. అతడా కులాంతరుడు కావడం – ఆతనికప్పటికే పెళ్ళాం,
ఓచిన్నవుద్యోగం వుండడం కారణంగా అతనిని పెళ్ళి చేసుకోలేదు. ఆతనితో మరోవూరుపోయి కాపురమూ పెట్టలేదు. ఫలితంగా కొన్ని
సర్దుబాట్లకు సిద్ధపడవలసివచ్చింది.

తర్వాతతర్వాత ఆమె ఇష్టాపూర్తిగా మగడివద్దకు వెడుతూంది. వెళ్ళినప్పుడో నెలో పదిహేనురోజులో అక్కడుండి వచ్చేస్తుంది. నెల
తప్పిందంటారు. ఆ విధంగా ఆమె ముగ్గురినో నలుగురినో కంది. ఆమె ఇచ్చిన చనువును పునరుద్ధరించుకొనేటందుకు ఆమొగుడాడు
ఒకటిరెండుమార్లు వచ్చాడు. కాని, వేవిళ్లు, నిండునెలలు, పచ్చిఒళ్ళు, పిల్లకు పాలు చాలకపోవడం, చెరగుమాయడం వంటి
సమస్యలు వస్తాయి. అప్పటికీ వదలక మొండితనంచేస్తే ఆతని చెయ్యి తగలడంతోటే ఆమె విరుచుకు పడిపోతుంది. ఈ బెడదలన్నీ
పడలేక ఆమె కళకుదిరి వచ్చినప్పుడే చాలులేయని ఆమొగుడు ఈ నాలుగు రోజులతోనే తృప్తిపడడం నేర్చుకొన్నాడు.

"పెళ్ళిని చాలమర్యాదగా, గౌరవంగా చూసేవాళ్ళకి వెంకటమ్మను చూపించాలి. ఆమె సహజంగా వ్యభిచారగుణం కలదికాదు. ఆమెకు
కావలసిందొకమగాడే. ఆతనినే తనపిల్లలకు బాబయ్యగారని చూపుతూంది. కాని, వివాహ వ్యవస్థకు మీరంతా ఇస్తూన్న
ప్రతిష్ఠఫలితంగా ఆమె తాళికట్టినవాడితో వ్యభిచారంచేయక తప్పడంలేదు.

ముసలమ్మ వోడిపోయాననుకొంది.

"నాయనా, నువ్వు చదువుకొన్నవాడివి. నీకు చెప్పలేం. కాని ఒకటి మరిచిపోకు. జీవితంలో నువ్వా-నేనా అనే మాటకు ఆస్కారం
లేదు. నీకూ-నాకూకూడ చోటుంది. అంతే."

ఈ మారు భాస్కరానికి ఏం చెప్పడానికీ తోచలేదు.

"అమ్మమ్మా! మీ రోజుల్లో పరిస్థితులు వేరు. తిండికి, బట్టకి, తలదాచుకునేటందుకు అన్నింటికి ఆడదానికి పరాధీనపుబ్రతుకే,
కనక మగాడేంచేసినా గజేంద్రమోక్షం పునశ్చరణ చేయవలసిందే...."

"అయితే నీచెల్లెలు సంపాదించుకొంటూందిగనక మగాడితో పనిలేకుండా బ్రతుకుతుందంటావు."

"అమ్మమ్మా! ఒక్కటడుగుతా చెప్పు,"

నరసమ్మ నవ్వింది.

"నువ్వు నాచేత నానావాగుడూ వాగిస్తావురా."

"వాగుడేమిటమ్మా! నీఅనుభవాలు...."

"అది నువ్వుపెట్టిన పేరు."

భాస్కరం నవ్వేడు. కాని, ప్రశ్నించకుండా వూరుకోలేదు.

"మనం అందరం ఎరిగినదీ, నిర్భయంగా చెప్పుకోగలదీ కనక వెంకటమ్మకథ తీసుకో...."

"ఏం సీతారామయ్య కథ...."

"వాళ్ళ వాళ్ళే ఆతని పేరు కదపడానికి జంకుతున్నారు...."

"అయితే చచ్చిపోయినవాళ్ళగురించి చెప్పు, ఏ పూచీ పేచీలు లేనిపని...."

"ఏదీవద్దులే పోనీ. పెట్టి పోషించవలసిన బాధ్యత లేకపోతే మగాళ్ళు చేస్తున్న అల్లర్లకి ఆడవాళ్లు వొప్పుకుంటారంటావా?"

"పెట్టిపోషించడం ఒక్కటేనట్రా. పిల్లలుపుట్టకపోతే ఒక విధం, ఆ కాస్త నలుసూ...."

"నలుసు – కాలిలోని ముల్లుసంగతి మళ్ళీ తీసుకుందాం. ఈ విషయం చెప్పు...."

నరసమ్మ ఆలోచించింది.

"ఇల్లరికపుటల్లుడు మాట ఎందుకు పుట్టిందనుకున్నావు?"

భాస్కరం నవ్వేడు.

"అంతే అమ్మమ్మా! మగాడి అవసరం ఆడదానికెంతో ఆడదానితో అవసరం మగాడికీ అంతే. రెండూ చెల్లు. ఇంక మిగిలిందేమిటి?
సంపాదించిపెడుతున్నాననే అభిప్రాయం దానివలనకలిగిన అధికారం, అహంకారం, సంఘంలో బలం...."

తల్లి ప్రశ్నించింది.

"అయితే ఏమంటావు? ఆతడో పాడుపని చేశాడు కనక కుక్కకాటుకి చెప్పుదెబ్బలా మనమూ ఓపాడుపని చెయ్యాలంటావు."

"నేను ఇంతవరకు అల్లాంటి మాట, తప్పుపని చెయ్యాలన్నానా అమ్మమ్మా! ఈచెంపకొడితే ఆచెంప చూపాలనడం ఈమధ్యనొక
ఫేషనయిపోయిందమ్మా! ప్రతిదానికీ సంగతి సందర్భాలున్నాయి. పెద్దపులి ఒకజబ్బ పీకేస్తే, ఏకంగా తలకాయి తీసుకెళ్లి దానినోట్లో
పెట్టెయ్యాలనం...."

"పెళ్ళీ-పెద్దపులి ఏం సామ్యంరా...."

"అందుకేనమ్మా! వుపమానాలు లాభంలేదనడం. వదిలెయ్యి. చెల్లాయికి జరిగిన పెళ్లి చెల్లదు. అందులో ఒకపాత్ర అయిన కల్యాణికి
ఆనాడు పదేళ్లు. చట్టంవొప్పకున్నా నైతికంగా మైనరు అది. పోషకులకి ఆమెతరఫున వ్యవహారాలు చెయ్యడానికి అధికారం వుందిగాని,
కాళ్ళూ చేతులూకట్టి దానినే అమ్మేసేటందుకు అధికారంలేదు...."

"నువ్వు ప్లీడరీ చదివితే ఎంత బాగుండేదిరా. ఎందుకు మానేశావురా, నాయనా!"

"సోషలిజం వస్తే ప్లీడర్లపని వుండదన్నారమ్మా అంతాను. తీరా చూస్తే సోషలిస్టుతరహా వరకే వచ్చింది. అందుచేత మనం ఇల్లానే
వుండిపోయాం అమ్మమ్మా!"

"అందుచేత వొప్పదంటావు. డెబ్భయ్యేళ్ళ క్రితం పుట్టి వుంటే నువ్వు....ఒరేయి నా పెళ్లి రెండోయేట జరిగిందిరా. అప్పటికి
పళ్ళుకూడా రాలేదట...."

"అవును. నీక్కూడా మళ్లీపెళ్లి ఎందుకు చేయాలనేదానికి పది కారణాలు చూపించి వుండేవాడు."- అని భాగ్యమ్మ వెక్కిరించింది.

భాస్కరం లెక్కచేయలేదు.

"చెల్లాయికి పెళ్ళేకాలేదనడమే కాదు. మీరు అయిందంటున్నారుగా.

'ఓం మమవ్రతే తే హృదయం దధాతు
మమ చిత్త మనుచిత్త ప్తేస్తు.
మమ వాచా మేకమనా జుషస్వ,
బృహస్పతి స్తా నియనక్తు మహ్వం.'

- అని మంత్రం చదివిన బుద్ధిమంతుడే పెళ్లిని రద్దు చేసేసేడు. తనఖా కాలదోష పరిమితి దాటిపోయిందనే కాదు. రద్దు
  అయినట్లుగానే భావించి మళ్ళీ పెళ్ళే చెయ్యమన్నాడు. ఆ రద్దయిపోయిన దాన్ని చూపించేహక్కు ఆయనకు లేదు."

"నువ్వు పండితుడవురా నాయనా! నువ్వీ కమ్యూనిస్టుల్లో ఎల్లా పడ్డావో గాని...."

అమ్మమ్మ మాట తప్పించే ప్రయత్నం వుందనిపించింది. ఇంక తానూ దానిని సాగించడం మంచిదిగా తోచలేదు. నవ్వేడు.

"పండితులు కమ్యూనిస్టులు కారా, కాకూడదా అమ్మమ్మా!"

కాని తల్లి వదలలేదు.

"హక్కులూ, టక్కులూ అని పెళ్లిళ్లు చెడగొట్టకురా, మహాపాపం!"

"దాని పీడా పోయిరి. వర్ణసంకరం, జాతిసంకరం కన్న మహాపాపాలు నన్నేం చుట్టుకుంటాయిగాని, ఏవేవో వెర్రి ఆచారాలనడ్డంపెట్టుకొని
మనుష్యుల బతుకులు నాశనం చెయ్యకండి."

"ఇంతకీ నువ్వేమంటావురా," అని నిలవదీసింది నరసమ్మ.

"ఆ మొగడని మీరంతా చెప్పేవాడితో కాపురం చెయ్యాలో, దానిని గడ్డలుచెయ్యాలో దానికే వదిలెయ్యండి."

"దానికేం తెలుస్తుందిరా"యని తల్లి ప్రాణం కొట్టుకులాడింది.

భాస్కరం నవ్వేడు. నరసమ్మ తలవూపింది.

"మా రోజుల్లో ఆడదానికో ఇష్టం, అయిష్టం వుందన్న వాళ్లే లేరు. మీ రోజులు వేరు. కనీసం నువ్వొక్కడివేనా నీ చెల్లెలితరఫున
వున్నావు. రెండోవేపు మీ అమ్మ ఒక్కర్తయిపోయింది. మీ నాన్న అటూ-ఇటూ అనలేకుండా వున్నాడు ఇదెందుకు వచ్చిందో గాని...."

భాగ్యమ్మ చిరాకు చూపింది.

"ఎందుకొచ్చిందో తెలుస్తూనే వుంది."

"ఇంతకీ అసలు పిల్లది ఏమంటుందో" నరసమ్మ సలహా భాగ్యమ్మకు నచ్చలేదని ఆమె ముఖమే చెప్తూంది.

"అన్న మాట విన్నాక చెల్లెలి మాట వినక్కర్లేదు.

ముసలమ్మకు ఏమనడానికీ తోచలేదు.

"మనకాలం తీరిపోయింది."

"అందుకోసం ఈ మహాపాతకాలన్నీ తలకి చుట్టుకోవాలంటావు."

"అమ్మా! ఒకటి చెప్తా విను. మా చిన్నరోజుల్లో నరేంద్రపురంలో చయనులుట. మంచి వేదపండితుడు. ఓ మాలదాన్ని అంటుకొని
వాళ్ళల్లో కలిసిపోయేడట. ఆ రోజుల్లో దానికి పెళ్లేమిటి? లేచిపోవడం – కలిసిపోవడం అంతేమాటలు. మహాపండితుడట. పెద్ద
ఆస్తిపరుల ఇంటబుట్టేడు. మాలాళ్ళలో కలిసిపోయాక మట్టికొట్టుకు బ్రతికేడు. మనూరి చెరువుంది చూడు. దానిని తవ్వించినప్పుడు
మట్టిమోసిన వాళ్ళలో ఆతడొకడు. అమ్మతో ఓరోజున వసిష్ఠకెళ్లి వస్తూంటే 'చిట్టెమ్మా' అని పిలిచి కళ్ళనీళ్ళు
పెట్టుకున్నాడు. నేనింతదాన్ని. మా తాతగారి వద్ద వేదం చదువుకున్నాడుట. "మహాపండితుడవు నీకీ ఖర్మేంరా" అని అమ్మ
ఏడ్చింది. నాకిప్పటికీ లీలగా గుర్తు. కాని...."

"అందుకోసం ఇంటా వంటా లేనిది...."

"ఇదిగో పిల్లా! కొంచెం సర్దుకోడం నేర్చుకో, మా మామయ్య ఏదో కొట్లాటలో కొడుక్కి అరదండాలు వేసి రెండురోజులు జైల్లో పెట్టేరని
అభిమానపడి అక్కిలేరుమీది నుంచి పడి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆ రోజుల్లో జైలుకి వెళ్లడం కానిపని. మహావమానం. కాని- మా
ఆయన ఆరుమాట్లు జైలుకెళ్లేడని నువ్వే గొప్పలు చెప్పుకొంటావు."

తన చిన్నతాత కొడుకు దొమ్మీకేసులోనో, దోపిడికేసులోనో జైలుకి వెళ్ళడానికీ, కాంగ్రెసు వుద్యమంలో తన మగడు జైలుకెళ్ళడానికీ
సాపత్యం చెప్పడం భాగ్యమ్మకు రుచించలేదు.

"దానికీ దీనికీ సాపత్యం ఏమిటమ్మా!"

"సాపత్యం ఏమీ లేదు. పిడుక్కీ బియ్యానికీ ఒకేమంత్రం కాదు. మనంచేసిన పనిఫలితం ఒకటే అనిపించినా దేశం-కాలం పట్టి ఆ
పనుల స్వభావాలు మారతాయి. అంతే...."

నరసమ్మ లేచి వెళ్లిపోయింది. గుమ్మంలో కల్యాణి ఎదురయింది.

"అదృష్టవంతురాలివే, మనమరాలా!"

భాస్కరంతోడి సంభాషణధోరణినుంచి బయటపడని నరసమ్మ ఒక వుద్దేశంలో అంది. ఆమె యిష్టాయిష్టాల్ని సమర్థించే అన్న
వున్నాడన్నంతవరకే ఆమె 'అదృష్టం' అంది. కల్యాణికి అది అర్థంకాలేదు. మరొక విధంగా ఆమె అర్థంచేసుకొంది.

"అల్లాగే కనిపిస్తూందమ్మమ్మా!"

చూపు ఆనని ముసలమ్మకు ఆమె ముఖంలోని నైరాశ్యం కనపడలేదు. చెవులకు లోపంలేదు, గనక మాటవినబడింది. వినబడినమాటకు
ఆశ్చర్యమే కలిగింది. ఇందాకటినుంచీ జరిగిన వాదనకూ, అసలుమనిషి ఇచ్చిన సమాధానానికి సంబంధంలేదు. "అన్నగారి ఆలోచన
తప్పా యేం చెప్మా"-అనుకొంది.



ముప్ఫయిమూడో ప్రకరణం


ఆనందరావుకు పరిస్థితులు ఎల్లా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. పదిహేనేళ్ళపాటు ముఖంచూడ్డానికికూడా నిరాకరించి ఈవేళ
హఠాత్తుగా హాజరయితే ఆ గాథలన్నీ మరచి అంతా స్వాగతం ఇస్తారని ఆతడూహించలేదు. నిజంచెప్పాలంటే ఆతడు
ఆశించినదానికన్నాఎక్కువ సౌమనస్యమే కనబడింది. తనఅత్తవారివాళ్ళు ఎంతోహుందాగా తనను ఆదరించేరు.

తానీదేశం వచ్చేటప్పుడు కల్యాణి ఆతని మనస్సులో లేనేలేదు. తన భార్య బుందేలీ కన్య. ఆమె చనిపోయింది. ఈమారు
తనస్వదేశంలో పిల్లనెవరినైనా చేసుకొందామనుకొన్నాడు. వచ్చాడు. వస్తూనే కల్యాణితో పరిచయం అయింది. నల్లగావున్నా మనిషి
అందంగా వుండొచ్చుననే విషయం ఆమెను చూశాకనే అర్థం అయింది. ఇంత కాలం ఆతడు పాశ్చాత్య దేశాలలోనో, ఉత్తరాదినో మాత్రమే కాలం
గడిపాడు. దక్షిణదేశంనుండి వచ్చినవాళ్లల్లోతప్ప అక్కడ నల్లనివాళ్లు కనబడరు. అందులో చిన్ననాటినుంచీ ఆతనికి నలుపు
అందవికారంగానే భావన. ఇప్పుడు కల్యాణి ఆతని ఆలోచనలన్నింటినీ తల్లక్రిందులు చేసింది. ఆమె నల్లనిదైనా అందకత్తె.
అంగసౌష్ఠవం వుంది. కన్ను ముక్కు తీరు వుంది. మంచి మర్యాద వుంది. చదువుంది. అంతకన్న భార్యలో కోరదగింది కనబడలేదు
ఆతనికి.

అందుచేత ఆమె ఎవరోతెలియకుండానే పరిచయం పెంచుకొన్నాడు. ఆ పరిచయంలో ఆమె ఎవరో తెలిసింది. వెంటనే బయలుదేరేడు. ఆమె
అంగీకరించకపోవచ్చుననే అనుమానమే ఆతనికి కలగలేదు.

తానామె భర్త. భారత మహిళ మహాపతివ్రతల వారసురాలు. చదువుకొన్నా, పాశ్చాత్య నాగరికత అలవరచుకొన్నా భారత స్త్రీ
పతివ్రతా ధర్మాన్ని విడవదు. తాను వస్తాననే ఆలోచనకూడా లేకపోయినా ఆమె ఇంత కాలంవరకూ అవివాహితగా వుండిపోవడంలోనే
అతనికీ ప్రమాణం లభ్యమయింది.

అత్తవారింటికి వచ్చాక తన అభిప్రాయాలకు ఆటంకం కాగలడని తోచిందల్లా చిన్నబావమరిది భాస్కరరావు. ఆతడైనా తననేమీ
అనలేదు. కాని, ఆతనికి భౌతికదృష్టే గాని, ఆధ్యాత్మిక విషయాల మీద విశ్వాసం ఏమీ లేదు. భారతీయత ప్రత్యేకతను
ఆతడంగీకరించడు. అందరిలాంటి వాళ్ళమే మనమూ. అందరికీ వున్న మంచిలూ, చెడ్డలూ, గుణాలు, అవగుణాలు, యోగ్యతలూ-అయోగ్యతలూ
తగుమైన పాళంలో మనకీ వున్నాయని ఆతని వాదన. పెళ్ళిని, స్త్రీ స్వాతంత్ర్యాన్నీ గురించిన అతని అభిప్రాయాలుకూడా భారతీయ
సాంప్రదాయాలకు విరుద్ధంగానే కనిపించాయి.

"ఈతడు ప్రత్యణువూ కమ్యూనిస్టు."-అనుకున్నాడు.

ఒకరోజున భాస్కరరావు తన్ను ఎగాదిగా చూసేడు.

"నీకు యౌవనపు విసురు మళ్ళిపోయింది. ఆడదాని అవసరం నీకిప్పుడు కేవలం కాలక్షేపానికి. హోటలుమెతుకులు తినక్కర్లేకుండేటందుకు.
కోపంవచ్చినప్పుడు ప్రపంచానికీ నీకూ మధ్య నిలబడ్డానికి, నలుగురిలో ప్రతిష్ఠ కోసం."

ఆ విధంగా భాస్కరరావు చెప్తూంటే తనకు నచ్చలేదు. కాని ఆలోచిస్తుంటే ఆతడు నిజమే చెప్తున్నాడనిపించింది.

ఇరవయ్యేళ్ళ వయస్సప్పుడు ఆడదాని సాంగత్యం కోసం చూపిన యావ తనలో ఇప్పుడు లేదు. అమెరికాలో ఓ అరడజనుమంది కన్యల్ని
మార్చేడు. 'నెకింగ్' దశను దాటి ముందుకు అడుగు పెట్టలేని ముగ్ధలు ఎంత అందంగా కనబడ్డా 'పెటింగ్'కు అనుమతించే యువతులతో
'డేట్సు' ఏర్పరుచుకున్నాడు. 'పెటింగ్' పరిమితుల్ని దాటిన ఘట్టాలుకూడా ఆతడు ఎరుగును. దేశం వచ్చి, పెళ్ళి చేసుకొన్నాక
మొదటి రోజుల్లో భార్యను ఒక్కరోజు విడిగా వుండనివ్వలేదు. క్రమంగా తనకు తెలియకుండానే పృథక్ శయ్యమీద నిద్రపట్టడం
ప్రారంభించింది. భార్య కన్నుగప్పి రండల్ని వెతికే ఆవేశం ఇప్పుడు లేదు.

అయితే తానెందుకు పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు?

శారీరకావసరంకన్న మానసికావసరమే ఎక్కువగా వున్నదని ఒప్పుకోక తీరిందికాదు. కూడావుండేందుకు సహచరి కావాలి. భాస్కరం
వివేచనను ఒప్పుకొన్నాడు. అయినా కల్యాణిని తీసుకుపోవాలన్న ఆలోచనను వదులుకోలేదు. ఆమె తన భార్య.

చివరకు భాస్కరం అనేశాడు.

"మీ అనుభవంతో జీవన ప్రాంగణంలో వున్న అమ్మాయిల్ని ఆకర్షించలేరు. మీకు ఈడుజోడుగా వుండగల స్త్రీని వెతుక్కోండి."

ఆనందరావుకామాట అర్థం కాలేదు. తాను ఆకర్షించడం సమస్య ఏముంది? రింగ్‌మాస్టరు చేతిలో కొరడా లాగ తన చేతిలో
తాళి కట్టిన హక్కు వుంది. దానిని ఝడిపించి మంచం ఎక్కమంటే ఎక్కాలిసిందే. ఇక్కడ అధికారంతోనే గాని ఆకర్షణతో పని లేదు.
ఆకర్షణ వుండాలిసింది ఆమెకు, కల్యాణిలో ఆకర్షణ అవసరం కన్న అధికంగానే వుంది.

అందుచేతనే అతడా బావమరిదితో ఆటే వాదన వేసుకోలేదు. కాని తీరా చూస్తే కల్యాణి కూడా ఆతని ధోరణిలోనే వుందనిపించింది.

తండ్రి ఇంట్లో తనను చూసినప్పుడు ఆమె అకృత్రిమమైన సంతోషాన్ని చూపింది. అప్పటికి తానెవ్వరో ఆమెకు తెలియదు. తెలియకపోయినా
ఆమె కనబరచిన ఆనందం తన సంతోషానికి ప్రతిబింబంగానే కనబడింది. భారతీయ వివాహ మంత్రాలలోని శక్తిని గూర్చి విన్న
కథలూ, చదివిన నవలలూ జ్ఞాపకం వచ్చి ఒక్కమారు జంద్యం తడుముకున్నాడు. మొదటిభార్య వుండగానూ, వుద్యోగస్థలంలోనూ ఆతడు
జంద్యం గురించి పట్టించుకోలేదు గాని, స్వదేశంలో వివాహప్రయత్నం చేసుకోడానికి బయలుదేరేటప్పుడు దాని అవసరం వుంటుందనిపించి, ఒక
పావలా ఖర్చు చెశాడు. గాయత్రీ మంత్రంతో సహా యావత్తూ మరచిపోయాడు, గాని సంధ్యావందనం కూడ ప్రారంభించేవాడే.

ఒక అరగంట పోయాక మరల కల్యాణి వచ్చింది. ఈమారు ముఖంలో సంతోషంలేదు. విచారంలేదు. మర్యాదకోసం నాలుగు మాటలాడి
వెళ్ళిపోయింది. ఆమె ముఖంలో ఇంతవరకు తాను ఉపేక్షించినందుకు అసమ్మతిమాత్రమే అతనికి కనిపించింది. తన పశ్చాత్తాపాన్నిగాని,
తన మనస్సులో ప్రస్తుతం పేరుకుంటున్న అభిమానాన్నిగాని వ్యక్తీకరించడానికి ఆమె ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.

మరునాడుదయం కాఫీ అనంతరం ఆమె అతనితో మాట్లాడడానికి వచ్చింది. తానూ మామగారు టేబులు వద్ద కూర్చుని కబుర్లు
చెప్పుకుంటున్నారు. కల్యాణి కాఫీ తీసుకొని వచ్చింది. తాను ఓ కుర్చీ లాక్కుని కూర్చుంది. ఆమే సంభాషణ ప్రారంభించింది.

"హైమ ఏం చెయ్యాలంటూంది?"

"దానికేం తెలుసు? మనం ఏది చెప్తే అదే చేస్తుంది."

ఆ 'మనం' ఎవరో అర్థం అయింది. కాని, ఎరగనట్లూ, అర్థం కానట్లే మాట్లాడింది.

"ఏం చదివించడానికీ, ఏం చెప్పడానికీ మీకు అధికారం ఏం వుంది? అది వాళ్ళిద్దరూ నిర్ణయించుకోవలసింది."

ఆ మాటలో సౌమ్యత లేదు. దక్షిణామూర్తి గ్రహించేడు. ఇదే వాళ్ళ దాంపత్య జీవితానికి నాందీవాచకం కావలసివుంటే శుభసూచకం
కాదనుకొన్నాడు. తానక్కడ అనవసరం అనిపించింది. లేచేడు.

"మీరిద్దరూ మాట్లాడుకొంటూ వుండండి. నేనల్లా వీధిలోకిపోయి పనిచూసుకువస్తా."

ఉపోద్ఘాతాలు, ప్రాథమికమైన సమాధానపరచడాలవరకూ ఆయన వుండడం బాగుంటుందని ఆనందరావు భావించినా ఏమీ చెయ్యలేకపోయాడు.
కల్యాణి ఎరిగివుండి సెలవిచ్చి పంపేసింది.

"వెళ్ళిరాండి....పని చూసుకురాండి...."

వెంటనే ఆమె తనను కూర్చోమంది.

"మీకేం పనిలేదుగదా....లేకుంటే కూర్చోండి."

ఆమె ఏదో దృఢనిర్ణయానికి వచ్చి తనతో మాట్లాడటానికి వచ్చింది. అయితే ఆమె ఎత్తుబడి చూస్తే ఆ నిర్ణయం తన ఆలోచనలకు
అనుకూలంగా వుండదనిపించింది. వెంటనే సర్దుకొన్నాడు.

తండ్రి వెళ్ళిపోయాక ఆమె ఒక్క క్షణం ఆగి ప్రారంభించింది.

"తమరు ఇక్కడికి వచ్చిన కారణం నేను విన్నా."

ఆనందరావు నెమ్మదిగా అన్నాడు.

"అయిందేదో అయిపోయింది. తెలిసో తెలియకో చేసినతప్పు సవరించుకోవాలని...."

కల్యాణి ఆతనిని వారించింది.

"ఇందులో తప్పేం జరగలేదు. మనుష్యుల మీద ఇష్టం, అయిష్టం అనేవి మంత్రాలమీద ఆధారపడికలగవు. ఒక వస్తువుమీద
మనకయిష్టం ఎందుకంటే ఏం చెప్తాం? శాస్త్రీయకారణం ఏదో వుండొచ్చు. మనకు తెలియదు. కనక సమాధానం ఇవ్వలేం. సమాధానం
చెప్పలేంగనక యిష్టం తెచ్చుకోగలుగుతామా?....అలాగే మనుష్యులమీదా...."

విజయవాడలో జరిపిన సంభాషణల తరవాయిలా వుందేగాని ఆనందరావు అనుకున్న ధోరణిలో సాగడంలేదు. ఆతనిమాట చొరనివ్వకుండా తన
నిర్ణయం చెప్పేసి వెళ్ళిపోయేటట్లా ఆమె కనిపిస్తూంది. ఆతడు ఏలాగయినా మాట దూర్చాలని ఓ వ్యర్థప్రయత్నం చేశాడు.

"కేవలం ఇష్టం అయిష్టం అనడానికి వీల్లేదు. ఏది ఇష్టమో, అయిష్టమో చూడ...."

"ఎక్జాట్లీ. చూడ్డం అవసరమే లేదు. సలాజార్‌ను మనం చూడలేదు. బహుశా ఏ ఫొటోలోనన్నా చూశామా అంటేఅదీ
అనుమానమే. డయ్యరున్నాడు. డప్పులాడున్నాడు. వీళ్ళెవళ్ళవీ ఫొటోలుకూడా చూడలేదు. కాని వాళ్ళ పేరు చెప్తే మనకెంతో అసహ్యం.
గాంధీజీని నేను చూడలేదు. కాని ఆయనంటే గౌరవం. బ్రతికి వుండగా చూడనేలేకపోయానే అని ఎంతో అనుకుంటాను. కొన్ని
ఎస్సోసియేషన్సు...."

మాటలో కల్పించుకొని సంభాషణను దారికి తేవాలనే ప్రయత్నాన్ని ఆనందరావు వదలలేదు.

"మనమధ్య ఎటువంటి 'ఎస్సోసియేషన్సు' ఆధారంగా ఏ అభిప్రాయాలు ఏర్పరచుకోడానికీ...."

"అవకాశమే లేదంటారు. సరిగ్గా అదే నే చెప్పదలచుకొన్నదీను. ఏమీ అక్కర్లేదు. అది అంతే. కారణశూన్యమైన
ఇష్టానిష్టాలకు క్షమాపణ చెప్పుకోవలసిన అవసరం నాకు కనిపించదు. ఏదో మర్యాదకుతప్ప వాటికెక్కువ ప్రాముఖ్యం ఇవ్వనూ
కూడదు. ఏమంటారు?"

ఆమె ఇంతసేపటికి మాటకు అవకాశం ఇచ్చినా ఇప్పుడేమనడానికీ తోచలేదు. 'నువ్వు చెప్పుకుంటూన్న క్షమాపణకు విలువ లేదు. నేను
నమ్మను' అంటూంటే ఆతడు దిగ్భ్రాంతుడయ్యేడు.

"అయితే మనం సంఘంలోవున్నాం గనక కొంతవరకన్నా ఆ నియమాల్ని అనుసరించకతప్పదు."

తనకవకాశం దొరికిందనిపించి ఆనందరావు మాటకలిపాడు.

"సరిగ్గా నా ప్రస్తుతప్రయత్నాన్ని ప్రోత్సహించినదదే...."

"నేను అర్థం చేసుకోగలను. నిన్నమధ్యాహ్నంవరకూ మనుష్యుని ఆలోచనల్నీ, విశ్వాసాల్నీ సంఘనియమాలు ఎంతవరకూ
తీర్చిదిద్దగలవనే విషయమై స్పష్టమైన అభిప్రాయంలేదు. కాని, మా రాజగోపాలంగారిలో వచ్చిన స్పందనలు చూశాక...."

ఆమె బుద్ధిపూర్వకంగా రాజగోపాలం పేరు సంభాషణలో ప్రవేశపెడుతూందని గ్రహించేడు. ఆమె అభిప్రాయాన్ని గ్రహించడంలో తాను పొరపాటు
చేశాననుకొన్నాడు. తననుచూసి రాజగోపాలం జంకేడు. వెళ్ళిపోయాడు. ఇప్పడీమెకు తానే దిక్కు.

ఆ మాట తోచాక అంతవరకూ ఆతని మనస్సులో అంతర్గతంగా వుండిపోయిన అనుమానం, ఆమె శీలాన్ని గురించిన శంక పొటమరించింది.
వారిద్దరూ పక్కపక్క వాటాలలో ఒంటరిగా వున్నారు. బాగా పరిచయంకూడా వున్నట్లు ఆతడిక్కడికి వెంబడించడమే చెప్తూంది. నిన్న
ప్రొద్దుటి నుంచీ ఆ మాట సూచనగాకూడా అనలేకపోయినా, ఆమె లోకువ కనిపించిపోయిందన్నప్పుడు అనకుండా వుండలేకపోయేడు.

"మీవెంట తిరగడానికి ఆయనకు వుద్యోగం, సద్యోగం ఏంలేదేమిటి?"

కల్యాణి ఆతని పొడుపును గ్రహించినట్లు నవ్వింది.

"నేనూ రాజగోపాలంగారూ పెళ్ళిచేసుకోవాలనుకొన్నాం. వారిని నాన్నకూ-అమ్మకూ చూపించాలని తీసుకొచ్చా. రమ్మంటే వచ్చారు."

ఆ మాటకాతడు నోరు తెరిచాడు.

"పాతికేళ్ళు వచ్చాక ఎవరి బాధ్యతలు వారు తీసుకోవడం మంచిది. ఆడదైనా, మగాడైనా. రేపు నే వెడుతున్నా. బెజవాడ వెళ్ళగానే
రిజిస్ట్రారుకు తెలుపుతాం."

ఆ మాటలు తనకెందుకు చెప్తూందో అర్థం కాలేదు. తనను ఆడిస్తూందా? వెక్కిరిస్తూందా? తాటాకులు కడుతూందా?-ఆమె ధోరణిని ఆతడా
ధోరణిలోనే ఎదుర్కోవాలనుకొన్నాడు.

"రిజిస్ట్రేషను చెల్లదు."

"మోసగించేవంటే శిక్షపడుతుంది."

"ఆయన వుద్యోగం వూడుతుంది."

ఎన్నో ప్రశ్నలు. ఎన్నో బెదిరింపులు. వానిలో ఒక్కటీ ఆమెయెడ అభిమానం చూపేది లేదు. చట్టం, హక్కు, అధికారం....

కల్యాణి ఆ ప్రశ్నలన్నింటికీ అంగీకారం తెలిపింది. కుర్చీలో జేరబడి దృఢకంఠంతో సమాధానం ఇచ్చింది:

"మీరిదివరకు నాన్నగారితో అన్నమాటలు కాగితంమీద వ్రాసి ఇస్తారు."

"ఆ మాట ఎల్లా అడగ్గలిగావు?"

అంతవరకు ఉపయోగిస్తున్న గౌరవవాచకం పోయింది. కల్యాణి గమనించింది.

"మీరు పెద్దలు. నన్ను 'నువ్వ'న్నా, 'మీర'న్నా నాకు వచ్చేదీ పోయేదీ ఏమీలేదు. కాని, అదేవిధంగా నేనుపయోగిస్తే
మాత్రం...."

"క్షమించండి."

ఆనందరావు అయిష్టంగానైతేనేం వెంటనే సర్దుకున్నాడు.

"ఫర్వాలేదు. ఇంక తమప్రశ్న...."

ఆతనికెంతో తామసం కలిగింది. క్షణంక్రితమే ఆమె శీలంయెడ అనుమానం వెలిబుచ్చిన మాట మరచాడు. తన హక్కులోవస్తువు
జారిపోనివ్నరాదనేదొక్కటే దుగ్ధ.

కల్యాణి బంధుకోటిఅంతా తనకు స్వాగతం ఇచ్చేరు. గ్రామమంతా తనను అభినందిస్తూంది. కల్యాణికూడా పెళ్ళికాక, మొగుడికోసం మొగంవాచి
వుందనీ, పిలిచిందేతడవుగా తనవెంటబడుతుందనీ ఆతడింతవరకు కల్పనలు సాగిస్తున్నాడు. కాని జరుగుతున్నది దానికి విరుద్ధం.
కోపంవచ్చిందంటే ఆశ్చర్యంలేదు.

"చిన్నప్పుడెప్పుడో ఏదో అన్నాననుకోండి. అది ధర్మవిరుద్ధమని గ్రహించేకకూడా...."

కల్యాణి ఖచ్చితంగా చెప్పేసింది.

"నాకు సంబంధించినంతవరకు ధర్మాధర్మచింతన అవసరం వుందనుకోను. ఏమంటే ఆనాటి వివాహాన్ని అంగీకరించను."

"అంగీకరించక...."

కల్యాణి నవ్వింది.

"చెప్పేనుగా...."

ఆమె కోరినటువంటి వుత్తరాన్ని ఆనందరావు ఇవ్వడు. దానిని లెక్కచేయకపోతే కోర్టుకీడ్చి నేలబెట్టి రాసేస్తానని చెప్పేడు.

కల్యాణి లేచింది.

"సరే, కోర్టులో మీరు పెట్టేకేసు సులువుగా రుజువుకావడానికి నే చెయ్యగల సహాయం ఇస్తాను."

ఆనందరావు ఆశ్చర్యంతో నోరు తెరిచేడు.

"అంటే...."

"మీరు కాగితం ఏదీ ఇవ్వనక్కర్లేదు."

"అది వట్టి వ్యభిచారం...."

"దృక్పథంలో భేదం తప్ప వేరుకాదు. నా దృష్టిలో మీతో కాపురం చెయ్యడం వ్యభిచారం. మీ దృష్టిలో అది ధర్మం. ఫర్వాలేదు
వ్యభిచారమే కొందరికి జీవితధర్మంగా తీసుకొనే భారత దేశంలో ఈ మాత్రపు దృక్పథవైవిధ్యం వుండడంలో ఆశ్చర్యంలేదు."



ముప్ఫయినాలుగో ప్రకరణం


రాజగోపాలం గుమ్మంలో అడుగుపెట్టేసరికి సుజాత కనబడింది. కాని ఆమెలో వెనుకటి దీప్తీ లేదు. వుత్సాహమూ కనబడలేదు. ఒక్క
రెండుమూడు నెలల్లో ఇరవయ్యేళ్ళ తరుగుదల వచ్చేసినట్లు కనబడుతూంది. ఏదో అమూల్యమైన వస్తువును పారేసుకొన్నట్లూ,
జీవితాలంబనాన్నే పోగొట్టుకొన్నట్లూ దిగాలుపడి వుంది. ఆమెను చూడగానే రాజగోపాలం దిగ్భ్రమచెందేడు.

"ఎవరు, సుజాతా! అల్లా వున్నావేమిటి?"

సుజాత ఉలికిపడినట్లు తిరిగిచూసింది. గుడ్లనీరు కక్కుకొని ఇంట్లోకి పారిపోయింది.

రాజగోపాలానికి వెంకట్రావు మాటలు జ్ఞాపకం వచ్చేయి. "జీవితానికి సరిపడా నిర్వేదం. దురదృష్టవంతురాలు,-" కాని, ఆమాటయందు
తనకు విశ్వాసం లేకపోయింది. ఆమెకు ఎవ్వరియందూ నిర్వేదం కలిగించేటంత ఆత్మీయత ఏర్పడలేదనీ, ఆ వయస్సూ, ఆ
మనస్తత్వమూ కూడ లేవని ఆతని అభిప్రాయం. చిన్నతనం, చిలిపితనం, గారం తప్ప ఆమెకింకా గాంభీర్యం పట్టుబడలేదని ఆతని
ఆలోచన. కాని, ఇప్పుడు ఆమెను చూస్తే అల్లాఅనిపించదు.

ఆతనికి ఆమెయెడ నిజంగానే ఎంతోపరితాపం కలిగింది. మనస్సులోనే ఆమెను దగ్గరకు తీసుకొని బుజ్జగించి, తల ముద్దుపెట్టుకొని
వీపు నిమిరేడు. 'వెర్రిపిల్లా!' అన్నాడు-మనస్సులోనే.

కాని, తనకు కావలసింది ఆమెకాదు, కల్యాణి. ఆమె లభించకపోతే తనజీవితం ఏమిటి?

చిన్నప్పుడెప్పుడో జరిగి, ఆమెజ్ఞాపకంలోంచికూడా జారిపోయిన ఒకఘటన తనకెందుకు చెప్పలేదని అభిమానం వేసింది. కోపం వచ్చింది.
కాని ఆ అభిమానం – కోపం రైలుకు బయలుదేరేవేళకే అంతరించేయి.

ఆమెను తాను పెద్దపులులూ, తోడేళ్ళామధ్య వదలిపెట్టి వచ్చినట్లనిపించింది. ఆమె ఆ ఒత్తిడికి తట్టుకోగలదా? ఆచారాలు,
సంప్రదాయాలు, కులప్రతిష్ఠలు, ధనం పలుకుబడులు – నిగ్రహించి నిలబడ్డానికి కావలసిన మనస్స్థైర్యం....భగవానే!
ఎంతపనిచేశాడు. తనకు కోపం, అయిష్టం ఏర్పడిందనే భ్రమ కలిగించేడు. ఆమె లొంగిపోయేటట్లు చేసిన ఆఖరు ఉపకరణం అదే
అయితే....ఆ ఆలోచనే చాల బాధాకరంగా తోచింది.

గుమ్మంలో అడుగుపెట్టేసరికి కల్యాణిలేనిలోపం బాగా కనిపించింది. ఈ ఏడాదిలో ఆమె తనకు చిరునవ్వుతో స్వాగతం ఇవ్వని రోజులు
జ్ఞాపకం రావడం లేదు. ఇదే మొదటిదనిపించింది. హృదయం పట్టేసింది. తానుచేసింది చాలతెలివితక్కువపని. వెంటనే వెనక్కి
తిరగాలనిపించింది.

ఎదురుగా శేఖరం నిలబడి పలకరిస్తున్నాడు.

"ఎప్పుడొచ్చేవు నాయనా!"

* * * * *

రాజగోపాలం ఆ వుదయమంతా ఎల్లాగోవున్నాడు. నిద్రరాకపోయినా పక్కమీదినించి లేవాలనిపించలేదు. మెదడంతా శూన్యంగావుంది. ఆఫీసుకి
పోవాలనిపించలేదు. హోటలుకి అలవాటుకొద్దీ వెళ్ళేడేగాని, వాడేం పెట్టేడో, తానేం తిన్నాడో, అసలు తిన్నాడో లేదో, ఏమీ తెలియదు.

అనుక్షణం ఒక్కటే ప్రశ్న. "ఈ క్షణంలో కల్యాణి ఏంచేస్తూందో? వాళ్లేం ఒత్తిడి పెడుతున్నారో, ఆమె ఒంటరిగా...."

సినీమాహాలువద్ద జనంమూగి ఆమెను కారులోకి గెంటుతున్నదృశ్యం గుర్తుకువచ్చింది. గుండె నీరయిపోయింది. తానువెళ్ళి ఆమెప్రక్క
నిలబడాలి. ఒక్కఉదుటున లేచేడు.

అప్పుడే గుమ్మంలోంచి వెనుతిరగబోతున్న శేఖరం ఆతడు లేచిన చప్పుడు విని ఆగేడు.

"నిద్రపోతున్నావనుకొన్నాను."

రాజగోపాలం ప్రకృతిలోపడ్డాడు.

"దయచెయ్యండి."

ఆతని ఆహ్వానంతో నిమిత్తంలేకుండా శేఖరం వెనక్కితిరిగేడు. కుర్చీలాక్కుని కూర్చున్నాడు.

"ఏం అల్లావున్నావు?"

ఏదో మర్యాదకోసం వేసేప్రశ్నలు. కాలక్షేపంకోసం వాకబులు. ఏదో చెప్పదలచినదానికి ఉపక్రమణికగా శాఖాచంక్రమణలు.

రాజగోపాలం మనస్సుకవేం దూరడంలేదు. తన స్వభావానికి విరుద్ధంగా మాట్లాడుతున్న మనిషి లేచిపోతే బాగుండుననిపించింది. మర్యాదకాదని
ఎరిగినా కొన్ని ప్రశ్నలకూరుకుంటూ వచ్చేడు. కాని శేఖరం ఏమీ నిరుత్సాహపడలేదు.

ఒక్క గంటసేపు ఆ మాటా ఈ మాటా చెప్పి అసలు విషయానికి వచ్చేడు.

"ఏమిటో కులం అనుకోడమే గాని పిల్లలకంటే ఎక్కువా? నీకంటె గుణవంతుడెవడు? సుజాత నీకోసం అలమటిస్తూంది. దానిని నీకిచ్చి
పెళ్ళిచెయ్యాలని నాకోరిక."

శేఖరం నలభైవేలు కట్నం ఇవ్వడానిక్కూడా సిద్ధపడి కూతుర్ని కులాంతరుడికివ్వడానికి సిద్ధంగా వున్నాడు.

సరాసరి తానివ్వగల కట్నం, లాంఛనాలు, వేడుకలు, బహుమతులు –

కంట్రాక్టరుస్వభావాన్ని స్పష్టంచేశాడనిపించి రాజగోపాలం నవ్వుకొన్నాడు.

పావలా నుంచి వేయిరూపాయిలదాకా వుందిరేటు – చప్రాసీనుంచి మంత్రివరకూ ఏ పనేనా జరిగిపోతుంది. రాష్ట్రాన్ని కొనేస్తానన్నా
అమ్మేసేటందుకు మనుష్యులున్నారు. వాటికి రేట్లున్నాయి. ఆ రేట్లన్నీ ఆతడెరుగు. ఆ ధైర్యంతోనే ఒక్కమారు అల్లుడు కావలసిన
యువకుడి కళ్ళు జిగేల్మనిపించెయ్యాలనుకొన్నాడు. కాని ఆతనిప్రయత్నం విఫలం అయ్యేసరికి నోరు వెళ్ళబెట్టేడు. 1940లో
జైలుశిక్షకి తయారయి అన్నీ సిద్ధం చేసుకొన్నప్పుడు కలక్టరు తన్నువొదలి, సత్యాగ్రహం చూడ్డానికి వచ్చిన జనాన్ని తెచ్చిన
బస్సులమీద కేసుపెట్టినప్పుడుకూడా ఆతడంత దిగ్భ్రమ చెందలేదు.

ఆ రోజున గాంధీజీ పిలుపుపై కాంగ్రెసువాదులు వ్యక్తి సత్యాగ్రహం చేస్తున్నారు. శేఖరం ఆ సత్యాగ్రహానికి పెద్ద ఆడంబరంచేశాడు.
సత్యాగ్రహంతేదీ నిర్ణయించి కలక్టరుకు, పోలీసులకు తెలియబరచేడు. పెళ్ళికి చేసినంత హడావిడి చేశాడు. ఎక్కడెక్కడున్న
బంధుమిత్రులకు ఆహ్వానాలు పంపేడు. చుట్టుప్రక్కల నాలుగూళ్ళజనాన్ని ఆహ్వానించేడు. అరెస్టు చేసినాక తననూ, తనను
సాగనంపేజనాన్నీ రాజమండ్రి జైలుదాకా జేరవేసేటందుకు మూడుబస్సులు మాట్లాడేడు. సత్యాగ్రహంరోజున వచ్చేజనానికి విందులు ఏర్పాటు
చేశాడు.

అనుకొన్నతేదీనాటికి అధికార్లుమినహా అందరూ వచ్చేరు. వారిరాక కోసం సత్యాగ్రహం ఒక పూట, రోజు వాయిదావేశాడు. వచ్చిన జనం
విసుగెత్తి వెళ్ళిపోతున్నారు. విందుఆశ కూడా వారినాపడం లేదు.

చివరకు రెండోరోజు సాయంకాలం సబినస్పెక్టరువచ్చి 'రాంగ్ రూట్'లోకి బస్సులు వచ్చినందుకు కేసుపెట్టి వెళ్ళిపోయేడు. ఆ రెండు
రోజుల్లోనూ చేసిన అప్పులూ – ఖర్చులూ సర్దుబాటు చేయడానికై తాను సత్యాగ్రహాన్ని తాత్కాలికంగా నిలుపుచేసి మిగిలి వున్న
రెండెకరాలూ అమ్మకం చూపవలసివచ్చింది.

ఆనాడుకూడా శేఖరానికంత నిరాశ, నిస్పృహ, దిగ్భ్రమ కలగలేదు.

"నాపెద్దఅల్లుడిక్కూడా నేనిచ్చినదానికన్న నీకెక్కువ ఇస్తున్నా. నీవంటి అల్లుడికింతకన్న ఎక్కువే యివ్వవచ్చు. కాని,
నీకిస్తే పెద్దఅల్లుడికివ్వాలి. తర్వాత ఎల్లాగూ మా పిల్లలకు పెట్టుకుంటాం."

స్కూల్‌ ఫైనలు అయితే పదివేలు. బి.ఏ. పదిహేనువేలు. ఎం. బి. బి. ఎస్. ఏభయివేలు. ఇంజనీరు ముప్ఫయివేలు.

ఇది వట్టి చదువేవుండి ఆస్తి ఏమీ లేనివాళ్ళ విషయంలో. ఆస్తికూడా వుంటే రేటు హెచ్చుతుంది. తెలుగుదేశంలోని కమ్మ కుటుంబాల
కంట్రాక్టరు మనస్తత్వం పెద్దపులిలా నోరు తెరిచింది. ఈవేళ వాళ్ళనే కాదు. దేశంలోని ఆడపిల్లల తండ్రులందర్నీ మింగేసేటట్లు
పళ్ళుకొరుకుతూంది. దానినిచూసి భయపడేస్థితి వాళ్ళకీ, దేశానికీకూడ సిద్ధపడిందన్న శేఖరమే తనవరకు వచ్చేసరికి
మనస్సునదుపుచేసుకోలేకపోతున్నాడు.

"ఆలోచించు. శుభ్రమైన పిల్లనిస్తానంటే కులంతక్కువ అన్నట్లు చెయ్యకు."- అనికూడా హెచ్చరించేడు.



ముప్ఫయ్యయిదో ప్రకరణం


సాయంకాలం మామూలుగా హోటలుకు పోయివచ్చేసరికి ముందు వరండాలో తండ్రి కూర్చుని కనిపించేడు. గుమ్మంలోనే కాలు ఆగిపోయింది. ఆయన
వస్తాడనే విషయం తెలియదు. రావలసిన కారణమూ కనబడదు. ఈమధ్య ఉత్తర ప్రత్యుత్తరాలలో కనబరుస్తున్న ముభావం ఇంత
హఠాత్తుగా మారి తనను చూసేటందుకే తండ్రి వచ్చేడంటే ఏదో గట్టి విశేషమే వుండాలనిపించింది. తండ్రి పట్టుదలలు అతనికి తెలుసు.

ఆ క్షణంలో ఆయనను సమీపించేటందుకు మనసు ఒప్పలేదు. ఎదటివానికి కష్టం కలిగిస్తున్నానేమోనన్న మృదుత్వం లేదాయనలో.
కల్యాణిని గురించి ఆయనకెటువంటి అభిప్రాయం వుందో క్రిందటిసారే తెలిసిపోయింది. ఇప్పుడాయన మళ్ళీ అదే ఎత్తుతే సహించేటంత ఓరిమి
మనస్సుకి లేదనిపించింది.

కాని తప్పదు. తండ్రి వచ్చి కూర్చున్నప్పుడు మొగం చాటుచేసేటంత ధైర్యం లేదు. చేతిలోవున్న సిగరెట్టు సైడ్ కాలవలో పారేసి
లోపల అడుగుపెట్టేడు.

తీరాచేసి ఆయన ప్రసంగం వినేసరికి నవ్వాలో- బాధపడాలో తెలియలేదు. తండ్రి తన వివాహ విషయంలో కులం పట్టింపులు
వదులుకొనేటందుక్కూడా సిద్ధమవుతున్నాడు.

"కులాంతరురాలిని చేసుకోవాలని కాదూ నీ కోరిక! చేసుకో. కానీ, ఆ బ్రాహ్మణపిల్ల వద్దు. మన్ని ససిపెట్టదు."

అసలు తానిప్పుడు పెళ్ళి చేసుకొనేధోరణిలో లేనేలేనని నచ్చచెప్పడానికి రాజగోపాలం ప్రయత్నించేడు. కాని, ఇక్కడ
జరుగుతున్నాయన్నవీ, జరిగినాయన్నవీ ఆయనకు అవసరమైన మార్పులతో తెలిసినాయని గ్రహించేక అతడు నిరుత్తరుడే అయ్యేడు.

కల్యాణి జబ్బుపేరుతో ఇతరుల కళ్ళుగప్పి అతనితో కాపురం చేస్తూంది. అతడిని తనతో వూళ్ళవెంబడి తిప్పుతూంది-- అనేది
ఆయనకర్థమైన విషయం.

అసలుపరిస్థితులు చెప్పి ప్రయోజనంలేదని గోపాలం గ్రహించేడు. ఆయన కొన్ని విషయాలు విన్నాడు. దానికి అనుగుణంగా పథకంకూడా
తయారుచేసేశాడు. అదేమిటో తెలుసుకొనేసరికి రాజగోపాలం ఆశ్చర్యానికి పరిమితిలేదు.

సుజాతను పెళ్ళిచేసికోడానికి ఆయన అభ్యంతరం చెప్పడు. అంతేకాదు, చేసుకోవాలనేది ఆయన ఆజ్ఞ.

సుజాత పచ్చనిపిల్ల.

"కోడలు నలుపైతే కులం అంతా నలుపంటారు-" కల్యాణి నల్లనిది-అని ఆయన చెప్పకపోయినా ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
అందులో దాపరికంలేదు.

ఏభయి అరవై వేల రూపాయలు కట్నంరూపంలోనూ, లాంచనాల రూపంలోనూ ఇస్తున్నారు.

కల్యాణి తండ్రి ఆస్తికలవాడు కాదు. ఆ అమ్మయి చేతిలో పసుపుకొమ్ముకూడా పెట్టలేడు- ఈ మాటా ఆయన వాచ్యంగా చెప్పలేదు.
కాని, ఆ భేదం తన మనస్సుకు తోచేటట్లు చేయడంలో ఏమీ లోపం వుంచలేదు.

కల్యాణి వయస్సులో అతనికన్న పెద్దదయి వుంటుంది. పెళ్ళాం పెద్దది కావడం ఆయుః క్షీణం.

కులం రీత్యా తమకన్న గొప్పవాళ్ళ మనుకొనే బ్రాహ్మణులింటిపిల్ల.

ఈమారు సుజాత కులాన్ని తాము సన్నదిగా చూస్తామనే అభిప్రాయాన్ని బైటపడనివ్వలేదు.

కాని వీటన్నింటికన్న కృష్ణంరాజు మనస్సులో సర్వ ప్రథమంగా మెదులుతున్న ఆలోచనవేరు.

శేఖరంగారి కొడుకులు మంచి ఉద్యోగాల్లో వున్నారు. ఈ దిక్కు మాలిన గవర్నమెంటులో ఎంతకాలం ఏడిస్తే ఏముంది? రాజగోపాలం
మెకానికల్ ఇంజనీరు. ఏ కంపెనీలోనన్నా నెత్తిన పెట్టుకొంటారు. ఆ అవకాశం వారు బావమరదికి కలిగిస్తారు.

"నీకీవేపున సాయం ఏమీ వుండదు. పైగా ఆ అమ్మాయి రెండో అన్న కమ్యూనిస్టట. వాళ్ళనుంచి నీకు లభించే సహాయం అల్లా ఈ
వున్నవుద్యోగంకూడా వూడడం."

రాజగోపాలం నిస్తబ్ధుడే అయ్యాడు.

తండ్రి తేగల యుక్తులు అయిపోయాయనుకొన్నప్పుడు శేఖరం ప్రవేశించేడు. తన తండ్రి ఎదటనే ఆయన ప్రశ్నించేడు.

"అంత ఆలోచన పనేముంది? నువ్వెరగని అమ్మాయి కాదు."

"నా కూతురులో ఏలోపం వుందని సందెహిస్తున్నావు?"

జంటకవుల్లా చెరోపాదం ఎత్తుకున్నారు. రాజగోపాలంవద్ద సమాధానం ఏంవుంది? సుజాతలో లోపం ఏం వుందని చెప్తాడు? అసలు ఏం వుంది?

ఆరోగ్యం, అందం, తెలివి, చురుకుదనం - అన్నీ వున్నాయి.

"డబ్బు!"

ఆమె తండ్రి బంగారు పిచ్చిక.

"హోదా?"

అన్నలు మంచిమంచి ఉద్యోగాలలో ఉన్నారు.

అన్నింటికీ మూలం ఆమె తనంటే ప్రాణం ఇస్తూంది.

కాని...

ఆ కాని...ఒక పెద్ద అగాధం. అది పూడదు. అందం, గుణం, ధనంకూడా దాన్ని భర్తీ చేయలేదు. అవి దానికి వంతెన
వెయ్యలేవు.

తనకామెమీద మనస్సులేదు!

ఆ రోజుకూడా అతడిల్లు వదలలేదు.

తండ్రి అతనిని వదలలేదు.

ఇరవైనాలుగుగంటలు వూదరపెట్టాక రాజగోపాలం సహనం పరాకాష్ఠకు చేరింది.

"మీకు కావలసిందేమిటి? మీయెడ భక్తి చూపించి, మీరుచెప్పేమాట వినడం. అంతేనా?"

"నువ్వు సుఖపడడం.."

తండ్రి యిచ్చిన సమాధానం అతనిని నిరుత్తరుణ్ణి చేసింది. ఇంతకాలం పెంచాం. పొషించాం. చదువు చెప్పించాం. ఈవేళ నువ్వు మమ్మల్ని
'ఎగర్తిస్తావా' అంటాడనే వుద్దేశంతో సమాధానం తయారుచేసుకొన్నాడు. కాని, ఆయన తన సుఖం కోరుతున్నాడు.

ఒక్క మారు నిరుత్సాహమే కలిగింది.

"అదింక సాధ్యం కాదు. నా చేజేతులా వొదులుకున్నా."

కృష్ణంరాజు ఒక్క మారు అగ్గిపుంతయిపోయాడు. మరుక్షణంలో నీటి బుగ్గయి కారిపోయేడు.

అటువంటి మొండివాడిని తనకు కొడుకుగా ఇచ్చిన భగవంతుణ్ణి స్మరించి చేతులు జోడించడంతప్ప ఆయనకు చేయగలిగింది తోచలేదు.



ముప్ఫయ్యారో ప్రకరణం


తెల్లవారేసరికి కల్యాణి గుమ్మంలో దిగింది. దిగిన క్షణంనుంచి శత్రుమధ్యంలో అడుగు పెడుతున్నట్లే అనిపించింది. రిక్షాలోంచి క్రింద
అడుగు పెడుతూండగా అటూ-ఇటూ వున్న రెండువాటాల గుమ్మాల లోనూ ఎవరివో ముఖాలు కనబడ్డాయి. చటుక్కున వెనక్కి తగ్గేయి.

ఆమె సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇరుగుపొరుగు వాటాల్లో ఏవో కొత్త కంఠాల గుసగుసలు వినిపిస్తున్నాయి. అవి కేవలం
కొత్తవి కావు. వెనక ఎరిగినవే. ఆ కంఠాలు తననీవేళ ఆప్యాయంగా పలకరించగల స్థితిలో లేవని ఆమె గ్రహించింది.

ఎంతో ఆప్యాయంగా పిలుస్తూవచ్చే రామలక్ష్మమ్మ తన రాకను పట్టించుకోలేదు. సుజాత వచ్చినట్లుంది. ఆమే రాలేదు. ఈ
వైపునవున్న రాజగోపాలం తనతో ఏలాగూ సన్నిహితత్వం చూపడు. ఆమెకు దొడ్డిలోకున్న తలుపు తియ్యడానిక్కూడా సందేహం అనిపించింది.
తన గదిలో మంచంమీదనే కూర్చుండిపోయింది.

సినీమాహాలు వద్ద ఆ దుర్ఘటన జరిగిన రాత్రి రాజగోపాలం తన గదిలో వున్నాడు. ఆ కథ లచ్చమ్మద్వారా పాకుతుంది. ఆసంగతి
తెలుసు. కాని, దానినారోజున తాను లక్ష్యం చేయలేదు. రాజగోపాలం తన ప్రక్కనున్నాడు. తాము పెళ్ళిచేసుకోదలచారు.

కాని, ఈ రోజున తనకా ధైర్యం లేదు. రాజగోపాలం తన్ను పలకరించనుకూడా అసహ్యించుకొనే స్థితికి వచ్చేడు- అనుకొంటూంది. తనకు
మిగిలిందేమిటి? ప్రపంచం వేలుపెట్టి చూపించే అవకాశం.

* * * * * *

హఠాత్తుగా ఆనందరావు రంగంలో ప్రత్యక్షమైనాడు.

"కల్యాణీ! నేనిక్కడే వుంటున్నా."

ఆమె ఆ స్వరానికీ, ప్రతిపాదనకూ దిగ్భ్రమ చెందినట్లు చూసింది. తనవూళ్ళో, తనయింట్లో అతనితో ఖండితంగా మాట్లాడగలిగిన
ధైర్యం ఇప్పుడు కనబడలేదు.

అతడు ఏదో అల్లరిచేయడానికి కృతనిశ్చయుడై వచ్చినట్లనిపించింది. పెట్టె సావట్లో పెట్టించేడు. వాకిట్లో కుర్చీలో కూర్చుని
సిగార్ కాలుస్తూ ఎవరితోటో మాట్లాడుతున్నాడు.

" కల్యాణి నా భార్య అండి. ఎప్పుడో చిన్నప్పుడే చేసుకున్నా. తెలివిమాలి ఇన్నాళ్ళూ తీసుకెళ్ళలేదు. ఇప్పుడు తీసుకెళ్ళడానికి
వచ్చేను."

అతడొక్కమాట అబద్ధం చెప్పలేదు. ఆమెనేమీ అనలేదు. పెద్ద వుద్యోగస్తుడుగా తన హోదాను కించపరచుకోలేదు. కల్యాణి
తనభార్య. ఆమెకు ఏ మాత్రం మాటవచ్చినా తనకే మాటఅన్నట్లు ఆమెయెడ అతిగౌరవం, ప్రేమ, అభిమానం వొలకబోస్తూ
మాట్లాడుతున్నాడు. వారికి వీరు- రెండు వాటాలనుంచీ జనం చేరేరు. ప్రశ్నలువేసి తెలుసుకుంటున్నారు. అందరికీ ప్రాణాలు
కుదుటపడినట్లు వారి కంఠాలను పట్టి తెలుస్తూంది.

రామలక్ష్మమ్మ కల్యాణి యోగ్యతనూ, ఆమె భవిష్యదదృష్టాన్నీ కూడ అభినందించింది. అందరూ తన్ను
వదల్చుకొనేటందుకుత్సాహపడుతున్నట్లు అనిపించింది.

తాను వ్యతిరేకత తెల్పడానికీ, ప్రతిఘటించడానికీకూడ అవకాశం లేనంత నేర్పుగా వల తయారయిపోతూంది. తానూరుకొంటే ప్రమాదం,
ఊరుకోక అల్లరిచేస్తే తనకే అప్రతిష్ఠ. ఇంకా వూళ్ళో వుండలేదు. అందరూ తన్ను వేలెట్టి చూపిస్తారు. తల ఎత్తుకోలేదు.

ఒక అరగంట పోయాకకూడా ఆమె అలాగే కూర్చుండి వుంది. మనస్సంతా అల్లకల్లోలంగా వుంది. తన నిస్సహాయతకు ఏడ్పు వస్తూంది.
కాని, ఏడవడం లోకువైపోతుంది. నిశ్శబ్దంగానే కూర్చుంది.

సుజాత వచ్చింది.

"ఒంట్లో బాగులేదంది లచ్చమ్మ! బాగున్నావా?"

ఆ మాటలో నీ రహస్యం మాకు తెలిసిందిసుమా అన్న అభిప్రాయమే, వెక్కిరింతే వినిపించింది. కాని, కల్యాణి ఏమీ అనలేదు.

"రా. ఎప్పుడొచ్చేవు?"

"మొన్ననే."

"అల్లా వున్నావేం? బాగా చిక్కిపోయావు." ఒక్కనిముషం వూరుకుని మళ్ళీ అంది.

"ఈ ఏడాది చదువు పాడుచేసుకున్నావు. అనవసరంగా అక్కడుండిపోవడం మంచి పని జరగలా."

అది సానుభూతో, ఎత్తిపొడుపుకు ప్రతిసమాధానమో సుజాతకు అర్థం కాలేదు. తానెందుకు నాలుగునెలలు పొరుగూళ్ళో వుండిపోయిందో తెలియదూ?
దానికి కారణం తానేకదూ? -అనుకుంది.

కల్యాణి నెమ్మదిగా లేచింది. స్నానం వగైరాలు పూర్తి చేసుకొంది. నారాయణరావు మధ్యలో వచ్చేడు.

"నేను స్నానం చెయ్యలి."

"దొడ్లో నుయ్యి వుంది."

"వేణ్ణీళ్ళు పెట్టించు."

కల్యాణికి ఆ ఆజ్ఞాపించేధోరణి చాలా అసహ్యం కలిగించింది. స్పష్టంగా చెప్పాలనుకొంది. కాని, తమాయించింది. ఇప్పుడు అల్లరి
చేసుకోకూడదు.

ఆమె వేణ్ణీళ్లు పెట్టలేదు. అతడు అడగలేదు. భోజనంవిషయం ఏంచెయ్యాలో ఆమెకు అర్థంకాలేదు. వంట వండినా, కారియరు తెప్పించినా
అతడు పీటవేసుక్కూర్చునేలా వున్నాడు.

జాగ్రత్తగా ఆలోచించుకొనేవరకూ ఆమె తొందరపడకూడ దనుకుంది.

పనిమనిషిని కారియర్లు తెమ్మని పంపుతూ తండ్రికి టెలిగ్రాం ఇవ్వడానికై డబ్బులూ, కాగితమూ ఇచ్చింది.

నారాయణరావు ఆ కాగితం తీసుకొన్నాడు. చదివేడు. లోపలికి వచ్చేడు.

"మీ నాన్నగారికి టెలిగ్రాం ఇవ్వటం మంచిపనే. కారణంకూడా వ్రాస్తే బాగుంటుంది."

కల్యాణికి క్రోధం ఆగిందికాదు.

"ఏమని? ఓ..."

నారాయణరావు చాల అమాయకంగా నటిస్తూ నోరు కొట్టుకొన్నాడు.

"ష్. మనది మార్జాలదాంపత్యమని పక్కవాళ్ళకి తెలియడం అవసరమా?"

అతని ధూర్తత్వానికి ఒళ్ళు వుడికిపోతున్నా చేయగలది కనిపించక కల్యాణి దాసీ లచ్చమ్మమీద కోపం చూపింది.

"వెళ్ళు. అల్లా నిల్చున్నావేం? ముందు టెలిగ్రాంఇచ్చి మరీ వెళ్ళు హోటలుకి."

నారాయణరావు అదివరకే టెలిగ్రామును తన సవరణలతో పూర్తి చేశాడనే విషయం తెలియకనే కల్యాణి దాసీని పంపేసింది. అతడు
మనస్సులోనే సంతృప్తిపడ్డాడు. అతడి పథకం చక్కగా నడుస్తూంది. కల్యాణి కాలుచేతులు బిగిసిపోతున్నాయి. ఆమె ఎరుగును.
ఏమీచేయలేకుండా వుంది. తనకు సాయం ఎవ్వరూ లేరు. స్వగ్రామంలోలాగ ధైర్యం చూపలేదు. పొరుగూరు. తానొంటరికత్తె. లోకభయం.

నారాయణరావు తిరిగి సావడిలోకి పోయాక కల్యాణి ఒక్క నిట్టూర్పు విడిచింది. నుదుటిచెమట తుడుచుకుంటూ మంచంమీద కూలబడిపోయింది.

హఠాత్తుగా పదిగంటలవేళ భాస్కరరావు బండిదిగి లోపల అడుగు పెడుతూవుంటే నారాయణరావే స్వాగతం పలికేడు.

"చిన్నబావగారా! దయచేయండి. ఏమిటి హఠాత్తుగా వచ్చేరు?"

భాస్కరం ఆ కంఠం, చొరవ, పిలుపుచూసి దిగ్భ్రమ చెందినట్లు నిలబడ్డాడు. అతనికేమీ అర్థం కాలేదు.

చెల్లెలిని చూసేక అర్థంఅయింది. కాని ఏమి చెయ్యడానికీ తోచలేదు. సంఘం తనకిచ్చే బలంమీద కల్యాణిని బలవంతంగా తనకు
లొంగేటట్లుచెయ్యాలని ప్రయత్నం. పళ్ళుకొరికేడు. లోలోపల తిట్టుకున్నాడు.

"రాస్కెల్. స్కాంప్."

తెలుగు, ఇంగ్లీషుభాషలలోని తిట్టుపదాలన్నీ ప్రయోగించినా పరిస్థితిని చక్కబరచలేవు.

భాస్కరం మంచితనంగానే నారాయణరావును తన దుష్టప్రయత్నంనుంచి విరమింప చెయ్యాలనుకొన్నాడు. కాని, నారాయణరావు చిరునవ్వుతో
అతనిని త్రోసిపుచ్చేడు. చాలా బేపర్వాగా సమాధానమిచ్చేడు.

"మీతో ఎల్లా వ్యవహరించాలో నాకుతెలుసు. నేను ఏంచేస్తున్నానో..."

ఆయన ధోరణి చూసేక తానూ తొందరపడకూడదనే నిర్ణయానికి భాస్కరరావు వచ్చేడు.

"ఏంచేస్తున్నారో అనుమానం ఎందుకు? రౌడీభద్రం చేసినపనికీ మీరు…."

రౌడీభద్రం ఎవరో, వాడేం చేశాడో తెలియకపోయినా నారాయణరావుకు ఆ ఉపమానం కోపకారణమే అయింది.

"మీ కమ్యూనిస్టులకన్న పెద్దరౌడీలు ప్రపంచంలో వున్నారా?"

తాను నారాయణరావును రెచ్చగొట్టగలిగేడు. కావలిసిందదే. ఆ వేడి తగ్గిపోనీకూడదు. భాస్కరరావు అంగీకారం తెలియబరచేడు.

"వచ్చినఇబ్బంది అక్కడే వుంది. మామీదకు వస్తే తప్ప మా రౌడీతనం చూపించం. దానితో మాకు పేరే మిగిలింది. జనం భయపడ్డం
మానేశారు."

నారాయణరావు కోపంలోంచి బయటపడేసరికి పక్కా పావుగంట పట్టింది. ఆ పావుగంటలో మూడేళ్ళపాటు కమ్యూనిస్టుల్ని అడవులకు
పట్టించడంలో జరిగినకృషిలో తనపాత్రను ఆతడు వివరించగలిగేడు.

"తెలుగుదేశంలో ఆ రోజుల్లో తలఎత్తిన హేమాహేమీలముందు నువ్వు గోచీకూడా పెట్టుకోలేని బుడ్డాడిక్రింద లెక్క"- అన్నాడు
భాస్కరరావు నిర్లక్ష్యంగా.

ఇద్దరూ ఒక్క నిముషం నిశ్శబ్దంగా కూర్చున్నారు. భాస్కరం లేచేడు.

"మీరు జరిగిందన్న పెళ్ళిని మేం గుర్తించం. దానిని చూపి మీరు...."

"చట్టమయ్యా స్వామీ. నువ్వు గుర్తించేదేమిటి?"-అన్నాడు నారాయణరావు వెక్కిరింతగా.

"అయితే కోర్టుకెళ్ళి ఆ చట్టాన్ని అమలు జరిపించుకో" మన్నాడు భాస్కరరావు, నిర్లక్ష్యంగా, ఏకవచనప్రయోగంతో –

ఒక్కనిముషం నారాయణరావు ఆలోచించేడు. అతనికీ ఆ ఆలోచన ఇష్టంకాదని తేలిపోయింది.

"అయితే ఓ తునితగువుకు వద్దాం. నీ చెల్లెలికి మళ్ళీ...."

భాస్కరరావుకు చటుక్కున ఏదోతోచింది. మహాసంతోషం వ్యక్తపరిచాడు. చేయిచాపేడు.

"అల్లా అన్నావు బాగుంది. ఆ ఏర్పాటేదో ఈవేళనే చేస్తా."



ముప్ఫయ్యేడో ప్రకరణం


భోజనానంతరం భాస్కరరావు చెల్లెలిని బజారుకు బయలుదేరతీసేడు.

"సాయంకాలం వివాహానికి ఏర్పాట్లుచేస్తున్నా. దానికి కావలసిన సరంజామా కొనాలి."

నారాయణరావుకు ఆ రోజున ముహూర్తంలేదే అని విచారం కలిగింది. "పిడుక్కి వారకూల ఏమిటి? సభాముఖంలో జరిగే దండలపెళ్ళికి
ముహూర్తం పట్టింపులేమిటండి."

భాస్కరరావుపద్ధతి నచ్చకపోయినా నారాయణరావు ఏమీ అనలేకపోయేడు. సుముహూర్తం చూసి ఓమారు పెళ్ళిచేయనే చేశారు. దాని
ప్రాముఖ్యం ఏం వుందిలే – అని సంతృప్తిపడ్డాడు.

హఠాత్తుగా అనుకున్న ఈ తతంగానికి డబ్బుందో లేదోననిపించింది.

"కావలిస్తే డబ్బు...."

భాస్కరరావు నవ్వేసేడు.

"మా చెల్లెలు పెళ్ళిచేయలేని దుర్దశలో వున్నామంటారా?"

నారాయణరావుకు గుక్క తిరగలేదు. చివరకు అన్నాడు.

"నేను ఎరిగున్నవాళ్ళొకరిద్దరున్నారు. పిలుస్తా."

భాస్కరం చాలవుత్సాహం కనబరచేడు.

"సందేహిస్తారేమిటి? ఈవూళ్ళో మీవాళ్ళెవరో వున్నారన్నారు పిలవండి. మా స్నేహితుల్ని నే పిలుస్తున్నా."

కల్యాణి అన్నీ వింటూంది. తన అన్నచెప్పిన ఒక్కమాటతప్ప ఆమెకాతని ప్రయత్నం ఏమీ తెలియదు.

"ఈవేళ సాయంకాలం రాజగోపాలం వివాహం ఏర్పాట్లు చేస్తున్నాడు."

కల్యాణికి ఆశ్చర్యమే కలిగింది. రెండురోజులక్రితం వెళ్ళివచ్చిన గోపాలం ఏంచేస్తున్నాడో ఇప్పుడే వచ్చిన తన అన్నకేం తెలుసు?
ఆమెకు నమ్మకంలేదు. తాను వచ్చేసరికి రాజగోపాలం ఇంట్లోలేడు. తర్వాత రాలేదు. తాను వచ్చినట్లే తెలియనివ్యక్తి తనతో
పెళ్ళిఏర్పాట్లు చేస్తున్నాడూ?

ఆమె కళ్ళలోనే ఆ ప్రశ్నలు చదివి భాస్కరం సంజ్ఞతో వారించేడు.

గంటవరకూ ఆమెకా ప్రశ్నలకు సమాధానం రాలేదు. బయలుదేరతీసేముందుకూడా నోరుతెరిచింది. కాని భాస్కరం ఆ అవకాశం ఇవ్వలేదు.

"నువ్వేమీ డబ్బుతేనక్కర్లేదు. ఈ ఘట్టం వస్తుందని ఎరిగే నాన్నగారు నాలుగువందలిచ్చి పంపేరు."

ఆమె నోరుకుట్టేసుకుంది. బయలుదేరబోయేముందు భాస్కరరావు ఇరుప్రక్కల వాటాలలోని వారినీ సాయంకాలం జరిగే పెళ్ళికి ఆహ్వానించేడు.

"డాబామీదే జరుగుతుంది. తమరుండాలి."

"వరుడెవ్వరు?"

అంతా ఏమీఎరగనట్లే ప్రశ్నించేరు. భాస్కరం చిరునవ్వు నవ్వేడు.

"చూస్తూ, ఎరిగివుండి అడుగుతారేమిటండీ"

కృష్ణంరాజూ, శేఖరం పెడనవ్వు నవ్వేరు. రామలక్ష్మమ్మ సానుభూతి ప్రకటించింది.

"బాగుంది నాయనా! ఇన్నాళ్ళకి...."

భాస్కరం ఆమెమాట పూర్తికాకుండానే వీధిలోకి నడిచేడు.

"అంతేలేండి. అంతేలేండి. దేనికైనా వేళ రావాలి,"

తనకొడుకుమీది ప్రమాదం దూసుకుపోతూందన్న సంతృప్తితో కృష్ణంరాజు భాస్కరాన్ని హాస్యం చేశాడు.

"మీ కమ్యూనిస్టులకూ వుందన్నమాట ఈ వేళావిశేషాలమీద పిచ్చినమ్మకం."

"అదేమిటండోయ్ అల్లా అంటారు. మేమూ అందరితోటివాళ్ళమే. మీ ప్రక్కనున్నాక ఆ మాత్రమన్నా అంటకుండా వుంటుందా....ఆఁ...."

తనవాక్యం మధ్యలోనే ఆపి రిక్షా ఎక్కేడు. రిక్షా కదలగానే జేబులోంచి టెలిగ్రాంతీసి చెల్లెలిచేత పెట్టేడు.

ఆమె నాలుగుమార్లు చదివినా దానిని అర్ధం చేసుకోలేకపోయింది.

కల్యాణిని వెంటనే పంపమంటూ డాక్టరు మంజులత ఆతనికి పంపిన టెలిగ్రాం అది. సందేహం తీరడానికి బదులు ఆమె మనస్సులో
సవాలక్ష ప్రశ్నలుదయించాయి. మంజులతకు తనఅన్న ఎల్లా తెలుసు? ఆమెకు తన అవసరం అంత ఏముంది? అసలు తాను వూళ్ళో
లేనట్లు, తండ్రి యింటికి వెళ్ళినట్లు ఏం తెలుసు?

"నాకూ సందేహాలెన్నో కలిగేయి. కాని ప్రధానమైన సందేహం వేరు. ఆమె యిచ్చిన టెలిగ్రామును పట్టి ఏదో వుందనిపించింది. తెల్లవారి
5 గంటల బండి ఎక్కే తోమ్మిదిన్నరకి దిగా. డాక్టరును కలుసుకున్నా."

రాజగోపాలం అక్కడేవున్నాడని చెప్తూ హాస్యం ఆడేడు.

"ఆయన తండ్రికి అండర్‌గ్రౌండ్. ఆతడి తరఫునే డాక్టరు టెలిగ్రాం ఇచ్చింది."

రాజగోపాలం తనకోసం టెలిగ్రాం పంపేడన్నమాట. సంతృప్తి కలిగించినా డాక్టరు మంజులత యింట్లో వున్నాడన్నప్పుడు ఏదో బాధ
చురుక్కుమన్నట్లయింది.

"మంచిచోటే దొరికింది."

ఒక్క క్షణం క్రితం రాజగోపాలం ఎక్కడున్నాడనే విషయాన్ని ఆలోచించడం అనవసరంగా భావించిన కల్యాణి ఆతడిప్పుడు
మంజులతయింట్లోవుండడం మంచిదికాదంటూంది. ఆమె 'జెలసీ'కి నవ్వువచ్చింది.

"ఆతడిని చూసేకచెప్పు, అంతకంటె మంచిచోటు మరొకటుంటుందేమో."

కల్యాణి ఏమీ మాట్లాడలేదు.

గుమ్మంలోనే మంజులత వారిని అహ్వానించింది.

"మేడమీదికి వెళ్ళండి."

"నేను డాక్టరుగారితో మాట్లాడుతూంటాను. నువ్వు పైకి వెళ్ళమ్మా!"

"గది తెలుసుగా." అని డాక్టరు అడిగింది.

కల్యాణి తలవూపింది. వెనుదిరిగికూడా చూడకుండా నడిచింది.

గదిలో, తలకికట్టుతో మంచంమీద కూర్చున్న రాజగోపాలాన్ని చూసి కల్యాణి విస్తుపోయింది.

తలుపుచప్పుడుకు తలఎత్తిన రాజగోపాలం ఆమెనుచూసి, మహానందంతో మంచందిగి ఎదురువచ్చేడు.

"నిన్ను కష్టపెట్టినందుకు వెంటనే కలిగిందోయి శిక్ష."

గతరాత్రి భోజనంచేసి వస్తూండగా హోటలుప్రక్కనే బిసెంటు రోడ్డుమీద పదిమంది మీదపడి కొట్టేరు. కాని జనం వెంటనే చుట్టూచేరడంతో
పారిపోయారు. రెండు దెబ్బలే తగిలేయి.

కొట్టినవాళ్ళెవరో, ఎందుకుకొట్టేరో తెలుసు. భజనసమాజంవాళ్ళని చాలమంది గుర్తు పట్టేరు. తానెవ్వరినీ ఎరగడు. చూడలేదు
కూడా. ఏమనికేస? ఎవరిమీద? చూసి కేసుపెట్టినా పోలీసులచేతిలో అది సరిగ్గా నడుస్తుందనే నమ్మకం లేదు. తిన్నగా రిక్షా
చేసుకొని డాక్టరు మంజులత ఇంటికి వచ్చేడు.

"కల్యాణీ! లాభంలేదు. మంజులతా నేనూ ఆలోచించాం. నీకభ్యంతరంలేకుంటే వెంటనే పెళ్ళి చేసుకోమంది. నాకు నచ్చింది. టెలిగ్రాం
ఇచ్చాను. నువ్వు కాదనకు, కల్యాణీ! నిన్న, మొన్న నా హితచింతకులు పెట్టిన ఇబ్బంది ఈ కర్రదెబ్బల కన్న ఎక్కువబాధ
కలిగించింది. నేను ఆ క్షణంలో ఏమన్నా అనివుంటే క్షమించు...."

కల్యాణి ఆతనిహృదయంమీద తలవాల్చి కన్నీళ్ళతోనే తన మనస్సును సూచించింది.

"కల్యాణీ!"

రాజగోపాలం ఆమెగడ్డం పట్టుకొని తలపైకెత్తేడు.



ముప్ఫయ్యెనిమిదో ప్రకరణం


నాలుగున్నరకే జనం డాబామీదకు చేరుకున్నారు. ఆకాశం మబ్బుకమ్మి చల్లగావుంది. ఎండ తెలియడంలేదు.

"మళ్ళీ వర్షంవస్తుందేమో, ఆలస్యం ఏమిటి?" – అని నాలుగుదిక్కులనుండీ ప్రశ్నలు వచ్చాయి.

భాస్కరరావు క్రిందినుంచి వచ్చేడు.

"ప్రారంభిద్దామా?"

సభ ఆమోదం తెలియబరచగానే ఆతడే నారాయణరావును కుర్చీలోకి ఆహ్వానించేడు.

"వీరు మా బావగారు. పెద్దవుద్యోగస్తులు."

ఉద్యోగస్తుని ఠీవి ప్రకటిస్తూ నారాయణరావు చిరునవ్వుతో బల్లవద్ద ఒకకుర్చీలో కూర్చున్నాడు.

భాస్కరరావు యథాక్రమంలో ఆతనిని సభికులకు ఎరుకపరచేడు. ఆతని గాథనంతనూ సవివరంగా చెప్తూంటే ఏమిటిదంతా అనిపిస్తున్నా
సభామర్యాదకు భంగం కలిగించలేకపోయేడు.

ఒకటిరెండుమార్లు భావసూచకంగా బల్లమీద వ్రేలితో వాయించేడు. కాని భాస్కరం వినిపించుకోలేదు. ఆతని దృష్టి అంతా మెట్లమీద వుంది.
పెళ్ళికూతురు వచ్చేవరకూ బాతాఖానీ వేస్తున్నట్లు గ్రహించి నారాయణరావు ఇంక తొందరపెట్టడం మానేడు.

"వీరు పదిహేనేళ్ల అనంతరం దేశంలోకి వచ్చేరు. ఈమధ్యలో ఒకమారు వచ్చేరట. కాని వారిదర్శనం చెసుకోగలభాగ్యం మాకు
లభించలేదు...."

మెట్లమీద మంజులత తల కనబడింది. ఇంక తొందరగా విషయానికి దిగవలసిన అవసరం కలిగింది.

"ఈవేళ వుదయమే మా చెల్లెలియింటికి వచ్చారు. పెద్దలెవ్వరూ లేరు. నేనే చొరవ తీసుకున్నా. వారంగీకరించారు. వెంటనే ఈ
ఏర్పాట్లు చేయవలసివచ్చింది. ఏమంటే వారు రేపు వెళ్ళిపోతామన్నారు. ఈ అల్పవ్యవధిలో...."

మెట్లమీద తలకట్టు కనబడింది.

"మిమ్మల్నందర్నీ పిలిచాను. దయవుంచి వచ్చిన మీ అందరికి కృతజ్ఞత."

"మాచెల్లెలు కల్యాణికీ, చిరంజీవి రాజగోపాలానికీ ఇప్పుడు వివాహం జరుగుతుంది. అధ్యక్షులు శ్రీ నారాయణరావుగారు ప్రథమంలో
దంపతులనాశీర్వదిస్తారు. వారు తమ సూచనను స్వయంగానే అమలుజరపగల అవకాశం లభించినందుకు వారితోపాటు మాకూ చాలసంతోషంగా
వుంది."

వధూవరులు చిరునవ్వుతో సభ్యుల శుభాకాంక్షలనందుకుంటూ టేబిలువద్దకు వస్తున్నారు. సభ కరతాళధ్వనులతో దద్దరిల్లిపోతూంది.

నారాయణరావు దిగ్భ్రమచెందేడు. కోపం వచ్చింది. మోసపోయానని దుఃఖం కలిగింది. కాని, చేయగలదిలేదు. ఆ సమయంలో తాను ఏమాత్రం
అల్లరి చేయబోయినా అపహాస్యం పాలయిపోతాడు. తన హోదా, ధనం ఏవీ తనను కాపాడలేవు. భాస్కరరావు తనను పరిచయం చేస్తూనే
తనను తన్నినా ఎవ్వరూ విచారపడకుండేటంత వాతావరణం సృష్టించి పెట్టేడు. చప్పట్లు కోలాహలం మధ్య భాస్కరానికే వినబడేటంత
నెమ్మదిగా పళ్ళు కొరికేడు.

"దొంగదెబ్బ తీసేవు. రాస్కెల్! మీరు కమ్యూనిస్టులున్నారే దేశానికే కాదు, హిందూధర్మానిక్కూడా శత్రువులే. ద్రోహులు!"

భాస్కరరావు చిరునవ్వు నవ్వేడు.

"కట్టుకొన్న పెళ్లాన్ని వదిలెయ్యడం, ఇష్టం లేని పడుచుల్ని బెదిరించి, 'బ్లాక్‌మైల్' చేసి లొంగతీసుకోవడం
హిందూధర్మం బోధిస్తూన్నట్లయితే నేచేస్తున్నదాంట్లో ఏం తప్పులేదు."





*** End of this LibraryBlog Digital Book "Kattula Vantena - Mahidhara Rama Mohana Rao" ***

Copyright 2023 LibraryBlog. All rights reserved.



Home